ఎన్నికలొచ్చి పడ్డాయి. పులిమీద పుట్ర పడిందన్నట్లు ఇదేం పదప్రయోగం అనుకోకండి. నిజంగానే ఎన్నికలొచ్చి మీదపడ్డాయి. బియ్యం, పప్పు, కూరగాయలు ధరలు దిగి రాకపోయినా [బంగారం మీద ఎటూ ఆశ లేదులెండి] ఎన్నికలొచ్చేసాయి.

ఏదిఏమైనా – తెల్లారగానే బడికి వెళ్ళక తప్పనప్పుడు నసుగుతూ ఒడి బస్సెక్కే బుజ్జిగాడిలా, బాసు గుర్తేచ్చి ఆముదం తాగినట్లనిపించినా ’వార్నాయనో టయిమయ్యింద’ను కుంటూ పరుగెత్తే ప్రైవేటు ఉద్యోగిలా[గవర్నమెంటోళ్ళకీ బాధలు తక్కువ కదా?] పోలింగు రోజున ఓటెయ్యక తప్పదు గదా!

ఓటెయ్యాలి సరే, ఎవరి కెయ్యాలబ్బా?

ఎప్పట్లాగే ఓ చిన్న కథ వ్రాసి, దాని అనువర్తన ……. అబ్బా! ఎప్పుడూ కథలే ఎందుకు? ఈసారి వెరైటీగా [వెరైటీ బ్రహ్మనందం సన్మానానికి చప్పట్లు బదులు చిటికె లేసినట్లు] ఓ నాటకం వ్రాసి దాని అనువర్తనతో నా బ్లాగు చుట్టాలని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

రంగం: సుబ్బన్న పాలెం అనే చిన్న పల్లెటూరు. రచ్చబండ అరుగు మీద అయిదారుగురు పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు. వెంకటప్పయ్య, నారాయణ రెడ్ది, సుబ్బయ్య శాస్త్రి, మస్తానయ్య, వీర్రాఘవులు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ దారిలో సత్తిపండు పోతున్నాడు.

వెంకటప్పయ్య:
ఏరోయ్ సత్తిపండు! ఓ పాలి ఇట్టారా!

సత్తిపండు:
ఏంటి బాబాయ్? బేగి పోవాల, సెప్పు!

వెంకటప్పయ్య:
పోదుగాని లే! ఎలచ్చనొచ్చనయ్ గందా? ఎవురికేస్తావురా ఓటు?

సత్తిపండు:
ఎవురి కేంది బాబాయ్! టివీ పెడితే గోల పెడతా ఉండలే. ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లూ అదీ ఇదీ అని. అందుకే సేతి గుర్తుకే ఓటేస్తాండా.

నారాయణ రెడ్డి:
అది గాదురా అబ్బాయ్. టివీల్లో సెప్పినంత మాత్రాన ఓటేసేస్తవా?

సత్తిపండు:
టివీ ఏంది మావా! రెండు పేపర్ల నిండా అదే గోల గదా!

నారాయణ రెడ్డి:
రెండు పేపర్లేంది రోయ్. ముఖ్యమంత్రిరి పేపరు సాచ్చొక్కటే గందా? అయినా రోజుకి రెండు పేపర్లు తెప్పిస్తున్నవా! అన్ని డబ్బులున్నయంట్రా నీకు?

సత్తిపండు:
నేనేడ కొంటా. మా ప్రక్కింటోళ్ళు సాచ్చి తెప్పిస్తే, ఎదురింటోళ్ళు ఈనాడే పించుకొంట్రు. సాలవేంది?

మస్తానయ్య:
మరైతే పేపరు సదివేసి ఓటేసేత్తావా? నీకిచ్చిన్రా ఆరోగ్యశ్రీ కార్డు, ఇందిరమ్మ ఇల్లు? అసలు మనూళ్ళో ఎందరి కొచ్చినయ్ రా!

సత్తిపండు:
నాకు రాకపోతే నేందన్నా! ఏరే ఊర్లల్లో ఎవురెవురికో వచ్చినయ్యని పేపరోళ్ళు, టివీల్లోళ్ళూ సెప్తుండారు గందా!

సుబ్బయ్య శాస్త్రి:
మరి తెలుగుదేశం చంద్రబాబు తనని గెలిపిస్తే అన్ని ఉచితంగా ఇస్తానంటున్నాడు కదబ్బాయ్?

సత్తిపండు:
అవును సామి! టయానికి గుర్తుసేసినారు. అసలే ఎన్టీవోడు పెట్టిన పార్టీ నయ్యె. ఇప్పుడు బాలయ్య, సిన్న ఎన్టీ ఆరూ అందరూ పెచారాని కొత్తుండ్రు. మరాల్లకీ యెయ్యాలయ్యె.

వీర్రాఘవులు:
మరైతే సిరంజీవి ఏం తప్పు జేసిన్రా చిన్నోడా? కొత్త సిన్మా రాంగానే ఉరికెత్తు కెల్తావ్ గందా! అసలే ఒక్క అవకాశ మిమ్మంటన్నాడు. వంద రూపాయలకే ఇంటి సరుకులన్నీ ఇప్పిస్తానంటున్నాడు. మరి సిరంజీవి నేం చేస్తావ్?

సత్తిపండు:
అబ్బా ఇరుకున బెట్టినావు తాతా! బంగారు కోడి పెట్ట అంటు డాన్సు జేసాడు గందా! ఎంత హుషారు గుంటది! గనుక సిరంజీవికీ ఓటెయ్యాల్సిందే.

వెంకటసుబ్బయ్య:
మరి మనూరి రంగనాయకులు కూడా సొతంత్ర అభ్యర్ధిగా పోటీ జేసాడు గదరా? ఆయబ్బికెయ్యకుంటే ఊరుకుంటాడా?

సత్తిపండు:
ఔ బాబాయ్! నిజం జెప్పినావ్. రంగయ్య బాబు కోటెయ్యకుంటే కొట్టి సంపుతాడు. తప్పని సరిగా ఓటెయ్యాల్సిందే.

సుబ్బయ్య శాస్త్రి:
నీకున్నది ఒక్క ఓటు. ఇందరికెలా వేస్తావురా తండ్రీ !

సత్తిపండు:
అదేంది సామి! అట్టాగంటారు? అన్ని గుర్తుల మీద గుద్ది పారేస్తా.

నారాయణ రెడ్ది:
ఇప్పుడు ఎలట్రానిక్కు మిషన్లంట గదరా? అన్ని గుర్తుల మీదెట్లాయేస్తావూ?

సత్తిపండు:
అట్టయితే అన్ని గుర్తుల గుండీలని నొక్కి పారేస్తా. దెబ్బకి గొడవొదిలి పోద్ది.

అక్కడున్న పెద్దలందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సన్నగా నవ్వుకున్నారు. సత్తిపండు అమాయకత్వాన్ని చూసి జాలిపడుతూ, ఒక్కసారిగా

అందరూ కలిసి:
అరే అబ్బాయ్! అలా చేస్తే నీ ఓటు మురిగి పోద్ది కదరా?

సత్తిపండు:
ఎవురి కోటేసినా జరిగేదిదే గందా!

గబుక్కున చెప్పేసి తన దారిన తాను పోయాడు సత్తిపండు.

’వార్నీ పిడుగా!’ అనుకున్నారు పెద్దలు.

********

మరయితే ఎవరికి ఓటెయ్యాలబ్బా?

[నాకు ఈ సమస్యే లేదు. ఎందుకంటే 1992 తర్వాత నాఓటు గల్లంతయ్యింది. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఏవూర్లోనూ నాకు ఓటు పుట్టలేదు. కనుక ఓటువేసే అవకాశం నాకు లేదు.]

ఇక సత్తి పండు చెప్పినట్లు ఎవరికి ఓటువేసినా మురిగిపోయేదే. ఎందుకంటే – ఏరాయి అయినా ఒకటే కదా పళ్ళూడగొట్టుకోడానికి? ఏపార్టీ అయినా ఒకటే ప్రజల్ని దోచుకు తినడానికి, దేశాన్ని అమ్మిపారేయటానికి.

కాబట్టి, ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరికి ఓటెయ్యాలని కాదు, ఏం చెయ్యాలని!

కాబట్టి, ఏం చెయ్యాలబ్బా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

భళే చెప్పారు. మీ వోటు గల్లంతయ్యిందంటే ఆశ్చర్యంగా ఉంది.
లోక్ సత్తా గురించి మర్చిపోయినట్టున్నారు. అయినా వాళ్ళ గురించి పట్టణాల్లో ఉంటున్న వారికే తెలియదు, ఇక పల్లెటూళ్ళా... సరే సరి

ఇందులో ఆశ్చర్యం ఏముంది, వాళ్ళ చేతిలో పని వాళ్ళు చేసారు.

లోక్ సత్తా చదువుకున్నవాళ్ళ పార్టీ గా మాత్రమే గుర్తింపబడుతోంది అదే ప్రాబ్లమ్.

నాకు కూడా ఓటు హక్కు లేదు :(, కాని ఉంటే లోక్ సత్తాకే.
ఇందుమూలంగా యావన్మందినీ నేను కోరేది లోక్‌సత్తాకే ఓటేయండీ(గెలుస్తుందా గెలవదా అని ఆలోచించకుండా)

most of the parties may be bad but there will be some good individuals.
we can vote them.

ఈ రోజు పేపర్లో ఓటు నమోదు చేయించుకోడానికిదే లాస్ట్ ఛాన్సంటున్నారే. ఇప్పుడైనా ప్రయత్నం చెయ్యరాదూ. ప్రయత్నించకుండా వదలకూడదు గదా. మీరు ప్రయత్నించి కూడా మీకు ఓటు రాకపోతే అదీ ఓ పోస్టింగిు రాయడానికి మంచి సబ్జక్ట్ అవుతుంది కదా. ఆలోచించండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu