కులప్రాతిపదికన రిజర్వేషన్ల నేపధ్యంలో అప్పట్లో న్యూఢిల్లీలో జరిగిన అలజడులూ, విద్యార్ధి ఉద్యమాలలో రాజీవ్ గోస్వామి అనే విద్యార్ధి ఆత్మాహుతి సంఘటన అత్యంత సంచలనం సృష్టించింది. ఆ విద్యార్ధి పేరిట ఢిల్లీలో ఒక రోడ్డు కూడా ఉంది. 1992 తర్వాత, రాజీవ్ గోస్వామి ఆనాటి ఆత్మాహుతియత్నంలో మరణించలేదనీ, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడనీ చదివాను. మనస్సుకి కొంత ఉపశమనంగా అన్పించింది. అయితే 1992 లో మండల్ నివేదిక అనంతరం ఈ అల్లర్లు, అలజడి హిమాలయాలంత ఎత్తున ప్రజ్వరిల్లాయి.

మరోప్రక్క హర్షద్ మెహతా సృష్టించిన స్టాక్ ఎక్స్ఛేంజ్, extra-ordinary boom మార్కెట్లో సునామీలు సృష్టిస్తోంది. దానికి సెక్యూరిటీ కుంభకోణమని పేరు పెట్టబడింది. దాదాపు 5000 కోట్ల రూపాయల కుంభకోణమని అప్పటికి లెక్కతేల్చారు.

ఇప్పుడు 7,000 కోట్లు రూపాయల సత్యం కుంభకోణం బయటపడి, వ్యక్తిగతంగా ఆ సంస్థయజమాని రామలింగరాజు, అతడి సోదరుడు, ఇంకా అతడి సంబంధీకులు బాధ్యులుగా నిలబెట్టబడ్డారు. అదే 1992 లోని [ఇది 1990 లో మొదలై, 1991 లో ముదిరి, 1992 ప్రధమార్ధంలో బ్రహ్మండంగా బద్దలయ్యింది.] సెక్యూరిటీ కుంభకోణంలో మాత్రం హర్షద్ మెహతా, బ్యాంకు ఉన్నతాధికారుల బదులు ప్రధానమంత్రిని బాధ్యుణ్ణిగా చేసారు. ఎందుకంటే ‘సరళీకృత ఆర్ధిక విధానాలు అమలు చేసేందుకు నాంది ప్రస్తావన వేసింది నాటి ప్రధాని పీ.వి.నరసింహారావు కాబట్టి’ అన్న వాదన బయటకి వచ్చింది. ఆ సరళీకృత ఆర్ధికవిధానాల కారణంగానే హర్షద్ మెహతా అంత తేలిగ్గా అంతా భారీ కుంభకోణం చేయగలిగాడన్న కథనాన్ని పత్రికలు భారీగా ప్రచారించాయి. వందల కోట్లతో ప్రారంభమైన కుంభకోణపు బట్ట బయలు, చివరికి 5,000 కోట్లకు పైగా తేలింది.

అప్పటి పీవి నరసింహారావు కాబినేట్ లో, అప్పటివరకూ రిజర్వ్ బ్యాంకు గవర్నరుతో సహా ఆర్ధికశాఖలో వివిధ పదవులు నిర్వహించిన మన్ మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నాడు. దేశవిభజన సమయంలో పాకిస్తాన్ నుండి భారత్ కు వలస వచ్చిన ఈ ఆర్ధికవేత్త గురించి అప్పటికే పత్రికల్లో ఆసక్తికరమైన కథనాలు ఉండేవి. అతడు పాకిస్తాన్ నుండి వలస వచ్చాడని 2008 లో, అతడి బాల్య మిత్రుడు పాకిస్తాన్ నుండి అతణ్ణి చూడవచ్చిన సందర్భంలో తెలిసింది. అంతకు ముందు వరకూ ఈ విషయం ఎవరికీ తెలియదు, ఏ పత్రిక వ్రాయలేదు. అతడి గురించి ఆనాటికి ప్రచారంలో ఉన్న కొన్ని అంశాలు ఏవంటే – హార్వర్డు యూనివర్సిటీ లో చదివి వచ్చిన ఈ ఆర్ధికవేత్త, విదేశాల్లో ఉద్యోగాలని తిరస్కరిస్తూ ’భారత ప్రభుత్వం ఇచ్చిన ఉపకారవేతనాలతో చదువుకున్నాను. అలా నేను నాదేశానికి ఋణపడి ఉన్నాను. కాబట్టి నా సేవల్ని భారతదేశానికే అర్పిస్తాను’ అన్నాడని. 1991 లో అతడు ఆర్ధికమంత్రిగా నియమితుడైన సందర్భంలో ప్రచురితమైన ఈ కథనం చదివినప్పుడు, మన్ మోహన్ సింగ్ ఫోటో చూసిన నాకు ఎంతో స్ఫూర్తి దాయకంగా అన్పించింది. తుపాకిపట్టుకున్న జేమ్స్ బాండ్ కంటే కూడా కలం పట్టుకున్న మన్ మోహన్ సింగ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు అనుకున్నాను.

అలాగే మరో కథనం ఏమిటంటే – ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఇండో పాక్ యుద్దానంతర కాలంలో ఆవిడ రక్షణవ్యయాన్ని పెంచమన్నప్పుడు, ఇతడు దాన్ని వ్యతిరేకిస్తూ కినుక ప్రదర్శించాడట.

మరో కథనం ఏమిటంటే 1991 లో అప్పటికి ప్రణాళికా సంఘం ఛైర్మన్ గానో లేక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పదవీ విరమణ చేసో ఉన్న మన్ మోహన్ సింగ్ కి, నాటి ప్రధాని పీ.వి. ఫోన్ చేసి కుశలప్రశ్నలయ్యాక ’అక్కడేం చేస్తావోయ్? ఇక్కడికా రా!’ అంటు చనువుప్రదర్శిస్తూ పిలిచి మరీ ఆర్ధిక మంత్రి పదవి ఇచ్చాడనీ.

ఇకనాటి ప్రధాని పీ.వి.నరసింహారావు మంత్రివర్గంలో మన్ మోహన్ సింగ్, మాంటెక్ సింగ్ అహ్లువాలియా, చిదంబరం, మరిద్దరు సభ్యులతో [అయిదుగురితో] ఉన్న టీం గురించి, 1992 బడ్జెట్ సమయంలో ప్రత్యేక కథనాలు, ఫోటోలతో వార్తలు వచ్చాయి. మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఇప్పుడు ప్రణాళిక సంఘం అధ్యక్షుడుగా ఉన్నాడు. చిదంబరం మొన్నటివరకూ ఆర్ధికమంత్రి, ముంబైపై దాడి అనంతరం గృహమంత్రి.

అయితే ఈ మేధావులెవ్వరూ కూడా ఆర్ధికవేత్తలై ఉండీ, హార్వర్డు యూనివర్సిటీ వంటి అత్యుత్తమ విద్యాసంస్థ పూర్వ విద్యార్ధులై ఉండీ కూడా, స్టాక్ ఎక్స్ఛేంజ్ లో షేర్ల ధరలు విపరీతంగా పెరుగుతూ extra-ordinary boom సృష్టిస్తున్నప్పుడు అందులో ఎటువంటి అసాధారణతనిగానీ, మోసాన్నీ గానీ పసిగట్టలేక పోయారు. తీరా కుంభకోణం బయటపడ్డాక బాధ్యత, నింద ఈ ఆర్ధికవేత్తల మీద గాకుండా ప్రధానమంత్రి భుజాల మీద పెట్టబడ్డాయి.

1992 ప్రధమార్ధంనాటికి కుట్రదారుల మద్దతుదారులు తప్ప ఇతరులెవ్వరూ కూడా సెక్యూరిటీ కుంభకోణం వెనుక గల కుట్రకోణాన్ని పసిగట్టలేకపోయారు. అలాగే నేటి ప్రధాని, నాటి ఆర్ధికమంత్రి అయిన మన్ మోహన్ సింగ్ యొక్క వ్యూహత్మక అమాయకత్వాన్ని కూడా [స్టాక్ మార్కెట్ షేర్ల బూమ్ లోని అసాధరణతని పసిగట్టలేక పోయిన వ్యూహత్మక అమాయకత్వం అది.] సందేహించలేదు, పసిగట్ట లేదు.

అప్పటికి నాలాంటి సామాన్యులందరూ హర్షద్ మెహతా, బ్యాంకు అధికారులతో కుమ్మక్కు అయ్యి ఇదంతా చేసాడేమో అనుకున్నారు.

అయితే 2004 తర్వాత, ప్రధానిగా మన్ మోహన్ సింగ్, అతడి రిమోట్ అరచేతిలో ఉంచుకొని ఆడించగలుగుతున్న ప్రభుత్వకుర్చీ వ్యక్తి సోనియాగాంధీతో కలిసి బహుళజాతి కంపెనీలకి, కార్పోరేట్ సంస్థలకి దోచిపెడుతున్న తీరు, సెజ్ లు పేరుతో దోపిడీ, నల్లబజారు లో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా వ్యూహాత్మకంగా నియంత్రించని తీరు [అంటే బ్లాక్ మార్కెట్లీర్ల నుండి ముడుపులు, క్రింది నుండి పైస్థాయి దాకా వెళ్తున్నాయని అర్ధం] చూసాక కుట్రలో వారి భాగం ఎంతో, కుట్రదారులకు [అంటే సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., బ్రిటిషు., అనువంశిక నకిలీ కణికుడు] వారెంతగా మద్దతుదారులో అందరికీ అర్ధమౌతునే ఉంది. మీదు మిక్కిలి ‘అణు ఒప్పందం చేసుకోకపోతే బుష్ కి నేనెలా ముఖం చూపించాలి’ అంటూ అంగలార్చిన ప్రధానిని, విశ్వాసపరీక్షలో నెగ్గేటందుకు పదవులూ, డబ్బు పంచిన వైనాన్ని చూసాక, ఎంతటి అమాయకులైన అర్ధం అవుతుంది కదా! గతంలో బ్రిటీషు పాలనలో మన ముందటి తరాల వారు ఏవిధంగా ప్రభుత్వ దోపిడికి గురయ్యారో, ఇప్పుడు మనమూ అదేవిధమైన ప్రభుత్వ దోపిడికి గురవుతున్నాము. అలా చూస్తే మనకి స్వాతంత్రం వచ్చిందనుకోవటం కేవలం మన భ్రమే.

ఇక ఈ సెక్యూరిటీ స్కాం విషయంతో పాటే, 1992 లో అప్పటికి రోజుల తరబడి లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు. వారి కోరికలు ఏపాటివో [గొంతెమ్మ కోరికలో, న్యాయబద్దమైనవో] తెలియదు గానీ ప్రభుత్వంతో చర్చలు మాత్రం ఫలించలేదు. దాంతో నిత్యావసరసరుకుల ధరలు అందుబాటులో లేవు. ఇక టెర్రరిజం తాలూకు హింస దేశమంతటా ప్రతీరోజూ గర్జిస్తూనే ఉంది. వరుసబాంబు పేలుళ్ళు మాత్రం మార్చి 1993 తో ప్రారంభమయ్యాయి. [ఈ కేసులో సినీనటుడు సంజయ్ దత్ ఉన్నాడు.] 1992 నాటికి వరసబాంబు పేలుళ్ళు లేవుగానీ, సిటిబస్సుల్లో, బహిరంగ ప్రదేశాల్లో బాంబు పేలటం, ప్రాణాలుపోవటం జరుగుతుండేవి. మెట్రో పాలిటన్ నగరాల్లో ముఖ్యంగా ఢిల్లీలో DTC బస్సుల్లోనూ, ముద్రిక బస్సుల్లోనూ బాంబుల గురించి పోలీసుల ప్రకటనలు వ్రాయబడి ఉండేవి. ‘సంచులూ, పాకెట్లూ వదలివేయబడి ఉంటే పోలీసులకి చెప్పమని’ వగైరా అన్నమాట. వరుసబాంబు పేలుళ్ళతో పోల్చుకుంటే స్థాయి తక్కువేకావచ్చు గానీ, అప్పటికి బస్సుల్లోనూ, లోకల్ ట్రైనుల్లోనూ ప్రయాణించేవారి వెనుక భయం మాత్రం తక్కువేం కాదు.

1992 కు పూర్వం [1990 నుండి 1992 వరకు] ఢిల్లీలోని DTC నుండి నా బ్యాటరీలకి order పొందేటందుకూ, ASRTU టెండర్లలో పాల్గొనేటందుకూ, DST వారి సహాయంతో CIRT నుండి నా బ్యాటరీలకి Quality Certificate తెచ్చుకొనేటందుకు పలుమార్లు ఢిల్లీ వెళ్ళిన అనుభవంతో ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా పరిశీలించాను. వీటన్నిటితో రామోజీరావు కార్యకలాపాల మీద ప్రధాని పీ.వి.నరసింహారావు కు ఫిర్యాదుచేయాలో వద్దో తేల్చుకోలేని సందిగ్ధంలో కొన్ని రోజులు గడిపాను.

అప్పుడే 1991–1992 లో జరిగిన కొన్ని సంఘటనలని గుర్తుకు తెచ్చుకున్నాను. అప్పటికి పీ.వి.నరసింహారావు సౌత్ బ్లాక్ లోని PMO లోకి ప్రవేశించి కొన్ని నెలలు గడిచి ఉంటుంది. 1991 లో మాజీ కేంద్ర మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె, మెడికో అయినటువంటి రుబియా ముఫ్తీని కాశ్మీర్ మిలిటెంట్లు అపహరించారు. అప్పుడు ముఫ్తీమొహమ్మద్ సయీద్, నాటి ప్రధానమంత్రి పీవినరసింహారావుని కలిసి తన కుమార్తెని విడిపించాల్సిందిగా అర్ధిస్తూ, ఒక బాధితుడిగా, కన్నతండ్రిగా చాలాసార్లు కంటతడి పెట్టుకున్నాడు. అది చూసి చాలా బాధకలిగింది. కాశ్మీర్ తీవ్రవాదులు, రుబియా ముఫ్తీని విడుదల చెయ్యాలంటే భారత ప్రభుత్వం పట్టి బంధించిన తమ సహచర తీవ్రవాదులని విడుదల చెయ్యాలని షరతు విధించారు. 2001 లో భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ కి మళ్ళించి నప్పుడు డిమాండ్ చేసిన మాదిరిగానే. 2001 లో నాటి కేంద్రమంత్రి జస్వంత్ సింగ్ స్వయంగా, విడుదల చేసిన ఖైదీల్ని వెంటబెట్టుకొని కాదంహార్ వెళ్ళి మరీ అప్పగించాడు. ఆ నేపధ్యంలో నాటి గృహామంత్రి అద్వానీని సంప్రదించాలేదని 2008 లో ఒక సంచలనం రేగింది. ఆనాటి విడుదల చేయబడ్డవారిలో కొందరు అమెరికా పైదాడి[11/9] లో పాల్గొన్నారని వార్తలొచ్చాయి. ముంబైదాడిలో ఆరోపణ నెదుర్కొంటున పాకిస్తానీ తీవ్రవాదసంస్థ అధినేత మసూద్ కూడా ఆలాగే విడుదల చేయబడ్డాడు.

అయితే 1991 లో పీ.వి.నరసింహారావు, రుబియా ముప్తీ కిడ్నాప్ వ్యవహారంలో, ముప్తీ మహమ్మద్ సయీద్ ఎంతగా కన్నీటితో ప్రాధేయపడినా, స్పందించలేదని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపధ్యంలోనే ’ఈనాడు’ పీ.వి.నరసింహారావుకి ’తాత్సార బ్రహ్మ’ అన్నది అతడికి సార్ధక నామాధేయమని వ్రాసింది. అలాగే మరో బిరుదేమిటంటే ’మౌనానందస్వామి’. అతడు దేనికీ త్వరగా స్పందించడనీ, మీడియా విలేఖర్లు ఏమడిగినా పెద్దగా జవాబివ్వడనీ అంటూ ఆ పేరుని రిఫర్ చేసేది. పీవినరసింహారావు గురించి ఆ రోజుల్లో ఈనాడులో నేను చదివిన మరో ఉపమానం లేదా విమర్శ – పీ.వి.నరసింహారావు కొన్ని సమస్యలకి ‘పరిష్కరించక పోవటమే ఆ సమస్యలకి పరిష్కారం’ అనుకుంటాడు అని, ఆనాటి వార్తలు చదివే వయస్సున వారికి, పెద్దవారికి ఇది గుర్తుకు తెచ్చుకోవటం సాధ్యమే.

ఈవిధంగా పత్రికల్లో ముఖ్యంగా ఈనాడులో పీ.వి.నరసింహారావు మీద ఎన్ని జోకులూ, కార్టూన్లు వచ్చినా గానీ, ఎన్.పి.టి. మీద సంతకం పెట్టనంటూ అమెరికాతో భీష్మించుకు కూర్చున్నట్లే, రుబియా ముఫ్తీ వ్యవహారంలోనూ, బంధించిన తీవ్రవాదుల్ని విడిచిపెట్టకుండా భీష్మించాడు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ గద్దద స్వరంతో, దుఃఖాశ్రువులతో ఎన్నిసార్లు అభ్యర్ధించినా ఫలితం లేకపోయింది.

అయితే, ఆశ్చర్యకరంగా, ఈ సంఘటనలు ఇలా ఇటు జరుగుతుండగా, ఒకరోజు హఠాత్తుగా రుబియా ముఫ్తీ కాశ్మీరు తీవ్రవాదుల చెరనుండి విముక్తురాలైంది. ఆమె తప్పించుకురాగలిగిందో, లేక తీవ్రవాదులే ఆమెని వదిలేసారో గానీ మీడియా ఈ వ్యవహారాన్ని ఒకటి రెండు రోజుల్లోనే అటకెక్కించేసింది.

ఇది జరిగింది 1991 ద్వితీయార్ధంలో. అప్పటికి కాశ్మీర్ తీవ్రవాదం వంటి వాటి వెనుక సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ. లు ఉండటం గురించి నాకు అసలు అవగాహన లేదు. రామోజీరావు కుట్రల గురించి ఊహమాత్రంగా కూడా తెలియదు. అయినా గానీ రుబియా ముఫ్తీ కిడ్నాప్, విడుదల, వ్యవహారం ఎందుకో ఆసక్తికరంగాను, కొంత అసాధారణంగానూ అన్పించింది. అందులోనూ ఈనాడు వ్రాతలు బాగా గుర్తుండిపోయాయి. కాకపోతే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సంఘటన తర్వాత, అలాంటిదే మరో సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అప్పటి ప్రముఖ రాజకీయనాయకుడు పి.శివశంకర్ తనయుడు పి.సుధీర్ కుమార్ ని నక్సల్స్ కిడ్నాప్ చేసారు. పి.సుధీర్ కుమార్ కూడా రుబియా ముఫ్తీ లాగానే నాటకీయంగా విడుదలయ్యాడు. ఈ పి.శివశంకర్ అప్పటికి కాంగ్రెస్ మినిస్టర్ గానూ, వివిధ పదవులూ నిర్వహించాడు. పై సంఘటన తర్వాత కొన్నాళ్ళకి తెరమరుగయ్యాడు. ఇటీవలే ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో తిరిగి ఇతడి పేరు వినబడింది. సుధీర్ కుమార్ ఆ తర్వాత సంవత్సరాలలో అనారోగ్యానికి గురై మరణించినట్లు చదివాను.

1992 ఏప్రిల్, మే లల్లో నేను రామోజీరావు కుట్రల గురించి సమాచారం సేకరించి, పరిశీలిస్తున్నప్పుడు పీ.వి.నరసింహారావు స్పందనలకు సంబంధించిన పై సంఘటనలు గుర్తుకొచ్చాయి. దానితో అతడు కుట్రదారులకు మద్దతుదారుడై [వి.పి.సింగ్ ల్లాగా] ఉండడని నమ్మాను. అతడు ఎవరో సృష్టించిన సమస్యలు ఎదుర్కొంటున్నాడని భావించాను. బహుశ ప్రధానికి సమస్యలు సృష్టిస్తున్నది ‘రామోజీరావు, ఇతరుల’ వంటివారే అయి ఉంటుంది అనుకున్నాను.

దాంతో రామోజీరావు భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రల గురించి, రాజీవ్ గాంధీ హత్య గురించి, మత ఘర్షణలు రెచ్చగొట్టటం గురించీ, ఆనాటి ప్రధాని పీ.వి.నరసింహారావు దృష్టికి తేవాలని నిశ్చయించుకున్నాను. అతడి అపాయింట్ మెంట్ సంపాదించేటందుకు దారులు వెదకసాగాను. స్వయంగా కలిసి ఫిర్యాదు చెయ్యాలని నా ప్రయత్నం.

అందులో భాగంగా, ఓ రోజు రాయపాటి సాంబశివరావుని కలిసాను. అతడు గుంటూరు ఎం.పి. 1989 లో నా ఫ్యాక్టరీ, నాటి గవర్నర్ కుముద్ బెన్ జోషీ చేత ప్రారంభం చెయ్యబడిన సందర్భం నుండీ, నాకు రాయపాటి సోదరులతో పరిచయం ఉంది. రాయపాటి శ్రీనివాస రావుతో good terms ఉన్నాయి. అప్పటికతడు గుంటూరు ZPP అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లోని రాయపాటి సాంబశివరావు నివాసంలో కలిసాను. అప్పటి ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్ధన రెడ్డి అక్రమాల గురించి, ఆర్.టి.సి.లోని ED మీద నా ఫిర్యాదు గురించి, ముందుగా చెప్పాను. రామోజీరావు గురించి గానీ, అతడి కార్యకలాపాల గురించి గానీ ఏమీ చెప్పలేదు. జనార్ధన రెడ్డి గురించి రాయపాటి అభిప్రాయం కనుకున్నాక గానీ నేనే విషయమూ పైకి చెప్పదలుచుకోలేదు. నేదురమల్లి జనార్ధన రెడ్డి అనైతికత, అక్రమార్జన అంశం లేవనెత్తి “మీరీ విషయాలన్నీ ఎందుకు ప్రధానమంత్రి పీవినరసింహారావు దృష్టికి తీసికెళ్ళకూడదూ?" అనడిగాను.

దానికి అతడు జవాబిస్తూ “They can corrupt even God” అన్నాడు. దాంతో నేను రాయపాటి సాంబశివరావు ‘Right choice’ కాదు అనుకున్నాను. తదుపరి నేను అప్పటి కడప ఎం.పి., [నేటి ముఖ్యమంత్రి] అయిన వై.ఎస్. రాజశేఖరరెడ్డిని కలవాలని ప్రయత్నించాను. అతడికీ, నాటి సి.ఎం. నేదురమల్లి కీ పడదన్న వార్తల నేపధ్యంలో నా ప్రయత్నం మొదలు పెట్టాను. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని అతడి నివాసానికి నెలవ్యవధిలో రెండుమూడుసార్లు వెళ్ళాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

1 comments:

ఈ రోజు టపా రాలేదేమిటబ్బా!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu