నిజానికి హరి జవహార్ లాల్ అనబడే ఈ ఈ.వో., ఎల్.ఎల్.బి. చేశాడు. కాబట్టి అతడికి legal, Administration బాగా తెలిసి ఉండాలి. అయితే దురదృష్టం ఏమిటంటే అతడి ప్రాధామ్యాలు[Priorities] కేవలం Accommodation and Medicine మాత్రమేనట. విద్యకు స్థానం లేదుకాబోలు. పోనీ అదే అనుకుందామన్నా, టీచర్స్ గా మేం చేస్తున్న సర్వీసు శ్రీశైలం రోడ్లు ఊడ్చే స్వీపర్ల పాటి చేయదా? మేం విద్య నేర్పుతుంది శ్రీశైలం ప్రజలకేగా? అక్కడికి వచ్చే యాత్రికులకు ఎవరైతే సేవలు చేస్తున్నారో [ఉద్యోగులుగా, వ్యాపారులుగా, ఇతరత్రా] వాళ్ళ పిల్లలకే గదా? అతడన్న మాటల్లో ఒక్కటి మాత్రం నిజం. ఆ ఊర్లో ఎప్పటి నుండో బదిలీలు లేకుండా పాతుకుపోయి ఉన్న వాళ్ళు, అటెండరు స్థాయిలో ఉన్న వాళ్ళు, పెద్దకాటేజీలు పొంది ఉన్నారు. కొత్తగా వచ్చినవాళ్లు యు.డి.సి. స్థాయిలో ఉన్నా సరైన accommodation లేదు. అయితే శ్రీశైలంలోని దేవస్థాన కాటేజీల్లో అధికభాగం అక్కడి ఉద్యోగులవే. బదిలీ అయి వెళ్ళిన ఏ ఒక్క ఉద్యోగి, అక్కడ కాటేజీని ఖాళీ చేయడు. సంవత్సరంలోపు బదిలీ అయిన వాళ్ళు కాదు, దాదాపు 10 ఏళ్ళ క్రితం బదిలీ అయిన వాళ్ళు కూడా, కేవలం ఆ ఉద్యోగి మాత్రమే భద్రాచలమో, కాణీపాకమో, ఎక్కడికి బదిలీ అయితే అక్కడకు వెళ్తారు గానీ, కుటుంబం మాత్రం శ్రీశైలంలోనే ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలంలో వాళ్ళకి బినామీ పేర్లతో బొమ్మలు దుకాణం లాంటి షాపుల దగ్గర నుండి, వడ్డీ వ్యాపారాల దాకా ఉన్నాయి మరి. అంతేకాదు రిటైర్ అయిపోయిన ఉద్యోగులు సైతం భారీసంఖ్య లోనే ఉంటారు. వాళ్ళల్లో కూడా ఎవరూ కాటేజీలు ఖాళీ చేయరు. అందుకోసం ఏవో మతలబులు చేస్తూనే ఉంటారు. ఇవి గాక పెట్రోలు బంకు, ప్రసాదాలు, అన్నదానాలు గట్రాగట్రాల్లో జరిగే అవినీతిది అదో పెద్ద గ్రంధం. ‘అవినీతి లేనిదెక్కడ?’ అన్న ప్రశ్నతో అదంతా అమోదయోగ్యం అయిపోయింది గనుక, ఇక్కడ ఇక దాని గురించి వ్రాయడం లేదు.

ఈనేపధ్యంలో గదులు/ కాటేజీలని రెగ్యులరేట్ చేస్తానన్న ఈ.వో., మా రూమ్ తప్ప మరెవ్వరికీ, ఆ తర్వాత నెలలోపు గానీ, ఇప్పటికి రెండేళ్ళు గడిచాయి, ఈలోపు గానీ ఎవరికీ రూంలు కాన్సిల్ చేయలేదు. ఏ రెగ్యులరైజేషనులూ క్రమబద్దీకరణలూ చేయలేదు. అయితే మేం ప్రత్యామ్నాయ వసతికోసం, శ్రీశైలం కొత్తపేటలో గానీ, శ్రీ గిరి కాలనీ లో గానీ, ఎక్కడైనా ప్రైవేటు భూముల్లోని ఇల్లు అద్దెకు తీసుకుందామని ప్రయత్నించినప్పుడు, కులసత్రాలలో నెలవారీ అద్దెకు గది తీసుకుందామని ప్రయత్నించినప్పుడు మాత్రం, అక్కడ కూడా అతడు గదులని ’రెగ్యులరేట్’ చేసి పారేసాడు. అలా గది నెలవారి అద్దెకి ఇచ్చే పద్దతి అక్కడ ఉంది. చల్లా వెంకయ్య సత్రంలోకి రాక ముందు మేం కన్నడ వారి మల్లిఖార్జున సత్రంలో నెలవారీ అద్దెకు గది తీసుకుని మూడు నెలలు ఉన్నాము. కాకపోతే శివరాత్రి, ఉగాది సమయాల్లో మాత్రం ఆయా గదుల దాతలు వస్తారు గనుక, మనం ఖాళీ చేయాల్సిన ఉంటుంది. మిగిలిన రోజుల్లో శ్రీశైలంలో అంతగా రద్దీ ఉండదు. అందుచేత ఈ పద్దతి అక్కడ ఉంది.

ఎలాగైతేనేం పిల్లల తల్లిదండ్రులంతా కలిసికట్టుగా ప్రయత్నించి, ఎట్టకేలకు 5 వారాల సమయం సంపాదించి పెట్టారు. ఇక గది/ ఇల్లు అద్దెకు చూసే ప్రయత్నంలో పడ్డాము. మా తరుపున తల్లిదండ్రులు కూడా ప్రయత్నించసాగారు. అయితే అదెంత ఊరని? కొత్తపేటలో దేవస్థానపు భూమి ఆక్రమించుకుని కొందరు గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకున్నారు. అక్కడ మేం ‘గూడు’ పొందలేం. మనం ఏదైనా చిన్నషెడ్డు నిర్మించగానే, ఖచ్చితంగా దేవస్థానం ఈ.వో., డి.ఈ.వో. లేదా మరొకరు అడ్డం పడతారు. ఇక శ్రీగిరి కాలనీ ఉంది. అక్కడ దాదాపు 100 మంది దాకా పట్టాలు పొందారు. అందులో దాదాపు ౩౦ మందిదాకా తమ పట్టాభూముల్ని అన్యాక్రాంతం చెయ్యకుండా వాళ్ళే చిన్నవో చితకవో ఇళ్ళేసుకుని నివసిస్తున్నారు. దాదాపు 70 మంది పేదలు, భాగ్యవంతులకి తమ పట్టాభూముల్ని బినామీగా అమ్మేసారు. అందులో శ్రీశైలంలోని ఉద్యోగులు, పూజారులు, కొందరు వ్యాపారులు పెద్దపెద్ద భవంతులు కట్టించుకున్నారు. అద్దెలకూ ఇస్తారు. అక్కడ మేం ఇంటికోసం ప్రయత్నించాము. అద్దె ఎక్కువే. దాదాపు సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు 2000/-Rs. దాకా చెప్పారు. అయినా సిద్దపడ్డాము. అయితే ఖాళీలు దొరకలేదు.

‘మార్కండేయులు’ అనే పూజారి శ్రీగిరి కాలనీలో అప్పుడే ఇల్లు ఖాళీ అవుతుంది. మా పిల్లల తల్లిదండ్రులు కూడా చాలామంది ఆయన్ని అడిగారు. మేమూ వేరేవాళ్ళ చేత అడిగించాము. ఖాళీ అవ్వగానే అద్దెకు ఇస్తామని చెప్పాడు. వారం తరువాత అడిగితే ‘అంతకు రెండురోజుల క్రితమే ఈ.వో. తమకి నోటిసులు ఇచ్చాడనీ, శ్రీశైలంలోనే గదులు/ కాటేజీలకు కొరత ఉన్నందున, శ్రీగిరి కాలనీలో స్వంత ఇళ్ళు ఉన్నవాళ్ళు, దేవస్థానం ఇచ్చిన కాటేజీలు ఖాళీ చేసి, స్వంత ఇళ్ళల్లోకి వెళ్ళాల్సిదన్నది ఆ నోటీసు సారాంశమనీ’ చెప్పాడు. శ్రీగిరి కాలనీలో ఎవరు ఇల్లు కట్టుకున్నా, అది పేదవాడైన పట్టాదారు పేరుమీదే ఉంటుంది. చట్టపరంగా అది ఇల్లు కట్టుకున్న భాగ్యవంతుడిది కాదు. ఆ తరువాత రోజుల్లో ఇలా పట్టాదారుల భూముల్లో బినామీగా భవంతులు కట్టుకున్న భాగ్యవంతులపై ప్రభుత్వం చర్యతీసుకోబోతుందని వార్తల్లో వచ్చింది. ‘మరి ఏ అధికారంతో, ఏ చట్టప్రకారం ఈ.వో. హరి జవహార్ ఈ పూజారులకీ, ఇతర ఉద్యోగులకీ తమ స్వంత ఇళ్ళల్లోకి మకాం మార్చి దేవస్థానం ఎలాట్ చేసిన గది/ కాటేజీ ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వగలడు? ప్రైవేటు భూములు, రెవిన్యూ భూముల్లో గల ఇళ్ళనీ కూడా ఇతడు [రెగ్యులరేట్] క్రమబద్దీకరిస్తున్నాడు కాబోలు’ అనుకున్నాము.[ అసలే ఆ ఈ.వో.కి legal & administration బాగా తెలుసయ్యే మరి!] ఇక్కడ ఇంకోవిషయం ఏమిటంటే వేసవిలో మూడు నెలలు బోరులో అస్సలు నీళ్ళురావు. అప్పుడు అందరు శ్రీశైలంలోని పబ్లిక్ పంపుల నుండి తోపుడుబళ్ళ ద్వారా నీళ్ళు తెప్పించుకుంటారు. అంత భయంకరంగా నీటికి కరువు. అలాంటి స్థితిలో ఏ ఉద్యోగి తన గది/ కాటేజీ ఖాళీ చేసి వెళ్తాడు. దేవస్థాన పరిధిలో అయితే కావాల్సినన్ని నీళ్ళు.

అయితే ఇదంతా మేం ఒకసారి సూర్యాపేటలో చూసిన సినిమానే! నటీనటులు మారారు, అంతే. అక్కడ మా ఇంటి ఓనరు చికెన్ కొట్టు భాగ్యలక్ష్మి అయితే, ఇక్కడ ఆ పాత్ర డి.ఈ.వో. కృష్ణయ్య, ఈ.వో. హరిజవహర్ లాల్ నిర్వహిస్తున్నారు. అంతే తేడా! దర్శకుడైతే రామోజీరావే అన్నది స్పష్టపడిపోయింది. మేం సి.ఐ. కరుణాకర్ ని కలిసి, వాళ్ళ స్టేట్ మెంట్ల తర్వాత జరిగిందంతా చెప్పి “ఇదేం వేధింపు?" అని అడిగాము. అతడు సూర్యాపేటలో సి.ఐ.ఖాన్, నల్గొండ ఎస్.పి. శివధర రెడ్డిల లాగే ఎంతో ‘చాకచక్యంగా’ రెడ్ టేపిజం చూపిస్తూ ’తమ ఎంక్వయిరీ తాము చేస్తున్నామని’ చెప్పాడు. ‘ఇది దేవస్థానపు భూమి గనుక, ఇక్కడి గదులు/ కాటేజీలు వారి పూర్తి అధికారంలో ఉన్నాయి గనుక, తామేమీ చేయలేమని’ చెప్పాడు. కృష్ణయ్య దగ్గర తానే స్టేట్ మెంట్లు తీసుకున్నానని నిర్ధారించాడు. అప్పుడు మాకు నీటి వేధింపు నేపధ్యంలో రమణయ్య సెల్ ఫోన్ లో నేను రిసీవ్ చేసుకున్నది Fake Phone కాదని, ఎవరి చేతో దొంగఫోన్ చేయించి రమణయ్య డి.ఈ.వో. కృష్ణయ్య పేరిట నన్ను బెదిరించ ప్రయత్నించలేదని, ఆ ఫోన్ స్వయంగా కృష్ణయ్యే చేశాడనీ అర్ధమయ్యింది. పైకారణాలు మారాయి, వ్యక్తులు మారారు గానీ, వేధింపులో మాత్రం సూర్యాపేటకీ, హైదరాబాదు నానల్ నగర్ కీ, శ్రీశైలానికి తేడాలేదు.

ఇదంతా జరిగేసరికి ఓ పదిరోజులు గడిచాయి. ఈలోపు ఊళ్ళో ఎవరుమాతో మాట్లాడినా “ఆ ఈ.వో. ఏదో కుంభకోణాలు చేశాడటండి. అవి గుప్పిట్లో పెట్టుకుని కృష్ణయ్య సారు ఈ.వో.ని ఆడిస్తున్నాడు. కృష్ణయ్య సారు చెప్పినట్లు ఈ.వో.చేస్తున్నాడు. కృష్ణయ్యసార్ కి ఈ రమణయ్య ఎక్కిస్తున్నాడు. ఇక్కడంతా రాజకీయాలు మేడం” అనేవాళ్ళు.

ఈమాట విని వినీ నాకు విసుగు పుట్టింది. ఓ రోజు పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు “ఎలా మేడం. వచ్చేసంవత్సరం ఎక్కడ పెడతారు స్కూలు?" అంటూ అందోళన పడుతుంటే, నేను “ఈ.వో., డి.ఈ.వో. కృష్ణయ్య మాట వింటున్నాడట. కృష్ణయ్య తన వంటవాడు రమణయ్య మాట వింటున్నాడట. వెరసి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఆ వంటవాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయట. కానివ్వండి, ఏం జరుగుతుందో చూద్దాం” అన్నాను, నవ్వు మిళితం చేసి. భయంకరమైన విచిత్రం ఏమిటంటే – ఆ తర్వాత ‘డి.ఈ.వో. మాట ఈ.వో., రమణయ్య మాట డి.ఈ.వో.’ గట్రా డైలాగు వినబడితే ఒట్టు.

మరో విచిత్రం ఏమిటంటే – ప్రతివాళ్ళు “ఈ ఊళ్ళో రాజకీయాలు ఎక్కువ మేడం” అనటం. దాంతో మేము “దీన్ని రాజకీయం అనకండి. పోలీసు భాషలో, అడ్మినిస్ర్టేషన్ లో దీన్ని నేరం అంటారు” అన్నాము. అంతే! ఇక మళ్ళీ ఆ డైలాగు మా చెవిన బడలేదు. దాంతో ఆ ఊళ్ళో ఎవరి బలం ఎంతో మాకు బాగానే అర్ధమైంది. [“ఈ ఊళ్ళో రాజకీయాలు ఎక్కువ” అన్నమాట నేను ప్రతీ ఊరిలో విన్నాను. ఒకరకంగా సమస్యని లోకలైజ్ చేయటానికి ఇలా అంటారు.]

ఎందుకంటే శ్రీశైలం చాలా చిన్న ఊరు. అక్కడి ఉద్యోగుల బదిలీలు గానీ, విధినిర్వహణలో వెసులుబాట్లు గానీ ఈ.వో. చేతిలోనూ, డి.ఈ.వో. చేతిలోనూ ఉంటాయి. అదేవిధంగా వ్యాపారుల షాపుల ఎలాట్ మెంట్లు కూడా! కేవలం ఈ.వో., డి.ఈ.వో. లని తెరమీద చూపించి కూడా ఊరు మొత్తాన్ని గ్రిప్ చేయవచ్చు. ఆశ కి, భయానికి లొంగని వారు అరుదు గదా! ఇక సాక్షాత్తు సి.ఎం.లూ, పి.ఎం.లూ, యు.పి.ఏ.కుర్చీవ్యక్తులూ, రామోజీరావు చేతిలో ఉండగా CBCID, IG లూ, శ్రీశైలం సి.ఐ. లూ ఎక్కడకి పోతారు?

ఈ.వో. నుండి ఐదు వారాల సమయం పొందాక, మరో ఇల్లు వెదికే ప్రయత్నాలు ఓప్రక్క చేస్తూనే, మరో ప్రక్క అడ్మినిస్ట్రేషన్ యుద్దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. మార్చి 31 న సమయం పొందగానే, ఏప్రియల్ ఒకటిన ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఒక లేఖ వ్రాసాము. అప్పటికి CBCID, IG, ఇంకా వార్తా సబ్ ఎడిటర్, ‘రామోజీరావు గురించి మాది భ్రాంతి’ అన్నందున, CID, IG మేం అవీ ఇవీ కలిపి వ్రాసి కేసు నిర్మిస్తున్నామన్నందున, ఈసారి లేఖలో రామోజీరావు పేరుఉదహరరించకుండా, ఒక సామాన్యుడు వ్రాసినట్లుగా వ్రాసాము. సీ.ఎం.కి వ్రాసిన లేఖలో ‘దేవస్థానపు ఈ.వో. అధికారాన్ని మేం ప్రశ్నించటం లేదనీ, అలాగే తనక్రింది ఉద్యోగులకి వసతీ, వైద్యం సమకూర్చాలన్నా విధి నిర్వహణ పట్ల అతడికి గల నిబద్దతనీ శంకించడం లేదనీ, అయితే అతడు అదే కరుణని మాదగ్గర చదువుకుంటున్న 58 మంది చిన్నారుల మీద కూడా ప్రసరింపచేయలేడా’ అని అడిగాము. ‘టీచర్సుగా మేం చేస్తున్న సర్వీసు శ్రీశైలంలో రోడ్లు ఊడ్చే స్వీపర్లు, కాంట్రాక్ట్ లేబర్ చేసే సర్వీసు పాటి కూడా చేయదా’ అని వ్రాసాము. వారం గడిచింది. స్పందన లేదు. దాంతో ఏప్రియల్ 8 న మరో ఫిర్యాదు వ్రాసి, దాని కాపీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి APJ అబ్ధుల్ కలాంకీ, సోనియాగాంధీకి పంపించాము. అందులో Fake Phone దగ్గర నుండి, సి.ఐ. తీసుకున్న స్టేట్ మెంట్లు, దాని పర్యవసానాలు, ఐ.జి. కృష్ణరాజ్ మాతో చేసిన ఆర్గ్యూమెంట్, మా రూం కాన్సిల్ చేయటం వరకూ జరిగిన ప్రతిసంఘటన క్లుప్తంగా స్పష్టంగా వ్రాసాము. అందులో ఐ.జి. వాదనకి మా తార్కిక జవాబు కూడా వ్రాసాము. కృష్ణయ్య వాదన, దాని పూర్యాపరాలు కూడా వ్రాసాము. అతడి మీద అసలు మేం కంప్లైంటు పెట్టలేదనీ, పెట్టింది రమణయ్య మీద అనీ, అప్పటి Fake Phone తాలూకూ, నీటి వేధింపు విషయంలోని Topograph copy తో సహా enclose చేసాము.

‘మేం రామోజీరావు విషయం రిఫర్ చేయకుండా సమస్య పరిష్కరించుకో ప్రయత్నిస్తే, సదరు ఉద్యోగులు రెడ్ టేపిజం చూపిస్తున్నారు. రామోజీరావుని రిఫర్ చేస్తే మా భ్రమ[hellusination] అంటున్నారు. ఇదేం డ్రామా?’ అని అడిగాము. ‘ఏమయినా మీకు పెట్టిన ఫిర్యాదులు క్రిందికి Farward అయ్యాయంటూ వాటిమీద స్టేట్ మెంట్లు డ్రామా చేసి విజయవంతంగా స్థానిక పోలీసు స్టేషన్, దేవస్థానం కలిసి మాగది ఎలాట్ మెంట్ రద్దు చేశారు’ అని వ్రాసాము. సూర్యాపేటలో, హైదరాబాదులోని వేధింపుని గుర్తుచేసి, ‘పిచ్చుక గూడు కట్టినట్లు మేం గూడు, ఉపాధి ఏర్పరుచుకోవటం, ఏదో పైకారణాన దాన్ని ఊడగొట్టటం. ఇలా ఎన్నిసార్లు మేం జీవితాన్ని మళ్ళీ మళ్ళీ ప్రారంభించాలి’ అని ప్రశ్నించాము. దీనికి ప్రధానమంత్రి నుండి జవాబు రాలేదు. రాష్ట్రపతి నుండి మాత్రం విషయాన్ని రాష్ట్రప్రభుత్వపరిశీలనకు పంపుతున్నట్లు నాకు లేఖ వచ్చింది. అయితే అది మే 8 తర్వాత, మేం శ్రీశైలం వదలివచ్చిన తర్వాత శ్రీశైలంలోని మాగదికి చేరింది. మా అంతస్థులోనే ఉన్న పోస్టల్ ఉద్యోగి సహాయంతో దాన్ని మేం కొరియర్ ద్వారా తెప్పించుకున్నాము.

ఏప్రియల్ 11 వ తేదిన ఉదయం 11 గంటల సమయంలో దేవస్థానకాంట్రాక్ట్ ఉద్యోగి ఒకరు ఒకనోటిసు తీసుకుని వచ్చాడు. అందులో కృష్ణయ్య సంతకంతో, ‘దేవస్థాన ఈ.వో.ని మేం మార్చి 27 న పెట్టుకున్న requisation [cancel order ని recall చెయ్యమని మేము వెళ్ళి ఈ.వో.కి పెట్టుకున్న అర్జీ అది.] మీద ఈ.వో. regretted వ్రాసినందున, దాన్ని పురస్కరించుకుని గది వెంటనే ఖాళీ చెయ్యవలసింది’ అని ఉంది. దాని తర్వాత మేమంతా తల్లిదండ్రులతో కలిసి ఈ.వో.ని కలిసినప్పుడు మే 8 దాకా ఈ.వో. మాకు సమయం ఇచ్చిన విషయం చెప్పి నేను ‘ నోటిసు తీసుకొను’ అని చెప్పేసాను. ఆ ఉద్యోగి వెళ్ళి మళ్ళీ 5 నిముషాల్లో వచ్చాడు. “అయితే గదికి తాళం వేస్తారట. సీజ్ చేస్తామని చెప్పమన్నారు కృష్ణయ్య సార్” అని చెప్పాడు. నాకు అరికాలి మంట నెత్తి కెక్కింది. అందునా అప్పటివరకూ చాలా సహనం కూడదీసుకుంటూ ఉన్నాను. దాంతో ఒక్కసారిగా “మంచిది, వేసుకొమ్మని చెప్పండి” అని గట్టిగా చెప్పాను. పిల్లలతో “రేయ్! బుడ్డీస్! వీళ్ళు మన స్కూల్ కి తాళాలు వేస్తారట. రేపట్నుండి మీరుస్కూలుకు రానక్కరలేదు. బ్యాగ్స్ సర్ధుకుని ఇంటికి వెళ్ళండి” అన్నాను. పాపం! పిల్లలంతా బిక్కముఖాలు వేసారు. కుర్చీలన్నీ సర్ధి, బొమ్మలు,బోర్డులూ లోపల పెట్టేసి బయలు దేరారు. ఎప్పుడైనా బందులూ గట్రా జరిగి, పెద్దవాళ్ళు రాకముందే పిల్లల్ని ఇళ్ళకి పంపవలసి వచ్చినప్పుడు, చిన్నపిల్లల్ని అదేదారిలో వెళ్ళే పెద్దపిల్లలకి అప్పజెప్పి పంపించడం మాకు అలవాటే. అలా పిల్లలుందర్నీ disburse చేసాము. మేమిదంతా చేస్తుండగానే ఆ ఉద్యోగి వెళ్ళిపోయాడు. 12 గంటలకి మరో ఉద్యోగి [ఈసారి పర్మినెంటు ఉద్యోగి] వచ్చి నోటిసు మాగది తలుపుకి అంటించి, "మాదేముందండి! కృష్ణయ్య సార్ నోటిసు ఇచ్చిరమ్మంటే వచ్చాం. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడుకొండి” అన్నాడు. నేను భగ్గుమంటూ “ఏం మాట్లాడాలి? ఎన్నిసార్లు వెళ్ళాలి? వెళ్ళిమాట్లాడబోతే గడపే తొక్కవద్దన్నాడు. మే 8 వరకూ టైమిచ్చి మళ్ళీ 10 రోజుల్లోనే మరో నోటిసు తీసుకుని వచ్చారు. ఏం డ్రామాలాడుతున్నారా? వేసుకుంటే వేసుకొండి గదికి తాళం! ఈ ఫర్నిచర్ కోసం కూడా వెనక్కి తగ్గను. ఈడ్రామాలు మీకు కొత్తేమో గానీ ఇది నేను చూసిన సినిమానే” అన్నాను. వాళ్ళు వెంటనే అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు. మర్నాడు మేము, మరిద్దరు పేరెంట్సు కలిసి ఈ.వో. ఇంటికి వెళ్ళి, దీనిగురించి అడగాలని బయలుదేరాం. ఇంతలో ఈనాడు శివ ఎదురు వచ్చి ‘తాను మాట్లాడివచ్చాననీ, టైం ఇచ్చిన విషయం తెలియక కృష్ణయ్య అలాచేశాడు. అదంతా ఏంలేదని’ మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చాడు. ఇదంతా వివరంగా ప్రధానికీ, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి వ్రాసిన ఫిర్యాదులో ఉన్నాయి.

ఈ గొడవంతా తెలిసి కొంతమంది తల్లిదండ్రులు ఆతృతగా ఫోన్లు చెయ్యటం, స్కూలు దగ్గరికి రావటం చేసారు. తర్వాత తేలిన సమాచారం ఏమిటంటే – ఈ.వో. మాకు టైం ఇస్తూ సంతకం పెట్టిన requisation వాళ్ళదగ్గరికి రాలేదట. ఈ.వో. మర్చిపోయి అది తన టేబుల్ సొరుగులోనే ఉంచుకున్నాట్ట. తమ దగ్గరికి regretted అని సంతకం పెట్టిన requisation మాత్రమే వచ్చిందట. దాని ప్రకారం తమ డ్యూటీ తాము చేసారట. అక్కడికి శ్రీశైలం దేవస్థానం మహా సాగరమంత ఆఫీసు, దానిలో ఎక్కడేం జరుగిందో ఎవ్వరికీ తెలీదు అన్న లెవల్లో చెప్పారు. అక్కడ ఉన్న ఉద్యోగుల్లో ఎక్కువమంది రూం అటెండర్లు వంటి నాల్గవ తరగతి ఉద్యోగులే. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు చాలా చిన్నది. అసలు ఊరే చాలా చిన్నది. ఊరిలోనే ఎక్కడేం జరిగినా గంటలో అందరికీ తెలిసిపోతుంది.

అటువంటిది – ఇక్కడ ఇప్పుడు ఈ నాటకం! మాకు favorable అయిన విషయం/ ఫైలు అయితే పదిరోజులైనా కదలదు. [మార్చి 31 నుండి ఏప్రియల్ 11 వతేది వరకూ] అదే మాకు infavor అయితే మూడు రోజుల్లో కదులుతుంది. మార్చి 10 తేదిన వాళ్ళ స్టాఫ్ రమణయ్య మొదలైన వాళ్ళు representation పెడితే, దాని మీద ఈ.వో., డి.ఈ.వో.కి మార్కు చేయడం, డి.ఈ.వో. మా సత్రంలో ఎంక్వయిరీ చెయ్యడం, [ఎప్పుడు చేశాడో, ఎవరిని ప్రశ్నించాడో ఎవరికి తెలియదు] ఆవిడ [అంటే నేను] అలాంటి మనిషే. అందరితో తగవులు పెట్టుకుంటుంది. కాబట్టి రూం కాన్సిల్ చెయ్యమని ఈ.వో.కి రిపోర్టు పంపటం, దానిమీద ఈ.వో. మాకు గది కాన్సిల్ చేస్తూ నోటిసు పంపటం – ఈ కార్యక్రమం అంతా మూడే మూడురోజుల్లో [మార్చి 10 వతేదినుండి 13 వ తేది వరకూ] జరిగింది. అదీ మాపైన నడిచిన వేధింపు తీరు! లేదా రెడ్ టేపిజం తీరు. పైన తన మీద కంప్లైంటు చేసినందుకు, అదేదో తన స్వంత జాగీరు దారు అన్నట్లు మాకు కేటాయించిన దేవస్థాన గదిని కాన్సిల్ చేసాడు దేవస్థాన ఉద్యోగి కృష్ణయ్య.[ఇప్పటికి అతడు రిటైర్ అయ్యి రెండేళ్ళవుతుంది. ఇంకా దేవస్థాన కాటేజీని ఖాళీ చేయలేదని విన్నాను.] ఆవిధంగా ఉద్యోగులు తమ వ్యక్తిగత భావోద్రేకాలూ, అహంకారాలు కూడా జనాల మీద చూపటానికి ఇది ప్రజస్వామ్యమా లేక హైదరాబాదు నిజాం పాలనా?

ఇదే ఉటంకిస్తూ, అన్ని వివరాలతో ఏప్రియల్ 13 న మళ్ళీ మరో ఫిర్యాదు పి.ఎం.కి, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి వ్రాసాము. అందులో దేవస్థాన ఉద్యోగి మధుసూదన రెడ్డి అనే C2 clerk మా గురించి ఊళ్ళో ప్రచారం చేస్తున్న పుకార్ల గురించి కూడా వ్రాసాము. అతడు తాడిపత్రి నేటివ్ గా గలవాడు. నాటి దేవదాయ శాఖామంత్రి జే.సి. దివాకర రెడ్డికి సమీప లేదా దూరపు బంధువని చెప్పుకుంటారు. అతడే గాక దాదాపు 10, 15 మంది పైనే తాడిపత్రి బ్యాచ్ ఒకటిఅప్పట్లో శ్రీశైలంలో చలాయించుకుంటూ ఉండేది. ఇక ఈ గుమస్తా ప్రచారించిన అంశాలు ఏమంటే -
1]. మార్చి 31 న మాకు ఈ.వో. ఐదువారాల గడువిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ మరి మళ్ళీ ఏప్రియల్ 11 న మరో నోటిసు ఎందుకు పంపాడని మా విద్యార్ధి తండ్రి, పోలీసు కానిస్టేబుల్ సుధాకర్ అడిగితే, మధుసూదన రెడ్డి చెప్పిన జవాబు అసలు మా విఙ్ఞాపన పత్రం మీద ఈ.వో. సంతకమే పెట్టలేదని. 20 మంది తల్లిదండ్రుల ఎదుట 40 నిముషాల ఉపన్యాసమిచ్చి, ఐదు వారాల గడువు ఇస్తున్నట్లు మాట ఇచ్చిన ఈ.వో. సంతకం పెట్టలేదట. ఏది నిజమో అతడికే తెలియాలి.

2]. మరో విద్యార్ధి తండ్రి, ఈ.వో.డ్రైవరు గణపతి అడిగితే, ఆఫైలు కనపడటం లేదని అందుచేత మొదటిregretted requisition మీద తమ react అయ్యామనీ చెప్పాడు. వారి ఆఫీసులో ఫైలు గల్లంతవ్వటం ఎవరితప్పో? అసలెందుకు గల్లంతయ్యిందో?

3]. మరో విద్యార్ధి తండ్రికి ఈ.వో. ఆ requisation ని క్రిందికి క్లర్కు దగ్గరికి పంపలేదని, తన టేబుల్ సొరుగులో పెట్టుకుని మరిచిపోయి ఉండొచ్చని చెప్పాడు.

4]. మరో విద్యార్ధి తండ్రి రాజశేఖర్ రెడ్డికి “వాళ్ళు వాళ్ళూ రాజీపడ్డారట. ఆ సారూ మేడం వాళ్ళు రాజీపత్రం రాసిచ్చారట అందుచేత ఇక వాళ్ళ రూం ఖాళీ చెయ్యక్కర్లేదు” అని చెప్పాడట. ఆ రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి ఈవిషయం మాకు చెప్పినప్పుడు, మాకు విపరీతమైన ఆశ్చర్యం వేసింది. ఎవరితో రాజీ, ఏమని రాజీ, రాజీపత్రం ఏమిటీ? నిజానికి ఈరాజీ [compromise] అన్న పదం సూర్యాపేటలో ఎ.ఎస్.పి. శివానందరెడ్డి నోట వచ్చినప్పుటి నుండి, ఇలాగే అసాధారణంగా విన్పిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఆ అసాధారణం చూసి ఆశ్చర్యపోవటమే మా పని అవుతుంది. ఇలాంటి పుకార్లతో మామీద చేసే మానసిక హింస, అందోళనలు సృష్టించే ప్రయత్నం [Psychological play] మాకు అర్ధమౌతునే ఉంది.

ఇక్కడ మరో వైచిత్రి ఏమిటంటే – ఆరోజు అంటే, మార్చి 11 వ తేదిన సాయంత్రం ఓవిద్యార్ధి తండ్రి వచ్చి “ఈ.వో.గారు మనకు టైం ఇస్తూ వ్రాసిన నోట్ ఉన్న లెటర్ క్రిందికి పంపడం మరిచిపోయాడట మేడం. ఆయన టేబుల్ సొరుగులోనే పెట్టుకున్నాడట. అందుకని కృష్ణయ్య సార్ ఈరోజు మళ్ళీ మీకు నోటిసు జారీ చేశాట్ట. మనమో పని చేద్దాం. రేపు మళ్ళీ పేరెంట్సందరినీ పిలవండి. మొన్నట్లాగే మళ్ళీ ఓ 20,30 మందిమి వెళ్ళి ఆ లెటర్ క్రిందికి పంపలేదని రిక్వెస్టు చేద్దాం” అంటూ కూర్చున్నాడు. అది అమాయకత్వం అనలేం. అలాగని శ్రేయోభిలాషి ముఖం పెట్టిన అతడితో, కఠినంగానూ వ్యవహరించలేం. అసలు నిజం చెప్పాల్సి వస్తే ‘శత్రువు శత్రువులాగా ముఖం పెడితే అది కనీసం యుద్ధం అవుతుంది. స్త్రీలైనా, పురుషులైనా యుద్ధంలో ఒకవీరత్వం ఉంటుంది. శత్రువు మిత్రువులా ముఖం పెడితే ఆ కుట్ర అతినీచంగా ఉంటుంది. అటు స్త్రీ, ఇటు పురుషుడు కాని నపుంసకత్వం అది. ఇలాంటి మిత్రులని నేను చాలా మందిని చూసాను. చాలా చాలా దగ్గరై, మా మోటివ్స్ తెలుసుకొని, చేరవేయటం అన్న విషయం మేమూ బాగా గమనించాం. దాదాపు ఆరు నెలలు పాటు పరిశీలించి మరి ఆ స్నేహాలని కట్ చేసుకున్నాం.

ఆ విద్యార్ధి తండ్రితో సహనంగా “అలా మళ్ళీ కదుపుతాం. ఆ తర్వాత అది ఆ క్రింది క్లర్కు దగ్గర మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ వెళ్ధామా? ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ గురించి మీకు తెలియదేమో గాని నాకు తెలుసునండీ! కానివ్వండి. వాళ్ళు మా రూంకి తాళం వేస్తే వెయ్యనివ్వండి. అదీ చూస్తాను. అయినా ఇది సూర్యాపేటలో నేను చూసిన సినిమానేనండీ! నా వెనక ఏంజరుగుతుందో నాకు తెలుసు. పిల్లల తల్లిదండ్రులుగా మీఆతృతా, ఆందోళనా నాకు అర్ధమయ్యాయి. కానీ మీరు చెపుతుంది impractical. చూద్దాం. ఏంచేస్తారో చెయ్యనివ్వండి. ఎన్ని డ్రామాలాడితే అన్నీ ఆడనివ్వండి. గుడిలో మల్లయ్య అందర్నీ చూస్తునే ఉంటాడు” అన్నాను. అతడు కిక్కురుమనకుండా వెళ్ళిపోయాడు. ఇలాంటి మిత్రువు ముఖం పెట్టిన శత్రువులు మాకు జీవితంలో చాలామందే తారసపడ్డారు.

ఈ దేవస్థాన ఆఫీసు డ్రామాలన్నింటిని పి.ఎం.కీ, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి ఫిర్యాదు పంపాక మాకు మే 5 వతేదిన AICC Letter head మీద ఏప్రియల్ 20 వ తేది తో దిగ్విజయ్ సింగ్ నుండి ఓలేఖ వచ్చింది. అదీ పోస్టల్ డిలే తో రాగా మా ప్లోరుమీద ఉన్న పోస్టల్ ఉద్యోగి ఆరోజు మధ్యాహ్నం తెచ్చి “అక్కా! ఇది మా ఆఫీసులో టేబుల్ మీద ఉంది. అడ్రస్సు locate కాక సున్నిపెంట అంతా తిరిగి వచ్చిందట. అక్కడ ఉంటే గమ్మున పట్టుకొచ్చేసాను” అంటూ ఇచ్చాడు. అతడికి కృతఙ్ఞతలు చెప్పి తీసుకుని చూస్తే అందులో సోనియాగాంధీ పేరిట ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామారావు [రామోజీరావు బదులుగా అలా టైపు చేయబడి ఉంది. స్కాన్డ్ కాపీ Fire Pot లో చూడగలరు] మమ్మల్ని వేధిస్తున్నట్లుగా ఆరోపిస్తూ, మేము వ్రాసిన ఫిర్యాదులు తనకు Farward అయ్యాయనీ, అందులో విషయాలు తాను నోట్ చేసుకుంటున్నాననీ ఉంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నిన్నటి టపాలు:


ఆరోజంతా ఆంధ్రజ్యోతి ఎడిటర్ ని కలవటానికి ప్రయత్నించాము. ఉదయం ఇదిగో వస్తారు, అదిగో వస్తారు అంటూ ఫోన్ లో సాయంత్రం దాకా గడిపి, తరువాత నింపాదిగా ఆయన తిరుపతి వెళ్ళారని, ఎప్పుడు వస్తారో తమకి తెలియదు అని చెప్పారు. ఆ మర్నాడు CBCID Office కి వెళ్ళాము. ఆ సంవత్సరం ఉగాదిపండుగ గురించి గందరగోళం నెలకొంది. మార్చి 19, 20 తారీఖుల్లో నిర్వహించారు. ప్రభుత్వసెలవు కూడా ఐచ్చికంగా తీసుకున్నారు. మాకు ఇంతకు ముందు ఫిబ్రవరి 6 వతేదిన CBCID, IG కృష్ణరాజ్ నంటూ ఫోన్ వచ్చినందున, అతణ్ణి కలిసేందుకు ప్రయత్నించాము. అతడే ఉండవల్లి అరుణ్ కుమార్ కారణంగా రచ్చకెక్కిన మార్గదర్శి కేసుని డీల్ చేస్తున్నాడు. ఆ ఫైల్స్ ని తరిలించటం, ఆపైన కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా, అతడి విజువల్స్ అప్పటికి టి.వీ.న్యూస్ లో చూసి ఉన్నాము. మేము అతడి పి.ఏ.కి విజిటర్ స్లిప్ ఇచ్చాము. అయితే ఆ అధికారి, మమ్మల్ని తన తర్వాతి అధికారిని కలవాల్సిందిగా చెప్పాడట. అతడి పి.ఏ. ఆ విషయం మాకు చెప్పి, మమ్మల్ని వేచి ఉండమని, ఫోన్ లో సదరు అధికారితో మాట్లాడాడు. ఆ అధికారి మమ్మల్ని తను రిసీవ్ చేసుకోవడానికి నిరాకరించాడు. దాంతో పి.ఏ. మమ్మల్ని అక్కడే కూర్చోమని, తాను మళ్ళీ లోపలికి వెళ్ళి ఐ.జి.కృష్ణరాజ్ కి విషయం ఇన్ ఫార్మ్ చేశాడు. మేమిదంతా మౌనంగా గమనిస్తూ విజటర్స్ లాంజ్ లో కూర్చున్నాము. కొంతసేపటి తర్వాత ఐ.జి. కృష్ణరాజ్ మమ్మల్ని లోపలికి పిలిచాడు. అతడికి నమస్కరించి కూర్చొని, మావ్యక్తిగత వివరాలు క్లుప్తంగా చెప్పి, కేసు గురించిన ఉపోద్ఘాతం చెప్పాను. పదిరోజుల క్రితం శ్రీశైలం సి.ఐ. మాదగ్గర స్టేట్ మెంట్లు తీసుకున్న వైనం వివరించి, ఆపైన దేవస్థానం మాకు జారీ చేసిన రూం కాన్సిలేషన్ ఆర్డర్ చూపించాను. అతడు ఒక్కసారిగా “ఆరోజు ఫోన్ లో మాట్లాడింది నేనే. మీ attititude wrong. ఈ attititude తో ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మీ సమస్యలు పరిష్కారం కావు. రామోజీరావుకి – రాజీవ్ గాంధీ హత్యతో గానీ, మీపైన organized harrasment తో గానీ అసలే సంబంధమూ లేదు. మాకు ప్రతీరోజూ ఇలాంటి ఆకాశరామన్న ఫిర్యాదులు ఎన్నో వస్తుంటాయి. అది నిర్ధారించుకునేందుకు ఆరోజు మీకు ఫోన్ చేసాను. మీరు సరియైన వివరాలు ఇవ్వలేదు. అందుకే చెబుతున్నాను మీ attitude తప్పని. మీరు అవీ ఇవీ కలెక్ట్ చేసి కేసు ఫ్రేం చేస్తున్నారు. అందులో మీభ్రమ తప్ప సత్యమన్నదే లేదు “ అన్నాడు.

ఎంత అడ్డగోలు వాదన ఇది? వాళ్ళకి ప్రతీరోజూ ఎన్నో ఆకాశరామన్న ఉత్తరాలు, ఫిర్యాదులు వస్తే నిర్ధారించుకునే పద్దతి ఫోన్ లో అడగటమా? వాళ్ళ స్థానిక పోలీసు స్టేషన్ కి ఒక్క మెయిల్ ఇచ్చినా, ఒక్క ఫోన్ చేసినా, క్షణాల్లో వివరాలు వస్తాయి? అసలు ఫిర్యాదులో ఏ ఫోన్ నంబర్ ఉందో, ఆనంబరుకే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కంప్లైంటీ చెప్పేది ఎలా నిర్దారణ అవుతుంది? అసలైనా ఇలాంటి ప్రమాదకర విషయాలు ఎవరైనా, పైస్థాయి వాళ్ళపేర్లు రిఫర్ చేస్తూ ఊసుబోని ఫిర్యాదులు వ్రాస్తారా? ఏళ్ళ తరబడి పోరాడతారా? అసలైనా ఫిర్యాదు వ్రాసింది ఆకాశరామన్నో, అడ్రసున్న సీతమ్మో, వాళ్ళ స్థానిక పోలీసు స్టేషన్ ని అడిగితే క్షణాల్లో చెబుతారు గదా! ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేసి “నేను I.G. of CBCID , కృష్ణరాజ్ ని, చెప్పు నీకేసు వివరాలేంటి?" అంటే నేనెందుకు నమ్మాలి? ఫోన్ లో ఉంది ఐ.జి. యేనని నాకేమిటి గ్యారంటీ? అయినా ఫోన్ లో చెప్పగలిగేటంత చిన్న కేసా ఇది? టూకీగా వ్రాస్తేనే 18 పేజీల పైన పట్టింది. [2006 వరకూ జరిగిన విషయాల వరకూ వ్రాస్తేనే] అలాంటిది ఫోన్ లో ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి?

ఈ అడ్డగోలు వాదనతో, నా attitude ని నిందిస్తూన్న వ్యక్తికి, ఇక ఏంచెప్పి ఏం ప్రయోజనం? అందుకే కృతఙ్ఞతలు చెప్పి లేచి రాబోతున్నాను. అతడు నన్ను ఆగమంటూ చెయ్యి ఊపి, "You won’t hear others and you won’t appreciate others work .మీరు మీ జీవితాన్నే గాక, మీ భర్త, మీ కూతురి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు” అన్నాడు. ఇదంతా నాకు విచిత్రంగా అన్పించింది. బాధితులమైన మేము ఎవరినైనా appreciate చేసేది ఏమిటి? అందునా అతడు నా attitude తప్పనీ, నేను [hellusination] భ్రమల్లో ఉన్నాననీ అంటున్నాడు. అదే అయోమయంలో అతడి వైపు ప్రశ్నార్ధకంగా చూస్తూ నిలబడి పోయాను. అతడు కొనసాగిస్తూ “ఆ రామోజీరావేం చేస్తాడు? వాడి ఖర్మ వాడు అనుభవిస్తున్నాడు. అసలు మీరు వ్రాసిన కంప్లైంటు నాకే అర్ధం కాలేదు. ఇక మా సి.ఐ.కి ఏం అర్ధమౌతుంది?" అన్నాడు. ఓ క్షణం ఆపి మళ్ళీ “మాకు పైనుండి వచ్చిన ఆ ఫైల్ మొత్తాన్ని కర్నూలు ఎస్.పి.కి పంపించేసాను. నేనసలు మిమ్మల్ని కలవకూడదు, అయినా సరే కలిసాను. నాకు ఎస్.పి. మాత్రమే జవాబుదారి. ఏవిషయమైన ఎస్.పి. నుండి తెలుసుకుంటా. మీసమస్యలు అన్ని ఎస్.పి.కి చెప్పుకొండి మీరు వెళ్ళి అతణ్ణి కలవండి” అని సలహా ఇచ్చాడు. ఇంత చేదు అనుభవాన్ని, అయోమయాన్ని వెంటబెట్టుకుని ఆ ఆఫీసులోంచి బయటికొచ్చాము. అయినా ఇతడు నా attititude wrong అని ఎందుకు అంటున్నట్లు? Disputes మీద కంప్లైంట్లు పెట్టటం గాకుండా, ఏంచేస్తే నాది right attitude అవుతుంది ఇతడి దృష్టిలో?

మర్నాడు ‘వార్త’ ఆఫీసుకి వెళ్ళాము. టాంకు బండుకు దిగువున ఉంది వీరి ఆఫీసు. అక్కడ ఉన్న సబ్ ఎడిటర్ ని కలిసాము. అతడు నింపాదిగా ఓ గంటపాటు మేం చెప్పిందంతా విన్నాడు. ఇక తర్వాత మొదలుపెట్టాడు. దాదాపు CBCID, IG కృష్ణరాజ్ చెప్పిందే. “మీరిదే దారిలో వెళ్తూ మీ జీవితమే గాక, మీ పాప జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. కావాలంటే శ్రీశైలంలో చుట్టుప్రక్కల గిరిజన తండాలకు మీరు వెళ్ళి సేవ చేయండి. మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను, మీరు వ్రాసి పంపండి. మేం పేపర్లో వేస్తాం. నేను 18 ఏళ్ళు ఈనాడులో పనిచేసాను. ఎల్.టి.టి.ఇ. సానుభూతిపరుణ్ణంటూ లంకలో పనిచేస్తుండగా జైల్లో కూడా పెట్టారు. ఇప్పుడు ‘వార్త’లో పని చేస్తున్నాను. మేం పేపరులో వేస్తే ఓ రెండురోజులు మీకేసు పాపులర్ అవుతుంది. అంతే! తర్వాత అందరూ మర్చిపోతారు. తర్వాత మీజీవితం మరింత అధ్వాన్నం అవుతుంది” అని సలహా ఇచ్చాడు. “అయినా అందుకు నేను సిద్దమే. పేపరులో ప్రచురించండి” అన్నాను.

“ఆ నిర్ణయం తన చేతుల్లో లేదని, యాజమాన్యం చేతుల్లో ఉందనీ, యాజమాన్యం కూడా వారి పరిమితికి లోబడే వార్తలు ప్రచురిస్తారనీ, ఎండోమెంట్ కమీషనర్ తనకు తెలుసునని, కావాలంటే ఆయనకి రికమెండ్ చేసి శ్రీశైలంలో మీ రూం కాన్సిల్ ని, రికాల్ చేసేటట్లు చేస్తానని” చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అప్పుడే ’పోటీ పత్రికలకి కూడా వారి వ్యాపారపరిమితులు వారి కుంటాయన్నమాట’ అనుకొని చేసేది లేక వెనుదిరిగాను. ఈ.వో. దగ్గరికి మాత్రం నన్ను వెళ్ళవద్దని, నా భర్తని మాత్రం వెళ్ళి అడగమని సలహా ఇచ్చాడు.

ఇక హైదరాబాదులో చేయగల ప్రయత్నం మాకేమీ కన్పించలేదు. ఉగాది సెలవులూ పూర్తవుతాయి. వెనుదిరిగి శ్రీశైలం వచ్చాము. మా విద్యార్ధులు తల్లిదండ్రులతో సమస్య పరిష్కరించుకునే ప్రయత్నాలు ప్రారంభించాము. మేం సమాచారం సేకరిస్తున్నప్పుడు మా విద్యార్ధుల తండ్రి, కానిస్టేబుల్ సుధాకర్, తానే క్రింది అంతస్థువారిని సి.ఐ. పిలుచుకురమ్మంటే పిలుచుకుపోయానని చెప్పాడు. మేం ఢిల్లీలో ప్రధానమంత్రికీ, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి పెట్టిన కంప్లైంట్లలలో ఎవరెవరి పేరుని ఉటంకించామో, వాళ్ళందరి దగ్గరా స్టేట్ మెంట్లు తీసుకున్నాడట. ఈ ప్రక్రియ అంతా దాదాపు రెండునెలలుగా జరిగిందట, అంటే జనవరి నుండీ అన్నమాట. అప్పుడెప్పుడూ అతడిది మాటమాత్రంగా కూడా మాకు చెప్పలేదు.

మాకు నోటీసు జారీ చేసింది మార్చి 13 న. 15 రోజుల గడువు ఇచ్చారు. విద్యార్ధుల తల్లిదండ్రులూ, మిత్రులూ సానుభూతి చెబుతున్నారు, అదిగో ఇదిగో అంటున్నారు గానీ ఏదీ ముడిపడటం లేదు. దాంతో మార్చి 29 న నేను, నాభర్త దేవస్థానపు ఆఫీసుకి వెళ్ళి ఈ.వో.ని కలిసాము. అతడెంతో అమర్యాదగా మమ్మల్ని డీల్ చేశాడు. అయినా మేం సహనంగా చేతివ్రాతలో ఉన్న రిక్విజేషన్ అతడికి ఇచ్చి, పరిస్థితి చెప్పి, మేం అప్పటికి నాలుగేళ్ళుగా అక్కడ ప్రీ స్కూల్ కమ్ ప్రైవేట్ ట్యూషన్ హోం నడుపుతున్నామనీ, వివరించాను. గొడవలు, తగవులు పెట్టుకునేంత తీరిక కూడా మాకు ఉండదనీ, ఉదయం 6గంటల నుండి రాత్రి 7.30 దాకా విద్యార్ధులతోనే సరిపోతుందనీ, కావాలంటే వారి దేవస్థానపు ఉద్యోగుల్లో చాలామంది పిల్లలు మాదగ్గర చదువుతున్నందున వారిని కనుక్కోమనీ చెప్పాము. అతడవేవి పట్టించుకోనట్లు “మా స్టాఫ్ మీమీద ఏదో చెప్పారని మీ రూమ్ కాన్సిల్ చెయ్యలేదు. శ్రీశైలంలో కాటేజ్ లన్నీ అడ్డదిడ్డంగా ఎలాట్ అయి ఉన్నాయి. కొందరు నాల్గవ తరగతి ఉద్యోగులు పెద్దపెద్ద కాటేజీలలో ఉంటున్నారు. కొందరు పైస్థాయి అధికారులు చిన్న కాటేజీలలో అవస్థలు పడుతున్నారు. అందుకని అన్ని రూములు, కాటేజీలు రెగ్యులరేట్ చెయ్యాలనుకుంటున్నాము. మీకే కాదు, అందరికీ నోటీసులు ఇస్తాం. అందర్నీ ఖాళీ చెయిస్తాం. ఇక మీరు వెళ్ళవచ్చు?” అన్నాడు. మేం మా స్కూల్ విద్యార్ధులకు వచ్చే నెలలో ఫైనల్ పరీక్షలున్నాయనీ మరింత రిక్వెస్టు చెయ్యబోతే చాలా rude గా ‘ఇకవెళ్ళండి’ అన్నాడు.

తర్వాత మా విద్యార్ధుల తండ్రి వెంకటేశ్వరరావు ఫోన్ చేసి “మేడం! మీరు వెళ్ళిపోయాక వేరేపనిమీద నేనూ, మా ఆఫీసర్ చక్రవర్తి గారూ, ఈ.వో. కాబిన్ లోకి వెళ్ళాము. అప్పటికే ఈ.వో.గారు కృష్ణయ్యకి ఫోన్ చేసి “వాళ్ళది స్కూలని అంటున్నారు” అని అడిగాడు. కృష్ణయ్య “స్కూలా,పాడా? ఏదో సాయంత్రం ఒకగంట ట్యూషన్ చెప్పుకుంటారు” అన్నాడు. చక్రవర్తి గారు “లేదుసార్! వాళ్ళది స్కూలే. మన స్టాఫ్ లో చాలామంది పిల్లలు అక్కడే చదువుతున్నారు. నాలుగేళ్ళగా నడుపుతున్నారు. బాగా చెబుతారు సార్! మంచివాళ్ళు” అని చెప్పాడు. నేను కూడా ఈ.వో.గారికి చెప్పాను. అయినా ఈ.వో.గారు “మరి కృష్ణయ్య కాదంటున్నాడు!” అనేసి ఊరుకున్నారు, మేడం! మీ రిక్విజేషన్ మీద రిగ్రేటెడ్ అని వ్రాశాడు” అని చెప్పాడు.

మర్నాడు మార్చి 30 వ తేదిన, మేము పిల్లలకి స్కూల్లో క్లాసులు తీసుకోకుండా తిప్పి పంపించాము. అప్పటికి గానీ తల్లిదండ్రులకి చురుకు రాలేదు. ఒక్కొక్కరూ ఫోన్ చెయ్యటం, స్కూలు దగ్గరకు రావటం ప్రారంభించారు. అందరికీ పరిస్థితి వివరించి చెప్పి, సమస్య ఎదురుగా ఉంచాము. దాదాపు 20 మంది పైగా తల్లిదండ్రులు గుమిగుడారు. తల్లిదండ్రుల్లో దేవస్థాన ఉద్యోగులు, వ్యాపారులూ, ఇతరులూ ఉన్నారు. ఈ.వో. ఇంకో డ్రైవరు గణపతి అని ఒకవ్యక్తి ఉన్నాడు. అతడి పాప, బాబు అప్పటికి నాలుగేళ్ళుగా మాదగ్గరే చదువుతున్నారు. అతడూ, పోలీసు కానిస్టేబుల్సూ కలిసి క్రింది అంతస్థులోని రమణయ్యని తీసుకొచ్చారు. మాగదిలో కూర్చోబెట్టి పంచాయితీ మొదలు పెట్టారు.

ఈ.వో. డ్రైవరు గణపతీ, కానిస్టేబుల్ సుధాకర్, ఈనాడు శివ ఇంకొంతమంది తల్లిదండ్రులు గదిలో కూర్చున్నారు. మరికొందరు బయట వరండాలో ఉన్నారు. గణపతి “అదికాదు రమణయ్యా! ఈమేడం ఏకేసూ ఇక్కడ పోలీసు స్టేషన్ లో పెట్టలేదట. అదెప్పుడో 1992 లో రామోజీరావు మీద ఢిల్లీలో పెట్టిన కేసు. మళ్ళీ 2005 లో ప్రధానమంత్రికి ఢిల్లీలోనే పెట్టారట. అంతే తప్ప ఆ కేసుకూ మీకు ఏసంబంధమూ లేదు. మరి ఇదంతా ఏమిటి, ఎందుకు? నువ్వేదో కృష్ణయ్య సార్ కు చెప్పటం, ఆసారు వీళ్ళ రూం కాన్సిల్ చెయ్యటం, ఏందిది? ఇక్కడ ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడిలా అర్ధాంతరంగా స్కూలు మూసేస్తే మాపిల్లలంతా ఏంకావాలా?" అన్నాడు. దానికి రమణయ్య “లేదన్నా! ఈ మేడమ్ పోలీసు స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టింది. రెండుసార్లు వెళ్ళొచ్చింది. ఇదిగో ఈ సుధాకర్ సారే మా ఆడోళ్ళనీ, మమ్మల్నీ సి.ఐ. పిలుచురమ్మన్నాడంటూ పిలుచుకుపోయాడు. ఆ సి.ఐ. మాచేత ఏంటో స్టేట్ మెంట్లంటు రాయించుకున్నాడు. మా ఆడోళ్ళు పోలీసు స్టేషన్ గడప తొక్కబట్టింది ఈ మేడం మూలంగానే గదా! అందుకే, నేనే అందరి చేతా పిటిషన్ రాయించి సంతకాలు పెట్టించి సార్ కి ఇచ్చిన” అన్నాడు.

రమణయ్య చెల్లెలు పోలీసుకానిస్టేబుల్ తో ఆక్రమ సంబంధం కలిగిన నేపధ్యంలో తగుమాత్రం రచ్చ గతంలో జరిగింది. అలాంటి వారి ఆడవాళ్ళు గౌరవనీయులు, పోలీసు స్టేషన్ గడప తొక్కటంతో వారి గౌరవానికి గ్లాని ఏర్పడింది. బూతులు తిట్టే వాళ్ళు ఆత్మగౌరవం అంత గొప్పది. వారి ఆత్మగౌరవం ముందు, దేవస్థానపు ఈ.వో.కీ, డి.ఈ.వో.కీ చదువుకున్న దాన్ని, పంతులమ్మని, గౌరవనీయులైన కుటుంబం నుండీ, ఆర్ధికస్థాయి నుండీ వచ్చిన దాన్ని అయిన నా ఆత్మగౌరవం దిగదుడుపుగా కన్పించింది. ఎందుకంటే మరి నేను అవినీతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసాను కదా? ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రామోజీరావు మీద ఫిర్యాదు చేసి ఘోరనేరం చేసాను కదా!

ఈ ఆలోచన్లలో నాకు లోలోపల రగిలిపోతుంది. అయినా సహనంతో మనస్సు కంట్రోలు చేసుకున్నాను. గీతలోని ఆత్మసంయమన యోగం గుర్తు తెచ్చుకున్నాను. అప్పటికి గణపతి, ఇతరులు రమణయ్యని కన్విన్స్ చేసి తమ representation వెనక్కి తీసుకోమని చెబుతున్నారు. నేను, మావారు దాదాపు గమ్మున చూస్తున్నాం. ఇంతలో సుధాకర్ “అదికాదు సార్! మాకు ఎస్.పి. దగ్గర నుండి ఈ మేడం, పైన ఢిల్లీలో పెట్టిన కంప్లైంటు వచ్చాయి. మా సి.ఐ.సార్ వీళ్ళందరినీ ఒక్కొక్కరినీ ఒక్కోరోజు పిలుచుకు రమ్మన్నాడు. నేనే పిలుచుకుపోయాను. కృష్ణయ్య సార్ కి మొన్న ఆక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది కదా! అందుకని మా సి.ఐ. సార్ వెళ్ళి కృష్ణయ్య సార్ దగ్గర కూడా స్టేట్ మెంటు తీసుకున్నాడు. అంతా అయ్యాక ఈ సారూ, మేడం, వాళ్ళ పాప దగ్గర కూడా స్టేట్ మెంట్లు తీసుకున్నారు. కదా సార్?" అంటూ మమ్మల్ని అడిగాడు. నేను, మావారు కూడా “అవునండీ! మొన్న మార్చి 8,9 తేదీల్లో మా స్టేట్ మెంట్లు కూడా తీసుకున్నారు. అది పూర్తిగా రామోజీరావుకి సంబంధించిన కేసు. ఆ ఫిర్యాదులో మా జీవితంలో జరిగిన మంచీ, చెడూ, రెండూ వ్రాసాను. మేలు చేసిన వాళ్ళు గురించి వ్రాసాము, వేధించిన వాళ్ళ గురించీ వ్రాసాము. అది రాజీవ్ గాంధీ హత్యకి, ఎంసెట్ కీ, మాపైన వేధింపుకి సంబంధించిన కేసు. పెట్టింది కూడా ఇప్పుడు కాదు. ఇన్నేళ్ళ తర్వాత ఇక్కడి కొచ్చింది” అన్నాము.

దానితో సుధాకర్ “మేడం మీరు కంగారు పడకండి, మా సి.ఐ.సార్ ఈ మేడంకి మెంటల్ అనీ, అందరితో ఇలాగే ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటుందనీ వ్రాసి పంపాడు. మేడం! మీరు కంగారు పడకండి” అన్నాడు. కంగారు పడటానికి మాత్రం ఏముంది అక్కడ? అడ్డగోలు వ్యవహారాలు అంతకంతకూ పెరిగిపోవడాన్ని చూస్తూ ఉన్నాము. ఇంతలో గణపతి “విన్నావు గదా రమణయ్య!” అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. అంతలో రమణయ్య బెట్టుచేస్తూ లేచిపోబోవడం, తల్లిదండ్రుల్లో కొందరు అతణ్ణి కన్విన్స్ చేసి కూర్చోబెట్టే ప్రయత్నం చెయ్యటం చేస్తున్నారు. ఇంతలో నేను “గణపతి గారు! నిన్న నేనూ, సారు ఈ.వో.గారిని కలిసామండి. నేను ఈ రమణయ్య వాళ్ళు పెట్టిన representation గురించి రిఫర్ చేసి, మారూమ్ కాన్సిల్ recall చెయ్యమని అడిగాము. ఆయన, ఎవరూ మాకు వ్యతిరేకంగా ఏ representation పెట్టలేదని, శ్రీశైలంలో రూములూ, కాటేజీల ఎలాట్ మెంట్లన్నీ తాను రెగ్యులరేట్ చెయ్యదలుచుకున్నానని, మాకేగాక త్వరలో అందరికీ నోటీసులు ఇస్తాననీ చెప్పారు” అన్నాను.

దాని మీద తలా ఓమాట అన్నారు. ఈలోపులో రమణయ్య లేచి వెళ్ళిపోయాడు. ఇకపిల్లల తల్లిదండ్రులంతా కలిసి ‘కృష్ణయ్యని కలుద్దాం’ అన్నారు. అతడి కాటేజీ మా సత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. దాదాపు 20 మంది పిల్లల తల్లిదండ్రులూ, మేమిద్దరమూ వెళ్ళాము. ఈనాడుశివ కూడా వచ్చాడు. అతడు కృష్ణయ్య ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోన్నాడు. మిగిలిన వారు నిలబడ్డారు. అందరూ కలిసి కృష్ణయ్యని బ్రతిమాలుతూ “సార్! ఏదో మా పిల్లలంతా అక్కడ చదువుకుంటున్నారు. ఆసారూ, మేడం కూడా ఎవరి జోలికీ వెళ్ళేవారు కాదు. పొద్దున లేచింది మొదలు వాళ్ళకి పిల్లలతోనే సాలైపోయిద్ది. మీరేదో ఆ రమణయ్య మాటలు విని కోపం చేసుకోకండి” అంటూ చేతులు జోడించి మరీ అడిగారు. అతడు ఖయ్యి మంటూ “అసలలాంటి ఆడామెని నేనేక్కడా చూడలేదు. ఆడామె అయి ఉండి మగాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టింది. రామోజీరావు మీద కంప్లైంటు పెట్టింది. చంద్రబాబునాయుడి మీద కంప్లైంటు పెట్టింది. నామీద కంప్లైంటు పెట్టింది. మా దేవస్థానం రూములో ఉంటూ మామీదే కంప్లైంట్లు పెడితే మాకెందుకీ గోల! అందుకే కాన్సిల్ చేసాను” అన్నాడు. నేను, మావారు వెనక నిలబడి ఉన్నాము. పిల్లల తల్లిదండ్రులు అతణ్ణి మరింత బ్రతిమాలుతూ నన్ను “మేడం! లోపలికి రండి!” అన్నారు. నేను ఓ అడుగు వేసి అతడి కాటేజీ వరండా గ్రిల్ వాకిటిదగ్గరికి వెళ్ళాను. అతడు “వద్దు వద్దు! అమ్మా నీకో దండం! నీలాంటి ఆమె నాగడపలో కాలే పెట్టద్దు” అన్నాడు. నేను ఆగిపోయాను. అంతలో ఓ పేరంటు “సార్! మమ్మల్నీ, మాపిల్లల్నీ మీరే దయచూడాలి” అంటూ ఏదో చెప్పబోయారు. అతడు ఒక్కసారిగా “నా దయ ఏమిటి! ఇంత మంది వచ్చారు గదా వాళ్ళకోసం? మీరే ఏమయినా చేసుకొండి” అన్నాడు. అంతలో వెంటవచ్చిన ఓ కానిస్టేబుల్ భార్య “ఏంసార్! ఇంతమందిమి బ్రతిమాలాడుతున్నాం. మాపిల్లల ముఖాలు చూసైనా ఆ రూం విడిచిపెట్టమని అడుగుతున్నా కాదంటున్నారే? అస్సలు న్యాయం ఉందా మీదగ్గర?" అంది. అంతే! అతడు “లేదమ్మా! నాదగ్గర న్యాయం లేదు. మీదగ్గర, మీ టీచరమ్మ దగ్గరే న్యాయం ఉంది. నేనేం చెయ్యలేను. మీరు ఈ.వో.ని అడగండి. ఆయన recall చేస్తే చేయించుకొండి. నేను అడ్డం రాను” అన్నాడు.

పిల్లల తల్లిదండ్రులూ “సార్! మేమంతా ఈ.వో.గారిని అడుగుతాం. మీరు కాదనకపోతే చాలు” అంటూ మరోసారి హామీ తీసుకుని బయటకు వచ్చారు. చాలామంది కి అసలు రామోజీరావుకీ మాకూ ఉన్న సంబంధం ఏమిటో, అతడి మీద మేం కంప్లైంటు ఇవ్వటం ఏమిటో అర్ధంకాలేదు. దాంతో వాళ్ళు ఆ వివరాలు అడిగారు. మాబదులుగా మరికొందరు తల్లిదండ్రులు,[అప్పటికే ఆవిషయం పోలీసుల ద్వారా, మాగదిలో జరిగిన పంచాయితీ లోనూ తెలిసినవారు] మిగిలిన వారికి చెప్పారు. దాంతో ఒక్కసారిగా శ్రీశైలంలో మా గురించిన విషయాలు, రామోజీరావుతో ముడిపడ్డ విషయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతకు ముందు మేం 1993 నుండి 1995 వరకూ గుడిసెలో ఉన్న కారణంతో సహా, అందరికీ అది చర్చనీయాంశమూ, సంచలనవిశేషమూ అయ్యింది. అప్పటికే ఎండమండుతుంది. తల్లిదండ్రుల్లో కొందరు ఈ.వో. గురించి భోగట్టా చేశారు. అతడు త్రిపురాంతకం క్యాంపు వెళ్ళాడనీ, మర్నాటికి గానీ రాడనీ తెలిసింది. అప్పటికి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు.

మర్నాడు మార్చి 31న అందరూ ఉదయమే ఈ.వో. నివాస కాటేజీ దగ్గరికి చేరారు. ఉదయం 8 గంటల కల్లా దాదాపు 25, 30 మంది వచ్చారు. అయితే అప్పటికే అతడు బయటకు వెళ్ళాడనీ, ఆఫీసుకి రమ్మనీ చెప్పబడింది. మళ్ళీ 11 గంటలకి ప్రయాస తీసుకుని తల్లిదండ్రులంతా దేవస్థాన ఆఫీసుకి చేరారు. దాదాపు ముప్పావుగంట వేచి ఉన్నాక పిలుపువచ్చింది. తల్లిదండ్రులూ, మేము దాదాపు 25, 30 మందిమి అతడి కాబిన్ లోకి వెళ్ళాము అతడు నాటకీయంగా ఆశ్చర్యం అభినయిస్తూ “ఎవరు మీరంతా?" అన్నాడు. [ముందుగా ఎవరో తెలిసే కాబిన్ లోకి పిలిపిస్తాడు గదా!] సత్యదేవ్ అని బ్యాంకు ఉద్యోగి “మేమంతా గీత పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ పేరెంట్సుమి సార్!” అన్నాడు. “అదే! మా స్టాఫ్ మీటింగ్ ఏదీ లేదుకదా ఇంతమంది వచ్చారేమిటి అనుకున్నాను. అయినా చూస్తే మీరు మా స్టాఫ్ కూడా కాదు. ఏదో స్కూల్ వాళ్ళు మాట్లాడటానికి వచ్చారంటే ఒకరిద్దరు అనుకున్నాం. ఇంతమంది వచ్చారేమిటి? చెప్పండి” అన్నాడు. ముందు సత్యదేవ్ [బ్యాంకు ఉద్యోగి] వివరంగా చెప్పాడు. తర్వాత వ్యాపారులు,పోలీసుకానిస్టేబుల్స్, పోస్ట్ మ్యాన్ భార్య ఇలా ఒక్కొక్కరుగా నలుగురైదుగురు అతణ్ణి స్కూలు రూం కాన్సిల్ చేయవద్దని, కాన్సిల్ ని రద్దు చెయ్యమని రిక్వెస్ట్ చేసారు. అతడి కాబిన్ లో దాదాపు 50 కుర్చీలు వేసి కాన్ఫరేన్స్ హాల్ లా ఉంటుంది. అయితే కనీసం అతడు పేరెంట్సుని ఎవ్వరినీ కూర్చోమనలేదు. అందులో దేవస్థాన ఉద్యోగులు నలుగురైదుగురు ఉన్నారు. మిగిలిన వారంతా వ్యాపారులు, వివిధ శాఖల్లో ఉద్యోగులు. అలా నిలబెట్టిందే గాక, అతడు కనీసం ఓ 40 నిముషాల పాటు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు.

వచ్చేసంవత్సరం కేంద్ర సిలబస్ [CBSE] తో మంచి స్కూలు శ్రీశైలంలో నెలకొల్పుతామన్నాడు. ఆ స్కూలు వివరాలు కావాలంటే చూపిస్తానని అన్నా ఎవరు ఆసక్తి చూపలేదు. అతడు పదేపదే చెప్పాడు.[2009 వరకూ ఏ స్కూలు రాలేదు.] ఆస్కూలు వచ్చేవరకయినా దీన్ని ఉండనివ్వమని పేరెంట్సు అన్నారు. “ఆ కృష్ణయ్య సార్ కి రమణయ్య లాంటి అటెండర్లు ఏవో చాడీలు చెబుతున్నారు సార్! అది విని ఆసారు కోపం చేసాడు. మీరి అది విని ఈ సారు, మేడం వాళ్ళు రూం కాన్సిల్ చెయ్యకండి. నాలుగేళ్ళుగా మేమంతా పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటున్నాం” అంటూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసారు. అతడు “మీరు మీబిడ్డల గురించి ఎంత బాధపడుతున్నారో, నేను నాబిడ్డల గురించి అంతే ఆలోచిస్తాను. ఈ దేవస్థానంలో పనిచేసే వాళ్ళంతా నాబిడ్డల లాంటి వారే! మీకు తెలుసు గదా! ఈమధ్య శ్రీశైలం నుండి బల్క్ ట్రాన్స్ ఫర్లు అయ్యాయి. కొత్తగా ట్రాన్స్ ఫర్ అయి ఇక్కడికి వచ్చిన ఉద్యోగులలో దాదాపు 30 మంది సెలవులో ఉన్నారు. [దీనికి వేరే కారణాలు ఉన్నాయిలెండి] ఏమిటీ సంగతి అని విచారిస్తే వాళ్ళకి ఇక్కడ accommodation లేదట. ఇక్కడ, ఈ శ్రీశైలంలో చిన్న ఉద్యోగికి పెద్దకాటేజ్ ఎలాట్ అయ్యాయి. పెద్ద ఉద్యోగికి చిన్నచిన్న గదులు ఎలాట్ అయ్యాయి. ప్రైవేటు వాళ్ళకి ఎన్నో రూంలూ, కాటేజీలు ఎలాట్ అయ్యాయి. అందుకే అన్నిటినీ రెగ్యులరైట్ చెయ్యాలనుకుంటున్నాం. ఎక్కడో చోటి నుండి మొదలుపెట్టాలి కదా! అందుచేత ఇక్కడి నుండి మొదలు పెట్టాం. ఈ స్కూలు వాళ్ళకే కాదు, శ్రీశైలంలో మిగిలిన స్కూళ్ళవాళ్ళకు కూడా త్వరలో నోటిసులు ఇస్తాం. మిగిలిన ప్రైవేటు వారికి కూడా ఇస్తాం. అందర్నీ ఖాళీ చేయిస్తాం. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని వీళ్ళకి నోటిసులు ఇవ్వలేదు. నా ప్రయారిటిలు రెండే. ఒకటి వసతి, రెండు వైద్యం. కాబట్టి నేను చెయ్యగలిగింది ఏం లేదు. వీళ్ళు ఖాళీ చేసి తీరాల్సిందే” అన్నాడు.

మేం పిల్లల తల్లిదండ్రుల పేరిట, మా పేరిట ఈ.వో. కి requisation వ్రాసి, దానిపైన మా సంతకం పెట్టి, తల్లిదండ్రులందరి చేతా పెట్టించాము. [కాపీ Coups on World లో చూడగలరు.] సత్యదేవ్ అది అతడికి అందించి “కనీసం కొంచెం టైం ఇవ్వండి సార్! ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. అవి అయిపోతే ఇంకెక్కడయినా వసతి వెదుక్కుంటాము” అని చెప్పాడు. అందరూ ఒక్కసారిగా అదే రిక్వెస్ట్ చేయటంతో అక్కడ కాస్సేపు మాటలు కలగాపులగంగా అయ్యాయి. అతడు “సరే సరే! ఎంత టైంకావాలి?" అన్నాడు. మావాళ్ళు రెండునెలలు అడిగారు. అతడు మే 8 వరకూ [అంటే 5 వారాలు] టైం ఇచ్చాడు. చేసేది లేక అందరం సరేనన్నాం. అతడు మా requisation మీద green ink తో మే 8 తేది వేసి నోట్ వ్రాస్తూ, "మే 8 తర్వాత వాళ్ళు ఖాళీ చెయ్యకపోతే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా సాక్ష్యం. బాధ్యత కూడా మీదే! నాకూ లీగల్, అడ్మినిస్ట్రేషన్ తెలుసు. అప్పుడు ఖాళీ చెయ్యకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది” అన్నాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఈరోజు టపా:
భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 78[కేసు విచారణలో భాగంగా స్టేట్ మెంట్లు]


మొన్నో రోజు[25 April, 2009] ప్రియాంక వాద్రా ‘నాతల్లి ఉత్తమురాలు’ అంది. నిజమే! ఎవరి తల్లి వాళ్ళకి ప్రేమమూర్తి, ఉత్తమురాలే. అంతకు కొన్ని రోజుల ముందు వై.యస్. జగన్, ‘వై.యస్. కడుపున పుట్టినందుకు గర్వపడుతున్నా’ అని అన్నాడు. ఇదీ నిజమే! ఎవరి తండ్రి వారికి పుజ్యనీయుడు, గర్వకారకుడే.

ఏవ్యక్తికైనా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు పూజ్యనీయులు, దైవసమానులే! ఎందుకంటే తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు, ప్రేమగా పెంచి పెద్దజేస్తారు, చదువు చెప్పిస్తారు, [కొందరు తల్లిదండ్రులు చదువు కొనిస్తారు] మంచి బుద్దులు నేర్పిస్తారు[ఇది కూడా కొందరికే వర్తిస్తుంది] కాబట్టి తల్లిదండ్రులు మనకి కన్పించే దైవాలు.

అలాగే ప్రియాంక వాద్రాకి తనతల్లి సోనియాగాంధీ ఉత్తమురాలిగానే కన్పిస్తుంది. ఎందుకంటే జన్మనివ్వడం, పెంచిపెద్దచేయటం గట్రాలతో బాటు హిమాచల్ ప్రదేశ్ లో రూల్సన్నింటిని తుంగలో తొక్కి, రాష్ట్రపతి విడిది భవనానికి చేరువలో ఎకరాల కొద్దీ ఇంటి స్థలాన్ని కట్టబెట్టింది గనుక, ఇంకా అలాంటి వెన్నో చేసింది గనుక!

వై.యస్. జగన్మోహన్ రెడ్డిదీ ఇదే కేసు. జగన్ కి, తన తండ్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి అడ్డగోలుగా కోట్లకొద్ది ఆస్థుల్ని కూడబెట్టి, వాటితో బాటు ఎన్నో కంపెనీలకి అధిపతిని చేశాడు కాబట్టి వై.యస్. కడుపున పుట్టటం తనకు గర్వకారణం అంటాడు.

ఇలాంటి మాటలు, స్టేట్ మెంట్లు తమ స్నేహితులు దగ్గర, అస్మదీయుల దగ్గర అంటే బాగుంటుంది కాని, జనం దగ్గర అనడం ఎంతవరకూ సబబు?

సోనియాగాంధీ పుత్రికా రత్నం, వై.యస్.రాజశేఖర్ రెడ్డి పుత్రరత్నం, తమ మాటలని జనం చేత ఒప్పించగలరా? 90 ఏళ్ళ నుండి అంటే తాత తండ్రుల హయం నుండి ఉంటున్న స్వగృహలు – భీంరావ్ బాడ! పట్టాలున్నాయి. కరెంటు, నీళ్ళు, టెలిఫోన్ కనెక్షన్లున్నాయి. కార్పోరేషన్ పన్నులు కట్టిన రసీదులున్నాయి. ఎప్పుడో దశాబ్ధాల క్రితం పట్టాలు పుట్టించుకున్న భూములు, ఇప్పుడేదో నగరం మధ్యలోకి ఉన్నాయి, మంచి ధర వస్తుంది. ‘తాము, తమ సంతానానికి బాగా సంపాదించి ఇవ్వలేకపోయినా, ఈ స్థలం ఇస్తే బాగా సంపాదించిన ధనంతో సమానం’ అన్న భరోసా ఇచ్చిన స్వగృహలు! రాత్రికి రాత్రి బుల్ డోజర్లతో పడగొట్టించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడతారట. [ఎంత విషాదం! దేశం నుండి బ్రిటిషు వారిని వెళ్ళగొట్టిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు పేదల్ని వెళ్ళగొట్టింది!] కోర్టులు తెరిచేలోగా అంతా నేలమట్టం. ముందుగానే పకడ్బందీ ప్రణాళిక వేసుకుని అమలు చేసిన తీరు. పేదవాళ్ళపై పకడ్బందీ ప్రణాలిక! వాళ్ళ కొంపాగోడూ కూలగొట్టి, ఒక్కసారిగా బ్రతుకు నడిరోడ్డుకి తోలేయటానికి పకడ్బందీ ప్రణాళిక! తర్వాత మీడియా వారి హడావుడి, ఫోటోలు, వ్యాసాల వ్యాపారం. రాజకీయ నాయకుల హడావుడి, హామీలు, ఓట్ల వ్యాపారం.

భీంరామ్ బాడా బాధితుల దగ్గరికి వెళ్ళి ప్రియాంక వాద్రాని చెప్పమనండి తన తల్లి సోనియాగాంధీ ఉత్తమురాలని? జగన్ ని చెప్పమనండి తనతండ్రి గొప్పవాడని? సెజ్ ల బాధితులు, అమ్మాలా అన్నం పెట్టే పొలాల్ని లాక్కుని వెళ్ళగొడితే, రైతులు కాస్తా కూలీలై, బ్రతుకులు కుదేలై అలమటిస్తున్న సెజ్ ల బాధితుల దగ్గరికి వెళ్ళి, చెప్పమనండి ప్రియాంక వాద్రాని తన తల్లి సోనియా ఉత్తమురాలని, జగన్ ని తన తండ్రి గొప్పవాడని? అంతేకాదు సిరిసిల్లా లో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాల దగ్గర, పంటరేటు రాక పురుగు మందులు తాగుతున్న రైతన్నల దగ్గర, బాంబుదాడులలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన కుటుంబాల దగ్గర, ముంబై దాడుల బాధితుల దగ్గర చెప్పమనండి ఈ ప్రియాంక వాద్రా తన తల్లి ఉత్తమురాలని?

అప్పుడు తెలుస్తుందేమో వాళ్ళకి సత్యమంటే ఏమిటో?

అప్పుడు అనుభవాని కొస్తుందేమో వాళ్ళకి ధైర్యం అంటే ఎలా ఉంటుందో?

అప్పుడు అర్ధమౌతుందేమో ‘ఉత్తములు, గొప్పదనం’ అన్నపదాలకి అర్ధం?

సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడలో కూడా తెలియకుండా, ఎలా ప్రవర్తించాలో తెలియకుండా, కారు అద్ధాలలో నుండి తమ స్నేహితులను చూస్తూ, ఇదే అభివృద్ది అనుకుంటే ఇలాంటి ప్రకటనలే నోటి నుండి వస్తాయి. కనీసం జనానికి సేవ చెయ్యటం మానేసారు సరే, హీనపరచకుండా ఉంటే అదే పదివేలు అనుకోవలసిన పరిస్థితిలో ఉండటం దారుణం!

దోచి పెడుతున్న తల్లుల నుండి, తండ్రుల నుండి రాజకీయ వారసత్వం సంక్రమిస్తే ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుంది!

ఇలాంటి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడుకోగలం?

గొంగట్లో తింటూ వెంట్రుకలేరినట్లు గాకపోతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

ఆరోజు ఫిబ్రవరి 6 వతేది. మధ్యాహ్నం మూడు గంటలయ్యింది. నేను పిల్లలకి హోంవర్కులివ్వడం వంటి పనుల్లో బిజీగా ఉన్నాను. ఫోన్ మోగింది. మా వారు తీసుకున్నారు. అటునుండి CBCID, IG, Mr. కృష్ణరాజ్! మావారు ఫోన్ నాకు ఇచ్చారు. నేను “చెప్పండి సార్!” అన్నాను. “మీపేరు ఆదిలక్ష్మేనా! మీరు President of India కీ, Prime minister of India కీ, Sonia Gandhi కి కంప్లైంటు పెట్టారట గదా! అవి మాకు forward అయ్యాయి. ఎంక్వయిరీ చేద్దామని ఫోన్ చేసాను” అన్నాడు. నేను “అవును సార్! నాపేరు ఆదిలక్ష్మి. President of India కీ, Prime minister of India కీ, Sonia Gandhi కి కంప్లైంట్స్ పెట్టాను. ఇంతకీ మీరెవరు సార్!” అన్నాను. అటునుండి దర్పంగా “IG, CID కృష్ణరాజ్” అని వినబడింది. నేను “నమస్తే సర్! చెప్పండి. What can I do for you" అన్నాను. అతడొక్కసారిగా ఇరిటేట్ అయ్యి “అసలేముంది ఈ కంప్లైంటులో?" అన్నాడు. నాకర్ధంగాక “pardon me Sir!” అన్నాను. అతడు కోపపు స్వరంతో అదే రెట్టించాడు. రెండుమూడు సార్లు అలా రెట్టించాక నేను “I think you can read it Sir ” అన్నాను. ఈసారి అతడు “ఏమిటీ?" అన్నాడు. నేను మళ్ళీ రిపీట్ చేసాను. అతడుఒక్కసారిగా తగ్గి “Okay, అమ్మా!Thank you” అంటూ ఫోన్ పెట్టేసాడు. అప్పటికే పిల్లలంతా నావైపే చూస్తున్నారు. ఎందుకంటే సి.ఐ.డి. అన్నమాట వాళ్ళకి చాలా కుతూహలం రేపింది. మావారు, మాపాప కూడా నావైపు ఏమిటన్నట్లుగా చూసారు. నేను నిజంగా ఆఫోన్ సి.ఐ.డి. ఐ.జీ. నుండి వచ్చిందని అనుకోలేదు. సి.ఐ.డి. ఐ.జీ ఒక కంప్లైంటు గురించి కనుక్కోవాలంటే, వాళ్ళకే [వాళ్ళు ఫిర్యాదులో ఇచ్చిన ఫోన్ నెంబరుకే] ఫోన్ చేసి మీరే ఫలానానా అని అడగుతారని నేను అనుకులేదు. నాకు తెలిసి ఇలా ఎంక్వయిరీ చెయ్యటం తెలియదు. ఎప్పుడు కూడా వినలేదు. కాబట్టి ఒక IG, CBCID, ఏవిషయమైనా కనుక్కోవాలంటే ఫిర్యాదుదారుకే ఫోన్ చేసి, అవునా కాదా అని అడుగుతాడని అనుకోలేదు. అలా అడిగితే ఆ కంప్లైంటీ అవుననే అంటారు గదా! అతడు నిజంగా విషయమే కనుక్కోవాలంటే, స్థానిక పోలీస్ స్టేషన్ ని ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే చాలు కదా! మొత్తం పుట్టుపుర్వోత్తరాలు బయటపడతాయి కదా! అందునా శ్రీశైలం పోలీసు స్టేషన్ కి ఇంటర్ నెట్ సౌకర్యం కూడా ఉంది. మా విద్యార్ధుల తండ్రే [ASI] స్వయంగా ఈవిధి నిర్వహిస్తూ ఉంటాడు. శ్రీశైలంలో ఓ ఎ.ఇ. ఉన్నాడు. అతడి తండ్రి టెంపుల్ పి.ఏ.గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అంచేత అతడికి రికమెండేషన్ [VIP] ఫోన్ కాల్స్ ఎలా ఉంటాయో తెలుసు. అతడు తను మంత్రుల పి.ఏ. నంటూ దొంగఫోనులు చేసి తనకు కావలసిన పనులు చేయించుకునేవాడు. ఒకసారి పట్టుబడి పోలీసు కేసు కూడా అయ్యింది. ఇలాంటి సంఘటనలు కూడా విని ఉన్నాను. అందుచేత ఆ ఫోన్, ఎవరో రామోజీరావు అనుయాయూలు చేసి ఉంటారు అనుకున్నాను. `CBCID పేరు చెబితే బెదురుతానేమో’ అని చేయించి ఉంటారు అనుకున్నాను. అంచేత పెద్దగా పట్టించుకోలేదు.

ఈలోపున అక్కడ మరో విషయం మరుగుతుంది. అప్పటికి రెండేళ్ళుగా మాదగ్గర ఆయమ్మగా ఓవృద్దురాలు పనిచేస్తోంది. చాలా సహానం ఉన్నమనిషి. కొంచెం వయస్సు తాలూకూ చాదస్తం గానీ, పిల్లలు శివరాత్రి, ఉగాది పండుగల సందర్భల్లో నీటి కాలుష్యానికి గురై వాంతులు అవి చేసుకున్నా కూడా, విసుక్కోకుండా, అసహ్యించుకోకుండా శుభ్రం చేసేది. మేమూ ఆమెని బాగా చూసుకునేవాళ్ళం. అలాగే ఆ ముసలావిడ కూడా మాపట్ల గౌరవంగా, కృతఙ్ఞతగా ఉండేది. శ్రీశైలం గుడికి వెనుక వైపు ప్రాంతంలో గుడిసెలో ఉండేది. ఆమె గుడిసెలో ఓ సాధువు [బిచ్చగత్తె] ఉంటుంది. ఏదో విషయమై మా అయమ్మతో ఆ సాధమ్మ కావాలని తగదా పెట్టుకుందిట. [ఆ తగవులో తప్పులెవరివో నాకు తెలియదు. మా ఆయమ్మ చెప్పిన విషయాలే ఇక్కడ నేను ఉంటంకిస్తున్నాను.] ఆ తగవు వంకపెట్టుకుని ఆ సాధమ్మ మా ఆయమ్మని కర్రతోనూ, చీపురుతోనూ కొట్టింది. వళ్ళంతా వాచిపోయి, మా ఆయమ్మ ఓరోజు స్కూలుకు రాలేదు. మర్నాడు వచ్చినప్పుడు కదుములు చూపించి ఏడ్చింది. నాకు మనసంతా బాధగా అన్పించింది. కానీ నేను అందులో కల్పించుకోలేదు. మనసెందుకో కీడు శంకించింది. 1995 లో నాగరత్నమ్మ అనే సాధు మహిళ విషయంలో ఇలాగే మేము స్పందించాము. కళ్ళ ఎదుట అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవటం సరైనదా లేక దాన్ని నిరోధించే ప్రయత్నం చెయ్యటం సరైనదా అన్న విషయంలో మాకు సందేహం లేదు. మనకెందుకు అని ఊరు కోలేము కూడా!. అయితే ఆయమ్మ విషయంలో, నాకు స్ట్రాటజీ అర్ధమైంది. ఒకవేళ మేం కలగజేసుకుంటే, సమస్య పరిష్కరింపబడక పోగా, మరింత జటిలం అవుతుంది. తర్వాత అది మన మెడకు చుట్టుకుంటుంది. లేదా చూస్తే అప్పుడు ఆయమ్మ తప్పలు బయటకు రావచ్చు. అప్పుడు అందరూ కలిసి “ఇలా అందరి వ్యవహారాల్లో వేలు పెడతారు. అ కారణంగానే మీరు ఎక్కడా సుఖంగా ఉండలేకపోతున్నారు” అంటూ క్లాసు పీకటం ఖాయం. తర్వాత అదే నెపంగా చూపెట్టి మా రూం క్యాన్సిల్ చేయడం కూడా ఖాయం. ఇది మాకు అర్ధం అయ్యింది. ఒకసారి రామోజీరావు ఉనికి అర్ధమయ్యాక, చచ్చినట్లు గూఢచర్యమూ అర్ధమౌతుంది. నదిలో పడ్డవాడు చచ్చినట్లు ఈత నేర్చుకోవడం వంటిదే ఇది కూడా! ఈత నేర్చికపోతే ఏముంది? మునిగి, మురిగి ఛస్తాడు మరి!

అంచేత ఆయమ్మ విషయంలో, మేము ప్రత్యక్షంగా కల్పించుకోలేదు. ఒకటి రెండురోజులు మా ఇంట్లోనే స్నానపానాలు చేసుకోమన్నాను. తెలిసిన వారి ఇంట కొన్నిరోజులు రాత్రిళ్ళు ఉంది. గొడవచల్లారింది అనుకున్నాక మళ్ళీ తన గుడిసెకు వెళ్ళింది. అంతే! మళ్ళీ ఆ సాధమ్మ, ఈ ముసలావిడ మీదకు వచ్చి, పిడిగుద్దులు గుద్ది, మర్మాంగంపై కొట్టింది. మా అయమ్మ బక్కగా ఉంటుంది. ఆ బిచ్చగత్తె మహాలావుగా బలంగా ఉంటుంది. ఎంతగా బాదిందంటే మర్మాంగం వాచిపోయేటంతగా! నేను ఆయమ్మని “మన పిల్లల తండ్రులు పోలీసులున్నారు గదా! అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పు” అని పంపించాను. ఒక్కరూ ఆవిడకు సాయం చేయలేదు. ఒకరోజు ఎ.ఎస్.ఐ. తమ పిల్లల ప్రవర్తన గురించి ఏదో అడగటానికి స్కూలుకు వచ్చాడు. మేము “ఏమండీ! మమ్మల్ని ఇంత సర్వీసు అడుగుతున్నారు. పాపం మా ఆయమ్మ, వయస్సులో పెద్దది. మీ పిల్లలకే సర్వీసు చేస్తుంది. ఆమెనెవరో ఓ బిచ్చగత్తె రోజూ కొడుతుందట. వారం రోజులుగా మీ కానిస్టేబుళ్ళ అందరిళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఒక్కరూ హెల్పు చెయ్యడం లేదు. ఇదేమైనా న్యాయంగా ఉందా?" అని నిలదీసాము. దాంతో అతడు తర్వాత స్కూలుకి రావటం మానేసాడు, పిల్లల్ని తీసుకెళ్ళటానికి అతడి భార్యబదులుగా, అతడి మామగారు రావటం మొదలుపెట్టారు. ఆయమ్మని స్టేషన్ కి వెళ్ళి ఎస్.ఐ. గారిని చెప్పుకోమని చెప్పాము. ఆ ముసలావిడ వినలేదు. ఆవిడ ఆగుడిసెని వదిలేసి, వేరేచోట గుడిసె వేసుకుందామని, ఎవరికో రెండువేలరూపాయలు ఇచ్చింది. కట్టెలూ, గడ్డి తెచ్చి గుడిసె వేసేందుకు వాడు డబ్బు తీసుకుని, ఇంతే సంగతులు అన్నాడు. ఇటు గుడిసె వేసి పెట్టడు. అటు ఆమె డబ్బులూ తిరిగి ఇవ్వడు. దాదాపు రెండుమూడు నెలలు నడిచిందీ వ్యవహారం. మేం మాస్కూలు విద్యార్ధుల తండ్రులైన పోలీసుకానిస్టేబుళ్ళకీ, వారి భార్యలకీ ఎప్పుడు కన్పిస్తే అప్పుడు మా ఆయమ్మకి సాయం చెయ్యమని చెప్పటం, ఒకోసారి దెప్పటం చేసేవాళ్ళం. చివరికి ఒక కానిస్టేబుల్ వెళ్ళి, అవతలి వాణ్ణి బెదిరించి ఆమె డబ్బు ఆమెకి ఇప్పించాడు.

నిజానికి కళ్ళముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించటం, ఎదిరించటం కన్నా కష్టం అన్న విషయం అప్పుడు మాకు బాగా అర్ధమయ్యింది.

ఇంతలో 2007 మార్చి వచ్చింది. మేము నాల్గవ యూనిట్ టెస్ట్ కి పిల్లల్ని తయారు చెయ్యటం, రివిజన్, ప్రశ్నాపత్రాల తయారీ పనులతో తలమునకలై ఉన్నాము. మార్చి 8 తేదిన కానిస్టేబుల్ సుధాకర్ వచ్చి “మేడమ్! మీరు ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి ఏవో కంప్లైంట్లు పెట్టారట కదా! అవి కర్నూలు ఎస్.పి.గారి దగ్గరి నుండి సి.ఐ.గారి దగ్గరికి వచ్చాయి. సార్ మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నాడు. ఏవో స్టేట్ మెంట్లు ఇవ్వాలట” అని చెప్పాడు. ఆరోజు వర్కింగ్ డే. దాంతో మావారు రెండు క్లాసులు చూసుకుంటుండగా, నేను మాపాపను తోడుగా తీసుకుని, ఉదయం 10 గంటలకి పోలీసు స్టేషన్ కి వెళ్ళాను. సి.ఐ.కరుణాకర్, యస్.ఐ.నాగేశ్వర రావులు నన్ను సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. ‘మీరు కంప్లైంట్స్ ఇచ్చారట గదా’ వంటి ఫార్మల్ ప్రశ్నలు వేసారు. అంతకు ముందే, సి.ఎం. పేరిట వ్రాసిన ఫిర్యాదు forward చెయ్యమని ఆగస్టు, 2006 లో కలిసినప్పుడే, అన్ని వివరాలు చెప్పి ఉన్నందున ఇక దాని గురించి పెద్ద సంభాషణ లేకుండా తెల్లకాగితం తీసుకుని స్టేట్ మెంట్ వ్రాయటానికి కూర్చున్నారు.

అందులో భాగంగా సి.ఐ. కరుణాకర్ “అదికాదమ్మా! అసలు మీరు రామోజీరావు మీదే ఎందుకు కంప్లైంట్ చేసారు?" అన్నాడు. అతడి ప్రశ్న, ప్రశ్నించిన తీరు కూడా నాకు అర్ధంకాలేదు. అతడు మళ్ళీ రెట్టిస్తూ “అతడి మీదే ఎందుకు, ఎందుకు కంప్లైంట్ చేశారు?" అన్నాడు. నేను ఠపీమని “తప్పా?" అన్నాను. అతడు అంతకంటే స్థాయి పెంచుతూ అదేప్రశ్న వేసాడు. నేనూ అదేస్థాయిలో “తప్పా?" "తప్పా?" అన్నాను. దాదాపు స్టేషన్ మొత్తం మా గొంతులు మార్ర్మోగాయి. ఇంతలో యస్.ఐ. నాగేశ్వరరావు కల్పించుకుని, పరిస్థితిని చల్లబరుస్తూ “అది కాదమ్మా! అతడి మీద మీరు కంప్లైంటు చేశారంటే అతడికీ మీకూ, ఏమైనా వ్యక్తిగతమైన స్పర్ధలు గానీ, కక్షలు గానీ ఉన్నాయా అని మా సి.ఐ.గారి ఉద్దేశం” అన్నాడు . నేను “సర్! అతడికీ నాకూ మధ్య వ్యక్తిగత స్పర్ధలో, కక్షలో, కారణాలో ఉండటానికి అతడి లెవల్ నాది కాదు, నా లెవెల్ అతడిది కాదు. అతడి స్థానంలో ఇంకెవరున్నా నేనిలాగే స్పందిస్తాను. ఇలాగే కంప్లైంట్ ఇస్తాను. ఒకనేరం జరిగిందని, మనకు తెలిసినప్పుడు, ఓ హత్యకు కారకుడెవరో మనకు తెలిసినప్పుడు, పోలీసులకి చెప్పాలని మీరే చెబుతారు గదా! అటువంటిది మన దేశానికి వ్యతిరేకంగా ఇన్ని చేస్తున్నాడని, సాక్షాత్తూ మాజీ ప్రధానినే హత్య చేయించాడని తెలిసినప్పుడు, పైకి ఫిర్యాదు చేయడం తప్పా?" అన్నాను.

అతడు “అయ్యో! అది తప్పని మేం అనటం లేదమ్మా! జస్ట్, అది మా ఎంక్వయిరీ పద్దతి [?] అంతే!” అన్నాడు.

స్టేట్ మెంట్ వ్రాయటానికి ఒక కానిస్టేబుల్ ని పిలిచారు. సి.ఐ. డిక్టేట్ చేస్తుండగా కానిస్టేబుల్ తెలుగులో వ్రాసాడు. మధ్యమధ్యలో నన్నువివరాలు అడుగుతూ దాదాపు రెండుపేజీల రిపోర్టు/స్టేట్ మెంట్ వ్రాసారు. వ్రాస్తున్నప్పుడు రామోజీరావుని గురించి ‘ఆయన’ అంటూ బహువచనం వ్రాయబోయారు. నేను అభ్యంతరం చెబుతూ “రామోజీరావుని నేను బహువచనంలో ఎప్పటికీ గౌరవించనండి. అతడు అని వ్రాయండి” అని చెప్పాను. స్టేట్ మెంట్ వ్రాయటం పూర్తిచేసి నన్ను సంతకం పెట్టమన్నారు. ఆ కాగితం నా చేతిలోకి తీసుకుని ఒకటికి రెండుసార్లు చదివాను. తర్వాత “అసలీ స్టేట్ మెంట్ అవసరం ఏమిటి సార్? ఎందుకు ఇదంతా వ్రాయించుకుంటున్నారు? ఈ ప్రాసెస్ అంతా ఏమిటి?" అని అడిగాను. సి.ఐ. “మీరు ఈ కంప్లైంటు, 2005 లో ప్రధానమంత్రికి పెట్టారమ్మ. తర్వాత రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి కూడా పెట్టారు. అప్పుడేదో మీరు ఆవేశంలో కంప్లైంట్ పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు ఆలోచించుకుని ఉపసంహరించుకోవచ్చు. ఇప్పటికీ మీరు ఆ ఫిర్యాదుకి కట్టుబడి ఉంటారా లేదా అన్న నిర్ధారణ కోసం ఇలా స్టేట్ మెంట్ వ్రాయించుకుంటాము. ఇది మా అడ్మినిస్టేషన్ పద్దతి” అన్నాడు, తన టేబుల్ పై నాచేతి వ్రాతలో ఉన్న కంప్లైంట్స్ తాలూకూ జిరాక్స్ కాపీలు సెట్ ని చూపిస్తూ.

నేను “ఖచ్చితంగా నేను ఆ కంప్లైంట్ కే కట్టుబడి ఉన్నానండి. అదే మరోసారి స్పష్టంగా వ్రాయించండి ఈస్టేట్ మెంట్ లో. అంతేకాదు, 1992 లో నేను చేసిన పనికి [అంటే రామోజీరావు మీద పీవీకి ఫిర్యాదు చెయ్యటం] ఇప్పటికీ నేను పశ్చాత్తాపపడటం లేదు. ఒకవేళ మళ్ళీ అవకాశం వస్తే, మరో వందసార్లు ఇదే చెయ్యటానికి కూడా వెనుకాడను నేను” అని తెగేసి చెప్పాను. స్టేట్ మెంట్లో తుదిమెరుగులు దిద్దించిన తర్వాత, సంతకం పెట్టి ఇచ్చాను. సి.ఐ. “మీభర్తా, మీ పాప కూడా ఢిల్లీకి పంపిన ఫిర్యాదుల్లో సంతకాలు చేశారమ్మా. అందుచేత వాళ్ళ నుండి కూడా స్టేట్ మెంట్లు తీసుకోవాలి. సాయంత్రం రండి” అన్నాడు. సాయంత్రం వెళ్తే అతడు లేకపోవటంతో, ఆ కార్యక్రమం మర్నాడు ఉదయం [మే 9th , 2007] ముగిసింది. చివరిగా సెలవు తీసుకొనేటప్పుడు నేను “సార్! స్టేట్ మెంట్లు తీసుకుని పైకి పంపుతారు కదా? తర్వాత ఏమవుతుంది?" అని అడిగాను.

"ఏమోనమ్మా! ఆ రామోజీరావు మీద ఆరెస్ట్ వారెంట్ ఇక్కడ ఇష్యూ చేయిస్తారో? లేక హైదరాబాదు లెవెల్లో అతణ్ణి అరెస్టు చేస్తారో, చూడాలి! అయినా మీరు క్రింది నుండి పైకి వెళ్ళాల్సింది. బదులు మీ ఫిర్యాదు పైనుండి క్రింది కొచ్చింది?" అన్నాడు. మేము అతడి దగ్గర సెలవు తీసుకుని వచ్చేసాము.

ఇది జరిగిన నాలుగో రోజు సాయంత్రం 8 గంటలకి ట్యూషన్ అయిపోయి, అప్పుడే విశ్రాంతిగా కూర్చున్నాము. దేవస్థానం కాంట్రాక్ట్ ఉద్యోగి శ్రీను వచ్చాడు. “మేడమ్! మీకు నోటిసు” అంటూ ఓ కాగితం నాచేతికిచ్చాడు. అతడి కాపీ మీద రిసీవిడ్ సంతకం పెట్టి తీసుకున్నాను. ఆ నోటీసులో తమ staff representation dt. 10/03/07 ని రిఫర్ చేస్తూ ఈ.వో. మా రూమ్ i.e. accommodation కాన్సిల్ చేస్తూ పంపిన ఆర్డర్ అది. 15 రోజుల్లో గది ఖాళీ చేసి దేవస్థానానికి అప్పగించాల్సిందిగా ఉంది. కేవలం మా ఒక్కరికే పంపిన నోటిసు అది. [దాని Copy, Coups on World లో ఉంచాను.] సి.ఐ. కరుణాకర్ మార్చి 9 వ తేదిన చెప్పిన ప్రకారం, రామోజీరావు ఆరెస్టు అయిపోతాడని మేమేమీ ఉర్రూతలూగిపోవటం లేదు. ఏం జరుగుతుందో నని జాగ్రత్తగా పరిశీలన మాత్రమే చేస్తున్నాం. అందుచేత ఈ నోటిసుకి మేమేమి షాకై పోలేదు. నోటిసు తెచ్చిన శ్రీనుతో “ఇంకా ఇలాంటివేం రాలేదా? అని ఎదురుచూస్తున్నానయ్యా! నువ్వొచ్చావు” అన్నాను నవ్వుతూ. పాపం ఆ పిల్లవాడు! అతడు భయంగా “నాదేముంది మేడం? కృష్ణయ్యసార్ ఇచ్చిరమ్మన్నాడు. వచ్చాను” అన్నాడు. “అయ్యో! ఫర్లేదు నాయనా! నేను నిన్నేమీ అనటం లేదు” అని అతణ్ణి పంపించేసాను. తర్వాత సమాచార సేకరణ ప్రారంభించాము. మా విద్యార్ధుల తండ్రి, దేవస్థాన ఉద్యోగి అయిన వెంకటేశ్వర రావుకి ఫోన్ చేసి, దేవస్థానం ఆఫీసులో ఏంజరిగిందని అడిగాము. అతడు “ఇదంతా కృష్ణయ్య చేస్తున్నాడు మేడం! మీరేదో కంప్లైంట్ పోలీసు స్టేషన్ లో పెట్టారట. దాంతో సి.ఐ. గారు మీ సత్రంలో క్రింద ఉన్న వాళ్ళని ఆడాళ్ళనీ, మగాళ్ళనీ కూడా పిలిపించి స్టేట్ మెంట్లేవో వ్రాయించుకున్నారట. దాంతో కృష్ణయ్య అటెండర్ ఉన్నాడు చూడండి, రమణయ్య! అతడు, ఇంకా మిగిలిన వాళ్ళు ఈ.వో. గారిని కలిసి ‘ఆదిలక్ష్మి అన్న ఆవిడ మమ్మల్ని రోజూ, పొద్దున లేచింది మొదలు తిడుతుంది సార్! ‘నేను రామోజీరావు మీద కంప్లైంట్ పెట్టాను. చంద్రబాబు నాయుడి మీద కంప్లైంట్ మీద పెట్టాను. మీలాంటి వాళ్ళను అసలు లెక్కే చెయ్యను’ అంటూ తిడుతుంది. ఆవిడ రూమ్ కాన్సిల్ చెయ్యండి’ అని రిక్వెస్ట్ పెట్టుకున్నారట. ఈ.వో. [ఇతడు పేరు హరి జవహర్ లాల్. రెవిన్యూ డిపార్ట్ మెంట్ నుండి డిప్యూటిటేషన్ మీద శ్రీశైలం ఈ.వో.గా వచ్చి కొన్నినెలలైంది. ఇతడు వచ్చాకే శ్రీశైలంలో ప్రైవేటు వ్యక్తులందరికీ రూములు కాన్సిల్ చేస్తూ జనవరి, 2007 లో నోటిసు జారీ చేసాడు.] డిప్యూటి ఈ.వో. కృష్ణయ్యకి మార్క్ చేసాడట. కృష్ణయ్య మీ సత్రంలో ఎంక్వయిరీ చేశాట్ట. ‘అవును. ఆవిడ అలాంటి మనిషే. అందరితో తగాదాలు పెట్టుకుంటుంది. కాబట్టి room accommodation cancel చేయవచ్చు” అని రిపోర్ట్ వ్రాసాడట. దాంతో మీకు రూం కాన్సిల్ చేస్తూ నోటిసు పంపారు’ అంటూ వివరాలు చెప్పాడు.

నిజానికి మేము ఉదయం ‍6 గంటల నుండి రాత్రి 7.30 గంటల దాకా స్కూల్లో క్లాసులూ, స్టడీ పీరియడ్లూ నడుపుతాము. క్షణం తీరికా ఉండదు, ఎవరితో ఏవీ మాట్లాడే ఓపికా ఉండదు. ఏదో దైనందిన పలకరింపులు, సెలవురోజుల్లో కాస్తంత మాటమంతీ తప్పితే పెద్దగా ఏం ఉండదు. అందునా రామోజీరావు గురించైతే మేము అసలు ఫ్లోరు మీద నోరేవిప్పము. 2005 లో ఢిల్లీ వెళ్ళి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసి వచ్చాక కూడా, నార్త్ టూర్ వెళ్ళామనే చెప్పాము. 2006, ఆగస్టులో పోలీసు స్టేషన్ లో సి.ఐ.తో చెప్పి, సి.ఎం.కి వ్రాసిన ఫిర్యాదు నకలు అందచేసాక కూడా, మేము ఇంటి చుట్టూప్రక్కల వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు. అటువంటిది ‘నేను రామోజీరావు మీదా, చంద్రబాబునాయుడి మీద కంప్లైంట్ చేసాను. మిమ్మల్ని లెక్క చెయ్యను’ అంటూ ప్రతీరోజూ పొద్దున్నుండీ సాయంత్రం దాకా వాళ్ళని తిడుతూ ఉండటమా? అంత తీరికా కూడానా? అందునా క్రింది అంతస్థువాళ్ళు మమ్మల్ని తరచుగా బూతులు తిట్టటం అక్కడ అందరికీ తెలిసిన విషయమే, మా పిల్లల తల్లిదండ్రులకీ, మా అంతస్థులోని వారికీ, మా ఎదురు వీధివారికీ. [అక్కడే ఉన్న పోలీసు వారితో సహా] ఇంత అడ్డగోలు ఆరోపణతో, మాకు సమస్య తీవ్రత అర్ధమైపోయింది. అయినా సహనంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం. అసలు ఈనేపధ్యంలో సి.ఐ.పాత్ర ఏమిటో, స్టేట్ మెంట్లు డ్రామా ఏమిటో మాత్రం అర్ధం కాలేదు. నాలుగురోజుల్లో ఉగాది సెలవులు వచ్చాయి. శ్రీశైలంలో ఉగాదికి కన్నడ భక్తులు లక్షలుగా వస్తారు. అంచేత వారం రోజులు ప్రత్యేక సెలవులు తప్పనిసరి.

ఉగాది సెలవుల్లో హైదరాబాదు వెళ్ళాము. వెళ్ళాక, మనస్సుండబట్టుకోలేక మావారికీ, మా తమ్ముడికీ గల ఉమ్మడి స్నేహితులని విచారించి, మా తమ్ముడి కొత్త ఫోన్ నెంబరు సేకరించి ఫోన్ చేశాము. అంతకు క్రితం సంవత్సరాల్లో, మేం శ్రీశైలంలో కాస్త నిలదొక్కుకున్నాక, మా చెల్లికి ఫోన్ చేస్తే ఆ నెంబరు కాల్ ఎవరో కొత్తవారు అందుకున్నారు. మా చెల్లి వాళ్ళు పల్లెలో తమ పొలం, రైసుమిల్లు గట్రా అమ్మేసి హైదరాబాదు మకాం మార్చారనీ, పాత ల్యాండ్ లైన్ ని తమకి బదిలీ చేసారనీ చెప్పారు. మా తమ్ముడు లైన్ లోకి వచ్చాక, క్షేమసమాచారాలు అడిగాను, మాచెల్లి గురించి అడిగితే చనిపోయిందని చెప్పాడు. ‘ఒక్కసారి వచ్చిపోకూడదా?’ అన్న మా తమ్ముడి పిలుపు మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికి మా అమ్మకూడా అక్కడే ఉంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర తమ షాపుని రోడ్ ఎక్స్ టెన్షన్ లో కొట్టేసారని, కొత్త షాపు పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాననీ మా పెద్దతమ్ముడు చెప్పాడు. చిన్న తమ్ముడు వేరుగా ఉంటున్నాడనీ, చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడనీ చెప్పాడు. మాచెల్లి వాళ్ళు కొండాపూర్ లో ఉంటున్నారనీ, అక్కడే ఇల్లుకూడా కొనుకున్నారనీ, కిరాణా షాపు పెట్టుకున్నారనీ చెప్పాడు. మూడు నెలల క్రితం, అంటే 2006, డిసెంబరులో మా చెల్లి చనిపోయిందని చెప్పాడు. హత్యో, ఆత్మహత్యో తెలియదు. శరీరం కిటికీ ఊచలకి చీర కొంగుతో ఉరిపెట్టుకున్నట్లుగా ఉంది. ఆ ఫోటో చూసి నాకు చాలా దుఃఖం కలిగింది. కానీపూర్తిగా నిబ్బరించుకున్నాను. మాచెల్లి కొడుకునీ, తమ్ముళ్ళ పిల్లలనీ చూసి, కాస్సేపు వాళ్ళతో గడిపి వచ్చేసాము. మా చెల్లి మరణం గురించి మా అమ్మవాళ్ళు చెప్పిన కారణాలు [భార్యభర్తల మధ్య తగవులు] నాకంతగా నమ్మశక్యం అన్పించలేదు. ఏం జరిగిందో తెలియదు. అల్పాయుష్కురాలిగా నా చిన్నచెల్లెలు ఈ లోకం నుండి నిష్ర్కమించింది. అంతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!
************

ఈరోజు టపా:
భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 77[రాష్ట్రపతి కలాం, సోనియా గాంధీలకి ఫిర్యాదు]

మన రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఐ.వి.సుబ్బారావు కూడా ఈ మేరకు ఓ ప్రకటన చేశాడు. దేశంలో ఇంకా మూడు విడతల పోలింగు మిగిలి ఉంది.

ఈ సందర్భంగా ఓ ఎన్నికల లీల…..

రాష్ట్రంలో పోలింగ్ ముగిసే వరకూ పత్రికలు, టీవీలు ప్రజల్ని జాగృతం చేస్తూ – ఓటు అతి పవిత్రమైనదనీ, దాన్ని అమ్మకోకూడదని చెప్పాయి. అదెంతో సంతోషించదగ్గవిషయం. డబ్బుకాశపడి నోటుకు ఓటు వేయటం – చేజేతులా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోవటమేనని పత్రికలు, టీవీలు ఎలుగెత్తి చెప్పాయి. అదెంతో నిజం కూడా! ఈనాడులో అయితే దీనికోసం కొన్ని ప్రత్యేక పేజీలు, శీర్షికలు నిర్వహించబడ్డాయి. ప్రతీరోజు కుర్రతారలు ఈవిషయమై చాలా సుద్ధులు కూడా చెప్పారు. ఏదిఏమైనా నోటుకు ఓటు అమ్ముకోకూడదని, ఓటు పవిత్రమైనదని అందరూ చెప్పారు. బాగుంది. బాధ్యతాయుతంగా ఉంది.

అయితే, ఇంత బాధ్యతనీ సదరు పత్రికలు 22, జూలై 2007 న ఎందుకు నిర్వహించలేదన్నది ప్రశ్న! ఒక్క ఓటే పవిత్రమైనది కదా! మరి అలాంటి లక్షల ఓట్లతో గెలుపొందిన ఎం.పి.లు తమ ఓటును కోట్లకు అమ్ముకోవడం ఎంతనీచం? మరి ఎం.పీ.ల ఓటు పవిత్రమైనది కాదా? అమ్ముకోదగినదా? ఆరోజు ఒక్కో ఎం.పీ.ఓటు కోట్లరూపాయాలు పలికిందని వార్తలొచ్చాయి. పత్రికలే వ్రాసాయి, పార్లమెంటులో నోట్లకట్టల ప్రదర్శన ప్రత్యక్షప్రసారం చూశాము. శిబూశోరెన్ తన, తన పార్టీవారి ఓట్లకు ప్రతిఫలంగా బహిరంగ బేరాలు, బెదిరింపులు చేసి జార్ఖండ్ ముఖ్యమంత్రి సీటు తీసుకున్నాడు. ఇది ఓటు అమ్మకం కాదా? ఇదే విషయమై సమాజ్ వాదీ పార్టీ అమర్ సింగ్ తమని కాంగ్రెస్ ఉపయోగించుకుని, ఆ తర్వాత చారులో కరివేపాకులా తీసి అవతల పారేసిందని వాపోయాడు.

ఆంధ్రప్రదేశ్ లో అయితే, అలా ఓటు అమ్ముకున్న ఆదికేశవులు నాయుడు తెదేపా నుండి బహిష్కృతుడైనా, సంతోషంగా, టీటీడి ఛైర్మన్ పదవిలో సెటిల్ అయిపోయాడు. తెదేపా పార్టీ మాత్రం ఇతణ్ణి బహిష్కరించటానికి చాలా బాధపడింది. తప్పని సరిగా బహిష్కరించింది. మందా జగన్నాధందీ అదే కేసు. ఢిల్లీ ఏపీ భవన్ లో కేబినెట్ మంత్రి హోదాగల పదవి పొందాడు. వీటన్నిటి సాక్షిగా, చట్టబద్దంగా కిశోర్ చంద్రదేవ్ అసలు విశ్వాసపరీక్షలో ఓట్లు అమ్ముడుపోలేదంటూ నివేదిక ఇచ్చేశాడు. మరి పార్లమెంట్ లో డబ్బు ఎలా ప్రత్యక్షమయ్యింది అన్నవిషయమై అందరూ కిమ్మనకూడా ఉన్నారు. డబ్బు ప్రత్యక్షం కావటం డ్రామా అయితే కావచ్చు. గాని పదవులు పొందటం మాత్రం నిజమే కదా!

ఓటుకు బదులు పదవులిచ్చిన కాంగ్రెస్ ప్రధానమంత్రి, అధ్యక్షురాలు ఓటుకు నోట్లు ఇవ్వలేదను కోవటం భ్రమ. ఇంత బాహాటంగా ఓట్లు కొనుగొలు/అమ్మకాలు జరిగిన సందర్భంలో పత్రికలు గానీ, టీవీలు గానీ ఎంపీల ఓట్లు పవిత్రమైనవనీ, వాటికి అమ్ముకోవడం నీచం అనీ, ఎందుకు ఎలుగెత్తి అరవలేదు? సాక్షాత్తు లోక్ సభాపతే సొంతపార్టీని విడనాడి, జీవితంలో మళ్ళీ రాదనిపించిన ‘అవకాశాన్ని’ సద్వినియోగం చేసుకున్న ఈ ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యపరిరక్షణ అనేపవిత్ర బాధ్యతని భుజల మీద మోస్తున్న మీడియా ఆ రోజెందుకు గొంతెత్తి ప్రచారించలేదు? ఎవరయితే ఓటు అమ్ముకుని పదవులు పొందారో, వారందరి గురించి పత్రికలు బహిరంగపరిస్తే, బహిష్కరిస్తే మరోసారి ఎవ్వరయిన తప్పుచెయ్యటానికి భయపడతారు కదా?

సామాన్యుల ఓట్లు పవిత్రమైనప్పుడు, లక్షలాది సామాన్యుల ఓట్లతో గెలుపొందిన ఎంపీల ఓట్లు పవిత్రమైనవి కావా? సామాన్యుడు అమ్ముకుంటే వందా, అయిదువందలకి అమ్ముకున్నాడు. అదీ ఆ పదిరోజులు కడుపునిండితే చాలనుకునేంత పేదరికంలో ఉన్నవాడు. [ఆకలితో, పేదరికంతో బాధపడుతున్నవాడికి నీతులు, సిద్దాంతాలు బోధించడం నిజంగా ఘోరం.] అదే ఎం.పి.లైతే ఒక్కొక్కరు బొజ్జలు పెంచినవారు, ఆదికేశవులు నాయుడు వంటివారైతే స్వంత హెలికాప్టర్లు కలిగినంత భాగ్యవంతులు. మరి వాళ్ళు ఏ కక్కుర్తితో ఓట్లు అమ్ముకున్నట్లు? అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాల్సిన బాధ్యత పత్రికలకి గుర్తు రాలేదేం పాపం! నిన్నటికి నిన్న పోలింగ్ రోజున ఎన్నికల అధికారులుగా విధులకు వెళ్తున్న వాళ్ళ జేబులో, ఒక్కొక్కరి జేబులో వెయ్యిరూపాయల నోట్లు పెడుతూ, ఫోటోకి చిక్కిన కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టరు ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించినా, మొత్తం అయిపోయిన తరువాత పోలీసులు తీరిగ్గా వచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇలాంటి సంఘటనలు జరిగినా పట్టించుకోకుండా ఉండటానికి పోలీసు కానిస్టేబుల్ స్థాయి నుండి పైస్థాయి దాకా అందరూ డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారు. పత్రికావిలేఖరులు కూడా ఎన్నికల ప్రారంభంలో అభ్యర్ధుల నుండి డబ్బులు డిమాండ్ చేసారు. పత్రికలు ప్రకటనలకి, తాము వాస్తున్న వార్తలకి తేడా లేకుండా ప్రకటనలు జారి చేసి డబ్బులు చేసుకుంది.

అంటే నీతులన్నీ సామాన్యులకి చెప్పేందుకేనా, పత్రికలున్నది?

ఇలాంటి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడుకోగలం?

గొంగట్లో తింటూ వెంట్రుకలేరినట్లు గాకపోతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2005, అక్టోబరులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి, 1992లో నేను అప్పటి ప్రధాని పీ.వీ.కి రామోజీరావు కుట్రల గురించి పెట్టినఫిర్యాదు గురించీ, తదనంతర కాలంలో రామోజీరావు మమ్మల్ని వేధిస్తున్న తీరు గురించి ఫిర్యాదు చేశాక నీటికష్టాలు పరాకాష్ఠకు చేరి టెలిఫోన్ బెదిరింపు దాకా, ఆపైన పోలీసు కేసుల దాకా వచ్చాయి. అదే ఫిర్యాదుని కవరింగ్ లెటర్ జతచేసి మే, 2006లో సోనియాగాంధీకి పంపాము. దాంతో మా పని పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. నీటి వేధింఫుల స్థానాన్ని జీరోక్లాసు పిల్లల యూరినల్ వంటివి ఆక్రమించాయి. ఈ నేపధ్యంలో ఈ వివరాలన్నింటినీ, మొదటినుండీ, అంటే 1992 నుండీ వివరంగా సి.ఎం. కి అడ్రస్ చేస్తూ వ్రాసి [ఈసారి 13 పేజీల రిపోర్టు] శ్రీశైలం సి.ఐ.ని కలిసాము. ఇంతకు క్రితం సి.ఎం. నుండి మా ఫిర్యాదు తమకు Forward అవ్వటంతో మాదగ్గర రిప్లై స్టేట్ మెంట్ తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, మేము పెడుతున్న ఫిర్యాదులు ముఖ్యమంత్రికి చేరుతున్నాయో, లేదో తెలియడం లేదని, అందుచేత తమ స్టేషన్ నుండి Forward చెయ్యమనీ వ్రాతపూర్వకంగా అభ్యర్ధించాము. దానికి ఆ సి.ఐ. “ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య గురించి మనం మాట్లాడితే, మనల్ని అందరూ పిచ్చివాళ్ళంటారు” అన్నాడు. [ఆ తర్వాత 2007, మార్చిలో అతడు నాగురించి ’పిచ్చి’ అనే రిపోర్టు వ్రాసి పైకి పంపాడని, కానిస్టేబుల్ మరియు మా విద్యార్ధుల తండ్రి అయిన సుధాకర్, మా స్కూలు గదిని శ్రీశైలం డి.ఈ.వో. క్యాన్సిల్ చేసినప్పుడు జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో చెప్పాడు. అది ఎంత వరకూ నిజమో తెలియదు.]

నేను రాజీవ్ హత్య విషయమై రామోజీ హస్తం గురించి, 1992 లోనే, అప్పుడు కడప ఎం.పి.గా ఉన్న, ప్రస్తుత సి.ఎం.ని కలిసానని, తదుపరి వివరాలన్ని చెప్పాను. అవన్నీ ఇప్పటి ఫిర్యాదులో వ్రాసానని చెప్పాను. పీ.వీ.నరసింహారావు మా ఇంటికి ఐ.బి.అధికారులని పంపిన వైనం, నేను 1992 లో ప్రధాని కార్యాలయంలో ప్రధాని OSD నీ కలిసిన వైనం అన్నీ చెప్పి మరోసారి నా చేతిలోని ఫిర్యాదుకాపీని ముఖ్యమంత్రికి పంపవలసిందిగా అడిగాను. అతడు “పీ.వి.నరసింహారావు ఏంచేశారో మనకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు అతణ్ణెవరూ ఏదీ అడగలేరు” అంటూ జోకు పేల్చాడు. నేనూ “అవును సార్! ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరూ తిరిగి రాలేరు గదా!” అంటూ మరో జోకు పేల్చాను. చివరికి యస్.ఐ., సి.ఐ.లు కలిసి నాకు “చూస్తామమ్మా. ఒక Investigative Agency[?] గా మా ఎంక్వయిరీ మేం చేసుకుని అప్పుడు ఈ కాపీని సి.ఎం.కి పంపిస్తాము” అని చెప్పాడు. మేము సెలవు తీసుకుని వచ్చేసాము. వారం పదిరోజులు వేచి చూశాము. వాళ్ళు పంపిన దాఖలా గానీ, సి.ఎం. ప్రతిస్పందించిన దాఖలా గానీ లేవు. పైపెచ్చు క్రింది వారి దుర్భాషలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో స్కూలుకు రెండురోజులు సెలవు ఇచ్చి, అగస్టు తొలివారంలో, హైదరాబాదు వెళ్ళి, సి.ఎం. ఇల్లు గ్రీన్ లాండ్ కి వెళ్ళాము. ఆరోజు జోరున వర్షం కురుస్తోంది. మేం వెళ్ళేప్పటికి సి.ఎం. ఇంటిలోనే ఉన్నాడు. అతడి పి.ఏ. కిరణ్ కుమార్ రెడ్డి సందర్శకులని రిసీవ్ చేసుకుంటున్నాడు. నేను నాచేతిలోని ఫిర్యాదు అతడి కిచ్చి, మౌఖికంగా, క్లుప్తంగా, అందులోని విషయాలు వివరించాను. దాదాపు 10 నిముషాలు పట్టింది. చివరగా సి.ఎం. అపాయింట్ మెంట్ ఇప్పించమని అడిగాను. అంతా విన్నాక అతడు “ఈ రిపోర్టు సి.ఎం.గారికి ఇస్తానమ్మా! మీరు చెప్పిందంతా కూడా సి.ఎం.కి బ్రీఫ్ చేస్తాను. ఆయన ఇది important గా తీసుకుని మిమ్మల్ని కలిస్తానంటే అపాయింట్ మెంట్ ఇస్తారు. అప్పుడు మీకు intimate చేస్తాము” అన్నాడు. అప్పుడే సి.ఎం.లోపల నుండి బయటకు వచ్చి వాహనంలో ఎక్కుతున్నాడు. మేం ఫిర్యాదు కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చేసి వెనుదిరిగాము. ఇక చేసేది లేక, తరువాత రోజు శ్రీశైలం దారిపట్టాము.

తదుపరి, నెలైనా సి.ఎం. అపాయింట్ మెంట్ రాలేదు. ‘బహుశః అతడికి అది important గా అన్పించలేదు కాబోలు’ అనుకున్నాము. ఈ సంఘటనలన్నిటితో మాకు రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ… వీళ్ళందరి వెనుకా రామోజీరావు ఉన్నాడన్న విషయం స్పష్టపడింది. దానికి తోడు దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలన్నిటినీ పరిశీలిస్తూనే ఉన్నాము. ఈనాడు న్యూస్ కవరేజ్ ని కూడా గమనిస్తున్నాము. దేశానికి వ్యతిరేకంగా, కీడు మూడేటట్లుగా తప్పితే, ప్రజలకి మేలు చేకూరే విధంగా ఏమాత్రమూ లేని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వవ్యవహార తీరు మాకు బాగానే స్పష్టపడింది. దాంతో ఇంకొన్ని రోజులు పోయాక సి.ఎం.కి అడ్రెసు చేస్తూ వ్రాసిన ఫిర్యాదులోని అంశాలన్నిటినీ సోనియాగాంధీ పేర వ్రాస్తూ, 18 పేజీల సుదీర్ఘ ఫిర్యాదు తయారు చేశాము. అందులో చివరిగా 1992 నాటి నాదేశభక్తి తాలూకూ భావనని గుర్తించమని, ఇది సంచలనం కోసం నేను చేస్తూన్న ఫిర్యాదు కాదని వ్రాస్తూ “మీ వివాహానికి ముందు మీమాతృదేశమైన ఇటలీ పట్ల మీకు ఇలాంటి అనుభూతులు ఉండి ఉంటాయి కాబట్టి, భారతీయురాలిగా భారతదేశం పట్ల నాకున్న భావాలని అర్ధం చేసుకోగలరని ఆశిస్తాను” అని వ్రాసాను. ఇన్నిసార్లు ఇందరికి ఫిర్యాదులు వ్రాసినా స్పందించని వైనాన్ని ప్రశ్నిస్తూ “చూడబోతే మీ అనుచరులకు, మీకు, మీభర్తపట్ల ఉన్న దాని కంటే భారతప్రజలుగా మాకే మానాయకుడి [రాజీవ్ గాంధీ] మీద అభిమానం ఎక్కువగా ఉన్నట్లుంది” అని వ్రాసాను. ఆ కాపీని యధాతధంగా Coups on World లో ఉంచాను. చదువరుల సౌలభ్యంకోసం పైన ఉటంకించిన పేరాగ్రాఫులను ఎరుపురంగులో ముద్రించాను. ఫిర్యాదు పంపించాము. 15 రోజులు గడిచాయి.

ఇక లాభం లేదను కొని అదే ఫిర్యాదు కాపీని కవరింగ్ లెటర్ జోడించి, అప్పటి రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాంకి 2006, సెప్టెంబరులో పంపించాము. తర్వాత స్కూలుకి దసరా సెలవులు వచ్చాయి. ఆ సెలవుల్లో గుంటూరులోని ఐ.బి.ఆఫీసుకి వెళ్ళాము. అక్కడి అధికారి “మీకు మా ఆఫీసు అడ్రెస్ ఎలా తెలుసు?” అనడిగాడు. ఆ ఆఫీసుకి ఎలాంటి బోర్డు ఉండదు. అందుకే అలా అడిగాడు. అంతక్రితం గుంటూరులో నేను ఎక్సల్ కాలేజీలో పనిచేస్తుండగా వారి ఆఫీసుకి ఎదురింట్లోనే మేం అద్దెకు ఉండేవాళ్ళం. అదీగాక 1992 లో మా ఇంటికి వచ్చిన ఐ.బి.అధికారులు ఇచ్చిన చిరునామాతో, అంతకు క్రితం, 1995 లో మేము ఒకసారి ఆ అఫీసుని సందర్శించి ఉన్నాము. అదే అతడికి చెప్పాము. 1992 నుండి అప్పటివరకూ జరిగిన విశేషాలని క్లుప్తంగా వివరించి చెప్పి ‘ఈనాడు రామోజీరావు వ్యవహారం, అతడు మమ్మల్ని వేధిస్తున్న తీరు, ఎంసెట్ కుంభకోణాల మూలంగా సమాజానికి జరుగుతున్న కీడు గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళమని’ అభ్యర్ధించాము. ఇక చూస్కోండి! అక్కడి అధికారి రామోజీరావు డిఫెన్స్ లాయర్ స్థాయిలో తెగరెచ్చిపోయాడు. ‘నీటి వేధింపుని after all అన్నాడు. ‘తమకీ నీళ్ళు రావటం లేదని, ఆమాటకొస్తే, ఆ రోజు తామింకా స్నానం చెయ్యలేదనీ’ అన్నాడు. నీటి సమస్య ఒక్కరోజుది కాదని, అదెంత తీవ్రంగా ఉందో ఋజువు పత్రాలు చూపబోతే పట్టించుకోలేదు. సూర్యాపేట త్రివేణి కాలేజీ వారితో “నేను సమాంతరంగా నా ప్రైవేటు ట్యూషన్ హోం నడుపుకుంటాను అలా ఇష్టమైతేనే మీ కాలేజీలో జాబ్ ఆఫర్ అంగీకరిస్తాను” అన్న డీల్ గురించిన ప్రస్తావనలో “అలా ఏ కాలేజీ వాళ్ళు ఒప్పుకోరు. అలా అని వ్రాసుకున్న అగ్రిమెంట్ ఉందా మీదగ్గర?” అంటూ మమ్మల్ని నిలదీసాడు. సూర్యాపేటలో మాఇంటి ఓనర్, మాఇంటికి ఫర్నిచర్ తో సహా తాళం వేసి, మమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డుమీదకి వెళ్ళగొట్టిన నేపధ్యంలో, ఆ అగ్రిమెంటు కాపీ ఆ ఇంట్లోనే ఉండిపోయింది. అంచేత “ఆకాపీ ప్రస్తుతం మాదగ్గర లేదు, ఇంత వరకూ ఎవ్వరు అడగలేదు ” అని చెప్పాను. “చూశారా! అలాంటప్పుడు మీమాట ఎలా నమ్మటం?" అన్నాడు. ‘నాదగ్గర ఉన్న డాక్యుమెంట్లు అక్కరలేదు. ఏదైతే లేదో, అది కావాలి!’ - ఇదే అతడి ధోరణి. అంటే పనిమాలా ఓ వ్యక్తి తన 14 ఏళ్ళ జీవితకాలాన్ని పనికిమాలిన ఫిర్యాదులతో వృధాచేసుకుంటారా? అయినా, ‘Customer is always correct’ అన్నది వ్యాపారరంగంలోని సూక్తి. అలాగే ‘Petitioner is always correct’ అన్నది ప్రభుత్వపాలనా యంత్రాంగంలో [Administration] రాజ్యాంగబద్దమైన సూక్తి.

1991 లో, నా ఫ్యాక్టరీకి వర్కింగ్ కాపిటల్ గా ఋణం ఇస్తున్న ఇండియన్ బ్యాంక్ లో, నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్టులో లెడ్, యాంటిమెనిల ధరలు విపరీతంగా పెరిగాయి. నాకు MMTC నుండి మంత్లీ కోటా ఉండేది. అయితే టన్ను ధర నాలిగింతలు పెరగటంతో, నాకు బ్యాంకు వారిచ్చిన లోన్ లిమిట్ చాలలేదు. పెంచమంటే లంచాలు, మరికొన్ని గొంతెమ్మ కోర్కెల [?] కోసం బ్యాంకువారు కిమ్మనటం లేదు. రెడ్ టేపిజం చూపిస్తున్నారు. ఆ నేపధ్యంలో అప్పటికి Additional Secretary, Banking affairs గా ఉన్న కె.జె.రెడ్డి, ఐ.ఎ.ఎస్.ని ఢిల్లీ వెళ్ళి కలిసి ఫిర్యాదు చేశాను. మరుక్షణం స్పందించారు.[1992 తర్వాత ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.] తక్షణం ఫోన్ లో ఇండియన్ బ్యాంకు డైరెక్టరు బి.బి.షెట్టిని, నా సమస్య పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. ‘ఎంతో ఇబ్బంది పడుతుంటే తప్ప, ఎవ్వరూ ఫిర్యాదుల వంటి చర్యలు తీసుకోరు’ అన్నది అక్కడి మౌలిక సూత్రం. ఫిర్యాదుదారుని, ఫిర్యాదులోని విషయాన్ని పరిశీలించగానే, వాళ్ళ అనుభవానికి, అవగాహనకి ఫిర్యాదులోని అంశం నిజమో, కాదో ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది. విద్యార్ధులు ఫిర్యాదు చేసినప్పుడు అది నిజమో, ఊరికే చాడీలు చెబుతున్నాడో టీచర్ కి ఎలా అర్ధమవుతుందో, ఇదీ అంతే. ఇలాంటి అనుభవాలు నాకు 1992 ముందర కూడా ఉన్నాయి. నామిత్రుల, ఇతర పరిచయస్థుల అనుభవాలు కూడా నాకు తెలుసు. ఎక్కడైనా, ఎప్పుడైనా, అదే సూత్రం, “Petitioner is always correct” అన్నది! ముందు ఆ దృష్టితోనే వాళ్ళు విచారణ మొదలు పెడతారు. ఒకవేళ petitioner wrong అయితే అది బాహాటంగా విచారణలో తేలిపోతుంది. అంతేగాని అసలు విచారణే ‘Petitioner is wrong and the deponent is correct’ అన్నధోరణిలో ఎవరూ చేయరు. అది అసాధారణం.

అయితే ఐ.బి.అఫీసులో, నేను ఇలాంటి అసాధారణనే చూశాను. పైగా సదరు అధికారి, నాదేశభక్తి గురించి మాట్లాడుతూ “ఫిర్యాదు ఇవ్వటం ఎలా దేశభక్తి అవుతుంది? దానిని మీరు దేశభక్తిగా తెగఫీలయి పోతున్నారు. అసలేమిటి మీకు మీ ఫ్రెండ్ చెప్పిన విషయం? After all ఒక సబ్ ఎడిటర్ కి ఏంతెలుస్తాయి?" అంటూ తెగ వాదించాడు. వాదించాడు అనటం కంటే నన్నే ఇంటారేగేషన్ చేసాడని అనటం సబబునుకుంటా. నేను “అవునండీ ఒక సబ్ ఎడిటర్ కి తెలిసేది తక్కువే. అయితే అది సామాన్య పాఠకుల కంటే ఎక్కువేమరి. అంతేగాక ఆ సబ్ ఎడిటర్, ఈనాడు రామోజీరావు వ్యక్తిగత ఆడిటర్ కి సమీపబంధువైతే మరికొంచెం ఎక్కువే తెలుస్తుంది కదా!” అని గట్టిగా అన్నాను. ఇక ఆవిషయంలో, పాపం వాదన ఆపేసాడు. వెంటనే “అసలేమనుకుంటున్నారు రామోజీరావు అంటే? అతడు Perfect Business man. తెలుసా? ఎంత ధైర్యంగా అతణ్ణి claim చేస్తున్నారు మీరు?" అంటూ గద్దించాడు. “బయటపడేవరకూ అందరూ పెద్దమనుష్యులే లెండి” అన్నారు మావారు. దాంతో అతడు మారు మాట్లాడలేదు. అయితే విచిత్రం ఏమిటంటే సరిగ్గా వారం, పదిరోజుల తర్వాత ఉండవల్లి రచ్చతో మార్గదర్శి వ్యవహారం రోడ్డునపడింది. ఇప్పుడైతే రామోజీరావు విలువలు ఏపాటివో, అతడి ఈనాడు సినిమాపేజీలోని వలువల్లేని పడతుల బొమ్మలూ, పమిటలు లేని బ్రిసా, కళాంజలి వ్యాపారప్రకటనలు చెబుతూనే ఉన్నాయి. ఇంకా అతడి నిజస్వరూపం విశ్వరూపమెత్తి అందరకి కూడా కళ్ళు మిరమిట్లు గొల్పుతోంది, ఇంకా గొల్పనుంది. అంతేగాక సదరు అధికారి ఎంసెట్ కుంభకోణం గురించి “ఇవాళ్ళ రేపు ఇలాంటి కుంభకోణాలు మామూలే. ఇది అందరికీ తెలిసిన విషయమే” అన్నాడు.

ఈ వాదన అంతటితో, మాకు, సిబిఐ లాగే ఐబి కూడా కుర్చీబానిస అన్న విషయం అర్ధమైంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి ఏజంట్లుగా సిబిఐ, ఐబి పనిచేస్తుందన్న వార్త పచ్చినిజమై మా ఎదుట నిల్చుంది. ‘దేశభక్తి గురించి మనం సోనియాగాంధీకి వేసిన వ్యంగ్యాస్త్రానికి జవాబు, ఐబి అధికారి నోట విన్నామన్నమాట’ అనుకున్నాము. సరే కానిమ్మని “ఒకే సార్! నా రిక్వెస్ట్ ఏమిటంటే – నా ఫిర్యాదుని మీరు కేంద్రం దృష్టికి తీసికెళ్ళగలరా?" అని సూటిగా అడిగాము. దానికి అప్పటివరకూ మాతో వాదించిన అధికారి [ఇతడి పేరు రంగన్న అని చెప్పుకున్నాడు] గాక, అతడి పైఅధికారి “సారీ అమ్మా! మాకు పైనుండి orders/assignments వచ్చినవే మేము take up చేస్తాము. మరేవీ మేము చెయ్యము” అన్నాడు. వాళ్ళ administration ప్రకారం, పైనుండి వచ్చిన orders/assignments మాత్రమే వాళ్ళు డీల్ చెయ్యవచ్చుగాక. మరి అలాంటప్పుడు క్రింది స్థాయిలో, అంటే జిల్లాస్థాయిలో ఆఫీసులు ఎందుకు? ఢిల్లీలోనే ఉంటే సరిపోతుందిగదా! Order/assignment ప్రకారం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తే అక్కడికి వెళ్ళి వర్కు చేసివస్తే సరిపోతుంది కదా! మరి క్రిందిస్థాయిలో ఏదైనా దేశద్రోహమో, మరో కుట్రో, ప్రమాదమో జరుగుతుందనుకొండి. దాన్ని ఎవరు నిఘా వేసి గమనించి, పైస్థాయికి చేరవేస్తారు? రాముడి కాలం నుండి ఉన్న నిఘావ్యవస్థ అది కదా! చివరికి ప్రతీ పోలీసు స్టేషన్ లో కూడా సెర్చిపార్టీపేరుతో ఓ నిఘా వ్వవస్థ ఉంటుంది కదా! అసలు క్రింది స్థాయిలో జరిగే ద్రోహాలు గుర్తించి, పైకి చేరవేయటం అనే విధే వారికి లేకపోతే, మరి క్రింది స్థాయిలో కార్యాలయాలు, ఉద్యోగులూ, వారికి జీతభత్యాలూ ఎందుకు? అయినా అలా నిఘావేసి, లేదా దేశద్రోహుల గురించిన సమాచారం తమకు అందితే, పైకి చేరవేయటం ఐబి వంటి నిఘా సంస్థల విధుల్లో ఒకటి కాదా? వారికా స్ఫూర్తి లేదా? మరిదేమీ లేకపోతే, 1992 లో, నేను పీ.వి.కి రామోజీరావు గురించి ఫిర్యాదు ఇవ్వటానికి ముందు, మాజీ గవర్నరు కుముద్ బెన్ జోషిని, ఆ విషయంలో సాయం చెయ్యమని అడగటానికి వెళ్ళినప్పుడు, ఆవిడ “ నీ పేరు, అడ్రసు వ్రాసి ఇస్తావా, ఐ.బి. డిపార్ట్ మెంట్ కు పంపిస్తాను” అని ఎందుకు అన్నట్లు?

ఇవన్నీ ఆలోచిస్తూనే, నేను, “Okay Sir! Thank you” అంటూ లేచి వీడ్కొలు తీసుకోబోయాము. వెంటనే అతడు మమ్మల్ని కన్విన్స్ చేస్తూ “అలా కాదమ్మా! విషయం తెలుసుకోవటానికి మేము అలాగే డీల్ చేస్తాము. సరే! ఇంతదూరం వచ్చారు గదా! ఆ కంప్లైంటు ఓ కాపీ ఇవ్వండి. మేం పైకి పంపిస్తాము. చూద్ధాం ఏంజరుగుతుందో!” అన్నాడు. సరేనని ఓ కాపీ [అది సోనియా గాంధీకి వ్రాసిన ఫిర్యాదు జిరాక్స్ కాపీ] ఇచ్చి శ్రీశైలం తిరిగి వచ్చాము.

ఇదిజరిగిన నెలరోజులకి శ్రీశైలంలో ప్రైవేటు వారందరినీ గదులు కాన్సిల్ చెస్తారట అన్న పుకారు ఊళ్ళో బాగా షికారు చెయ్యటం మొదలుపెట్టింది. అంతకు ముందే అలాంటి వార్తలు కొన్ని వచ్చాయి. ఇంతలో జనవరి, 2007 ప్రవేశించింది. దాంతో పాటే మాకు గది కాన్సిల్ చేస్తున్నట్లు, వారంలోగా గది ఖాళీ చేసి అప్పగించాలని, నోటిసు ఇవ్వబడింది. అయితే ఇదే నోటిసు శ్రీశైలంలో మరో 100 మందికి కూడా ఇవ్వబడింది. ‘సరే! అందరికీ ఏమయితే అదే మనకీ అవుతుంది కానిమ్మని’ మేం చూస్తూ ఉన్నాము. తర్వాతి కాలంలో శ్రీశైలంలోని ప్రైవేటు వాళ్ళంతా [వాళ్ళల్లో కొందరు వివిధపార్టీలకి చెందిన రాజకీయనాయకులు ఉన్నారు.] కలిసి రాజకీయంగా గొడవచేశారు. మంత్రి జే.సి.దివాకర్ రెడ్డి వచ్చినప్పుడు అతడి దృష్టికి ఇది తెచ్చారు. అతడు ఈ.వో.ని చీవాట్లు పెట్టాడట. దాంతో ఆ గొడవ అలా మూతబడింది. అయితే ‘ఇది ఇప్పుడు చల్లారింది. తర్వాత ఆ వందమందినీ వదిలేసి కేవలం మా ఒక్కరి గది మీదకీ వస్తుంది!’ అని మాకు [sixth sense అనండి, అంతఃచ్ఛేతన హెచ్చరిక అనండి, అనుభవ పాఠం అనండి] అన్పించింది.

2007, జనవరి సంక్రాంతి సెలవుల్లో మేం విజయవాడ వెళ్ళి ఆంధ్రజ్యోతి ఎడిటర్ ని కలిసాము. అంతా విన్నాక ఆయన “The strength and the mode of the weapon can be determined by your enemy, but not by yourself. I think, మీరిక్కడ fail అవుతున్నారనుకుంటాను” అన్నాడు. నాకు అర్ధం గాక ఆమాటని ఒకటికి రెండుసార్లు చెప్పించుకొని, ’ఇంతకు నా కేసు ప్రచురించగలరా లేదా?’ అని అడిగాను. ‘తమకి అంత స్వాధికారం లేదని, హైదరాబాద్ లోని తమ హెడ్డాఫీసుకి అప్రోచ్ అవ్వమనీ’ చెప్పారు. “పోనీ మీరే పంపకూడదా? జిరాక్స్ కాపీ ఇస్తాను” అన్నాను. “లేదు మీరే హైదరాబాద్ వెళ్ళి కలవండి” అని చెప్పారు. చేసేది లేక వెనుదిరిగాను. పత్రిక వాళ్ళు స్పందించనందున చేసేది లేక మేం శ్రీశైలం తిరిగి వచ్చాము. అప్పటివరకూ దూర్భాషలాడుతూనే ఉన్న మా సత్రపు క్రింది అంతస్థువారు ఒక్కసారిగా మౌనం పాటించటం మొదలుపెట్టారు. అసలు సెలవులకి ఊళ్ళు వెళ్ళిన కొందరు రెండునెలలైనా తిరిగి రాలేదు. ఒకరిద్దరు ఉన్నాగానీ, నన్ను చూడగానే గభాలున లోపలికి తప్పుకోవటం మొదలుపెట్టారు. మాకు ఏమీ అర్ధం కాలేదు. గాలిలోనే భయపు వాసన వస్తోందా అన్నట్లుంది. ప్రాంగణం అంతటా ఓ నిశ్శబ్ధం, పరారీ వాతావరణం. ఆ తర్వాత ఈ పరిస్థితినే ఉటంకిస్తూ వాళ్ళందరి దగ్గరా సి.ఐ. స్టేట్ మెంట్లు తీసుకున్నాడనీ, తానే వాళ్ళని స్టేషన్ కి సి.ఐ. పిలుచుకు రమ్మనాడని, తానే తీసుకుపోయాననీ – మా విద్యార్ధుల తండ్రి, కానిస్టేబుల్ సుధాకర్ మార్చి, 2007 లో చెప్పాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నిన్నటి టపాలు:
భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర – 76[వేధింఫుల వెనుక అంతరార్ధం]
ఎన్నికలలో, ఎన్ని లీలలో……[4] మీడియా వ్యూహాత్మక మౌనంప్రతిపక్షనేతల అంతర్గత సర్దుబాటు



ఈ అదివారపు సెలవు రోజున నా బ్లాగు చుట్టాలందరి కోసం అమ్మఒడి అందిస్తున్న చిన్నికానుక.

అనగా అనగా…..

ఓ గ్రామానికి దాపుల నున్న అడవిలో సదానందుడనీ గురువు, ఒక గురుకులాన్ని నడుపుతున్నాడు. ఆయన గురుకులం క్రమశిక్షణకి పెట్టింది పేరు. ఆయన యుద్దవిద్యలు కూడా బాగా నేర్పుతాడని ప్రసిద్ది. ఓరోజు కిరీటి అనే యువకుడు సదానందుడి ఆశ్రమానికి వెదుక్కుంటూ వచ్చాడు. సదానందుణ్ణి కలుసుకుని నమస్కరించి “అయ్యా! నాకు కత్తి సాము నేర్చుకోవాలని ఆశ. తమ శిష్యుడిగా స్వీకరించండి” అని ప్రార్ధించాడు. సదానందుడు ఆ యువకుడి జన్మస్థలం గురించి, తల్లిదండ్రులగురించి, పూర్వవిద్యల గురించి అడిగాడు. కిరీటి అన్నిటికీ వినయంగా జవాబిచ్చాడు. సదానందుడు ఏమాటా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు.

కిరీటికి ఏమీ అర్ధం కాలేదు. సరే ‘కాదు పొమ్మనలేదు కదా!’ అనుకుని ఆశ్రమంలో ఇతర విద్యార్ధులతో కలిసిపోయాడు. గురుకుల ఆశ్రమంలోని ఇతర విద్యార్ధుల లాగే రోజూ ఉదయాన్నే లేవటం, ఆశ్రమవిధులు నిర్వహించటం చేస్తున్నాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తేవటం, వంటశాలలో పనిచేయటం, ఏటి నుండి నీరు తేవటం, గురుకులంలోని తోటలోగల కూరగాయల మొక్కలకీ, పూలమొక్కలకీ, పళ్ళవృక్షాలకీ నీళ్ళుపోయటం….. ఇలా అన్ని పనులూ చేస్తున్నాడు. అయితే సదానందుడు కిరీటి కన్పిస్తే చాలు ఈడ్చి తంతుండేవాడు. కిరీటి మొక్కలకు నీళ్ళు పోస్తుంటే ఫెడేలున వీపు మీద గుద్దేవాడు. ప్రాంగణం ఊడుస్తుంటే డొక్కలో గుద్దేవాడు. ఏపని చేస్తున్నా, ఎటో ఒకవైపు నుండి సదానందుడు కిరీటిని తన్నటం మానలేదు.

కిరీటికి ఏమీ అర్ధం కాలేదు. దుఃఖం వచ్చింది. అవమానంగా అన్పించింది. ‘ఒకవేళ గురువుగారికి తనంటే ఇష్టం లేదా? తమ ఆశ్రమంలో ఉండటం ఇష్టం లేకపోతే తనని పిలిచి సూటిగానే అదేవిషయం చెబుతాడుగానీ ఇలా ఎందుకు తనని కొడతాడు?’ అనిపించింది. ఒకోసారి, గురుకులం నుండి వెళ్ళిపోదామా అన్పించేది. కానీ కత్తి యుద్ధం నేర్చుకోవాలన్నా సంకల్పం కొద్దీ గురుకులంలోనే ఉండిపోయాడు. కొన్ని నెలలు గడిచాయి. గురువు గారు మాత్రం కిరీటి కన్పిస్తే చాలు దెబ్బతీయకుండా ఉండేవాడు కాదు. కిరీటి ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వీపు పగలటం ఖాయం. దాంతో అనివార్యమై, కిరీటి అప్రమత్తంగా ఉండటం నేర్చుకున్నాడు. ఏపని చేస్తున్నా, చురుగ్గా అన్నిదిక్కులూ జాగ్రత్తగా పరిశీలించేవాడు. ఏమాత్రం అలికిడి అయినా మెరుపులా కదిలేవాడు. దాంతో సదానందుడు కిరీటిని తన్నలేకపోవటం తరుచుగా జరగసాగింది. ఇలా మరికొన్నిరోజులు గడిచాయి.

ఓరోజు సదానందుడు కిరీటిని పిలిచి “నాయనా! అదిగో ఆ కత్తి అందుకో. ఈ రోజు నుండీ నీకు కత్తిసాము నేర్పుతాను” అన్నాడు ప్రసన్నంగా.

కిరీటి ఆనందానికి అవధుల్లేవు. మరుక్షణం కత్తి అందుకుని అభ్యాసానికి దిగాడు. తొలిపాఠం అయ్యాక కిరీటి గురువుగారికి నమస్కరించి “అయ్యా! నేను వచ్చి, నన్ను శిష్యుడిగా అంగీకరించమని అడిగిన రోజు, మీరు ఔననలేదు. కాదనలేదు. కాదనలేదు కాబట్టి నేను గురుకులంలో ఉండిపోయాను. కానీ ప్రతిరోజూ మీరు నేను కనబడతే చాలు చితకబాదారు. ఆ బాధ పడలేక వెళ్ళిపోదామని కూడా అన్పించింది. ఈ రోజు నేను అడగకుండానే పిలిచి విద్యాబోధన ప్రారంభించారు. కారణం సెలవిస్తారా?" అని అడిగాడు.

సదానందుడు చిరునవ్వునవ్వి “నాయనా! కత్తి యుద్దానికి అప్రమత్తతా, చురుకుదనమూ పునాది వంటిది. నీవు వచ్చిన రోజు నుండీ నీకు అది నేర్పటం మొదలుపెట్టాను. నువ్వు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా నాచేతి దెబ్బలు తిన్నావు. క్రమంగా నీ చురుకుదనం, జాగ్రత్త పెరిగాయి. ఇప్పుడు లాంఛనంగా విద్యాబోధన ప్రారంభించాను. ఏవిద్యకైనా ముందు దానికి తగిన దృక్పధాన్ని, ఆలోచనా సరళిని విద్యార్థికి నేర్పాలి. తర్వాత అసలు విద్య వారు అతి సులభంగా నేర్చుకోగలుగుతారు. విద్యా బోధనలో అసలు కిటుకు ఇదే” అన్నాడు.

కిరీటి సంతోషంగా గురువుగారికి పాదాభివందనం చేసి, ఇతర విధుల్లోకి వెళ్ళాడు. అనతికాలంలోనే సదానందుడి దగ్గర కత్తియుద్ధంలోని మెళకువలు నేర్చుకుని, నైపుణ్యంగల కత్తి యుద్ద వీరుడిగా కిరీటి పేరు తెచ్చుకున్నాడు.

ఇదీ కథ!

ఈ కథ మనకి, ఏది నేర్చుకోవాలన్నా, ఏ సాధన చెయ్యాలన్నా, వాటికంటే ముందు దృక్పధం [attitude] ముఖ్యమని చెబుతుంది. ఒకవ్యక్తి జీవితాన్ని నిర్మించేది, ప్రభావపరిచేది దృక్పధమే. ఒక జాతిని నిర్మించేది, ప్రభావపరిచేది కూడా దృక్పధమే. ఒకప్పుడు భారతీయుల్లో ఉన్న ఈ దృక్పధమే వారిని ప్రపంచంలోకెల్లా భాగ్యవంతుల్నీ, సౌశీల్యవంతుల్నీ చేసింది. ప్రపంచం నలుమూలల నుండి క్రీస్తు పూర్వమే నలందా విశ్వవిద్యాలయానికి 10 వేలకంటే ఎక్కువ విద్యార్ధులుండేవాళ్ళు. ఎందుకంటే భారతీయులు అలనాటి దృక్పధం భారతదేశాన్ని ప్రపంచంలోనే తలమానికం చేసింది.

ఒకప్పుడు, ఆ దృక్పధాన్ని భారతీయులకు, పురాణాలు, ఇతిహాసాలు, వాటిని ప్రచారించే కళారూపాలు, మతవిశ్వాసాలు, జీవన సరళి, బోధించేవి. ఇప్పుడు వాటిస్థానాన్ని మీడియా [పత్రికలు, టివీలు], సినిమాలు ఆక్రమించాయి. అదే ఈ దుస్థితికి కారణం.

ఏది ఏమైనా – దృక్పధం మారనిది, ఇప్పుడున్న ఏ స్వామ్యాలు [ప్రజస్వామ్యం గాకపోతే XYZ స్వామ్యం], ఏ ఇజాలు, ఏ పద్దతులూ, ఏ చట్టాలూ ప్రజల్లో, వారి జీవితాల్లో, ఏమార్పునీ తేలేవు.

ఇది కాలం నిరూపించిన సత్యం.

నిరూపిస్తున్న సత్యం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu