ఇవేగాక మా స్కూల్లో, రోజూ ఏదో ఒక ప్రత్యేక పీరియడ్ ఉండేది. ఓ రోజు లైబ్రరీ, ఓరోజు లెసన్ డ్రామా, ఓరోజు స్పోకెన్ ఇంగ్లీషు, ఓరోజు పజిల్ అవర్….. ఇలా! పిల్లలు నిత్యోత్సాహంగా ఉండేవాళ్ళు. ఓసారి భవాని అని ఓ ఏడేళ్ళ పాపని తెచ్చారు. వాళ్ళు కొత్తగా మా సత్రంలోకి, గది ఎలాట్ అయి వచ్చారు. ఆ అమ్మాయి తండ్రి మాకు బాగా పరిచయమే. గుడిలో పూజారిగా పనిచేసేవాడు. మాపాపని ఎంతో ముద్దు చేసేవాడు. ఆ బిడ్డ లొడలొడా వాగుతూ ఉంది. పెద్ద అరుగుపేరమ్మాలా ఉంది. ఆ పిల్లతల్లి వచ్చి “మేడమ్, భవానికి మీరే చదువు నేర్పాలి” అంటే ‘ఓర్నాయనో’ అనుకున్నాను. తీరా చూస్తే ఆబిడ్డ చాలా తెలివైనది. దాని బుర్ర సామర్ధ్యానికి తగినంత పని, చదువు లేక అది సొల్లువాగుతూ, ఆరిందాలా తయారయ్యింది. ఆ బిడ్డకి కాస్త చదువురుచి చూపించగానే అల్లుకుపోయింది. మొత్తంగా ఆ పిల్ల ప్రవర్తన మారిపోయింది. పిల్లల కోసం మా లైబ్రరీలో చాలా కథల పుస్తకాలు ఉండేవి. ఆ కథలన్నీ చదువుతూ, చెప్పిన పాఠమల్లా నేర్చుకుంటూ…. ఆ బిడ్డ ముఖంలో ఎంతో వర్చస్సు. అది చూసినప్పుడు నేను, నాభర్తా చాలా ఆశ్చర్యపోయాము. ఇలా చూస్తే దేశంలో, ఎందరో, జులాయిగా తిరుగుతున్నారన్న పిల్లల విషయంలో చాలామంది పరిస్థితి ఇదేకావచ్చు. వారికి తగిన దిశా నిర్ధేశం జరగకే ప్రేమ, ప్రేమోన్మాదమనీ, వ్యసనాలనీ, సినిమాలనీ చెడిపోతున్నారనిపించింది. ఎందుకంటే ‘ఙ్ఞానం’ కంటే thrill నీ, నిషాని ఇచ్చేది మరేదీ లేదని మా స్వానుభవం. అందుకే గీతలో భగవంతుడు ఙ్ఞానం అంత పవిత్ర వస్తువీ లోకంలో లేదనీ, ఙ్ఞాని అంటే తానేనని, ఙ్ఞానికీ తాను, తనకి ఙ్ఞానీ కనపడకపోడనీ అంటాడు.

ఓ సారి ఓ పిల్లవాడి తల్లి వచ్చి, తమ వాడు కోపం వచ్చిందంటే చేతిలో ఏవస్తువు ఉంటే అది విసిరి కొడుతున్నాడని ఫిర్యాదు చేసింది. నిజానికి ఈ భావోద్రేకం పిల్లలు టివీ సీరియళ్ళలోనూ, సినిమాల్లోనూ చూసి నేర్చిందే. మేం మర్నాడు క్లాసులో “ఓరేయ్ పిల్లలూ! ఇప్పుడు మీరో సినిమా చూద్దురు గాని” అని చెప్పి, ఆ బుడ్డిగాణ్ణి వాడి స్కూల్ బ్యాగ్ తెమ్మన్నాం. నేను వాడి బ్యాగ్ నాఒళ్ళో పెట్టుకుని “నాకిప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు నేను చేతిలో ఏదుంటే అది విసిరి వేస్తాను. మరి టీవిల్లో, సినిమాల్లో అలాగే చేస్తారు కదా! ఇప్పుడు నేను వీడి పుస్తకాలు ఒక్కొక్కటే విసిరి వేస్తూ ఉంటాను. వీడు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాడు. మీరంతా చప్పట్లు కొట్టండి” అన్నాను. ఇక నేను ఒకో పుస్తకం తీసి కొంచెం దూరం విసరటం, వాడు పరుగున వెళ్ళి తెచ్చుకోవటం. [మెల్లిగా వెళ్తే మేం ఊరుకోం మరి!] ఇక పిల్లలంతా ఒకటే నవ్వులూ, చప్పట్లు. ఇకవాడు మళ్ళా ఇంట్లో ‘కోపం వచ్చింది నాకు’ అంటే ఒట్టు. నిజానికి పెద్దలు ఊరుకుంటారా లేదా అన్నది గమనించుకునే పిల్లలు ఈ వేషాలు వేస్తారు. వాళ్ళకి అంత పరిశీలన ఉంటుందని తెలుసుకోకపోవటం పెద్దల పొరపాటు. ‘చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు’ అనుకుంటాం గానీ, వాళ్ళ ప్రపంచమే ముందు తల్లిదండ్రులూ, తర్వాత స్కూలు అయినందున వాళ్ళు బాగానే పరిశీలిస్తారు. తమకోరికలు, పనులు సాధించుకొనేందుకు తమవైన ప్రణాళికలు వేస్తారు.

పిల్లల పరిశీలన ఎంత నిశితంగా ఉంటుందంటే – ఓ సారి ఓ నర్సరీ బుడ్డిగాడు, సెలవులకి వాళ్ళ బంధువుల ఊరు [పల్లెటూరు] కు వెళ్ళి వచ్చాడు. సెలవులైపోయాక క్లాసులో వేగంగా వర్క్ పూర్తి చేసుకొని బొమ్మలు ఇప్పించుకున్నాడు. కాస్సేపటికి ఇంకొంతమంది కూడా అడుకునేందుకు వచ్చారు. [సెలవులైపోయి వచ్చాక మా పిల్లలంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేవాళ్ళు] ఈ బుడ్డిగాడు బిల్డింగ్ బ్లాక్సు పెట్టే బకెట్ లాంటి డబ్బా తీసుకొని దాన్ని బోర్లించి, దాని లోపల ఓ చిన్న ప్లాస్టిక్ బ్లాక్ పెట్టాడు. గడ్డం క్రింద రెండు చేతులూ పెట్టుకొని ఓ నిముషం ఆగాడు. మళ్ళా ఆ డబ్బా ఎత్తి చూసి “ఓఁ” అని అరుస్తూ, ఆశ్చర్యపోయి, ప్రక్క వాళ్ళని పిలిచి చూపెట్టాడు. వాళ్ళ కదేదీ అర్ధంగాక వాళ్ళ ఆటల్లో వాళ్ళు పడిపోయారు. వీడు మళ్ళా ఇంకో బ్లాక్ ని డబ్బా క్రింద పెట్టటం, కాస్సేపు వేచి ఉండటం, డబ్బా ఎత్తి ఆశ్చర్యపోవటం….. ఇదే ఆడుతున్నాడు. పైతరగతి పిల్లలకి పాఠం చెబుతూ నేను వాణ్ణి పరిశీలిస్తూ ఉన్నాను. “ఒరే బుడ్డీ! గంగాధర్! ఏంచేస్తున్నావురా?" అని అడిగాను గానీ, పాపం వాడికి చెప్పటం రాలేదు. వాడికప్పటికి మూడేళ్ళుండేవి. కొన్ని మాటలింకా నత్తిగానే పలికేవాడు. కాస్సేపు పరిశీలిస్తే నాకు అర్ధం అయ్యింది. “ఏం రా! కోడి గుడ్డు పెట్టిందా?" అన్నాను. వాడు ఒక్కసారిగా ఎంగ్జయిట్ అయిపోయాడు. విషయం ఏమిటంటే – సెలవులకి వాడు వెళ్ళిన పల్లెటూర్లో గంపక్రింద కోడిని పెడితే, అది గుడ్డుపెట్టటం, తర్వాత వాళ్ళు గంపెనెత్తి ఆనందంగా ఆ కోడి గుడ్డుని తీసుకోవటం పరిశీలించాడట. దాన్నే వాడిప్పుడు అనుకరిస్తున్నాడు. గంపక్రింద పెట్టేటప్పుడు కోడి ఒక్కటే ఉంది. తర్వాత గుడ్డెలా వచ్చిందో అన్నది వాడి ఆశ్చర్యం. ఇదంతా పరిశీలించేసరికి చాలా నవ్వొచ్చింది. ఎవరికి చెప్పినా అందరూ ఒకటే నవ్వులు.

ఈ చిన్ని భడవ ఓసారి….. మేం నర్సరీ, ఎల్.కె.జీ. పిల్లల్ని మధ్యాహ్నం 1.30PM నుండి 2.30PM వరకూ చాపలు వేసి పడుకోమంటాం. నిద్రపోయి తీరాల్సిందే. మళ్ళీ 2.30PM నేను వెళ్ళి “బుడ్డీస్! లేవండి నాన్నా. టైమయ్యింది. అదిగో సారు వస్తున్నారు”, అనగానే ఠక్కున లేచి కూర్చొనేవాళ్ళు. ఓ రోజు మధ్యాహ్నం 2 గంటలకి నేను 5 వతరగతి పిల్లలకి పాఠం చెబుతున్నాను. లోపలి గదిలో యూ.కె.జీ. వాళ్ళు వ్రాసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు నిద్రపోతున్నారు. వీడు అప్పటికి స్కూల్లో చేరి పదిరోజులవుతుంది. మధ్యలో నిద్రలేచాక నా గొంతు విన్పిస్తోంది. నాకోసం బయటకు రాబోయి లోపలికి వెళ్ళిపోయాడు. మేము గదిలో చిన్న పార్టీషన్ పెట్టి ఓవైపు వంటగదిగా, రెండో వైపు క్లాసురూమ్ గా వాడేవాళ్ళం. వాడు నాగొంతు విన్పిస్తున్న దిశలో నడుస్తూ వంటగదిలోకి వెళ్ళి బకెట్ లో, కుర్చీలో కూర్చున్నట్లు కూర్చున్నాడు. నీళ్ళు చిందిపడ్డాయి. “మమ్మీ!” అంటూ సన్నగా అంటున్నాడు. నాకు లీలగా విన్పించి “బుడ్డీ! ఎక్కడా!” అంటూ పరుగునా వెళ్తే వంటగదిలో, బకెట్ లో, పిల్లవాడు! వాణ్ణి ఎత్తుకుని బయటకు తెచ్చి, తర్వాత ఇంటికి పంపించి పొడిదుస్తులు వేయింపించాము. నిద్రలో లేచినా తల్లి గొంతు వింటే ఎంత రక్షణగా ఉంటుందో, అంతగా టీచర్ గొంతు విన్నా, వాళ్ళకి రక్షణగా అన్పిస్తుంది. కాకపోతే టీచర్ కీ, వాళ్ళకీ మధ్య ప్రేమ ఉండాలి, అంతే!

ఇలా పిల్లల్ని పరిశీలిస్తూ, మేమూ చాలా విషయాలు నేర్చుకున్నాము. ఓసారి ఓ నర్సరీ బుడ్డీ… ప్రక్కవాడు ఏడుస్తున్నాడు. కొత్తగా స్కూల్లో చేరాడు. వాడికది కొత్తగా భయంగా ఉంది. ఈ బుడ్డిది అప్పటికి పదిరోజుల సీనియర్. వెంటనే ఆ పసిది ప్రక్కవాడి కళ్ళు తుడిచింది. తన స్కర్ట్ తో వాడి ముక్కు తుడిచింది. వాడి జుత్తు సవరించి, లాగి తన భుజం మీద వాణ్ణి పడుకోబెట్టుకొని, వీపు మీద జో కొడుతోంది, అచ్చం వాళ్ళ అమ్మమ్మనో, అమ్మనో అనుకరిస్తూ. అయితే ఆ అనుకరణలోనూ తన తోటివారి మీద ఎంత ప్రేమో! అసలా బిడ్డని చూస్తేనే ప్రేమనంతా కుప్పబోసినట్లుండేది. అచ్చమైన ఆడపిల్లలా, అసలు తలెత్తి చూడదు. “ఏం బుడ్డీ! తలెత్తి చూస్తే నీ బంగారం కరిగిపోతుందా!” అంటే బుగ్గల్లో గులాబీలు పూయిస్తూ ముసిముసిగా నవ్వుతుంది. అంత ప్రేమ ఉంటుంది కదా… ఇదంతా పెద్దయిన తరువాత ఎక్కడికి పోతుందా అనిపించింది మాకు. [బంగారంలాంటి పిల్లలని తల్లిదండ్రులు చెడగొడతారా, సమాజం చెడగొడుతుందా?]

మా స్కూల్లో ఎవరైనా ఓరోజు స్కూలుకు డుమ్మా కొట్టారనుకొండి. మావారు “ఏం రా! వాడు ఇంట్లో ఏం చేస్తున్నాడు? గుడ్డిగుర్రానికి పళ్ళు తోముతున్నాడా?” అనేవారు. దాంతో పిల్లలంతా ఎవరైనా క్లాసుకి రాకపోతే ’ఫలానావాడు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నాడేమో సార్. స్కూల్ కి రాలేదు’ అనేవాళ్ళు. ఇలాంటి పదప్రయోగాలూ, వాక్యప్రయోగాలూ బోలెడు ఉండేవి. ఇంట్లోనూ, ఏదైనా ఊరెళ్ళితే అక్కడ, పిల్లలు అలాగే మాట్లాడేవాళ్ళు. దాంతో మా స్కూలు పిల్లల మాటకారితనం గురించి[talkative ness] అందరూ నవ్వుతూ చెప్పుకునేవాళ్ళు. పిల్లలు కొంత సొల్లు మాట్లాడతారు. వాటిని సరిచేసేవాళ్ళం. దానితో సరియైన పదాలతో సరియైన భావంతో మాట్లాడేవాళ్ళు. చాలామంది పిల్లలు వ్యంగ్యోక్తులతోనే తమ ప్రవర్తనని దిద్దికునేవాళ్ళు.

ఓ చిన్ని రాస్కెల్ ఉండేవాడు. బక్కగా, ఇంతలేసి కళ్ళేసుకుని. అయితే వాడిగొంతు కంచుగంట. తనకు వచ్చిన ఇంగ్లీషు పదాలన్నీ వాడేసేవాడు. “వీడికి నన్ను తిట్టిపించాలని ఆశగా ఉంది సార్!” అంటూ తన మీద ఎవరైనా పితూరీలు చెబితే అనేవాడు. “అప్పుడు ఆప్టర్ నూన్ సార్! నేను స్లీపింగ్ చేస్తున్నాను సార్. వీధిలో పెద్ద సౌండ్ వినిపించింది సార్!” అంటూ బోలెడు కబుర్లు చెప్పేవాడు. ఇంగ్లీషు సంభాషణ నేర్పినప్పుడు కూడా చకచక నేర్చేసాడు. ఓ రోజు ప్రార్ధన సమయంలో “సార్! నేను కథ చెబుతాను” అన్నాడు. “సరే చెప్పు బుడ్డీ!” అన్నాం. వాడు ఏకధాటిగా పదినిముషాల పాటు మూడో తరగతి తెలుగుపాఠం, ‘రెక్కల ఏనుగు’ కథ [వీడు నాలుగేళ్ళు నిండిన ఎల్.కె.జీ. బుడతడు] గలగలా చెప్పేసాడు. వాడి వాగ్థాటికి మేమంతా నివ్వెర పోయాం. పిల్లలు ఒక్కొక్కళ్ళు చిచ్చర పిడుగుల్లా ఉండేవాళ్ళు.

వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పుతూ, చెడు అలవాట్లు [పితూరీలు చెప్పటం, వస్తువులు పాడు చేయటం గట్రా] వదలగొడుతూ దిద్దుకుపోయేవాళ్ళం. ఇంట్లో కూడా వాళ్ళ ప్రవర్తన బాగా ఉండేటట్లు తల్లిదండ్రులూ మేమూ కూడా ఒక టచ్ లో ఉండేవాళ్ళం. చివరికి ఆకుకూరలు తినకపోయినా ‘మేడం, సార్ లకి చెప్పనా’ అంటే తినేసేవాళ్ళు. తల్లిదండ్రుల ఒత్తిడి మీద మేం 2004 లో సెల్ ఫోన్ తీసుకున్నాము. ఓసారి మూడో తరగతి చదివే ఓ కుర్రాడు తనతల్లి ఏదో అంటే “నామార్కులు చూసి మాట్లాడమ్మా?" అన్నాడట. ఆవిడ ఓ సారి స్కూలుకి వచ్చినపుడు చెప్పింది. మేం వెంటనే “ఈరోజూ మార్కులు చూసి మాట్లాడమన్నవాడు, రేపు నా సంపాదన చూసి మాట్లాడు అంటాడు. అస్సలు spare చేయకండి” అని చెప్పాము. అలాగే పిల్లలందరికీ కూడా మన గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల్ని గౌరవించాలి అని నేర్పించాము.

పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పరిశీలించేవాళ్ళమంటే – ఓ పిల్లాడు బోర్డు మీదనుండి లెక్క ఎక్కించటం కూడా బండతప్పులు ఎక్కించేవాడు. ఒకటి రెండు సార్లు రెండు పీకాను కూడా. తర్వాత ఎందుకో అనుమానం వచ్చి, పిల్ల వాడి తల్లిదండ్రులకి, వాడి డైరీలో నోట్ వ్రాసి పంపాను, ఒకసారి కళ్ళడాక్టర్ కి చూపించమని. తీరా చెక్ అప్ చేయిస్తే వాడికి ఇంతలావుపాటి కళ్ళద్దాలు వచ్చాయి. మరి దాదాపు టీవిలో దూరిపోయి చూస్తాడట.

మేం ప్రతీసంవత్సరం కార్తీకమాసంలో పిల్లలందర్నీ పిక్ నిక్ తీసికెళ్ళే వాళ్ళం. ప్రక్కనే ఉన్న అడవిలో ఎక్కడికి వెళ్ళినా అది పిక్ నిక్కే. ఆ రోజంతా ఒకటే ఆటలు. ఇష్టమైన తినుబండారాలు తెచ్చుకోవటం, పంచుకొని తినటం, ఆడటం. మేం కూడా వాళ్ళతో కలిసిపోయి ఆడేవాళ్ళం. ఆ అడవిలో అంతా స్వేచ్ఛే. కాళ్ళా గజ్జా నుండి కబడ్డీ దాకా ఆడేదాన్ని. మా వారు పిల్లలతో క్రికెట్టు ఆడేవాళ్ళు. ఇకవాళ్ళ ఉత్సాహమైతే ఆకాశాన్నంటేది. ఓ రెండుగంటలు పెద్ద పిల్లలతో ట్రెక్కింగ్ కూడా చేసేవాళ్ళం. ఓసారి పిక్నిక్ నుండి తిరిగివస్తుంటే, జీపులో కూర్చొన్నాక, నా ప్రక్కనే కూర్చున్న ఓ చిన్నిది, కళ్ళు తిప్పుతూ “మేమ్! మనం రేపు కూడా పిక్ నిక్ వస్తాం కదా!” అంది. “రేపెందుకు వస్తాం రా బుడ్డీ. ఈ రోజే. రేపు సెలవు. హాయిగా నిద్రపోయి తర్వాత స్కూల్ కి రావటమే” అన్నాను. ఒక్కసారిగా పాపం దాని ఆశలన్నీ కూలిపోయాయి. మూడేళ్ళ ఆ చిన్నదాని హాంగోవర్ అన్నిరోజులూ పిక్ నిక్ ఉండాలనీ. దానికి నేను చెప్పిన నిజం పరమ చేదుగా ఉంది. కాస్సేపు దాన్ని సంభాళించి, ప్రతీరోజూ స్కూల్ లో కూడా మనం ఆనందంగానే ఉన్నాం కదా అంటూ నచ్చజెప్పాక తేరుకుంది. ఇవన్నీ పరిశీలించినప్పుడు మన మనస్సు చేసే విన్యాసాలు, అరిషడ్వర్గాల ప్రభావం, మనమీద వాటి పనితీరు రకరకాల కోణాల్లో కనిపించేది. ఆవిధంగా పిల్లలకి అక్షరాలు నేర్పుతూ మేము జీవిత సత్యాలు నేర్పుకున్నాము.

ప్రతీ సంవత్సరం జనవరి 26 నాడు ఆటలపోటీలు నిర్వహించి, బహుమతులు ఇచ్చేవాళ్ళం. చిన్నపిల్లలూ, పెద్దపిల్లలూ కూడా ఎంతో పోటీపడి ఉత్సాహంగా ఆడేవారు. ఉన్న 60 మంది విద్యార్ధుల తోనే అన్ని విన్యాసాలూ నిర్వహించేవాళ్ళం. ఆగస్టు 15 నాడు ఓ పెద్ద పండుగలాగే ఉండేది వాళ్ళకి. డాన్సులు, డ్రామాలు ఒకటే హడావుడి. మాయాబజార్ సినిమాలోని ‘విన్నావటమ్మా ఓ యశోద’ లాంటి పాటలకు డాన్సులూ, పరమానందయ్య శిష్యుల కథలాంటి నాటకాలు వేసేవాళ్ళు. చిన్నిపిల్లలకి కూడా చాలానే నేర్పేవాళ్ళం. ఓ సారి చిన్ని పిల్లలకి మా పాప కొన్ని నాట్యపు ముద్రలు నేర్పింది. ఆ పిల్లలు ఇంటికి వెళ్ళి, తల్లుల్ని ‘నాకు లిప్ స్టిక్ కొని పెట్టు. పట్టులంగా వెయ్యి’ అని గొడవపెడుతున్నారంట. వాళ్ళొచ్చి మాకు చెప్పారు. “ఏమర్రా! షోకు లెక్కువయ్యాయా?" అన్నాను. పాపం చిన్నిముఖాలు చిన్నబుచ్చుకున్నాయి. తీరా చూస్తే విషయం ఏమిటంటే – మా పాప వాళ్ళకి కొన్ని డాన్సు స్టెప్స్ నేర్పింది. కాబట్టి, త్వరలో తామూ గీతక్క, ఇతర పెద్ద క్లాసు పిల్లల్లాగే డాన్స్ ప్రోగ్రాం ఇవ్వబోతున్నామన్నది వాళ్ళ ఊహ. అందుకన్నమాట ఆ హడావుడీ అంతా. అది అర్ధమై “ఏమర్రా. డాన్సు చేద్దామనా?" అనగానే గబగబా తలలూపారు గుమ్మడి కాయల్లా. మేమూ, తల్లిదండ్రులూ అందరం ఒకటే నవ్వుకున్నాము.

నిజంగా ఆ పసివాళ్ళ ప్రేమ వెలకట్టలేనిది. వాళ్ళ స్పర్శలో, మాటలో మాపట్ల ఎంతో ప్రేమో, ఎంతో ఇష్టం. మేడం చెప్పిందంటే, సార్ చెప్పాడంటే అది సుగ్రీవాఙ్ఞే. మా స్కూల్ కి చిన్న మైక్ సెట్టు కూడా సమకూర్చుకున్నాము. ఆదివారం నాడు రిక్రియేషన్ అవర్ ఓ గంట ఉండేది. చిన్నారులంతా తమకొచ్చిన కథో, జోకో, పాటో, పద్యమో చెప్పాలి. ఎంతో ఇష్టంగా మైకులో చెప్పేసేవాళ్ళు. ఆ చెప్పేటప్పుడు వాళ్ళు టీవిల్లో వాళ్ళని గుర్తుచేసుకుంటూ మాట్లాడేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళదగ్గర స్టేజ్ ఫీయర్ అన్నది లేకుండా చేసాము. పిల్లలంతా ఎంతగా శుభ్రతకి అలవాటు పడ్డారంటే – మా స్కూలులో ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చొనేవాళ్ళు. గుడికి వెళ్తే క్రింద కూర్చొమ్మంటే గునిసేవాళ్ళు. నిజానికి శ్రీశైలం గుడిలో విశాలమైన ప్రాంగణమంతా బండలు పరిచి శుభ్రంగా ఉంటుంది. అయినా ఈ చిన్నారులకి ఆదో గీర అన్నమాట. ఇదంతా చెప్పి తల్లిదండ్రులు కూడా ఎంతో మురిసిపోతుండేవాళ్ళు. ఎందుకంటే వీటన్నింటితో పాటు తమ పిల్లలకి చదువు [అక్షరాస్యత] కూడా బాగావస్తుంది కాబట్టి, వాళ్ళకి అదంతా చాలా సంతృప్తిగా ఉండేది.

నిజానికి స్కూలు పెట్టిన మొదట్లో ఎంసెట్ స్థాయినుండి చిన్నపిల్లల స్థాయికి రావటానికి నేను కొంచెం ఇబ్బందిపడ్డాను. “ఈపాటి రాదా?" అన్పించేది. తర్వాత ‘వాళ్ళు బాగా చిన్నపిల్లలనీ, అది ప్రాధమికంగా నేర్చుకునేదశ’ అనీ అర్ధం చేసుకుని వాళ్ళ స్థాయికి వెళ్ళి చెప్పటం నేర్చుకున్నాను. ఈ దశలో కథల ద్వారా చెప్పటం అత్యధిక ఫలితాన్నిస్తుందన్నది అర్ధమయ్యింది. బహుశః అందుకే మన పెద్దలు భారతీయ జీవిన విధానం అయినటువంటి హిందుమతాన్ని[హిందూ మతం ఒక మతం కాదు. అది ఒక జీవన విధానం], భారత రామాయణ భాగవత కథల రూపంలో నిక్షిప్తం చేశారేమో అన్పించింది. ఈ విషయమై విపులమైన చర్చ ‘Coups on World’ లోని ‘Coup on Indian Epics’ లో వ్రాసాను.

ఇక చిన్నపిల్లలు [జీరో క్లాసు పిల్లలు] ఇలా ఉంటే పెద్దక్లాసు పిల్లల పరిస్థితి మరోలా ఉండేది. ఓసారి 7th చదివే, ఓ కుర్రాడు మనుష్యులు చచ్చిపోయినప్పుడూ కళ్ళు తెరిచే చనిపోతారనీ స్నేహితులతో వాదించాడు. అదివాడి ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే సినిమాల్లో, టీవిల్లో అలాగే చూపిస్తున్నారు కదా! అని గట్టిగా వాదిస్తాడు. మరోపాప హఠాత్తుగా Extreme Expressions, నుదురు బాదుకోవటం, గుండెలు బాదుకుంటూ అరిచి ఏడవటం చేస్తోంది. వాళ్ళ అమ్మ మాదగ్గర మొత్తుకుంది. విషయం ఆరాతీస్తే అదీమధ్య టీవీ సీరియల్స్ చూస్తోందని తెలిసింది. పాప తల్లికి అదే చెప్పి ముందు టీవీ కట్టేయ్యమన్నాం. కొన్ని రోజులకీ ఆ చిన్నది సరైపోయింది.

ఓసారి మా స్కూల్ లో ఓ 11 ఏళ్ళ కుర్రాణ్ణి చేర్చారు. వాళ్ళ తండ్రి మాకు బాగా పరిచయం. అతడు మమ్మల్ని బాగా ఒత్తిడి చేసి స్కూల్లో కుర్రాణ్ణి చేర్చాడు. వాడు బాల భీముడిలా ఉంటాడు. అప్పటికి 4 వతరగతే చదువుతున్నాడు. వరుసగా A to Z కూడా రావు. b,d లు percept అవుతాడు. వాడిపూర్తి పేరు మల్లిఖార్జున అని ఇంగ్లీషులో వ్రాయటం కూడా రాదు. అందుకని ఇంగ్లీషులో Malli అని వ్రాస్తాడు. అదీ అక్కడి ఇంగ్లీషు మీడియం చదువులు. వాడికెలా చదువు చెప్పాలో మాకు అర్ధం కాలేదు. వాణ్ణి కొడితే మనకే చెయ్యినొప్పి పెడుతుందన్న మాట. ఉదయం క్లాసుకి రాగానే నిద్రపోతాడు. నాకైతే చిర్రెత్తుకొచ్చింది. సహనం కూడదీసుకుని పిల్లవాణ్ణి బాగా పరిశీలించాము. వాళ్ళకి శ్రీశైలంగుడి ఎదురు మెయిన్ రోడ్డులో హోటల్ ఉంది. బాగా రద్దీగా ఉండే హోటల్. మన బాలభీముడు రోజూ ఉదయాన్నే బాగా నూనె వేసికాల్చిన దోశలు, గారెలు బొజ్జనిండా తిని వస్తాడు. ఇక నిద్ర రాక ఏం చేస్తుంది? మేం పిల్లవాడి తల్లిని పిలిచి విషయం చెప్పాము. ప్రతీరోజూ కూరగాయలతో చేసిన తేలిక పాటి ఆహారం ఇవ్వమనీ, నూనె గారెలు తగ్గించమనీ, అలాంటి పదార్ధాలు నిద్ర తెప్పిస్తాయనీ చెప్పాము. మెల్లిగా వాడి తిండి అలవాట్లు మార్పించాక కొంచెం ఫలితం వచ్చింది. అయినా వాడి బద్దకం వదల్లేదు. చివరికి వాడి బలహీనత బరువులు మోయ్యడంలో ఉందని కనిపెట్టాము. వాణ్ణి “ఎటూ చదువుకోకపోతే రేపు కూలీ పనులు చేసుకోవాల్సిందే. కనీసపాటి లెక్కలన్నా నేర్చుకోకుండా హోటల్ కూడా నడపలేవు. నువ్వు చదువునేర్చుకోవటం లేదు కదా! కనీసం బరువులు మొయ్యటం నేర్చుకో” అంటూ వాడి వీపున నాలుగైదు స్కూలు బ్యాగులు వేసి మేడ మెట్లు నాలుగుసార్లు ఎక్కించి దింపాము. రెండురోజులకే వాడు ‘బేర్’ మన్నాడు. దెబ్బతో వళ్ళువంచి చదువునేర్చాడు. రెండేళ్ళు తిరిగేసరికి వాడిలో నమ్మశక్యం కానంత [వాడితో వాడిని పోల్చితే] మార్పు కన్పించింది. మెల్లిగా తెలుగు, ఇంగ్లీషు చదవటం, వ్రాయటం, లెక్కలూ నేర్చాడు…. ఇలా ఎన్నో అనుభవాలు.

మేం 2003 నుండి 2007 వరకూ నాలుగు సంవత్సరాలపాటు శ్రీశైలంలో స్కూలు నడిపాము. ఆ నాలుగేళ్ళు మాదగ్గరే చదివిన పిల్లలు చక్కని ఇంగ్లీషు మాట్లాడటం, వేగంగా కథల పుస్తకాలు చదవటం నేర్చారు. ఐదవతరగతి వరకూ వచ్చిన పిల్లలు స్వంతంగా అర్ధపేజీ వచ్చే జవాబులు [ఇంగ్లీషులో] వ్రాయగలిగారు. అది మాకు, తల్లిదండ్రులకు కూడా చాలా సంతృప్తిగా అన్పించింది. పిల్లల ప్రవర్తన కూడా ఎంతో మారింది. “మనం చదువుకున్నామంటే ఆ డిగ్రీలు మెడలో వేసుకొని మూర్ఛ రోగుల్లా తిరగం కదా! మన చదువు, సంస్కారం మన ప్రవర్తనలో తెలియాలి” అని పిల్లలకి చెప్పేవాళ్ళం. పిల్లలకి ‘పని చెయ్యటం’ అన్నది ఎంతగా అలవాటు అయిపోయిందంటే – ఓసారి నేను ఏదో వ్రాయమని వర్కు ఇచ్చి, ఇంతలో ఎవరో వస్తే మాట్లాడుతున్నాను. పిల్లలు బాగా అల్లరి చేసారు. వచ్చినవాళ్ళు వెళ్ళిపోయాక “గెస్ట్ వచ్చినప్పుడు అల్లరి చేసారు. ఛ! ఈ మేడంగారి స్టూడెంట్స్ కి అసలు క్రమశిక్షణ లేదు అనివాళ్ళు అనుకోరా? నా పరువుపోయింది. సరే. ఈ కబుర్లు చెప్పుకోవాలనే కదా వ్రాయకుండా అల్లరి చేసారు. ఈ రోజంతా వ్రాయకండి. గమ్మున కూర్చొండి. మీరు చదవక్కర్లేదు, వ్రాయక్కర్లేదు. నిశ్శబ్ధంగా కూర్చొండి. అంతే!” అన్నాను. ఆరోజంతా మౌనంగా ఉండమన్నాను. సాయంత్రానికి అందరూ ఘోల్లుమన్నారు. “మేమ్! ఇంకెప్పడూ అల్లరి చెయ్యమండి. బోర్ కొడుతుంది. వ్రాసుకుంటామండి” అని ఒకటే బ్రతిమిలాడారు.

అలాగే ఇక్కెప్పుడూ అలాంటి అల్లరి, క్రమశిక్షణా రాహిత్యం చూపించలేదు. అయితే ఇలాంటి అనుభవాలే గాక కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు అసలు పిల్లల్ని ఎందుకు స్కూలుకు పంపిస్తారో అన్నట్లు ఉండేవాళ్ళు. కాకపోతే మా స్కూలులో అలాంటివారు ఒకరిద్దరే. వాళ్ళు తరువాత కొనసాగలేక కొన్ని నెలల్లోనే వెళ్ళిపోయారు. ఇక ఇలాంటి ఫలితాలతో [ప్రభుత్వం నిర్వహించే పరీక్షలతో, మార్కులతో నిమిత్తం లేని ఫలితాలు ఇవి] మా స్కూలుకు బాగా పేరొచ్చింది. సీట్ కోసం డిమాండ్, రికమెండేషన్లు పెరిగాయి. కావాలంటే మా ఫీజుకంటే ఎక్కువ ఇస్తాం అనేవాళ్ళు. అంటే డొనేషన్ అన్న మాట. మేం ఒకటే చెప్పేవాళ్ళం. “మాకు ఇచ్చింది సింగిల్ రూమ్ మాత్రమే నండి. మీరు కొంచెం పెద్ద కాటేజ్ ఇప్పించండి. ఎందరు పిల్లలకైనా చెబుతాం. పిల్లల్ని కూర్చుబెట్టేందుకు చోటు లేనిది, మేం ఏం చెయ్యగలం?" అనేవాళ్ళం. దాంతో మా స్కూలుకు సమస్యల్లా చోటు లేకపోవటమే అయ్యింది. రికమెండేషన్లు పట్టుకొచ్చేవాళ్ళు అదే రికమెండేషన్ తో మాకు పెద్ద కాటేజ్ మాత్రం ఇప్పించేవాళ్ళు కాదు. నిజానికి శ్రీశైలంలో స్వీపర్లకు కూడా గదులు సులభంగానే ఎలాట్ అయ్యేవి. మాకు మాత్రమే అది పెనుకష్టం అయ్యింది.

ఆ వివరాల్లోకి వెళ్ళేముందు, చివరిగా మాస్కూలు అనుభవాల్లో మమ్మల్ని అత్యంత విస్మయపరిచిందీ, విషాద పరిచింది అయిన ఒక సంఘటన చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

good one....

chala bagunnay mee kaburlu..

neenu recent mee blog choosanu, Mee bloglo meeru vrasina mee jeevitha sangatanalu motham oka attachment laga pampagalara

meeru vrasina mee jeevihta sangatanalu motham oka attachment laga pampinchagalara. Endhukante naaku internet annivelala undadhu.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu