ఇక మా స్కూలు విద్యార్ధుల కబుర్లు ప్రక్కన పెట్టి, మా విషయంలోకి వస్తాను. మాకు 2004, సెప్టెంబరులో చల్లావెంకయ్య సత్రంలో 10 వ నెంబరు గది ఎలాట్ అయ్యింది. ఎలాట్ మెంట్ కాపీ Fire Pot లో ఉంచాను. అప్పటివరకూ ఉన్న 18 వ నెంబరు గది నుండి 10 కి మారాము. మాకు ఆ గది ఎలాట్ అవ్వడానికి దాదాపు 1 ½ సంవత్సరాలు పట్టింది. మామూలుగా శ్రీశైలంలో చాలా తేలికగా గదులు ఎలాట్ అవుతాయి. మా తర్వాత కూడా ఎందరో స్వీపర్లకీ, అటెండర్లకీ [వీరందరూ కాంట్రాక్టు లేబర్ గా పనిచేసేవాళ్ళు] గదులు ఎలాట్ అయ్యాయి. ఇతర డిపార్ట్ మెంట్లలో అంటే టూరిజం, పోస్టల్, పోలీసులాంటి వాళ్ళకి, ప్రైవేటు వారికీ కూడా గదులు సులభంగానే ఎలాట్ అయ్యేవి. చివరికి శ్రీశైలం శిఖరం దగ్గర యాత్రికులకి ఫోటోలు తీసి ఉపాధి పొందే ఫోటోగ్రాఫర్లకి కూడా పెద్దసత్రలాంటి వాటిల్లో గదులు కేటాయింపబడ్డాయి. మాకు మాత్రం అది పెనుకష్టం అయ్యింది. చివరికి గది ఎలాట్ మెంట్ కీ ఏమైనా డబ్బు ఖర్చు ఉంటుందేమో అని అనుమానం వచ్చి, మా విద్యార్ధుల తల్లిదండ్రుల ద్వారా ఆ ప్రయత్నాలు కూడా చేసాము. చివరికి నేను పనిచేసిన స్కూల్ లోనే నాకంటే కొన్నినెలలు ముందు పనిచేసిన ఒక పంతులమ్మకి కూడా, ‘వేదభాస్కర యోగా ఆశ్రమం’ పేరిట అతి పెద్దప్రాంగణంలో వసతి ఎలాట్ అయ్యింది. ‘సింధూర’ అన్న పేరుగల, అంతకు ముందు వరకూ పువ్వుల సిల్కు చీరలు ధరించిన ఈ నడివయస్సు స్త్రీ, నివాస గృహ ఎలాట్ మెంట్ తో పాటుగా, రాత్రికి రాత్రి కాషాయాంబరం ధరించి, ఆశ్రమం బోర్డు పెట్టుకుని సన్యాసిని అయిపోయింది. శ్రీశైలంలో కృష్ణయ్య అని ఓ అధికారి [D.E.O] ఉండేవాడు. జూలై 1, 2007 న రిటైర్ అయినాడు. ఒకప్పుడు శ్రీశైల దేవస్థానం వివిధప్రాంతాలకు బస్సులు నడిపేది. అప్పట్లో ఇతడు బస్సుల్లో కండక్టరుగా ఉండేవాడు. తర్వాత ఆ బస్సురూట్లు కూడా APS RTC వారి అధ్వర్యంలోకి పోయినపుడు, ఇతడు శ్రీశైల దేవస్థానంలోకి రాగా, కొందరు ఇతడి మిత్రులు ఆర్.టి.సి.లోకి పోయారు. వారిలో ఒకరి పిల్లలు మాదగ్గర చదువుకునేవారు. ఈ కృష్ణయ్య కాలక్రమంలో పదోన్నతులు పొంది, 2003 నాటికి డిప్యూటి ఈ.వో. స్థాయిలో ఉండేవాడు. ఆ స్థాయి ఉద్యోగం ఇక మరే దేవస్థానంలోనూ లేనందున అతడిది బదిలీలకి అవకాశం లేని ఉద్యోగం అయ్యింది. అలాంటి సౌకర్యాన్ని అతడు కోర్టుద్వారా పొందాడట. అతడు గొప్ప లిటిగెంట్ అనీ, కోర్టు కేసులతో ఎండోమెంట్సు ఉన్నతాధికారులని కూడా గడగడలాడిస్తాడనీ, మనిషికి కొంత ‘తిక్క’ అనీ, కులాభిమానం మెండు అనీ ఊళ్ళో చెప్పుకునేవాళ్ళు. ఇతడితో గల సాన్నిహిత్యంతోనే సదరు సింధూర టీచర్ సన్యాసిని అవతారం ఎత్తి, నివాసగృహ ఎలాట్ మెంట్ పొందిందని ఓవార్త శ్రీశైలంలో ఉంది. శ్రీశైలంలో ఈ.వో.ది అంతిమాధికారం. అయితే ఈ.వో.లకి బదిలీలు ఎక్కువ. దానితో డిప్యూటి.ఈ.వో. అయిన కృష్ణయ్య ఆ ఊరికి మకుటం లేని మహారాజుగా చలామణి అయ్యేవాడు. అందునా అతడు రెవిన్యూ డిపార్టుమెంట్ అధికారిగా ఉండటంతోనూ, శ్రీశైలంలోని దుకాణాలు, నివాసగృహాల ఎలాట్ మెంట్లు అతడి చేతిలోనే ఉండటంతోనూ, అతడిమాటకు శ్రీశైలంలో తిరుగులేదు.
మేమూ, మా విద్యార్ధుల తల్లిదండ్రులూ గది కేటాయింపు కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు, చాలా మంది మావారితో “కమ్మవారంటే కృష్ణయ్య సార్ కి చాలా అభిమానం సార్! మన కులం అంటే చాలు వెంటనే పనిచేసిపెడతాడు. వెళ్ళి కలవకూడదా?" అన్నారు. తను “రెడ్డి పిల్లని చేసుకుని, ఇప్పుడు ‘కమ్మవాణ్ణి. నాది కులాభిమానం’ అనటం పద్దతిగా ఉండదు” అని అన్నారు.
మేము, మావిద్యార్ధుల తల్లిదండ్రుల ద్వారా చాలా ప్రయత్నాలు చేశాము. ఎక్కడ సింగిల్ కాటేజ్ ఖాళీగా ఉందని తెలిసినా ప్రయత్నంచేవాళ్ళం. మేమలా దేని గురించి ఆరా తీస్తే ఆ గది/కాటేజ్ వెంటనే ఎవరికో ఒకరికి ఎలాట్ అయిపోయేది. ఆదేవిషయం ‘రూమ్ ఖాళీ ఉంటే ఎలాట్ చేయిస్తాం’ అని మాతో అన్న వాళ్ళని అడిగితే, ‘అది ఎప్పుడో ఫలానా వాళ్ళకి ఎలాట్ అయ్యిపోయిందని అందుకే ఎలాట్ చేయించలేకపోయామని’ చెబుతారు. అలాగని ‘సరే మీరే ఆఫీసులో కనుక్కొని ఏది ఖాళీ అయితే అది ఎలాట్ చేయించండి’ అంటే వాళ్ళు ‘లేదు, లేదు. మీరు ఖాళీ చూసుకోండి, మేము ఎలాట్ చేయిస్తాం’ అని చెప్పేవారు. చాలా ప్రయత్నాల తర్వాత అర్ధం అయ్యింది. అలా వాళ్ళు మమ్మల్ని తమ చుట్టూ తిప్పుకుంటున్నారని. అంతటితో ఆ ప్రయత్నాలు విరమించుకున్నాం. ఈ నేపధ్యంలో ఒక విద్యార్ధి తల్లి రాధిక [ఈమె భర్త ఈవో కి సి.సి.గా పనిచేసేవాడు] చాలా పట్టుబట్టి, ఫైలు పట్టుకుని తిరిగి, మాకు గది ఎలాట్ చేయించింది. నేను రాధికతో కలిసి దేవస్థానపు కార్యాలయానికి వెళ్ళి, కృష్ణయ్యని కలిసి నా కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. గది కేటాయింపుకు పెట్టుకున్న దరఖాస్తులో మేము ప్రీ స్కూలు మరియు ట్యూషన్ హోం అని పెట్టుకున్నాం. అతడది రిఫర్ చేసాడు. నేను మరోసారి కృతఙ్ఞతలు చెప్పుకోగా “నాకెందుకు చెబుతారమ్మా! ఈ అమ్మాయికి [రాధికని చూపిస్తూ] చెప్పండి. మీ ఫైలు పట్టుకుని మూడునెలలు తిరిగింది.” అన్నాడు. అతడి దగ్గర సాదరంగా వీడ్కొలు తీసుకుని, ఆ మరునాడు మా కృతఙ్ఞతాసూచనగా పళ్ళు పంపించాము. అతడు ఒంటరిగా ఉండేవాడు. భార్య చనిపోయింది. ఒక్కకొడుకు వేరే దేవస్థానంలో పనిచేసేవాడు. అతడికి తిక్క అనీ, ఎవరిమీద ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, అనుగ్రహం వస్తుందో ఎవరూ చెప్పలేరనీ ఊళ్ళో అంతా అనేవాళ్ళు. అందుచేతనే రాధిక రూం ఎలాట్ అయినప్పుడు అతడిదగ్గరికి తీసుకెళ్ళటానికి సంశయించింది. తరువాత నా ఒత్తిడి మీద తీసికెళ్ళింది. అతడి డీల్ చూసి బయటకి వచ్చిన తరువాత చాలా చాలా ఆశ్చర్యపోయింది. ‘అతడు అంత సౌమ్యంగా మాట్లాడడని అందుకే తను నన్ను తీసుకెళ్ళటానికి సంశయించానని’ అన్నది. అందువలన మేం ‘అసలే మనరోజులు బాగాలేదు. ఎందుకొచ్చింది’ అన్నట్లు అతడు దూరంలో ఉండగానే ప్రక్కకు పోయేవాళ్ళం. ఎప్పుడైనా ఎదురుపడితే విష్ చేసి తప్పుకునే దాన్ని.
మాకు చల్లా వెంకయ్య సత్రంలో గది కేటాయింపు వచ్చిన తరువాత, అదే సత్రంలో గ్రౌండ్ ఫ్లోరులో అప్పటివరకూ ఉన్న ఇతరులకి బదిలీలు, వేరే కాటేజీల కేటాయింపులూ జరిగి, ఆయా గదులలోనికి కొత్తవారు ప్రవేశించారు. అయితే ఈసారి అందులో కేటాయింపు పొందిన వారంతా కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేసే అటెండరు, తోటమాలి వంటి నాల్గవ తరగతి ఉద్యోగులు. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కూడా ఉండేవాడు. ‘ఎవరైతేనేం అందరం ఒకచోట ఉండేవాళ్ళమే కదా’ అన్నట్లు మేము అందరితో స్నేహంగా ఉండేవాళ్ళం. అయితే వీరి రాకతో ఒక్కసారిగా వెంకయ్య సత్రం రూపురేఖలే మారిపోయాయి. కోళ్ళ పెంపకం, తడికల బిగింపుడు, తక్కువస్థాయి భాషాకూడా సత్రంలోకి ప్రవేశించాయి. వారిలో సెక్యూరిటి గార్డు భార్య తన పిల్లలకి మాస్కూలులో అడ్మిషన్ అడిగింది. ఆవిడ, వాళ్ళకి ఒంటిపైన దుస్తులు ఉంచుకోవటం కూడా నేర్పలేదు. మాటలూ నేర్పలేదు. ఐదేళ్ళు వయస్సు వచ్చినా అమ్మా, నాన్న వంటి రెండు అక్షరాల మాటలు తప్ప పెద్దగా ఏవీరావు. నగ్నంగా ఆదిమానవుల్లాగా తిరిగుతూ, టార్జాన్ లాగా అరుస్తూ ఉండేవాళ్ళు.[ఇది అతిశయోక్తి కాదండి] అప్పటికే మా స్కూలులో ఫీజు ఎక్కువ కారణంగా, ఆఊరిలో పైస్థాయి వాళ్ళ పిల్లలే ఎక్కువగా ఉండేవాళ్ళు. లంచ్ అవర్లో, ప్రక్కవారి టిఫిన్ డబ్బాలో ఏముంది అన్న ఆసక్తితో కూడా చూచేవాళ్ళుకాదు. అంతహుందా ప్రవర్తన ఉండేది. వీళ్ళు చూస్తే పరిశుభ్రతతోనే మనల్ని చంపేసేలాగున్నారు. ఆవిడ అడ్మిషన్ అడిగినప్పుడు నేను ప్రశాంతంగా మా స్కూలు ఫీజు, పుస్తకాలకి అయ్యేఖర్చు వివరించి ‘ఇక నిర్ణయం మీదే’ అన్నట్లు చెప్పాను. ఆవిడ కొన్ని నెలలు గమ్మున ఉంది. ఇంతలో స్కూల్లో విద్యార్ధులు పెరగడంతో చోటు ఇరుకైపోయింది. మేడమీద గది కాబట్టి Extend చేసుకోగల అవకాశం లేదయ్యె. కొన్ని నెలల తర్వాత ఆవిడ మళ్ళీ నన్ను అడ్మిషన్ అడిగినప్పుడు నేను నవ్వుతూ “ముందు మీ పిల్లలకి ఒంటి మీద బట్టలు ఉంచుకోవటం నేర్పండి. తర్వాత స్కూల్లో చేరుద్దురు గాని” అన్నాను. ఆవిడ పెద్ద గొంతుతో “మా పిల్లలు ఉంచుకోరు మేడాం! అదీ నువ్వే నేర్పాలి” అంది. నేను నవ్వేస్తూ “ఇంక నేను స్కూలు మూసుకోవాల్సిందే” అన్నాను. తర్వాత ఇది పైకారణంగా పెట్టుకుని ఆవిడ మమ్మల్ని ఎంత వేధించిందంటే – మంచినీళ్ళు రానివ్వకపోవటం ఒక్కటేకాదు, స్కూటర్ క్రిందిప్లోరు పోర్టికోలో పార్కు చేస్తే పిల్లలు ఎక్కి సీటు కవర్ చించటం, బ్రేకులు తొక్కి పాడుచేయటం, ఇదేమిటమ్మా అంటే, అయితే స్కూటర్ తీసికెళ్ళి నీ ఇంటి ముందు [మేడమీద] పెట్టుకొమ్మని ఆవిడ ‘తనభాషలో’ దెబ్బలాడటం. ఇందులో పరాకాష్ట ఏమిటంటే 2006, డిసెంబరులో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం వచ్చాడు. చాలామంది పోలీసులతో అసాధారణ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం మరి! మా సత్రానికి కూతవేటు దూరంలో గల చెంచులక్ష్మి మ్యూజియం వెనుక సభ జరుగుతుంది. సభావేదిక మా సత్రపు మేడ మీదకి కన్పిస్తోంది. ఉపన్యాసం విన్పిస్తోంది. సరిగ్గా ఆ సమయంలో ఈవిడ నన్ను ‘సరిగ్గా గంటపాటు’ బూతులు తిట్టింది. అప్పటికే అలాంటి అనుభవం సూర్యాపేటలో ఉండటంతోనూ, ఈ వేధింపు దానంతట అది జరగటం లేదనీ, అది నా దురదృష్టమో విధివ్రాతో కాదనీ, రామోజీరావు వీటన్నింటికి కారణమనీ అర్దం అవ్వటంతో నేను ఆవిడ తిట్లనీ, ప్రవర్తననీ మౌనంగా భరించాను. కానీ నాకు అప్పటికి ఇప్పటికి అర్ధం కానిదేమిటంటే – కారణం లేకుండా, ఆవిడ ఆ తిట్టేదేదో మరో సమయంలో కాకుండా, సరిగ్గా రాజశేఖర రెడ్డి వచ్చిన రోజున, ఓ వైపు అతడి మీటింగ్ నడుస్తున్న సమయాన ఎందుకు తిట్టిందన్నది. వాళ్ళ గదినెంబరు 5. ఇలాంటివి నేను ఏకంప్లైట్ లోనూ వ్రాయలేదు. ముందుగానే చెప్పినట్లు భరించగలిగినన్నిటిని భరించాను. అనివార్యమైన, భరించశక్యం కాని వేధింపులనే ఫిర్యాదులకెక్కించాము. వాటిని క్లుప్తంగా చెబుతున్నాను.
ఇక మరోగది, నెంబరు 4 లో ఉండే అటెండరు పేరు రమణయ్య. ఇతడు కృష్ణయ్యకి వ్యక్తిగత సేవకుడు. కృష్ణయ్య ఒంటరి వాడుగనుక, అక్కడి అన్నదాన సత్రాల నుండి అతడికోసం రమణయ్య భోజనం క్యారియర్ తెచ్చేవాడు. అదనంగా అతడి భార్య మరికొన్ని వేపుడు కూరలు, జొన్నరొట్టెలు చేసి పంపేది. ఒకరకంగా అటెండర్ కమ్ కుక్ కమ్ ఇన్ ఫార్మర్ & ఆల్ ఇన్ ఒన్. అందుచేత కృష్ణయ్య వంటవాడిగా అతడు బాగా చలాయించేవాడు. అతడికి మా స్కూలులో చేర్చగల వయస్సు పిల్లలులేరు. ఇతడి భార్య ఓరోజు తన బంధువుల పిల్లలిద్దరికి మా స్కూలులో అడ్మిషన్ అడిగింది. అప్పటికే నాకు ఈ స్థానిక పరిస్థితులు తెలుసు. అప్పటికి మా స్కూలులో ఎవరికీ అడ్మిషన్ ఇచ్చేంత ఖాళీ లేదు. అయినా గానీ వీళ్ళకి నేను ఇవ్వననలేదు. ఖర్చు వివరాలన్నీ చెప్పాను. వాళ్ళకింకా ఏ ఉద్యోగము లేదు, కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం కూడా. నేను “చూడమ్మా. ఫీజంటే నేను ఏదో సర్ధుకుంటాను. కానీ పుస్తకాలు, యూనిఫాం అన్నీ చాలా ఖరీదు. పిల్లల ఖర్చు మీరు అందుకోలేరని నా అభిప్రాయం. ఇక మీఇష్టం” అన్నాను. ఫీజు అంటే రాయితీ ఇవ్వగలను గానీ పుస్తకాలు, యూనిఫాం మేం కొనివ్వలేం కదా! ఇక ఈ వంటవాడికీ మమ్మల్ని వేధించటానికి పైకారణం పుట్టింది. అప్పట్లో అర్ధం కాలేదు గానీ రెండేళ్ళ పోయాక అనుభవపూర్యకంగా బోధపడింది ఏమిటంటే “వాళ్ళు మనల్ని వేధించేందుకే మనల్ని ఏదో favor అడుగుతారు. మనం చెయ్యలేకపోతే వాళ్ళకి మనల్ని వేధించేందుకు కారణం పుట్టినట్లే. ఒకవేళ మనం వాళ్ళ ఆకాంక్షని నెరవేర్చాం అనుకొండి. ఇక ఆ జాబితా పెరిగిపోతుంది. చివరికి మనం తీర్చలేనంత గొంతెమ్మ కోరిక కోరేవారు. మనం కాదనగానే వాళ్ళకి కారణం పుడుతుంది.”
ఓసారి మా క్రింది అంతస్ధులోని ఓ గృహిణి [ఈవిడ పేరు రెడ్డెమ్మ] నన్ను కొంత డబ్బు ఋణం అడిగింది. నేను సున్నితంగా తిరస్కరించాను. అంతే! మర్నాడు క్రింది ప్లోరులో ఆడుకుంటున్న మా విద్యార్ధుల బంతి వాళ్ళ తోటలో పడి మొక్కలు పాడవుతున్నాయట. పిల్లల్ని తిట్టి తరిమేసింది. ఇక ఆరోజు నుండీ అదో వెత.
మరో సంఘటన – శ్రీశైలంలో రత్నామాచారి అనీ ఓ ఉద్యోగి ఉండేవాడు. మేం 1993 నుండి 1995 వరకూ శ్రీశైలంలో ఉన్న రోజుల్లో వాళ్ళ పిల్లలిద్దరికి ట్యూషన్ చెప్పెవాళ్ళం. అప్పట్లో అతడు మాకు చాలా సాయం చేశాడు. మా పాప పుట్టాక ఆసుపత్రి నుండి ఇంటికొచ్చినప్పుడు మా చేతిలో డబ్బులేదు. అతడంతట అతడే మాపాప తలగడ క్రింద డబ్బుపెట్టి “ఖర్చులకి ఉంచండి సార్!” అని చెప్పాడు. ‘ఎంత సాయం చేసాడు అన్నదాని కంటే ఎలాంటి సమయంలో చేశాడు’ అన్నది ముఖ్యం అంటారు. అతడు అలా మాకు సాయం చేశాడు. అతడిపట్ల మాకు చాలా కృతఙ్ఞత ఉండేది. మేం 1995 లో తిరిగి మాఫ్యాక్టరీకి వెళ్ళిపోయాక, నంబూర్లో ఉన్నరోజుల్లో ఆయనకి డబ్బు బ్యాంకు డి.డి.ద్వారా పంపాము. అయితే మేం 2003 లో తిరిగి శ్రీశైలం వచ్చేసరికి, కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది. ఊరి నిండా అప్పులే ఉన్నాయి. 16,000/- రూపాయల జీతం వచ్చేఆయనకి రిటైర్ అయితే కూడా చేతికి డబ్బేమీ రానంత స్థితి అంటే ఇక ఊహించండి. వారి పిల్లల్లో రెండో వాడు రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగం. చివరి వాడికి తప్ప అందరికీ వివాహమయ్యింది. ఈచివరి పిల్లవాడు అప్పట్లో మాదగ్గర 9వ తరగతి చదివాడు. వాడి పెళ్ళిఖర్చుకి కూడా వాళ్ళు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు. మేం అతడు మాకు చేసిన మేలు గుర్తుంచుకుని 2004 లో అప్పటికి మాచేతిలో ఉన్న మొత్తం సొమ్ము [పెద్ద ఎక్కువ కాదులెండి. కొన్నివేల రూపాయలు మాత్రమే.]ని అతడు అడగకుండానే ఇచ్చాము. మా దగ్గర ఇక డబ్బు లేదు. కాకపోతే గ్యారంటీగా స్కూలు ఫీజులు వస్తాయన్న భరోసా మాత్రం ఉంది. ‘మీదగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి, ఫర్వాలేదు’ అని చెప్పాము . అవి రావని మాకు తెలుసు.[అలాగే ఇంతవరకూ వాళ్ళు నాకు డబ్బు తిరిగి ఇవ్వలేదు.] ఎందుకంటే వాళ్ళ అప్పులు మాకు తెలుసు. అతడు అలాగే స్పందించాడు. కాని తర్వాత కాలంలో అతడి భార్య “మీ సంపాదన బాగానే ఉంది గదా! మాకు డబ్బులివ్వవచ్చుకదా” అన్న డిమాండ్ నర్మగర్భంగా చేసేది. మాకా ఇంటి ఫర్నిచర్ మొత్తం కొనుక్కోవలసిన అవసరం ఉండేది. చివరికి ఆవిడ ఎంత దూరం వెళ్ళిందంటే మమ్మల్ని మా పరోక్షంలో నానా తిట్లూ తిట్టటం, మాకు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యటం…… ఇలా చాలా చేసింది. వాళ్ళ మనవడికి రెండేళ్ళు ఫీజు తీసుకోకుండా చదువు చెప్పినందుకు మాకు ఆవిడ చాలా ‘బహుమనాలే’ ఇచ్చింది. ఈవిడ తమ్ముడు ఈనాడు రిపోర్టర్. ఇలాంటి వేధింఫులని సహించగలమే గానీ, ఎవరికీ ఫిర్యాదు కూడా చెయ్యలేం కదా! ఏమైనా అంటే ‘కష్టాల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ బాధలకొద్దీ వాళ్ళు ప్రవర్తిస్తారు’ అంటారు. మనం కష్టాల్లో ఉన్నామని, ఎదుటి వాళ్ళని తిడితే ఎవరు ఊరు కుంటారు చెప్పండి? మన కోపతాపాలని, అరిషడ్వర్గాలని భరించటానికి సమాజం మన డస్ట్ బిన్ కాదు కదా? సూర్యాపేటలోనూ, హైదరాబాదు నానల్ నగర్ లోనూ మేము చాలా కష్టాలే పడ్డాము. పైపెచ్చు మేమే దుర్భాషలు పడ్డాము గానీ ఎవరిని తిట్టలేదు. తిడితే మాత్రం ఎవరూరుకుంటారు? ‘ఊరుకుంటే తిడతారా’ అనవద్దు. తిడితే పడినా, నేను తిట్టను.
కానీ మా విషయంలో మాత్రం ఎదుటివాళ్ళు ఎవరైనా సరే. వాళ్ళకి ఓ గొప్ప క్షమార్హత ఉంటుంది. వాళ్ళు చదువుకోలేదనో [సూర్యాపేటలోని మా ఇంటి ఓనరు లాగా] లేదా కష్టాల్లో ఉన్నారనీ లేదా తక్కువస్థాయి వాళ్ళూ అని.[విచిత్ర మేమంటె మేం ఎక్కడ ఉంటే అక్కడ, చుట్టూ క్రమంగా అలాంటి స్థాయి వాళ్ళే చేరతారు. దాదాపు 2001 నుండి 2007 వరకూ ఇదే స్థితి.] వాళ్ళు మనల్ని నానా తిట్లూ తిడతారు, బూతులతో సహా! మనం మాత్రం ఏమీ అనకూడదు. పొరపాటున ఏదైనా అన్నామా, ఇక చూస్కోండి! ‘మీరు చదువుకున్నవాళ్ళు కాబట్టి ఇలా అనకూడదు’, ’మీరు గీత ప్రాక్టీస్ చేస్తాం అన్నారు కాబట్టి మీకు కోపం రాకూడదు’ - ఇవీ పై అధికారుల నుండి మాకు వచ్చిన స్పందన. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే వాళ్ళే గీతాశ్లోకాలు ఎత్తుతారు, మన నోరు ఊరుకోదు కదా? ‘సార్! నేను గీత ప్రాక్టీసు చేస్తాను’ అంటాను. అంతే! వాళ్ళు అందుకోని ‘ఇంక ప్రైవేట్ చెప్పేస్తారు’ అన్నమాట. సూర్యాపేటలో అయినా, శ్రీశైలంలో అయినా అంతే. నిజానికి గీతలో కూడా – ఒకోసారి గుణాలు ప్రవర్తిల్లుతూ ఉంటాయనీ, మనం ప్రేక్షకుల్లా చూడాల్సిందేననీ చెప్పబడుతుంది. నేను చెయ్యననే నిగ్రహం ఏమీ చేయలేదని చెబుతుంది.
మేం చల్లా వెంకయ్య సత్రంలోకి వచ్చిన తర్వాత AP Transco వారికి యూనిట్ ధర 7/- రూ. కట్టటం వంటి గొడవలు ఒకప్రక్క ఉంటే, 2004 నుండి సరిక్రొత్తగా నీటిసమస్య ఏర్పడింది. కరెంటు సమస్య మా ఒక్కరిదే అయితే, నీటి సమస్య మొదటి అంతస్ధులోని 9 గదుల వారిదీ అయ్యింది. శ్రీశైలం లోయలో కృష్ణానది ప్రవహిస్తోంది. కొండపైకి నీటి సరఫరాకు చక్కని ఏర్పాట్లున్నాయి. మా చుట్టుప్రక్కల అందరికీ రెండుపూటలా OH ట్యాంకులు నిండి, పొంగిపొర్లుతుంటాయి. మా 9 గదులకి మాత్రం ప్రతీరోజూ నీటికి కటకటగా ఉండేది. అయితే ఈ సమస్య సృష్టించబడిన తీరు అత్యంత ఆసక్తి కరంగానూ, సునిశితమైన ఇంజనీరింగ్ ప్రణాళికతోనూ ఉండేది.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
1 comments:
hats off to your patience
Post a Comment