13 ఏప్రియల్, 2006 న సీ.ఎం. రాజశేఖర్ రెడ్డికి, మేము మళ్ళీ ఒక ఫిర్యాదు వ్రాసాము. అంతకు ముందు, మాపాప విషయమై అతడిస్పందనకు కృతఙ్ఞతలు చెబుతూ సి.ఐ.ద్వారా జవాబు స్టేట్ మెంట్ పంపాక, ఫిబ్రవరి 28, 2006 న ఒక ఫిర్యాదు వ్రాసాము. అందులో నీరు, కరెంట్ వేధింఫులే గాక గది ఎలాట్ మెంట్ కాన్సిల్ చేస్తారన్న పుకారులు గురించీ, ఫణిధర ప్రసాద్[దేవస్థానం ఉద్యోగి] తన రెండవభార్యకు మా సత్రపు ఆవరణలో విడిగా ఉన్న కాటేజ్ ని పొంది, దేవస్థానపు mesh గట్రాలతో Extend చేస్తున్న విషయం గురించి, అతడి పేరిట మాపై నడుస్తున్న వేధింపుల గురించి కూడా వ్రాసాము. దానికి స్పందనలేనందున ఏప్రియల్ 13, 2006 న మరో ఫిర్యాదువ్రాసామన్న మాట. ఈ ఫిర్యాదులో [Fire Pot లో ఉంది ]తెలుగులో స్పష్టంగా

"శ్రీశైలంలో మా పరిస్థితికి, సూర్యాపేటలో 2001 లో మేం ఎంసెట్ మీద కంప్లైంట్ ఇచ్చిన తదుపరి organized harassment నేపధ్యంలో, ఒక చికెన్ కొట్టుదాన్ని[మా ఇంటి యజమాని] అదీ గతంలో పనిమనిషిగా పనిచేసిన ’చరిత్ర’ ఉన్న స్త్రీని ఆ జిల్లా ఎస్.పి. గానీ, ఆ ఊరి డి.యస్.పి.గానీ, సి.ఐ.లుగానీ, స్థానిక తెలుగుదేశం పార్టీ లీడర్లు గానీ, కాంగ్రెసు లీడర్లు గానీ, స్వయంగా తిరుగుబాటు ఎం.ఎల్.ఏ.లనీ నిలబెట్టి గెలిపించగల కింగ్ మేకర్ మీలా సత్యనారాయణ లాంటి పెద్దలు గానీ కాంట్రోల్ చేయలేకపోయిన పరిస్థితికి సారూప్యత కన్పిస్తోంది.

After all ‘ఎంసెట్’మీద కంప్లైట్ చేసినందుకు ఇంతగా వేధించబడతామని ఎవరూ అనుకోరు. గత ముఖ్యమంత్రి Mr.చంద్రబాబు నాయుడు ఏం ఆశించి మమ్మల్ని అలా వేధించాడో అతనికే తెలియాలి. ఏం ఆశించి మీరు ఆ వేధింపుని కొనసాగిస్తున్నారో మీకే తెలియాలి. లేదా ఇవన్నీ చూస్తున్న భగవంతుడికి తెలియాలి. నా దగ్గర మాత్రం మీరు వేధించి, శోధించి తెలుసుకోవలసిన ‘గండికోట రహస్యాలు’ ఏమి లేవు. ‘1992లో ఈనాడు రామోజీరావు మీద, రాజీవ్ గాంధీ హత్య విషయంపై అప్పటి ప్రధాన మంత్రి శ్రీ పి.వి.నరసింహారావు గారికి కంప్లైంట్ చేశాననీ, అది immature అనుకోండి, ఉడుకురక్తం అనుకోండి లేదా దేశభక్తి అనుకోండి, ఆనాటి నుండి life miserable అయిపోయిందనీ’, స్వయంగా నేను, సాక్షాత్తు మీకే, 21March, 2001 న మీ ఇంట్లో కలిసినప్పుడు చెప్పాను. అప్పుడు మీరు శ్రీ మీలా సత్యనారాయణకి రికమెండేషన్ లెటర్ ఇస్తాననీ, ప్రతిపక్షంలో ఉన్నందున అంతకంటే ఇంకేం చేయలేనని చెప్పారు. అది మీకు గుర్తుందో లేదో గానీ నా దగ్గర మాత్రం మీరంతా వేధించి శోధించి తెలుసుకోవలసిన రహస్యాలు ఏమీ లేవు.

మరి మీరు ఏం ఆశించి ఇదంతా చేస్తూన్నారని నా సూటి ప్రశ్న?"

అప్పటికి 2006 మే వచ్చింది. అప్పటికీ, ఢిల్లీలో ప్రధానికి ఇచ్చిన ఫిర్యాదు తాలూకూ ఏ స్పందనా మాకు రాకపోవటంతో మేము ప్రధానికి 2005 అక్టోబరులో ఇచ్చిన ఫిర్యాదునే కవరింగ్ లెటర్ జతపర్చి, సోనియాగాంధీకి పంపాము. ఈ ఫిర్యాదుని ఏప్రియల్ 2006 లోనే వ్రాసినా, రెండుమూడు వారాల తర్వాత శ్రీశైలం నుండి మార్కాపురం [100 K.M.] రామదాసు సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు స్పీడ్ పోస్ట్ లో పంపించాము. ఒకవేళ మా ఫిర్యాదులు పోస్టల్ మిస్ అవుతున్నాయోమోననే అనుమానం కొద్దీ కూడా అలా చేశాము. ఎందుకంటే, ఈ Postal missing లేక Postal Theft అనే అనుభవాలు మాకు సూర్యాపేటలోనే తెలుసుగనుక.

దీనికి స్పందన మాత్రం, కాగితం రూపంలో కాకుండా, అనూహ్యంగా వాస్తవరూపంలో వచ్చింది. 2006 , జూన్ 6న మా స్కూలు రి ఓపెన్ రోజు పెట్టుకున్నాము. సహజంగానే వేసవి సెలవుల అనంతరం స్కూలు తెరిచే రోజు బాగా హడావుడిగా ఉంది. ఆరోజు మాకింకా పేపరు రాలేదు. అంతలో మా స్కూలు విద్యార్ధినుల తండ్రి ఒకరు వచ్చి “మేడం! ఈనాడు చూశారా? అందులో మీ స్కూలు [గీతపబ్లిక్ స్కూలు] పేరు వచ్చింది. మీకు రాష్ట్రప్రభుత్వ అనుమతి లేదంట గదా! [ఆ విషయం వీళ్ళకి ముందే తెలుసు. మేమే చెప్పిమరీ అడ్మిషన్లు ఇచ్చాం, ఎవ్వరికి టి.సి.లు ఇవ్వలేమని కూడా చెప్పాము.] అంచేత స్కూలు నడిపితే డి.ఇ.వో.[విద్యాశాఖ] చర్యలు తీసుకుంటాడట” అన్నాడు. మాకు విషయం అర్ధంకాకపోయినా ‘మరో అంకానికి తెర లేస్తోందన్న మాట. మరోవేధింపుకు మనం సిద్దపడాలి. కానీయ్!’ అనుకున్నాము. “మాకింకా పేపర్ రాలేదండి. అయినా ఏముంది పేపరులో?" అన్నాను. అతడు అయితే పేపరు తెస్తానంటూ పోయి పేపరు తెచ్చాడు. ఈ లోపున మాకూ పేపరు వచ్చింది. మేమూ ఈనాడు వేయించుకునేవాళ్ళం. చూస్తే కర్నూలు జిల్లా ఎడిషన్ లో, జిల్లావ్యాప్తంగా 290 పాఠశాలలకు గుర్తింపులేదనీ, గుర్తింపు లేనిదే స్కూలు నడపకూడదని, నడిపితే డి.ఇ.వో.తీసుకోబోయే న్యాయపర, చట్టపర చర్యలకు గురికావలసి ఉంటుందనీ ప్రచురించి ఉంది. 290 జాబితాలో మా స్కూలు ఉంది. అంతేకాదు శ్రీశైలంలోని మిగిలిన ప్రైవేటు స్కూళ్ళకు కూడా గుర్తింపు లేదు. అయితే వాటన్నిటి కంటే గలాభా మాస్కూలు గురించే జరిగింది. దాంతో మేం “మాకు ఉందే 60 మంది విద్యార్ధులు. అంతకంటే ఎక్కువమందిని చేర్చుకునేందుకు కూడా అవకాశమూ లేదు, చోటూ లేదు. అందులో దాదాపు 30 మంది నర్సరీ, ఎల్.కె.జి., యూ.కె.జి. విద్యార్ధులే. సరే! ప్రభుత్వ అనుమతి, తొక్కా, అంటే మేం మొత్తం జీరో క్లాసు విద్యార్ధుల్నే తీసుకుంటాం. ఇక 1 నుండి 5 వతరగతి కూడా చెప్పము. కాబట్టి మీరు మీ చిన్నపాపని మాదగ్గర చదివించుకోవచ్చు. మీ పెద్ద పాప రెండవతరగతికి వస్తుంది కాబట్టి ఆమెని వేరే స్కూల్లో చేర్చుకోవలసిన వస్తుంది” అన్నాము. ఇదంతా ఆ చిన్న ఊళ్ళో పెద్దకలకలం రేపింది.

ఇంతలో మా విద్యార్ధుల తండ్రి ఒకరు మరో సలహా ఇచ్చారు. ఇతణ్ణి ఈనాడు శివ అని పిలుస్తారు. ఎందుకంటే అతడు శ్రీశైలంలో ఈనాడు పేపరుకు ఏజంటు. అంతేకాదు. అప్పడప్పుడూ హైదరాబాదు ఈనాడు ఆఫీసుకీ, RFC కీ వెళ్ళి వస్తాడనీ, ప్రతీ సంవత్సరం ఈనాడు జర్నలిజం స్కూలు వాళ్ళు శ్రీశైలం ప్రాజెక్ట్ స్టడీ కోసం వచ్చినప్పుడు వసతి సౌకర్యాలన్నింటిని పర్యవేక్షిస్తాడనీ, కాలక్రమంలో మాకు తెలుసు. ఇతడి రికమెండేషన్ మీద RFC లో కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయనీ, ఈనాడు ఎం.డి. కిరణ్ ఒకసారి శ్రీశైలం వచ్చినప్పుడు తనే దగ్గరుండి మల్లయ్య స్వామి దర్శనం చేయించానని అతడే చెప్పుకున్నాడు.

ఇతడిచ్చిన సలహా ఏమిటంటే – “సార్! మీరు జీరో క్లాసులకి పరిమితం కావటం ఎందుకు? అలా చేస్తే నేనిప్పుడు నా ఇద్దరు కొడుకుల్నీ ఇంకెక్కడో చేర్చుకోవాలి. వేరే స్కూళ్ళు పెద్దవి కావచ్చు, గొప్పగా ఉండొచ్చు. కానీ మీలాగా ఎవరూ ప్రవర్తన దిద్దుతూ చదువుచెప్పరు. అందుచేత మేమే తల్లిదండ్రులుగా ఈ స్కూలుకి ప్రభుత్వగుర్తింపు లేకపోయినా, మా ఇష్టపూర్తిగా మేమే, మంచి చదువు కోసం మీదగ్గర ట్యూషన్ చదివించు కుంటున్నామని వ్రాసి ఇస్తాం. అప్పుడు ఏ గొడవా ఉండదు కదా!” అన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న మరికొందరు తల్లిదండ్రులు కూడా దాన్ని సమర్ధించారు. పేపరులో ప్రకటన, ఆమీదట కలకలం రీత్యా, ఆరోజే స్కూలు రీఓపెన్ అవటం రీత్యా, అప్పుడక్కడ చాలామందే ఉన్నారు. దాంతో అందరూ తలోమాటా అంటూ చర్చించారు. అంతా అయ్యాక మేం తెలుగులో ఓ Pro-forma తయారు చేసి కంప్యూటర్ టైపింగ్ చేయించాము. అందులో విద్యార్ధి వివరాలు, తల్లిదండ్రులు వివరాలు వ్రాసి, మా స్కూలుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదనీ, తమకి ఇష్టమై, మంచి క్రమశిక్షణాయుత విద్య కోసమై స్వచ్ఛందగా మాదగ్గర చదివించుకుంటున్నామని వ్రాసిన నోట్ క్రింద తల్లిదండ్రుల సంతకాలు తీసుకుని ఫైల్ చేసుకున్నాము. దాంతో ఎంత ఉవ్వెత్తున కలకలం రేగిందో, అంతే స్థాయిలో అది సమసి పోయింది. శ్రీశైలంలో మిగిలిన స్కూళ్ళల్లో ఈ విషయమై ఏంజరిగిందో మాకు తెలియదు. మళ్ళీ మా స్కూలు, మా విద్యార్ధులు, చదువులు, క్లాసుల హడావుడిలో పడిపోయాము.


అయితే క్రింది అంతస్థులోని వాళ్ళు ఏదో నెపాన మామీద మాటల దాడి మానలేదు. అప్పటికి నీటి గొడవ మీద పోలీసు కంప్లైంట్ దాకా పోవటం, ఆ తర్వాత రెండు అంతస్థులకీ ఒకే నీటి ట్యాంకు ఉంచటంతో నీటి యుద్ధాలు ఆగిపోయాయి. దాంతో ఈసారి మరో కొత్త సమస్య లేవనెత్తారు. అదీ హఠాత్తుగా! ఓరోజు సాయంత్రం ట్యూషన్ సమయంలో జీరో క్లాసు పిల్లలు యూరినల్ కోసం వెళ్ళారు. రమణయ్య భార్య ఓచిన్న పాటి కర్ర తీసుకుని పసిపిల్లల్ని పెద్దగా తిడుతూ, కొట్టవచ్చింది. పిల్లలంతా భయంతో వెనక్కి పరుగెత్తుకొచ్చారు. చల్లా వెంకయ్య సత్రం ఆవరణ చాలా పెద్దది. ఆ సత్రంలోని ఇళ్ళల్లోని చిన్నపిల్లలు సత్రపు ప్రహరి దగ్గరే ప్రకృతి అవసరాలు తీర్చుకుంటారు. మా స్కూలు జీరోక్లాసు పిల్లలు 30 మంది అక్కడే యూరినల్ కు వెళతారు. పెద్దపిల్లలు రోడ్డు దాటి తుప్పలదగ్గరకు వెళతారు. మా సత్రం ముందు రోడ్ ఏటవాలుగా ఉన్నందున, స్పీడ్ బ్రేకరు లాంటిది కూడా లేనందున మూడునాలుగేళ్ళ జీరోక్లాసు పిల్లల్ని బయటికి పంపించము. అందుచేత వాళ్ళు ప్రహారీ గోడ దగ్గరికే యూరినల్ కు వెళ్ళటం అప్పటికి మూడేళ్ళుగా ఉన్న అలవాటు. అదీ అక్కడ మట్టి, రాళ్ళు, గడ్డిమొక్కలు ఉంటాయి. దుర్వాసన వంటి ఇబ్బందులు ఉండేవి కావు. అయితే హఠాత్తుగా రమణయ్య భార్యకూ, సెక్యూరిటి గార్డు భార్యకూ అక్కడ దుర్వాసన సమస్య వచ్చిందట. దాంతో పిల్లల్ని నేను మా ఇంట్లో టాయిలెట్ లోకి పంపాలంటూ బూతులు లంకించుకున్నారు. నేను జవాబివ్వకుండా పిల్లల్ని పెద్దపిల్లల తోడుతో రోడ్ మీదకి పంపాను.

ఈ లోపున ట్యూషన్ అయిపోయే సమయం అయ్యింది. పిల్లల్ని తీసికెళ్ళటానికి దాదాపు 20 మంది దాకా తల్లిదండ్రులు వచ్చారు. మాదగ్గర ఒక ASI, ముగ్గురు కానిస్టేబుళ్ళ పిల్లలు చదువుతున్నారు. వారిలో ఇద్దరు కానిస్టేబుళ్ళు మా ఎదురు వీధిలోనే ఉంటారు. ఆరోజు పిల్లల్ని తీసికెళ్ళేందుకు ASI, మరో కానిస్టేబుల్ కూడా వచ్చారు. నేను అందరు తల్లిదండ్రులతో సమస్య చెప్పి “రోజుకి కనీసం నాలుగుసార్లు ఈ చిన్న పిల్లలు యూరిన్ కి అడుగుతారు. ఇంత చిన్న వాళ్ళని రోడ్ మీదకి ఎలా పంపగలం చెప్పండి. ఇంటికి పంపడానికే పెద్దవాళ్ళు వచ్చేదాకా పంపను. పిల్లలంతా వెళ్ళిపోయేదాకా ప్రతీరోజు పర్యవేక్షిస్తుంటాను. మీరు చూస్తునే ఉన్నారు కదా! ఇప్పుడు వీళ్ళు ఇలా గొడవ పెడుతున్నారు. మొన్నటిదాకా నీళ్ళదగ్గర వేధించారు. ఇప్పుడు ఇది. ఏం చెయ్యాలి చెప్పండి” అన్నాను. చిత్రమేమిటంటే పోలీసులు ఇద్దరు దూరంగా వెళ్ళి చాలా సేపు చర్చించుకుని వచ్చారు. ఇంతలో ఇతర విద్యార్ధుల తల్లిదండ్రులు కొందరు క్రింది అంతస్థువాళ్ళతో గట్టిగా గొడవపడ్డారు. దాంతో వాళ్ళు వెనక్కి తగ్గి, "చిన్నపిల్లల్ని రోడ్ మీదకు పంపమని ఎలా గంటాం? మాకూ చిన్న పిల్లలున్నారు. మేం పెద్దపిల్లల్ని ఇక్కడ పోయవద్దన్నాం” అంటూ గొడవ వెనక్కి తీసుకున్నారు. నిజానికి అది పచ్చి అబద్ధం. పెద్ద పిల్లలెవరూ సత్రపు ఆవరణలో ప్రకృతి అవసరం తీర్చుకోరు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే మా సత్రపు ఆవరణలో నివాస భవనం [రెండతస్థుల బిల్డింగ్] వెనకాల పెద్ద డ్రైనేజి మురుగు ఉంది. చిన్నపాటి మురుగునీటి కొలను లాగా ఉంటుంది. క్రింది అంతస్థుల వాళ్ళకు దుర్వాసనా, దోమల బెడదా చాలా ఎక్కువ . అది వాళ్ళకు ఏమాత్రం పట్టలేదు. ఇలాంటి వేధింపులతో మాకు విషయం బాగానే అర్ధం అయ్యింది.

ఇందులో మరింత విచిత్రం ఏమిటంటే – మా విద్యార్ధుల తల్లిదండ్రుల్లో నలుగురు పోలీసులున్నారు. వారిలో ఒకరు ASI కూడా. ఒక్కొక్కరి ఇంటి నుండి దాదాపు ఇద్దరేసి విద్యార్ధులున్నారు మా స్కూల్లో. అందరికి దాదాపు చిన్నపిల్లలున్నారు. అయినా గాని ఒక్కరంటే ఒక్కపోలీసు ఈ విషయంలో మాకు ఏసహాయమూ చెయ్యలేకపోయారు. అందుకు వాళ్ళు చెప్పిన కారణం మరింత విచిత్రమైనదీ, ఆసక్తికరమైనది. తాము వాళ్ళని నియంత్రించబోతే రమణయ్య [ఇతడు దేవస్థానం డి.ఇ.వో. కి వంటవాడు. కాంట్రాక్టు లేబరు, అటెండర్ స్థాయి ఉద్యోగి] “ఏంసార్! మా ఆడవాళ్ళ మీద మీరు పోలీసు జులుం చెలాయిస్తున్నారని మేం కేసుపెడితే మీగతి ఏమవుతుంది?” అని బెదిరించాడట. దాంతో తాము వెనక్కి తగ్గక తప్పలేదని సదరు పోలీసులు చెప్పారు. రమణయ్య వంటి చదువురాని నాల్గవతరగతి కాంట్రాక్టు ఉద్యోగి ‘పెట్టబోయే’ కంప్లైంటుకి భయపడిపోయిన పోలీసులు, చదువుకున్న, వాళ్ళ పిల్లలకి టీచర్లమైన మేము ’పెట్టిన’ కంప్లయింట్లను పట్టించుకోను కూడా లేదు. అదీ విచిత్రం!

అయితే దీనికి మేము ఆశ్చర్యపోలేదు. అప్పటికీ [అంటే అక్టోబరు 2005 నుండి జూలై 2006 వరకూ] జరిగిన, జరుగుతున్న సంఘటనలన్నింటిని పరిశీలిస్తూనే ఉన్నాము. 1995 నుండీ 2005 వరకూ దేశరాజకీయాల్లో జరిగిన వాటిని [పత్రికల్లో యధాలాపంగా చదివినవీ, టీవీల్లో చూపినవీ] గుర్తుతెచ్చుకున్నాము. పాతపత్రికలు, సమీక్షలు, మిత్రులతో చర్చలూ మొదలైన మార్గాల్లో సోనియాగాంధీ రాజకీయప్రవేశ సంవత్సరం వంటి విషయాలు సేకరించాము. అదే సమయంలో AICC అంతర్గత వ్యవహారాలపై రివ్యూ వ్యాసాలు కొన్ని వివిధ పత్రికల్లో చదవటం తటస్థించింది. మొత్తానికి 1995 నుండి 2005 వరకూ మేం పట్టించుకోని రాజకీయ వ్యవహారాలని మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేసి ఎంతోకొంత సఫలీకృతం అయ్యాము.

వీటన్నిటి నేపధ్యంలో ఏం జరుగుతుందో మాకు బాగానే అర్ధం అయ్యింది. మమ్మల్ని సూర్యాపేటలో గానీ, హైదరాబాదు లోగానీ, ఇప్పుడు శ్రీశైలంలో గాని వేధిస్తున్నది – పైకి ఎవరు కనపడనీయండి, ఏకారణం చూపెట్టబడనీయండి, వెనక ఉన్నది మాత్రం రామోజీరావు అన్నవిషయం చాలా స్పష్టపడింది. అతడికీ, చంద్రబాబునాయుడికీ సంబంధం ఉండటం అందరికీ తెలిసిందే. కానీ అతడికీ, AICC అధ్యక్షురాలికీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రికీ సంబంధం ఉండటం అప్పటికి నిగూఢమైనది. ‘మేం సోనియాగాంధీకి ఫిర్యాదు చేయగానే సమస్యలు పరిష్కరింపబడకపోగా, వేధింపు తీవ్రత పెరగటంలోని అంతరార్ధం ఏమిటి? తన భర్త హత్యోదంతం, భారత్ పై గూఢచర్య కార్యకలాపాలలో రామోజీరావు పాత్ర గురించి మనం వివరాలు అందిస్తే ఈవిడ ఏమాత్రం ఎందుకు స్పందించటం లేదు? పైపెచ్చు వేధింపుపెరుగుతుందేమిటి? ఈనాడు రామోజీరావు తాను కాంగ్రెస్ వ్యతిరేకిని, కులపక్షపాతిని అంటాడు. మరి సోనియాగాంధీని అసలు విమర్శించడేం?’ ఇలాంటివన్నీ మాకు ఎంతో సందేహాస్పదంగా కనబడ్డాయి. ఇక అప్పటి నుండీ, మాస్కూలు పనికి సమాంతరంగా, నిరంతరం, వర్తమాన పరిశీలన, విశ్లేషణ చేశాము. దాదాపు రాత్రి ఒంటిగంటవరకూ మేలుకునేవాళ్ళం.

అయితే బెంగపడటం మాత్రం వదీలేసాం. సూర్యాపేటలో, హైదరాబాదులో బాధలు పడుతున్నప్పుడు చాలాసార్లు దుఃఖపడ్డాను. అప్పడంతా అది విధివ్రాత అనీ, అప్పటికి కనపడుతున్న కారణాలనీ నమ్మేవాళ్ళం. అయితే ఇప్పుడు అది విధివ్రాత కాదనీ, పైకి కనబడుతున్నవి over leaf reasons మాత్రమేనని, అంతర్గత కారణం రామోజీరావనీ అర్ధం అయినాక మాలో బెంగా,దుఃఖం స్థానే ధైర్యం, తెగింపు నిండాయి. భగవద్గీతలో అర్జునుడు

శ్లోకం:
నష్టో మోహఃస్మృతిర్లబ్ధా త్వత్ర్పసాదాన్మయా చ్యుత
స్థితో స్మి గతసందేహః కరిష్యే వచనం తవ

భావం:
కృష్ణా! నీ దయవలన నా అఙ్ఞానం తీరింది. సందేహం నశించింది. ఆత్మస్మృతి కలిగింది. ఇప్పుడు నువ్వేం చెబితే అది [యుద్ధం] చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను.
అంటాడు.

అలాగే అప్పటి వరకూ మేము పడుతున్నకష్టాలకి కారణాలు తెలియవు. అంతఃచ్ఛేతన, ‘ఉన్న పరిస్థితికి పైకారణాలని’ [over leaf reason] ఒప్పుకోదు. అలాగని ఇంకే కారణాలు కన్పించలేదు. భగవంతుడి దయ మాపట్ల ఇలాగుందే అన్న బాధ! తెలిసికాని, తెలియక గాని నేను ఏప్రాణికి కూడా హాని చేయలేదు. ఎవరికయినా మంచే చేసాను గాని, కీడు చెయ్యలేదు. మరి నేనెందుకు ఈ బాధలు పడుతున్నానో అర్ధం కాలేదు. ఎప్పడయితే కారణం అర్ధమయిందో, మనస్సుకు ఒక్కసారిగా సత్యం తాలూకూ శక్తి వచ్చింది.

ఇక్కడ ఒక విషయం చెప్తాను. భారతీయులు, బ్రిటిష్ వారితో పోరాటానికి వాళ్ళకి ఎదురుగా శత్రువు కన్పించాడు. తమ శక్తియుక్తులన్ని ఆ శత్రువును ఎదుర్కోటానికి ఉపయోగించారు. కాబట్టే విజయం సాధించగలిగారు. అదే స్వాతంత్రం తరువాత ఈ నకిలీ కణికుడి వ్యవస్థ [మీడియా, రాజకీయనాయకులు, కార్పోరేట్ వ్యాపార సంస్థలు] మనల్ని ఎంతసేపటికి అసత్య ప్రచారం లేదా సూడో విలువల మీద జీవింపజేయాలని ప్రయత్నిస్తుంది. వాటిని ఎదుర్కోటానికే మన ఆత్మశక్తి ఖర్చువుతున్నది. సత్యాన్వేషణ చేయనివ్వకుండా, ఈ నకిలీ కణికుడి వ్యవస్థ, మనల్ని మన బతుకుపోరాటంలోనే ఉంచుతుంది. రేపు ఎట్లా అన్నదే మన ప్రశ్న అయ్యి కూర్చుంటుంది.

"యుద్దంలో సైనికుడు శత్రు బలాన్ని చూసి భయపడడూ, బెంగపడడూ. దుఃఖపడడు. అధైర్యపడడు. అందునా భారతీయుడు అలా చేయడు. ఎందుకంటే ఈ దేశం కోసం ఎందరో మహానుభావులు తమ రక్తం ధారపోసారు. తరువాత తరాల కోసం స్పూర్తి ని రగిలించి పోయారు. యుద్దంలో సైనికుడు శత్రు బలాన్ని చూసి భయపడితే, దుఃఖపడితే భారత మాతని, భారతీయతని, యావద్భారత దేశాన్ని అవమానించినట్లే. అలాంటప్పుడు మనం మాత్రం ఈ సి.ఐ.ఏ. ఏజంట్లనీ, ఐ.ఎస్.ఐ. ఏజంట్లనీ చూసి భయపడటం ఎందుకు? అది చెయ్యరాని పని. ఈ ఇటలీ స్త్రీని, RFC వ్యక్తినీ చూసి భయపడటం కంటే అవమానం లేదు” అని అన్పించింది. అంతే! అప్పటి నుండి ఎన్ని వేధింపులు ఎదురైనా మేం వెనక్కి తగ్గింది లేదు, ఫిర్యాదులు ఆపిందీ లేదు.

ఆడ్మినిస్ట్రేషన్ తో కూడిన యుద్ధాన్ని కొనసాగిస్తూనే పోయాము. ఠాగూర్ సినిమాలో చిరంజీవి, శివాజీ సినిమాలో రజనీకాంత్ అంటారు “ఈ దేశంలో ఏమూలనైనా ఏ కొంచెమైనా న్యాయం ఉంటుంది. దాన్ని వెదికి తీస్తాను” అని. దాదాపు అదేస్థాయిలో న్యాయం కోసం రాజ్యాంగ పరంగా, అడ్మినిస్ట్రేషన్ సాక్షిగా మేం చెయ్యని ప్రయత్నం లేదు, తట్టని తలుపు లేదు. అయితే వచ్చిన ఫలితం కూడా ఏమీలేదు. అంటే ఈదేశంలో ఏమూలన, ఏ కొంచెం కూడా న్యాయం లేదు అనుకోవాలేమో! ఠాగూర్, శివాజీ సినిమాల్లో కూడా, పాపం చిరంజీవి, రజనీకాంత్ లకు కూడా ఏ ఫలితం రాదు గదా! దాంతో దెబ్బకి ఒకరు AFC అంటూ హింసాత్మక తిరుగుబాటు లేవదీస్తే, మరొకరు బ్లాక్ మనీ మీద దాడి చేసారు. [ఆ సినిమాల్లో ఆమొత్తం వ్యవహారాలు లొసుగులమయం అనుకొండి.] అది సినిమా కాబట్టి, వాళ్ళు హీరోలు కాబట్టి అది సాధ్యం. మనలాంటి సామాన్యులకి అది అసాధ్యం కదా! అసాధ్యమే కాదు, అవి చెయ్యరాని పనులు, తొక్కరాని బాట కూడా! అంచేత మేము అడ్మినిస్ట్రేషన్ యుద్దాన్నే కొనసాగించాము.

మేం కొనసాగించిన అడ్మినిస్ట్రేషన్ యుద్దాన్ని వివరించేముందు, మీకు మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా సందేహాలు వచ్చి ఉండాలి. వాటిని నివృత్తి చేయటానికి కూడా నేనీ వివరాలు మీకు చెప్పవలసి ఉంటుంది. మీకు సందేహాలు వచ్చి ఉంటాయని నేను ఎలా చెప్పాగలనంటే, ఎన్నో సందేహాలు మాకు కూడా 2005, 2006 లలో వచ్చాయి గనుక, కాలక్రమంలో అవి మాకు కొంత నివృత్తి అయ్యాయి గనుక.

సరే! ఈ ఉపొద్ఘాతం ఆపి అసలు విషయానికి వస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

ఈ నకిలీ కణికుడి వ్యవస్థ, మనల్ని మన బతుకుపోరాటంలోనే ఉంచుతుంది. రేపు ఎట్లా అన్నదే మన ప్రశ్న అయ్యి కూర్చుంటుంది.
వేయి పడగలు ఒక బ్రాహ్మణుడి కధ ఉంటుంది మీకు గుర్తుందా.

కోట గోడ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న బ్రాహ్మణుడిని కృష్ణమనాయుడు నిలదీస్తే సరైన రాజు లేక ఇలా అయిపోయాను అన్నాడట. దాంతో కృష్ణమనాయుడు సత్రంలో వసతి కల్పిస్తాడు. కొన్నాళ్ళ తరువాత షికారు కు వెళ్తూ అదే బ్రాహ్మణుడిని తపస్సు చేస్తుండగా చూస్తాడు. ఆ బ్రాహ్మణుడి ఉత్తరీయం గాలిలో ఏ ఆధారం లేకుండా పరుచుకుని అతనికి నీడ ని ఇస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వనాధ వారు, నాయుడి చేత పలికించే మాటలు నిజంగా అక్షర సత్యాలు.

అందుకే ఈ కణిక వ్యవస్ధ మనిషి మానసికంగా ప్రచోదనం చెందేలా చేయగలిగిన భక్తి మార్గాన్ని అపోహలు, మూఢనమ్మకాలు,ముసలోళ్ళ పని ... అనే ముళ్ళ కంపలతో నింపేసారు.ఎప్పుడైనా ఎవరైనా ఆ ముళ్ళకంపల దారిని బాగుచేద్దామనుకుంటే ఏటికి ఎదురీదుతున్నావంటూ అధైర్య పరుస్తారు లేదా వారిపై బురద చల్లడానికి ప్రయత్నిస్తారు. లేదా ఈ సారి మరింత పకడ్బందీగా (భూమి పుట్టినప్పటినుండీ ఈ దారి ఇలాగే ఉందనిపించేలా,లేదంటే అసలు దారే కనపడకుండా)అమలు చేస్తారు.

మనోహర్ గారు,

మీ వ్యాఖ్య నాకు వెయ్యిఏనుగుల బలం ఇచ్చింది. కృతఙ్ఞతలు.

మీరు మీ బ్లాగుకు పెట్టిన పేరుకి మీ పోస్టులకు వున్న వ్యత్యాసాన్ని తెలియచేయగలరా అన్యదాబావించకండి ....శ్రీ

శ్రీగారు,
నా బ్లాగుకి ‘అమ్మఒడి’ అని పేరెందుకు పెట్టానంటే – అమ్మ , మనల్ని చిన్నప్పుడు తన ఒడిలో కూర్చోబెట్టుకుని, తను తన అమ్మ అంటే మన అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నదీ, తన జీవితంలో అనుభవం ద్వారా తెలుసుకున్నవీ, అవగాహనతో అర్ధం చేసుకున్నవీ, అన్నిటినీ మనకి చెబుతుంది. “నాన్నా! ఇది నిప్పు! తాకితే చేయి కాలుతుంది. ఇది తప్పు! చేస్తే బ్రతుకే కాలుతుంది. ఇది మోసం. ఎవరైనా నీకు చేస్తే చాలా కష్టం. అందుకే ఇలా జాగ్రత్తపడాలి. నాకు తెలియక ఈపొరపాట్లు చేశాను. అందుకు ఈ ఫలితాలు వచ్చాయి. అంచేత నువ్వు ఇలా చెయ్యి. ఇలా చెయ్యవద్దు” అంటూ – తన అనుభవాలని మనకి చెబుతుంది. వినటం, వినకపోవటం పిల్లవాడి ఇచ్ఛ, స్వేచ్ఛ! అలాగే నేనూ నా అనుభవాలని, నాకు తెలిసిన విషయాలని అందరికీ చెప్పటానికే ఈ బ్లాగు వ్రాస్తున్నాను. అందుకే ‘అమ్మఒడి’ అన్న పేరు ఎంచుకున్నాను. ఎవరైనా నన్ను మాతృ సమానంగా భావిస్తే, అది నేను చాలా సంతోషంగా, గౌరవంగా స్వీకరిస్తాను. అదే వాత్సల్యాన్ని, ఆత్మీయతని పంచాలనుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి ‘నేను, నావాళ్ళు’ అన్న పరిమితి దాటేస్తే మనకి విశ్వమంతా భగవానుడి ప్రేమ నిండి కన్పిస్తుంది. ఇది నేను స్వానుభవంతో నేర్చుకున్నది. వ్యాఖ్యవ్రాసినందుకు కృతఙ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu