నాబ్లాగు చుట్టాలందరికీ ఈ సెలవు రోజున, క్రైస్తవుల పండుగైన శుభశుక్రవారం రోజున చదువుకునేందుకు, అనువర్తించుకునేందుకు క్రీస్తు చెప్పిన ఓ చిన్న కథ.

ఇది నాచిన్నప్పుడు మాపాఠశాలలో మా పంతులమ్మ చెప్పారు. పెద్దయ్యాక నేనూ బైబిలులో చదివాను. బైబిలు లో క్లుప్తంగా ఉన్న కథని మా పంతులమ్మ విపులంగా అనువర్తించి చెప్పారు. అది నాకేంతగానో నచ్చింది. మీకూ నచ్చుతుందని వ్రాస్తున్నాను.

ఒకరైతు తనపొలంలో చల్లటానికి , బలమైన, మంచి ధాన్యపు వితనాలను తెచ్చాడు. పొలం దున్ని సిద్ధం చేశాడు. గంపలో గింజలు పోసుకొని పొలంలో చల్లటం మొదలు పెట్టాడు.

కొన్ని గింజలు రాతిబండలపై పడ్డాయి. కొన్ని గింజలు పొలంగట్టు మీద, డొంక దారి మీద పడ్డాయి. కొన్ని గింజలు ముళ్ళపొదల్లో పడ్డాయి. కొన్ని గింజలు పొలంలో పడ్డాయి. బండలమీద పడ్డ గింజలు ఎండవేడికి మాడిపోయాయి. గట్టుమీద, దారి మీదా పడ్డగింజల్ని పిట్టలొచ్చి తినిపోయాయి. ముళ్ళపొదల్లో పడ్డ గింజలు మొలకెత్తాయిగానీ పెరగలేదు. నాలుగు రోజులకే మొలకలు వాడిపోయాయి. సారవంతమైన పొలంలో పడ్డ గింజలు మొలకెత్తి, పెరిగి పైరై, పండి మరెన్నో గింజల్ని ఇచ్చాయి.

అలాగే మహాత్ములు, గొప్పవారు, పెద్దవారు మనకు ఎన్నో మంచి మాటలు చెబుతారు. అయితే శ్రోతల్లో కొందరి హృదయాలు బండరాళ్ళవంటివి. పెద్దల సూక్తులు, మంచిమాటలు అటువంటి వారిని ఏమాత్రం ప్రభావితం చెయ్యలేవు. కొందరి హృదయాలు పొలంగట్టు, డొంకదారి వంటివి. అక్కడ పడిన గింజలవంటి మంచి మాటలనీ, నీతి సూత్రాలనీ పిట్టలనే విషయవాంఛలు, ప్రలోభాలు తినేసి పోతాయి. కొందరి హృదయాలు ముళ్ళపొదల వంటివి. మంచిమాటలు వారి హృదయాల్లో నాటుకొని మొలకెత్తుతాయి గానీ ఎక్కువకాలం ఉండవు. వారిలోని విషయలాలస, అరిషడ్వర్గాల వంటి ముళ్ళు ఈ మొలకల్ని బ్రతకనీయవు. కొందరి హృదయాలు మాత్రం సారవంతమైన పొలం లాంటివన్న మాట. అక్కడ పడిన గింజల వంటి మంచిమాటలు, ఆలోచనలు మొలకెత్తి నారై, పైరై, పండుతాయి. మరికొన్ని మంచిమాటలని, ఆలోచనలని ఫలిస్తాయి.

ఈ కథని మా పంతులమ్మ తను నేర్పుతున్న చదువుకూ, విద్యార్ధుల మనస్సుకూ అనువర్తించి చెప్పింది.

ఈ సెలవు రోజున, పండుగరోజున మీ ఇంట్లోని చిన్నారులకి ఈ కథని, అనువర్తననీ చెప్పి ఆనందింపజేస్తారని ఆశిస్తాను.

ఈ సందర్భంలో భర్తృహరి సుభాషితం ఒకటి గుర్తు తెచ్చుకోవటం సమయోచితంగా ఉంటుంది. శ్లోకం గుర్తులేదు. భావం వ్రాస్తున్నాను. ఏనుగుల లక్ష్మణ కవి పద్యం ఎవరికైనా గుర్తు ఉంటే వ్రాయమని అర్ధిస్తున్నాను.

ఇంతకీ భర్తృహరి శ్లోక భావం ఏమిటంటే – మనిషి మనస్సు చేటలా ఉండాలట. చేట – తప్పి, తాలు, పొట్టు, పుచ్చు గింజల్ని వదిలేసి, మంచి గింజల్ని తనలో ఉంచుకుంటుందట. జల్లెడ మంచిపదార్ధాన్నంతా వదిలేసి పొట్టుని తనలో మిగుల్చు కుంటుందిట. కాబట్టి మనిషి మనస్సు చేటలా ఉండాలని, తాము చూసిన, విన్న, చదివిన విషయాల్లో మంచి గ్రహించి చెడు వదిలేయాలని చెబుతుంది ఈ సుభాషితం. అలాగే జల్లెడలా ఉండకూడదని, చెడు గ్రహించి మంచి వదిలేయటం మంచిది కాదని చెబుతుంది. [ఈ జల్లెడ లక్షణాన్నే ‘గూట్లే’ తనమంటారని జల్సా సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం సునీల్ కు చెబుతాడు.]

నా ఈ చిన్ని టపాని మీరు అనదించగలరని ఆశిస్తూ………..

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

చాలా మన్చి కధ చెప్పారు. నెనర్లు.

చాలా మంచి కథ చెప్పారు. మీ దగ్గర బోలెడు స్టాక్ కథలు ఉంటాయ్ కదా..అప్పుడప్పుడూ మాక్కూడా చెప్తున్నందుకు ధన్యవాదాలు.

story is good

మొన్ననే ఎందుకో నేణు కూడా ఈ కథనే గుర్తు చేసుకున్నా

శ్లోII
పరిక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే
స పశ్చా త్సమ్పూర్ణః కలయతి ధరిత్రీం తృణసమాం,
అతశ్చా నేకాన్తా గురులఘుయా2ర్థేషు ధనినా
మవస్థా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ. II
ఉ.
చేరి యొకండు నెవ్వఁబడి చిక్కుచుఁ జేరెడు శాలిధాన్యమే
కోరు నతండు పిమ్మట నకుంఠధనోన్నతుఁడై వసుంధరం
బూరికి సాటిగాఁ దలచు భూరిధనాఢ్యులచొప్ప నేకమై
గైరవమున్ లఘుత్వమును గైకొను వస్తువులందు నెల్లెడన్.

ఒకడు దారిద్ర్యము చేజిక్కి చేరెడు ధాన్యమునే కోరును. పిదప నతడు మిక్కిలి ధనము గలవాడై భూమినే గడ్డిపోచగా లెక్కించును. గొప్ప ధనవంతుల తీరు వివిధమై వస్తువులయందు గొప్పదనమును, చులుకదనమును గ్రహించును.
ఇదేనాండి ఆ శ్లోకమూ, పద్యమూను.ఇదికాక వేరే ఏమైనా ఉందా. తెలియజేయగలరు.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారు,

ఇది కాదండి. మంచి గ్రహించి, చెడు వదిలేసే లక్షణమూ చేటకీ, చెడు గ్రహించి, మంచి వదిలేసే లక్షణం జల్లెడకీ ఉందని చెబుతూ మనుష్యులు చేటలా ఉండాలని చెప్పే శ్లోకం, పద్యమూ. ఈమధ్యే ఎక్కడో మరోసారి చదివాను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu