ఈ రోజు జపాన్ దేశ పరిస్థితి, పౌరుల దుస్థితి చూస్తే..... ఓ వైపు బాధ, మరో వైపు ఆక్రోశం కలుగుతున్నాయి.


నిన్నటి వరకూ పరిశుభ్రమైన ఆవాసాల్లో నివసిస్తూ, పోష్ గా ఉండే కార్యాలయ భవనాల్లో పనిపాటలు నిర్వహించుకున్న జపనీయులు, ఈ రోజు..... బురదలో, మురుగులో, గుక్కెడు నీళ్ళు, గుప్పెడు తిండీ లేక అల్లడుతూ, అణు ధార్మికతను తలుచుకుని భీతిల్లుతూ బ్రతుకు తున్నారు.


కూలిన శిధిలాల్లా, కుప్పతొట్టెల్లా ఉన్న పరిసరాల్లో..... కన్నబిడ్డల శవాలని వెదుక్కుంటున్న తల్లిదండ్రుల్నీ, కన్న వాళ్ళ జాడ కోసం రోదిస్తున్న పిల్లల్నీ చూస్తుంటే, హృదయం తరుక్కుపోతుంది.


శుభ్రమైన పరిసరాల్లో, క్రమబద్దమైన దినచర్యతో బ్రతకడం మాత్రమే తెలిసి ఉన్న వాళ్ళకి, ఒక్కసారిగా ఋరదలో, మురుగులో, మురికిలో బ్రతకటం.... ఎంత ప్రాణాంతకంగా ఉంటుందో, దుర్భరంగా ఉంటుందో మాకు అనుభవపూర్వకంగా తెలుసు. 2009 వరదల సందర్భంలో, కర్నూలు జిల్లా వాసులకీ తెలుసు, అది చూసిన వాళ్ళకీ తెలుసు.


భూకంపం, సునామీ జపాన్ ని అతలాకుతలం చేసి, ఎనిమిదడుగులు ఆవలికి నెడితే, వరుస బెట్టి పేలుతున్న అణు విద్యుత్ కేంద్రాలు, అత్యంత భీతి గొల్పుతున్నాయి. నాటి ప్రపంచ యుద్ద సమయంలో హిరోషిమా నాగసాకిల మీద పేలిన అణుబాంబు స్థాయిలో గాకపోయినా నష్టం మాత్రం తక్కువేం కాదు.


[1986లో సంభవించిన చెర్నోబెల్ ప్రమాదం – అణువిద్యుత్ కేంద్రాన్ని భూస్థాపితం చేసినా, అణు ధార్మికత వెలువడకుండా కట్టుదిట్టం చెయ్యటం ‘శాశ్వత ప్రాతిపదిక’ అని నిరూపించింది. 1979లో త్రీమైల్ ఐలెండ్ దుర్ఘటన తర్వాత, అమెరికాలో అణువిద్యుత్ కేంద్రాల ఊసే లేదు.


అమెరికా, తమ దేశంలో అణువిద్యుత్ కేంద్రాల స్థాపన చేసుకోవటం లేదు గానీ, భారత్ సహా పలు దేశాలని మాత్రం అందుకు ప్రోత్సాహిస్తుంది. తనది గాక పోతే కాశీదాకా డేకమనటం అంటే ఇదే!]


ఈ నేపధ్యంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్, “మన దేశంలో ఉన్న అణుకేంద్రాల కొచ్చిన ప్రమాదం ఏదీ లేదు, అవి భూకంపాలకు దుర్భేద్యంగా నిర్మించబడ్డాయి” అని సెలవిచ్చాడు. “2004లో వచ్చిన సునామీ, 2001లో వచ్చిన బుజ్ భూకంపం, దాన్నే నిరూపించాయి’ అని ముక్తాయించాడు కూడా!


ఏతావాతా..... అణువిద్యుత్ కేంద్రాలకు అనుమతులిచ్చే రాజకీయ వ్యాపారంలో, వెనుకడుగు వేసేది లేనే లేదని తేల్చి పారేసాడు భారత ప్రధాని! ఎంత కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లతో నిర్మించినా, అణు విద్యుత్ కేంద్రాల స్థాపన ప్రమాదకరమే అని నేటి జపాన్ నిరూపించింది.


అలాంటి చోట భారత్ లో!? అందునా కార్యనిర్వహణలో ప్రైవేటు సెక్టార్ లో గానీ, పబ్లిక్ సెక్టార్ లో గానీ, ఎంత అలసత్వం ఉంటుందో, మనకి, భోపాల్ యూనియన్ కార్బయిడ్ సాక్షిగా తెలుసు. అవేవీ మన్మోహన్ సింగ్ కళ్ళకి కనబడవు.


ఒక వేళ ఖర్మకాలి ఏదైనా అయితే, ఆనక, సీవీసీ థామస్ విషయంలో చెప్పినట్లు ఓ ‘సారీ’ చెప్పేసీ, “ముందుగా దీని గురించి నాకు సమాచారం లేదు. ఫలానా శాఖ వివరాలు పంపలేదు. బాధ్యత మాదే!” అనేస్తే సరిపోతుందని సదరు మేధావి తెలివి కావచ్చు!


బహుశః జపాన్ ప్రధానులు కూడా (వారూ వీరని లేకుండా) ఇలాగే ప్రకటించి ఉంటారు, ముక్తాయించీ ఉంటారు.


ఇకపోతే..... జపాన్ విద్యుత్ అవసరాల్లో 34% అణువిద్యుత్తే తీరుస్తుందట!


విద్యుచ్ఛక్తి, మనిషికి అవసరం.


జీవితంలో..... సౌకర్యానికి, పనిలో సౌలభ్యానికి..... తప్పనిసరిగా అవసరం.


అది అభివృద్ధికి చిహ్నం. మరింత అభివృద్ధికి మార్గం.


అయితే..... అవధుల్లేని అభివృద్ధి, అవసరమా?


అమ్మపాలు పాపాయి పెరుగుదలకి అవసరం. అయితే అమ్మపాలు చాలవు, రొమ్ముకోసి కూరొండుకు తిందాం’ అనేంత అభివృద్ధి అవసరమా? [భూమితల్లి విషయంలో మనిషి ప్రవర్తన ఇలాగే ఉంది.]


అంతస్థుపై అంతస్థు... ఒక దానిపై ఒకటి గుండ్రంగా తిరిగేటట్లు అపార్ట్ మెంట్ల.....తో ఋర్జ్ ఖలీఫాలంత అభివృద్ధి.....!


గంటకి నాలుగొందల ఇరవయ్యో అరవయ్యో కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రెయిన్ లంత అభివృద్ధి....!


మార్కెట్లలోకి పదిహేను రోజులకో, నెలకో..... [వస్తువుల] కొత్త మోడళ్ళు విడుదల చేసేంత అభివృద్ధి......!


అవసరమా?


ఇవన్నీ నడిచేది విద్యుత్ తోనే! అందుకోసం తొలచాల్సింది భూగర్భాన్నే!


కడుపు డొల్ల అయ్యాక.....


పుడమి తల్లి హృదయాక్రోశం వెల్లడయ్యేది..... భూకంపం లాగానే!


భూమాత గుండెమంట వెల్లడయ్యేది.... అగ్ని పర్వతపు విస్పోటనం లాగానే!


అవని తల్లి అశృధార వెల్లడయ్యేది...... జలప్రళయపు విలయం లాగానే!


పిజ్జాలు, ఛీజ్ బర్గర్, నేతి పాయసాలు, చికెన్ మసాలా లతో, ఆహారమూ అవసరాన్ని దాటి, విలాసమైపోయాక, పనుల్లోయంత్ర సౌలభ్యం అదనపు కొవ్వుని ఒంట్లో కొలువుంచాక, ఒబెసిటీని తగ్గించుకునేందుకు ఏసీ జిమ్ లు కావాల్సివచ్చేంతగా విద్యుత్ మనిషికి అవసరమై పోయింది.


అందుకోసం భూమాతని వేడెక్కిస్తున్నాం.


అవని గర్భాన్ని తొలిచేస్తున్నాం.


అణువుల్ని బద్దలు కొడుతున్నాం.


ఇంతగా కూర్చున్న కొమ్మ నరుక్కునేంత, అమ్మ రొమ్ము కొరుక్కుతినేంత.... అభివృద్ధి, అవసరమా?


‘ఓ ప్రక్క జపాన్ ప్రకృతి ఉత్పాతానికి గురై, ప్రజలు దైన్య స్థితిలో ఉంటే, మరో ప్రక్క మాటలతో తూట్లు పొడుస్తున్నాను’ అనుకుంటారేమో!


మనదేశంలో అణువిద్యుత్ కేంద్రాలు వద్దనీ, అణు ఒప్పందాలు అవసరం లేదనీ మనమెంత అరిచి గీపెట్టినా..... 2008లో యూపీఏ ప్రభుత్వం, ఏదీ చెవి పెట్టకుండా, ఉరుక్కుంటూ వెళ్ళి, అణుఒప్పందాలు కుదుర్చుకుంది చూడండి....


మన పరిస్థితి ఎలాంటిదో, 1970ల్లోనే అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చెయ్యబడినప్పుడు జపనీయుల పరిస్థితీ అంతే!


మనకి చెప్పినట్లే ‘ఇన్ని లక్షల ఉద్యోగాలొస్తాయి..... ఇంతింత అభివృద్ధి జరిగి అర చేతిలోకి వైకుంఠం వచ్చిపడుతుంది’ అని చెప్పి ఉంటారు శ్రీమాన్ ప్రధానమంత్రులూ, కుర్చీ వ్యక్తులూ, యువరాజులు!


ఆ హోరులో..... సామాన్యుల ఘోష.... కార్పోరేట్ల వ్యాపార ఝుంఝూమారుతంలో గడ్డి పోచలు కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతాయి.


ఎందుకంటే – అణు విద్యుత్ కేంద్రాల, బుల్లెట్ ట్రెయిన్ల ఉత్పత్తి సంస్థలూ, నిర్వహణా సంస్థలూ..... అన్నీ వ్యాపార మయమే అయి ఉండే చోట.... కార్పోరేట్ వ్యాపార దిగ్గజాలే ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలన్నిటినీ శాసిస్తున్నాయి గనక! ఇది సుదీర్ఘ కాలంగా, నిరాఘాటంగా నడుస్తోన్న దోపిడి గనక!


సదరు వ్యాపార దిగ్గజాల (దిగ్గజాలు కాదు, సాక్షాత్తూ దుష్ట రాక్షసులే వీళ్ళల్లో అత్యధికులు) జేబులు నింపడం కోసం, ప్రభుత్వాధినేతలే లాబీయిస్టులై పనిచేసి పెడతారు. మీడియా అధినేతలు ప్రచారం చేసి పెడతారు. అంతా కలిసి దోపిడికి, దగాకి ఆకర్షణీయమైన పాజిటివ్ కాప్షన్ లు పెడతారు.


ఉదాహరణకి జపాన్ సంగతే తీసుకొండి.


‘గంటకి ఇన్ని వందల కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బుల్లెట్ ట్రయిన్లతో జపాన్ అభివృద్ధి కళ్ళు మిరమిట్లు గొల్పుతుందని’ మీడియా ప్రశంసిస్తుంది, ప్రచారించింది.


జపనీయులు వర్క్ హాలిక్ లూ, సాంకేతిక నేర్పురులనీ హోరెత్తించింది. ప్రపంచ ఆధునిక వినిమయ వస్తూత్పత్తిలో జపాన్ దే అగ్రస్థానమంటూ ర్యాంకింగులిచ్చింది.


అయితే ఆ వస్తూత్పత్తి కంపెనీలన్నీ ప్రైవేటు వనే నిజం ప్రచారించదు. సదరు వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ, నిరంతర పని విధానంలో ముంచి వేయబడి.... మొదట్లో ఇప్పుడు మనం ప్రతిఘటిస్తున్నట్లు ఎదురు తిరిగినా..... కాలగతిలో ఒకటి రెండు తరాలు మారేటప్పటికి అలవాటు పడి.... ఇప్పుడు షిప్టుల కొద్దీ పని చేయటం తప్ప మరేమీ చెయ్యలేని అసహాయ స్థితికి నెట్టబడిన జపనీయుల జీవిత పరిణామాలని..... ‘జపనీయులు వర్క్ హాలిక్’ లనే పాజిటివ్ కాప్షన్ మాటున మాయం చేస్తుంది.


నిజమే, జపనీయులు వర్క్ హాలిక్ లు!


ఎంత వర్క్ హాలిక్ లంటే.... షిష్ట్ ల కొద్దీ పనిచేసి.... డ్యూటి దిగి ఇంటికెళ్ళేందుకు గంటల కొద్దీ రైళ్ళల్లో ప్రయాణం చేసి..... అంత పొడవాటి ప్రయాణం గనుక అందులోనే కునుకేసి.... ఇల్లు చేరి పెళ్ళాం బిడ్డల ముఖాలు చూసి మరో రెండు గంటలు గడిపితే, మళ్ళీ డ్యూటీకి వెళ్ళేందుకు ప్రయాణం కావాల్సినంతగా వర్క్ హాలిక్ లు!


నిలబడి నిద్రపోవటానికి కూడా అలవాటు పడిపోయారు వాళ్ళు. అదే వాళ్ళ ప్రత్యేకతగా చెబుతుంది జపాన్ కి విదేశీ మీడియా. అందులో భారత్ మీడియా కూడా ఉందండోయ్! ఇలాంటి పరిస్థితి మన భారత్ లో పూనే టూ ముంబై రెళ్ళల్లో కూడా చూడవచ్చు.


‘ఎందుకంతగా గంటల కొద్దీ పొడవాటి ప్రయాణాలు చేయడం?’ అనుకుంటారేమో! అదేమీ వాళ్ళకి సరదా కాదు. పని చేసే చోటుకు దగ్గరలోనే నివాసం ఉండాలంటే, ధరలు (ఇళ్ళ ధర లేదా అద్దె దగ్గరి నుండి జీవన వ్యయం దాకా) అందుబాటులో లేక, దూరంగా నివాసాలని ఎంచుకోవడం వాళ్ళకి అనివార్యం అయ్యింది.


ఈ ప్రయాణ కాలాన్ని తగ్గించడానికే అక్కడ వేగపు రైళ్ళని ప్రవేశ పెడుతుంటాయి మరికొన్ని వ్యాపార సంస్థలు. అన్నిటిలో నుండీ వ్యాపారావకాశాలని అన్వేషిస్తే..... పనిచేసే చోటుకు దగ్గరలోనే పనిచేసే వారి నివాస ప్రాంతాలుండే విధంగా అవకాశాలు అన్వేషింపబడవు, ఖరీదు ఎక్కువైనా, వేగంగా వెళ్ళగలిగే అవకాశాలు అన్వేషింపబడతాయి. అప్పుడు ఎక్స్ ప్రెస్ వేలు, ఆకాశ రైళ్ళూ సృష్టింపబడతాయి.


ఇక ఆ రెండు మూడు గంటల కాలానికి ఇంటికెళ్ళి బావుకునేది ఏముంది అనుకుని..... క్రమంగా వంధ్యత్వం పెరిగిపోయి, లేదా వివాహం మీద, సంతానాన్ని పొందడం మీదా ఇచ్ఛ కోల్పోయి, గడిపేస్తున్న జపాన్ వాసుల సంఖ్య తక్కువేమీ కాదు.


అంతగా జీవితేచ్ఛ కోల్పోయి, రక్తమాంసాలున్న రోబోలుగా మిగిలి పోతున్నారు. ఇక్కడ ఇప్పటి విద్యావిధానం లాగానే, నాలుగైదు దశాబ్దాల క్రిందటే అక్కడి విద్యా విధానం ‘ఉద్యోగులన బడే పనిచేసే రోబోలని’ సృష్టించే పని తలకెత్తుకుంది. సమర్ధంగా నిర్వహించి ‘వర్క్ హాలిక్’లని తయారు చేసింది.


ఇదీ అక్కడ ‘పని సాంప్రదాయం’గా మీడియా ప్రచారించే విషయం వెనుకనున్న చేదు నిజం! అంతగా పాజిటివ్ కాప్షన్ లు పెట్టటం మీడియాకే చెల్లు. ఆకర్షణీయమైన ఆ పాజిటివ్ కాప్షన్ ల వెనుక ఉంది శ్రమ దోపిడే! అదే జపాన్ లో నడిచింది, ఇప్పుడు చైనాలో నడుస్తోంది, ఇప్పుడిప్పుడే భారత్ లోకీ.... చొచ్చుకు వస్తోంది, వచ్చింది.


ఇదంతా మీకు నమ్మశక్యం గాకుండా ఉందా?


జపాన్ అభివృద్దికి ఒక సూచికగా దిగువ ఫోటోను చూడండి.



సూటూ బూటూ వేసుకుని, జనాలని రైళ్ళల్లోకి తోస్తున్నారు గనుక, ఇంగ్లీషులో స్టైల్ గా ‘పుషర్స్’ అంటారేమో గానీ, అచ్చ తెలుగులో అయితే ‘తోపుడు గాళ్ళు’ లేదా ‘నెట్టుడు దారులు’ అనాలి!


పై విషయంలోనే పాజిటివ్ వెతుక్కుంటే తక్కువ మెయింటినెన్స్ తో రైల్వేలు లాభాలు గడించాయని చెప్పవచ్చు. అలాగే పుషర్స్ గా ఉద్యోగవకాశాలు కల్పించబడ్డాయని చెప్పవచ్చు. ఈ అవధుల్లేని అభివృద్ధిలో సగటు జపనీయునికి సౌఖ్యం సున్నానే అని నిరూపితమవుతుంది.


మరెవ్వరి భర్తలో తమ భార్యలకి విలాసవంతమైన విమానాలు, నౌకలూ లేదా దీవులూ కానుకగా ఇచ్చేటందుకు, ఉరుకులూ పరుగుల మీద రైళ్ళల్లో ప్రయాణించాలంటే..... కొన్ని సెకన్లు మాత్రమే ఆగే స్టేషన్ లలో తీరుంబావుగా ఎక్కాలంటే ఎలా కుదురుతుంది?


అందుకే ప్రయాణికుల్నీ కట్టకట్టి, లోపలికి నెట్టి, కూలేసి లేదా కుక్కేసి.... ప్యాక్ చేసి పంపిస్తే సరి!


ఇప్పుడు చెప్పండి!


రక్తమాంసాలున్న రోబోలు కాదా మరి!


ఇప్పటికైనా మేలుకోకపోతే..... అదే శ్రమ దోపిడి శ్రమ సంస్కృతి (వర్క్ హాలిక్) పేరుతో ప్రపంచ వ్యాప్తమై, బ్రతుకు లుప్తమై పోతుంది.


అందుకే... అవధుల్లేని అభివృద్ధి మనకి అవసరం లేదు.


ఎందుకంటే అభివృద్ధి కొందరికే!


శ్రమ దోపిడి మాత్రం సగటు ప్రజలందరిది!




మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

>>>ఆఫ్రికా ఖండంలోని టునీషియా రిపబ్లిక్‌లో రాజకీయ విప్లవం వచ్చింది. 64వేల చదర పు మైళ్ళ విస్తీర్ణంతో, కోటి మందికి పైగా జనాభా కలిగిన ఈ దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ప్రజా ఉద్యమాల దెబ్బకు 23ఏళ్లపాటు అధ్యక్షుడుగా కొనసాగుతున్న నియంత జైనె అల్ అబిదైన్ బెన్ అలీ గత శుక్రవారం దేశం విడిచి పారిపోయాడు.

 విశ్లేషణ:

23 ఏళ్ళుగా కొనసాగుతున్న నియంత జైనె అల్ అబిదైన్ బెన్ అలీ! మన దేశంలో 1998 లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన అధిష్టానం సోనియా..... పార్టీ సంస్థాగత ఎన్నికల్లేకుండా, ఏకగ్రీవంగా వరుసగా ఎన్నిక అయిపోతున్నట్లుగానే, జైనె అల్ అబిదైన్ బెన్ అలీ అయినా! ఈవీఎం లూ నవీన్ చావ్లాలూ సాయం చేస్తే.... ఆరేళ్ళేం ఖర్మ, ఇరవై ఆరేళ్ళయినా యూపీఏ సోనియాలే రాజ్యమేలగరన్నట్లుగానే!


ఈ విధంగా వీలు కుదిరిన దేశాల్లో, ఇలాంటి వాళ్ళని అధ్యక్షులనీ, అధిష్టానాలనీ అంటారు, కుదరక పోతే నియంతలనీ, సైనికాధ్యక్షుడనీ అంటారు. పేరు లోనే తేడా! ప్యాకింగులో తప్ప లోపలి సరకు ఒకటేనన్నట్లుగా!


>>>ఇస్లాం మతవాదం, సైనిక జుంటా, విదేశీ సాయుధ మూకల ప్రమేయం లేకుండా కేవలం సాధారణ ప్రజలు ఒక నియంత పాలనను అంతమొందించడం అరబ్ ప్రపంచంలో ఇదే ప్రప్రథమం. గత ఏడాది డిసెంబర్ 17 జరిగిన సైదీ బావుజీద్ తిరుగుబాటు తర్వాత దేశ వ్యాప్తంగా 29 రోజుల పాటు నిరంతరాయంగా సాగి ప్రజా ఉద్యమాలు బెన్ అలీ పాలనకు చరమగీతం పాడాయి. టునీషియా జాతీయ పుష్పం పేరుతో ప్రజా ఉద్యమాలకు 'జాస్మిన్' విప్లవం అన్న పేరు వచ్చింది. టునేషియా ప్రజల పోరాటాలను అరబ్ ప్రపంచంతోపాటు, యావత్తు అంతర్జాతీయ సమాజం పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.

విశ్లేషణ:
ఇస్లాం మతవాదం పేరుతో, పాకిస్తాన్ లాంటి పలు దేశాల్లో చక్రం తిప్పడం మామూలే! ఆ చక్రం తిప్పడంలో భాగంగానే..... విప్లవాలు, ప్రభుత్వ మార్పిడులూ సంభవిస్తాయి. నిజానికి మత ఛాందస వాదమూ, కమ్యూనిజమూ, సైనిక పాలకులూ గట్రా.... పేర్లు మార్పేగానీ, అందరూ చేసేదీ ఒకటే.... ప్రజలని దగా చేయటం! శ్రమ దోపిడి దగ్గరి నుండి అన్ని రకాల దోపిడులూ, అక్రమాలూ చెయ్యడం!! 

అవేవీ లేకుండా సాధారణ ప్రజలు ఒక నియంత పాలనని అంత మొందించాడని చెప్పాలంటే మీడియాకి ఎంత కష్టంగా అన్పించిందో! కాబట్టే – 29 రోజుల పాటు ట్యునీషియాలో జరిగిన ప్రజా విప్లవాన్ని గానీ, ముబారక్ ని తరిమేసిన ఈజిప్టు ప్రజల చైతన్యాన్ని గానీ, ఇప్పుడు గడాఫీని గడగడలాడిస్తున్న లిబియా ప్రకంపనలని గానీ (నామ మాత్రపు ఫోకస్ తప్ప) ఏమాత్రం ప్రచారించటం లేదు. అంత నొప్పి మరి!

అదే తమకి ఇష్టమై ఉంటే.....

ఒకప్పుడు ఈనాడు దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రచారించినట్లు.....
లేదా వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం నేపధ్యంలో అన్ని వార్తాపత్రికలూ, టీవీ ఛానెళ్ళు ఎడతెగని ఉత్కంఠని హోరెత్తించినట్లు.......
లేదా వైయస్ మరణించిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు ఏక వార్తగా ఈనాడు వై.ఎస్.ని దేవుణ్ణి చేసి ప్రచారించినట్లు.....
లేదా ఎక్కడో ఫోర్డ్స్ పత్రిక ప్రపంచ ప్రభావశీలుర జాబితాలొ, ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రచురించారని ఆఘమేఘాల మీద వ్రాసేసినట్లు......
అన్ని ప్రచార సంస్థలు కూడా ప్రచారించి ఉండేవి.

>>>ఫ్రాన్స్ వలస పాలనలో 75ఏళ్ళపాటు మగ్గిన టునీషియా 1956లో స్వాతంత్య్రం పొందింది. రాజకీయంగా విముక్తి పొందినప్పటికీ ఆర్థికంగా ఫ్రాన్స్పైనే ఆధారపడటంతో యూరోపియన్ యూనియన్తో టునీషియా 'సహకార ఒప్పందం' చేసుకుంది. భౌగోళికం గా ఆఫ్రికా ఖండంలో ఉండడం మూలాన ఆఫ్రికన్ యూనియన్ లోను, ఆరబ్ సంస్కృృతి ఉండడంతో అరబ్ లీగ్లోను ఏకకాలంలో సభ్యదేశంగా కొనసాగడం టునీషియా ప్రత్యేకత. ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో కీలక మధ్యవర్తిగా కూడా టునీషియా వ్యవహరించింది.

విశ్లేషణ:

ఒకప్పుడు ఇజ్రాయేల్ పాలస్తీనా వివాదం ప్రపంచానికే పచ్చిపుండు. ప్రతీరోజూ వార్తాపత్రికల్లో పశ్చిమాసియాలో శాంతి ఒక ప్రధాన వార్త! రాజీవ్ గాంధీ హత్యని ముందే హెచ్చరించిన అరాఫత్ మరణం వరకూ మరింతగా మరిగిన నిప్పుల కుంపటి. ఇప్పుడు తీవ్రత చాలా తగ్గినా, సలుపుతున్న సమస్యే!

మతం అది యూదులలో అయినా, హిందువులలో అయినా, ముస్లింలలో అయినా, బౌద్దులలో అయినా మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. వేర్పాటు వాదాలైనా ఇంతే! ఇలాంటి సెంటిమెంటువ్యవహారాలు తక్కువ డబ్బు ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించుకోగలిగినవి, నకిలీ కణిక వ్యవస్థకి! అందుచేత, అలాంటి మంటలు అన్నిచోట్లా, ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. ఆపై కారణాలతో తమ బొమ్మల్ని బాగా పైకి తెచ్చుకోవటం నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులకి రివాజు!

ఇక ఇక్కడ గమనించాల్సింది – ట్యునీషియా ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో కీలక  మధ్యవర్తిగా వ్యవహారించిందట! అంటే ఇప్పుడు విప్లవం చేపట్టిన సామాన్య ప్రజానీకం కాదు. అక్రమాల నియంత అలీ నే! ఆఫ్రికా ఖండంలో అంత బుడ్డి దేశం ట్యునీషియా నియంత, అమెరికా బ్రిటన్ లతో సహా ప్రపంచ రాజకీయాలని ప్రభావితం చేసిన ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదంలో, కీలక పెద్దమనిషిగా వ్యవహారించాడన్న మాట. అంత పెద్ద మనిషి కాబోలు ఈ చిన్ని దేశపు నియంత!

ఆ వంకతో ఎవరికి ఎంత లాబీయింగ్ చేసి పెట్టాడో..... ఇప్పటి నీరా రాడియాల గురించి కలిగిన అవగాహనతో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి అలీలు, వెయ్యిమంది నీరా రాడియాల పెట్టు.

 >>>యూరోపియన్ యూనియన్, ముఖ్యంగా ఫ్రాన్స్ సహకారంతో ఇక్కడ పరిశ్రమల ఆధునీకరణ, ప్రైవేటైజేషన్ కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచీకరణలో భాగంగా ఎగుమతి ఆధారిత దేశంగా అవతరించింది. 1990 నుంచి సగటున 5 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో కొనసాగుతున్న దేశ ఆర్థికవ్యవస్థలో అవినీతి నరనరాల్లో వ్యవస్థీకృతమైంది. దాంతో ప్రజా సంక్షేమం మూలన పడింది, ధరలు అదుపు తప్పాయి.

ఆశ్రిత పెట్టుబడీదారీ విధానం (క్రోనీ కే పిటలిజం) మూలాన ప్రభుత్వాధినేతలు వారి కుటుంబాలు, సన్నిహితు లు కోట్లకు పడగలెత్తారు. నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. చేసేందుకు పనుల్లేక, తినేందు కు తిండికి నోచుకోక ప్రజలు దుర్భర జీవితాలను వెళ్ళదీస్తున్నారు. సుదీర్ఘకాలంపాటు సాగిన కాన్‌స్టిట్యూషనల్ డెమొక్రటిక్ ర్యాలీ (ఆర్‌సీడీ) పార్టీ అధినేత బెన్ అలీ అధ్యక్ష పాలనలో దేశ ఆర్థికవ్యవస్థ మరింతగా దిగజారి, ప్రజల జీవన ప్రమాణా లు పూర్తిగా పడిపోయాయి.

విశ్లేషణ:
ఎక్కడైనా ఇదే స్థితి! దేశాలు వేరు. ఆయా దేశాల నేతలు వేరు. కానీ చేతలు మాత్రం ఒక్కటే! ఎంత సారూప్యత!? 


>>>పౌరహక్కులు మృగ్యమైనాయి. సైదీ బావుజీద్ పట్టణంలో మహమ్మద్ బావుజిజి అనే 17ఏళ్ల గ్రాడ్యుయేట్ యువకుడు ప్రభుత్వ అనుమతులు లేకుం డా వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణపై టునీషియా పోలీసులు అతని కూరగాయలు, పండ్లను స్వాధీనం చేసుకున్నారు.

విశ్లేషణ:
అవును. ఏ దేశంలోనైనా పోలీసులు చెయ్యగలిగింది బీదా బిక్కిలపై జులుం మాత్రమే!

>>>మరో బతుకుదెరువులేని యువకుడు ప్రభుత్వ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చి మరణించాడు. సంఘటనతో సైదీ బావుజీద్ పట్టణ ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల, అధికార పార్టీ ఆర్సీడీ కార్యాలయాలపై ప్రజలు దాడి విధ్వంసం సృష్టించారు.

విద్యార్థులు, కార్మికులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలందరూ తిరుగుబాటులో పాల్గొన్నారు. పోలీసులకు ఉద్యమకారులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరుద్యోగం భరించలేనిస్థాయికి చేరుకోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైన విద్యార్థి, యువజన శ్రేణులు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. విద్యాసంస్థలన్నీ మూతపడ్డా యి. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి. మీడియాపై ఆంక్షలు విధించడంతో ఉద్యమానికి సంబంధించిన వార్తలు బయట ప్రపంచానికి తెలియలేదు. పోలీసు కాల్పుల్లో 60 మందికి పైగా మరణించారని ట్రేడియన్ నాయకులు, ప్రతిపక్ష నేతలు ప్రకటించారు.

వ్యవసాయం, మైనింగ్, వస్తూత్పత్తి, పెట్రోలియం ఉత్పత్తులు, టూరిజం లాంటి పలు రంగాలతో కూడిన బహుముఖ ఆర్థిక వ్యవస్థ టునీషియాలో సంపద వ్యత్యాసాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి. 4.5 జీడీపీతో ఆఫ్రికాలోనే అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ ఆర్థిక వేదిక వేసిన తప్పుడు అంచనాను ఉద్యమకారులు సవాలు చేశారు.

విశ్లేషణ:
ప్రపంచ ఆర్దిక వేదికే తప్పుడు అంచనాలు వేసింది. మళ్ళీ అవే నివేదికలను, ఇక్కడి మన మీడియా సంస్థలు (ఎక్కడివైనా అంతే లెండి) ప్రతిష్ఠాత్మక so and so నివేదిక.... ఇలా చెప్పింది అంటూ..... కళ్ఫార్పుకుంటూ చెబుతాయి, పెద్దచ్చరాలతో ప్రచురిస్తాయి.

అసలైనా.... ప్రపంచ ఆర్ధిక వేదికలు, ఎవరికి ఏ ప్రయోజనం చేకూర్చేందుకు తప్పుడు అంచనాలు వేసాయి? సామాన్యుడి బ్రతుకులకు సంబంధం లేని ఈ ఆర్ధికాభివృద్ది అంచనాలు ఎవరికోసం?

ఏ దేశంలోనైనా సరే..... క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు గానీ, ప్రపంచ వేదికలు గానీ, ఐక్యరాజ్య సమితి చేత నడిపించబడే సంస్థలు గానీ..... చాలా వరకూ..... చేసే సర్వేలన్నీ, ఇచ్చే నివేదికలన్నీ సామాన్యుల్ని కొల్లగొట్టేందుకూ, కార్పోరేట్ సంస్థల జేబులు నింపేందుకూ అనుకూలంగా ఉంటాయి. అప్పటికప్పుడూ చూస్తే షుగర్ కోటెడ్ తో కనబడినా, కాలం గడిచే కొద్దీ, అసలు రంగు బయటపడి, నివేదికల సారం తేట తెల్లమౌతుంది. అప్పుడు మళ్ళీ వాటి పై సమీక్షలూ, వైఫల్యానికి పైకారణాల చర్చలూ చేస్తారు.

అంతగా కేవలం కార్పోరేట్ సంస్థలకి మాత్రమే మేలు చేకూర్చేట్లుగా..... ఈ సర్వేలనీ, నివేదికలనీ కేవలం లంచంమాత్రమే నియంత్రిస్తుందా?

కాదు. ఖచ్చితంగా కాదు.

లంచంతో పాటుగా, మరింకో శక్తి కూడా నియంత్రిస్తోంది.
అదే గూఢచర్యంతో నడపబడుతున్న వ్యవస్థ.
ఒకప్పుడు కేజిబీల వెనకా, సీఐఏల వెనకా, ఐఎస్‌ఐ ల వెనకా దాక్కున వ్యవస్థ!
ఇప్పుడు ఆల్ ఖైదా వంటి వాటిని, లాడెన్ ల వంటి వ్యక్తుల్ని పైముఖాలుగా తగిలించుకున్న వ్యవస్థ!
ప్రపంచ వ్యాప్తంగా మీడియాఅనే ఆయుధాన్ని పట్టుకుని, ప్రపంచాన్ని ఆడించిన, ఆడించ చూస్తున్న వ్యవస్థ!

దాన్నే నకిలీ కణిక వ్యవస్థగా చెప్పాను!

>>>అలీ అధికారంలోకి రాకముందు దేశంలో కొనసాగుతున్న బహుభార్యత్వ నిషేధం, సార్వత్రక నిర్బం ఉచిత విద్యలాంటి మహిళా హక్కులను తిరిగి కల్పించాలని, ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజాఉద్యమాలు వెల్లువెత్తాయి. దాదాపు నెలరోజుల పాటు దేశమంతా స్తంభించిపోయింది.

 విశ్లేషణ:
అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్నఅన్నట్లు.... ఈ ట్యూనీషియా నియంత అలీ, తాను అధికారంలోకి వచ్చాక, బహుభార్యత్వ నిషేధం ఎత్తేసాడన్న మాట. సో, ఎంత మందినైనా కట్టుకుని ఊరేగొచ్చు. పేదవాడు ఒక్కపెళ్ళాన్నే పోషించలేక ఛస్తున్నాడు. ఇక పదిమందినేం చేసుకు ఛస్తాడు గనక!

అలాంటప్పుడు..... ఇలాంటి వెసులు బాట్లతో అలీగారు, ఎవరికి ఏ ఫేవర్ చేసాడో తెలుస్తూనే ఉంది కదా!
కాబట్టే ప్రభుత్వాధినేతలు, వారి కుటుంబాలు, సన్నిహితులు..... కోట్లకు పడగలెత్తారు మరి! పాకిస్తాన్ లో అయినా, ఇండియా లో అయినా ఇదే వరుస!

>>>ఉద్యమకారులను ఉపశమింపజేసేందుకు అంతరంగిక భద్రతా వ్యవహారాల శాఖ మంత్రికి ఉద్వాసన పలికి, అవినీతి వ్యతిరేక కమిటిని అధ్యక్షుడు బెన్ అలీ నియమించాడు.

విశ్లేషణ:
మన సీవీసీ థామస్ కి లాగా! లేదా ఓటుకు నోటు వ్యవహారాన్ని తేల్చిపెట్టిన కిశోర్ చంద్రదేవ్ కి లాగా! గొడవలు జరిగినప్పుడు కమీటీలు వేయటం, తర్వాత వాటిని నీరుగార్చటం అనే ప్రక్రియలు ప్రభుత్వాలకు వెన్నతో పెట్టిన విద్యలు.

>>>ప్రజా ఉద్యమాలు మరింతగా విజృంభించడంతో 2014లో తాను పదవి నుంచి తప్పుకుని సార్వత్రక ఎన్నికలను నిర్వహిస్తానని కూడా ప్రకటించాడు.

విశ్లేషణ:
అప్పటి దాకా దేశాన్ని ఉద్దరిస్తానన్నాడన్న మాట. సరిగ్గా ఈజిప్టు ముబారక్ కూడా పీఠం దిగడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈజిప్టు ఏమై పోతుందోననే నా ఆందోళన అన్నట్లుగా!

వీళ్ళందరికీ తమ దేశాలంటే అంత ప్రేమా భక్తీ మరి! మరి పదుల ఏళ్ళల్లో అంత నిరుద్యోగం, అంత దుర్భర జీవితం ఎందుకు సంప్రాప్తించాయి సగటు జనాలకి? అంత సంపద ఎలా బలిసింది తమ ఆశ్రిత జనాలకి?

>>>గత శుక్రవారం రాజధాని టునిష్, ఇతర ప్రాంతాల్లో వెల్లువెత్తిన ప్రదర్శనలు, చెలరేగిన హింసాత్మక ఘటనల కారణంగా బెన్ దేశం విడిచి పారిపోక తప్పలేదు. అల్లర్లలో బెన్ అలీ అల్లుడు మహమ్మద్ సఖేర్ ఎల్ మతేరిని ఉద్యమకారులు సజీవం దహనం చేశారు.

విశ్లేషణ:
దొరికితే తనకీ అదే గతిఅన్నంత స్థితి వచ్చాక గానీ పలాయన బాట చేపట్ట లేదు సదరు అలీగారు.


మరిన్ని  విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.      
              సర్వేజనా సుఖినో భవంతు!

ఈ టపాల మాలికలో ముందుగా చెప్పినట్లు..... సహన క్రోధాలకు పరిమితులున్నాయి. సహనం చూపాల్సిన చోట క్రోధం చూపినా, క్రోధం చూపాల్సిన సమయంలో సహనం వహించినా ఫలితం నెరవేరదు.

అంతేగాక, ఆయా వ్యక్తులు ఆయా సందర్భాలకి స్పందించే తీరు కూడా వేర్వేరుగా ఉంటుంది. ఒకే విషయానికి ఒకరు చాలా సేపు సహనంగా ఉండొచ్చు, మరొకరు తృటిలోనే సహనం కోల్పోయి క్రోధంలోకి దిగవచ్చు. అది ఆయా వ్యక్తుల ప్రవర్తనా సరళిని బట్టి, దృక్పధాన్ని బట్టి ఉంటుంది. వ్యక్తుల కుటుంబ నేపధ్యమూ, చిన్నతనం నుండి పెరిగిన తీరు కూడా వారి వారి సహన క్రోధ స్వభావాలని ప్రభావ పరుస్తుందంటారు.

ఇది ఒక వ్యక్తి కైనా వర్తిస్తుంది, ఒక జాతికైనా వర్తిస్తుంది. సాధారణంగా నివసించే ప్రాంతపు నెసర్గిక స్వరూపాన్ని బట్టి, శీతోష్ణ స్థితి గతులుంటాయి. దాన్ని బట్టి పాడి పంటల తీరు తెన్నులుంటాయి. వాటిని బట్టే ఆచార వ్యవహారాలు, స్వరూప స్వభావాలూ ఉంటాయి. జీవన సరళీ ఉంటుంది.

కాబట్టే ఉష్ణ మండలాల్లో నివసించే ఆఫ్రికన్లు... నల్లగా ఉంటారు, వారి జీవన సరళి, స్వరూప స్వభావాలు విభిన్నంగా ఉంటాయి. సమశీతోష్ణ మండలాల్లో బ్రతికే వారి శరీరచ్ఛాయ దగ్గరి నుండి జీవన శైలి వరకూ వారిదైన తీరుంటుంది. అతి శీతల ప్రాంతాల్లో బ్రతికే వారి తీరు వారి స్వంతం. ఒకే రాష్ట్రంలో ప్రాంతీయ బేధాలు స్వల్ప వైవిధ్యాలతో ఉంటే, ఒకే దేశంలో ప్రాంతీయ భేధాలు మరికొంత స్పష్టంగా ఉంటాయి.

ఉదాహరణకి దక్షిణ భారతీయులు ‘నేషన్’ అని పలికే Nation ని, ఉత్తరప్రదేశ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు ‘నేసన్’ అని పలుకు తారు. వారికి ‘ష’ పలకదు.

అలాగే పాశ్చాతులకీ మనకీ స్వరపేటిక నిర్మాణం సైతం స్వల్ప భేధాలతో ఉంటుందనీ, అందుకే ఉచ్ఛారణా వ్యత్యాసాలు ఉంటాయనీ నిపుణులంటూ ఉంటారు.

అలాంటి చోట.... ఆయా విషయాల మీద స్పందించేటప్పుడు, సహనం, క్రోధాల తీరు కూడా.... ఆయా దేశాల ప్రజల దృక్పధాన్ని బట్టి ఉంటుంది కదా!

ఈ నేపధ్యంలో, ఇప్పుడు అరబ్ దేశాలని పట్టి ఊపుతున్న ఉద్యమాలు, మనకు ఆసక్తిని కలిసిస్తున్నాయి.

‘ఆ స్థితి మన దేశంలో సంభవిస్తుందా?’ అన్న కుతూహలాన్ని రేపుతున్నాయి.

“అదంత తేలిక కాదు”

“అయినా ఏ ఉద్యమమూ ఒరగ బెట్టేదేం లేదు. ఆ ఉద్యమాలనీ అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది”

“అయినా మన వాళ్ళల్లో ఆ చేవ చచ్చింది. మనదేశంలో ఛస్తే అలాంటి విప్లవాలు రావు”

....... ఇలా, పలురకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

అసలేం జరుగుతోంది?

యెమన్ – ఈజిప్టులలో..... ఏం జరిగింది.

ఇప్పుడు లిబియాలో..... ఏం జరుగుతోంది?

అరబ్ దేశాలలో సంభవించిన విప్లవాలు, భారత్ లో ఎందుకు రావటం లేదు?

అక్కడున్నంతగా ఇక్కడ పరిస్థితులు విషమించలేదా – ఇదో సందేహం!

గాడిద గుడ్డేం కాదూ? ఎక్కడైనా దోపిడి తీరు ఒకటే! – ఇది సమాధానం.

మరి? అరబ్బు దేశాల ప్రజల్లో, అంతగా చైతన్యం వెల్లివిరిస్తే..... భారతీయులు అంతగా చేవచచ్చి ఉన్నారా? – ఇది మరో సందేహం.

‘అయి ఉండొచ్చు’ – అన్నది ప్రాధమిక సమాధానం.

అయితే దానికి కార్యకారణాలేమిటి?

పర్యవసానాలేమిటి?

ఈ పరిస్థితికి పూర్వపరాలేమిటి?

భవిష్యత్తులోనైనా, ప్రజా చైతన్యం ఇక్కడా వెల్లివిరుస్తుందా?

ఎప్పటికీ ఇదే దోపిడి నడుస్తుందా?

ఇలా..... ఎన్నో ప్రశ్నలు!

ప్రక్కనున్న చైనా ఇనుప తెరల మధ్య నుండి కూడా..... ‘విప్లవం వస్తుందేమోనని’ పాలకులు ఉలిక్కిపడిటం వినబడుతూనే ఉంది.

ఇది భారతీయుల్లో చాలామందికి ఒకింత ఉక్రోషం కూడా కలిగిస్తుంది.

నిజానికి...... చైనా.... ‘రానున్న రోజుల్లో ఉచ్ఛస్థితి నందుకోడానికి ఉరుకుతోందనీ, రానున్న కాలంలో చైనానే అగ్రదేశమని..... అక్కడి వృద్ధిరేటు xyz శాతమనీ..... చైనీయులలో దేశభక్తి చాలా ఎక్కువని..... ఇంకా అదనీ ఇదనీ’ అరుస్తున్న చోట..... విప్లవం వస్తుందేమోనని చైనా పాలకులు ఉలిక్కి పడుతున్నారంటే అర్ధం ఏమిటి?

దీన్ని బట్టి, ఇనుప తెరల కావల, సగటు చైనీయుడు ఎంతగా దగా పడుతున్నాడో, దోపిడికి గురవుతున్నాడో అంచనా వేయవచ్చు. దానికి తార్కాణమే భారత్ లో కంటే కూడా చైనా, రష్యాలలో అవినీతి చాలా ఎక్కువన్న వార్తలు! అవినీతి ఎక్కువ ఉంటే ఎవరు లాభపడతారే మనకి ఇప్పుడు బాగానే అర్ధమవుతుంది కదా!

ఈ నేపధ్యంలో..... నేడు అరబ్బు దేశాల్లో వినిపిస్తున్న విప్లవ ధ్వని.....

ముబారక్ లకు వినిపించిన.....

గడాఫీలకు వినిపిస్తోన్న......

సోనియాలకు వినబడనున్న.......

యముని మహిషపు లోహ ఘంటలు......!

‘వినబడితీరతాయా?’ అంటే.... నిస్సందేహంగా!

అయితే ఈజిప్టుకీ ఇండియాకీ తేడా ఉంది, ఉంటుంది.

అదెలాగో ఓ పరిశీలనా, అలాగెందుకో ఓ విశ్లేషణా చేసే ముందు.....

ఓ చిన్నవివరణ!

1992 జూన్ లో, పీవీజీకి, సుదీర్ఘ కాలంగా ప్రపంచవ్యాప్తంగా అల్లుకుని ఉన్న గూఢచర్య వలయం గురించీ, నకిలీ కణిక వ్యవస్థ గురించీ వివరాలు తేటతెల్లమైనప్పుడు.... ఒక్కసారిగా ప్రపంచ రాజకీయ అవనిక మీద, భారత్ కు ప్రాముఖ్యత పెరిగింది. హఠాత్తుగా భారత్ తో చాలాదేశాల అధినేతలకి అవసరాలు కనబడ్డాయి.

దాంతో ఎడాపెడా, మన వారికి ఆహ్వానాలు అందాయి. పలు దేశాల అధినేతలు భారత్ సందర్శనకు ఉత్సుకత చూపటమే కాదు, ఉరుక్కుంటూ వచ్చారు కూడా! పార్లమెంటరీ వ్యవహారాలు పరిశీలించాలనే పైకారణాలతో, ప్రజా ప్రతినిధుల బృందాలు, పలుదిక్కుల నుండి ఇక్కడికీ, ఇక్కడి నుండి పలు దిక్కులకీ..... పదే పదే తిరిగారు.

ఆ ‘ఎరా’లో భారత్ సందర్శనకి వెంటనే పరుగెత్తుకు వచ్చిన వాళ్ళల్లో అతిముఖ్యుడు హోస్నీ ముబారక్! అతి తక్కువ కాలవ్యవధిలో, మరో సారి భారత్ సందర్శించిన వాడూ ముబారకే! ఎంతో హడావుడిగా, ఆతృతగా, లాబీయింగ్ చెయ్యడానికి శ్రమించిన వ్యక్తి! మారిన గూఢచర్య పరిధితుల్లో పరిస్థితుల గురించి కూపీలాగటం చాలా అవసరం మరి?

ఇప్పుడు పీఠం కోల్పోయి, కోమాలోకి వెళ్ళిపోయిన హోస్నీ ముబారక్!

ఇది రాజకీయ నాయకులకు వచ్చే మహా మాయరోగం లెండి!

బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిన నేరం క్రింద అరెస్టయినప్పుడు బాలకృష్ణకి వచ్చిందే అలాగన్న మాట!

నానా గడ్డి తిన్న తమ ఆర్ధిక అక్రమాలు, నేరాలు బయటపడి అరెస్టయిన మరుక్షణం, పలువురు రాజకీయ రాబందుల గుండెలకి హఠాత్తుగా ‘అటాక్’ వచ్చేస్తుంది చూడండి, అలాగన్న మాట.

ఇప్పుడు కూలిపోయిన ఈ ముబారక్..... నకిలీ కణిక వ్యవస్థకి ముఖ్యమైన స్థంభాలలో ఒకటి!

శిధిల మౌతూ ఉన్న నకిలీ కణికుల గూఢచర్య భవనపు స్తంభం కూలుతున్న చప్పుడది!

ఇప్పుడు, ప్రపంచ అత్యంత ధనవంతుడిగా పేరు వినిపిస్తున్న ముబారక్ పతనం.... దీవులకి దీవులే కొనుగోలు చేసుకుని, సుఖభోగాల్లో తేలి పోగలమని కలలు గన్న ఎందరికో అశనిపాతం, మరెందరికో ఓ హెచ్చరిక!

సామాన్య ప్రజలకి ఆ కేకలు వినబడక పోయినా.... సోనియాకీ, ఆమె చేతిలో కీలు బొమ్మ వంటి మన్మోహన్ సింగ్ లకీ శుభ్రంగా, స్పష్టంగా వినబడతాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఏజంట్లకి బాగా అర్ధమౌతాయి.

నకిలీ కణిక అనువంశీయులకి స్టీరియో ఫోనిక్ లో వినబడతాయి, 70 ఎంఎం లలో కనబడతాయి.

ఎందుకంటే అది వారికి అర్ధమయ్యే నిగూఢ భాష మరి!

ఇక ఈజిప్టు – లిబియాల వంటి ఉద్యమాలని పరిశీలిస్తే....

ముందుగా ఆఫ్రికా ఖండంలోని టునీషియా తో ప్రారంభిద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

[ముందుగా ఓ చిన్న వివరణ –

భారతీయ ఇతిహాసాల మీద కుట్రని వివరించే క్రమంలో.... రామాయణ విషవృక్షాల వంటి రచనలూ, రంగనాయకమ్మల వంటి రచయిత్రి/రచయితలూ కుట్రకు సహకరించిన తీరు గురించి వివరించటమే తప్ప.... నాకు, సదరు రచయితలూ, రచయిత్రుల పట్ల కసీ ద్వేషాల్లాంటివి లేవు. అలాగని రంగనాయకమ్మల వంటి వారి స్థితి పట్ల జాలీ దయా కూడా లేవు. కుట్రకు సహాయంగా, వారి చర్యల ఫలితాల్నీ, తీరుతెన్నుల్నీ, పూర్వాపరాలనీ వివరించటమే నా ఉద్దేశం. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ విశ్లేషణని పరిశీలించగలరు.]

రావణ సోదరి శూర్పణఖ కథ సందర్భంలో.... రంగనాయకమ్మ, ఇంకా అలాంటి ఇతర వ్యక్తుల వాదన ఎలా ఉంటుందంటే..... సీతారామ లక్ష్మణులు పంచవటిలో నివసిస్తున్నప్పుడు శూర్పణఖ వారిని చూస్తుంది. రామ లక్ష్మణులని చూసి మోహ పడుతుంది. రాక్షస వనితగా తనకు గల కామరూప విద్యతో అందమైన మానవ కాంత రూపంలో శ్రీరాముడి దగ్గరి కొస్తుంది.

రాముడితో “ఓ సుందరాకారా! చూడు! నేను సౌందర్యవతిని. నీవు సుందరుడవు. ఈ ప్రకృతి నయన మనోహరంగా ఉంది. నాకు నీ మీద మనసయ్యింది. సమయాన్ని ఆనందంగా అనుభవిద్దాం” అంటుంది.

రాముడు తిరస్కరిస్తూ “నాకు భార్య ఉంది. మరో స్త్రీని కోరను. అదిగో నా సోదరుడు లక్ష్మణుడున్నాడు. అతడిని అడుగు” అంటాడు.

లక్ష్మణుణ్ణి చూసిన శూర్పణఖ అతడూ అందంగానే ఉన్నాడు అనుకుంటూ వెళ్ళి కోరిక వెళ్ళడిస్తుంది.

లక్ష్మణుడితో ఆమె తన కోరిక వెల్లడించినప్పుడు, అతడు “నేను శ్రీరాముడి సేవకుడను. నాతో నీవేమి సుఖించగలవు? నీవూ రాముడికి సేవిక కాగలవు. కాబట్టి వెళ్ళు” అంటాడు.

రంగనాయకమ్మ వాదన ప్రకారం..... రామ లక్ష్మణులు ఈ విధంగా శూర్పణఖతో ఆడుకున్నారు. ఆపైన ముక్కు చెవులు కోసి పరాభవించారు. ఇష్టం లేదంటే అదే చెప్పాలి గానీ ‘తమ్ముడి దగ్గరికి పో’ అని అన్న, ‘అన్న సేవకుణ్ణని’ తమ్ముడు..... ఎందుకిలా ఆడ (రాక్షసి)దానితో ఆడుకోవటం?

నిజానికి శూర్పణఖ హిపోక్రసీ లేకుండా, సూటిగా తన కోరికని చెప్పింది (అట). ఆమె హిందూ ఆర్ధడాక్స్ (సనాతన వాదుల) లాగానో, ఆర్యరాజుల లాగానో (ఆర్యుల గురించిన చారిత్రక వాదాలిక్కడ అప్రస్తుతం) గాకుండా, ఏ డొంక తిరుగుడూ లేకుండా ‘ఫ్రాంక్’గా ప్రకృతి సహజమైన తన కోరికని వెల్లడించింది(అట). ఓపెన్’గా తన వాంఛ వివరించింది(అట).

అలాంటి చోట.... రామలక్ష్మణులు ఆమె మీద ప్రాక్టికల్ జోకులు వేసారు (అట). ఆ విధంగా వాళ్ళిద్దరూ స్త్రీ పట్ల అది ఘోరమైన తప్పు చేసారు.

శూర్పణఖ దృష్ట్యా.... ఆ విధంగా కోరిక వెల్లడించటం, వివాహంతో నిమిత్తం లేకుండా నచ్చిన వారితో భోగించడం వారి జాతిలో సహజం. అదేమీ తప్పుకాదు. అలాంటి ఆచార వ్యవహారాలు రాక్షస జాతిలో సహజం. అవేవీ పట్టించుకోకుండా, రామలక్ష్మణులు శూర్పణఖని అవమానించారు. – ఇదీ సదరు విష వృక్ష వాదం.

ఎంతటి వితండ వాదమూ, కుతర్కమూ ఇది!?

ఎవరైనా ఆటవికులు.... చిక్కని అడవి నుండి వచ్చి, మన భూమిలోని చెట్లను నరికి, వాటిని తీసుకెళ్తూ, ‘తమకు నచ్చిన చెట్టును నరుక్కొని తీసుకెళ్ళటం తమ వ్యవహారాల్లో భాగమని’ అంటే – దాన్ని మనం అంగీకరిస్తామా?

అంతెందుకు? అడవిలో బ్రతికే వాడెవరైనా వచ్చి ‘అడవుల్లో మేం ఎక్కడంటే అక్కడ, మలమూత్ర విసర్జన చేస్తాం, అది మా అలవాటు’ అంటూ నగరాల్లో.... నడివీధుల్లోనో, పార్కుల్లోని పచ్చిక మీదో, మన ఇంటి ముంగిటి తోటలోనో మలమూత్రాదులు విడిస్తే...., ‘ప్రకృతి సహజంగా తమకు విసర్జనావసరం వచ్చింది, తీర్చుకున్నాం’ అంటే ఒప్పుకుంటామా?
““
‘‘సర్లే! అది వాళ్ళకి సహజం. అది వాళ్ళ జీవన శైలి’ అని సరిపెట్టుకుంటామా? వ్యతిరేకించి మన ప్రతిఘటన చూపించమా?

[ఇంత చిన్న విషయాలకే మనం వ్యతిరేకత చూపిస్తామే, అలాంటిది శ్రీరాముడంతటి వాడు శీలం విషయంలో చూపించడా?]

తప్పనిసరిగా వాళ్ళ ఆచార వ్యవహారాలనీ, అలవాట్లనీ, జీవనశైలినీ తిరస్కరిస్తాం. ఏదో విధంగానో, బలవంతానో దాన్ని వాళ్ళు మన నెత్తిన రుద్దడాన్ని ఒప్పుకోం.

అలాగాక, దాన్ని వాళ్ళు మన నెత్తిన రుద్దడాన్ని సహించి ఊరుకుంటే.... కొంతకాలం గడిచేసరికి మనం మనంగా మిగలం. మనం వాళ్ళ రూపంలో ఉంటాం. ఇప్పుడు జరిగిందీ, జరుగుతోందీ అదే!

వాస్తవానికి..... నకిలి కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల లక్ష్యం అదే, భారతీయులనీ, భావవాదులనీ, పదార్ధ వాదులుగా, పరుగుదారులుగా మార్చడం!

విషవృక్షం వంటి రచనలతో, యమగోల, సతీ సుకన్యల వంటి సినిమాలతో.... భారతీయ ఇతిహాసాల మీద సైటైర్లు, విసుర్లు, హేళనాపూరిత వ్యాఖ్యానాలూ చేసి ఆ లక్ష్యాన్ని సాధించుకునే ప్రయత్నం చేసారు. కొంత వరకూ విజయం సాధించారు. ఇప్పుడు సమాజం, మనమూ కూడా ఆ దుష్ర్పభావాన్నీ చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. జీవితాల్లో శాంతినీ, బంధాలనీ, ఆనందాలనీ పారేసుకుని వెదుక్కుంటున్నాం.

కాబట్టే కుమార్తెల వంటి శిష్యురాళ్ళ మీద అత్యాచారాలు చేసే గురువుల్నీ, ముసలమ్మల్ని సైతం విడిచి పెట్టని తాగుబోతుల్నీ చూస్తున్నాం!

ఇక ఇప్పుడు రామాయణంలోని శూర్పణఖ అసలు కథని క్లుప్తంగా పరిశీలిద్దాం.

వనవాస దీక్షలో ఉన్న సీతారామలక్ష్మణులని చూసిన శూర్పణఖ, రాముడిపై మోహపడి, దాపుకొచ్చి తన వాంఛ వెల్లడించినప్పుడు, శ్రీరాముడామెతో “నేను భార్యతో ఉన్నవాడను. అదీగాక ఏకపత్నీ వ్రతం గలవాడిని. కాబట్టి మరో స్త్రీని కోరను. నీవంటి దానికి సవతిపోరు బాగుండదు. అదిగో నా తమ్ముడు లక్ష్మణుడున్నాడు. అతడూ ప్రియదర్శనుడు. మంచి వయస్సులో ఉన్నాడు. అతణ్ణి పొందితే ఏ బాధా ఉండదు” అన్నాడు.

‘అతడూ ప్రియదర్శనుడు అనటంలో నీకు రూపమూ, కామమూ తప్ప, మనస్సుతోనూ, ప్రేమాభిమానాతోనూ, భావాలతోనూ, పని లేనట్లయితే.... అతణ్ణి కోరు’ అనే సూచన ఉంది.

శూర్పణఖ వ్యక్తపరిచిన కోరికలోని కామానికి అది సూటి జవాబే కదా!?

లక్ష్మణుణ్ణి చూసిన శూర్పణఖ ‘అతడూ బాగున్నాడు’ అనుకొని చెంత చేరి వలపు తెలిపింది. అంతగా దేహ సౌందర్యం పట్ల కాంక్షామోహాలు గలది శూర్పణఖ! కాబట్టే రాముడు కనబడితే కాంక్షించింది. ‘రాముడు గాకపోతే లక్ష్మణుడు’ అనుకుంది. ఎవరైనా ఫర్లేదు, ఆమె కాముకత్వం తీరటమే ఆమెకు ప్రధానం.

లేకపోతే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళేదే కాదు. సుఖభోగాలను బావుకోవాలనుకునే ఆమె బుద్దికి పూర్తి విపర్యయం సీతాదేవి! ప్రాణత్యాగానికైనా సిద్దపడిందే గానీ రావణుణ్ణి అంగీకరించలేదు, ధర్మమార్గాన్ని విడిచి పెట్టనూ లేదు. శ్రీరాముడి బుద్దీ శూర్పణఖకు విపర్యయమే! సతిని తప్ప పరస్త్రీని కోరని పురుషుడు రాముడు. కంటికి నచ్చిన వారితో శృంగారం అభిలషించింది శూర్పణఖ.

ఆ విధంగా కామం తప్ప ప్రేమ తెలియని శూర్పణఖని చూసి లక్ష్మణుడు “నేను సేవకుణ్ణి. నీ వంటి స్వేచ్ఛా విహారిణి నా వంటి సేవకుడితో పొందగల సౌఖ్యమేమిటి?” అన్నాడు. శూర్పణఖ మళ్ళీ శ్రీరాముడి వైపు మళ్ళింది. సీతాదేవితో సహా రామలక్ష్మణులకి శూర్పణఖ కాముకత్వం, చంచలత్వం అర్ధమైంది. శూర్పణఖ ‘సీత ఉండబట్టే కదా రాముడు తనని నిరాకరించాడు. కాబట్టి ఈమెను తినేస్తాను” అంటూ సీతకి హాని చేయ తలపడింది.

అప్పుడు లక్ష్మణుడామె ముక్కూ, చెవులూ కోసాడు. రాక్షసి అయినా, కౄరస్వభావం కలిగినదైనా, స్త్రీ కాబట్టి ప్రాణాలతో విడుస్తున్నానంటూ పరాభవించి పంపాడు.

రంగనాయకమ్మల వంటి విష గ్రంధ రచయితల వాదన ప్రకారం....‘రాక్షసులు, మనుష్యుల్లాగా, ప్రత్యేకించి శ్రీరాముడి వంటి రాజ వంశీయుల్లాగా హిపోక్రైట్ కాదు. తమ మనస్సులోని భావాలని అరమరికలు లేకుండా వ్యక్తపరుస్తారు. ఆకలీ దాహాల్లాంటివే కామవాంఛలు కూడా! తనకి కోరిక కలిగింది. దాన్ని వ్యక్తీకరించింది శూర్పణఖ. అందునా అది వారి జీవన విధానం. వారి ఆచారాలు వాళ్ళవి. అందులో తప్పేముంది? అలాంటి చోట రామలక్ష్మణులామెతో ప్రాక్టికల్ జోకులు వేసారు. ముక్కు చెవులు కోసారు. –

ఇది సరైనదే అనుకుందామన్నా.... శూర్పణఖ అంతటితో ఆగలేదే? సీతని మింగబోయింది. ఆ విధంగా తన కోరికకు అడ్డంకిని తొలగించుకోవాలనుకుంది.

అదీగాక, ఆ విష వాదనలే సబబైతే.... శూర్పణఖ రావణుడి దగ్గరికి వెళ్ళి ప్లేటు ఫిరాయించిందేం? నచ్చిన వాడితో శృంగారాన్ని ఆనందించటం తమ ఆచారమైనప్పుడు, తాను రాముణ్ణి కుదరకపోతే లక్ష్మణుణ్ణి కామించి సీతని మింగబోవటం చేత, వాళ్ళు తన ముక్కూ చెవులూ కోసారని చెప్పుకోలేదేం?

మరెందుకు “అన్నా! దండకారుణ్యంలో రామలక్ష్మణులనే సూర్యవంశ రాజపుత్రులు నివసిస్తున్నారు. వారిలో రాముడి భార్య సీత అద్భుత సౌందర్యవతి. నీ అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ ఆమె కాలిగోటికి కూడా సరిరారు. ఆమె నీ రాణిగా ఉండటానికి అర్హురాలు. నేనామెను నీకు బహుమతిగా తెచ్చేందుకు పట్టబోగా, వారు నా ముక్కు చెవులూ కోసి పంపారు. కనీసం ఆడదాన్ననైనా చూడకుండా పరాభవించారు” అని చెప్పింది?

అందునా ఆమె స్త్ర్రీకి సహజమైన ప్రవర్తన కూడా చెయ్యలేదు. తన కోరిక వెల్లడించేటప్పుడు కాదు, సీత మీద తన శారీరక బలం చూపించేటప్పుడు, తను స్త్రీ అని భావించిందా? బలం ఉంది కాబట్టి చంపెయ్య గలను అనుకుంది. అదే తాను అన్నకు చెప్పుకునేటప్పుడైతే “రామలక్ష్మణులు తన మీద ఆడదని కూడా కనికరం చూపలేదు” అని చెప్పుకుంది. ఇలాంటి శూర్పణఖ రంగనాయకమ్మలకీ, అలాంటి రచయిత్రుల్ని ప్రోత్సహించిన నకిలీ కణిక అనువంశీయులకీ ఏమాత్రం హిపోక్రైట్ గా కనబడలేదు.

ఆ విధంగా వాళ్ళు… సమాజం మీదికి, గుడ్డి వాదనలనీ, కుతర్కాలనీ గుమ్మరిస్తూ, మంచిని చెడుగా చిత్రిస్తూ విషాలు విరజిమ్మి పారేసారు. బహుశః రంగనాయకమ్మలకీ, యార్లగడ్డ లక్ష్మీప్రసాదులకీ వాళ్ళ కారణాలు వాళ్ళ కుండవచ్చు. అయితే మూల కారణం మాత్రం హిందూ ఇతిహాసాల మీద దుష్ప్రచారం నిర్వహించే కుట్రే! అందుకే అంతగా ‘తెలుపుని నలుప’నే అంధత్వం అందిపుచ్చుకున్నారు.

ఇక రామాయణంలో.... శూర్పణఖ ఉదంతం అనంతరం..... రావణుడు సీతని అపహరించాలనుకుంటాడు. రాముణ్ణి ఎదుర్కొని యుద్దం చేసి సీతని తీసుకుపోవాలనుకోలేదు.

వాస్తవానికి…. పరసతిని ఎత్తుకుపోవటం, లేదా ఎదుటి వాడితో యుద్ధం చేసి (అంటే తన్ని తగలేయటమన్న మాట) వాడి భార్యని తీసుకుపోవటం, రెండూ తప్పే. కాని రెండింటినీ... ఒక దానితో ఒకటి పోల్చినపుడు, దొంగిలించటం పిరికితనం కాగా యుద్ధం చేసి గెలవటం, కనీసం ‘ధైర్యం కలిగి ఉండటా’న్ని సూచిస్తుంది.

రావణుడు బహుశాస్త్ర పారంగతుడు, పండితుడు, సంగీతాది విద్యలందు ఆరితేరిన వాడు, రాజనీతిజ్ఞుడు, శివభక్తుడూ అయినప్పటికీ.... శ్రీరాముడితో తలపడేంత ధైర్యం లేక మోసాన్ని, దొంగతనాన్ని ఆశ్రయించాడు.

చివరికి శ్రీరాముడు వానర సేనని సమీకరించి లంక మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు కూడా, రావణుడు శ్రీరాముడితో చివరి దశలో గానీ యుధ్దానికి దిగలేదు. ఇంద్రజిత్తు, కుంభకర్ణుడితో పాటు ఎంతోమంది దానవ వీరులూ, రావణపుత్రులూ యుద్ధంలో మృతి చెందాక, ఇక అనివార్యమైన స్థితిలో యుద్ధరంగానికి వస్తాడు రావణుడు.

అందుకు రావణుడి వాదనలు (లేదా రావణుడి తరపు వకాల్తా పుచ్చుకున్న విషగ్రంధ రచయితలూ/రచయిత్రుల వాదనలు) ఎలా ఉన్నా సరే.... అంత్యదశ వరకూ శ్రీరాముడితో యుధ్దానికి రావణుడు సంసిద్ధుడు కాకపోవటం మాత్రం అందరూ ఒప్పుకునేదే! (దీనికి అనువర్తన మరెప్పుడైనా!)

ఈ విధంగా రంగనాయకమ్మలు రావణుడిలో సకల సుగుణాలనీ చూడగలరు, శ్రీరాముడిలో హిపోక్రసీని, ఇంకా ఎన్నో దుర్గుణాలనీ చూడగలరు. అదీ కుట్రతీరూ, కుట్రకు మద్దతిచ్చిన తీరు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఈ రోజు శివరాత్రి!

ఉపవాసాలు, జాగరణలతో బాటు జాతరలతో శైవ క్షేత్రాలు కళ కళలాడుతుంటాయి.

ముఖ్యంగా శ్రీశైలంలో....

శివదీక్షా స్వాములతో, ఎటు చూసినా ‘శివా శివా’ అన్న పిలుపులతో..... అక్కడి లోయలూ, కొండలే కాదు, దుమ్ముధూళిలో కూడా భక్తిభావం పొర్లుతూ ఉంటుంది.

అసలు ‘మల్లయ్యా’ అన్న పిలుపే మధురంగా తోస్తుంది.

ఎంత చల్లని సామి మల్లయ్య!

సువర్ణ మందిరాలు, సిరిసంపదలూ లేని స్వామి.

భోళా శంకరుడనీ, భక్త సులభుడనీ....ఆర్తితో పిలిస్తే తొందరగా ఆలకిస్తాడనీ, ఆపద నుండి ఆదుకుంటాడనీ భక్తుల ఆశ!

లయకారుడనీ, రౌద్రుడనీ.... ఒకింత వెరపు కూడా!

సృష్టికి విధ్వంసం కూడా అవసరమే కదూ!

పాతది పోనిదే కొత్తది వచ్చేదెలా?

అందుకే నేమో! శివతత్త్వం అర్ధం చేసుకోవటం బహుకష్టం అంటారు పండితులు!

తత్త్వాలు అర్ధం చేసుకునేంత దృశ్యాలు ఎటూ మనకి లేదనుకొండి!

ప్రేమతో భక్తితో భజిస్తే చాలు! చల్లగా చూసే స్వామి మల్లయ్య!

ఈ సందర్భంలో.... ‘మూగ మనసులు’ సినిమాలోని ఘంటసాల సుశీల బృందం పాడిన ‘గౌరమ్మా! నీ మొగుడెవరమ్మ’ అన్నపాట గుర్తు కొస్తోంది.

మరదలిని ఏడిపిస్తూ..... ఓ పల్లెటూరి మామఁ

“గౌరమ్మ నీ మొగుడెవరమ్మా

ఎవరమ్మా.... వాడెవరమ్మ” అంటాడు.

ప్రతిగా ఆమె

“చెప్పాలంటే సిగ్గు కదయ్యా! ఆనవాలునే చెబుతానయ్య!” అంటుంది.

‘చెప్పు చెప్పు’ అన్న ప్రోత్సాహంతో,

“సిగలో నెలవంక, మెడలో నాగరాజు

ఆరేడు నావాడు సరిరారు వేరెవరూ

మావఁయ్యా నా మొగుడెవరయ్య! ఎవరయ్యా వేరెవరయ్యా!”

అంటూ చెప్పకనే చెబుతుంది.

ఇక ఆ పల్లెటూరి మాఁవ, వ్యంగ్యాలు పోతూ....

“ఇల్లూ వాకిలి లేని వాడు, లే...నీ... వాడూ, లేనివాడు

బిచ్చమెత్తుకుని తిరిగే వాడు.

మాదాకవళం.

ఎగుడూ దిగుడూ కన్నుల వాడు, జంగం దేవర నీవాడా!” అనేస్తాడు.

ఇక చూడండి గౌరమ్మ సమర్ధింపు!

“ఆకాశమే ఇల్లు, లోకమే వాకిలీ!.... అవును!

బిచ్చమడిగేది భక్తి! బదులు ఇచ్చేది ముక్తి!

బేసి కన్నులే లేకుంటే బెంబేలెత్తును ముల్లోకాలు” అంటుంది.

ఇక ఇలా కాదని ఆ గడుసు గౌరమ్మని నిలేస్తూ... ఈ మామ

“మొగుడు మొగుడని మురిసావే, పొగిడావే, పిల్లోయ్!

నెత్తిన ఎవరినో ఎత్తుకొని నిత్యం దానినే కొలుచునట

ఆమెయె ఆతని ఆలియట. కోతలు ఎందుకు కొస్తావే!?” అంటాడు.

గౌరమ్మా మజాకా! ఎంత గడసరిగా బదులిస్తుందో చూడండి.

“యెవరో పిలిస్తే వచ్చింది, యెవరి కోసమో పోతోందీ

మయాన మజిలీ యేసింది, మయాన మజీలీ యేసింది.

సగం దేహమై నేనుంటే..... అది పెళ్ళామంటే చెల్లదులే

పళ్ళుపదారు రాలునులే” అంటుంది.

ఇంతకీ పళ్ళు పదారు రాలేది ఎవరికి?.... ‘గంగ శివుని భార్య, అన్న వాళ్ళకా?

లేక ఆ మాటన్నాడంటే...... ఆయనకైనా సరే, పళ్ళు పదారు రాలుతాయంటుందా?

ఎంత గడుసు గౌరమ్మో కదా!

అసలుకే, అర్ధనారీశ్వరుడై, ఆలుమగల అరమరికలు లేనితనాన్ని, అఖిల జనానికి చాటిన ఆదిదంపతులు ఆ శివపార్వతులు!

భిక్షాపాత్ర చేగొని, భార్యనే భిక్ష అడిగే జంగమ దేవర ఆయన.

అర్ధశరీరాన్ని ఆలికిచ్చేసిన ప్రియపతి ఆ పశుపతి!

ఈ పండుగ రోజున..... వారి గురించి జానపదులు ప్రేమగా చెప్పుకునే బోలెడు కల్పిత కథలలో..... ఒక కథ, మీకోసం!

ఈ కథ నాకు మరింత ప్రత్యేకమైనందండోయ్! ఎందుకంటే... ఎన్నో కథలు, నేను నా కూతురికి చెప్పినవైతే.... ఇది మాకు మా అమ్మాయి చెప్పిన కథ! తొలిసారిగా మాకు తెలియని ఓ కథని..... మాకు చెప్పినందుకు, తానూ, మేమూ కూడా మురిసిపోయామన్న మాట! ఇప్పుడు కాదులెండి ఓ ఆయిదారేళ్ళ క్రితం!

ఇక కథలోకి!

ఓ సారి పార్వతీ పరమేశ్వరులు, ఆకాశమార్గాన భూలోక విహారం చేస్తున్నారు.

మాటల సందర్భంలో అయ్యవారు “ఈ సృష్టిలో ప్రతీ పని కూడా.... కార్య కారణ సంబంధం కలిగి ఉంటుంది. ఎంత చిన్న పని అయినా, అది మరిన్ని సంఘటనలకు దారి తీస్తుంది” అన్నాడు.

అప్పటికి వారిద్దరూ ఓ ఊరి దాపున ఉన్నకొండవాలులో ఉన్నారు. అక్కడున్న పచ్చిక మేస్తూ కొన్ని గొర్రెలున్నాయి. వాటిని కాస్తూ ఓ పిల్లాడున్నాడు. వాడు ఊసుపోక గోళ్ళు కొరుక్కుంటున్నాడు.

ఈశుని మాటలకు నవ్వుతూ ఈశ్వరి “స్వామీ! ఇప్పుడీ గొర్రెలు కాసే పిల్లవాడు, పనేం లేక గోళ్ళు కొరుక్కుంటున్నాడే! దీనికీ కార్యకారణ సంబంధాలు, పర్యవసానాలూ ఉంటాయంటారా?” అంది.

సన్నగా నవ్వాడు శివుడు.

“నిశ్చయంగా ఉంటాయి దేవి!” అన్నాడు.

“అయితే చెప్పండి. ఇప్పుడీ పిల్లాడు గోళ్ళు కొరకడంతో ఏం జరగబోతోంది? ప్రళయం వస్తుందా?” అంది అంబ.

“ప్రళయం రాదు గానీ అంతే అల్లకల్లోలం అవుతుంది. వీడు గోళ్ళు కొరకటం ద్వారా ఓ పావురం మరణిస్తుంది. ఈ దేశాన్నేలే రాజు మరణిస్తాడు. ఈ దేశంలో అరాచకం చెలరేగుతుంది – చివరికి దేవలోకాలు కూడా అల్లకల్లోలం అవుతాయి” అన్నాడు పరమ శివుడు.

“స్వామీ! అదెలా జరుగుతుందో చూద్దామని నాకు కుతూహలంగా ఉంది. మనం ఇక్కడే కొన్నాళ్ళుండి ఏం జరుగుతుందో పరిశీలిద్దాం” అంది పార్వతి.

ఇల్లాలు అడిగితే ఈశుడు కాదాంటాడా? సతి మాటలకు సరేనన్నాడు.

ఇంతలో గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్న పిల్లాడు, నోట్లో ఉన్న గోటిని బయటకు ఊసి, బొడ్లో దోపుకున్న మూటలోంచి మరమరాలు తీసి తినటం ప్రారంభించాడు. గాలికి కొన్ని మరమరాలు అతడి చుట్టూ పడ్డాయి.

అవి చూసిన ఓ పావురం, చెట్టు మీది నుంచి అతడి దాపులనే వాలి, మరమరాలు తినసాగింది. అలా తింటూ తింటూ, పొరపాటున పిల్లవాడు కొరికి పారేసిన గోటిని కూడా మింగేసింది. అయితే ఆ గోరు కాస్తా, పావురం గొంతులో గుచ్చుకు పోవటంతో, పాపం ఆ పావురం, ఉక్కిరి బిక్కిరయ్యింది. గిలగిల కొట్టుకుంది.

గొంతులో కుచ్చుకున్న గోరు మూలంగా పావురం ఆహారం తినలేకపోయింది. అనారోగ్యం పాలైంది. గోరు కారణంగా దాని శరీరం విషపూరితం అయ్యింది. దాంతో దానిలో చురుకుదనం తగ్గిపోయింది. తేలిగ్గా వేటగాడి వలలో చిక్కుకుంది.

వేటగాడు దాన్ని తెచ్చి నగరులో అమ్మాడు. దాన్ని రాజు గారి వంటవాడు కొన్నాడు.

ఆ దేశపు రాజు గారికి, రోజూ పడుకునే ముందు పావురపు రక్తం త్రాగటం అలవాటు. అలా చేస్తే మంచిదని ఎవరో చెప్పటంతో నమ్మి ఆచరిస్తున్నాడతడు.

వేటగాడి దగ్గర కొనుక్కొచ్చిన పావురాన్ని చంపి, ఆ రక్తాన్ని రాజుకిచ్చాడు వంటవాడు. విషపూరితమైన ఆ పావురపు రక్తం తాగిన రాజు గారికి కూడా, అనారోగ్యం పట్టుకుంది. ఎన్ని మందులు వాడినా.... అంతుచిక్కని జబ్బుతో కొన్నాళ్ళు బాధపడి, చివరికి రాజు గారు మరణించారు.

రాజు లేక పోవటంతో ఆ రాజ్యంలో ఆరాచకం ప్రబలింది. అది చూసి పరమ శివుడు “పార్వతీ! గొర్రెలు కాస్తున్న పిల్లవాడు గోళ్ళు కొరకటం చూసి దానికే పర్యవసానాలుంటాయి? అన్నావు. చూశావా! ఆ చిన్నపని ఎంతకి దారి తీసిందో?” అన్నాడు.

పార్వతీ దేవి అయ్యవారి మాటలను అంగీకరిస్తు “అవును స్వామీ! మీ మాట ఒప్పుకుంటాను. అయితే ప్రభూ! నాకో సందేహం! పిల్లవాడు గోరు కొరకటంతో పావురం చచ్చిపోతుంది. రాజూ చచ్చిపోతాడు. ఈ రాజ్యం అరాచక మౌతుందన్నారు. అయ్యింది. మరి దేవలోకాలు కూడా అల్లకల్లోలం అవుతాయన్నారే!” అంది.

ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు పరమ శివుడు. “మరి!? ఈ చోద్యం చూడటానికి మనం ఇన్ని రోజులూ భూలోకంలో ఉండిపోతే.... కైలాసంతో సహా దేవలోకాలన్నీ అల్లకల్లోలం కావా!? పద పద!” అన్నాడు.

“అవునండోయ్! మరిచే పోయాను” అంది అమ్మవారు బుగ్గలు నొక్కుకుంటూ!

ఇదండీ కథ!

ఈ శివరాత్రి రోజు....

మిమ్మల్నీ, మీ కుటుంబ సభ్యులనీ భ్రమరాంబా మల్లిఖార్జున స్వామి వార్లు చల్లగా చూడాలని కోరుకుంటూ......!


నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu