‘కన్నా?’ ‘కాలా?’ స్ట్రాటజీ గురించి గతటపాలలో చెప్పిందే అయినా, దానికి తాజా ఉదాహరణలివ్వ బోయే ముందు మరోసారి ‘కన్నా?’ ‘కాలా?’ స్ట్రాటజీని వివరిస్తాను.

మనం చదరంగం ఆడుతున్నప్పుడు, ఒక ఎత్తుగడ మూలంగా, మన ప్రత్యర్ధి… మన బంటునో, శకటునో చంపగల పరిస్థితిలో పడ్డామనుకొండి. ఏం చేస్తాం? శకటు కంటే బంటు ప్రయోజనం తక్కువ కాబట్టి, బంటుని వదిలేసుకుని, శకటుని కాపాడుకుంటాం. అయితే మరికొంత ఆట కొనసాగాక… ఈ సారి, ఇందాక కాపాడుకున్న శకటు, గుర్రంలలో ఏదో ఒక పావుని కోల్పోవాల్సిన స్థితిలో పడ్డామనుకొండి. అప్పుడేం చేస్తాం?

ఇంతకు మునుపు కాపాడుకున్న శకటుని వదిలేసుకుని, గుర్రాన్ని కాపాడుకుంటాం. అంటే ఇంతకు మునుపు విలువైనదిగా, ప్రయోజనకరమైనదిగా కనిపించిన శకటు, ఇప్పుడు గుర్రంతో పోలిస్తే తక్కువ విలువైనదిగా, తక్కువ ప్రయోజనకరమైనదిగా కనిపించింది.

ఆపైన గుర్రం, మంత్రి పావులలో ఏదో ఒక దాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైతే, ఈ సారి గుర్రాన్ని వదులుకుంటాం.

దాన్నే ‘కన్నా?’ ‘కాలా?’ స్ట్రాటజీగా ఉటంకించాను.

గూఢచర్యపరంగా, ‘కన్ను, కాలు’ రెండింటిలో ఏదో ఒకదాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తే… ‘కాలు?’ వదిలేసుకుని ‘కన్ను వంటి విలువైన ఏజంటునో, సమాచారాన్నో, విషయాన్నో కాపాడుకుంటారు.

మరోసారి… మునుపు ‘కన్ను’గా భావించి కాపాడుకున్న విలువైన ఏజంటు/సమాచారం తో బాటు, మరో ఏజంటు/సమాచారం… రెండింటిలో ఏదో ఒకదాన్ని వదులు కోవాల్సివస్తే ఏది విలువైనదనిపిస్తుందో ఆ ‘కన్ను’ని కాపాడుకుంటారు.

ఇలాంటి ‘కన్నా?’ ‘కాలా?’ స్ట్రాటజీకి, ఇప్పటి రాజకీయ నేపధ్యంలో, తాజా ఉదాహరణని పరిశీలిద్దాం.

నవంబరు 6 నుండి 8వ తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ సందర్శించాడు. 8 వ తేదిన పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించాడు. ‘నమస్తే ఇండియా’ మొదలు చాలా శ్లాఘనలు చేసి, తనకు కావలసిన వాణిజ్య ఒప్పందాలు చేసుకుని చక్కా పోయాడు.

ఆ మర్నాటి నుండి (నవంబరు 9వ తేదీ) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై, డిసెంబరు 13వ తేదీ దాకా కొనసాగాయి.

9 వ తేదిన, సమావేశపు తొలి నాటికి… ప్రతిపక్షాలు అజెండాలో – ముంబై ఆదర్శ్ అక్రమాలు, 2జీ స్ప్రెక్ట్రమ్ అవకతవకలు ప్రధానమైనవి.

అయితే 10వ తేదీ (బుధవారం) ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్, మీడియా సమావేశంలో ‘సోనియా సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తున్నారనీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యల్లో ఆమె కుట్ర ఉందనీ’ ఆరోపించాడు.

ఒక్కసారిగా దాని మీద సంచలనం చెలరేగింది. కొందరు కాంగ్రెస్ వాదులు, అధిష్టాన భక్తులు (వీరు బహుళ నిగ్గర్లన్న మాట) సుదర్శన్ మీద ఖఁయ్యిమన్నారు. ‘త్యాగమయి సోనియాని అంతమాటంటారా?’ అంటూ కొందరు, ‘సుదర్శన్ మీద కోర్టులో కేసు వేస్తామని’ మరికొందరు ఆయాసపడ్డారు, ఆగ్రహపడ్డారు. రోశయ్య అయితే, ముఖ్యమంత్రి హోదాలో ఉండీ స్వయంగా రోడ్డెక్కి ధర్నా చేశాడు.

పార్లమెంటులోనూ ఆ రోజు, మరునాడు రచ్చ జరిగింది.

ఇంతలో ఆర్.ఎస్.ఎస్., భాజపా గట్రా పార్టీలన్నీ ‘అది సుదర్శన్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు’ అంటూ సోనియా గురించిన సుదర్శన్ వ్యాఖ్యలతో తమకి సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు. కానీ పార్లమెంట్ లోపల కొంత, బయట మరి కొంత ఎక్కువగా రచ్చ మాత్రం కొనసాగింది.

‘సోనియా సీఐఏ ఏజంటు వ్యవహరణ, ఇందిరా, ఆమె తనయుడి హత్యల్లో సోనియా కుట్ర’ అనే వ్యవహారాన్ని ఇలా వదిలేస్తే… అది ప్రజలని మరింత ఆకర్షించి, విషయం మరింత అడుగుతట్టు దాకా ప్రాకి పోవచ్చు. మరింత లాగితే తెగి ఎక్కడ నుండి ఏ సాక్ష్యాధారాలు బయటపడతాయో? ఇది ‘కన్ను’ వంటిది.

ఈ ‘కన్ను’ని కాపాడు కోవాలంటే కాలుని వదిలేసుకోవాలి. ఆ ‘కాలు’… 2జీ స్ప్రెక్ట్రం, రాజా రాజీనామా అయ్యింది. నిజానికి రెండేళ్ళ నుండీ నలుగుతున్న వ్యవహారం 2జీ స్ప్రెక్ట్రమ్ లోని అక్రమాలు! అయినా చలనం లేని కేంద్రప్రభుత్వం, రకరకాల డ్రామాల తర్వాత, నవంబరు 14వ తేదిన, రాజా చేత రాజీనామా చేయించింది.

అప్పటి వరకూ ససేమిరా అన్న రాజా, ‘ఠాఠ్’ కుదరదన్న కరుణానిధి, ఢిల్లీ నుండి అధిష్టానం తరుపున, వారి ‘ట్రబుల్ షుటర్’ ప్రణబ్ ముఖర్జీ చెన్నై పర్యటన తర్వాత రాజీ రాజీనామాకు అంగీకరించారు.

ఆ తర్వాత ఒక్కసారిగా నీరా రాడియా టేపుల వ్యవహారం బయటికొచ్చింది. తెలుగు పత్రికలలో అయితే ఆ ‘రచ్చ’ ఆలస్యంగా ప్రారంభమైంది. యధాప్రకారం ‘కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక’ ‘ఈనాడు’ ప్రాధాన్యత లేని వార్తాంశం గానే ఈ టేపులను పరిగణించింది.

కార్పోరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో, మంత్రిపుంగవులతో సంభాషించిన టేపులు బయటకి రావడంతో చెలరేగిన గగ్గోలులో… ‘సుదర్శనం వ్యాఖ్యలు’ గాలి కెగిరి పోయాయి. అంతటితో ప్రతిపక్షాలన్నీ పకడ్బందీగా,వ్యూహాత్మకంగా… రాడియా 2జీ స్ప్రెక్ట్రమ్ వ్యవహారంపై జేపీసీకి పట్టుబట్టి, పార్లమెంటుని స్తంభింపజేయటంతో మీడియా దృష్టి మొత్తం దానిమీదే కేంద్రీకరింప బడింది.

సోనియా వ్యవహారాలు బయటికి రావటం అనే ‘కన్ను’తో పోల్చుకుంటే – ఎంతో మంది కార్పోరేట్ కంపెనీల అధిపతులూ, బ్యూరాక్రాట్లు, కేంద్రమంత్రుల నియామకాలూ, వ్యవహారాలతో ముడిపడి ఉన్న లాబీయిస్ట్ నీరా రాడియా టేపులు ‘కాలు’ వంటిదన్న మాట!

ఇందులో చురుక్కుమని పించే ఒక చమక్కు ఏమిటంటే – రతన్ టాటా ‘నన్ను ఓ మంత్రి 15 కోట్లు లంచం అడిగాడు. అటువంటి పనులు నాకు ఇష్టం లేదు. అందుకే విమాన యాన రంగంలోకి ప్రవేశించ లేదు’ అంటూ నంగనాచి కబుర్లు చెప్పాడు, నవంబరు 15వ తేదిన.

అక్కడికీ… ఇన్నేళ్ళుగా టాటాలు, అసలు లంచాలే ఇవ్వకుండా వ్యాపారం చేసినట్లు! లంచగొండితనానికి మహా‘రాణి’ పోషకులైన బ్రిటీష్ వాళ్ళ హయాంలో వ్యాపారాలూ, పరిశ్రమలూ ప్రారంభించిన ఈ పార్శీ వంశీయులు, లంచాలు ఇవ్వకుండానే వ్యాపారాలు చేశారట!

సరిగ్గా… అతడు అలాంటి నంగనాచి మాటలు చెప్పిన నాలుగు రోజులకే… నీరా రాడియాతో అతడి సంభాషణల టేపుల బయటకొచ్చాయి!

అయితేనేం లెండి! మన్మోహన్ వంటి ఆర్ధికవేత్త, రాజకీయ నాయకుడు, వాళ్ళకి అండగా ఉన్నంతకాలం, వాళ్ళకి ఇబ్బందేం ఉండదు. [అందుకే గదా ‘మన్మోహన్ వంటి నాయకుడు దొరకడం అదృష్టం’ అంటూ టాటా సెలవిస్తున్నాడు.]

కాబట్టే వాళ్ళ Right of Privacy ని కాపాడటానికి, శక్తివంచన లేకుండా నడుం కట్టాడు మన్మోహన్ సింగ్.

మొత్తానికీ టాటా తన నిజాయితీ గురించి ఢంకా బజాయించుకున్నాక, రాడియా వ్యవహారాలు బయటికి రావడమే ఇక్కడ గమ్మత్తు!

ఇంతటితో టాటా Vs నీరా రాడియా వ్యవహారాన్ని ప్రక్కన బెట్టి, మళ్ళీ మొదటి కొస్తే…

సోనియా గురించి సుదర్శన్ వ్యాఖ్యల్ని మరుగు పరచటానికి, నీరా రాడియా వ్యవహారాన్ని బయట పెట్టుకున్నారు.

నకిలీ కణిక వంశీయులకి… సోనియా, అంత విలువైన ‘కన్ను’ మరి! ఆమె గురించిన గుట్టు బయట పడకుండా ఉండేందుకు, దేన్నైనా వదిలేసుకుంటారు! అది ప్రభుత్వపరువైనా, ప్రధాన మంత్రినైనా, మరి దేన్నైనా!

ఏతావాతా…2జీ స్ప్రెక్ట్రమ్ అక్రమాలు, అవినీతి, నీరా రాడియా టేపుల వ్యవహారం బయటపడితే, అవినీతి మకిలి ప్రభుత్వానికీ, ప్రధానమంత్రికీ, ప్రభుత్వ కుర్చీవ్యక్తి సోనియాకీ కూడా అంటుకోవచ్చు గాక! ప్రతిష్ఠ మరింత మసక బారవచ్చు గాక.

అయినా… ‘గూఢచార ఏజన్సీ సీఐఏకి ఏజంటుగా వ్యవహరించటంతో’ పోల్చుకుంటే, అవినీతి మరక సురక్షితమైనది.

ఎందుకంటే – ఇప్పటికే అవినీతి అందరి చేతా అంగీకరింపబడినదే కదా! “ఆఁ ఎవరు మాత్రం అవినీతి చెయ్యకుండా ఉన్నారు? ఇవ్వాళ్ళా, రేపూ అవినీతి చెయ్యకుండా గడిచేదెలా? పార్టీ నడపాలంటే ఆ మాత్రం అవినీతి నడుస్తుంది”అంటూ అంతో ఇంతో అందరూ అవినీతిని అంగీకరిస్తున్నదే!

అందుచేత అదే `Safe’ అన్నమాట. అదే సీఐఏకో, మరో గూఢచార ఏజన్స్ కో ఏజంటుగా వ్యవహరించటం, దేశనేతల హత్యల్లో కుట్ర చేయటం, గూఢచారిణి వంటివి తెలియటం భవిష్యత్తుల్లో మరింత ప్రమాదం కదా?

ఇది కన్నా? కాలా? స్ట్రాటజీకి ఒక తాజా మచ్చుతునక?

మన రాష్ట్ర రాజకీయాల్లోనూ, దీనికి బలమైన తాజా ఉదాహరణ ఉంది గానీ, పరిస్థితులు మరికొంత స్పష్టపడే వరకూ వేచి చూద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా ఓ చిన్న పోలికతో…

శ్రీశైలంలో పాఠశాల నడుపుతున్న రోజుల్లో… మేం మా విద్యార్ధుల తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇస్తూ “మీరు రోజూ కొనిచ్చే చాక్లెట్లూ, ఐస్ క్రీం లే! కానీ పిల్లలు మీ మాట విన్నప్పుడు, డిసిప్లిక్డ్ గా ఉన్నప్పుడు, మరేదైనా మంచిగా చేసినప్పుడు, ఆ విషయాన్ని అండర్ లైన్ చేసి, బహుమతిగా ఇచ్చినట్లుగా ఆ చాక్లెట్ నీ, ఐస్ క్రీం నీ ఇవ్వండి. అలాగే పండక్కి మీరు కుట్టించే కొత్త డ్రస్ లే! ఎటూ తప్పకుండా మనం కొనిచ్చేవే అయినా సరే! టెస్ట్ ల్లో మార్కులు బాగా తెచ్చుకున్న దానికో, మరో అఛీవ్ మెంట్ కో లింకు వేసి, ‘అది చేసినందుకు ఇదీ గీప్ట్’ అని చెప్పి ఇవ్వండి. పిల్లలు మరింత ఉత్సాహంగా ఉంటారు, మీరు చెప్పినట్లు వింటారు” అని చెప్పేవాళ్ళం!

తెలంగాణా ఉద్యమకారుల మీద కేసులు ఎత్తివేత కోసం, మొన్న ప్రారంభమై, నిన్న ముగిసిన తెలంగాణా కాంగ్రెస్ ఎంపీల నిరాహార దీక్షల్ని చూస్తే, సరిగ్గా పై సంఘటనే గుర్తుకు వచ్చింది.
దాని మీద సాగిదీయాల్సినంత సాగదీసాక, ఇక ఇప్పుడు, ఎటూ తాము కేసులు ఎత్తేయదలుచుకున్నారు. దాని గురించి అసెంబ్లీలో హోంమంత్రిణి ఓ ప్రకటనా చదివింది. అయితే దశల వారీగా అంటూ ఓ స్టార్ మార్క్ (షరతులు వర్తిస్తాయి అని అర్ధమన్న మాట.) పెట్టింది.

ఆ మొత్తం తతంగానికీ రాజకీయ నాటకీయత రంగరించి, కేకేలు వంటి వారు హిందీ, తెలుగు, ఇంగ్లీషు కలిపి కొట్టిన ఉపన్యాసాలతో నిరాహార దీక్షలూ (అంతగా అయితే ఐవీ ప్లూయిడ్లు ఉండనే ఉన్నాయి), ఆపైన హూంమంత్రిణి శిబిరానికి వచ్చి చేసిన ప్రకటనలు… ఆపైన దీక్షా విరమణలు!

మరీ నాసిగా లేవూ! చిన్నపిల్లాడి క్కూడా తెలిసి పోయేంత ‘చీప్’ గా ఉన్న నటనలూ, నాటకాలూ ఇవి! టీవీ సీరియళ్ళూ, సినిమాలూ, రాజకీయాలూ చూసి చూసి… ప్రజలు, ఇంతకంటే క్లిష్టమైన వ్యూహాలనే అర్ధం చేసుకోగల స్థాయికి ఎప్పుడో చేరుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఇంతకంటే నాణ్యత గల వ్యూహాలు దొరకలేదు కాబోలు!

బహుశః ’తమ నాటకాలు వ్యూహాలు జనాలకి అర్ధమైనా ఏం ఫర్వాలేదు. ఎన్ని నాటకాలు బహిరంగపడినా, ఎంతగా అవినీతి బయటపడినా, ఎంతగా తమ రెడ్ టేపిజం పచ్చిగా ప్రదర్శితమైనా… ప్రజలేం చెయ్యగలరు? కాబట్టి ప్రమాదమేమీ లేదు’ అనే ధీమా కాబోలు! ఎలాగూ మీడియాతో తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవచ్చు అన్న నమ్మకమూ కావచ్చు!

~~~~~~~

మరో పోలిక… ఇటీవల విడుదలైన ఖలేజా సినిమాలో హీరో, తన టాక్సీని రెండోసారి డాష్ కొట్టిన హీరోయిన్ తో వాదులాడే సన్నివేశంలో, కోపంగా చూస్తున్న హీరోయిన్ తో “నువ్వే గుద్దేసి, నువ్వే చూసేస్తే… ఇక మేమెందుకే ఇక్కడ?” అంటాడు.
అలాగే, కాంగ్రెస్ వాళ్ళూ ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వాళ్ళ పార్టీకి చెందిన ప్రధానమంత్రి, 2జీ స్పెక్ట్రం వ్యవహారంలో, మురళీ మనోహర్ జోషీ అధ్యక్షతన గల పీఏసీ (ప్రజాపద్దుల కమిటీ) ఎదుట హజరౌతానంటూ లేఖ వ్రాసాడట.

“మీ పార్టీకి చెందిన మురళీ మనోహర్ జోషీ మీద మీకే నమ్మకం లేదా? మరెందుకు ఒప్పుకోరూ?” అంటూ కాంగ్రెస్ వాదులు గోల పెడుతూనే ఉన్నారు. ఇంతలో మురళీ మనోహర్ జోషీ స్పందించేసాడు. అందులో ఏ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనుకున్నారో ఏమో, ప్రతిపక్షాలు (భాజపాతో సహా) ‘ఠాఠ్’ అంటున్నాయి. ‘జేపీసీకి తప్ప మరి దేనికీ ఒప్పుకోం’ అంటున్నాయి.

ఈ నేపధ్యంలో… ప్రధానమంత్రి పీఏసీ ఎదుట హాజరౌతాననటం ఎంతో గొప్ప విషయమని, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు తెగ మెచ్చుకుంటున్నారు.

వాళ్ళే అవినీతి చేసేసి, వాళ్ళే జాయింట్ కమిటీలు జాతీయ కమిటీలు వేసేసుకుని, వాళ్ళే విచారణలు చేసేసుకుని, వాళ్ళే మెచ్చేసుకుంటే… ఇక ప్రజలున్నది ఎందుకు?

ఇలాంటి ‘డైలాగులు’ రాజకీయనాయకులకి రుచించవు.

వాళ్ళ దృష్టిలో… ‘తొక్కలో జనం! ఉల్లి ధరలు 50/- రూపాయలైనా, చింతపండు వంద రూపాయలైనా, కూరల ధరలు కనుచూపు మేరలో లేకపోయినా, తాము లక్షల కోట్ల రూపాయలు దండుకున్నా… ఏం చెయ్యగలరు?’

~~~~~

మరో పోలిక – ఇప్పుడంటే ఓ సినిమా హిట్టయితే ‘అది యూనిట్ విజయమనీ, దర్శకుడి ప్రతిభనీ, కథాబలమనీ’ అంటున్నారు. హీరో హీరోయిన్లు దర్శకుణ్ణి పొగిడితే, దర్శకుడు నటీనటులకీ, టెక్నీషీయన్లకీ ఆ క్రెడిట్ ఇస్తున్నారు.

అదే ఒకప్పుడైతే… సినిమా విజయం ‘మా గొప్ప అంటే మా గొప్పనే’ వాళ్ళు. ఒక్కోసారి ఆ విషయమై వివాదాలూ రేగేవి.
ఉదాహరణకి, 1990 – 92 ల నడుమ ‘గ్యాంగ్ లీడర్’ అని ఓ సినిమా వచ్చింది. చిరంజీవి, విజయశాంతి నాయకా నాయికలు ‘రఫ్ ఆడిస్తా’ ననే మాస్ డైలాగ్ ఆ సినిమాలోదే!

సినిమా విజయం తన మూలంగానేననీ, తాను మరికొంత ‘ఫ్రీ’గా నటించానని విజయశాంతి అన్నది. అంటే ‘స్వేచ్ఛ’గా నని సదరు నటి ఉద్దేశం. అప్పటికి బరితెగించిన నటన స్థాయి అది. ఇప్పుడది మరింత పెరిగి పోయిందనుకొండి. నిజానికి ఆ సినిమాలో ‘సగం బూతుల డైలాగులూ, పగా ప్రతీకారాల కథ’ గట్రా చాలా మసాలాలున్నాయి.

దరిమిలా… సినిమా విజయం గురించి ‘ఆ క్రెడిట్ ఎవరిది?’ అనే వివాదం చెలరేగింది. ఆ రకమైన పబ్లిసిటీ స్టంట్ల గురించి అప్పటికింతగా పబ్లిక్ కాలేదు లెండి.

ఏతావాతా, విషయం ఏమిటంటే – ఓ సినిమా హిట్ అయితే క్రెడిట్ ఎవరికి దక్కుతుందో నని మిగిలిన వాళ్ళు ఆరాట పడితే… ఆ కామిడీ, సదరు సినిమా కామెడీ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇప్పటికి ‘తెలంగాణా’ అంటూ ఓ ఊపు క్రియేట్ అయ్యింది. ఒకవేళ అది గానీ విజయవంతం అయితే…

‘ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ కి పోతుందేమో’నని కాంగ్రెస్ వాళ్ళు,

‘గద్దర్ కి దక్కుతుందో ఏం పాడో’ అని కేసీఆర్ గట్రాలు,

‘కాంగ్రెస్ కి దక్కుతుందేమో’నని తెదేపా వాళ్ళు…

ఇలా అందరూ కలిసి క్రెడిట్ కోసం కాట్లాడు కుంటున్న కామెడీ అనుశృతంగా నడుస్తోంది.

మరో వైపు… రైతులు ఎడాపెడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇంతగా మండిపోతున్న నిత్యావసరాల ధరలూ, కూరగాయల ధరలూ, ఎవరికి లాభాలు పండిస్తున్నాయో, నల్ల బజారు నాయకులకీ, రాజకీయ నాయకులకీ తెలియాల్సిందే!

ఈ నేపధ్యంలో… రైతుల కోసం నిరాహార దీక్షలు చేసి, వాటి ప్రచారాలతో వై.ఎస్. జగనూ, చంద్రబాబు నాయుడూ గట్రాలందరూ బిజీ బిజీ!

‘రైతుల కోసం… క్రెడిట్ ఎవరికి పోతుందే ఏం ఖర్మో’ అనుకొని ఎవరికి వాళ్ళూ హడావుడి పడుతూ… జగన్ 48 గంటలు నిరాహార దీక్ష చేస్తే, ఐవీ ప్లూయిడ్ల సాయంతో చంద్రబాబు వారం పైబడి నిరాహార దీక్ష చేసాడు. ఆపైన 30 వ తేదీన గుంటూరులో రైతుల కోసం సభ పెట్టేస్తానన్నాడు.

‘ఓర్నాయనో!’ క్రెడిట్ అతడికి పోతుందేమోనని చిరంజీవి, హడావుడీగా గుంటూరు జిల్లా కెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలని పరామర్శించి, ఇరవై వేలు ఆర్ధిక సాయం ‘ఆన్ ది స్పాట్’ అందించాడు.

ఈ రాజకీయ నాటకాలకి నిర్మాతా, దర్శకుడూ ఎవరో గానీ… ప్రస్తుతం రాజకీయ కామెడీ మాత్రం నడుస్తోంది. కాకపోతే… ఈ మొత్తం రచ్చలో రైతులూ, ప్రజలే సమిధలు!

‘ఏ నెపం అయితేనేం, మృతి చెందిన రైతుల కుటుంబాలకి చిరుసాయం అందుతోంది కదా?’ అనుకుంటే – అన్నదాత అంతగా బిచ్చగాడి స్థితికి దిగజారి పోయేంత దుస్థితి వచ్చాక అనుకోడానికేం మిగిలి ఉంది?

ఈ రాజకీయ నాయకులకే చిత్తశుద్ది ఉంటే దళారీల నుండి రైతుని కాపాడి, పండిన పంటకు లాభదాయకమైన ధరని అందేటట్లు చేస్తే అసలు రైతే అందర్నీ పోషిస్తాడు.

అబ్బా, అదెలా కుదురుతుంది?

ఈ దళారీలే లేకపోతే స్టాక్ మార్కెట్ ఎలా నిలబడుతుంది?

పైకి కనబడని బాదారాయణ సంబంధం అది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

గతంలోని పల్లెలకీ ప్రస్తుత గ్రామాలకీ, అదే విధంగా పల్లె జీవితాలకీ నగర జీవనానికీ మధ్య వ్యత్యాసాన్ని సమీక్షిస్తే…

మహాకవి కాళిదాసు తన అభిజ్ఞాన శాకుంతలంలో… అరణ్య మధ్యంలోని ముని వాటికల్లోంచి నగరానికి వచ్చిన కణ్యముని శిష్యులు, శార్జరవుడు, శారద్వతుల సంభాషణలో ‘నగరం తగలబడుతున్న ఇల్లు’లా ఉందంటాడు. [పరుగులు పెడుతున్న జనం కవికి కలిగించిన భావన అది!]

అందమైన ఆ శ్లోకాలని ఓ సారి పరిశీలించండి.

శార్జరవుడు:
మహాభాగః కామం నరపతిరభిన్న స్థితిరసౌ
న కశ్చి ద్వర్ణానామపథమపకృష్ట్యోపి భజతే
తధాపీఠం శశ్వత్పరిచితవివిక్తేన మనసా
జనాకీర్ణం మన్యే హతవహవరీతం గృహమివ!


శారద్వతుడు:
అభ్యక్తమిప స్నాతః శుచిరశుచి మిప
ప్రబుద్ధ ఇవ సుప్తమ్
బద్ధమివ స్వైరగతిర్ణనమిహ
సుఖసంగినమవైమి!

జనసమ్మర్ధంతో కూడిన పురం తగలబడుతున్న ఇల్లువలె వున్నదని ఒక శిష్యుడు అంటాడు. పురప్రజలను చూస్తున్నప్పుడు స్నానం చేసినవాడు, అశుభ్రంగా వున్నవాడిని, పవిత్రుడు దుష్టుడిని, మేలుకుని వున్నవాడు నిద్రితుడిని, స్వేచ్ఛగా వున్నవాడు కారాబద్దుడిని చూస్తే కలిగే ఏవగింపు వంటిది కలగడం సహజమేనని మరొక శిష్యుడు అంటాడు.

భోజుడు కాళిదాసుల కాలం నాటికే నగరాలు తగల బడుతున్న కొంపల్లా కనబడితే, ఈనాటి పరిస్థితి మాటేమిటి?

నగరాలు, పట్టణాలతో పోలిస్తే… పల్లెల్లో ఫ్యాషన్ల ప్రభావం, కృత్రిమత ముద్రా తక్కువ. నిజానికి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, నట్టింట తిష్ఠ వేసిన టీవీల్లో కేబుల్ ప్రసారాల ద్వారా, ప్రైవేటు ఛానెళ్ళల్లో సినిమాల హోరు ద్వారా ఫ్యాషన్ల రూపు రేఖా విలాసాలు గ్రామీణుల దాకా ప్రసారమైనా, వాటిని స్వయంగా అనుకరించేందుకు, అంది పుచ్చుకునేందుకు గ్రామీణులు కొంత బిడియ పడతారు.

[మేము ప్రస్తుతం ఉండేది గ్రామీణ ప్రాంతమే! మా చుట్టుప్రక్కల గల పల్లెల్లో పగలు బారెడు పొద్దెక్కాక నైటీల్లో కనబడితే ఎద్దేవా చేయబడటం కద్దు.] అంతేకాదు, గ్రామాల్లో ఫ్యాషన్ గా చలామణి అయ్యే అధునాతన వస్తువులు, తిండి పదార్ధాల లభ్యత కూడా, నగరాలూ పట్టణాలతో పోల్చుకుంటే తక్కువ.

ఆ రకంగా గ్రామాలు ‘ఫ్యాషన్, కృత్రిమత్వం’ అనే ప్రమాణాల్లో నగరాలకి ‘గత కాలం’లో ఉంటాయి. మరో మాటగా చెప్పాలంటే – గ్రామాలు, నగరాలతో పోలిస్తే ప్రకృతికి మరికొంత దగ్గరగా, కృత్రిమత్వానికి దూరంగా ఉంటాయి.

కాబట్టి అనుభూతులూ, భావనల విషయంలో కూడా, గ్రామీణుల స్థితి కొంత మేరకు కాలుష్యరహితంగా ఉంటుంది. అలాగని గ్రామీణులందరూ పోతపోసిన మంచితనాలూ, భావవాదులూ అనిగానీ, నగర వాసులంతా అచ్చొత్తిన పదార్ధ వాదులనీ గానీ అనటం లేదు.

గ్రామీణ జీవితం మరికాస్త ‘తెలియని తనానికి’ దగ్గరగా ఉండటాన, భావ కాలుష్యానికి కూడా కాస్త దూరంగా ఉంటుందంటాను. అదీ సాపేక్షంగానే! ఇది ఇప్పటి పరిస్థితి!

అదే ఒకప్పుడైతే… పల్లె జీవితాలకీ, నగర జీవన శైలికీ చాలా వ్యత్యాసమే ఉండింది. అప్పటికైతే… భావపరంగా గ్రామీణులు ప్రకృతి సహజ పుష్పాలైతే నగర వాసులు ప్లాస్టిక్ పువ్వులూ, కాగితపు పువ్వులూ! గ్రామీణుల నవ్వులు పూల పరిమళాలైతే, నగర వాసుల నవ్వులు ఫెర్ ప్యూమ్ బాటిళ్ళు!

అయితే ఈ సాపేక్ష తారతమ్యత అనుశృతంగా కొనసాగుతూనే ఉంటుంది.

నిజానికి చరిత్ర పరిశీలిస్తే… నగరాలు పల్లెల భవిష్యత్తులైతే, పల్లెలు నగరాల గతాలు.

ఇటీవలి సినిమా ‘ఖలేజా’లో పాటలో మాదిరిగా ‘ఆ మహాశివుడి పాదముద్రలు మోసి మురిసిపోయిన’ కాశీక్షేత్రం… నాడు కాశీ పట్టణమైనా, నేడు కాశీ నగరమైనా, ఒకప్పుడు పల్లె కాశీయే గదా!

ఈ సంబంధం… పల్లె పట్టణాల మధ్యే కాదు, దేశాలైనా అంతే! అభివృద్ధి చెందిన దేశాల గతకాల స్థితిలో అభివృద్ధి చెందుతున్న దేశాలుంటాయి. వెనక బడ్డ దేశాలు, భవిష్యత్తులో అభివృద్ధి చెందితే, ప్రస్తుత అభివృద్ది చెందిన దేశాల్లా ఉంటాయి. కొద్ది దేశాల ‘గతం’ మరికొన్ని దేశాల ‘వర్తమానం’ అవుతుంది.

ఆ విధంగా విభిన్నదేశాలు, విభిన్న సమాజాలు, అభివృద్ధి పరంగా చూస్తే విభిన్న దశలలో ఉండటమనేది సహజ పరిణామం! ఇది పదార్ధ వాద పరంగా, ఆర్ధిక అభివృద్ధి విషయంలో!

ఆర్ధికాభివృద్ధికి ఇతరమైనదీ, దానికంటే ముఖ్యమైనదీ – భావపరమైన ఉన్నతి! ఏ విధంగానైతే భౌతిక వృద్ధిని నిర్లక్షం చేయకూడదో, అదే విధంగా భావపరమైన అభివృద్ధినీ నిర్లక్ష్యం చెందకూడదు. ఆర్ధిక సంపద ఎంత ముఖ్యమో, భావసంపద కూడా అంతే ముఖ్యమైనది, ఇంకా చెప్పాలంటే ఒకింత ఉత్తమమైనది.

వాస్తవానికి, భారతదేశంలో, పల్లె జీవితం, వ్యవసాయం పెనవేసుకు పోయి, భారతీయ ఆత్మ ఆవిష్కరింప బడుతుంది. ఆత్మ స్వరూపమంటే భగవానుడి బాహ్య రూపమే కదా!

ఒకప్పుడు ‘పనీపాటా’ అంటూ… పనిలో పాటల్ని మిళితం చేసుకుని, పనిని ఆనందిస్తూ గడిపిన భారతీయ రైతులూ, పల్లెలూ… నేడు ఏ స్థితికి ప్రయాణించాయి? ఒకనాడు ‘తాను తిని పదిమందికి తిండి పెట్టిన రైతు, మీసం తిప్పే రైతు మారాజు!’ ఈ రోజు? ఆత్మహత్యలు చేసుకుంటున్న దుర్బలుడు! ఎందుకింతగా పరిస్థితులు దిగజారి పోయాయి? ప్రశ్న చాలా చిన్నది! జవాబు సుదీర్ఘమైనది!

ఒకప్పుడు గడ్డి మోపు మోసుకొచ్చే పల్లె యువతి వర్ణచిత్రం, అందానికి ఐకాన్! ఈ రోజు? దుస్తులు విప్పేసిన దుడ్డు సుందరి తాలూకూ సినిమా స్టిల్ ఆ స్థానంలో ఉంది.

శ్రమైక జీవన సౌందర్యానికి పునాది రాళ్ళ వంటి ‘కొడవలి, నాగలి’ చేతబట్టిన యువతీ యువకులు సౌందర్యాధి దేవతలు కాకుండా పోయారు. ఈసడింపుకీ గురవుతున్నారు. అక్కడ ప్రారంభమైన ‘భావపతనం, అనుభూతి కాలుష్యం’ పరిస్థితుల్ని మరింతగా దిగజార్చేసాయి.

ఈ రోజు గ్రామాల్లో రైతులు, ఇతర వృత్తుల వాళ్ళూ, జీవన మాధుర్యాన్ని, శాంతీ సంతోషాలనీ, వృత్తి సంతృప్తినీ కోల్పోయారు. వాటినెక్కడ, ఎప్పుడు పారేసుకున్నారో వారికే తెలియదు.

ఈ స్థితి గ్రామీణులది మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా అందరిదీ ఇదే స్థితి.

అంథపాంధుల లాగా ఎడారిలో ఒయాసిస్సు కోసం వెదుకుతున్న స్థితి.

దాహార్తులై, నీటి కోసం ఎండమావుల వెంట, ఆయాసపడుతూ ఆతృతగా పరుగులెడుతున్న స్థితి.

జీవితంలో నిజమైన ఆనందాన్ని కోల్పోయిన స్థితి!

దమ్మిడీల పరుగులో, డబ్బు కుప్పల్లో ఆత్మని పారేసుకున్న స్థితి.

వృత్తిలో, సాంఘిక స్థాయిలో పోటీపడుతూ, ఆ పోటీలో భావాలనీ, అనుభూతుల్నీ పారేసుకున్న స్థితి!

హృదయపు ఆర్ధ్రతనీ, మానవీయ స్పందనలనీ బిజీ షెడ్యూల్ మధ్యలో బిగించేసుకున్న స్థితి!

ఎంతమందికి, ఉదయాన్నే సూర్యకిరణాలకి స్వాగతం చెబుతూ ‘తెల్లారింది లెగండోయ్’ అనే పిట్టల కువకువలని విని ఆనందించేంత తీరిక ఉంది? అసలు కువకువలాడేందుకు పిట్టలకి జాగా ఎక్కడిది?

చీకటి పడుతూ పడుతూ ఉండగానే… రావిచెట్ల మీదా, మర్రిచెట్ల మీదా చేరి, పెద్దపేద్దగా అరుస్తూ, ఉప్పర్ మీటింగ్ పెట్టుకుని, పగలంతా ఆహారాన్వేషణలో తామేం చిత్రాలు చూసాయో నేస్తాలన్నిటికీ చెప్పుకుంటున్నాయా అన్నట్లు చప్పుడు చేస్తూ, ఆ చప్పుళ్ళని రావిచెట్టు ఆకుల గలగలలో కలబోస్తూ, అల్లరల్లరి చేసే పక్షుల గోల ఎంతమంది చూసి ఉంటారు?

సూర్యాపేట పోలీసు స్టేషన్ ఆవరణలోనూ, అచ్చం పేట ఆర్టీసీ బస్టాండు ఎదురుగానూ సాయం సంధ్యలో పిట్టల రొద చూసి, అప్పటికి నాకున్న సమస్యలన్నిటినీ మరిచిపోయిన అనుభవంతో చెప్పగలను, నిజంగా అది అపూర్వ చైతన్యమది!

ఇప్పుడు… సాయంత్రపు నడకకి పొలాల మధ్య, రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటే… చేల మీద పంట ఏపుగా పెరిగి, కోతల దశకు చేరుతుండగా… ఆకాశానికి అడ్డం పడి గిరికీలు కొడుతూ, పొలం చుట్టూ తిరిగి, చెట్ల మీద వాలుతూ, చిన్న ముక్కకు ఇరువైపులా ఉన్న కళ్ళల్లో ఆనందాన్ని నింపుకుని, తిక్కతిక్కగా పాడేసే చిన్నిపిట్టల ముఖాల్లో, స్పష్టంగా, సంతోషం ద్యోతకమౌతుంది.

ఆ దృశ్యం ఎంతందంగా ఉంటుందని! కనుచూపు మేరలో కుముద్వని(కుందూ) నదీ ప్రవాహం లీలగా కనబడుతుంటే, ఆ పక్షుల గానం విశ్వకవి రవీంద్రుడి గీతాంజలిలా, ఘంటసాల లలిత గీతంలా, ఎంత మధురంగా ఉంటుందో!!

అసలు పొలాల మీద పంట పచ్చగా ఊగుతుంటే… ఆ పరిసరాల్లో కూడా ఎంత చైతన్యమో! రకరకాల పైరు వాసనలు నింపుకున్న గాలిలోనే, ఏదో తెలియని చైతన్యపు సవ్వడి, నిశ్శబ్దంగా విన్పిస్తుంటుంది.

చిగురు మొదలు, చెట్టుదాకా… ప్రతి అణువు లోనూ భగవంతుడి దివ్యప్రేమ, మన చుట్టూ పరుచు కున్నట్లుంటుంది! మెల్లిగా మన శరీరాన్ని తాకే గాలి, ఆ తడి స్పర్శని, భగవంతుడి ప్రేమ స్పర్శనీ, అనుభూతిలోకి తెస్తుంది.

పచ్చని పొలాలూ, గాలికి ఊగే పచ్చదనం, అచ్చంగా అమ్మఒడి మనల్ని స్వాగతిస్తున్నట్లుంటుంది.

పసిబిడ్డగా ఉన్నప్పుడు, అమ్మ దగ్గరికి ఉరికినట్లుగా మనం!

చేతులు చాచి నవ్వుతూ మనల్ని హత్తుకున్న అమ్మలా ఆ నేల!

కనుచూపు మేర దాకా పరుచుకున్న పచ్చని పొలాలు, కంటి నిండా పరుచుకొని, చిన్నప్పుడు నాన్న చేతుల మధ్య భద్రంగా ఉన్నప్పుడు పొందిన ధైర్యాన్నీ, Protective feeling నీ గుర్తుకు తెస్తుంది.

ఎంత గొప్పగా ఉన్నా, rich గా, భారీగా ఉన్నా… ఏ ఆకాశ హర్మ్యాలూ, ఏ ఫ్లైఓవర్లూ, ఎనిమిది లైన్ల బిజీ జాతీయ రహదార్లూ కూడా… ఇలాంటి సహజ భావనలనీ, పసితనపు గురుతుల్నీ మన కివ్వలేవు.

ఈ సందర్భంలో, చిన్నప్పుడు చదువుకున్న చిన్న కథ ఒకటి చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

కారణాలేమైతే నేం గానీ… హఠాత్తుగా అవసరమై… చంద్రబాబు, జగన్ ల వంటి రాజకీయ నాయకులకీ, అనివార్యమై… ముఖ్యమంత్రీ, ప్రధానమంత్రి వంటి ఇతర రాజకీయ నాయకులకీ `రైతు’ ప్రధాన విషయమై పోయిన నేపధ్యంలో… దాదాపు మూడేళ్ళ క్రితం ఆంగ్లంలో వ్రాసి, రెండేళ్ళ క్రితం ప్రచురించిన నా ఆంగ్ల బ్లాగు Coups On World లోని ఈ శీర్షికని, ఇప్పుడు తెలుగులోకి అనువదిస్తున్నాను.

అక్కడక్కడా మార్పు చేర్పులు, ఇటీవలి సంఘటనలు జోడిస్తూ… కొనసాగే ఈ టపాల మాలికలో భారతీయత మీద వ్యవసాయ రంగంతో బాటు, పల్లె జీవనం, నగర పోకడల ద్వారా, సుదీర్ఘ కాలంగా నకిలీ కణిక వ్యవస్థ కొనసాగించిన కుట్ర తీరుని వివరించాలన్నది నా ప్రయత్నం.

ఇక విషయానకి వస్తే…

నిజానికి, వ్యవసాయం, మానవుడి తొలి వృత్తులలో ఒకటి.

మనిషిని సంచార జీవితం నుండి స్థిర జీవితానికి పరిణమింప జేసిన మహత్తర వృత్తి అది!

నాగరికతకి తొలి అడుగు కూడా అదే!

మానవ పరిణామ శాస్త్రం, (ఆంత్రోపాలజీ) చతుష్పాద జంతువు దశ నుండి ద్విపాద జంతువుగా, చివరికి బుద్ధి జీవిగా, మనిషి పరిణామ క్రమాన్ని మనకి వివరిస్తుంది.

ఆరంభ దశలో మనిషి జంతువు లాగానే బ్రతికాడు. ఆహార నిద్రామైధునాలు అతడి ప్రాధమిక అవసరాలు! అయితే మనిషి గమ్యం ‘బ్రతకడం’ అనే చోట ఆగిపోలేదు. కాబట్టే – చుట్టూ ప్రకృతిని పరిశీలించాడు. తనలో తాను ఆలోచించాడు. కార్యకారణ సంబంధాలని వివేచించాడు.

క్రమంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు, నేర్చుకుంటూనే ఉన్నాడు. తొలి దశల్లో అడవి జంతువుగా బ్రతుకుతూ, చలి ఎండా వానల నుండి రక్షించుకునేందుకు చెట్ల ఆకులు, బెరళ్ళు, జంతు చర్మాలూ ఉపయోగించటం నేర్చాడు.

ప్రాకృతిక ప్రమాదాలని, జంతువుల దాడుల్ని ఎదుర్కునేందుకు, ఒంటరిగా కంటే గుంపుగా చరించటం శ్రేయోదాయకమని గ్రహించాడు. జంతువుల్ని వేటాడి ఆహారం సంపాదించటంలో గుంపుగా ఉండటమే మరింత ప్రయోజన కరమనీ తెలుసుకున్నాడు.

చెట్ల గుబురుల్లో, కొమ్మల్లో నిదురించటం కంటే కొండ గుహల్లో నిదురించటం భద్రమని అర్ధమయ్యాక గుహల్లో నివసించటం మొదలెట్టాడు. ఒరిపిడికి నిప్పు పుడుతుందన్న ప్రకృతి పరిశీలిన, నిప్పు జంతువుల్ని భయపెడుతుందన్న పరిశీలన, తమ ఆవాసాలని జంతువుల నుండి రక్షించుకునే విధానాన్ని నేర్పింది.

పచ్చి మాంసం, పచ్చి దుంపలు శాకాల కంటే… నిప్పుల్లో కాలిన, మగ్గిన మాంసం, దుంపలు రుచిగా, తినేందుకు సౌలభ్యంగా ఉంటాయని అనుభవం నేర్పింది. ఆ విధంగా తొలి పచనం ప్రారంభమైంది. తాము తిని ఉమిసిన గింజల నుండి మొక్కలు రావటం, అవి చెట్లై వాటి నుండి అవే ఫలాలు రావటం ప్రకృతి నేర్పిన పాఠాలయ్యాయి. మొక్కలతో సహా పశు పక్ష్యాదులకీ, తమకీ నీటి అవసరం, వారి తొలి పరిశీలనల్లో ఉన్నదే!

క్రమంగా కొండ గుహలని పోలిన గుడిసెలని, నీటి వనరుల సమీపంలో నిర్మించడం నేర్చుకున్నాడు. మొక్కలూ, చెట్లూ ఉన్న చోటికి పోయి పండ్లు తెంపుకోవటం గాక తాము ఉన్న చోటే వాటిని పెంచడం నేర్చుకున్నాడు. పరిణామ ప్రక్రియగా… వ్యవసాయం మానవుణ్ణి సంచార జీవితం నుండి మరల్చి స్థిర జాతిగా మార్చింది. అప్పటికే జంతువులతో సహజీవనం నేర్పిన మరిన్ని నైపుణ్యాలు, అవే జంతువుల్ని మచ్చిక చేయటమూ నేర్పింది.

కాలగతిలో నదీ పరివాహ ప్రాంతాల్లో గ్రామాలు వెలిసాయి. అవి పట్నాలూ, నగరాలై మెరిసాయి.

ఆ విధంగా పశుపక్ష్యాదుల్ని వేటాడటం, వ్యవసాయం మానవుడి తొలి వృత్తులైనాయి. పశు పక్ష్యాదుల్ని వేటాడి ఆహారం సంపాదించుకోవటం ప్రమాదాలతోనూ, ప్రయాసతోనూ కూడు కున్నది. అయితే ఫలితం మాత్రం తక్షణమే లభిస్తుంది. ఇన్ స్టంట్ రిజల్టన్న మాట.

తక్షణమే ఆహరం లభిస్తుంది. జంతువుల ఎముకలూ గట్రా అవశేషాలను ఆయుధాలుగా ఉపయోగించు కోవచ్చు. చర్మాన్ని తమ శరీరాన్ని కప్పుకునేందుకు, నివాస ప్రాంతాల్ని కప్పు కునేందుకు ఉపయోగించు కోవచ్చు.

వ్యవసాయంతో ఆహారం లభ్యం కావటానికి జంతువుల వేటతో పోల్చుకుంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఆహర లభ్యత విస్తారంగా ఉంటుంది. జంతు మాంసంలా తక్షణం ఉపయోగించుకోకపోతే కుళ్ళి పోవటం కూడా సాపేక్షంగా తక్కువే!

క్రమంగా మనిషి వ్యవసాయంలోని ప్రయోజనాలు మరిన్ని తెలుసుకున్నాడు, మరి కొన్నిటిని కనుగొన్నాడు. పరికరాలని, జంతువులనీ కూడా వ్యవసాయానికి ఉపయోగించటం నేర్చుకున్నాడు.

మానవ జీవితం ఆటవిక దశ నుండి నాగరికత దిశలోకి పయనించడం ప్రారంభమైనది.

వేల సంవత్సరాలు గడిచాయి. ఎన్నో నాగరికతలు చరిత్ర పుటల్లో చేరాయి.

ఇప్పుడు…ప్రజలు పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో నివసిస్తున్నారు. ఆ రకంగా కొందరు పల్లె దాసులూ, కొందరు పట్టణ వాసులూ అయితే మరి కొందరు నగర బాసులూ అయ్యారు.

ఎక్కడ నివసించినా కొన్ని సానుకూలాంశాలు, కొన్ని ప్రతి కూలాంశాలూ ఉండటం సహజం కదా! (Advantages & Dis advantages అన్నమాట!)

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~

క్రిస్మస్ పండుగ రోజున పిల్లలందరికీ ‘అమ్మఒడి’ అందించే కమ్మని కథ.

అనగా అనగా…

సిరిపురం అనే ఓ చిన్న ఊరు. అందమైన ఆ పల్లెలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతడి భార్య బంగారమ్మ నిజంగా బంగారం లాంటి మనిషి. ఎప్పుడూ వంచిన నడుమెత్త కూడా పనిచేసేది. వేళకి అందరికీ అన్నీ అమర్చి పెట్టేది. పన్నెత్తి పరుషంగా ఎవరినీ ఒక్కమాటా అనెరగదు. రాజయ్య కూడా భార్యకు తగిన వాడే!

ఆ దంపతులకి ముగ్గురు కూతుళ్ళు. పిల్లల మీద ప్రేమ కొద్దీ భార్యాభర్త లిద్దరూ వాళ్ళని తెగ గారాబంగా పెంచారు. ఒక్కపనీ చెప్పేవాళ్ళు కాదు.

ముగ్గురు పిల్లలూ పెళ్ళి కెదిగి వచ్చారు. ఓ ఏడాది రాజయ్య పొలంలో మంచి పంట పండింది. దాంతో మంచి సంబంధాలు చూసి ముగ్గురు కూతుళ్ళకీ ఒకేసారి పెళ్ళిళ్ళు చేసారు రాజయ్య, బంగారమ్మ.

పెళ్ళి కొచ్చిన బంధుమిత్రులంతా కొత్త జంటలని చూసి ముచ్చట పడి, రాజయ్య దంపతులని అభినందించారు. పెళ్ళి సంబరాలన్నీ ముగిసాక రాజయ్య బంగారమ్మలు, చీరె సారెలతో కూతుళ్ళని అత్తవారిళ్ళకి పంపారు.

వారం తిరక్కుండానే అత్తారిళ్ళలో కూతుళ్ళెలా ఉన్నారోనని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అంతలోనే ‘ఆడపిల్లల్ని కన్నాక ఎవరికైనా ఇది తప్పని కష్టం లే’ అనుకొని గుండె దిటవు చేసుకున్నారు.

మరో వారం గడిచింది.

ఓ రోజు… ఉదయాన్నే బంగారమ్మ వాకిట్లో ముగ్గు లేస్తోంది. అంతలోనే పెద్ద కూతురు అత్త గారింటి నుండి బట్టలు సర్దుకొని వచ్చింది.

“ఏమిటమ్మా! చెప్పాపెట్టకుండా వచ్చావు? కబురు పెడితే మేం వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా? అయినా అల్లుడు లేకుండా ఒక్కదానివే వచ్చావేం?” అన్నాడు రాజయ్య.

“ఏం చెప్పమన్నావు నాన్నా! రాత్రి మా ఆయన తమలపాకులకి ఈనెలు తీసి పెట్టమన్నాడు. తీరా తీసి పెట్టాక ‘అయ్యో నీ చేతివేళ్ళు ఎంత కంది పోయాయో’ అనైనా అనలేదు. ఆ కాపురం చేయటం ఇహ నా వల్ల కాదు నాన్నా! అందుకే పెట్ట సర్దుకొని చక్కా వచ్చాను” అంది పెద్ద కూతురు కళ్ళొత్తుకుంటూ!

నిలువు గుడ్లేసుకు చూశారు రాజయ్యా, బంగారమ్మా!

మధ్యాహ్నానికి మధ్య కూతురు బండి దిగింది.

“ఏమైందమ్మా! అల్లుడేడి?” అతురతగా అడిగింది బంగారమ్మ!

“ఏం అల్లుడూ, ఏమత్త గారూ! ఈ ఘోరం తెలుసా అమ్మా! పొద్దున్నే మా అత్తగారు చల్ల చిలికి వెన్న తీసింది. చెయ్యి జారి వెన్నముద్ద కాస్తా నా కాలి మీద పడింది. ‘అయ్యో! కాలు వాచిందా?’ అని తల్లీ కొడుకులు మాట వరసకైనా అన్నారు కాదు”రుసరుసలాడింది రెండో కూతురు.

నిర్ఘాంత పోయారు భార్యభర్తలు.

సాయంత్రమయ్యేసరికి చివరి కూతురు చిర్రుబుర్రులాడుతూ వచ్చింది.

“ఏమైంది తల్లీ!” భార్యాభర్తలిద్దరూ బితుకు బితుకుమంటూ అడిగారు. ‘అల్లుడేడీ?’ అని అడగబోయి మాట మింగేసారు.

“ఏమౌతుంది? అవ్వాల్సినంతా అయ్యింది” ఖస్సుమంది చిన్నకూతురు.

బేలగా చూశారు రాజయ్య, బంగారమ్మలు.

“అది కాదు నాన్నా! నిన్న మా అత్తగారు నాకు పూల జడ వేసింది. ‘తట్టెడు పూలు తలలో ఉంటే తలనొప్పి పుడుతుందేమో’ అని ఆలోచనైనా ఉందా మా ఆయనకి? పొద్దంతా చూసినా మొహమాటానికైనా అడిగాడు కాదు. అంత ప్రేమ లేని మనిషితో ఎలా వేగటం? చిర్రెత్తు కొచ్చి చప్పున వచ్చేసాను” అంది మూతి మూడు వంకర్లు తిప్పుతూ!

బిక్క చచ్చిపోయి నట్లయ్యింది రాజయ్య బంగారమ్మలకి.

మరోమాట లేకుండా బంగారమ్మ వంటింట్లోకి, రాజయ్య పెరట్లోకి పోయారు.

రాత్రి భోజనాలై పడుకున్నాక రాజయ్య, బంగారమ్మతో,

“బంగారం! పిల్లల్ని మనం బాగా గారాబం చేసి చెడగొట్టాం. పనులు నేర్పకుండా పెంచాం. ఇప్పుడిలా గయ్యింది” అన్నాడు దుఃఖం దిగమింగుతూ.

“అవునయ్యా! ఇప్పుడు తలవంపులు తెచ్చారు” అంది బంగారమ్మ కన్నీళ్ళు తుడుచుకుంటూ!

కాస్సేపు మౌనంగా ఉన్న రాజయ్య “ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిల్లల కళ్ళు తెరిపిద్దాం” అంటూ భార్య చెవిలో ఏంచెయ్యాలో చెప్పాడు. బంగారమ్మ సరేనంది.

మర్నాడు పొద్దున బారెడు పొద్దెక్కినా… ఇంట్లో అలికిడి లేదు. నులక మంచాల మీద ముసుగు తన్ని పడుకున్న ముగ్గురు కూతుళ్ళకీ కడుపులో ఆకలి కేకలు వేయటంతో లేవక తప్పింది కాదు.

లేచి చూస్తే ఏముంది? కనీసం వాకిలి ఊడ్చి ముగ్గైనా పెట్టలేదు. ఎక్కడి పని అక్కడే ఉంది.

“అమ్మా! ఆకలేస్తోంది” అంటూ తల్లి కోసం చూస్తే… బంగారమ్మ ఎక్కడా కనబడలేదు. వసారాలో మంచం మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు తండ్రి.

“నాన్నా! అమ్మేది?” అన్నారు ముక్తకంఠంతో!

“అలిగి పుట్టింటికి పోయింది” అన్నాడు రాజయ్య నిర్లిప్తంగా!

ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు కూతుళ్ళు ముగ్గురూ!

“ఎందుకు?”ఆతృతగా అడిగారు.

“రాత్రి ఆరు బయట పక్క లేసుకు పడుకున్నామా? ఒకటే ఉక్క! విసన కర్రతో విసర మన్నాను. ముంజేతులు నొప్పి పుడుతున్నాయి పొమ్మంటూ అలిగి పుట్టింటికి పోయింది” అన్నాడు రాజయ్య.

“ఇదేం చోద్యం నాన్నా! పెళ్ళయి పాతికేళ్ళయ్యాక ఇప్పుడు అమ్మ నీ మీద అలిగి అమ్మమ్మ ఇంటికి పోయిందా? నలుగురూ వింటే నవ్వుపోరూ?” అంది పెద్ద కూతురు బుగ్గలు నొక్కుకుంటూ!

“పెళ్ళైన నెలకే అలిగి అత్తారింటి నుండి వచ్చావు. నిన్ను చూసి నవ్వినట్లే నా పెళ్ళాన్ని చూసీ నవ్వుతారు. అంతే కదా!?” అన్నాడు రాజయ్య నిస్పృహ ధ్వనింప జేస్తూ!

గతుక్కు మంది పెద్ద కూతురు.

“అయినా విసన కర్రతో విసిరితేనే చేతులు నొప్పి పుట్టాయా, మరి చోద్యం గాకపోతే!”అంది రెండో కూతురు.

“వెన్నముద్ద కాలి మీద పడితేనే కాలు వాచిందా అని అడగలేదని కోపం వచ్చి పుట్టింటి కొచ్చావు నువ్వు. నీలాంటి సుకుమార ప్పిల్లని గన్న మీ అమ్మా సుకుమారమే గదమ్మా! అందుకే అలిగింది. ఇందులో చోద్యం ఏముంది?” అన్నాడు రాజయ్య.

బిత్తరపోయి నిల్చుంది రెండో కూతురు.

“అయినా ఎన్నడూ లేనిది ఇదేమిటి నాన్నా!? ఇప్పుడు మాకెవరు వండి పెడతారు?” గుఁయ్యిమంది మూడో కూతురు.

ఖఁయ్యి మన్నాడు రాజయ్య, “పాతికేళ్ళుగా నాకూ, మీకూ వండి పెట్టింది నా బంగారం. ఎన్నడూ ఒక్కమాట అని ఎరగదు. ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసి అదీ అలకలు నేర్చింది. ఛీఛీ” అనేసి విసురుగా వీధిలోకి పోయాడు.

చతికిల పడ్డారు ముగ్గురమ్మాయిలూ!

ఇన్నేళ్ళుగా తమ కన్నీ అమర్చి పెడుతూ తల్లీతండ్రీ తమనెలా చూసుకున్నారో గుర్తొచ్చింది తమ తప్పూ తెలిసొచ్చింది.

వెంటనే లేచి అత్తారిళ్ళకు బయలు దేరారు. నెలరోజుల తిరిగే సరికల్లా తల్లి పనితీరుని గుర్తుకు తెచ్చుకుంటూ, అన్ని పనులూ చేయటం నేర్చుకుని, అత్తగారిళ్ళల్లో శభాషని పించు కున్నారు.

‘పిల్లల్ని ప్రేమగా పెంచటం అంటే పనులు నేర్పక పోవటం కాదన్న సత్యాన్ని ఆలస్యంగానైనా గ్రహించాం. పెను ప్రమాదం తప్పింది’ అనుకొని ఆనందపడ్డారు రాజయ్య బంగారమ్మలు.

తర్వాత వచ్చిన పండక్కి వాళ్ళిల్లు అల్లుళ్ళూ కూతుళ్ళతో కలకలలాడింది.

ఇదీ కథ!

చిన్నప్పుడు చదివిన కథకి మరిచిపోయిన చోట స్వంత కల్పన జోడించి…

పండగ మిఠాయిలకి ఇలాచి పరమళం చేర్చినట్లుగా…

మీ కోసం, ఈ పండుగ సెలవు రోజున ఈ చిన్ని కానుక!

అభివృద్ధి పేరుతో, విస్తరిస్తున్న నగర సంస్కృతితో, వ్యవసాయాన్ని మింగేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో, ప్రకృతి కడుపులో చిచ్చు పెడితే… అది సర్వనాశనానికే దారి తీస్తుంది.

దాని పేరు కాలుష్యం కావచ్చు, కార్చిచ్చు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, సునామీలు వరదలూ భూకంపాలూ కూడా కావచ్చు. కాబట్టే దేనికైనా ఓ హద్దు అవసరం అని పెద్దలన్నది!

ఈ విషయాన్ని ఎంత హృద్యంగా చెబుతుందో భాగవతంలోని దేవహూతి కథ!

బ్రహ్మదేవుడు సృష్టి గురించి ఆలోచన చేస్తుండగా ఆయన నాలుగు ముఖాల నుండి బుగ్యజుస్సామ అధర్వణ వేదాలు పుట్టాయి. అలా సర్వశాస్త్రలూ ప్రభవించాయి.

ప్రజాసృష్టి గురించి ఆలోచన చేయగా స్వాయంభువ మనువు, ఆయన భార్య శతరూప ప్రభవించారు. [ఇక్కడ ‘ఆలోచన నుండే జనించటం’ గురించి చెప్పబడింది. ‘సంకల్పమే అన్నిటికీ ప్రారంభం’ అని ఇందుకే అంటారేమో! ‘భావం నుండే అన్నీ జన్మించాయి. భావమే తప్ప భౌతిక ప్రపంచం లేదు. అది అభాస మాత్రమే, ఉన్నదను కోవటం భ్రాంతే’ అనే తత్త్వ చింతనకి, ఆధార బీజాలు ఇక్కడ కనిపిస్తాయి.]

ఈ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే కుమార్తెలు కలిగారు. ఉత్తానపాదుడు కుమారుడే ధృవుడు.

ఆకూతిని రుచికిచ్చి, దేవహూతిని కర్దముడి కిచ్చి, ప్రసూతికి దక్షుని కిచ్చి వివాహం జరిపించారు. వీరి వల్ల మానవ ప్రపంచం ప్రవృద్దమయింది.

[ఇది భాగవతం తొలి అధ్యాయాలలో చెప్పబడింది.
దేవహూతిని గురించిన కథ ఇక్కడ వివరిస్తున్నాను.]

ఒకనాడు స్వాయంభువ మనువు, తన కుమార్తె దేవహూతిని వెంట బెట్టుకుని కర్దముని ఆశ్రమానికి వెళ్ళాడు.
వచ్చిన అతిధిని ఆదరించిన కర్దముని తో స్వాయంభువ మనువు “ఆర్యా! ఈమె నా బిడ్డ దేవహూతి. పురుషోత్తముని దర్శించిన వారికి తప్ప అన్యులకు యీమె గోచరించదు. ఈమెను కాముకదృష్టితో చూసిన వారికి ఆ క్షణంలోనే మృత్యువు సంభవిస్తుంది.

అటువంటి శీలవతి, పవిత్ర హృదయ అయిన నా బిడ్డ, నిన్ను భర్తగా వరిస్తున్నది. నీకు అంగీకారమైతే ఈమెను నీకు ధారపోస్తాను”అన్నాడు.

తండ్రి ప్రక్కన నిలబడి ఉన్న ముగ్ధ, దేవహూతి ని చూసి కర్దముడు,

“ఈమెకూ నాకూ గుణ రూపాలలోనే కాక, నడవడిలో కూడా పోలికలున్నాయి. కాబట్టి ఈమెను నేను వరిస్తాను. అయితే ఒక నియమం ఉంది. దాంపత్య జీవితానికి పరమావధి అయిన సంతానం కలగగానే, నేను యోగాభ్యాసంతో శ్రీహరి ధ్యానంలో ఉంటాను. ఆ విధంగా ముక్తి సాధన చేస్తాను. అందుకు అంగీకారమైతే, నీవు నాకు కన్యాదానం చేయవచ్చు” అన్నాడు.

[చూడండి. కర్దముడు దేవహూతి అందాన్నో స్వాయంభువ మనువు సంపదనో పరిశీలించలేదు. ఆమెకూ తనకూ… గుణంలోనూ, రూపంలోనూ, ప్రవర్తనలోనూ పోలికలుండడాన్ని గమనించాడు. అప్పుడే దంపతులు సుఖంగా జీవించగలరని ఆయన ఉద్దేశం. స్వభావంలో, గుణంలో తూర్పు పడమరల్లా ఉన్నా, రూపంలో ఒకరు అందంగా మరొకరు అనాకారిగా ఉన్నా, నడవడికలో ఒకరిది శాంత స్వభావం మరొకరిది క్రోధ స్వభావం గలవారైనా వాళ్ళు ఒకరితో ఒకరు సర్ధుకు పోలేక పోవచ్చు.

ఏమైనా గుణరూప నడవడికల్లో పోలికలున్న వారైతే… కలిసి జీవించడం శాంతీ సంతోషాలాతోనే కాదు, ముక్తి సంపాదించే ప్రయత్నంలో ఒకరికి మరొకరు తోడ్పాటు నివ్వగలరన్నదే ఇక్కడ ఉద్దేశం.]

కర్దముడి అభిప్రాయం, నియమాల గురించి స్వాయంభువ మనువు తన భార్య శతరూపతో, కుమార్తె దేవహూతితో సంప్రదించాడు. వారిద్దరూ అంగీకరించారు. దాంతో దేవహూతిని కర్దముని కిచ్చి వివాహం జరిపించాడు.

[‘ఆఁ ఆడవాళ్ళతోనా వ్యవహారం!?’ అనుకోకుండానూ… ‘మన కుటుంబాల్లో ఆడవాళ్ళని అడిగే అలవాటు లేదు!’ అనకుండానూ… భార్యనీ, కుమార్తెనీ కూడా సంప్రదించాడు స్వాయంభువ మనువు. పెళ్ళి చేసుకోవాల్సింది కుమార్తె గనుక ఆమెనీ, తల్లి గనుక తన భార్యనీ సంప్రదించాడు!]

వివాహానంతరం దేవహూతిని, కర్దమునికి అప్పగించి తిరిగి వెళ్ళే సమయంలో, ఆ తండ్రి హృదయం విషాద భరితం అయింది. ఎంత అపురూపంగా పెంచినా, అనురాగం పంచినా, అప్పటి వరకూ తమ చేతుల్లో ఆడిపాడిన, తమ ఇంట్లో నడయాడిన తమ కన్నబిడ్డ… ఇప్పుడు అల్లుడి సొత్తు! ఒకసారి దానం ఇచ్చాక, ఇక ఆమెపై తల్లిదండ్రుల ప్రమేయమూ, ప్రభావమూ ఉండవు కదా!

బిడ్డను కౌగలించుకుని, శిరసు ముద్దాడి, వెన్నుదువ్వుతూ కొంత సేపు కన్నీరు విడిచి, మనస్సు దిటవు చేసుకున్నాడు. సంసార నౌకలోకి అడుగు పెట్టిన కుమార్తెకు, అల్లుడికి కొన్ని మంచి మాటలు చెప్పి సెలవు తీసుకున్నాడు. దారిలో బ్రహ్మావర్ష దేశంలో విష్ణువరంగా సత్ర్కుతువులు చేసి రాజధాని చేరాడు.

పార్వతీ దేవి పరమశివుని ఆరాధించే రీతిలో, దేవహూతి తన భర్తను సేవిస్తూ, భక్తితో ఆయన శుశ్రూషయే పరమావధిగా భావిస్తూ, కామ క్రోధాది అరిషడ్వర్గాలనీ, అహంకారాన్నీ దరి చేరనీయకుండా, సర్వమూ తనకు భర్తయే అని త్రికరణశుద్దిగా విశ్వసిస్తూ జీవయాత్ర సాగిస్తున్నది.

[సన్మార్గుడైన భర్తని అనుసరిస్తూ సేవించడం సతీధర్మం. అధర్మ పరుడైనా నోరెత్తక పడి ఉండమనే వ్రత కథలూ, కుష్ఠురోగ పీడితుడైనా వేశ్యా సంపర్కాన్ని కోరిన భర్తని గంపలో మోసుకెళ్తూ సూర్యోదయాన్ని ఆపమంటూ సూర్యుణ్ణి శపించబోయిన సతీ సమతుల కథలు ప్రక్షిప్తాల్లో భాగాలు!

హిందూ ఇతిహాసాలని అవహేళన చెయ్యడానికి… సినిమాలలో చూపే విధంగా సాంబారులో తామే బొద్దింకని వేసి, ఆపైన నానా రచ్చ చేసి హోటల్ వాడి నుండి పైకం రాబట్టే రేలంగిలా… హిందూ ఇతిహాసాలపైనా, పురాణాల పైనా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అమలు చేసిన కుట్రలో భాగమే ప్రక్షిప్తాలు! అసలు చరిత్రే వారి దృష్టిలో చింపేస్తే చెరిగి పోయేది. తామేది ప్రచారిస్తే అదే… చరిత్ర అయినా, మరేదైనా!]

ఆ విధంగా తనని సేవిస్తున్న భార్యని చూచి, ఓ రోజు… కర్దముడు “ఇల్లాలా! నీ సేవాభావం నా మనస్సుకి ఆహ్లాదం కలిగించింది. నీకు దివ్యదృష్టి వరంగా యిస్తున్నాను” అన్నాడు.

దేవహూతి చల్లని వెన్నెలలా మందహాస చేస్తూ“స్వామీ! మీ సేవలో మీ సర్వశక్తులూ నాకు లభిస్తాయని తెలుసు.” అంది.

కర్దముడు చిరునవ్వుతో చూసాడు.

ఆమె వినయంగా “మన కల్యాణ సమయాన, మీరు వాగ్ధానం చేసిన సంతాన విషయం విస్మరించరని నమ్ముతాను” అంది.
అంతట కర్దముడు తన శక్తితో మణులు చెక్కిన స్తంభాలతో అలరారే సువర్ణ సౌధాలు కల్పించాడు. దాని నిండా సంసారానికి అవసరమయిన శయ్యాగారాలు, భోజన శాలలు, సువర్ణ పాత్రలు, పట్టు పీతాంబరాలు సృష్టించాడు. భవనం చుట్టూ ఉద్యానవనాలు, వనాలలో లతానికుంజాలు, ఫలవృక్షాలు, శుక పిక సంతతులు, సరోవరాలు, క్రీడామందిరాలు సర్వశోభాయమానంగా ఉన్నాయి. రంగురంగుల పూలు, సుమధుర పరిమళాలు, పూలపై వాలుతున్న తుమ్మెదల అలంకారాలు! పిట్టల కువకువలు, సరోవరాల్లో హంసల విహారాలు!

[ఇంత కంటే గొప్ప విల్లాలను ఏ constructing company కట్టగలదు?]

ఇక వీటన్నిటితో నిండిన దివ్యవిమానం సృష్టించాడు.

అదంతా చూసినా దేవహూతికి సంతోషం కలగలేదు. ఆమె పన్నెత్తి చెప్పకపోయినా, కర్దముడామె హృదయాన్ని గ్రహించాడు.

“ఈ బిందు సరోవరంలో స్నానం చెయ్యి. దానివల్ల అన్నికోరికలూ నెరవేరతాయి” అన్నాడు.

దేవహూతి సరోవరంలో దిగి, స్నానం చేసింది.

ఆమె సరస్సులోకి దిగిన ఉత్తర క్షణం, ఆ నీటిలో నవయౌవన శోభనాంగులు వెయ్యిమంది దాసీలు ప్రత్యక్షమయ్యారు. వారిలో కొందరు ఆమెకి సకల సపర్యలూ చేశారు. భవనాలలో, ఉద్యానవనాల్లో, విమానంలో కావలసిన పనుల్లో కొందరు నిమగ్నమయ్యారు. కొందరామె సేవలో నిమగ్నమయ్యారు.

ఆమెకు చక్కగా అభ్యంగన స్నానం చేయించి, అగరధూపంతో తల ఆర్చి, దువ్వలువలు ధరింప చేసారు. తీరుతీరుగా కురులు ముడిచి పుష్పాలంకరణ చేసారు. రత్నాభరణాలతో అలంకరించారు.బొట్టూ కాటుకలతో ముఖారవిందాన్ని మురిపించారు.

షడ్రసోపేతంగా భోజనం పెట్టి, కర్పూరహారతు లిచ్చి, చక్కని ఆసనం మీద కూర్చుండబెట్టి, ఎదురుగా నిలువెత్తు అద్దం ఉంచారు.

దేవహూతి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ, భర్తను స్మరించింది. ఉత్తర క్షణంలో ప్రక్కగా నిలిచాడాయన.

పెళ్ళినాడు ఏ వయోరూప సౌందర్య లావణ్యాలు ఉన్నాయో, అదే రీతిగా ఈ క్షణంలో ఉన్న దేవహూతిని ప్రియంగా చూస్తూ, భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు కర్దముడు. దాసీజనాలతో కూడా దంపతులు విమానం ఎక్కారు.

సర్వసుఖ సౌకర్యాలతో ఉన్న ఆ విమానంలో సకల లోకాలూ తిరిగి వచ్చారు దేవహూతి, కర్దములు. [ఇంతకంటే గొప్పదైన హనీమూన్ ప్యాకేజీని ఏ అంతర్జాతీయ సంస్థ అయినా ఇవ్వగలదా!?]

విహార యాత్ర అనంతరం, తన నివాసానికి వచ్చి, దేవహూతితో సాంసారిక సుఖభోగాలను అనుభవిస్తూ కొంతకాలము గడిపారు. ఆ రోజులలో కర్దముని అనుగ్రహంతో దేవహూతి తొమ్మండుగురు ఆడపిల్లలను ప్రసవించింది.

అప్పుడు కర్దముడు సన్యాసాశ్రమం స్వీకరించబోగా, ఆమె ఆయన పాదాలపై వ్రాలి “స్వామీ! ఈ బాలికలకు వివాహం చేసి, నాకు తత్త్వోపదేశం చేయగల కుమారుని దయచేసి మీరు సన్యాసం తీసుకొండి” అని వినయంగా ప్రార్ధించింది.

[ఆ తల్లి తన కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేయగల కుమారుడిని మాత్రమే అడగ లేదు. ఆ కుమారుడు తనకు తత్త్వోపదేశం కూడా చేయగలిగి ఉండాలని కోరింది.]

కర్ధముడు ఆమె అభీష్టాన్ని మన్నించాడు. మరికొంత కాలం గడిచింది. ఆ దంపతుల ధర్మనిష్టపై భగవంతుడి కరుణ అన్నట్లుగా వారికి ఒక కుమారుడు కలిగాడు. శ్రీహరి అంశం, ఆమె గర్భాన పుత్రరూపంలో ప్రవృద్ధమై, కపిలముని జన్మ పొందింది.

ఆ సమయాన వచ్చిన బ్రహ్మాది దేవతలందరూ దేవహూతిని, కర్దమునీ అభినందించి ఆనందంతో తిరిగి వెళ్ళారు.

చతుర్ముఖుని ఆజ్ఞానుసారం, కర్దముడు తన బిడ్డలు తొమ్మండుగురినీ, ఘరీచి, ఆత్రి, అంగీరస, పులస్త్య, క్రతు, భృగు, వశిష్ఠ, అధర్వులకిచ్చి వేదొక్తంగా వివాహం జరిపించాడు.

కొంతకాలం గడిచింది.

ఒకనాడు కర్దముడు తన యింట కపిల రూపంలో ప్రభవించిన మహావిష్ణువును సమీపించి “పురాణపురుషా! సర్వ మానవులూ నీ చరణ సేవతో ముక్తిధామం చేరుతారు. మా అదృష్టవశాన మా పుత్రుడవై జన్మించి మాకు తరణోపాయం చూపించావు. ఇక నేను సంసారం వదలి, వనానికి పోయి, యోగ మార్గాన ముక్తి సాధించుకుంటాను” అన్నాడు.

కపిలుడు మందహాసం చేసి “ఈ మానవులందరినీ ఉద్దరించడానికే కపిల మునిగా అవతరించాను. సాంఖ్య యోగ ప్రభోధంతో వీరిని తరింప జేస్తాను. నువ్వు నిశ్చితంగా పరంజ్యోతి ధ్యానంతో కైవల్య పదం చేరు” అని పంపించాడు.

కర్దముడు ప్రశాంత తపోవనం చేరి యోగనిష్ఠతో ఈశ్వరధ్యానంతో పరమ భాగవతోత్తముల స్థానం చేరాడు.

[తన తపశ్శక్తితో తృటిలో అంత సంపదనీ, సకల సౌకర్యవంతమైన సకల లోకాలనూ చేరగల విమానాన్నీ సృష్టించగల కర్దముడు… ఆ సుఖభోగాలలో మునిగి పోవాలనుకోలేదు. అవి అశాశ్వతమని తెలుసు. అలాగని ‘అసలే భోగమూ అనుభవించను’ అనీ అనుకోలేదు. సంసారికీ ఎంత సుఖసౌకర్యాలు కావాలో, సంసారి గా ఏ గమ్యాన్నీ చేరాలో ఆయనకి నిర్ధిష్టంగా తెలుసు. దాన్నే నిగ్రహంగా అనుసరించాడు. దేనికి ఏది ఎంత యుక్తమో కర్దముడు ఆచరించి చూపాడు.]

మరికొంత కాలం గడిచింది.

బిందువరం దగ్గర దేవహూతి, కపిలుని చేరి తనకు తత్వం ఉపదేశించమని కోరింది.

[ఏ సరోవరం దగ్గరైతే భర్తతో సంసార జీవితాన్ని ప్రారంభించిందో, అక్కడే కుమారుణ్ణి తత్త్వం బోధించమని అడిగింది. సంసారపు తుది గమ్యం అదే అన్నట్లుగా!]

కపిలుడు చిరునవ్వు వెన్నెలలు వెదజల్లుతూ శాంత గంభీర స్వరంతో తల్లికి తత్త్వోపదేశం చేసాడు.

[ఉషశ్రీ వచన భాగవతంలో క్లుప్తంగా వ్రాసినా… ఈ తత్త్వోపదేశం దాదాపు నాలుగు పేజీలలో ఉంది. అది మరోసారి!]

స్వాయంభువ మనువు, శతరూపల కుమార్తెలు ఆకూతి, దేవహూతి, ప్రసూతి. దేవహూతి కర్దముల పుత్రుడు నారాయణ అంశగల కపిల ముని. ప్రసూతి దక్షుల కుమార్తె పార్వతీదేవి అంశగల సతీ దేవి.

అందుకే, శ్రీమహా విష్ణువు, పార్వతీ దేవి లను వరుసకు అన్నాచెల్లెళ్ళుగా చెబుతుంటారు.

ఈ పురాణ గాధలో… మన పూర్వీకులు ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి, వాళ్ళకి సంపదా తెలుసు, సుఖసౌకర్యాలూ తెలుసు. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఎంతెంత గానో! అలాగే దేనికి ఏది అవధో కూడా! సుఖశాంతులతో బ్రతకడానికి, సంపద ప్రమేయం కొంతే! అలాగే సంపద పోగొట్ట గలిగే విచార దుఃఖాలు కూడా కొంతే!

కాబట్టి – బ్రతకడానికి డబ్బు కావాలి. కానీ డబ్బే బ్రతుకు కాదు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటారు. డబ్బుకోసం పరుగుపెట్టి ఆయాసం తెచ్చుకున్నాక, పోయిన ‘మహాభాగ్యం’తో పోల్చుకుంటే… ఏదీ ఆ వెలితి పూడ్చలేదు.

కారు పోతే, మరో కారు కొనుక్కోగల అవకాశం ఉంది. ఒక ఇల్లు అమ్ముకుంటే, అంతకంటే మంచిదైన మరో ఇంటిని కొనుక్కోగల అవకాశం ఉంది.

కానీ భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని పోగొట్టుకుంటే, మరో దాన్ని తెచ్చుకోలేం! జీవితమూ అలాంటిదే! ఒక దాన్ని పోగొట్టుకుంటే మరోదాన్ని పొందగలిగే వీలు లేదు.

పోగొట్టుకున్న కాలాన్నీ తిరిగి పొందగలిగింది లేదు. కాబట్టి – సుఖంగా సౌకర్యాలతో బ్రతికేందుకు సంపద సంపాదించుకోవాలి. దాన్ని, శాంతంగా సంతోషంగా ఆస్వాదించేందుకు తీరికా కావాలి.

ఆ అవధిని గుర్తించుకుంటే ఆనందం మన వెంటే! అప్పుడు దోపిడికీ హద్దులు ఏర్పడతాయి. వ్యాపారం మోసంగా పరిణమించటం మాని, మానవ జీవితాన్ని దురాక్రమణ చేయకుండా ఉపశమిస్తుంది.

అందుకు సర్వమానవాళి నిజాలు తెలుసుకోవాలి!

సత్యాన్ని చూడాలన్నా, అంగీకరించాలన్నా ధైర్యం కావాలి. ఆత్మశక్తి కావాలి.

అది సామాన్యులకి లభ్యమైనప్పుడు ప్రాకృశ్చిమాల మేలు కలయికనీ…

పాత కొత్త రోజుల మంచినీ…

ఏర్చికూర్చుకుని,

వర్తమాన మానవ జాతి, భవిష్య ప్రపంచానికి అందిస్తే!?

ఎంత తియ్యటి కల కదూ!

నిజమౌతుందని ఆశిద్దాం!

నిజమయ్యేందుకు…

మన కర్తవ్యం మనం పాటిస్తే…

నిజం చెయ్యమని భగవంతుణ్ణి ప్రార్దిస్తే…

నిజం కావటం అసాధ్యం ఎప్పటికీ కాదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఈ రోజు వైకుంఠ ఏకాదశి. ఈ పండుగ రోజున ఓ చిన్న కథా విశ్లేషణతో నా బ్లాగు పాఠకులని అలరించాలని ఈ టపా వ్రాస్తున్నాను.

గీతలో శ్రీకృష్ణ భగవానుడు

“శ్లోకం:
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం
మాసానాం మార్గశీర్షో హ మృతూనాం కుసుమాకరః

భావం:
సామములలో బృహత్సామం, ఛందస్సులలో గాయత్రి, నెలలలో మార్గశిరము, ఋతువులలో వసంతమూ నేనే.”

అంటాడు.

మాసాలలో మార్గశిరమాసం మహావిష్ణువుకు ఇష్టం. లక్ష్మీదేవికీ ఇది ప్రీతికరం!

ఆ సందర్భంగా ఈ కథా విశ్లేషణ: శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం తెలుగు వారందరికీ తెలిసిన కథ.

అందులో…

లోకకళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగుమహర్షిని పంపుతారు. అరికాలిలో నేత్రం కారణంగా తనకి గల శక్తిపట్ల గర్వితుడై ఉన్న భృగు మహర్షి, తొలుత సత్యలోకాన్ని చేరాడు.

వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు, ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీ దేవి సంగీతంలో సంలీనులై ఉన్నారు. ఆలుమగలిద్దరూ ఒకే అనుభూతిలో లయించి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది. భృగు రాక వారిని ఆటంక పరచలేదు. దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు.

బ్రహ్మకు భూలోకంలో ఆలయాలుండవని శపించిన భృగవు, నేరుగా కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు. ఆది దంపతులతో బాటు గణపతి కుమారస్వామి సహితంగా నందీ భృంగీ, రుద్రగణాలు ఆ పారవశ్యంలో ఉన్నారు.
ఇక్కడా భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు. పార్వతీపరమేశ్వరులు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యం సర్వసృష్టికీ శృతిలయలై ఉంది.

అహంకార రహితుడై ఉండి ఉంటే… భృగుమహర్షి, ఆది దేవుడు నాట్యమాపి తనని పలకరించే వరకూ సహజంగా, భక్తిగా, వేచి ఉండేవాడు. కానీ భృగువుకి అదనపు శక్తి ఉంది. దాని తాలూకూ అహంకారమూ ఉంది. కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండటం కాదు, భగవంతుడే భక్తుడి రాక కోసం మెళకువతో ఉండాలనుకున్నాడు.

దాంతో ఆగ్రహన్ని నిగ్రహించుకోలేక లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి అర్చనలుండ రాదని శపించి వైకుంఠానికి వెళ్ళాడు.
అక్కడ లక్ష్మీనారాయణలు చదరంగ వినోదంలో ఉన్నారు. సత్యలోకంలో బ్రహ్మా సరస్వతుల హృదయాలు సంగీత భరితమైతే, కైలాసంలో శివపార్వతుల తనువులు నాట్యగతిలో లయించి ఉన్నారు. వైకుంఠంలో లక్ష్మీవిష్ణువులు మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు. ‘సృష్టి స్థితి లయకారులం కదా’ అని త్రిమూర్తుల్లో ఎవరూ ఇల్లాలితో గడపటానికి ‘టైం లేదు. బిజీగా ఉన్నాం’ అనలేదు, అనుకోలేదు.

క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి శ్రీదేవిలను చూశాడు భృగువు. అప్పటికే ఆగ్ర్రహం హద్దులు దాటి ఉంది. కాలెత్తి మహా విష్ణువు వక్షస్థలం పై తన్నాడు. గుండెలపై తన్నిన బిడ్డణ్ణి చూసిన తండ్రిలా… శాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి!
భృగువుని బుజ్జగిస్తూ, అతిధి సత్కారాల్లో భాగంగా అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తూ… భృగువు అరికాలిలోని నేత్రాన్ని చిదిమి వేసాడు. అప్పటికి కానీ భృగు మహర్షి తలకెక్కిన అహంకార మహమ్మారి దిగిపోలేదు, చేసిన తప్పిదాలు తెలిసి రాలేదు, పోగొట్టుకున్న తపశ్శక్తి నష్టం అర్ధం కాలేదు.

దాంతో దిమ్మతిరిగి వాస్తవంలోకి వచ్చిపడ్డ భృగువు, దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై బడ్డాడు. ఆపైన పశ్చాతప్తుడై తపోవనానికి తరలిపోయాడు. అతణ్ణి ఆశ్వీదించి తిరిగి చూసిన శ్రీహరికి, ఎదురుగా శోకమూర్తియై శ్రీలక్ష్మి నిలిచి ఉంది!

తన నివాసస్థానమైన మహా విష్ణువు వక్షస్థలంపై తన్నిన భృగువుని విష్ణువు శిక్షించకుండా సమాదరించి పంపినందుకు ఆ తల్లి అవమానం పదింతలైనట్లుగా పరితపిస్తోంది.

అనునయించ బోయిన శ్రీమన్నారాయణుడికి శ్రీదేవి శోకాశ్రువులే సమాధానం చెప్పాయి.

బాధతప్తమై, ఆ ఇల్లాలు కన్నీటితో భర్తని విడిచిపోయింది.

సిరితనతో ఉన్నప్పుడు సర్వ సంపదలతో వైభవమూర్తియై విలసిల్లిన శ్రీమన్నారాయణుడు, సిరిదేవి విడిచి వెళ్ళటంతో దరిద్ర నారాయణుడై… అడవులు బట్టి పోయాడు.

గుక్కెడు పాలకి పుట్టలో ఉండి, పొదుగు వదలిన గోమాత పుణ్యాన కడుపు నింపు కున్నాడు. దేశ దిమ్మరిలా తిరుగుతూ వకుళ మాలని చేరినప్పుడు సైతం “ఎవరు నాయనా నీవు?” అంటే…

“ఏ పేరని చెప్పను? ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. ఏ ఊరని చెప్పను? అన్ని ఊళ్ళు నావే! సిరియు నుండె తొల్లి. ఇప్పుడు తొలగి పోయినది” అంటాడు.

ఆ తల్లి జాలిపడుతూ “అంతే నాయనా లోకరీతి! భాగ్యమున్నంత కాలం అందరూ గౌరవిస్తారు. కలిమి కోల్పోయిన నాడు అన్నీ కోల్పోయినట్లే!” అంటూ కన్నబిడ్డ నాదరించినట్లు ఆదరిస్తుంది.

ఆశ్రమ వాసియై, వరాహమూర్తి అనుమతి పొంది, ఆశ్రితుడై జీవిస్తూ… ఆకాశరాజ పుత్రి పద్మావతిని పరిణయ మాడాలను కుంటే… పైసలేవీ? పెళ్ళి చేసుకునేందుకు వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది.

ఒకప్పుడు సిరిసంపదలకి నెలవైన వాడు!

కలకంఠ కంట కన్నీరొలికితే… అదీ పరిస్థితి!

అందుకే – “కట్టుకున్న ఇల్లాలి కంట కన్నీరు చిందితే ఆ ఇంటి సంపదలు నిలబడవు” అంటారు.

అదీ, హిందూ మతం… స్త్రీకి, జీవన సహచరికి ఇచ్చిన ప్రాముఖ్యత!

అదే కలియుగ దైవం ‘శ్రీ వేంకటేశ్వరుడి కథ’ మనకి చెబుతుంది. [ఇదంతా వదిలేసి ఇప్పుడు చాలామంది శ్రీ వేంకటేశ్వర స్వామితో లంచాల బేరసారాలు చేస్తుంటారు.]

అందుకే – ఒకప్పుడు ఇంట ఆడపిల్ల పుడితే ‘మహాలక్ష్మి పుట్టిందిరా’ అనేవాళ్ళు. ఆ భావం బలంగా ఉన్నప్పుడు ఆడపిల్ల అని భౄణహత్యలూ, శిశు హత్యలూ జరగవు.

‘ఇల్లాలి కంటి నీరు ఇంటికి చేటు’ అనుకుంటే, వరకట్నపు చావులూ ఉండవు.

అయితే ఇక్కడా ఓ హద్దు ఉంది సుమా!

ఇల్లాలికి అరిషడ్వర్గాలు అదుపులో లేవనుకొండి. మొగుడి ఆదాయానికి ఆరింతలు ఖరీదుండే పట్టుకోకలూ, పట్టెడ నగలూ గట్రా కోరికలతో వేపుకు తింటుంటే…

అప్పుడు ‘కలకంఠి, కంట కన్నీరొలికిన కరిగి పోవురా సిరులు’ అనుకోవటం కష్టం.

ఎందుకంటే – కోరికల చిట్టా కొండవీటి చాంతాడంత ఉంటే మగాడి బ్రతుకు మటాష్ అయిపోతుంది మరి!

అంచేత, ఇది… కోరికలు వాస్తవ ప్రపంచం తోనూ, భర్త పరిస్థితులతోనూ అనుసంధానమై ఉండే అతివల విషయంలోనే అనువర్తించ గలిగేది.

ఏమైనా…

భార్య భావాలని గౌరవిస్తే, ఆమె అవమానాలని తన అవమానంగా భావిస్తే, ఆమె మనస్సుని నొప్పించక పోతే…
మొత్తంగా, ఆమె కంట కన్నీరు చిందకుండా చూసుకుంటే

సిరి, సుఖ సంతోషాలు ఆ ఇంట స్థిరంగా ఉండిపోతాయి.

అటువంటి సిరితల్లి ఈ పండుగ రోజున మనందరినీ అనుగ్రహించాలని కోరుతూ…

అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు!

ఈ నేపధ్యంలో నేను మీకు కొన్ని విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను.

నెయ్యి రంగు రుచీ వాసనా తెలియని వారికి, ఎన్నిరకాలుగా చెప్పినా నెయ్యిని స్ఫురింప చెయ్యలేం. కాబట్టే మన పెద్దలు ‘నేతి నేతి’ ని ‘బ్రహ్మానందాన్ని తెలుసుకోవటం’ అనే నేపధ్యంలో వాడతారు.

ఏ విషయాన్నైనా… కనీసం దాని ప్రాధమిక రూపమైనా తెలియనిది, దానిపై ఏ ఊహానీ చెయ్యలేం! సైన్స్ డెవలప్ మెంట్ ఎలా ఉంటుందో తెలియని రోజుల్లో, రైట్ బ్రదర్స్ విమానాలని ప్రజలు నమ్మలేనట్లు, రోబోలనీ నమ్మలేనట్లు!

కాబట్టే… కళలూ సాహిత్యాన్ని బట్టి, ఆయా కాలల్లో సమాజపు జీవన స్థాయిని చరిత్ర కారులు లెక్కగడతారు.

మత గ్రంధాలు, మత సాహిత్యం, మతపరమైన కళలూ, ఆచార వ్యవహారాలు కూడా ఆ కోవలోకే వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే… భారతీయుల హిందూ పురాణాలు, వేదాలు ఆనాటి వారి మానసిక స్థాయిని చెబుతాయి. పురాణ గాథలలోని వర్ణనలు ఆనాటి సామాజిక స్థితులని, సౌభాగ్య వైభవాన్ని వివరిస్తాయి,

ఆ సంపదని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాయి. రత్నఖచిత ఆభరణాలు, పట్టు పీతాంబరాలు దైవ విగ్రహాల ఆవిష్కరణలోనే కాదు, దేవతామూర్తుల వర్ణనలలోనూ ఉన్నాయి. ఆలయాలలో శిల్ప సంపదలోని ఆభరణాల శైలి, ఆ వైభవాన్ని వేనోళ్ళ చాటుతుంది.
అలంకార ప్రియులుగా, ఆభరణాలతో నిండిన దేవతా రూపాలు హిందువుల పూజలందుకుంటాయి.

అదే గ్రీకు వారి పురుణాలు ఇలియాడ్ గట్రాలలో చూస్తే… వీనస్, హెర్కులస్, జూపిటర్, ధేసిస్ వంటి, వారి దేవతల ఆభరణాలు, దుస్తులూ, హిందూ దేవతల ఆభరణాలూ దుస్తులంత వైభవంగా ఉండవు. [ఇక్కడ నాకు గ్రీకులని గానీ మరే ఇతర దేశీయులని గానీ చిన్నబుచ్చే ఉద్దేశం లేదు.] ఎవరి శైలి వారిది అనుకున్నా… గ్రీకు దేవతల వారి దేవతల రాజు జూపిటర్ యొక్క కిరీటాల దగ్గరి నుండి అన్ని అభరణాలలోనూ, విశేష పనితనం, కళాత్మకత, వైభవం ఉండవు.

ఉదాహరణకు చెప్పాలంటే – గత టపాలల్లో వ్రాసిన ‘300 యోధులు’ సినిమాలో లియో నైడర్స్ స్పార్టా కు రాజు. అతడి వేషధారణ గానీ, అంతఃపురం గానీ ఎలా ఉన్నాయో అందరం చూసిందే! అదే, జానపద కథలుగా భారతీయులకి, ముఖ్యంగా తెలుగు వారికి, తెలిసిన ఏ ‘జగదేశ వీరుని కథ’ వంటిదో, పౌరాణికాలైన ‘మాయబజార్’, ‘నర్తన శాల’ వంటిందో అయితే… అందులో రాజుల వేషధారణ, అంతఃపురాల కళాత్మక ఎలా ఉంటాయో కూడా అందరికీ తెలుసు! అదీ వ్యత్యాసం!

చివరికి రాజాధి రాజుగా కీర్తించబడే జెక్సీస్ మహారాజు ఆభరణాలు, వేషధారణ చూస్తే… అతడి కంఠసీమలో ఉండే ‘కంటె’ వంటి ఆభరణాలు మన దేశంలో గిరిజనుల ఆభరణాలని తలపిస్తాయి.

అదీ… ‘తెలిసినతనం’లో ఉండే వ్యత్యాసం!

క్రైస్తవుల మత గ్రంధం బైబిల్ లో, క్రీస్తు జన్మించినప్పుడు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళే జ్ఞానులూ, ఇతరులూ సమర్పించే కానుకలు… బంగారం, సాంబ్రాణి! చివరికి బైబిల్ లో వర్ణించబడిన సాలమోను చక్రవర్తి సంపద వివరాలలో కూడా… పాత నిబంధన

గ్రంధం, 11 వ అధ్యయాలలో… దిగువ పేరాలను ఓ సారి పరిశీలించండి.

>>> సొలోమోనునకు ఏటేట ఇంచుమించు 66 బారువల బంగారము లభించెడిది. వర్తకుల మీద విధించిన కప్పముల నుండియు, వర్తకుల నుండియు, ఆరేబియా రాజు నుండియు, రాష్ట్రపాలకుల నుండియు లభించిన బంగారము ఈ లెక్కలో చేరలేదు.

అతడు కమ్మచ్చున తీసిన బంగారముతో రెండు వందల పెద్ద డాలులను చేయించెను. వానికొక్కొక్క దానికి ఆరువందల తులముల బంగారము వాడెను. కమ్మచ్చున తీసిన బంగారముతోనే మూడువందల చిన్న డాలులను గూడ చేయించెను. వానికి ఒక్కొక్క దానికి నూటయేబది తులముల బంగారము వాడెను. వానినన్నిటిని “లెబానోను అరణ్యము” అను పేరుగల మందిరమున నుంచెను.

అతడు దంతముతో సింహాసనము చేయించి దానిని మేలిమి బంగారమున పొదిగించెను. ఈ సింహాసనమునకు ఆరుమెట్లు కలవు. ఒక్కొక్క మెట్టునకు రెండు సింహముల చొప్పున మొత్తము పండ్రెండు సింహముల బొమ్మలు కలవు. సింహాసనమునకు వెనుక తట్టున ఎద్దుతలను చెక్కించెను. సింహాసనమున రెండు చేతులకు ప్రక్క రెండు సింహముల బొమ్మలు కలవు. ఏ రాజును ఇటువంటి సింహాసనమును చేయించిఎరుగడు.

సొలోమోను పానపాత్రములన్నియు, లెబానోను అరణ్యము అను పేరుగల మందిరములోని పాత్రములన్నియు మేలిమి బంగారముతోనే చేయబడెను. సొలోమోను కాలమున వెండికి విలువ లేదు గనుక దానితో అతడు వాడిన పాత్రలలో దేనిని చేయరైరి.

సొలోమోనునకు నావలును గలవు. అవి హీరాము నావలతో పాటు సముద్రయానము చేసేడివి. ప్రతి మూడేండ్ల కొకసారి అతని ఓడలు వెండి బంగారములతో, దంతములతో, రకరకముల కోతులతో తిరిగి వచ్చెడివి. విజ్ఞానముననేమి వైభవముననేమి సొలోమోను ఈ నేలను ఏలిన రాజులలోనెల్ల అధికుడు.

ప్రభువు అతనికి అనుగ్రహించిన విజ్ఞాన సూక్తులను వినుటకై ప్రపంచములోని జనులెల్లరు రాదొడగిరి. అతనిని చూడవచ్చిన వారు వెండి బంగార వస్తువులను, ఆయుధములను, సుగంధ ద్రవ్యములను, గుఱ్ఱములను, గాడిదలను బహుమతులుగా కొని వచ్చిరి. ఏటేట ఇట్లే జరుగు చుండెడిది.

సొలోమోనునకు గొప్ప రధబలమును గలదు. అతడు పదునాల్గు వందల రధములను తయారు చేయించెను. పండ్రెండు వేల గుఱ్ఱములను సంపాదించెను. వానిలో కొన్నిటిని రథనగరములందు నిల్పి యుంచెను. కొన్నిటిని యెరూషలేముననే ఉంచెను.

~~~~~~~

బైబిల్ ని గానీ, క్రైస్తవ మతాన్ని గానీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. బైబిల్ వారి మత గ్రంధమే కాదు, వారి చరిత్రనీ, సామాజిక జీవనాన్ని కూడా వివరించే గ్రంధం. నిజానికి ఏ మత గ్రంధమైనా అంతే! ఆ ప్రామాణికత మేరకే పోలుస్తున్నాను.

అంత గొప్పగా కీర్తించబడిన, ఆరు మెట్లూ ఒకో మెట్టుకీ ఇరువైపులా సింహాల బొమ్మలూ ఉన్న, సొలోమోను సింహాసనంతో పోల్చితే… మన జానపద భట్టి విక్రమాదిత్యుల కథలోని సువర్ణ సింహాసనం ఎక్కువ వైభవంగా ఉంటుంది. ముప్పై రెండూ మెట్లూ, మెట్టు మెట్టుకీ పలుకు నేర్చిన సువర్ణ సుందరీ ప్రతిమలతో…!

ఇంకా… రామాయణంలోని సుందరకాండలో వర్ణించబడిన లంకానగర వైభవం ఎంతటి దంటే – ఆ నగర సంపద, సౌందర్యాల కారణంగా దాన్ని సుందర కాండ అని పిలిచేంత! మయుడి శిల్పకళా చాతుర్యం, నగర భవనాలని సువర్ణ శోభితం చేస్తుంది. మరకత మాణిక్యాలు పొదిగిన స్తంభాలతో, గవాక్షలతో, ముత్యాలూ రతనాలూ కూర్చిన తోరణాలతో… ఆ సంపద వైభవపు వర్ణన, చూడకుండానే కళ్ళు మిరుమిట్లు గొల్పుతుంది.

అంతగా ఊహించాలంటే వాల్మీకి మహర్షికి అంత సంపద ఉంటుందనీ, ఉండగలదనీ సూచన ప్రాయంగానైనా తెలియాలి కదా!? అసలు ఆధారమే లేకుండా అంత ఉచ్ఛ స్థితిని ఊహించలేడు గదా! వాల్మీకి ఒక కవిగాక వందమంది కవులైనా సరే! (ఈ వాదనలు కూడా… వాల్మీకి, వ్యాసమహర్షుల విషయంలో చేసారు లెండి!) ఆ వందమంది ‘వాల్మీకులకీ’ అంతటి సంపద యొక్క ప్రాధమిక ఉనికి అయినా తెలియాలి కదా!?

ఇదంతా ఎందుకు చెప్పానంటే… ‘ఇప్పుడు ఐశ్వర్యంతో మిడిసి పడుతున్న పాశ్చాత్య ప్రపంచం కళ్ళు తెరిచే నాటికే… ఈ వేదభూమి సిరి సంపదలని అనుభవించి, హద్దులు తెలుసుకొని ఉంది’ అని చూపేందుకే!

ఇంతగా సంపదా, వైభవమూ తెలుసుకాబట్టే… ‘ఎన్ని తాపత్రయాలు పడినా, ఏది పొందాలో అదే పొందుతామనీ, పోయేటప్పుడు వెంట వచ్చే అసలు సంపద ఏమిటో తెలుసుకొమ్మనీ’ చెప్పారు పెద్దలు.

‘ఒయాసిస్సుల్ని వదిలిపెట్టి, ఎండమావుల వెంట పరుగెత్త వద్దని’ హెచ్చరించారు. ‘ఎంత పొర్లాడినా ఎంత అంటుకోవాలో అంతే అంటుకుంటుందని’ ముతక సామెతలూ ఇందుకే చెప్పారు.

ఎందుకంటే – ప్రకృతిలోనే ఆ ‘సమతుల్యత’ (Balance) ఉంది. మనిషి దాన్ని ధిక్కరిస్తున్నాడు, ధ్వంసం చేస్తున్నాడు.
కొల్లేటి సరస్సు లోకి వలస కొంగలతో సహా పలు పక్షులొస్తాయి. వాటి రెట్టలతో చేపలు తామర తంపరగా వృద్ధి చెందుతాయి. చేపల్ని తిని కొంగలు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతాయి. ఆ విధంగా అవి పరస్పరాశ్రితాలు. ప్రాకృతిక వలయాలు.

నీటి చక్రంతో సహా… అంటే సముద్రాల్లో నీరు ఆవిరై వర్షమైతే… అది వాగులూ వంకలై, నదులుగా విస్తరించి మళ్ళీ సముద్రాన్ని చేరినట్లుగా… ప్రకృతిలో ఎన్నో సమతుల్య వలయాలున్నాయి. మనం భౌతిక శాస్త్రంలో చదువుకునే డాల్టన్ పదార్ధ నిత్యత్వ సూత్రంలాగా! ప్రకృతిలో ఆయా ప్రదేశాల్లో ఓ జీవికి మరో జీవి సహజ శతృవూ, ఒక జీవికి మరో జీవి ఆహారమూ, ఒక జీవికి మరో జీవి సహచరమూ అయినట్లుగా!

ఆ సమతుల్యతని దెబ్బతీస్తూ…

అభివృద్ధి సాధిస్తున్నాం, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నాం అంటూ…

కొండల్ని మింగేస్తూ…

సరస్సుల్ని తాగేస్తూ…

అడవుల్ని మాయం చేస్తూ…

మనిషి, తనకు తానే హాని చేసుకుంటున్నాడు. తోటి పశుపక్ష్యాదుల్నీ, క్రిమి కీటకాదుల్నీ హత్యలు చేస్తున్నాడు.
ప్రకృతి మనిషికి కడుపు నింపే కన్నతల్లి వంటిది. గూడునిచ్చి అవసరాలు తీర్చే కన్నతండ్రి వంటిది. అలాంటి ప్రకృతిని నాశనం చేస్తే… సర్వజీవులూ మానవాళీ కూడా నాశనం కాక తప్పదు.

ఒక ఉదాహరణ గమనించండి. బైకుల మీద ఇప్పుడు రఁయ్యి రఁయ్యిన ప్రయాణిస్తున్నాం. దానికి ఇంధనం కోసం భూగర్భాన్ని గుల్ల చేస్తున్నాం. తిరిగి ఆ గుంతలు పదార్ధంతో పూడాలంటే, అదే ఇంధనం ఏర్పడాలంటే – లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంతకాలం పట్టినా మళ్ళీ ఏర్పడక పోవచ్చు కూడా! ఎందుకంటే ప్రకృతి సహజ పరిణామ వలయాన్ని మనిషి అభివృద్ధి పేరుతో ఆటంక పరుస్తున్నాడు గనుక!

ఒకప్పుడు ఈనాటి బైకులంత వేగంగా గాకపోయినా, ఆనాటి కాలానికి తగిన వేగంతో వెళ్ళాలంటే గుర్రాలని వాడేవాళ్ళు. బైకు భూగర్భంలో నుండి వచ్చే పెట్రోలుని తాగితే, గుఱ్ఱం భూఉపరితలం మీది గడ్డి నములు తుంది. పెట్రోలు ఓ సారి తీస్తే మళ్ళీ రాదు. గడ్డి మేసిన కొద్దీ పెరుగుతుంది. ఆపైన గుఱ్ఱపు లద్దెతో మళ్ళీ మళ్ళీ చిగురిస్తుంది.

అలాగని మళ్ళీ అందరూ… బైకులూ, కార్లూ రైళ్ళూ విమానాలూ మూలన పడేసి ఎద్దుల బళ్ళు గుఱ్ఱాలూ ఎక్కమని అనటం లేదు. ‘దేనికైనా ఒక హద్దు అవసరం’ అంటున్నాను.

‘అభివృద్ధి పేరుతో, విస్తరిస్తున్న నగర సంస్కృతితో, వ్యవసాయాన్ని మింగేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో, ప్రకృతి కడుపులో చిచ్చు పెడితే… అది సర్వనాశనానికే దారి తీస్తుంది’ – అంటున్నాను.

దాని పేరు కాలుష్యం కావచ్చు, కార్చిచ్చు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, సునామీలు వరదలూ భూకంపాలూ కూడా కావచ్చు. కాబట్టే దేనికైనా ఓ హద్దు అవసరం అని పెద్దలన్నది!

ఈ విషయాన్ని ఎంత హృద్యంగా చెబుతుందో భాగవతంలోని ఈ కథ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఈ మధ్య ‘సాక్షి’ ఫ్యామీలీ పేజీల్లో ‘డైలీ స్టోరీ – ప్రతీ రోజూ ఓ కథాపరిచయం’ పేరిట, మంచి ముత్యాల్లాంటి కథలు కొన్నిటిని పరిచయం చేస్తోంది. వాటిలో డిసెంబరు 4 వ తేదీన నాగప్ప గారి సుందర్రాజు గారు వ్రాసిన ‘మగాళ్ళు సిద్ధంగా ఉన్నారు’ కథ చదివినప్పుడు మనస్సు కలిచి వేసింది.

ఆ సమీక్ష ఓ సారి పరీక్షించదలిస్తే…


~~~~~~~

ఏ కాలంలో అయినా, ఏ సమాజంలో అయినా ఏ వర్గానికి తమ పట్టు నడిస్తే… ఆ వర్గానికి, అహం బలిసి పోవటం మానవ నైజం. అది అగ్ర వర్గాంహకారామైనా, అణగారిన వర్గాల అహంకారమైనా!

అగ్ర వర్ణాంహకారమూ, పురుషాంకారమూ కలగలిసిన… బసివిని, మాతంగి, దేవదాసి గట్రా… ఏ పేరుతో పిలిచినా, ఊరమ్మడి వేశ్యగా ఆడపిల్లల ఉసురు పోసుకున్న దురాచారాన్ని గురించిన కథ – ‘మగాళ్ళు సిద్ధంగా ఉన్నారు’.

అది చదివినప్పుడు… “శతాబ్దాలుగా… ఎందరు స్త్రీల కన్నీరు కాల్వలు కట్టి ప్రవహించిందో! ఆ నీరంతా ఒకచోట చేరిస్తే ఓ సముద్రమంత అవదూ!?” అనిపించింది.

నిజంగా… ఆ ఆడబిడ్డల కన్నవాళ్ళు గానీ, ఊళ్ళో ఉన్నవాళ్ళు గానీ… ఎవరూ వాళ్ళ గురించి తలచలేదే? దాదాపుగా, స్వాతంత్ర సమర సమయం వచ్చే వరకూ కొనసాగిన ఈ దుష్టాచారంలో… రఘపతి వెంకటరత్నం, గాడిచర్ల హరి సర్వోత్తమ రావుల వంటి వాళ్ళు గొంతులెత్తి కృషి చేసే వరకూ… ఎందరు దేశ్ ముఖ్ ల, పెద్ది రెడ్డిల, చౌదరి బాబుల, చిన్న నాయుళ్ళ చేతుల్లో, ఎందరు ‘కమ్లి’లు, ‘బోడెక్క’లూ నలిగి పోయారో!

ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు స్పందించలేదు, అడ్డగించనూ లేదు. బహుశః అసహ్యంచుకొని ఉంటారేమో! అదీ సదరు అభాగినులనే గానీ… తమ మొగుళ్ళనీ, తమ ఇంటి మగవాళ్ళనీ అయి ఉండదేమో! కొందరన్నా సానుభూతి కలిగి ఉన్నా, సాటి ఆడవాళ్ళ కన్నీరు తుడవగలిగేంత అయి ఉండదు. కాబట్టే – దేవదాసీ వ్యవస్థ అనుశృతంగా కొనసాగింది.

ఇక మగవాళ్ళు…

దున్నపోతు కూరాకు కోసం ఎగబడిన మాదిగ వాళ్ళలాగా…

ఆడపిల్ల శరీరం కోసం ఎగబడిన మగాళ్ళు!

తమ తల్లీ, చెల్లీ, కూతురు, మనవరాళ్ళ వంటిది కాదూ ఎదుటి ఆడపిల్ల!?

ఉహు! అవన్నీ ఆలోచించే అవసరమేముంది?

ఏదో బావుకుందామన్న యావ తప్ప!

ఏదేమైనా,,, ఆడా మగా, ముసలీ ముతకా… అందరూ, మొత్తంగా సమాజమే… చూస్తూ ఊరుకుంది. [ఇక్కడ పేరుకే అగ్రవర్ణం, మాదిగ కులం. గీత చెప్పే చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం అందరి ప్రవర్తన తామసమే.]

ఆ పాపమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, దేశాల కతీతంగా, ప్రభుత్వాలని తోలుబొమ్మల్ని చేసి, ప్రభుత్వాధినేతల్ని తమ ఏజంట్లుగా చేసి, గూఢచార వలయమై ఆడిస్తున్న నకిలీ కణిక వ్యవస్థగా రూపుదిద్దుకుందనవచ్చు.

వేశ్యాపుత్ర వంశమై… తరతరాలుగా విస్తరించిన నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులకి స్త్రీ అంటే గౌరవం లేకపోవడానికీ, మానవతా విలువలు మృగ్యమై పోవడానికీ మూలాలు ఆ పాపంలో నుండే ఉద్భవించాయి.

ఈనాడు రాజకీయ, బ్యూరాక్రాట్ల, కార్పోరేట్ కోరల్లో నుండి వ్యాపార విషం చిమ్ముతున్న… ఈ వ్యవస్థకి ‘జాలీ దయా లేవు’ అంటే…

ఆ నాడు బసినినులో, దేవదాసిలో… వారిపట్ల, వారి సంతానం పట్లా… సమాజం చూపిన ‘జాలీ, దయా’ మాత్రం ఏమున్నాయి గనుక!?”

అందుకే భగవంతుడు గీతలో అంటాడు… ‘చేసిన మంచి చెడు కర్మల ఫలితాలని అనుభవించక తప్పదు’ అని!

వ్యక్తిగతంగా చేస్తే వ్యక్తిగతంగా…

సామూహికంగా చేస్తే సామూహికంగా…

సమాజమంతా చేస్తే సామాజికంగా…

‘చేసిన కర్మ అనుభవించక తప్పదు’ అనడానికి ఇది మరో నిదర్శనమే!

మనిషి ప్రాణానికీ, మహిళ శరీరానికీ, శీలానికీ విలువ లేక పోవటం… ఆనాటి పురుష సమాజం చూపిన స్వార్ధమూ, స్త్రీ సమాజం చూపిన ఉదాసీనతల ఫలితమే!

ఇలా ఆలోచిస్తూంటే… నకిలీ కణిక అనువంశీయుల మీద ఏహ్యత కలగదు, జాలి కలుగుతుంది.

నిజానికి ‘దుష్టుల్ని ద్వేషించకు, వారిలోని దౌష్ట్యాన్ని ద్వేషించు’ అనే మాట ఎంతో అర్ధవంతమైంది.

అయితే… ‘దౌష్ట్యాన్నే తప్ప దుష్టుల్ని ద్వేషించకపోవటం’ అంటే – ‘దుష్టుల్ని శిక్షించక పోవటం’ అనుకుంటే అది కుహనా భావవాదమే!

పైకి చూడటానికి ఇది పరస్పర ద్వంద్వం అనిపించినా… నిశితంగా పరిశీలిస్తే వడ్లగింజలో బియ్యపు గింజ వంటిదే!

ఎందుకంటే… దుష్టుల్ని శిక్షించక పోతే శిష్టుల్ని శిక్షించినట్లవు తుంది గనకా,

దుష్టుల్ని ద్వేషించక పోవడమంటే దౌష్ట్యాన్ని సహించడం కాదు గనకా!

ఈ కథ అప్పుడెప్పుడో ‘బసివిని’ దురాచారం ఉన్నప్పటి రోజుల్లోది మాత్రమే కాదు. ఇప్పటికీ అప్పుడప్పుడు పల్లెలో జరిగినట్లుగా వార్తల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలకి మాత్రమే సంబంధించిందీ కాదు.

ప్యాకింగ్ మారినా లోపలి సరుకు అదే ఉన్నట్లుగా… ఇప్పటికీ ఎల్లెడలా మన చుట్టూ ఉన్నదే!

ఒక్కసారి ఈ కథని భారతదేశపు ప్రస్తుత పరిస్థితికి అనువర్తిస్తే…

తమ తల్లి, చెల్లి, కుమార్తె, మనవరాలు… వీళ్ళందరూ స్త్రీలే అని మరిచిపోయి, పదేళ్ళ పసిపిల్ల (బోడెక్క) బసివిని కోసం ఎగబడ మగవాళ్ళలా…

ఇది మన దేశం, మనం పుట్టిన గడ్డ అని మరిచి పోయి, దోచుకునేందుకు ఎగబడుతున్న రాజకీయులు, బడా కాంట్రాక్టర్లూ, కార్పోరేట్లూ, కోట్లల్లో, పదుల లక్షల్లో … లంచాలు పుచ్చుకునే ఉన్నతోద్యోగులూ ఉంటే…

తమ ఇంటి ఆడపిల్ల, తమ జాతి ఆడపిల్ల, బలి పశువు అవుతోందన్న స్పృహ లేకుండా, దున్నపోతు కూరాకు కోసం ఎగబడిన మాదిగల్లాగా…

బ్రతికి ఉన్న తమ ఇంటి ఆడపిల్లని తీసుకుని, బదులుగా చచ్చిన దున్నపోతు శరీరాన్ని తమకి ‘కూరాకు’గా ఇచ్చారన్న స్పృహ లేకుండా…

ఓటుకి ఇచ్చే నోట్లకీ, సారా పాకెట్లకీ ఎగబడే సామాన్య ఓటర్లూ!

సంక్షేమ పధకాలతో రెండ్రూపాయలకే బియ్య మిచ్చారంటూ మురిసిపోతూ, ఆలోచించటం మానేసిన మామూలు ఓటర్లూ!

వందలూ వేల రూపాయల్లో లంచాలు పుచ్చుకునే అవకాశాలిస్తున్నారని, బాసులకి భజనలు చేస్తున్న చిన్న ఉద్యోగులూ!

తమ దగ్గర లంచాలు గుంజుకుంటేనేం, తమకీ దోచుకునే అవకాశం ఇస్తున్నందుకు చంకలు గుద్దుకునే చిన్న వ్యాపారులూ!

తమ కులస్తుడో, తమ మతస్థుడో, తమ పార్టీయో అధికారంలోకి వస్తే తమకు దోచుకునే అవకాశం వస్తుందని తమవాణ్ణి వేనకేసుకువచ్చే పార్టీ కార్యకర్తలూ, అభిమానులూ!

అచ్చంగా ప్యాకింగ్ మారిన అదే దుష్టాచారం కాదూ ఇది!
~~~~~~

ఇంతమంచి కథని ప్రచురించినందుకు సాక్షిని అభినందించ వలసిందే!

ఇక్కడ నాకు ఆసక్తికరంగా తోచిన అంశం ఏమిటంటే – ఈ కథా రచయిత నాగప్ప గారి సుందర్రాజు! సెంట్రల్ యూనివర్శిటీ స్టూడెంట్ అట. తను పుట్టి పెరిగిన కులంలోని దురాచారాన్నే కాదు, కందారప్ప పాత్రలో అలాంటి వ్యక్తి జీవితంలోని నిస్సహాయతనీ, విషాదాన్ని కూడా చిత్రించాడు. కుల పక్షపాతం కంటే సత్యావిష్కరణే ఉందా కథలో!

ఆడపిల్ల శరీరం కోసం ఎగబడిన మగాళ్ళనీ, దున్నపోతూ శరీరం కోసం ఎగబడిన మాదిగ వాళ్ళనీ… నిష్పక్షపాతంగా చూపించాడు.

నిష్కర్షగా సమాజంలోని అగ్ర, అణగారిన వర్గాల వారి లోపాలని ఎత్తి చూపాడు.

రచయిత కలంలో… సత్యం పట్ల ఆర్తి ఉంది! సత్యాన్ని ఆవిష్కరించే సత్తా ఉంది!
అయితే ఈయన దురదృష్టవశాత్తూ చిన్న వయస్సులోనే మృతి చెందాడట.

చిత్రంగా… సత్యం పట్ల ఆర్తి, సత్యావిష్కరణ చేయగల సత్తా ఉన్న రచయితలు/రచయిత్రులు, దర్శకులు, కళాకారులు, నటీనటులు… ఎవరైనా సరే… అల్పాయుష్కులై, అర్ధాంతర మరణాలని పొందారు.

ప్రమాదాలు, కాన్సర్ల వంటి అనారోగ్యాలు పైకారణాలై కనబడ్డాయి.

లేదా వ్యసనపరులై అపజయాల పాలయ్యారు.

వ్యక్తిగత బలహీనతలు పైకారణాలై కనబడ్డాయి.

మొత్తంగా మాత్రం దురదృష్టవంతులయ్యారు.

ఎవరైతే సత్యాన్ని దాచేందుకు, దేవుడు తండ్రులని (God Fathers) పొగిడేందుకు, పైవారి పాదాలు పట్టుకుని మకారత్రయాల్ని సమర్పించేందుకు సదా సంసిద్ధంగా ఉంటారో…

ఎవరైతే తాను పైవారికి జరిపించినవన్నీ తమ క్రింది వారి నుండి ఆశిస్తారో…

వాళ్ళు మాత్రం అవార్డుల మీద అవార్డులూ, కీర్తి ప్రతిష్టులూ, సర్వ సంపదలూ, విజయ పరంపరలూ పొందారు.

మొత్తంగా మాత్రం అదృష్టవంతులయ్యారు.

ఎందుకో మీకీ పాటికే అర్ధమై ఉంటుందనుకుంటా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

‘మంచి చెడు కర్మలలో ఎవరేది చేసుకుంటారో!’ అన్నది వాళ్ల మనస్సుని బట్టే ఉంటుంది. అందుకే గీత ‘నీ మనస్సే నీ మితృవు, నీ మనస్సే నీ శతృవు’ అంటుంది.

ఇక ఈ తత్త్వ చింతన [లేదా కొంతమంది భాషలో వేదాంతం] వదిలేసి… తిరిగి ఆర్ధికరంగం దగ్గరికి వస్తే…
ముందే చెప్పినట్లు, ఒక మోసం జరిగితే… మోసగించే వాడి కపటానికి ఎంత బాధ్యతో, మోసగింపబడిన వాడి అజ్ఞానానిదీ అంతే బాధ్యత! అయితే దీనికీ పరిమితులున్నాయి. వ్యక్తి మీద వ్యవస్థ పనిచేస్తున్న నేపధ్యంలో… వ్యక్తిగతంగా మోసపు తీరుతెన్నులు తెలిసినా, మోసగించబడటం, దోపిడికి గురవ్వటం అనివార్యం అవుతోంది.

ఉదాహరణకి నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ నడుస్తోందని ప్రజలకి తెలుసు. కానీ నియంత్రణ ప్రజల చేతుల్లో లేదు. సిమెంట్ సిండికేట్ వంటివి తమ జేబుల్ని కొల్లగొడుతున్నాయని తెలుసు. నిస్సహాయంగా చూడటం తప్ప చేయగలిగింది పెద్దగా లేదు. అలాగన్న మాట.

ఎందుకంటే – ఇక్కడ వ్యక్తుల మీద వ్యవస్థ పనిచేస్తోంది. అది గూఢచర్యంతోనూ, అధికారపు అండదండలతోనూ, వ్యాపార దోపిడితోనూ మిళితమై ఉంది.

సదరు వ్యవస్థనే నేను నకిలీ కణిక వ్యవస్థగా ఉటంకించాను. అది సృష్టించిన పరుగు… జీవితంలో ఓ భాగమై పోయి, దోపిడిని అనివార్యంగా అంగీకరిస్తూ, ‘అవినీతి అంతటా ఉంటుంది, అది సహజం’ అని నిట్టూరుస్తూ లేదా ఆ ప్రభావంలో, ప్రవాహంలో, తామూ పడి ఉరకలేస్తూ… ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలోనూ సామాన్యుల జీవన చిత్రం ఇదే!

అందరూ ఒక్కసారిగా పరుగు ఆపితే తప్ప, ఒక్కరుగా ఎవరు పరుగు ఆప ప్రయత్నించినా అది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవటం వంటిదే!

ఇంత లోతుగా… పరుగు, దోపిడిల మాటున దాగిన గూఢచర్యం… జీవితంలోకి చొచ్చుకొని వచ్చాక… అది గుర్తించే నేర్పు, వివేకం కూడా చాలామందిలో కనుమరుగయ్యాయి. ‘ఇది ఇప్పటి రోజులకి తగిన జీవన విధానం’ అనే ధోరణి ప్రబలింది. ‘ప్రజాదృక్పధాన్ని ఆ విధంగా ప్రభావ పరచటమే’ నకిలీ కణిక వ్యవస్థకి ప్రధాన దన్ను అయిన మీడియా నిర్వహించింది. అందునా సుదీర్ఘ కాలంగా నిర్వహించింది.

ఇక్కడ మీకు కొన్ని చిన్న సంఘటనలు చెబుతాను.

ఓ సారి… అప్పటికి మేం శ్రీశైలంలో ఉండేవాళ్ళం. పనులన్నీ అయ్యాక, రాత్రి భోజనం చేసుకుని, రాత్రి తొమ్మిదిన్నరకి మల్లయ్య స్వామి దర్శనానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఉచిత దర్శనం ఉండేది.

ఓ రోజు… అయ్యవారి ఆలయంలో దర్శనం క్యూలో ఉన్నాం. పెద్దగా భక్తులు లేరు. గుడి ఖాళీగానే ఉంది. పంచాక్షరి జపిస్తూ దర్శనానికి వెళ్తుండగా… హడావుడిగా ఓ గుంపు లోనికొచ్చింది. అంతా గ్రామీణులు… ఓ అయిదారుగురు ఆడవాళ్ళు, పదిమంది మగవాళ్ళు ఉన్నారు. బహుశః ఏ వ్యానో వేసుకుని వచ్చినట్లున్నారు.

క్యూలో మా వెనుక ఉన్న వాళ్ళంతా దర్శనం కోసం ఆతృత పడుతూ తొయ్యసాగారు. వాళ్ళ హైరానాకి, గలభా గలభాగా మాట్లాడుతున్న వాళ్ళ గోలకీ, నేనూ మా వారూ ప్రక్కకు తప్పుకొని వాళ్ళనే ముందుకు వెళ్ళనిచ్చాం. నిజానికి వాళ్ళని చూస్తే అంతగా అలిసిపోయి ఉన్నట్లు కూడా కన్పించలేదు.

సరే, వాళ్ళ వెనకాల మేం ప్రశాంతంగా మల్లయ్య దర్శనం చేసుకుని భ్రమరాంబ అమ్మవారి ఆలయపు మెట్ల దగ్గరికి వెళ్ళే సరికే, వాళ్ళు తల్లి దర్శనం పూర్తి చేసుకుని మాకు ఎదురు వచ్చారు. మేం దర్శనం చేసుకుని, గుళ్ళో కాస్సేపు కూర్చొని బయటికి వచ్చేసరికి… ఆ గుంపులోని వాళ్ళు గుడి ముందర దుప్పట్లు పరుచుకొని పడుకొని ఉన్నారు. ఒకళ్ళిద్దరు అప్పటికే గుర్రు కొడుతుంటే, మిగిలిన వాళ్ళు పడుకొని చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

నాకూ, మా వారికి అది చూసి నవ్వొచ్చింది. ‘అంత ఉరుకులూ పరుగులూ పెట్టి, పక్క వాళ్ళని తోసి మరీ దర్శనం చేసుకుని వచ్చింది ఇందుకా?’ అన్పించింది. ఎంతో దూరం నుండి స్వామి దర్శనానికి వచ్చి ఆలయ ప్రశాంతతని అనుభవించకుండా, దర్శనానుభూతి ఆస్వాదించకుండా ఉరుకులు పెట్టారు.

అమ్మవారి కోవెలలో స్తంభాల మీద శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. కనీసం దాన్ని కన్నెత్తి చూసేంత సమయం కూడా వాళ్ళు గుడిలో ఉండలేదు. ‘అసలెందుకు క్షేత్ర దర్శనానికి వచ్చారా?’ అన్పించింది. తిరిగి తమ ఊరి కెళ్ళాక ‘మీమిన్ని ఊళ్ళూ చూసి వచ్చాం’ అని చెప్పుకోవడానికి తప్ప, మరెందుకూ పనికిరాని క్షేత్ర దర్శనం అది!

మరోసారి… అప్పటికి నేను గుంటూరులో బ్యాటరీ ఫ్యాక్టరీ నడుపుతున్నాను. ఓ రోజు మనస్సు ప్రశాంతంగా లేదని అమరావతి వెళ్ళాను. అక్కడి గుడి, కృష్ణవేణి నది చాలా మనోహరంగా ఉంటాయి. దైవదర్శనం చేసుకుని, విశ్రాంతింగా నది ఒడ్డున గట్టు మీద, కాళ్ళు నీళ్ళల్లోకి వేలాడేసి కూర్చున్నాను. పారుతున్న నదిని చూస్తూ చల్ల గాలికి అలా కూర్చుండి పోయాను.

అంతలో ఓ టూరిస్టు బస్సు వచ్చి కొద్ది దూరంలో ఆగింది. బిలబిలమంటూ ఓ యాభైమంది స్త్రీ పురుషులు దిగారు. వీళ్ళూ గ్రామీణులే! రఁయ్యిన గుడిలోకి అరుపులూ కేకలతో ఉరుకులు పెట్టారు. పదే నిముషాల్లో బయటికొచ్చారు. మగవాళ్ళల్లో కొందరు చుట్టలూ, బీడీలు, సిగరెట్లు వెలిగించి దమ్ములాగుతూ, పచార్లు కొడితే, ఆడవాళ్ళల్లో కొందరు హడావుడిగా నది నీళ్ళల్లో బట్టలుతకడం మొదలు పెట్టారు. నాకు పగలబడేంత నవ్వొచ్చింది. బాగోదని ఊరుకున్నాను.

నిజానికి అమరావతి పెద్ద గుడి. అంతస్థులుగా ఉంటుంది. గుడి ఆవరణలో పొన్న పొగడ చెట్లుంటాయి. చిన్న చిన్న గుడులు మరికొన్ని ఉంటాయి. నింపాదిగా ఓసారి చుట్టి రావాలన్నా గంట పడుతుంది. అలాంటిది పది నిముషాల్లో పరిగెత్తు కొచ్చి వీళ్ళు చేస్తోంది ‘దమ్ముకొట్టటం, బట్టలుతకడమునా?’ అనిపించింది.

పోనీ అది కర్మాసక్తి లేదా కర్తవ్యనిర్వహణ అందామన్నా… ఆ బట్టలుతకడంలో వాళ్ళ ‘పని రంధి’, దమ్ముకొట్టడంలో ‘బావుకునే రంధి’ తప్ప మరేం కనబడలేదు.

మరోసారి… అప్పటికి మేం శ్రీశైలంలో బడి నడుపుతున్నాం. ఓ సెలవు రోజు ఉదయాన్నే పాతాళ గంగ దగ్గరి కెళ్ళి కాస్సేపు జలాశయపు అందాలు ఆస్వాదించి, చేపలు కొనుక్కొని ఇంటికి వెళుతున్నాం! మా పాప, నేనూ, మా వారూ ఏదో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాం.

చలికాలపు ఉదయం! కొండల మీద మబ్బుల గుంపులు దిగాయి. చుట్టూ అందంగా పచ్చగా కొండలూ లోయలూ, వీస్తోన్న పచ్చిగాలి… హృద్యంగా ఉంది వాతావరణం.

అప్పుడే కంభం సత్రం రెండో అంతస్థులో ఓ యాభైమంది దాకా స్త్రీ పురుషులు నింపాదిగా కూర్చొని దిక్కులు చూస్తున్నారు. చల్లగాలినీ, కొండలపై మబ్బుల నీడలినీ, చూస్తూ… మెల్లిగా… రికామీగా… గుడిపాటి వెంకట చలం పరిభాషలో చెప్పాలంటే ‘సోమరి గాలి’ని ఆస్వాదిస్తూ… అలా గడుపుతున్నారు. వీళ్ళూ గ్రామీణులే! టూరిస్టు బస్సులో వచ్చినట్లున్నారు.

వాళ్ళని చూసి ముచ్చటేసింది. ‘ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారో కదా!’ అనుకున్నాం. అప్పుడనిపించింది ‘పరుగులు పెట్టడంలో గ్రామీణులనీ, నగర వాసులనీ తేడా లేదు. అది వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది’ అని! నగర జీవనం మనిషిని పరుగులు పెట్టించగలిగినా, పల్లె జీవనం కొంత స్థిమిత పడనిచ్చినా అది కొంత భాగమే! నియంత్రణ కోసం ప్రయత్నించడం వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుంది కదా!

గమనించి చూడండి. ఒకప్పుడు ‘వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడు’ అంటూ, భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం ప్రారంభమై,… ‘ఈ రోజుల్లో ఇద్దరూ సంపాదిస్తే గానీ అవసరాలు తీరడం లేదు’ అనే వరకూ ప్రయాణించాం.

ఒక్కోసారి… ప్రశాంతంగా కూర్చొని… కాగితం కలం తీసుకొని ‘అసలు సంపాదిస్తోంది ఎంత? ఖర్చు పెడుతోంది ఎంత? పొందుతోంది ఎంత? పోగొట్టుకుంటోంది ఎంత?’ …అని లెక్కలు వేసుకుంటే…?

నగరాల్లో మహా అయితే ఉద్యోగస్తులైన భార్యాభర్తలిద్దరికీ చెరో పాతిక ముఫ్ఫైవేలు వస్తున్నాయనుకొండి. పట్టణాల్లో అది చెరో పది పన్నెండు వేలుంటే ఎక్కువ. ఇంకా చిన్న పట్టణాల్లో అయితే చెరో అయిదారువేలుంటుంది, అంతే!

ముందు నగరాల సంగతే చూద్దాం! భార్యభర్తలిద్దరూ ఉద్యోగులైన చోట… గృహ నిర్వహణ ఇద్దరికీ భారమే! అనివార్యమై కొంతా, అత్యవసరమై మరికొంతా… ఖర్చులు తప్పవు.

తగిన సమయానికి అందుకునేందుకు హడావుడి ప్రయాణాలూ తప్పవు. ప్రయాణ ఖర్చులు, (స్వంత వాహనం ఉన్నా ఇంధనం+రిపేర్+కొన్నాళ్ళకి రీప్లేస్ ఖర్చులు కలుపుకు చూడాల్సిందే) ప్రతీ రోజూ బయటికెళ్ళడంతో…ఇస్త్రీ బట్టలు, పాదరక్షలూ, ఇతర యాక్సెసరీస్ ఇంకా మెయింటెన్స్ ఖర్చులు చాలానే ఉంటాయి.

ఒక్కసారి లెక్కవేసుకు చూస్తే… కర్చీఫుల దగ్గర నుండి సెంటు బుడ్డీల (అదేలెండి బాడీ స్ప్రేలు లేదా పెర్ ప్యూములు) దాకా… కనబడని ఖర్చు కౌంటబుల్ గానే ఉంటుంది. నలుగురిలో తక్కువగా కనిపించకుండా ఉండటానికి, ఖరీదైన లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలు తప్పవు.

ఆపైన పిల్లల బాగోగుల మీద, చదువు సంధ్యల మీదా పెద్దగా శ్రద్ధ పెట్టలేమనిపిస్తుంది. అదో వెలితిగా బాధిస్తుంది. ‘ఇంత కష్టపడుతోంది పిల్లల భవిష్యత్తు కోసమే కదా’ అనిపిస్తుంది. దాంతో ఖరీదైన కార్పోరేట్ విద్యాసంస్థల కోసం వెదుకుతాం. ‘డబ్బెంతైనా ఫర్వాలేదు, వాళ్ళ చేతుల్లో పిల్లల బాధ్యత పెడితే నిశ్చింత!’ అనిపిస్తుంది – ఆ ఖర్చు ఎంత భారమో అనుభవంతో తెలుస్తుంది.

ఆపైన ట్యూషన్ల అవసరం పడుతుంది. పర్యవసానంగా వారమంతా పిల్లల ముఖం మనమూ, మన ముఖం పిల్లలూ చూడలేదనిపిస్తుంది. దాంతో వారానికోసారో, నెలకోసారో వాళ్ళని ఏ ధీమ్ పార్కుకో,గండిపేటకో, శిల్పారామానికో తీసి కెళ్తే గానీ మనశ్శాంతిగా అనిపించదు. అధమపక్షం బయటికి తీసికెళ్ళి రెస్టారెంట్ లో తినిపించాలనన్నా అనిపిస్తుంది.

వీటన్నిటికీ పైసలు సమకూర్చుకొని, ఇంకొన్ని దాచుకోవాలంటే ఒళ్ళిరగ కష్టపడక తప్పదు. దాంతో నిజంగానే ఒళ్ళు, విరిగో అరిగో కూర్చోంటుంది. ‘ఒత్తిళ్ళు ఎక్కువయ్యాయి’ అనే అందమైన పేరు దానికి పెట్టబడుతుంది.

దేవుడిచ్చింది ఒకటే దేహం. అరిగితేనో, విరిగితేనో దెబ్బకి మటాష్! ‘ప్రాణం కంటే ఎక్కువా?’ అనుకొని కార్పోరేట్ ఆసుపత్రిల్లోనో, మామూలు ఆసుపత్రుల్లోనో చికిత్సకి వెళతాం. ఆ టెస్టులనీ, ఈ టెస్టులనీ, మందులనీ, ఆపరేషన్లనీ… ఎంత హైరానా అయినా తప్పదు. రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరవలేరు గదా!? ఏడాదికి మెడికల్ బిల్లు చూసుకుంటే… సంపాదించిన దానిలో దాని వాటా తక్కువేం ఉండదు.

ఇక ఇన్ని పనుల మధ్య ప్రతీరోజూ వంట… పెద్ద తంటానే! రుచి కోసమో, తీరిక లేకనో ‘కర్రీ పాయింట్లనీ, రెడీ టూ ఈట్ ఫుడ్ పాకెట్లనీ, సాంబారు రసం పొడులనీ, రెడీమెడ్ మసాలాలనీ’, ఆశ్రయించక తప్పదు. అందులో వాడే ఇన్ గ్రేడియంట్లలో (రంగు రుచి వాసనల కోసం వాడే రసాయనాలతో) అలర్జీల దగ్గరి నుండి అంతు దొరకని, అర్ధం కాని అనారోగ్యాలూ, ఈతిబాధలూ వస్తాయి. ఏది ఎందుకు వచ్చిందో కూడా గుర్తించుకునే తీరిక ఉండదు.

ఒకేరోజు తిన్న నూడిల్స్ నుండి వచ్చిందో, పిజ్జా బర్గర్ నుండి వచ్చిందో, చాక్లెట్లూ బిస్కట్లకే వచ్చిందో, దుమ్ము గాలికీ, ట్రాఫిక్ లో ఇంధన పొగకి వచ్చిందో తెలియని జలుబూ తుమ్ములూ మాత్రం, పర్మెనెంట్ కేరాఫ్ అడ్రెస్ గా మన ఇంట్లోనో ఒంట్లోనో ఉండి పోతాయి.

యధాప్రకారం మెడికల్ బిల్లు మన జేబుని గీకుతూనే ఉంటుంది.

ఇక కరెంటు టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ సిలెండరూ, సూపర్ మార్కెట్ నుండి సరుకులూ తెచ్చుకునేందుకు వేరెవరి సాయమో అవసరమౌతుంది. ఆ సేవల రంగంలోని సంస్థలని మామూలుగా పోషించాల్సి రావచ్చు. పండుగ పబ్బాలకి పులిహోర పాయసాలు కూడా స్వగృహ ఫుడ్ నుండి తెచ్చుకున్నట్లుగా, పెళ్ళి పేరంటాలకి ఈవెంట్ మేనేజర్స్ కీ, బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలకీ మరికొంత సమయం వెచ్చించక తప్పదు.

వీటన్నిటిలో ‘అవసరమైన ఖర్చెంత? అనవసరమైన ఖర్చెంత? అనివార్యమైన ఖర్చెంత?’… లెక్క వేసుకుంటే?

నిజానికి… గృహ నిర్వహణ అవమానకరమైన పని కాదు. తమ దోపిడికి ముందస్తు బ్రెయిన్ వాష్ గా నకిలీ కణిక వ్యవస్థ ప్రచారించిన అంశాల్లో ఇది ఒకటి. భార్యాభర్తల్లో ఎవరికి సహనం ఎక్కువగా ఉంటే వారు, ఎవరికి వీలైతే వారు – గృహ నిర్వహణని ఒక బాధ్యతగా తీసుకుంటే పైసమస్యల్లో చాలా వాటి సంఖ్య తగ్గిపోతుంది.

ఎందుకంటే – డబ్బు కంటే, ఆస్తుల సంపాదన కంటే విలువైనవి… ఆరోగ్యమూ, కుటుంబ జీవనమూ, భావితరాల పెంపకమూ! ముందటి తరం పట్ల కృతజ్ఞతా, వారికీయ వలసిన గౌరవం, చేయవలసిన సేవ… అంతకంటే విలువైనవి. ఒకసారి వాళ్ళు తమ కాల్షీటు పూర్తి చేసుకొని, భగవంతుడి పిలుపు అందుకొని వెళ్ళిపోయాక… ‘వాళ్ళు బ్రతికి ఉన్నరోజుల్లో మనం ఇంతకంటే ఇంకా బాగా ప్రవర్తించి ఉండాల్సింది!’ అని ఎంతగా అనుకున్నా, గడిచిన కాలం తిరిగి రాదు కదా? పోయిన ఆప్తులూ మనం ఎంత ఆర్తిగా తలుచుకున్నా తిరిగి రారు!

అలాంటి చోట… కుటుంబంలో ఇద్దరూ సంపాదన కోసం పరుగుమాని, ఒక్కరు కుటుంబ శ్రేయస్సు కోసం సమయం కేటాయిస్తే… చాకలి/డ్రైక్లీనర్ బిల్లు దగ్గరి నుండి మెడికల్ బిల్లుల దాకా… ఫ్యాన్సీ షాపు నుండి పచారీ కొట్టు దాకా… చాలా మిగులే వస్తుంది. పిల్లల గురించి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్న తృప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన ఆనందం మిగులుతుంది.

ఎంత మిగులు వచ్చినా జీతం అంత మిగులు రాకపోవచ్చు. కాని కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోక తప్పదు అన్న సూత్రమే ఇక్కడా వర్తిస్తుంది.

సహజంగా స్త్రీకి ప్రకృతి పరంగా పిల్లలతో మమేకం ఎక్కువా, సహనం ఎక్కువా గనుక, గృహ నిర్వహణ తల్లి బాధ్యతగా, ఉపాధి నిర్వహణ తండ్రి బాధ్యతగా పెద్దలు అమర్చి ఉంటారు. అందులో పురుషాధిక్యత అహంకారానికి ఓ రూపమైతే, ఫెమినిజం మరో రూపం!

ఏమైనా… ఆర్ధికంగా ఇంటిని నడపటం ఎంత ముఖ్యమైనదో, కుటుంబ సభ్యుల ఆలనా పాలనా కూడా అంతే ముఖ్యమైనది. కాబట్టి గృహ నిర్వహణ గౌరవనీయమైనదే, అది స్త్రీ నిర్వహించినా పురుషుడు నిర్వహించినా! కాకపోతే పురుషుడు నిర్వహిస్తే వింతగా చూడటం మన సమాజంలో సుదీర్ఘకాలంగా ఉంది. అవగాహనా రాహిత్యమే అది! గృహ నిర్వహణ అవమాన కరమైనది కాదు, మనిషి జీవితానికి అత్యంత విలువైనది. గృహమే కదా మరి స్వర్గ సీమ! ఎంత బాగున్నా, ఎంత ఖరీదైనదైనా, ఇంటి కంటే ఏదీ పదిలం కాదు.

కాబట్టే మన పెద్దలు… మన పరుగుకి, సంపద సృష్టికి కొన్ని హద్దులు ఏర్పరిచారు.

ఈ నేపధ్యంలో నేను మీకు కొన్ని విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

గత టపాలలో వివరించినట్లు, షేర్ల సహజ క్రయ విక్రయాల పరిమాణం చాలా తక్కువైపోయి చాలా రోజులే అయ్యింది. అది రోజు రోజుకీ మరింత తగ్గిపోతోంది.

కాబట్టే ఇన్ని మోసాలూ, అసత్య ప్రచారాలు! అది ఒక్క షేర్ మార్కెట్ విషయంలోనే కాదు, అన్ని రంగాల్లో అదే దోపిడి, అదే మోసం!

నిజానికి …ఒక మోసం జరిగిందంటే – మోసగించే వాడి తెలివి, కుత్సితం, కపటాల బాధ్యత ఎంతో, మోసగింపబడే వాడి అమాయకత్వం, అజ్ఞానం, అనవగాహన (కొన్ని సందర్భాల్లో ఆశ) ల బాధ్యత కూడా అంతే!

కాబట్టి – ఆలోచించవలసిన అవసరం, మోసాలని అర్ధం చేసుకోవలసిన అవసరం, సామాన్యులకి తప్పదు. లేకపోతే కరిమింగిన వెలగ పండు లాగా సంపాదించుకున్నది కరిగిపోతుంది. నిరంతరం శ్రమ దోపిడి, మేధో దోపిడి, సమస్త దోపిడికి గురౌతూ, మోసపోవటం కూడా జీవితంలో భాగమై, మొత్తంగా బ్రతుకు భారమౌతుంది.

పరిస్థితులు మరింత విషమించి తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు… ఓ వైపు మోసగింపబడుతూ… మరో వైపు అవకాశం వస్తే తామూ మోసాలకు పాల్పడుతూ… వెరసి వైతరణిని భూలోకానికి, నిజ జీవితంలోనికి తెచ్చుకోవడ మౌతోంది. ఇదే గత టపాల్లో ‘చెంపదెబ్బలు’ అనే టపాలో ఉదాహరణలో చెప్పాను.
22. భారతీయ ఇతిహాసాల మీద నకిలీ కణికుడి కుట్ర – 2[చెంప దెబ్బలు] [Dec.11, 2008]
http://ammaodi.blogspot.com/2008/12/2_11.html

వాళ్ళ వ్యాపారం కోసం మీడియా, ప్రభుత్వాలు, కార్పోరేట్ కంపెనీలు ప్రజల జీవితాల్లో పరుగుని సృష్టిస్తే… అందరూ ఆ వేగంలో పడి కొట్టుకు పోతే… పరిస్థితి ఇక్కడికే చేరుతుంది. అదే ఇప్పుడు నిరూపించబడింది.

ఒక ఉదాహరణ చెబుతాను.

మనం ఓ ఉద్యాన వనాన్ని లేదా ధీమ్ పార్కుని చూడటానికి వెళ్ళామను కొండి. ప్రవేశ రుసుం తీసుకుని లోపల ప్రవేశించాం. పార్కు మూసేసే లోగా అన్నీ చూడాలని కుతుహల పడతాం. ఆ ఉబలాటం సహజమే! అది కాస్తా ఆతృత లోకి, ఆపైన పరుగులోకి పరిణమిస్తేనే కష్టం.

ఒకో అంశాన్ని పరిశీలిస్తూ, ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలనుకుంటాం. ఆనందాన్ని ప్రశాంతంగా ఉంటేనే పొందగలం. ప్రశాంతంగా చూడాలని, ఆనందించాలని మెల్లిగా తిరిగితే కొన్నిటినే చూడగలం, ఆనందించగలం. అలాక్కాదని పరుగులు పెడితే ఆయాసం మిగులుతుంది. మిగిలిన వేవీ చూడలేం. అంతేగాక చూసిన ఆనందం కూడా మిగలదు.

ఇదే పోలికని జీవితానికి అనువర్తిస్తే… పార్కు లాంటిదే జీవితం. ఇంకా టిక్కెట్ తీసుకుని పార్కులో ప్రవేశిస్తే… ఫలానా టైం లోపల అన్నీ చూచి రావాలని, రావచ్చని ఓ అంచనా ఉంటుంది. జన్మ ధరించి ఈ లోకంలోకి వచ్చాక ఎవరికీ తిరిగి తను ఎగ్జిట్ టైం ఏమిటో తెలియదు. కాబట్టి బ్రతికిన నాలుగు నాళ్ళలోనే మరికొన్ని ఆనందాలని అనుభవించాలనుకుంటాం. అది తప్పు కాదు కూడా! అయితే, అలాగని పరుగులెత్తితే వచ్చేది ఆనందం కాదు, ఆయాసం మాత్రమే!

కాబట్టే మన పెద్దలు ‘ఆలస్యం అమృతః విషం’ అనీ చెప్పారు, ‘నిదానమే ప్రధానమనీ’ చెప్పారు. ఏది ఎప్పుడు ఎంత వరకూ పాటించాలో తెలుసుకోగలగటమే విజ్ఞత. ఖచ్చితంగా చెప్పాలంటే జీవన కళ! (Art of Living అన్నమాట!)

దీన్నే స్పష్టంగా భగవద్గీత…

శ్లోకం:
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా

భావం:
మితాహార నిద్రా విహారాలు, మితనియత కర్మలూ, మితమైన మెలకువా కలిగి అభ్యాసం చేసే వాడికే – సర్వదుఃఖ నాశకమైన యీ యోగం సిద్దిస్తుంది.

నిజానికి భగవద్గీత కంటే గొప్ప పదార్ధ వాద గ్రంధం నాకు మరొకటి కనిపించదు.

మనం తినేందుకు అరటి పండ్లు ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? కుళ్ళి, నీరు కారుతున్నవి ఎంచుకుంటామా? అవి తింటే రోగాలొస్తాయనీ, రుచిగా ఉండవనీ మనకి తెలుసు! కాబట్టి – తాజాగా ఉన్నవాటినీ, చక్కగా పండి నిగారింపుతో ఉన్నవాటినీ ఎంచుకుంటాం.

ఇప్పుడు తింటే మరికాస్సేపటికి అరిగిపోయే అరటిపండు విషయంలోనే అంత జాగ్రత్త తీసుకునేటప్పుడు అధమ పక్షం అరవై ఏళ్ళు, దీర్ఘాయువు అంటే నిండు నూరేళ్ళు ఉండే జీవితం విషయంలో, జీవానానందం, ఆస్వాదనల విషయంలో మరింకా ఎంత జాగ్రత్త, శ్రద్ధ తీసుకోవాలి?

అదే మనకి భగవద్గీత చెబుతుంది.

ఆనందంగా జీవించడమే జీవితానికి సార్ధకత, జీవిత లక్ష్యమూ అయినప్పుడూ, ఆ ఆనందానుభవం, ప్రత్యక్షంగా అల్పకాల ఆనందాన్నిచ్చి, పరోక్షంగా దీర్ఘకాల దుఃఖాన్నివ్వ కూడదు. అప్పుడది నష్టపు బేరమే!

ఉదాహరణకి ప్రొగతాగటం! అప్పటికి ఆనందాన్నిచ్చినా ఆనక క్యాన్సర్ నిచ్చినట్లు!

కాబట్టి జీవితంలో ఉత్తమమైన ఆనందాన్ని అందుకొమ్మంటుంది భగవద్గీత. అరగంటలో అరిగిపోయే అరటిపండు విషయంలోనే ఉత్తమమైన పండుని ఎంచుకునేటప్పుడు… ఇదీ అంతే గదా! కాబట్టి … తక్కువ ఆనందం కోసం ఎక్కువ ఆనందాన్ని పోగొట్టుకోవద్దంటుంది. అలా చూస్తే ‘గీత’ కంటే పదార్ధ వాదాన్ని ప్రతిపాదించగల గ్రంధం ఇంకేది?

ఇక్కడ మీకు ఓ చిన్న కథ చెబుతాను.

ఇది శ్రీ రామనుజాచార్యుల వారి పేరిట ప్రసిద్ధిమైనది. నిజ సంఘటనగా పేర్కొనబడినది.

ప్రతీరోజూ కావేరినదిలో స్నానమాచరించి, రంగడి ఆలయానికి వెళ్ళే రామానుజాచార్యుల వారికి ఓ దృశ్యం కళ్ళబడేది.

రంగదాసు ఆ వూరిలో ప్రముఖ వ్యాపారి కుమారుడు. ధనికుడు. అతడు తన ప్రేయసి రంగనాయకి కి గొడుగు పట్టి, ఆమె వైపు ముఖం పెట్టి వెనకకు నడుస్తూ ప్రతీ రోజూ ఆలయానికి వస్తుంటాడు.

జనం అతణ్ణి చూసి నవ్వుతున్నా అతడవేవీ పట్టించుకోడు. ఓ రోజు రామానుజాచార్యుడు రంగదాసుని “నాయనా! ప్రతీ రోజూ ఈ యువతికి గొడుగు పట్టుకుని వస్తావెందుకు?” అని అడిగాడు.

రంగదాసు స్థిరంగా “స్వామీ! నాకు ఆమె సౌందర్యమంటే ఇష్టం. ఆమె ముఖ కమలం, అందులో కలువ రేకుల వంటి ఆమె కన్నులంటే మరీ మరీ ఇష్టం! ఎండకవి కందిపోయి, వడలి పోకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుంటాను” అన్నాడు.

“మరి వెనక్కి నడుస్తూ వస్తావేం?” ప్రశ్నించారు రామానుజాచార్యులు వారు.

“ఒక్కక్షణం కూడా ఆ సౌందర్యాన్ని చూడకుండా ఉండటం నాకిష్టం లేదు” ఠకీమని జవాబు చెప్పాడు రంగదాసు.

“జనం నిన్ను చూచి నవ్వుతున్నారు కదా?” నిశితంగా పరిశీలిస్తూ అన్నారు రామానుజులు.

“ఎవరేమను కుంటే నాకేమిటి? నా ఆనందమే నాకు ముఖ్యం” వెఱపులేని సమాధానం రంగదాసుది.

ఆ యువకుడిలో సమాజం పట్ల పట్టింపు లేనితనం, ఎవరేమనుకుంటారోననే వెఱపులేని తనం రామానుజుల కర్ధమయ్యింది.

రంగ దాసుతో “నాయనా! రంగనాయకి సౌందర్యం, నిశ్చయంగా గొప్పదే! అయితే ఆ చిన్నదానికి… కోపమో, అసూయో కలిగిందనుకో! అప్పుడా వదనం అంత అందంగా ఉండదు. ఆమెకి ఏ వ్యాధో వచ్చిందనుకో! ఆ కళ్ళు కాంతి కోల్పోతాయి. వార్ధక్యం మీద పడితే, ముఖం ముడతలు పడుతుంది. ఇంత ఆశాశ్వతమైన అందానికే ఇంతగా దాసుడవయ్యావు. శాశ్వత సౌందర్యాన్ని చూపిస్తాను, ఆరాధిస్తావా?” అన్నాడు.

“నిజంగా మీరు అంతటి సౌందర్యాన్ని చూపించాలే గానీ నిశ్చయంగా దాసుణ్ణవుతాను” అన్నాడు రంగదాసు.

అతణ్ణి వెంట బెట్టుకుని ఆలయంలోకి వెళ్ళారు రామానుజాచార్యులు. కమండలంలోని నీటితో కళ్ళు కడుక్కుని రంగనాధుడి విగ్రహాన్ని దర్శించమన్నాడు.

ఏ తీరుగా రామానుజుల వారు, రంగదాసుడికి విశ్వసౌందర్యాన్ని, విరాట్స్వరూపాన్ని చూపించగలిగారో తెలియదు గానీ, రంగదాసు ఆయన శిష్యుడిగా మారిపోయాడు. కాలక్రమంలో అతడే పద్మపాదుడిగా పేరు గాంచాడు.

ఇదీ కథ!

ఇందులో చెప్పినట్లుగా మన ఈ భౌతిక శరీరంతో ముడిపడిన ఆనందం తృణప్రాయం కాదు గానీ, శాశ్వతం కూడా కాదు. ఒక పురుషుడు స్త్రీని, లేదా ఒక స్త్రీ పురుషుణ్ణి, వారి అందమైన శరీరాన్ని చూచి ప్రేమిస్తే… ఆ ప్రేమ, ఆనందం కొన్ని రోజులకి తరిగి పోగలదు. అదే అందమైన మనస్సుని చూసి ప్రేమిస్తే… ఆ ప్రేమ, ఆనందం రోజులు గడిచే కొద్దీ పెరుగుతుంది.

శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండే ఆనందం కన్నా, భౌతిక వస్తువులతో ముడిపడి ఉండే ఆనందం కన్నా మానసిక ఆనందం గొప్పది. ఆ దారిలో వెళ్తే ఆత్మానందాన్ని ఏదో నాటికి అందుకుంటాం. అది అత్యంత ఉత్తమమైనది. అలాంటి పరమానందాన్ని పొందాలంటే స్థిర బుద్దిని సాధించాలి. దాన్ని సాధించమనే , అందుకొమ్మనే, చెబుతుంది గీత! కాబట్టే గీత కంటే పదార్ధ వాదాన్ని చెప్పే గ్రంధం మరొకటి లేదనిపిస్తుంది.

ఎందుకంటే – గీత, భౌతిక వాదం కంటే భావవాదం గొప్పది గనుక మట్టి గొట్టుకు పొమ్మనదు. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ఇవ్వాలంటుంది. ధర్మబద్దంగా ద్రవ్య సంపాదన చెయ్యమంటుంది. అయితే ద్రవ్య సంపాదనే జీవితం అనుకోవద్దంటుంది.
మరోమాటలో చెప్పాలంటే… ధర్మకార్యాలు చెయ్యటానికి, జీవించటానికి డబ్బు (ద్రవ్యం) కావాలంటుంది. జీవితమే ‘డబ్బు’ అనదు.

ఎందుకంటే – సంపాదించిన ఆస్తిపాస్థులు ఇక్కడే మిగిలిపోతాయి. పుట్టుకతో తెచ్చుకున్న శరీరం, జీవించినంత కాలం మనతో పాటే పెరిగి మనకి ఆశ్రయం ఇచ్చిన శరీరం, ఇక్కడే మిగిలి పోతుంది. ‘మనం అనుభవించిన వాటి ముద్రలూ, భావనల వాసనలూ మాత్రం మనతోనే వస్తాయి’ అంటుంది గీత!

శ్లోకం:
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్ర్కా మతీశ్వరః
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్II

భావం:
గాలి సువాసనను తీసికొని పోయేటట్లుగా – దేహాధికారియైన జీవుడు క్రొత్త శరీరం పొందేటప్పుడు – వెనుకటి శరీరం నుంచి భావ పరంపరను తీసుకు పోతున్నాడు.

కాబట్టి కూడా, మంచి భావనలనీ, భావ పరంపరగా విలసిల్లే సంపదనీ సంపాదించు కొమ్మంటుంది. ‘చేసిన మంచి చెడని పదార్ధం’ అంటుంది. ‘ఆస్తులూ అప్పులూ వెంట రావు గానీ… మంచి చెడుగులు, పాపపుణ్యాలు వెంట వస్తా’యంటుంది. ‘కర్మఫలం మన వెంటే ఉంటుంది’ అంటుంది.

‘జన్మ సిద్ధాంతం నమ్మాలా, వద్దా?’ అని నేనిక్కడ చర్చించటం లేదు. నమ్మితే వచ్చే నష్టం లేదనీ, మీదు మిక్కిలి ఇప్పటి ఇహలోక జీవితంలో సైతం శాంతి సౌఖ్యాలు అనుభవింప వచ్చనీ నా వ్యక్తిగత నమ్మకం! నమ్మకాల విషయంలో వాదనలు అనవసరం అన్నది నా అనుభవం!

ఈ నేపధ్యంలో… కొందరు పుట్టుకతో కొన్ని లోపాలని తెచ్చుకుంటారు. అవీ పూర్వజన్మ వాసనేనేమో అనుకుంటాను. కొందరు పుట్టుకతోనే కొన్ని నైపుణ్యాలు, కళలూ తెచ్చుకుంటారు. అదీ పూర్వజన్మ పుణ్యమే అనుకుంటాను.

క్యారమ్స్ ఆట ఆడేటప్పుడు బోర్టుమీద కొన్ని ‘కాయిన్స్’ పెట్టి ఆడతాం. ఒకో ఆటలో పోగొట్టుకునే అవకాశం ఎంతో, గెలుచుకునే అవకాశమూ అంతే ఉంటుంది. జన్మలోనూ అంతేనేమో! ప్రతీ జన్మలోనూ పాపం, చెడు కర్మలు చేసుకునే అవకాశం ఎంతో, పుణ్యం, మంచి కర్మలూ చేసుకునే అవకాశం కూడా అంతే!

ఎవరేది చేసుకుంటారో అన్నది వాళ్ల మనస్సుని బట్టే ఉంటుంది. అందుకే గీత ‘నీ మనస్సే నీ మితృవు, నీ మనస్సే నీ శతృవు’ అంటుంది.

ఇక ఈ తత్త్వ చింతన [లేదా కొంతమంది భాషలో వేదాంతం] వదిలేసి… తిరిగి ఆర్ధికరంగం దగ్గరికి వస్తే…

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఈ మధ్య కాలంలో నేను చదివిన కథలన్నిటిలో నాకు బాగా నచ్చిన కథ, కె.ఎ.ముని సురేష్ పిళ్ళె వ్రాసిన ‘ఈగ’. అక్టోబరు 31, 2010 సాక్షి ఆదివారపు సంచిక ‘ఫన్ డే’ లో ప్రచురితమైన కథ! అది రచయిత అసలు పేరో కాదో తెలియదు గానీ, ‘ఈగ’ అనే కథ పేరు మాత్రం దానికి ఎంతో తగి ఉన్న పేరు.

ఆ కథని ఓ సారి పరిశీలించాలంటే ఇక్కడ నొక్కండి.

‘ఈగ’ కథలో…

నికార్సయిన నిగ్గరు హేరిస్!

పసి వయస్సులో ఉండగా… అతడి మనస్సులో చెరగని ముద్ర చేసిన ఈగ బ్రతుకు, అతడి బ్రతుకు లాంటిదే!

తెల్లతోలున్న యజమాని జిమ్.

తన కొడుకు జార్జి గుర్రం ఆట ఆడుకునేందుకు కొన్న పసి బానిస హేరిస్.

జిమ్ కొడుకు జార్జి ‘అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న’ లాంటి వాడు.

బానిసలతో సహా తన సంపదని ప్రదర్శించుకునే జిమ్ కి కొడుకు, బానిసలని ఫ్యాక్టరీ పనికి పంపి భత్యం వసూలు చేసుకునే జార్జి!
హేరిస్ వేలంపాట నిర్వహించేవాడు తండ్రి.

వాడి పనితనాన్ని నిధిని దాచుకున్నట్లు దాచుకునేవాడు కొడుకు.

ఏ దేశంలోనైనా, బానిసలని… బానిస సంకెళ్ళల్లో వాళ్ళంతట వాళ్ళే ఉమ్మిలో ఈగల్లా పడుండేటందుకు, తరతరాలుగా, రకరకాలుగా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు.

“ప్రభువులని సేవించేందుకే బానిస జన్మలున్నది. అదే వారి జీవిత పరమార్ధం” – ఇది నయాన చేసే బ్రెయిన్ వాష్!

“అదిగో తప్పించుకో చూసిన వాడి గతేమయ్యిందో చూడు! బ్రతికుండగానే తోలు వలవబడింది. స్వేచ్ఛ కోరటమే మహాపరాధం. జాగ్రత్త సుమా” – ఇది భయాన చేసే బ్రెయిన్ వాష్!

పదే పదే… అదే ప్రచారంతో… బుర్రలోకి ఇంకి, గడ్డకట్టి, శాశ్వతంగా నిలిచిపోయే, బ్రెయిన్ వాష్!

ఆనాడే కాదు, ఈనాటికీ ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేయబడిన హేరిస్ వంటి నిగ్గర్లు ఎల్లెడలా ఉన్నారు.
ఉమ్మిలో పడి,

అందులో అతుక్కు పోయి,

తప్పించుకునేందుకు గిలగిల లాడే కొద్దీ మరింతగా చిక్కుకు పోయి…

చచ్చే వరకూ…

చచ్చాక కూడా శవం ఎండి పోయే వరకూ… ఆ ఉమ్మిలోనే ఉండిపోయిన ‘ఈగ’ ల్లాంటి బానిసలు, ఇప్పటికీ మన చుట్టూ ఎందరో ఉన్నారు.

నాకు ఈ కథ అంతగా నచ్చడానికి, ఈగల్లాంటి బానిసలని స్వానుభవ పూర్వకంగా చూడటమూ, ఎదుర్కోవటమూ ఒక కారణం కావచ్చు.

స్వేచ్ఛ కోసం ప్రయత్నించని బానిసలు,

పోరాడే మాలాంటి వాళ్ళకి సుద్దులు చెప్పవచ్చిన బానిసలు,

జిమ్ గట్రా ప్రభువుల వంటి తమ ‘బాస్’ల తరుపున మమ్మల్ని వేధించిన బానిసలు,

మా పోరాటానికి అడ్డం వచ్చిన బానిసలు,

‘బాస్’లు తమకి పోసిన మద్యపు చుక్కలకీ, మాంసపు ముక్కలకీ, డబ్బులు లెక్కలకీ మురిసి పోయి, తమ చుట్టు ఉన్న
ఉమ్మిలాంటి బానిసత్వాన్నే స్వర్గంగా భావించిన బానిసలు,

“అంత గొప్పోళ్ళతో, డబ్బూ అధికారం ఉన్నవాళ్ళతో మీకెందుకు? తలుచుకుంటే వాళ్ళేమైనా చేయగలరు. మీ బ్రతుకు మీరు బ్రతకండి” అని మాకు హిత బోధలు చేసిన బానిసలు,

“డబ్బూ, కెరీర్ ఇస్తామంటే పడి ఉండక, ఏదో పెద్ద so & so ల్లాగా పోరాడతామంటారు. రాజీ పడటానికి ఏం తీపరమా? తలొంచుకు తప్పుకు పోతే పోయేదానికి ఎందుకు బ్రతుకు నాశనం చేసుకుంటారు?” అని మమ్మల్ని ఈసడించిన బానిసలు.

“బ్రతక చేత గాని వాళ్ళు” అని మమ్మల్ని హేళన చేసిన బానిసలు,

“గడ్డి వామి దగ్గర కుక్కలాగా ఎందుకొచ్చిన పనికిమాలిన పనులు? అవినీతితోనే అభివృద్ధి సాధ్యం అని అర్ధం చేసుకోలేని మూర్ఖులు” అని మా గురించి జాలిపడిన బానిసలు!

ఇలాంటి హేరిస్ లనీ, బానిసలనీ సూర్యాపేటలో మా ఇంటి ఓనరు భాగ్యలక్ష్మి దగ్గరి నుండి, శ్రీశైలంలో మాజీ డిఈవో కృష్ణయ్యల దాకా… వందల మందిని చూశాము.

“ఔను! మేము కాంగ్రెస్ అధిష్టానపు ఇంటి కాపలా కుక్కలం” అనే కాంగ్రెస్ కునాయకుల వంటి బానిసలని, అధిష్టానపు కాళ్ళు పట్టుకోవటానికి క్యూలు కట్టే కెరీర్ దాహపు కరుడగట్టిన బానిసలనీ… మీరూ చూస్తూనే ఉన్నారు. ఒక్క మా విషయంలోనే కాదు, బానిస సంకెళ్ళు తెంపజూసే ఎవరికైనా… అడ్డం వచ్చే బానిసలు వీళ్ళంతా!

‘ఈగ’ కథలో హేరిస్ సహబానిస జేమ్స్

>>>“జేమ్స్ కాండ్రించి ఉమ్మిన ఉమ్ము హేరిస్ ముఖం మీద పడినట్లుగా తుప్ మని చిత్రమైన చప్పుడు వచ్చింది. తుడుచుకున్నాడో… తడుముకుని అలవాటుగా ఉపేక్షించాడో…”అంటాడు రచయిత హేరిస్ గురించి.

అంతగా ముఖాన పడ్డ ఉమ్మిని కూడా ఉపేక్షించటం అలవాటయి పోయిన బానిస హేరిస్.

ఈనాటి వ్యవస్థలో, మీడియా, రాజకీయులు, కార్పోరేట్ లు, బ్యూరాక్రాట్ లూ, … జిమ్ ప్రభువుకీ, జార్జి ప్రభువుకీ ప్రతీకలైతే…

వాళ్ళు చేసిన రకరకాలు ప్రచారాల వంటి,

ప్రచారించిన రకరకాల సిద్ధాంతాల వంటి

వాళ్ళు చూపిన కెరీర్, ఇతర ప్రయోజనాల వంటి

ఉమ్మిలో పడి… బయటపడేందుకు, కనీసం కథలోని ఈగ లాగా కూడా గిలగిల్లాడని బానిసలు… మన సమాజంలో, మన దేశంలో, దేశాల కతీతంగా ప్రపంచమంతటా చాలామందే ఉన్నారు.

అలాంటి ఎంతమంది బానిసల్ని ‘ఈగ’ కథారచయిత, ముని సురేష్ పిళ్ళె, పాత్రికేయ రంగంలో చూశాడో గానీ, ‘మరణించిన పాత్రికేయుడు SM గౌస్ కు, ఇంకా మరణించని మరికొందరు మిత్రులకు’ ‘ఈగ’ కథని అంకితమిచ్చాడు.

ఈ కథ చివరి పేరాలో రచయిత వర్ణించినట్లుగా…

>>>కత్తి చేసిన దారిలోంచి ప్రభువు రక్తం నెమ్మదిగా జారి, వెచ్చగా ఉబికి వస్తున్న నిగ్గరు రక్తంతో కలిసిపోయింది. ప్రళయం రాలేదు. భూకంపం పుట్టలేదు. సృష్టి తిరగ బడలేదు. రెండూ ఒక్కటే అన్నట్లుగా కలిసిపోయాయి.

నిజమే!

బానిస సంకెళ్ళు తెంచుకుంటే… ప్రళయం రాదు,

భూకంపం రాదు.

స్వేచ్ఛ వస్తుంది.

స్వాతంత్రం వస్తుంది.

దోపిడి లేని సమాజం వస్తుంది.

ఆ ఆశని వెలిగిస్తూ… రచయిత, కథని,

“దోమల కొట్టాల్లో ఒక్కసారిగా పెద్ద కలకలం రేగింది
కొవ్వొత్తుల దీపాలు వెలిగాయి” అని ముగించాడు.

అవును!

దీపాలు వెలగాలి.

చేతుల్లోనే కాదు,

చేతల్లో కూడా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu