ఈ నేపధ్యంలో నేను మీకు కొన్ని విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను.

నెయ్యి రంగు రుచీ వాసనా తెలియని వారికి, ఎన్నిరకాలుగా చెప్పినా నెయ్యిని స్ఫురింప చెయ్యలేం. కాబట్టే మన పెద్దలు ‘నేతి నేతి’ ని ‘బ్రహ్మానందాన్ని తెలుసుకోవటం’ అనే నేపధ్యంలో వాడతారు.

ఏ విషయాన్నైనా… కనీసం దాని ప్రాధమిక రూపమైనా తెలియనిది, దానిపై ఏ ఊహానీ చెయ్యలేం! సైన్స్ డెవలప్ మెంట్ ఎలా ఉంటుందో తెలియని రోజుల్లో, రైట్ బ్రదర్స్ విమానాలని ప్రజలు నమ్మలేనట్లు, రోబోలనీ నమ్మలేనట్లు!

కాబట్టే… కళలూ సాహిత్యాన్ని బట్టి, ఆయా కాలల్లో సమాజపు జీవన స్థాయిని చరిత్ర కారులు లెక్కగడతారు.

మత గ్రంధాలు, మత సాహిత్యం, మతపరమైన కళలూ, ఆచార వ్యవహారాలు కూడా ఆ కోవలోకే వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే… భారతీయుల హిందూ పురాణాలు, వేదాలు ఆనాటి వారి మానసిక స్థాయిని చెబుతాయి. పురాణ గాథలలోని వర్ణనలు ఆనాటి సామాజిక స్థితులని, సౌభాగ్య వైభవాన్ని వివరిస్తాయి,

ఆ సంపదని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాయి. రత్నఖచిత ఆభరణాలు, పట్టు పీతాంబరాలు దైవ విగ్రహాల ఆవిష్కరణలోనే కాదు, దేవతామూర్తుల వర్ణనలలోనూ ఉన్నాయి. ఆలయాలలో శిల్ప సంపదలోని ఆభరణాల శైలి, ఆ వైభవాన్ని వేనోళ్ళ చాటుతుంది.
అలంకార ప్రియులుగా, ఆభరణాలతో నిండిన దేవతా రూపాలు హిందువుల పూజలందుకుంటాయి.

అదే గ్రీకు వారి పురుణాలు ఇలియాడ్ గట్రాలలో చూస్తే… వీనస్, హెర్కులస్, జూపిటర్, ధేసిస్ వంటి, వారి దేవతల ఆభరణాలు, దుస్తులూ, హిందూ దేవతల ఆభరణాలూ దుస్తులంత వైభవంగా ఉండవు. [ఇక్కడ నాకు గ్రీకులని గానీ మరే ఇతర దేశీయులని గానీ చిన్నబుచ్చే ఉద్దేశం లేదు.] ఎవరి శైలి వారిది అనుకున్నా… గ్రీకు దేవతల వారి దేవతల రాజు జూపిటర్ యొక్క కిరీటాల దగ్గరి నుండి అన్ని అభరణాలలోనూ, విశేష పనితనం, కళాత్మకత, వైభవం ఉండవు.

ఉదాహరణకు చెప్పాలంటే – గత టపాలల్లో వ్రాసిన ‘300 యోధులు’ సినిమాలో లియో నైడర్స్ స్పార్టా కు రాజు. అతడి వేషధారణ గానీ, అంతఃపురం గానీ ఎలా ఉన్నాయో అందరం చూసిందే! అదే, జానపద కథలుగా భారతీయులకి, ముఖ్యంగా తెలుగు వారికి, తెలిసిన ఏ ‘జగదేశ వీరుని కథ’ వంటిదో, పౌరాణికాలైన ‘మాయబజార్’, ‘నర్తన శాల’ వంటిందో అయితే… అందులో రాజుల వేషధారణ, అంతఃపురాల కళాత్మక ఎలా ఉంటాయో కూడా అందరికీ తెలుసు! అదీ వ్యత్యాసం!

చివరికి రాజాధి రాజుగా కీర్తించబడే జెక్సీస్ మహారాజు ఆభరణాలు, వేషధారణ చూస్తే… అతడి కంఠసీమలో ఉండే ‘కంటె’ వంటి ఆభరణాలు మన దేశంలో గిరిజనుల ఆభరణాలని తలపిస్తాయి.

అదీ… ‘తెలిసినతనం’లో ఉండే వ్యత్యాసం!

క్రైస్తవుల మత గ్రంధం బైబిల్ లో, క్రీస్తు జన్మించినప్పుడు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళే జ్ఞానులూ, ఇతరులూ సమర్పించే కానుకలు… బంగారం, సాంబ్రాణి! చివరికి బైబిల్ లో వర్ణించబడిన సాలమోను చక్రవర్తి సంపద వివరాలలో కూడా… పాత నిబంధన

గ్రంధం, 11 వ అధ్యయాలలో… దిగువ పేరాలను ఓ సారి పరిశీలించండి.

>>> సొలోమోనునకు ఏటేట ఇంచుమించు 66 బారువల బంగారము లభించెడిది. వర్తకుల మీద విధించిన కప్పముల నుండియు, వర్తకుల నుండియు, ఆరేబియా రాజు నుండియు, రాష్ట్రపాలకుల నుండియు లభించిన బంగారము ఈ లెక్కలో చేరలేదు.

అతడు కమ్మచ్చున తీసిన బంగారముతో రెండు వందల పెద్ద డాలులను చేయించెను. వానికొక్కొక్క దానికి ఆరువందల తులముల బంగారము వాడెను. కమ్మచ్చున తీసిన బంగారముతోనే మూడువందల చిన్న డాలులను గూడ చేయించెను. వానికి ఒక్కొక్క దానికి నూటయేబది తులముల బంగారము వాడెను. వానినన్నిటిని “లెబానోను అరణ్యము” అను పేరుగల మందిరమున నుంచెను.

అతడు దంతముతో సింహాసనము చేయించి దానిని మేలిమి బంగారమున పొదిగించెను. ఈ సింహాసనమునకు ఆరుమెట్లు కలవు. ఒక్కొక్క మెట్టునకు రెండు సింహముల చొప్పున మొత్తము పండ్రెండు సింహముల బొమ్మలు కలవు. సింహాసనమునకు వెనుక తట్టున ఎద్దుతలను చెక్కించెను. సింహాసనమున రెండు చేతులకు ప్రక్క రెండు సింహముల బొమ్మలు కలవు. ఏ రాజును ఇటువంటి సింహాసనమును చేయించిఎరుగడు.

సొలోమోను పానపాత్రములన్నియు, లెబానోను అరణ్యము అను పేరుగల మందిరములోని పాత్రములన్నియు మేలిమి బంగారముతోనే చేయబడెను. సొలోమోను కాలమున వెండికి విలువ లేదు గనుక దానితో అతడు వాడిన పాత్రలలో దేనిని చేయరైరి.

సొలోమోనునకు నావలును గలవు. అవి హీరాము నావలతో పాటు సముద్రయానము చేసేడివి. ప్రతి మూడేండ్ల కొకసారి అతని ఓడలు వెండి బంగారములతో, దంతములతో, రకరకముల కోతులతో తిరిగి వచ్చెడివి. విజ్ఞానముననేమి వైభవముననేమి సొలోమోను ఈ నేలను ఏలిన రాజులలోనెల్ల అధికుడు.

ప్రభువు అతనికి అనుగ్రహించిన విజ్ఞాన సూక్తులను వినుటకై ప్రపంచములోని జనులెల్లరు రాదొడగిరి. అతనిని చూడవచ్చిన వారు వెండి బంగార వస్తువులను, ఆయుధములను, సుగంధ ద్రవ్యములను, గుఱ్ఱములను, గాడిదలను బహుమతులుగా కొని వచ్చిరి. ఏటేట ఇట్లే జరుగు చుండెడిది.

సొలోమోనునకు గొప్ప రధబలమును గలదు. అతడు పదునాల్గు వందల రధములను తయారు చేయించెను. పండ్రెండు వేల గుఱ్ఱములను సంపాదించెను. వానిలో కొన్నిటిని రథనగరములందు నిల్పి యుంచెను. కొన్నిటిని యెరూషలేముననే ఉంచెను.

~~~~~~~

బైబిల్ ని గానీ, క్రైస్తవ మతాన్ని గానీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. బైబిల్ వారి మత గ్రంధమే కాదు, వారి చరిత్రనీ, సామాజిక జీవనాన్ని కూడా వివరించే గ్రంధం. నిజానికి ఏ మత గ్రంధమైనా అంతే! ఆ ప్రామాణికత మేరకే పోలుస్తున్నాను.

అంత గొప్పగా కీర్తించబడిన, ఆరు మెట్లూ ఒకో మెట్టుకీ ఇరువైపులా సింహాల బొమ్మలూ ఉన్న, సొలోమోను సింహాసనంతో పోల్చితే… మన జానపద భట్టి విక్రమాదిత్యుల కథలోని సువర్ణ సింహాసనం ఎక్కువ వైభవంగా ఉంటుంది. ముప్పై రెండూ మెట్లూ, మెట్టు మెట్టుకీ పలుకు నేర్చిన సువర్ణ సుందరీ ప్రతిమలతో…!

ఇంకా… రామాయణంలోని సుందరకాండలో వర్ణించబడిన లంకానగర వైభవం ఎంతటి దంటే – ఆ నగర సంపద, సౌందర్యాల కారణంగా దాన్ని సుందర కాండ అని పిలిచేంత! మయుడి శిల్పకళా చాతుర్యం, నగర భవనాలని సువర్ణ శోభితం చేస్తుంది. మరకత మాణిక్యాలు పొదిగిన స్తంభాలతో, గవాక్షలతో, ముత్యాలూ రతనాలూ కూర్చిన తోరణాలతో… ఆ సంపద వైభవపు వర్ణన, చూడకుండానే కళ్ళు మిరుమిట్లు గొల్పుతుంది.

అంతగా ఊహించాలంటే వాల్మీకి మహర్షికి అంత సంపద ఉంటుందనీ, ఉండగలదనీ సూచన ప్రాయంగానైనా తెలియాలి కదా!? అసలు ఆధారమే లేకుండా అంత ఉచ్ఛ స్థితిని ఊహించలేడు గదా! వాల్మీకి ఒక కవిగాక వందమంది కవులైనా సరే! (ఈ వాదనలు కూడా… వాల్మీకి, వ్యాసమహర్షుల విషయంలో చేసారు లెండి!) ఆ వందమంది ‘వాల్మీకులకీ’ అంతటి సంపద యొక్క ప్రాధమిక ఉనికి అయినా తెలియాలి కదా!?

ఇదంతా ఎందుకు చెప్పానంటే… ‘ఇప్పుడు ఐశ్వర్యంతో మిడిసి పడుతున్న పాశ్చాత్య ప్రపంచం కళ్ళు తెరిచే నాటికే… ఈ వేదభూమి సిరి సంపదలని అనుభవించి, హద్దులు తెలుసుకొని ఉంది’ అని చూపేందుకే!

ఇంతగా సంపదా, వైభవమూ తెలుసుకాబట్టే… ‘ఎన్ని తాపత్రయాలు పడినా, ఏది పొందాలో అదే పొందుతామనీ, పోయేటప్పుడు వెంట వచ్చే అసలు సంపద ఏమిటో తెలుసుకొమ్మనీ’ చెప్పారు పెద్దలు.

‘ఒయాసిస్సుల్ని వదిలిపెట్టి, ఎండమావుల వెంట పరుగెత్త వద్దని’ హెచ్చరించారు. ‘ఎంత పొర్లాడినా ఎంత అంటుకోవాలో అంతే అంటుకుంటుందని’ ముతక సామెతలూ ఇందుకే చెప్పారు.

ఎందుకంటే – ప్రకృతిలోనే ఆ ‘సమతుల్యత’ (Balance) ఉంది. మనిషి దాన్ని ధిక్కరిస్తున్నాడు, ధ్వంసం చేస్తున్నాడు.
కొల్లేటి సరస్సు లోకి వలస కొంగలతో సహా పలు పక్షులొస్తాయి. వాటి రెట్టలతో చేపలు తామర తంపరగా వృద్ధి చెందుతాయి. చేపల్ని తిని కొంగలు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతాయి. ఆ విధంగా అవి పరస్పరాశ్రితాలు. ప్రాకృతిక వలయాలు.

నీటి చక్రంతో సహా… అంటే సముద్రాల్లో నీరు ఆవిరై వర్షమైతే… అది వాగులూ వంకలై, నదులుగా విస్తరించి మళ్ళీ సముద్రాన్ని చేరినట్లుగా… ప్రకృతిలో ఎన్నో సమతుల్య వలయాలున్నాయి. మనం భౌతిక శాస్త్రంలో చదువుకునే డాల్టన్ పదార్ధ నిత్యత్వ సూత్రంలాగా! ప్రకృతిలో ఆయా ప్రదేశాల్లో ఓ జీవికి మరో జీవి సహజ శతృవూ, ఒక జీవికి మరో జీవి ఆహారమూ, ఒక జీవికి మరో జీవి సహచరమూ అయినట్లుగా!

ఆ సమతుల్యతని దెబ్బతీస్తూ…

అభివృద్ధి సాధిస్తున్నాం, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నాం అంటూ…

కొండల్ని మింగేస్తూ…

సరస్సుల్ని తాగేస్తూ…

అడవుల్ని మాయం చేస్తూ…

మనిషి, తనకు తానే హాని చేసుకుంటున్నాడు. తోటి పశుపక్ష్యాదుల్నీ, క్రిమి కీటకాదుల్నీ హత్యలు చేస్తున్నాడు.
ప్రకృతి మనిషికి కడుపు నింపే కన్నతల్లి వంటిది. గూడునిచ్చి అవసరాలు తీర్చే కన్నతండ్రి వంటిది. అలాంటి ప్రకృతిని నాశనం చేస్తే… సర్వజీవులూ మానవాళీ కూడా నాశనం కాక తప్పదు.

ఒక ఉదాహరణ గమనించండి. బైకుల మీద ఇప్పుడు రఁయ్యి రఁయ్యిన ప్రయాణిస్తున్నాం. దానికి ఇంధనం కోసం భూగర్భాన్ని గుల్ల చేస్తున్నాం. తిరిగి ఆ గుంతలు పదార్ధంతో పూడాలంటే, అదే ఇంధనం ఏర్పడాలంటే – లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంతకాలం పట్టినా మళ్ళీ ఏర్పడక పోవచ్చు కూడా! ఎందుకంటే ప్రకృతి సహజ పరిణామ వలయాన్ని మనిషి అభివృద్ధి పేరుతో ఆటంక పరుస్తున్నాడు గనుక!

ఒకప్పుడు ఈనాటి బైకులంత వేగంగా గాకపోయినా, ఆనాటి కాలానికి తగిన వేగంతో వెళ్ళాలంటే గుర్రాలని వాడేవాళ్ళు. బైకు భూగర్భంలో నుండి వచ్చే పెట్రోలుని తాగితే, గుఱ్ఱం భూఉపరితలం మీది గడ్డి నములు తుంది. పెట్రోలు ఓ సారి తీస్తే మళ్ళీ రాదు. గడ్డి మేసిన కొద్దీ పెరుగుతుంది. ఆపైన గుఱ్ఱపు లద్దెతో మళ్ళీ మళ్ళీ చిగురిస్తుంది.

అలాగని మళ్ళీ అందరూ… బైకులూ, కార్లూ రైళ్ళూ విమానాలూ మూలన పడేసి ఎద్దుల బళ్ళు గుఱ్ఱాలూ ఎక్కమని అనటం లేదు. ‘దేనికైనా ఒక హద్దు అవసరం’ అంటున్నాను.

‘అభివృద్ధి పేరుతో, విస్తరిస్తున్న నగర సంస్కృతితో, వ్యవసాయాన్ని మింగేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో, ప్రకృతి కడుపులో చిచ్చు పెడితే… అది సర్వనాశనానికే దారి తీస్తుంది’ – అంటున్నాను.

దాని పేరు కాలుష్యం కావచ్చు, కార్చిచ్చు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, సునామీలు వరదలూ భూకంపాలూ కూడా కావచ్చు. కాబట్టే దేనికైనా ఓ హద్దు అవసరం అని పెద్దలన్నది!

ఈ విషయాన్ని ఎంత హృద్యంగా చెబుతుందో భాగవతంలోని ఈ కథ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

good interesting

జాన్‌హైడ్ కనుమూరి గారు: నెనర్లండి!

$ఆదిలక్ష్మి గారు

ఎంత బాగా చెప్పారండి, ఎక్కడనుంచి ఎక్కడికి. చివరలో కఠిన వాస్తవాల్నీ, అందరూ అలోచించాల్సిన అవసరాన్ని చక్కగా చెప్పారు. నెసర్లు. ఇలాగే రాస్తూ ఉండండి :)

రాజష్ జి. గారు: మీ అభిమానానికి నెనర్లండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu