అభివృద్ధి పేరుతో, విస్తరిస్తున్న నగర సంస్కృతితో, వ్యవసాయాన్ని మింగేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో, ప్రకృతి కడుపులో చిచ్చు పెడితే… అది సర్వనాశనానికే దారి తీస్తుంది.

దాని పేరు కాలుష్యం కావచ్చు, కార్చిచ్చు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, సునామీలు వరదలూ భూకంపాలూ కూడా కావచ్చు. కాబట్టే దేనికైనా ఓ హద్దు అవసరం అని పెద్దలన్నది!

ఈ విషయాన్ని ఎంత హృద్యంగా చెబుతుందో భాగవతంలోని దేవహూతి కథ!

బ్రహ్మదేవుడు సృష్టి గురించి ఆలోచన చేస్తుండగా ఆయన నాలుగు ముఖాల నుండి బుగ్యజుస్సామ అధర్వణ వేదాలు పుట్టాయి. అలా సర్వశాస్త్రలూ ప్రభవించాయి.

ప్రజాసృష్టి గురించి ఆలోచన చేయగా స్వాయంభువ మనువు, ఆయన భార్య శతరూప ప్రభవించారు. [ఇక్కడ ‘ఆలోచన నుండే జనించటం’ గురించి చెప్పబడింది. ‘సంకల్పమే అన్నిటికీ ప్రారంభం’ అని ఇందుకే అంటారేమో! ‘భావం నుండే అన్నీ జన్మించాయి. భావమే తప్ప భౌతిక ప్రపంచం లేదు. అది అభాస మాత్రమే, ఉన్నదను కోవటం భ్రాంతే’ అనే తత్త్వ చింతనకి, ఆధార బీజాలు ఇక్కడ కనిపిస్తాయి.]

ఈ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే కుమార్తెలు కలిగారు. ఉత్తానపాదుడు కుమారుడే ధృవుడు.

ఆకూతిని రుచికిచ్చి, దేవహూతిని కర్దముడి కిచ్చి, ప్రసూతికి దక్షుని కిచ్చి వివాహం జరిపించారు. వీరి వల్ల మానవ ప్రపంచం ప్రవృద్దమయింది.

[ఇది భాగవతం తొలి అధ్యాయాలలో చెప్పబడింది.
దేవహూతిని గురించిన కథ ఇక్కడ వివరిస్తున్నాను.]

ఒకనాడు స్వాయంభువ మనువు, తన కుమార్తె దేవహూతిని వెంట బెట్టుకుని కర్దముని ఆశ్రమానికి వెళ్ళాడు.
వచ్చిన అతిధిని ఆదరించిన కర్దముని తో స్వాయంభువ మనువు “ఆర్యా! ఈమె నా బిడ్డ దేవహూతి. పురుషోత్తముని దర్శించిన వారికి తప్ప అన్యులకు యీమె గోచరించదు. ఈమెను కాముకదృష్టితో చూసిన వారికి ఆ క్షణంలోనే మృత్యువు సంభవిస్తుంది.

అటువంటి శీలవతి, పవిత్ర హృదయ అయిన నా బిడ్డ, నిన్ను భర్తగా వరిస్తున్నది. నీకు అంగీకారమైతే ఈమెను నీకు ధారపోస్తాను”అన్నాడు.

తండ్రి ప్రక్కన నిలబడి ఉన్న ముగ్ధ, దేవహూతి ని చూసి కర్దముడు,

“ఈమెకూ నాకూ గుణ రూపాలలోనే కాక, నడవడిలో కూడా పోలికలున్నాయి. కాబట్టి ఈమెను నేను వరిస్తాను. అయితే ఒక నియమం ఉంది. దాంపత్య జీవితానికి పరమావధి అయిన సంతానం కలగగానే, నేను యోగాభ్యాసంతో శ్రీహరి ధ్యానంలో ఉంటాను. ఆ విధంగా ముక్తి సాధన చేస్తాను. అందుకు అంగీకారమైతే, నీవు నాకు కన్యాదానం చేయవచ్చు” అన్నాడు.

[చూడండి. కర్దముడు దేవహూతి అందాన్నో స్వాయంభువ మనువు సంపదనో పరిశీలించలేదు. ఆమెకూ తనకూ… గుణంలోనూ, రూపంలోనూ, ప్రవర్తనలోనూ పోలికలుండడాన్ని గమనించాడు. అప్పుడే దంపతులు సుఖంగా జీవించగలరని ఆయన ఉద్దేశం. స్వభావంలో, గుణంలో తూర్పు పడమరల్లా ఉన్నా, రూపంలో ఒకరు అందంగా మరొకరు అనాకారిగా ఉన్నా, నడవడికలో ఒకరిది శాంత స్వభావం మరొకరిది క్రోధ స్వభావం గలవారైనా వాళ్ళు ఒకరితో ఒకరు సర్ధుకు పోలేక పోవచ్చు.

ఏమైనా గుణరూప నడవడికల్లో పోలికలున్న వారైతే… కలిసి జీవించడం శాంతీ సంతోషాలాతోనే కాదు, ముక్తి సంపాదించే ప్రయత్నంలో ఒకరికి మరొకరు తోడ్పాటు నివ్వగలరన్నదే ఇక్కడ ఉద్దేశం.]

కర్దముడి అభిప్రాయం, నియమాల గురించి స్వాయంభువ మనువు తన భార్య శతరూపతో, కుమార్తె దేవహూతితో సంప్రదించాడు. వారిద్దరూ అంగీకరించారు. దాంతో దేవహూతిని కర్దముని కిచ్చి వివాహం జరిపించాడు.

[‘ఆఁ ఆడవాళ్ళతోనా వ్యవహారం!?’ అనుకోకుండానూ… ‘మన కుటుంబాల్లో ఆడవాళ్ళని అడిగే అలవాటు లేదు!’ అనకుండానూ… భార్యనీ, కుమార్తెనీ కూడా సంప్రదించాడు స్వాయంభువ మనువు. పెళ్ళి చేసుకోవాల్సింది కుమార్తె గనుక ఆమెనీ, తల్లి గనుక తన భార్యనీ సంప్రదించాడు!]

వివాహానంతరం దేవహూతిని, కర్దమునికి అప్పగించి తిరిగి వెళ్ళే సమయంలో, ఆ తండ్రి హృదయం విషాద భరితం అయింది. ఎంత అపురూపంగా పెంచినా, అనురాగం పంచినా, అప్పటి వరకూ తమ చేతుల్లో ఆడిపాడిన, తమ ఇంట్లో నడయాడిన తమ కన్నబిడ్డ… ఇప్పుడు అల్లుడి సొత్తు! ఒకసారి దానం ఇచ్చాక, ఇక ఆమెపై తల్లిదండ్రుల ప్రమేయమూ, ప్రభావమూ ఉండవు కదా!

బిడ్డను కౌగలించుకుని, శిరసు ముద్దాడి, వెన్నుదువ్వుతూ కొంత సేపు కన్నీరు విడిచి, మనస్సు దిటవు చేసుకున్నాడు. సంసార నౌకలోకి అడుగు పెట్టిన కుమార్తెకు, అల్లుడికి కొన్ని మంచి మాటలు చెప్పి సెలవు తీసుకున్నాడు. దారిలో బ్రహ్మావర్ష దేశంలో విష్ణువరంగా సత్ర్కుతువులు చేసి రాజధాని చేరాడు.

పార్వతీ దేవి పరమశివుని ఆరాధించే రీతిలో, దేవహూతి తన భర్తను సేవిస్తూ, భక్తితో ఆయన శుశ్రూషయే పరమావధిగా భావిస్తూ, కామ క్రోధాది అరిషడ్వర్గాలనీ, అహంకారాన్నీ దరి చేరనీయకుండా, సర్వమూ తనకు భర్తయే అని త్రికరణశుద్దిగా విశ్వసిస్తూ జీవయాత్ర సాగిస్తున్నది.

[సన్మార్గుడైన భర్తని అనుసరిస్తూ సేవించడం సతీధర్మం. అధర్మ పరుడైనా నోరెత్తక పడి ఉండమనే వ్రత కథలూ, కుష్ఠురోగ పీడితుడైనా వేశ్యా సంపర్కాన్ని కోరిన భర్తని గంపలో మోసుకెళ్తూ సూర్యోదయాన్ని ఆపమంటూ సూర్యుణ్ణి శపించబోయిన సతీ సమతుల కథలు ప్రక్షిప్తాల్లో భాగాలు!

హిందూ ఇతిహాసాలని అవహేళన చెయ్యడానికి… సినిమాలలో చూపే విధంగా సాంబారులో తామే బొద్దింకని వేసి, ఆపైన నానా రచ్చ చేసి హోటల్ వాడి నుండి పైకం రాబట్టే రేలంగిలా… హిందూ ఇతిహాసాలపైనా, పురాణాల పైనా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అమలు చేసిన కుట్రలో భాగమే ప్రక్షిప్తాలు! అసలు చరిత్రే వారి దృష్టిలో చింపేస్తే చెరిగి పోయేది. తామేది ప్రచారిస్తే అదే… చరిత్ర అయినా, మరేదైనా!]

ఆ విధంగా తనని సేవిస్తున్న భార్యని చూచి, ఓ రోజు… కర్దముడు “ఇల్లాలా! నీ సేవాభావం నా మనస్సుకి ఆహ్లాదం కలిగించింది. నీకు దివ్యదృష్టి వరంగా యిస్తున్నాను” అన్నాడు.

దేవహూతి చల్లని వెన్నెలలా మందహాస చేస్తూ“స్వామీ! మీ సేవలో మీ సర్వశక్తులూ నాకు లభిస్తాయని తెలుసు.” అంది.

కర్దముడు చిరునవ్వుతో చూసాడు.

ఆమె వినయంగా “మన కల్యాణ సమయాన, మీరు వాగ్ధానం చేసిన సంతాన విషయం విస్మరించరని నమ్ముతాను” అంది.
అంతట కర్దముడు తన శక్తితో మణులు చెక్కిన స్తంభాలతో అలరారే సువర్ణ సౌధాలు కల్పించాడు. దాని నిండా సంసారానికి అవసరమయిన శయ్యాగారాలు, భోజన శాలలు, సువర్ణ పాత్రలు, పట్టు పీతాంబరాలు సృష్టించాడు. భవనం చుట్టూ ఉద్యానవనాలు, వనాలలో లతానికుంజాలు, ఫలవృక్షాలు, శుక పిక సంతతులు, సరోవరాలు, క్రీడామందిరాలు సర్వశోభాయమానంగా ఉన్నాయి. రంగురంగుల పూలు, సుమధుర పరిమళాలు, పూలపై వాలుతున్న తుమ్మెదల అలంకారాలు! పిట్టల కువకువలు, సరోవరాల్లో హంసల విహారాలు!

[ఇంత కంటే గొప్ప విల్లాలను ఏ constructing company కట్టగలదు?]

ఇక వీటన్నిటితో నిండిన దివ్యవిమానం సృష్టించాడు.

అదంతా చూసినా దేవహూతికి సంతోషం కలగలేదు. ఆమె పన్నెత్తి చెప్పకపోయినా, కర్దముడామె హృదయాన్ని గ్రహించాడు.

“ఈ బిందు సరోవరంలో స్నానం చెయ్యి. దానివల్ల అన్నికోరికలూ నెరవేరతాయి” అన్నాడు.

దేవహూతి సరోవరంలో దిగి, స్నానం చేసింది.

ఆమె సరస్సులోకి దిగిన ఉత్తర క్షణం, ఆ నీటిలో నవయౌవన శోభనాంగులు వెయ్యిమంది దాసీలు ప్రత్యక్షమయ్యారు. వారిలో కొందరు ఆమెకి సకల సపర్యలూ చేశారు. భవనాలలో, ఉద్యానవనాల్లో, విమానంలో కావలసిన పనుల్లో కొందరు నిమగ్నమయ్యారు. కొందరామె సేవలో నిమగ్నమయ్యారు.

ఆమెకు చక్కగా అభ్యంగన స్నానం చేయించి, అగరధూపంతో తల ఆర్చి, దువ్వలువలు ధరింప చేసారు. తీరుతీరుగా కురులు ముడిచి పుష్పాలంకరణ చేసారు. రత్నాభరణాలతో అలంకరించారు.బొట్టూ కాటుకలతో ముఖారవిందాన్ని మురిపించారు.

షడ్రసోపేతంగా భోజనం పెట్టి, కర్పూరహారతు లిచ్చి, చక్కని ఆసనం మీద కూర్చుండబెట్టి, ఎదురుగా నిలువెత్తు అద్దం ఉంచారు.

దేవహూతి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ, భర్తను స్మరించింది. ఉత్తర క్షణంలో ప్రక్కగా నిలిచాడాయన.

పెళ్ళినాడు ఏ వయోరూప సౌందర్య లావణ్యాలు ఉన్నాయో, అదే రీతిగా ఈ క్షణంలో ఉన్న దేవహూతిని ప్రియంగా చూస్తూ, భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు కర్దముడు. దాసీజనాలతో కూడా దంపతులు విమానం ఎక్కారు.

సర్వసుఖ సౌకర్యాలతో ఉన్న ఆ విమానంలో సకల లోకాలూ తిరిగి వచ్చారు దేవహూతి, కర్దములు. [ఇంతకంటే గొప్పదైన హనీమూన్ ప్యాకేజీని ఏ అంతర్జాతీయ సంస్థ అయినా ఇవ్వగలదా!?]

విహార యాత్ర అనంతరం, తన నివాసానికి వచ్చి, దేవహూతితో సాంసారిక సుఖభోగాలను అనుభవిస్తూ కొంతకాలము గడిపారు. ఆ రోజులలో కర్దముని అనుగ్రహంతో దేవహూతి తొమ్మండుగురు ఆడపిల్లలను ప్రసవించింది.

అప్పుడు కర్దముడు సన్యాసాశ్రమం స్వీకరించబోగా, ఆమె ఆయన పాదాలపై వ్రాలి “స్వామీ! ఈ బాలికలకు వివాహం చేసి, నాకు తత్త్వోపదేశం చేయగల కుమారుని దయచేసి మీరు సన్యాసం తీసుకొండి” అని వినయంగా ప్రార్ధించింది.

[ఆ తల్లి తన కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేయగల కుమారుడిని మాత్రమే అడగ లేదు. ఆ కుమారుడు తనకు తత్త్వోపదేశం కూడా చేయగలిగి ఉండాలని కోరింది.]

కర్ధముడు ఆమె అభీష్టాన్ని మన్నించాడు. మరికొంత కాలం గడిచింది. ఆ దంపతుల ధర్మనిష్టపై భగవంతుడి కరుణ అన్నట్లుగా వారికి ఒక కుమారుడు కలిగాడు. శ్రీహరి అంశం, ఆమె గర్భాన పుత్రరూపంలో ప్రవృద్ధమై, కపిలముని జన్మ పొందింది.

ఆ సమయాన వచ్చిన బ్రహ్మాది దేవతలందరూ దేవహూతిని, కర్దమునీ అభినందించి ఆనందంతో తిరిగి వెళ్ళారు.

చతుర్ముఖుని ఆజ్ఞానుసారం, కర్దముడు తన బిడ్డలు తొమ్మండుగురినీ, ఘరీచి, ఆత్రి, అంగీరస, పులస్త్య, క్రతు, భృగు, వశిష్ఠ, అధర్వులకిచ్చి వేదొక్తంగా వివాహం జరిపించాడు.

కొంతకాలం గడిచింది.

ఒకనాడు కర్దముడు తన యింట కపిల రూపంలో ప్రభవించిన మహావిష్ణువును సమీపించి “పురాణపురుషా! సర్వ మానవులూ నీ చరణ సేవతో ముక్తిధామం చేరుతారు. మా అదృష్టవశాన మా పుత్రుడవై జన్మించి మాకు తరణోపాయం చూపించావు. ఇక నేను సంసారం వదలి, వనానికి పోయి, యోగ మార్గాన ముక్తి సాధించుకుంటాను” అన్నాడు.

కపిలుడు మందహాసం చేసి “ఈ మానవులందరినీ ఉద్దరించడానికే కపిల మునిగా అవతరించాను. సాంఖ్య యోగ ప్రభోధంతో వీరిని తరింప జేస్తాను. నువ్వు నిశ్చితంగా పరంజ్యోతి ధ్యానంతో కైవల్య పదం చేరు” అని పంపించాడు.

కర్దముడు ప్రశాంత తపోవనం చేరి యోగనిష్ఠతో ఈశ్వరధ్యానంతో పరమ భాగవతోత్తముల స్థానం చేరాడు.

[తన తపశ్శక్తితో తృటిలో అంత సంపదనీ, సకల సౌకర్యవంతమైన సకల లోకాలనూ చేరగల విమానాన్నీ సృష్టించగల కర్దముడు… ఆ సుఖభోగాలలో మునిగి పోవాలనుకోలేదు. అవి అశాశ్వతమని తెలుసు. అలాగని ‘అసలే భోగమూ అనుభవించను’ అనీ అనుకోలేదు. సంసారికీ ఎంత సుఖసౌకర్యాలు కావాలో, సంసారి గా ఏ గమ్యాన్నీ చేరాలో ఆయనకి నిర్ధిష్టంగా తెలుసు. దాన్నే నిగ్రహంగా అనుసరించాడు. దేనికి ఏది ఎంత యుక్తమో కర్దముడు ఆచరించి చూపాడు.]

మరికొంత కాలం గడిచింది.

బిందువరం దగ్గర దేవహూతి, కపిలుని చేరి తనకు తత్వం ఉపదేశించమని కోరింది.

[ఏ సరోవరం దగ్గరైతే భర్తతో సంసార జీవితాన్ని ప్రారంభించిందో, అక్కడే కుమారుణ్ణి తత్త్వం బోధించమని అడిగింది. సంసారపు తుది గమ్యం అదే అన్నట్లుగా!]

కపిలుడు చిరునవ్వు వెన్నెలలు వెదజల్లుతూ శాంత గంభీర స్వరంతో తల్లికి తత్త్వోపదేశం చేసాడు.

[ఉషశ్రీ వచన భాగవతంలో క్లుప్తంగా వ్రాసినా… ఈ తత్త్వోపదేశం దాదాపు నాలుగు పేజీలలో ఉంది. అది మరోసారి!]

స్వాయంభువ మనువు, శతరూపల కుమార్తెలు ఆకూతి, దేవహూతి, ప్రసూతి. దేవహూతి కర్దముల పుత్రుడు నారాయణ అంశగల కపిల ముని. ప్రసూతి దక్షుల కుమార్తె పార్వతీదేవి అంశగల సతీ దేవి.

అందుకే, శ్రీమహా విష్ణువు, పార్వతీ దేవి లను వరుసకు అన్నాచెల్లెళ్ళుగా చెబుతుంటారు.

ఈ పురాణ గాధలో… మన పూర్వీకులు ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి, వాళ్ళకి సంపదా తెలుసు, సుఖసౌకర్యాలూ తెలుసు. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఎంతెంత గానో! అలాగే దేనికి ఏది అవధో కూడా! సుఖశాంతులతో బ్రతకడానికి, సంపద ప్రమేయం కొంతే! అలాగే సంపద పోగొట్ట గలిగే విచార దుఃఖాలు కూడా కొంతే!

కాబట్టి – బ్రతకడానికి డబ్బు కావాలి. కానీ డబ్బే బ్రతుకు కాదు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటారు. డబ్బుకోసం పరుగుపెట్టి ఆయాసం తెచ్చుకున్నాక, పోయిన ‘మహాభాగ్యం’తో పోల్చుకుంటే… ఏదీ ఆ వెలితి పూడ్చలేదు.

కారు పోతే, మరో కారు కొనుక్కోగల అవకాశం ఉంది. ఒక ఇల్లు అమ్ముకుంటే, అంతకంటే మంచిదైన మరో ఇంటిని కొనుక్కోగల అవకాశం ఉంది.

కానీ భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని పోగొట్టుకుంటే, మరో దాన్ని తెచ్చుకోలేం! జీవితమూ అలాంటిదే! ఒక దాన్ని పోగొట్టుకుంటే మరోదాన్ని పొందగలిగే వీలు లేదు.

పోగొట్టుకున్న కాలాన్నీ తిరిగి పొందగలిగింది లేదు. కాబట్టి – సుఖంగా సౌకర్యాలతో బ్రతికేందుకు సంపద సంపాదించుకోవాలి. దాన్ని, శాంతంగా సంతోషంగా ఆస్వాదించేందుకు తీరికా కావాలి.

ఆ అవధిని గుర్తించుకుంటే ఆనందం మన వెంటే! అప్పుడు దోపిడికీ హద్దులు ఏర్పడతాయి. వ్యాపారం మోసంగా పరిణమించటం మాని, మానవ జీవితాన్ని దురాక్రమణ చేయకుండా ఉపశమిస్తుంది.

అందుకు సర్వమానవాళి నిజాలు తెలుసుకోవాలి!

సత్యాన్ని చూడాలన్నా, అంగీకరించాలన్నా ధైర్యం కావాలి. ఆత్మశక్తి కావాలి.

అది సామాన్యులకి లభ్యమైనప్పుడు ప్రాకృశ్చిమాల మేలు కలయికనీ…

పాత కొత్త రోజుల మంచినీ…

ఏర్చికూర్చుకుని,

వర్తమాన మానవ జాతి, భవిష్య ప్రపంచానికి అందిస్తే!?

ఎంత తియ్యటి కల కదూ!

నిజమౌతుందని ఆశిద్దాం!

నిజమయ్యేందుకు…

మన కర్తవ్యం మనం పాటిస్తే…

నిజం చెయ్యమని భగవంతుణ్ణి ప్రార్దిస్తే…

నిజం కావటం అసాధ్యం ఎప్పటికీ కాదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

అద్భుతం చాలా బాగుంది

:) యథావిధి చక్కగా వ్రాసారు. ఈ మధ్యన బ్లాగులు చదవటమే మానేసాను. యథాలాపంగా మీ బ్లాగు చూస్తే నేడు ఈ చక్కటి టపా కనబడింది. ఊరకుండటంకంటె పలకరించటం మంచిదని...

నమస్సులతో భవదీయుడు

చాలా బాగుందండి.:)

good post:)

మాకూ ఉన్నారు మగ రాడియాలు!
- బుద్దా మురళి
http://www.andhrabhoomi.net/sub-feature/22sf-088
ఎంతో శక్తివంతుడైన ఎన్టీఆర్‌ను ఒక్క బాబే దించేశాడనుకుంటున్నావా? కాదు కాదు ఇప్పుడు నీవు రాజాను మంత్రివర్గంలో చేర్చడానికి లాబీయింగ్ చేసినట్టుగానే మా తెలుగు మగ రాడియాలు ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. విజయం సాధించారు. ఈ మగరాడియాలు నైతిక విలువల గురించి బోధించే స్థాయికి ఎదిగిపోయారు. నీవంటే సంస్కరణల రెండవ దశలో రాణించావు కాబట్టి నీ పనికి కన్సల్టెన్సీ ఫీజు అని ముద్దు పేరు పెట్టుకుని తెల్లధనమే మెక్కేశావు. మా మగరాడియాలకు అలాంటి అవకాశం లేని కాలం కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా నొక్కేసి ఎక్కడికో ఎదిగిపోయారు. ఒక వేళ నీకు ఆసక్తి ఉంటే ముద్దుకృష్ణమ నాయుడు అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు. 95లో వెన్నుపోటులో పాలు పంచుకున్న ‘నాలుగో స్తంభం వారి’ జాతకాలు నా వద్ద ఉన్నాయని అప్పుడాయన రోజూ చెప్పే వారు. ఆ జాబితా సంపాదించడానికి ప్రయత్నించు. నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడరు ఎందుకంటే నీ కాల్స్ అన్ని ట్యాపింగ్ అవుతున్నాయి కాదా? వారి జాబితా నువ్వు సంపాదిస్తే విజయవంతంగా పనులు ఎలా సాధించవచ్చునో వారు మెలుకువలు నేర్పిస్తారు

caala manci vishayaalu ceppaaru...

Thankyou...

మొదటి అజ్ఞాత గారు: నెనర్లండి!
రాఘవ గారు: చదివి కామెంట్ ఇచ్చినందుకు నెనర్లండి!
సతేంద్ర గారు: నెనర్లండి!
రెండవ అజ్ఞాత గారు, సవ్వడి గారు: నెనర్లండి!
మూడవ అజ్ఞాత గారు: మంచి లింక్ ఇచ్చినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu