క్రిస్మస్ పండుగ రోజున పిల్లలందరికీ ‘అమ్మఒడి’ అందించే కమ్మని కథ.

అనగా అనగా…

సిరిపురం అనే ఓ చిన్న ఊరు. అందమైన ఆ పల్లెలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతడి భార్య బంగారమ్మ నిజంగా బంగారం లాంటి మనిషి. ఎప్పుడూ వంచిన నడుమెత్త కూడా పనిచేసేది. వేళకి అందరికీ అన్నీ అమర్చి పెట్టేది. పన్నెత్తి పరుషంగా ఎవరినీ ఒక్కమాటా అనెరగదు. రాజయ్య కూడా భార్యకు తగిన వాడే!

ఆ దంపతులకి ముగ్గురు కూతుళ్ళు. పిల్లల మీద ప్రేమ కొద్దీ భార్యాభర్త లిద్దరూ వాళ్ళని తెగ గారాబంగా పెంచారు. ఒక్కపనీ చెప్పేవాళ్ళు కాదు.

ముగ్గురు పిల్లలూ పెళ్ళి కెదిగి వచ్చారు. ఓ ఏడాది రాజయ్య పొలంలో మంచి పంట పండింది. దాంతో మంచి సంబంధాలు చూసి ముగ్గురు కూతుళ్ళకీ ఒకేసారి పెళ్ళిళ్ళు చేసారు రాజయ్య, బంగారమ్మ.

పెళ్ళి కొచ్చిన బంధుమిత్రులంతా కొత్త జంటలని చూసి ముచ్చట పడి, రాజయ్య దంపతులని అభినందించారు. పెళ్ళి సంబరాలన్నీ ముగిసాక రాజయ్య బంగారమ్మలు, చీరె సారెలతో కూతుళ్ళని అత్తవారిళ్ళకి పంపారు.

వారం తిరక్కుండానే అత్తారిళ్ళలో కూతుళ్ళెలా ఉన్నారోనని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అంతలోనే ‘ఆడపిల్లల్ని కన్నాక ఎవరికైనా ఇది తప్పని కష్టం లే’ అనుకొని గుండె దిటవు చేసుకున్నారు.

మరో వారం గడిచింది.

ఓ రోజు… ఉదయాన్నే బంగారమ్మ వాకిట్లో ముగ్గు లేస్తోంది. అంతలోనే పెద్ద కూతురు అత్త గారింటి నుండి బట్టలు సర్దుకొని వచ్చింది.

“ఏమిటమ్మా! చెప్పాపెట్టకుండా వచ్చావు? కబురు పెడితే మేం వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా? అయినా అల్లుడు లేకుండా ఒక్కదానివే వచ్చావేం?” అన్నాడు రాజయ్య.

“ఏం చెప్పమన్నావు నాన్నా! రాత్రి మా ఆయన తమలపాకులకి ఈనెలు తీసి పెట్టమన్నాడు. తీరా తీసి పెట్టాక ‘అయ్యో నీ చేతివేళ్ళు ఎంత కంది పోయాయో’ అనైనా అనలేదు. ఆ కాపురం చేయటం ఇహ నా వల్ల కాదు నాన్నా! అందుకే పెట్ట సర్దుకొని చక్కా వచ్చాను” అంది పెద్ద కూతురు కళ్ళొత్తుకుంటూ!

నిలువు గుడ్లేసుకు చూశారు రాజయ్యా, బంగారమ్మా!

మధ్యాహ్నానికి మధ్య కూతురు బండి దిగింది.

“ఏమైందమ్మా! అల్లుడేడి?” అతురతగా అడిగింది బంగారమ్మ!

“ఏం అల్లుడూ, ఏమత్త గారూ! ఈ ఘోరం తెలుసా అమ్మా! పొద్దున్నే మా అత్తగారు చల్ల చిలికి వెన్న తీసింది. చెయ్యి జారి వెన్నముద్ద కాస్తా నా కాలి మీద పడింది. ‘అయ్యో! కాలు వాచిందా?’ అని తల్లీ కొడుకులు మాట వరసకైనా అన్నారు కాదు”రుసరుసలాడింది రెండో కూతురు.

నిర్ఘాంత పోయారు భార్యభర్తలు.

సాయంత్రమయ్యేసరికి చివరి కూతురు చిర్రుబుర్రులాడుతూ వచ్చింది.

“ఏమైంది తల్లీ!” భార్యాభర్తలిద్దరూ బితుకు బితుకుమంటూ అడిగారు. ‘అల్లుడేడీ?’ అని అడగబోయి మాట మింగేసారు.

“ఏమౌతుంది? అవ్వాల్సినంతా అయ్యింది” ఖస్సుమంది చిన్నకూతురు.

బేలగా చూశారు రాజయ్య, బంగారమ్మలు.

“అది కాదు నాన్నా! నిన్న మా అత్తగారు నాకు పూల జడ వేసింది. ‘తట్టెడు పూలు తలలో ఉంటే తలనొప్పి పుడుతుందేమో’ అని ఆలోచనైనా ఉందా మా ఆయనకి? పొద్దంతా చూసినా మొహమాటానికైనా అడిగాడు కాదు. అంత ప్రేమ లేని మనిషితో ఎలా వేగటం? చిర్రెత్తు కొచ్చి చప్పున వచ్చేసాను” అంది మూతి మూడు వంకర్లు తిప్పుతూ!

బిక్క చచ్చిపోయి నట్లయ్యింది రాజయ్య బంగారమ్మలకి.

మరోమాట లేకుండా బంగారమ్మ వంటింట్లోకి, రాజయ్య పెరట్లోకి పోయారు.

రాత్రి భోజనాలై పడుకున్నాక రాజయ్య, బంగారమ్మతో,

“బంగారం! పిల్లల్ని మనం బాగా గారాబం చేసి చెడగొట్టాం. పనులు నేర్పకుండా పెంచాం. ఇప్పుడిలా గయ్యింది” అన్నాడు దుఃఖం దిగమింగుతూ.

“అవునయ్యా! ఇప్పుడు తలవంపులు తెచ్చారు” అంది బంగారమ్మ కన్నీళ్ళు తుడుచుకుంటూ!

కాస్సేపు మౌనంగా ఉన్న రాజయ్య “ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిల్లల కళ్ళు తెరిపిద్దాం” అంటూ భార్య చెవిలో ఏంచెయ్యాలో చెప్పాడు. బంగారమ్మ సరేనంది.

మర్నాడు పొద్దున బారెడు పొద్దెక్కినా… ఇంట్లో అలికిడి లేదు. నులక మంచాల మీద ముసుగు తన్ని పడుకున్న ముగ్గురు కూతుళ్ళకీ కడుపులో ఆకలి కేకలు వేయటంతో లేవక తప్పింది కాదు.

లేచి చూస్తే ఏముంది? కనీసం వాకిలి ఊడ్చి ముగ్గైనా పెట్టలేదు. ఎక్కడి పని అక్కడే ఉంది.

“అమ్మా! ఆకలేస్తోంది” అంటూ తల్లి కోసం చూస్తే… బంగారమ్మ ఎక్కడా కనబడలేదు. వసారాలో మంచం మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు తండ్రి.

“నాన్నా! అమ్మేది?” అన్నారు ముక్తకంఠంతో!

“అలిగి పుట్టింటికి పోయింది” అన్నాడు రాజయ్య నిర్లిప్తంగా!

ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు కూతుళ్ళు ముగ్గురూ!

“ఎందుకు?”ఆతృతగా అడిగారు.

“రాత్రి ఆరు బయట పక్క లేసుకు పడుకున్నామా? ఒకటే ఉక్క! విసన కర్రతో విసర మన్నాను. ముంజేతులు నొప్పి పుడుతున్నాయి పొమ్మంటూ అలిగి పుట్టింటికి పోయింది” అన్నాడు రాజయ్య.

“ఇదేం చోద్యం నాన్నా! పెళ్ళయి పాతికేళ్ళయ్యాక ఇప్పుడు అమ్మ నీ మీద అలిగి అమ్మమ్మ ఇంటికి పోయిందా? నలుగురూ వింటే నవ్వుపోరూ?” అంది పెద్ద కూతురు బుగ్గలు నొక్కుకుంటూ!

“పెళ్ళైన నెలకే అలిగి అత్తారింటి నుండి వచ్చావు. నిన్ను చూసి నవ్వినట్లే నా పెళ్ళాన్ని చూసీ నవ్వుతారు. అంతే కదా!?” అన్నాడు రాజయ్య నిస్పృహ ధ్వనింప జేస్తూ!

గతుక్కు మంది పెద్ద కూతురు.

“అయినా విసన కర్రతో విసిరితేనే చేతులు నొప్పి పుట్టాయా, మరి చోద్యం గాకపోతే!”అంది రెండో కూతురు.

“వెన్నముద్ద కాలి మీద పడితేనే కాలు వాచిందా అని అడగలేదని కోపం వచ్చి పుట్టింటి కొచ్చావు నువ్వు. నీలాంటి సుకుమార ప్పిల్లని గన్న మీ అమ్మా సుకుమారమే గదమ్మా! అందుకే అలిగింది. ఇందులో చోద్యం ఏముంది?” అన్నాడు రాజయ్య.

బిత్తరపోయి నిల్చుంది రెండో కూతురు.

“అయినా ఎన్నడూ లేనిది ఇదేమిటి నాన్నా!? ఇప్పుడు మాకెవరు వండి పెడతారు?” గుఁయ్యిమంది మూడో కూతురు.

ఖఁయ్యి మన్నాడు రాజయ్య, “పాతికేళ్ళుగా నాకూ, మీకూ వండి పెట్టింది నా బంగారం. ఎన్నడూ ఒక్కమాట అని ఎరగదు. ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసి అదీ అలకలు నేర్చింది. ఛీఛీ” అనేసి విసురుగా వీధిలోకి పోయాడు.

చతికిల పడ్డారు ముగ్గురమ్మాయిలూ!

ఇన్నేళ్ళుగా తమ కన్నీ అమర్చి పెడుతూ తల్లీతండ్రీ తమనెలా చూసుకున్నారో గుర్తొచ్చింది తమ తప్పూ తెలిసొచ్చింది.

వెంటనే లేచి అత్తారిళ్ళకు బయలు దేరారు. నెలరోజుల తిరిగే సరికల్లా తల్లి పనితీరుని గుర్తుకు తెచ్చుకుంటూ, అన్ని పనులూ చేయటం నేర్చుకుని, అత్తగారిళ్ళల్లో శభాషని పించు కున్నారు.

‘పిల్లల్ని ప్రేమగా పెంచటం అంటే పనులు నేర్పక పోవటం కాదన్న సత్యాన్ని ఆలస్యంగానైనా గ్రహించాం. పెను ప్రమాదం తప్పింది’ అనుకొని ఆనందపడ్డారు రాజయ్య బంగారమ్మలు.

తర్వాత వచ్చిన పండక్కి వాళ్ళిల్లు అల్లుళ్ళూ కూతుళ్ళతో కలకలలాడింది.

ఇదీ కథ!

చిన్నప్పుడు చదివిన కథకి మరిచిపోయిన చోట స్వంత కల్పన జోడించి…

పండగ మిఠాయిలకి ఇలాచి పరమళం చేర్చినట్లుగా…

మీ కోసం, ఈ పండుగ సెలవు రోజున ఈ చిన్ని కానుక!

6 comments:

చాలా బాగుందండి ఈ కథ. అంతే కాదు నా కింకో కథ కూడా గుర్తొచ్చింది. కూతుర్ని పలకరించటానికి అత్తారింటికి వెళ్ళిన తండ్రితో ఏముంది నాన్నా నా కాపురం మోచేతికి తగిలిన దెబ్బలాగుంది అంటే అంతే కదా అని వెళ్ళిన తండ్రికి తన మోచేతికి దెబ్బతగిలినప్పుడు ఆ బాధ ఎంత తీవ్రమైనదో గ్రహించి బాధ పడ్తాడు. తల్లిదండ్రులకు తమ కష్టాలు తెలిస్తే ఎక్కడ బాధ పడ్తారో అని గుట్టుగా సంసారాలు చేసుకునే ఆడపిల్లలు కూడా గుర్తొచ్చారు నాకు. మీకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలండి.

కథ భలే బాగుందండీ :)

హాయిగా ఉంటుందండీ మీ బ్లాగు టపాలు చదివినప్పుడల్లా.

హృదయే జాయతే భావో తవ బ్లాగ్-పఠనాత్ సదా శరచ్చంద్రకరప్రాప్తగాఢసంతోషవన్మమ.

జయ గారు, మధురవాణి గారు : కృతజ్ఞతలండి.

రాఘవ గారు: మీ వ్యాఖ్య చదివి కూడా చాలా హాయిగా అనిపించిందండి!

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

చాలా బాగుంది కథ

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu