మళ్ళీ జీవితాన్ని ’సున్నా’ దగ్గర నుండి ప్రారంభించాల్సిన స్థితి. ఈ స్థితిలో ఏ స్నేహితుడైనా చేయగలిగేది ఏమాత్రం? అందుకని ముందుగా మా మామగారికి ఫోన్ చేశాము. కొన్ని రోజులు Shelter ఇస్తే మళ్ళీ ఏదైనా ఉద్యోగమో, ఉపాధో వెదుక్కోగలమన్నది మా ప్రయత్నం. అప్పటికి మా పెళ్ళై ఎనిమిదేళ్ళుయ్యింది. మాపాపకి ఆరేళ్ళు నిండాయి. కానీ మా మామగారు మాత్రం మా వారిని, నన్ను పాపని వదిలివస్తే రమ్మన్నారు. [అంతకు ముందు సూర్యాపేటలో ఉన్నప్పుడు ఊరు మొత్తంలో సాయంచేసేవాళ్ళులేనప్పుడు మా వారు, వాళ్ళ నాన్నకు విషయం మొత్తం చెప్పి ఏమైనా సాయం చేయమని అడిగాడు. అప్పుడు మా మామగారు “నల్లకుంటలో జి.ఎం.సి. బాలయోగి సెక్రటరీ ఉంటాడని అతన్నీ కలవమని” చెప్పారు. అంతే తప్ప ఇంటికి రమ్మన లేదు.] దాంతో మళ్ళా మా పోరాటం మాకు తప్పలేదు. స్నేహితుల ఇళ్ళల్లో నాలుగైదురోజులు, వారంరోజులు. ఓ ఇద్దరు మిత్రుల ఇంట్లో దాదాపు నెల,నెల రోజులు ఉన్నాము. ఇలా తలదాచుకుంటూ మళ్ళా ప్రయత్నాలు ప్రారంభించాము. వెంటనే ఏదైనా ఉద్యోగంలో చేరాలన్నా విద్యాసంవత్సరపు చివరిరోజులు, అపైన వేసవి సెలవులు. కాబట్టి టీచర్స్ గానో, లెక్చరర్స్ గానో జాబ్ వెదుక్కోలేం. అందునా ప్రైవేటు, కార్పోరేట్ కాలేజీలలో మళ్ళా ఉద్యోగ ప్రయత్నం, ఎంసెట్ మీద ఫిర్యాదు పెట్టిన నేపధ్యంలో ఏపాటి ఫలిస్తుందో తెలియలేదు. ఇంకో రంగంలోకి ప్రవేశించాలన్నా అవగాహన లేదు. అప్పటికి ఇంకా మా షాక్ పూర్తిగా తీరలేదు. ‘కార్పోరేట్ కాలేజీలకి తమ కుంభకోణాలు తమకి హాయిగా ఏ అడ్డంకి లేకుండా నడిచిపోతున్నాయి. సాక్షాత్తు సీ.ఎం.పేషీ, సీ.ఎం. కూడా అనుకూలురై ఉండగా ఇక అడ్డంకి ఏమిటి? ఆ పాటిదానికి మేమెందుకింతగా వేధింప బడుతున్నాం?’ అన్న అయోమయం మమ్మల్ని బాగా గందరగోళ పరుస్తోంది. మా వారు చేసిన ఉద్యోగప్రయత్నాలు కూడా పెద్దగా కలిసి రాలేదు. ఈ స్థితిలో మా స్నేహితులు చేసిన ఆర్ధిక సాయం ఒక స్నేహితుడు/ స్నేహితురాలు దగ్గర నుండి మరో స్నేహితుడు/ స్నేహితురాలు దగ్గరకి ప్రయాణించగలిగేంత, ఒక్కొక్కరి దగ్గర కొద్దిరోజులు తలదాచు కోగలిగేంత మాత్రమే. ఈ దశలో మండుటెండల్లో మేనెలలో రాష్ట్రం ఈ చివరి నుండి ఆ చివరి వరకూ స్కూటర్ మీద తిరిగాము. ఓ సారి చిలకలూరిపేట, నా బాల్య స్నేహితురాలి ఇంటి నుండి నల్గొండ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాము. సెక్రటేరియట్ లో చెప్పినందున కలెక్టర్ ని కలిసి సమస్య పరిష్కరించుకొనే ప్రయత్నం చేశాము. ఆ ‘వెరీ గుడ్ కలెక్టర్’ ఆఫీసులో [సి.ఎం. పేషీలో ఉమా మహేశ్వరరావు ఐ.ఏ.ఎస్. చెప్పినట్లు] నాలుగు గంటలు వేచి ఉంచి [నాతోపాటు సందర్శకుల్లో చాలామంది ఉన్నారు] తీరిగ్గా ‘ఈ రోజు ఇక కలెక్టర్ గారు ఎవర్నీ కలవరట. రేపురండి’ అని బంట్రోతు చెప్పాడు. సిసి ని కలిసి ఫిర్యాదు కాపీ ఇచ్చి వెనక్కి వెళ్ళాము. ఆ రోజు మేడే. నడిఎండలో దాదాపు బండిలో పెట్రోలు బొటాబొటి సరిపోయింది. మంచినీళ్ళు సైతం పొదుపుగా వాడుతూ [బాయిల్డ్ వాటర్ అలవాటు] వెనక్కి చిలకలూరి పేట వెళ్ళాము. అక్కడి నుండి మరో ఫ్రెండ్. ఇలా నానా బాధలూ పడ్డాము. ఎవరయిన సరే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు అన్నమాట ముందుగానే చెప్పారు. ఇక లాభం లేదని చివరికి మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాము. ఈమె మా అమ్మకు చివరి చెల్లెలు. నాకంటే మూడేళ్ళు పెద్దది. చిన్నప్పుడు కలిసి ఒకే తరగతిలో ఒకేబడిలో చదివాము. మా నాన్న, మా అమ్మకు మేనమామ అయిన రీత్యా మా పిన్ని వాళ్ళంతా చిన్నప్పుడు మా ఇంట్లోనే ఉండేవారు. వాళ్ళది గుంటూరు దగ్గర పల్లెటూరు. ఆమె మా అమ్మ, చెల్లి, తమ్ముళ్ళకు ఫోన్ చేసి నేను వచ్చిన సమచారం చెప్పింది. మా అమ్మ, తమ్ముళ్ళు హైదరాబాదు లోనూ, చెల్లి అక్కడికి దగ్గర్లోని మరో పల్లెటూరు లోనూ ఉంటున్నట్లు చెప్పింది. మా అమ్మ హైదరాబాదు నుండి బయలుదేరి వచ్చింది. మా చెల్లి ఫోన్ లో మమ్మల్ని తమ ఊరు రమ్మని పిలిచింది. దాదాపు ఆరేళ్ళు తర్వాత నేను నాకుటుంబసభ్యుల గురించి విన్నాను, కలిసాను.

మా అమ్మ, చెల్లి, తమ్ముళ్ళు, ఫ్యాక్టరీ నుండి 1995 లో వెళ్ళి పోయాక, హైదరాబాదు వెళ్ళారట. పంజాగుట్ట దగ్గర ఓ కార్ డెకరేటర్స్ దగ్గర మా తమ్ముళ్ళు ఉద్యోగంలో చేరారట. ఆ కార్ డెకరేటర్స్ కి చంద్రబాబునాయుడి కుమారుడు లోకేష్, కస్టమర్ గా తరచూ వచ్చేవాడట. ఆ నేపధ్యంలో మా తమ్ముళ్ళతో, ముఖ్యంగా పెద్దతమ్ముడితో బాగాస్నేహం ఏర్పడిందట. తన జీపు కి వేరేఇంజన్ వేసి ప్రయోగాలు చేయటానికి నా తమ్ముడిని తనవెంట తీసుకొని వెళ్ళాడట. ఆ పనితనం నచ్చటంతో తన తల్లితండ్రులకి అంటే చంద్రబాబునాయుడు, భువనేశ్వరి లకి చెప్పి, జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కార్ డెకార్స్ షాప్ తెరిచేందుకు సాయం చేశాట్ట. స్వయంగా భువనేశ్వరి మా తమ్ముడికి 5 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఋణం ఇచ్చి, షాపుని రిబ్బన్ కత్తిరించి, టెంకాయకొట్టి ప్రారంభించింది. వారి కుటుంబంతో స్నేహం కారణంగా ప్రస్తుతం [అంటే 2001 లో] మా తమ్ముళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. చంద్రబాబునాయుడి రాజకీయ పర్యటనలకి మా తమ్ముళ్ళిద్దరూ వెంట ఉండటం రివాజయ్యిందిట. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలలతో పాటు, చంద్రబాబుతో మా తమ్ముళ్ళ ఫోటోలు అప్పట్లో ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ తోపాటు ఇతర పత్రికలలో కూడా ప్రచురించబడ్డాయి. అప్పటికి లోకేష్ హైదరాబాదులో ఉంటే తప్పని సరిగా నాపెద్దతమ్ముడు వెంట ఉండటం, అతడి విదేశీ ప్రయాణాల సమయంలో విమానాశ్రయానికి వెళ్ళి, వీడ్కొలు స్వాగత కార్యక్రమాలకు మా తమ్ముడు తప్పని సరిగా వెళ్ళటం గురించి తర్వాత నా తమ్ముడు స్వయంగా చెప్పాడు. [ఇప్పటికీ నా చిన్నతమ్ముడు చంద్రబాబునాయుడి దగ్గరే పనిచేస్తున్నాడు.] ఆ ఫోటోలూ, పత్రికా ప్రచురణల కటింగ్స్ కూడా తర్వాత చూశాను. ఇదంతా నాకు ఆశ్చర్యంగా, అద్భుతంగా, దిగ్ర్భాంతిగా అన్పించింది.

మరో వైపు మా తమ్ముళ్ళద్దరికీ, చెల్లికీ పెళ్ళిళ్ళయ్యాయి. పిల్లలు కలిగారు. ఇది నాకు సంతోషం కలిగించింది. ఈ వివరాలన్నీ ముందు మా అమ్మ చెప్పగా విన్నాను. నా వివరాలు చెప్పబోతున్నప్పుడు మా అమ్మ ‘తానేమీ సహాయం చేయలేదు గనుక నేను చెప్పనూ వద్దు, తాను విననూ వద్దు’ అంది. అది నాకు చాలా కోపాన్ని, బాధనీ కలిగించింది. ఏదైనా సాయం చేయటం చేయకపోవటం తర్వాత విషయం, ముందు కనీసం వినటం అన్నదీ మనస్సు బరువు తీరుస్తుంది కదా? మా అమ్మ హైదరాబాద్ వెళ్ళిపోయింది. మా తమ్ముళ్ళు నాతో ఫోన్ లోనూ మాట్లాడలేదు. మా అమ్మ పిలవలేదు. మేము మా చెల్లిలి ఇంటికి తను ఆహ్వానించగా వెళ్ళాము. [నిజానికి మాపిన్ని, "మా ఊర్లో అందరు అడుగుతున్నారు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని, నీవు మీ అక్కను పిలిపించుకొని తీసుకెళ్ళు” అని మా చెల్లికి చెప్పిందట] మా మరిదికి ఆ ఊర్లో కొంత పొలమూ, ఇల్లూ, ఓ చిన్న రైసుమిల్లు ఉన్నాయి. వాళ్ల ఊరికి బాపట్ల దగ్గర. మా మరిది తనకు తెలిసిన కాలేజీ వాళ్ళున్నారనీ, అక్కడ ఉద్యోగం వేయిస్తాననీ అన్నాడు. ‘అప్పటికి ఆరేళ్ళ తర్వాత మళ్ళీ ముఖాలు చూసుకున్నాము. ప్రస్తుతం మా స్థితి ‘రామ’ అన్నా బూతు అయ్యేలా ఉంది. ఈ స్థితిలో అక్కడ ఉద్యోగప్రయత్నం చేయటం, ఉన్న కొద్దిపాటి అనుబంధాలనీ తుంచేస్తుందా’ అని కొంత గుంజాటన పడ్డాము. గతంలో లాగే పత్రిక ప్రకటనల ద్వారా మరో ఉద్యోగం సంపాదించుకోలేమా అన్న ఆలోచన చేశాము. ఇంతలో మా చెల్లెలు, వాళ్ళ భర్త తరుపు బంధువులు వస్తున్నారని మా దారి మమ్మల్ని చూసుకోవలసినదిగా చెప్పింది. మేమూ అక్కడ నుండి కదలిపోక తప్పలేదు. అప్పటికీ మా తమ్ముళ్ళు నన్ను avoid చేస్తున్నందున, రోషం కొద్దీ నేనూ ప్రయత్నించలేదు. అప్పటికి ఇంకా మిగిలి ఉన్న స్నేహితులని వెతుక్కొని, నిలదొక్కుకునే ప్రయత్నం చేశాము.

మా చెల్లి వాళ్ళ ఊరిలో ఓ విశేషం గురించి చెప్పటం ఇక్కడ అసందర్భమే అయినా చెబుతున్నాను. ఆ ఊరిలో పురాతనమైన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. చాలా చక్కని గుడి. ఎతైన ప్రాకారాలు, గోపురాలతో, చిన్నతోటతో ఎంతో మనోహరంగా ఉంది. ఆగుడికి ఆ ఊర్లోనే 365 ఎకరాల మాన్యం ఉంది. ఆ ఊర్లో ఎకరాకి సంవత్సరానికి అయిదువేల రూపాయల కౌలు నడుస్తోంది. అంటే ఆ గుడికి రోజుకి 5 వేల రూపాయల ఆదాయం ఉన్నట్లే. అయితే సదరు భూమి ఎండోమెంట్స్ కింద ఉంది. గుడిలో దేవుడికి నైవేద్యం కూడా కరువుగా ఉంది. ఇదంతా మా చెల్లి చెప్పినప్పుడు నాకునవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఏనాడో, ఏ ధార్మత్ములో, ధర్మమనీ, పుణ్యమనీ గుడికి స్వంత మాగాణి భూములను మాన్యంగా ఇచ్చారు. ఎండోమెంట్స్, ప్రభుత్వం ఎంచక్కా తినేస్తుంది. దీనిమీద విపులమైన చర్చ Coups On World లో Coups on Hindu religion లో వ్రాసాను. ఇది విషయాంతరం అవ్వటంతో ఇక్కడితో ఆపేస్తున్నాను.

మళ్ళీ మా కథ దగ్గరకు వస్తే – మేము ఏ స్నేహితుల దగ్గర వెళ్ళినా, ఏ ప్రయత్నం చేసినా, ఏదీ సాధ్యపడలేదు. అనివార్యమైన స్థితిలో, నిస్సహాయత కారణంగా, రోషాన్ని చంపుకుని నాతమ్ముడికి ఫోన్ చేశాను. చిన్నతమ్ముడు పరమ rude గా డీల్ చేసాడు. పెద్దతమ్ముడు సరే రమ్మంటూ ఇంటికి తీసుకెళ్ళాడు. అయితే కండిషన్ చెప్పాడు “నువ్వు అప్పటి 1992 ఫిర్యాదు, పివినరసింహారావు గురించి, రామోజీరావు గురించి మాట్లాడవద్దు. అవన్నీ మేం మర్చిపోయి హాయిగా ఉన్నాము” అన్నాడు. మేము అదే చెప్పాము “మేం మర్చిపోయి చాలా సంవత్సారలయిందని, అవన్నీ ఫ్యాక్టరీతోనే మర్చిపోయామని” చెప్పాము. నిజానికి ఇద్దరు తమ్ముళ్ళు ఉమ్మడిగానే ఉండేవాళ్ళు. ఉమ్మడిగానే వ్యాపారం చేసేవాళ్ళు. మమ్మల్ని నా పెద్దతమ్ముడి అతిధులుగా పరిగణించి తీసుకుపోయాడని నాకు అర్ధం అయ్యింది. అప్పటికే, గుంటూరులో మా ఇరుగుపొరుగు వారిని, తన దగ్గర పనిలో పెట్టుకున్నాడు. మా అమ్మ చెల్లెళ్ళు ఇద్దరి సంతానాలకి తానే అండగా ఉండి ఇల్లూ, వాకిలీ, ఉపాధి, దన్ను ఇచ్చాడు. తన షాపు అద్దె నెలకి పాతిక వేలనీ, తన నెలసరి ఖర్చు దాదాపు లక్ష రూపాయల వరకూ ఉంటుందనీ చెప్పాడు. వాడి షాప్ కి సెలబ్రిటీలు రావడం గురించి నాకు తెలుసు. నటుడు శ్రీకాంత్, జూనియర్ ఎన్.టి.ఆర్,……ఇలా. నటుడు మోహన్ బాబుకి కూడా వీళ్ళు ఏదో డిజైనర్ జీపు చేసి ఇచ్చారనీ, దాన్నీ ఏదో సినిమాలో కూడా వాడారనీ చెప్పాడు. ఈ నేపధ్యంలో మా తమ్ముడు ఓ రోజు నా భర్తతో “మనం ఎవర్నీ ఎదిరించకూడదు. ఏదో అలా తలవంచుకొని పోవాలి?" అన్నాడు. దానికి మా వారు “తలవంచుకు పోదాం అన్నా ఏది మన చేతిలో ఏం ఉంది? ఏ కాలేజీ వాడితోనైనా మనకెందుకులే అని గమ్మున మన పని మనం చూసుకొని వస్తున్నా, డబ్బెగ్గొట్టి మరీ గొడవ పెట్టుకుంటే ఏంచేస్తాం? తలవంచుకుపోవటం అంటే మీ అక్క నైతికత వదిలేయటం కాదు గదా?" అన్నాడు.

తర్వాతి పర్యవసానాల్లో మా పెద్ద తమ్ముడు నాకు సహాయం చేయడాన్ని వాడి భార్య, నా చిన్నతమ్ముడు వ్యతిరేకించారు. చివరికి మా తమ్ముడు మేం షీర్డీ వెళ్ళుతున్నామని, మీరు మీ దారి చూసుకోమని చెప్పారు. బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు. వాడి భార్య, నా చిన్న తమ్ముడు, మేము వినేటట్లు నా భర్త గురించి అవమానకరంగా మాట్లాడారు. వాళ్ళ ఇంటి నుండి బయటికి వచ్చి మేం మళ్ళీ మా ప్రయత్నాలు చేశాము. మా వారి అక్క ఫోన్ నెంబరు సంపాదించి ఫోన్ చేయగా “నా తమ్ముడు ఎప్పుడో చనిపోయాడు, మరో సారి ఈ నంబరుకి ప్రయత్నించవద్దు” అని చెప్పింది. మళ్ళీ రోడ్డున పడ్డాము. మళ్ళీ బస్టాండ్ లోని డార్మిటరీ నే గతి. ఈ స్థితిలో మరోదారి లేక మళ్ళీ మా పెద్ద తమ్ముణ్ణే ఏదో ఒకటి చెయ్యమని ఫోన్ లో ఒత్తిడి చేశాను. నాకు ఉద్యోగం వేయించలేను గానీ, నా భర్తకీ ఎక్కడైనా ఉద్యోగం చూస్తాననీ, ఇల్లు చూస్తాననీ కొన్నిరోజులు సాగదీసాడు. ఇంటి అద్దె 100/- రూ. ఎక్కువపెట్టటం ఇష్టంలేక మరో ఇల్లు చూస్తున్నామంటూ, ఈ రోజు, రేపు అంటూ, దాదాపు నన్ను డార్మిటరీలో 40 రోజుల పాటు ఉంచాడు. మాకై మేము ఇల్లు చూసుకునేందుకు తగినంత డబ్బు పంపేవాడు కాదు. అదీ గాక, తాను ఎక్కడ ఉద్యోగం చూస్తాడో, అక్కడికి దగ్గర్లో ఇల్లు చూస్తాననీ, కాబట్టి వేచి ఉండమని వాడే చెప్పాడు. చివరికి మొహిదీపట్నం పరిధిలో నానల్ నగర్ అనేబస్తీలో ఓ రేకుల షెడ్డులో ఇల్లు చూశాడు. వెళ్ళి ఆ ఇంట్లో దిగేవరకూ ఆ ప్రదేశంగానీ, ఆ ఇంటి పరిసరాలు గానీ నాకు తెలియవు. నాకప్పుటికి హైదరాబాదులో చిక్కడిపల్లి, బాగ్ లింగంపల్లి, జూబ్లీహిల్స్…. ఇలాంటి ప్రదేశాలే తెలుసు. గతంలో స్నేహితులు అక్కడ ఉండేవారు కాబట్టి. నగరాల్లోని బస్తీలు, మురికివాడలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. శ్రీశైలంలో గుడిసెలో ఉన్నా అక్కడి జనం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవి. చుట్టూ అడవి, బాగా శుభ్రంగా ఉండేది. నిజానికి నా తమ్ముడు ఉండే మాదాపూర్ లోనే మా అమ్మ చెల్లెలి సంతానానికీ, ఇతరులకీ చిన్నవే అయినా చక్కని వసతి వాడు సమకూర్చటం నేను చూశాను. మాకు చూపిన ఇల్లుపూర్తిగా మురికివాడ. చుట్టూ ఆటో డ్రైవర్లు, పనిమనుష్యులు ఉండేవారు. ‘ఇదేమిటిరా’ అంటే మాకు దగ్గరలో ఇల్లు చూడటానికి తన భార్య, తమ్ముడు ఒప్పుకోలేదనీ, నానల్ నగర్ లో అద్దె తక్కువగనుక అక్కడ ఇల్లు చూసాననీ, అదీ తన వర్కర్ ని చూడమంటే అక్కడ చూసాడనీ చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారంలో మా అమ్మ మౌనప్రేక్షక పాత్ర నిర్వహించింది. రెండుమూడు జతల బట్టలతో ఆ రేకుల షెడ్డులో మళ్ళీ బ్రతుకుపోరాటం ప్రారంభించాము. అప్పటికి దాదాపు 2001, నవంబరు మాసం వచ్చేసింది. నా పెద్దతమ్ముడు ఇచ్చిన వెయ్యిరూపాయలతో ఓ కిరోసిన్ స్టవ్, రెండు గిన్నెలు కొన్నాము. పప్పూ, బియ్యంతో మళ్ళా వంట, తంటా అన్నీ మొదలు పెట్టాము. మావారి ఉద్యోగం విషయం నా తమ్ముడు నాన్చుతున్నాడు గానీ తేల్చటం లేదు. ఈ లోపున పత్రికాప్రకటన ద్వారా దిల్ షుక్ నగర్ లో ఉన్న ఓ కోచింగ్ సెంటర్ ‘సాయి స్టడీ సర్కిల్ ’ లో ఉద్యోగం సంపాదించాను. మూడు ఇంటర్ రెగ్యులర్ క్లాసులూ, ఒక ఎంసెట్ క్లాసు సంపాదించాను. యస్.ఆర్. నగర్ లోని బ్రాంచిలో ఉదయం క్లాసులు తీసుకోవాలి. రెమ్యూనరేషన్ 8000/- రూ. క్రమంగా పుంజుకున్నాను. పది రోజులు గడిచాక మేనేజిమెంట్ ని కొంతడబ్బు అడ్వాన్స్ ఇమ్మని రిక్వెస్ట్ చేశాను. దానితోనూ, ఓ నెల గడిచాక వచ్చిన మొత్తం సొమ్ముతోనూ అవసరమైన దుస్తులూ, చాపాదిండు, దోమతెర గట్రాలు కొన్నాము. మెల్లిగా కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్నాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

ఏమని కామెంట్ రాయాలో అర్థం కాని స్థితి. అలా అని రాయకుండా వుండలేని స్థితి.

Hello Madum, meeku salute kottina naaku ithe adhi thakkuve anipisthundhi, endhukante nenu padeve ekkuva bhadhalu, kastaalu anukontunna kaabatti.. meeru padina bhadalu, kastaala tho naavi polisthee nothing, meedhanilo 1% kooda kaadhu.

మీ అన్ని టపాలు చదివాను..ఏం చెప్పడానికీ నా దగ్గర words లేవు

మీ బ్లాగు చదివిన వాళ్ళెవ్వరూ జీవితంలో ఓడిపోరు.

bhagavamtudu konni jIvitaalanu mree imtagaa padunu peTTaalani saanaraayi mIda eMduku saadutuMTaaDO!

వెంకట్ గారు చెప్పింది నిజమే, సమస్యలు వస్తున్నాయని నైతిక విలువల్ని వదులుకుంటే మనిషిగా చచ్చిపోయినట్టే. మీ ప్రయాణం మాలాంటి వాళ్ళకి స్ఫూర్తిదాయకం...

"మా చెల్లి వాళ్ళ ఊరిలో ఓ విశేషం గురించి చెప్పటం ఇక్కడ అసందర్భమే అయినా చెబుతున్నాను. ఆ ఊరిలో పురాతనమైన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. చాలా చక్కని గుడి. ఎతైన ప్రాకారాలు, గోపురాలతో, చిన్నతోటతో ఎంతో మనోహరంగా ఉంది. ఆగుడికి ఆ ఊర్లోనే 365 ఎకరాల మాన్యం ఉంది. ఆ ఊర్లో ఎకరాకి సంవత్సరానికి అయిదువేల రూపాయల కౌలు నడుస్తోంది. అంటే ఆ గుడికి రోజుకి 5 వేల రూపాయల ఆదాయం ఉన్నట్లే. అయితే సదరు భూమి ఎండోమెంట్స్ కింద ఉంది. గుడిలో దేవుడికి నైవేద్యం కూడా కరువుగా ఉంది. ఇదంతా మా చెల్లి చెప్పినప్పుడు నాకునవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఏనాడో, ఏ ధార్మత్ములో, ధర్మమనీ, పుణ్యమనీ గుడికి స్వంత మాగాణి భూములను మాన్యంగా ఇచ్చారు. ఎండోమెంట్స్, ప్రభుత్వం ఎంచక్కా తినేస్తుంది".

You wrote about the reality in India. Secular government taken over Hindu Temples and looting the wealth. It is a irony that a Missionary like Reddy controls Hindu Temples. And his son-in-law and daughter convert Hindus.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu