మా అమ్మ చెల్లి, తమ్ముళ్ళు ఇంకా ఫ్యాక్టరీలోనే ఉన్నారు. 1992 లో తాళం వేసిపోయిన AP SFC వాళ్ళు, 1995 వరకూ ఒక్కసారి కూడా మళ్ళీ ఫ్యాక్టరీకి రాలేదని చెప్పారు. తమని ఎవ్వరూ disturb చెయ్యలేదని మా అమ్మచెప్పింది. AP SFC వాళ్ళు అపాయింట్ చేసిన సెక్యూరిటీ గార్డ్సు మా అమ్మవాళ్ళకూ తోట పనులూ, ఇంటి పనులూ చేసిపెడుతున్నారు. ప్రయాణబడలిక తీర్చుకున్నాక మా అమ్మని నేను “ 1993 లో ఇంట్లోంచి వెళ్ళిపోతామని నన్నెందుకు బెదిరించావు?” అని నిలదీసాను.
దానికావిడ “నా చేతి ఐదు వేళ్ళల్లో ఒకవేలు పోయినా ఫర్వాలేదు, నాలుగేళ్ళయినా మిగులుతాయి అనుకున్నాను” అన్నది. నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను. మా అమ్మనాన్నలకు మేం అయిదుగురం పిల్లలం. ఇంటికి నేనే పెద్దదాన్ని. మా అమ్మ ఉద్దేశం నాకు అర్ధమయ్యింది. ఒకవేళ మమ్మల్ని వేధిస్తున్నది శతృవే అయితే, ఆ శతృవుకి నన్ను ఎరగా వేసయినా సరే, కనీసం తన మిగిలిన పిల్లల్ని దక్కించుకోవాలన్నది ఆవిడ ఉద్దేశం. నాతో తెగతెంపులు చేసుకుంటే తమని శతృవు వదిలేస్తాడేమోనన్న ఆశ ఆవిడకి నామీద ఉన్న ప్రేమని కూడా నలిపేసింది. ఇది నా గుండెని కుదిపేసింది.
చిన్నప్పుడు అంటే డిగ్రీ చదివేటప్పుడు రంగనాయకమ్మ ‘బలిపీఠం’ నవల చదివాను. అందులో బర్మా యుద్దాన్ని, అప్పుడు చితికిన బ్రతుకుల్ని వర్ణిస్తూ – రచయిత్రి, కధానాయకుడు భాస్కర్ తల్లి గంజిలో అడుగున మిగిలే అన్నం మెతుకులు పెట్టుమన్న తమ్ముణ్ణి, లేదంటూ తన్ని బయటకు పంపేస్తుంది. భాస్కర్ గదిలోకి వచ్చేసరికి తల్లి ఆబగా ఆ మెతుకులు తింటూ ఉంటుంది. ‘జీవితంలో extreme పరిస్థితులు వచ్చినప్పుడు అనుబంధాలు పలచన అవుతాయి’ అని హీరో అనుకుంటాడు – అని వ్రాసింది. అది చదివినప్పుడు ‘జీవితం అంత చేదుగా ఉంటుందా? ఎంతటి స్థితి అయినా కన్నతల్లి అలా ఉంటుందా?’ అనుకున్నాను.
అయితే జీవితం అంతకంటే చేదుగా ఉంటుందనీ, బ్రతుకు భయం, ప్రాణభీతి ఇంకా కౄరంగా ఉంటాయని తర్వాత తెలుసుకున్నాను. అయినా మా అమ్మంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ. జీవితంలో ఇంత extreme స్థితి రానట్లయితే మా అమ్మ అయినా అంతగా భయపడదు కదా! ఆమె నాకు జన్మనిచ్చింది. విద్యాబుద్ధులు నేర్పింది. వంటావార్పు, మంచీ మర్యాద నేర్పింది. మా కోసం, మమ్మల్ని సుఖంగా ఉంచటం కోసం ఎన్నోకష్టాలు ఓర్చింది. అందుకే, ఇప్పటికీ నాకు మా అమ్మంటే ఇష్టం, ప్రేమ. ఇప్పటికీ, నా తల్లి, తోబుట్టువుల గురించేకాదు, నా అత్తమామలూ, ఆడబడుచుల గురించి మేమిలాగే అనుకుంటాము. అప్పుడప్పుడూ క్షేమసమాచారాలు కనుక్కొనేందు కోసం, మా అమ్మ ఫోను చేసినప్పుడు నేను ఎంతో ఆనందిస్తుంటాను.
అయితే 1995 లో, నేను నా భర్తతో సహా ఫ్యాక్టరీకి తిరిగి చేరినప్పుడు మా అమ్మ, చెల్లి, తమ్ముళ్ళు మా వివాహాన్ని హర్షించలేదు. నన్ను మా నాన్నగారు మాత్రమే దీవించారు. అప్పుడే మా మామగారు [నా భర్త తండ్రిగారు] వచ్చారు. నా భర్తని నన్ను వదిలేసి రమ్మని వత్తిడి చేసారు. నా భర్త అందుకు తిరస్కరించాడు.
మేం శ్రీశైలం తిరిగి వచ్చేసాము. 1995 ఏప్రియల్ లో నాకు పాపాయి జన్మించింది. మా పాపకి ఫణి గీతా ప్రియదర్శిని అన్న పేరు పెట్టుకున్నాము. మా Hut లో గోడకి ఆవలివైపు మాతోపాటు పెద్ద నాగుపాము సహజీవనం చేసేది. అందుకని పేరులో మొదట ఫణి అని పేరు పెట్టుకున్నాము. గీత మాకు మార్గదర్శి కనుక గీత అని, నాపాప ఇందిరాగాంధీ అంతటి పోరాట యోధురాలు కావాలన్నది మా అకాంక్ష. అందుకని ఆమె పేరులో ‘ప్రియదర్శని’ని మా పాపకు పెట్టుకున్నాము.
పాపను కని ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరిచయమైన ఓ ఎన్.జి.ఒ.[Non Govt. organization] ఉద్యోగి ద్వారా మాకు అటవీ శాఖలో ఉద్యోగం వచ్చింది. ఎంత నాటకీయంగా వచ్చిందో అంతే నాటకీయంగా నెల తిరిగే లోపల ఉద్యోగం ఊడింది. అయితే అప్పుడు మేం గిరిజన తండాల్లో పర్యటించిన అనుభవం మాత్రం మాకు మరికొన్ని విషయాలు తెలియచేసింది. వాటి గురించి గత టపాల్లో వ్రాసాను. సంక్షేమ పధకాల పట్ల వారి స్పందన ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. తరువాత కొన్ని రోజులకు మానాన్నగారు స్వర్గస్తులయ్యారు. ఆ విషయం మాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అప్పటికే, పాప పుట్టాక మాకు కొత్త సమస్యలు అనుభవంలోకి వచ్చాయి. మేమంటే ఎలాగో ఆ hut లో బ్రతికేసాం. ఈ చిన్నారితో జీవితం అలా లేదు. శ్రీశైలంలో ఆదాయవనరు బలపడటం లేదు. దానితో ఉపాధిని వెదుక్కోవాలని శ్రీశైలం నుండి ఫ్యాక్టరీకి తిరిగి వచ్చాము. నేను రాగానే నాతోనే సమస్యలూ వస్తాయని మా అమ్మ, చెల్లి, తమ్ముళ్ళ నమ్మకం. అది నిజమేనన్నట్లుగా, 1992 నుండి 1995 వరకూ ఆ ఛాయలకి కూడా రాని APSFC వారినుండి సీజ్ చేసాక కూడా అక్కడ ఉన్నందుకు కేసుపెడతామంటూ పుకారే తెలిసిందో, విషయమే రూఢిగా తెలిసిందో కాని, మా అమ్మ,చెల్లి, తమ్ముళ్ళు అక్టోబరు 1995 లో ఫ్యాక్టరీ నుండి హైదరాబాద్ కి వెళ్ళిపోయారు. అక్కడ కారు డెకార్స్ షోరూమ్ లో తమ్ముళ్ళు ఉద్యోగంలో చేరారు.
మా అమ్మవాళ్ళు వెళ్ళిపోయిన వారంలోగా AP SFC వాళ్ళువచ్చి ఫ్యాక్టరీ Hand over చేసుకుంటామనీ, Premises ఖాళీ చేయమనీ చెప్పారు. ఫ్యాక్టరీ ఖాళీ చేసేముందు చివరి ప్రయత్నంగా, 1992 లో మా ఫ్యాక్టరీ కి వచ్చిన ఐ.బి.అధికారులు ఇచ్చిన చిరునామా ప్రకారం వెదుక్కుంటూ ఐ.బి.ఆఫీసుకి వెళ్ళాము. బయట బోర్డుగాని ఏమీ ఉండని బిల్డింగ్ అది. 1995 నవంబరులో, మేం అక్కడికి వెళ్ళి, concern officer తో 1992 నుండి జరిగినవన్నీ క్లుప్తంగా చెప్పి, అతడే మా స్థానంలో ఉంటే ఏంచేస్తాడో అలా ఆలోచించి మమ్మల్ని గైడ్ చెయ్యమని అడిగాము. అతడు “If I were in your place, I believe in fate” అన్నాడు. ఇదే ఐ.బి.ఆఫీసుకి 2006 అక్టోబరులో మరోసారి [ఈసారి కొన్ని ఋజువులున్నాయి, సాక్ష్యాధార పత్రాలున్నాయి] అప్రోచ్ అయినప్పుడు అక్కడి ఐ.బి.అధికారి, దాదాపు తాను స్వయంగా రామోజీరావు తరుపు డిఫెన్సు లాయర్ ఏమోనన్నంతగా నాతో ఎదురువాదించాడు. “అసలేమనుకుంటున్నారు రామోజీరావంటే! అతడు మచ్చలేని వ్యాపారి తెలుసా?" అన్నాడు. చిత్రమేమిటంటే ఈ సంఘటన తర్వాత వారం పదిరోజుల్లోనే ఉండవల్లి అరుణ్ కుమార్ నిందారోపణలతో మార్గదర్శి గొడవ ప్రారంభమైంది. ఈ మొత్తం వ్యవహారంలోని నాటకీయత గురించి తర్వాతి టపాల్లో వివరిస్తాను. ఫ్యాక్టరీ ఖాళీ చేసి రావడానికి ముందు – నాకు తెలిసిన, నాకు తారస పడిన వారందరూ “జరిగిదంతా మరిచిపొండి. క్రొత్త జీవితం ప్రారంభించండి” అనేవాళ్ళు. ఈ క్రమంలో మద్రాసు నుండి వచ్చిన ఒక వ్యాపార మిత్రుడు “మేడం. మీరు తెలివైన వారు. ఇవన్నీ మరిచిపొండి. పి.ఎం.కి మీరిచ్చిన ఫిర్యాదు, అన్నీ మరిచిపొండి. అలాంటి ఫిర్యాదులు పి.ఎం.లకి లెక్కలేనన్ని వస్తాయి. అవేవీ వాళ్ళు పట్టించుకోరు. మీ జీవితంలో ఏదో అసాధారణం నడుస్తోందనీ, దేశంలో మీ ఫిర్యాదు అనంతరం పరిస్థితులు మారిపోయానని అనుకోవటం మీ భ్రమ. అవన్నీ వదిలేయండి. మీరు మద్రాసు వస్తానంటే నేను మీకు జాబ్ చూసిపెడతాను” అన్నాడు. నేను చెప్పిన అసాధారణలు, అసహజాలు గురించి వివరణ ఇవ్వకుండా, ఒకటే మాట “అవన్నీ మర్చిపొండి, కొత్త జీవితం ప్రారంభించండి” అని చెప్పాడు.
1995 లో, ఐ.బి.ఆఫీసులోని సంఘటన తర్వాత నవంబరు 1995 లో నేనూ, నాభర్త, నాఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డులు సహకారంతో దగ్గరిలోని నంబూరు అనే పల్లెకి మకాం మార్చాము. ఎందుకంటే పర్నిఛర్ చాలా ఉండేది, పల్లెటూరు అయితే అద్దె తక్కువ ఉంటుందని పల్లెకు మారాము. ఫ్యాక్టరీ విడిచిపెట్టి బయటికి వచ్చేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా దుఃఖం కలిగింది. ఆస్థులు పోగొట్టుకున్నందుకు కాదు ఎందుకంటే ఆవి నేను సంపాదించిన ఆస్థులు, మళ్ళీ నేను సంపాదించుకోగలను, కాని పెంచుకున్న మొక్కలు పోగొట్టుకుంటున్నందుకు, అల్లుకున్న ఆత్మీయతాను బంధాలు పోగొట్టుకున్నందుకు గుండెలవిసిపోయేలా దుఃఖించాను. అందుకే అప్పట్నుంచి నా భర్త నన్ను మొక్కలు పెంచుకోవద్దంటాడు. ‘ఒకవేళ విడిచిపెట్టాల్సివస్తే నువ్వు ఏడ్చేస్తావు. వద్దు’ అంటాడు.
ఈదశలో నా దగ్గర అంతకు క్రితం పనిచేసిన వాచ్ మెన్ కమ్ హెల్పర్ వచ్చి AP SFC వాళ్ళు ఫ్యాక్టరీలో కొన్ని వస్తువులు పోయాయనీ, అందుకోసం నామీద కేసు పెడతామన్నారనీ చెప్పాడు. నా ఫ్యాక్టరీని పంచనామా చెయ్యకుండానే AP SFC సీజ్ చేసింది. అప్పటినుండి 1995 వరకూ మా అమ్మ వాళ్ళక్కడ ఉన్నారు. అప్పడెప్పుడూ ఒక్కసారీ AP SFC వాళ్ళుగానీ, బ్యాంకర్లు గానీ ఫ్యాక్టరీకి రాలేదు గానీ నేను తిరిగి రాగానే మాత్రం ఇలాంటి వార్తలు రావడం మొదలయ్యింది. బహుశః ఈకేసుల భయంతోనే మా అమ్మ చెల్లి, తమ్ముళ్ళు ఫ్యాక్టరీ నుండి 1995 అక్టోబరు లో వెళ్ళిపోయి ఉంటారని అనుకున్నాను. దాంతో నేను “ఏనుగు చచ్చినా బ్రతికినా పదివేలే. నష్టపోయాను కదా అని పిచ్చివేషాలు వేయొద్దని చెప్పు. పెట్టమను కేసుని! నేను ఇలాంటి దానికే ఎదురుచూస్తున్నాను, వాళ్ళేం చేసారో, నేనేం చేశానో అన్నీ బయటికి లాగుతాను. అసలు ఏమయినా ఉంటే ప్రభుత్వ ఆఫీసువాళ్ళు కాగితాలతో కదా మాట్లాడాలి? అంచేత నోటిసు ఇవ్వమను. కావాలంటే నా అడ్రసు చెప్పు వాళ్ళకి. అంతేగానీ ఇలాంటి బెదిరింపు వార్తలు పట్టుకొని ఇంకోసారి నాదగ్గరికి రాకు” అని హెచ్చరించాను. తర్వాత ఏమయ్యిందో తెలియదు గానీ AP SFC వాళ్ళు నాఫ్యాక్టరీని బాలకృష్ణ అనే అతనికి అమ్మారు. ఏపద్దతిలో అమ్మారో నాకు తెలియదు. ఫ్యాక్టరీ నిర్మాణంలో వాస్తుసలహాల కోసం అతడు వచ్చి మాతో పరిచయం చేసుకున్నప్పుడు ఇది మాకు తెలిసింది. చల్లకొచ్చి ముంతదాచి, తరువాత ముంత తీసాడు “మీరు సరే నంటే, ఆ బ్యాటరీ యూనిట్ మిషనరీ అంతా నాదగ్గరే ఉంది, దాంతో మళ్ళీ బ్యాటరీ యూనిట్ ప్రారంభిద్దామా” అని అడిగాడు. మాకు ఆసక్తి లేదని చెప్పి పంపాను.
అప్పటికే ఐ.బి.అధికారి ‘Believe the fate’ అన్నాడు. ఇక మరేమీ ఆలోచించదలచలేదు. సంపూర్తిగా నేనూ నా కుటుంబం, నా ఉపాధి. అంతవరకే మా ఆలోచన్లు. అప్పుడే వివేకానందుడి సూక్తి ‘దేశం నీ సేవల కోసం అర్రులు చాచటం లేదు. నిన్ను నువ్వు ఉద్దరించుకో!’ అన్న సూక్తి చదివాము. ఆ ప్రభావంతో మేం ‘దేశం కోసం ఏదో చేసాం అనుకున్నాం. మనం చేయగలిగినంత చేసాము. మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు, మన వరకూ మనం, ఎదుటివాడికి కీడు చేయకుండా ఉంటే, అదే మనం దేశానికి మేలు చేసినట్లు’ అని అనుకున్నాము. మేం భగవద్గీతని పెట్టెలో పెట్టి దాచేసాము కూడా. కానికొన్ని రోజులకు భగవద్గీత లేకుండా బ్రతకలేమనిపిచింది. మళ్ళీ భగవద్గీతను ప్రాక్టీసు చేస్తూ విద్యాబోధన వృత్తిని చేపట్టాము.
నంబూరు మేజర్ పంచాయితీ. పూర్తిగా వ్యవసాయమే ప్రధానమైన గ్రామం. మాగాణి పొలాలు. అప్పటికీ అక్కడ కొన్ని కులవృత్తులు నడిచేవి. మంగల పొదితో ఇంటికి వచ్చి క్షౌరం చేసివెళతాడు. చాకలి ఇంటికొచ్చి బట్టలు ఉతికిపోతుంది. RMP డాక్టరు, కబురు పెడితే చాలు ఇంటికి వచ్చి వైద్యం చేసి పోతాడు. తగ్గేవరకూ రోజు ఇంటికీ వచ్చి ఇంజెక్షన్లు ఇస్తాడు, మందులూ ఇస్తాడు. చాకలి, మంగలి, డాక్టరు , ప్రైవేట్ స్కూల్ కి అందరికీ సంక్రాంతి పండగప్పుడు, వరిపంట చేతికొచ్చినప్పుడు, రైతులు ధాన్యం కొలుస్తారు. సంవత్సరమంతా చేసిన సేవకు, సంవత్సరానికి సరిపడా ఒకేసారి చెల్లింపు జరుగుతుంది. ఇలాగేకాక అప్పటికప్పుడు డబ్బులు చెల్లించే పద్దతి కూడా ఉంది. మంగలి షాపులు, డిస్పెన్సరీ, ఇంగ్లీషు మీడియం స్కూల్, కాలేజీ, ఒకరకంగా ‘పెద్ద గ్రామపంచాయితి’ స్థితి ఉంటుంది.
ఈదశలో జీవితం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించాము. నాకు బ్యాటరీ తయారీ – గ్యాస్ వెల్డింగ్ దగ్గర నుండి, అన్ని పనులూ వచ్చు. టెండర్లు వెయ్యటం దగ్గరనుండీ administration అంతా వచ్చు. 1989 లో బొంబాయి [అప్పటికి అలాగే పిలిచేవారు] శాంతాక్రజ్ లో ఉన్న Standard Batteries లో శిక్షణ పొందాను. ఫ్యాక్టరీ నడిపిన అనుభవంతో నేను మల్టీనేషనల్ కంపెనీ లయిన Amco, Exide వంటి Battery unit లో జాబ్ కు ఆప్లై చెయ్యవచ్చు. ఎటువైపు ప్రయాణిద్దాం అని, నేను నా భర్త బాగా ఆలోచించాము. డబ్బుకావాలి, అలాగే జీవితంలో ప్రశాంతతా కావాలి. ఫ్యాక్టరీ నడిపిన అనుభవంతో నాకు తెలుసు కార్పోరేట్, మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం అంటే జీవితంలో ఎంత హడావుడీ, పరుగు నిండిపోతుందో. దాంతో తెగ ఆలోచించాము. ’రేపు మా పాపాయి పెద్దయ్యాక “ఉత్తి ప్రేమ ఏంచేసుకోను? ఫలానా నా ఫ్రెండు వాళ్ళ అమ్మానాన్న చూడండి. కార్లు మేడలూ ఇచ్చారు” అనకూడదు. అలాగని “ఎంత డబ్బుంటే మాత్రం ఏమిటీ? ఒక్కరోజు నువ్వు నాతో ప్రేమగా మాట్లాడావా? తీరిగ్గా నాతో గడిపావా?" అనకూడదు’ అనుకున్నాం. కాబట్టి జీవితంలో కొంత డబ్బుకావాలి, కొంత ప్రశాంతతా కావాలి అనుకున్నాము. మాకు ఆ పల్లెటూరు బాగానే ఉందనిపించింది. అక్కడ ఓ కమిటీ కాలేజీ ఉంది. అందులో నేను పార్ట్ టైం లెక్చరర్ గా చేరాను. నా భర్త గుంటూరులో [14 కిలోమీటర్లు] ఓ యాడ్ ఏజన్సీలో రెప్రజెంటేటివ్ గా చేరాడు. ఆ పైన పిల్లలకి ట్యూషన్లు చెప్పేదాన్ని. మా పాపకి పదిహేడేళ్ళు వచ్చేటప్పటకి ఆవూళ్ళో ఐదు ఎకరాల పొలం కొనుక్కోగలిగితే చాలు. ప్రశాంతంగా బ్రతికేయవచ్చు అనుకునే వాళ్ళం. అయితే జీవితం మనచేతిలో ఉండదు కదా!
1996 ఏప్రియల్ లో, నంబూరులో పిల్లలకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ ఇచ్చాను. 13 మంది విద్యార్ధులకి శిక్షణ ఇస్తే అందులో 7 గురికి మంచి సీట్లు వచ్చాయి. దాంతో తొలిసంవత్సరం కెరీర్ బాగా ఉంది. అప్పట్లో మాధ్యాస మా పాప, మా కెరీర్ అంతే. మేము ఒక పెంకుటింటిలో చేరిన రెండు నెలలకే ఇల్లు ఖాళీ చెయ్యమని చెప్పాడు మా ఓనర్. కారణం మాత్రం మేమే ఈ ఇంట్లో ఉంటాము, వెంటనే ఖాళీ చెయ్యండి అని చెప్పాడు. తరువాత మేం ఒక మేడ మీది ఇంటికి మారాము. ఎదురుగా గుడి, వరండాలో కూర్చుంటే చెరువు కన్పిస్తుంది. ఫర్వాలేదు అద్దె పెరిగినా, ఇల్లు బాగానే ఉంది అనుకున్నాము. అద్దె 350/- రూ.
అయితే మలి సంవత్సరం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రోజులు వచ్చేసరికి నంబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి ఒక కొత్త లెక్కల మాస్టారు బదిలీ అయ్యివచ్చాడు. అతడు అక్కడ 10th చదువుతున్న విద్యార్ధులని తన దగ్గరే ట్యూషన్ చెప్పించుకోవాలని పరోక్ష ఒత్తిడి చేశాడు. [అప్పటికి నేను 10th విద్యార్ధులకి ట్యూషన్ చెప్పడం లేదు. ఇంటర్ పిల్లలకీ ట్యూషన్ చెప్పడంతో నాకు సమయం మిగిలేది కాదు.] అలాగే ఆ లెక్కల మాష్టారు 10th పరీక్షలయ్యాక పిల్లల్ని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ కి నాదగ్గరికి రాకుండా ఆపాడు. అలాగని అతడూ చెప్పలేదు. పిల్లలు కోచింగ్ కోసం ఊరు దాటి వెళ్ళలేదు. అతడేం చెప్పాడో తెలియదు గానీ, మొత్తానికి ఆ ఊర్లో ముందు సంవత్సరం 13 మందిలో 7 గురికి సీట్లు వచ్చినా, వారిలో కొంత మంది పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకుంటున్నా కూడా, ఆ సంవత్సరం నాదగ్గర చేరిన విద్యార్ధులు ఇద్దరే. చివరికి ఒక్కరే నిలబడ్డారు. తర్వాత తెలిసింది అ మాస్టారు ఉచితంగానే చెప్తానన్నాడనీ, కూర్చోబెట్టి ఊరికే చదివించాడని, ఎవరికీ సీట్లు రాలేదన్న విషయం. అలా అతను ఎందుకు ప్రవర్తించాడో నాకు అర్ధం కాలేదు, నాకు ఆశ్చర్యం కలిగింది. విద్యాబోధన కెరీర్ అలా ఉంటే, మరో ప్రక్క మా ఇంటి ఆవరణలో గొడవలు ఎక్కువయ్యాయి. మాఇంటి ఓనర్స్ గుంటూర్లో ఉండేవాళ్ళు. క్రిందివాటాల్లో ఉండేవాళ్ళతో నేను మామూలుగానే ఉండేదాన్ని. ఎదురుపడినప్పుడు “ఏమండీ పనయ్యిందా! పిల్లలు స్కూలుకెళ్ళారా?....." లాంటి పిచ్చాపాటి మాట్లాడి నాపనిమీద నేనుఉండేదాన్ని. ఖాళీ సమయం దొరికితే నా పాపతోనూ, పుస్తకాల తోనూ గడిపేదాన్ని. క్రింది వాటా వాళ్ళు అరుగుమీద చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అందులో నేను పాల్గొనక పోవటం ’నాకు గీర’ అన్న బిరుదునిచ్చింది. ఆ రుసరుసలతో మాకు మంచినీళ్ళు ఇవ్వకుండా వేధింఫు మొదలుపెట్టారు. ఈ అనుభవంతో, తర్వాత నేను చుట్టుప్రక్కల వాళ్ళతో మరికొంత చనువుగా ఉన్నా, సఖ్యత నడవలేదు. నేను వాళ్ళతో చనువుగా ఉన్నా, అంటిముట్టనట్లుగా ఉన్నా, ఎలాగున్నా సరే, వాళ్ళు గొడవపెట్టుకోదలుచుకుంటే పెట్టుకుంటారు అన్న విషయం అనుభవంతో నేర్చుకున్నాను.
టాల్ స్టాయ్ కధ, సింహం – గొర్రెపిల్ల లో చెప్పినట్లు –
ఓ రేవులో సింహం నీళ్ళు తాగుతుంటుంది. ఓ గొర్రెపిల్ల ప్రవాహపు దిగువున నీళ్ళు తాగుతుంది.
సింహం “ఏమే గొర్రెపిల్లా! నేను తాగే నీళ్ళని ఎంగిలిచేసావు. కాబట్టి ఇప్పుడు నిన్ను చంపేస్తాను” అంది.
గొర్రెపిల్లా “నేను మీకు దిగువున నీళ్ళు తాగుతున్నాను. నా ఎంగిలి నీళ్ళు మీదగ్గరికి ఎలా వస్తాయి?" అంది.
సింహం “అయితే ఆరునెలల క్రితం నువ్వు నాకు ఎగువున నీళ్ళు తాగావు. అందుకు ఇప్పుడు నిన్ను చంపబోతున్నాను” అంది.
గొర్రెపిల్ల “అయ్యో! ఆరు నెలలు క్రితం నేను పుట్టనైనా లేదు. మా అమ్మ బొజ్జలో ఉన్నాను” అంది.
దానికా సింహం గుర్రుమంటూ “అప్పుడు మీ అమ్మ నానీళ్ళు ఎంగిలి చేసింది. అందుకు నిన్ను చంపుతున్నాను” అంటూ గొర్రెపిల్ల మీదకి దూకింది.
ఈ కథ అనువర్తనని నా జీవితంలో చాలా సార్లు అనుభవించాను.
మొత్తానికి క్రిందివాటాల వాళ్ళుతో నీళ్ళ సమస్య, కరెంట్ సమస్యలు ఉండేవి. క్రింది మూడు వాటాలకు కలిపి main meter ఉండేది. మా సబ్ మీటరు కాలిన కరెంట్ కంటే main meter లో కాలిన కరెంట్ చాలా తక్కువ ఉండేది. వాళ్ళు నెలాఖురులోపు మీటరు రిడింగ్ సరిచేసేవాళ్ళు. ఈ మోసాన్ని పట్టుకున్న తరువాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇలా నీళ్ళు, కరెంట్ గొడవులతో ఆ పల్లెలో ఉండటం అనవసరం అన్పించింది. అప్పటికి పోలీసు కేసులయ్యాయి. పోలీసు కేసుల దాకా వద్దు అని మేము అనుకున్నా, వాళ్ళు మా వస్తువులని దొంగిలించి పాత ఇనపసామాన్ల వాళ్ళకు వేసేవాళ్ళు. వాళ్ళని కట్టడి చెయ్యటానికి అనివార్యంగా పోలీసు కేసు పెట్టడం తప్పనిసరి అయ్యింది. మేము అక్కడికి వచ్చేదాకా పరిస్థితులు లాగబడేవి.
అప్పటికి కార్పోరేట్ కాలేజిల్లో లెక్చరర్లకి మంచి జీతాలున్నాయన్న విషయం నా దృష్టికి వచ్చింది. దాంతో గుంటూరులోని కార్పోరేట్ కాలేజిల్లో జాబ్ కోసం ప్రయత్నించాను. వికాస్ జూనియర్ కాలేజిలో కొన్ని గంటలు, వీనస్ లో కొన్ని, అరోరా కాలేజిలో ఒకగంట క్లాసులు సంపాదించాను. ఒకటి రెండునెలలు నంబూరు నుండి గుంటూరు up and down చేశాక గుంటూరులో ఇంటి అద్దెలు భరించగలనన్న నమ్మకం కలిగాక మకాం గుంటూరుకు మార్చాము. కాలేజీ వెనుకనే మా ఇల్లు ఉండేది. ఎందుకంటే అప్పటికి మా పాప చిన్నదికావటంతో కాలేజికి దగ్గరిలోనే ఇల్లు ఉండేటట్లు చూసుకునేవాళ్ళం.
ఒకసారి కార్పోరేట్ కాలేజిల రంగంలోకి అడుగుపెట్టాక అక్కడి పద్దతులు అర్ధం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. టిచింగ్ అవర్స్, స్టడీ పీరియడ్స్, ఆయా క్లాసుల్లో ఆర్గనైజ్ చేసే తీరు అన్నీపరిశీలించేదాన్ని. మొదట్లో విద్యార్ధులకి క్లాసులు నిర్వహించేతీరు, క్రమశిక్షణ, హార్డ్ వర్కు చేయించటం నాకు చాలా నచ్చాయి. లెక్చరర్స్ గా మేం లెసన్స్ చెప్పాక పిల్లలు doubts తీర్చుకునే తీరు, ఖరిదైన environment అన్నీ బాగా ఉన్నాయనిపించింది. రోజులు గడిచే కొద్దీ కార్పోరేట్ కాలేజిల్లోని advantages తోపాటు disadvantages కూడా అర్ధం అయ్యాయి. డైరక్టర్స్ కి, కొందరు మహిళా లెక్చరర్స్ కీ మధ్య ‘ఇంకేదో సన్నిహిత సంబంధాలుండేవి.’ స్టాఫ్ రూంలో వ్యంగ్యాస్త్రాలు వెయ్యడం స్యయంగా చూసి నోరెళ్ళపెట్టాను. అప్పటివరకూ అలాంటి వ్యవహారాలు రాజకీయరంగంలో విన్నాను, మరికొన్ని రంగాలు గురించి విన్నాను. కానీ స్వయంగా విద్యారంగంలో చూసేసరికి ‘వీళ్ళు పిల్లలకి నేర్పగలిగేది ఏముంది’ అనిపించింది. ఎంతో నమ్మకంగా, వేలకు వేలు కట్టి తల్లితండ్రులు పిల్లల్ని అక్కడ వదలిపెడుతున్నారు. ‘రాత్రికి మందుకొట్టే మగ వార్డన్ల పర్యవేక్షణలో, లెక్చరర్లకీ డైరక్టర్లకీ మధ్య అనుబంధాల గురించి ముచ్చట్లు చెప్పుకునే ఆడవార్డన్ల పర్యవేక్షణలో, ఈపిల్లలు ఏం చదువుకుంటారబ్బా’ అనుకునేదాన్ని. అయినా ‘నైతికత అన్నది వ్యక్తిగత సంస్కారం. మనమేం అంటాం’ అనుకొని ‘మూగచెవుడు గుడ్డితనం’ ఉత్తమం అన్నట్లు ప్రవర్తించేదాన్ని. తమ సందేహాలు తీర్చే లెక్చరర్స్ తో పిల్లలు ఆత్మీయంగా ఉంటారు. నిజానికి విద్యా బోధనలో మేం సంతోషంగా గడపటానికి కారణం కూడా ఇదే. బి.ఎస్సీ. నుండి నర్సరీ క్లాసు వరకూ ఎవరికి చదువుచెప్పినా మా అనుభవం ఒకటే. ఆ పిల్లలు మాపట్ల ఎంతో ప్రేమని చూపిస్తారు. ఫీజు ఇస్తారు. ఎదురు ప్రేమనీ, గౌరవాన్నీ ఇస్తారు. మనం నేర్పే ఙ్ఞానాన్ని ఆసక్తితో, ఇష్టంతో నేర్చుకుంటారు. పాఠం అర్ధమైందన్న కృతఙ్ఞత చూపిస్తారు. మొత్తంగా, డబ్బుకి అతీతమైన అనుబంధం గురుశిష్యుల మధ్య ఉంటుంది. గురువుగా మేం పిల్లల్ని ప్రేమతోనూ, వాత్సల్యంతోనూ చూస్తాం. శిష్యులుగా పిల్లలు మాపట్ల గౌరవాన్ని, కృతఙ్ఞతనీ, ప్రేమనీ చూపిస్తారు. అందుకే ఎన్నిగొడవులున్నా విద్యాబోధన వృత్తిని నేను, నా భర్తా బాగా ఆనందించాం.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
1 comments:
:-
Post a Comment