మొదటిసారి నేను వై.ఎస్.రాజశేఖరరెడ్డిని, అతడి ఇంటిలోని ఆఫీసు రూమ్ లో కలిసినప్పుడు, అతడు ఫోనులో హోం డిపార్ట్ మెంట్ సెక్రటరీని, పులివెందులలో తనని, తనవారిని ఇబ్బంది పెడుతున్న ఓ పోలీసు ఎస్.ఐ.ని బదిలీ చెయ్యవలసిందిగా Request చేస్తున్నాడు. అతడి సంభాషణని బట్టి ఫోనులో అవతల ఉన్నది హోంశాఖ కార్యాలయంలోని ఉన్నతాధికారి అని అర్ధమయ్యింది. దాంతో, నేదురమల్లి జనార్ధన రెడ్డి హయాంలో ఇతడు సమస్యలెదుర్కొంటున్నాడని నేను అనుకున్నాను. ముందు జాగ్రత్తగా నేను, అసలు నాదగ్గర ఉన్న విషయమేమిటో చెప్పకుండా, నన్ను నేను పరిచయం చేసుకొని, ఆర్.టి.సి.లోని నాసమస్య గురించి, ఆర్.టి.సి.E.D. మీద నేను పెట్టిన ఫిర్యాదుగురించి చెప్పి, నాకు సహాయం చెయ్యవలసిందిగా అర్ధించాను. నా విజిటింగ్ కార్డు వెనుక నా రిక్వెస్ట్ క్లుప్తంగా వ్రాసి ఇచ్చాను. అతడు ప్రయత్నిస్తానన్న హామీ ఇచ్చాడు. ఇతడు రాయపాటి సాంబశివరావులాగా నెగిటివ్ మాటలు మాట్లాడనందుకు [లంచగొండులని ఎవరూ ఏమీ చెయ్యలేరు, అవినీతే గెలుస్తుంది గట్రా అన్నమాట] నేను కొంత సంతృప్తి చెందాను.

కొన్ని రోజులాగి మళ్ళీ అతడి ఇంటికి వెళ్ళాను. రెండోసారి అతడి ఆఫీసు రూమ్ లో కలిసినప్పుడు అతడి ఇంటికి వచ్చిన సందర్శకులలో ఓ వృద్ధపేదమహిళ ఉంది. ఆమె తనకు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసేందుకు, మందులకూ సహాయం చేసినందుకు అతడికి కృతఙ్ఞతలు చెప్పుకుంటోంది. ఈసారి నేను నా మునుపటి అభ్యర్ధన గురించి గుర్తుచేసాక, నా ప్రస్తుత బస, టెలిఫోన్ నంబర్ [అప్పటికి సెల్ ఫోన్లు లేవు] రిఫర్ చేస్తూ ఈనాడులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నాస్నేహితురాలి ఇంటిలో నేను బస చేస్తున్నానని చెప్పాను. అది వినగానే అతడి ముఖంలో కొంత మార్పు కనిపించింది. నా కేసు పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తూ అప్పటికప్పుడే సెక్రటేరియట్ కి ఫోన్ చేసి నా కేసు గురించి విచారించాడు. [అప్పట్లో నా ఫిర్యాదు సీ.ఎం. సెక్రటరీల్లో ఒకరైన రేమండ్ పీటర్ కి మార్క్ అయ్యింది. తర్వాత చక్రవర్తి అనే ఐ.ఎ.ఎస్.కి far ward అయినట్లు గుర్తు.]

తర్వాత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తాను దాన్ని తర్వాత follow up చేస్తానని నాకు హామీ ఇచ్చాడు. అతడి పి.ఏ. ఈ విషయాన్ని వ్రాసుకోవటం చూసాను. కృతఙ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాను. మూడోసారి నేను అతణ్ణి కడపలోని అతడి ఇంట్లో కలుసుకున్నాను. ప్రతీసారి నావెంట నాచిన్న తమ్ముడు ఉండేవాడు. ఈసారి నాపెద్ద తమ్ముణ్ణి తీసుకొని కడప వెళ్ళాను. నేను కడపలోని అతడి ఇంటికి చేరుకున్నప్పుడు నా విజిటింగ్ కార్డు ఇస్తూ నేను, వై.ఎస్. గురించి ‘ఎప్పుడు వస్తారని’ విచారించాను. వాళ్ళింటిలోని సిబ్బంది ‘అతడు బయట కోఆపరేటివ్ ఎన్నికల హడావుడీలో ఉన్నాడని, మధ్యాహ్నం భోజనం తర్వాత వస్తాడనీ, మధ్యాహ్నం మూడుగంటలు దాటవచ్చని’ చెప్పారు. తర్వాత నా కార్డు తీసుకొని లోపలికెళ్ళాడు. ఆ తర్వాత వై.ఎస్.రాజరెడ్డి బయటకి వచ్చి నన్ను రీసీవ్ చేసుకున్నాడు. ఆ రోజుటి సంఘటనలన్నీ నాకు చాలా స్పష్టంగా గుర్తున్నాయి. అతడు కార్డ్ లెస్ ఫోనులో నాముందే కుమారుడికి ఫోన్ చేసి “ఆ గుంటూరు బ్యాటరీ యూనిట్ అమ్మాయి నిన్ను చూడటానికి వచ్చింది. వెంటనే రా.” అని చెప్పాడు. [భావం ఇది. అతడి ఉచ్చారణ కడప జిల్లా రాయలసీమ యాసలో ఉంది.]

దాదాపు 15 నిముషాల లోపలే రాజశేఖరరెడ్డి ఇంటికి వచ్చాడన్న కబురు విన్నాను. కోఆపరేటివ్ ఎన్నికల నేపధ్యంలో ఉన్న విందు కార్యక్రమాన్ని వదిలేసి ఇంటికి వచ్చేసాడని అర్ధమయ్యింది. ఈ లోపల రాజారెడ్డి నన్ను భోజనం చెయ్యవలసిందిగా ఆహ్వానించాడు. నేను కృతఙ్ఞతలు చెప్పుకొని, సున్నితంగా తిరస్కరించాను. అతడు లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత అటెండర్ నాకు కాఫీ తెచ్చి ఇచ్చింది. వాళ్ళకి నేను, నా రిఫరెన్స్ గుర్తున్నందుకు నేను కొంత సంతృప్తి చెందాను. నాకు వాళ్ళిచ్చిన ట్రిట్ మెంట్ కి ఆనందించాను.

ఈ లోపు రాజశేఖర్ రెడ్డి ఆఫీసు రూమ్ లోకి వస్తూ నన్ను పిలిపించాడు. నేనూ, నా సోదరుడూ, రాజశేఖరరెడ్డి తప్ప ఆ రూములో ఇంకెవ్వరూ లేరు. దాదాపు ఏదో రహస్యం రిసీవ్ చేసుకోబోతున్నట్లుగా, ఆసక్తి కనబరస్తూ రాజశేఖర్ రెడ్డి “చెప్పమ్మా!” అన్నాడు. కొన్ని నిముషాల పాటు ఏకబిగిన రామోజీరావు గురించి నాకు తెలిసిన వివరాలు, నా అనుమానాలు, విశ్లేషణలూ చెప్పాను. ఈ విషయాలన్నీ ప్రధానమంత్రి దృష్టికి తీసికెళ్ళాలనుకుంటున్నాననీ, అందుకతడు సహాయం చెయ్యాలని అర్ధించాను. దానికతడు “ఇదంతా నిజమేనమ్మా! ఇందుకు మీదగ్గర ప్రూఫ్ ఏమన్నా ఉందా?” అని అడిగాడు.

నేను “లేదండీ!” అన్నాను. అప్పుడతడి ముఖంలో కన్పించిన నిరాశ నాకు స్పష్టంగా గుర్తుంది. అదే విషయాన్ని ఒకటికి రెండుసార్లు నొక్కి అడిగాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత “ప్రూఫుల్లేకుండా మనమేం చెయ్యలేమమ్మా! ఎవ్వరూ మనల్ని నమ్మరు. ఏకొంచెం ప్రూఫుల్లున్నా మనం ముందు కెళ్ళచ్చు. ఫారిన్ విజిటర్స్ వస్తారంటున్నావు కదా, వారు వచ్చినట్లు, వాటికి సంబంధించిన స్లిప్పులు లాంటివి ఉన్నా సరే!” అన్నాడు. నాదగ్గర ఇంకా ఏవో నిర్ధారణలు [ప్రూఫ్స్] ఉండి ఉండొచ్చు అన్న ఆశ అతడి కళ్ళల్లోనూ ముఖంలోనూ ఉన్నట్లనిపించింది నాకు. కానీ అప్పటికి నాదగ్గర తార్కిక విశ్లేషణ తప్ప నిర్ధారణ పత్రాలో, ఫోటోలో , వీడియోలో లేవు. [అసలలాంటివి సామాన్యులకి ఎలా లభిస్తాయి? ఎవరైనా వీడియో కెమెరాలు పెట్టుకొని, ఫోటోగ్రాఫర్ కి ఫోజులిచ్చి కుట్రలు పన్నుతారా?] దాంతో నేను నా నిస్సహాయతని వెల్లడించాను. ప్రూఫుల్లేకుండా ప్రధాని దగ్గరికి తీసికెళ్ళటానికి అతడు తన నిస్సహాయత వెల్లడించాడు. ఇక నేను సెలవు తీసుకొని లేచాను. నాతోపాటే ఆఫీసు రూమ్ లోంచి బయటికి వచ్చిన వై.ఎస్.ఆర్. మరోమారు నన్ను హెచ్చరిస్తూ ,[రామోజీరావు కార్యకలాపాలని నిరూపించేందుకు] “ఏమాత్రం ప్రూఫ్ దొరికినా తప్పుకుండా రామ్మా!” అని చెప్పి send-off ఇచ్చాడు.

ఈ మొత్తం సంఘటనలతో నేను కొంత సంతృప్తి, ఆత్మవిశ్వాసం పొందాను. విషయాన్ని పీ.ఎం. దృష్టికి తీసికెళ్ళగలనన్న ధైర్యం వచ్చింది. నేను చెబుతున్న విషయం నమ్మశక్యంగానే ఉన్నదనీ, చెబుతున్న నన్ను చూసి ’పిచ్చిది’ అని ఎవరూ అనుకోరనీ నమ్మకం కలిగింది.

ఇకదాంతో ఢిల్లీ బయలుదేరాలని నిర్ణయించుకున్నాను.

1992 నాటికి, వై.ఎస్.రాజశేఖరరెడ్డికి నేను ప్రూఫ్స్ గాని ఇచ్చిఉంటే అతడేమీ చేసిఉండేవాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు, 2009 నాటికి ఈ 17 సంవత్సరాల పరిశీలన, కొన్నిసార్లు అతణ్ణి కలిసి మాట్లాడిన అనుభవం తర్వాత, నాకు అర్ధమయ్యిందేమిటంటే – అలాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అవి అడ్డంపెట్టుకొని అతడు రాజకీయంగా ఎదిగేందుకు రామోజీరావుతో బేరం పెట్టుకొని ఉండేవాడని.

ఎందుకంటే 2004 నుండి ప్రూఫ్స్ తో సహా నేను అప్రూచ్ అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ “నేను enquiry చేస్తాను”, "కేసు సంగతి తర్వాత చూద్దాం. ముందు మీయొక్క ప్రస్తుత సమస్య తీరాలి కదా. కాబట్టి రూము సంగతి చూస్తాను” ఇలా అనటమేగానీ చేసింది మాత్రం ఏదీ లేదు. ఆవిధంగా అతడి ప్రవర్తన నా కేసువిషయంలోనూ, రామోజీరావు విషయంలోనూ చాలా ప్రత్యేకంగా, అసాధారణంగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు Documentary Evidence తో సహా, తర్వాత వివరిస్తాను.

ఇక 1992, మే చివరి వారంలో నేను న్యూఢిల్లీ వెళ్ళాను. కొద్దిరోజుల్లో పని పూర్తవుతుందనుకొని to and fro tickets book చేసుకొని వెళ్ళాను. తర్వాత తిరుగు టిక్కెట్లు రద్దు చేసుకున్నాను. ఢిల్లీ చేరింతర్వాత అప్పటికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కుముద్ బెన్ జోషి ఇంటికి వెళ్ళి ఆమెని కలిసాను. 1989 లో ఆమె నా బ్యాటరీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసాక, నేను అప్పుడప్పుడూ రాజ్ భవన్ వెళ్ళి ఆమెని కలుస్తూ ఉండేదాన్ని. రాజ్ భవన్ లోని గవర్నర్ కార్యదర్శి, ఇతర సిబ్బందితో నాకు కొంత పరిచయం కూడా ఉండేది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఆమె నన్ను ప్రోత్సాహించేది గనుక ఆపాటి పరపతి నాకు ఉండేది. ఆ పరిచయంతో, ఆమె ఢిల్లీ వెళ్ళాక కూడా, నేను సంబంధాలను కొనసాగిస్తుండేదాన్ని.

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని డీల్ చేసిన అనుభవంతో, ఈసారి రామోజీరావు గురించి నాకు తెలిసిన విషయాలు, ఇతర వివరాలన్నీ నాలుగైదు గంటల పాటు ‘రైల్ యాత్రీనివాస్’ లోని నా గదిలో కూర్చొని వ్రాసుకున్నాను. అయిదారు పేజీల ఆ రిపోర్టు చివరిలో ఈ విషయాన్ని నాటి ప్రధాని దృష్టికి తీసికెళ్ళెందుకు, ప్రధాని అపాయింట్ మెంట్ పొందేటందుకు సహాయం చెయ్యమనీ అభ్యర్ధన వ్రాసాను. ఇంటివద్ద ఆమెను కలిసి ఆ కాగితాలు ఆమె చేతికిచ్చాను.

దాదాపు 15 నుండి 20 నిముషాల సమయం తీసికొని ఆమె అదంతా చదివింది. ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. మనిషి ఆపాద మస్తకం వణికిపోయింది. “You idiot. Don’t involve in such things. You go and do your business. Otherwise your life will become miserable” అంది. నేను ‘అన్నిటికీ సిద్దంగా ఉన్నాననీ, ప్రధానమంత్రి దృష్టికి రామోజీరావు పనులగురించి ఫిర్యాదు చెయ్యటం అన్న విషయంలో స్థిర నిశ్చయంతో ఉన్నాననీ’ చెప్పాను. ఆమె గద్దింపుస్వరంతో “Can you write your address on these papers?” అని ప్రశ్నిస్తూ ఆ పేపర్స్ నావైపు చాచింది. మరుక్షణం నేనా పేపర్స్ అందుకొని నాపేరు, చిరునామా, టెలిఫోన్ నంబరు వ్రాసి ఆమె చేతికిచ్చాను. అపరిమితమైన కోపంతోనూ, ఎర్రబారిన ముఖంతోనూ, ఆమె ఆ పేపర్లని నేను కూర్చొని ఉన్న సోఫామీదకి విసిరి, వణుకుతున్న కంఠస్వరంతో “ You go and meet your A.P. P.M. Next time, don’t come to me with such issues” అన్నది. మరుక్షణం ఆగది లోంచి లోపలికెళ్ళిపోయింది.

నేను చాలా నిరాశకి గురయ్యాను. నా హోటల్ గదికి తిరిగి వచ్చేసాను. ఒకటి /రెండు రోజులు ఆలోచిస్తూ గడిపాను. నిరాశగా, నిరుత్సాహంగా అన్పించింది. ప్రధానమంత్రిని కలిసి రామోజీరావు మీద ఫిర్యాదు చేయాలో, గమ్మున నా వ్యాపారం నేను చూసుకోవాలో తేల్చుకోలేకపోయాను. ఈ అసందిగ్ధంతోనే, తర్వాతి రోజు DST [Department of Science & Technology] కి, [నా వ్యాపార పని నిమిత్తమై] బయలుదేరాను. అక్కడికి DTC బస్సులో ప్రయాణిస్తున్నాను. బస్సు చాలా రద్దీగా ఉంది. కూర్చొనేందుకు సీట్లులేవు. ముందు వైపు నిలబడి ఉన్నాను. నాలాగే కొందరు మహిళలు, కాలేజీ అమ్మాయిలు డ్రైవర్ సీటు వెనుకాల నిలబడిఉన్నారు. ఒకతను ఆ మహిళల వెనకే నిలబడ్డాడు. నేను వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్నాను. అతను కాలేజీ యువతులని ఆనుకొని నిలబడ్డాడు. బస్సు కండక్టర్ అతణ్ణి వెనక్కి వెళ్ళి నిలబడమని చెప్పాడు. DTC [Delhi Transport Corporation] బస్సులో మహిళల కోసం ప్రత్యేకంగా సీట్స్ ఉండేవి కావు. అయితే నిలబడి ప్రయాణించేటప్పుడు మహిళలు, పురుషులు వేరువేరుగా నిలబడి ప్రయాణించేవాళ్ళు. కండక్టర్ ఎన్నిసార్లు చెప్పినా అతడు పెడచెవిన పెట్టడమే గాకుండా, మహిళల మీద పడుతున్నాడు. కావాలని తాకుతూ అల్లరి పెట్టటం మొదలుపెట్టాడు. కండక్టర్ తో వాదనకి దిగాడు. నేనిదంతా గమనిస్తూ, నిలబడి ఉన్నాను. హఠాత్తుగా డ్రైవర్ బస్ ని ప్రక్కకి తీసి ఆపి దిగిపోయాడు. నిముషం గడిచిందో లేదో ఇద్దరు పోలీసులు వచ్చి, అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతణ్ణి లాక్కొని తీసుకెళ్ళారు. రద్దీగా ఉన్న బస్సులోంచి బయటికి తొంగి చూసాను. బస్సు పోలీసుస్టేషన్ ముందు ఆగి ఉంది. తర్వాత 5 నిముషాలకి డ్రైవర్ తిరిగివచ్చి బస్సు నడపటం ప్రారంభించాడు.

ఇదంతా జరిగి, నేను DST చేరేసరికి నా ఫైల్ చూస్తున్న సంబంధింత అధికారి, వారం సెలవు పెట్టి స్వంత రాష్ట్రం పోయారట. వారం తర్వాత రమ్మని చెప్పారు. చేసేది లేక వెనుదిరిగి హోటల్ గది చేరుకున్నాను. ఎందుకనో మనస్సులోంచి బస్సు డ్రైవర్ సంఘటన పోవటం లేదు. అప్పట్లో నాకున్న అలవాటు ప్రకారం, కళ్ళు మూసుకొని భగవద్ధ్యానం చేసి, నాకు మార్గం చూపాల్సిందిగా దేవుణ్ణి కోరుకుంటూ భగవద్గీత తెరిచాను. నాకళ్ళెదురుగా ఉన్న

శ్లోకం:
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథా న్యానపి యోధవీరాన్
మయా హతాంస్త్వం జహి మావ్యథిష్టాః
యుధ్యస్వ జేతా సి రణే సపత్నాన్

భావం:
ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాదివీరులందర్నీ నేను పూర్వమే చంపివేశాను. నాచేత చచ్చినవారినే నువ్విప్పుడు చంపబోతున్నావు. ఆధైర్యం మాని, యుద్ధం చెయ్యి. శత్రువులను జయిస్తావు.


భగవద్గీతలోని ఈ శ్లోకం, భావం చదవగానే నాలో ఉత్సాహం, ధైర్యం, తెగువ నిండాయి. నన్ను నేను ఉత్సాహ పరుచుకున్నాను. నాలో నేను “కేవలం భగవంతుడి చేతిలో ఓ పనిముట్టుని నేను. నేనెందుకు వత్తిడి పడాలి? ఏది జరగబోతోందో, అది ఎటూ జరిగితీరుతుంది. భగవంతుడు నాకు ఈ పని చెయ్యమనే చెబుతున్నాడు. కాబట్టే DST లో ఆ ఆఫీసర్ నాకు దొరకలేదు. వాస్తవానికి దేశానికి ప్రధానమంత్రి, బస్సుకి డ్రైవర్ వంటివాడే. డ్రైవర్ ఏవిధంగా అయితే తన బస్సులో ఆడవాళ్ళని అల్లరిచేస్తున్న వాడి మీద చర్య తీసికొన్నాడో, అలాగే ప్రధానమంత్రి కూడా ఈ [దుష్టచతుష్టయం] క్రిమినల్స్ మీద చర్య తీసుకుంటాడు. దేవుడు నాకిదే చెబుతున్నాడు. కాబట్టి ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి, అతణ్ణి కలిసి ఈ ఫిర్యాదు ఇస్తాను” అని అనుకున్నాను.

ఈవిధంగా నన్ను నేను సమాయత్తం చేసుకున్నాను. కానీ వ్రాద్దామంటే అక్షరాలు కాగితమ్మీదకి రావటం లేదు. కుముద్ బెన్ జోషికి ఆంగ్లంలో వ్రాసాను. నన్ను నేను పరిచయం చేసుకోనక్కర లేదు గనుక సూటిగా విషయం వ్రాసాను. ప్రధానమంత్రికి నేనెవరో తెలీదు. ‘వివరంగా వ్రాయాలి’ అనుకుంటే కొంత ఆందోళన, వత్తిడి కలిగాయి. స్ఫూర్తి కోసం నెం.1, సఫ్థర్ జంగ్ రోడ్ కి వెళ్ళాను. ఇందిరాగాంధీ హత్యకు గురైన ఇల్లు అది. అక్కడ నేలన జారిపడ్డ ఆవిడ రక్తం, బుల్లెట్ల రంధ్రాలు పడిన ఆవిడ చీర, ఇతర ఫోటోలు చూశాను. నాలో తెలియని ఒకరౌద్రం ప్రవేశించింది. ఈ అన్ని సమయల్లోనూ భగవద్గీత నా చేతుల్లోనే ఉంది.

ఆ రోజు నాకు స్పష్టంగా గుర్తుంది. జూన్ మూడో తేది 1992. రాత్రి 11 గంటలకి రామోజీరావు కార్యకలాపాల గురించి, రాజీవ్ గాంధీ హత్య గురించి, భారత వ్యతిరేక వ్యవహారాల గురించి ఫిర్యాదు వ్రాయటం ప్రారంభించాను. వ్రాయటం, ఫెయిర్ చెయ్యటం పూర్తయ్యేసరికి తెల్లవారి పోయింది. ఆరేడు పేజిల్లో వ్రాసిన ఆ ఫిర్యాదు టెండర్లు పెట్టే కవర్ లో పెట్టి లక్కతో సీల్ చేసాను. కవర్ మీద “This is not my personal. This is very confidential and dangerous. Others should not open this, except PM” అని వ్రాసాను. ఫిర్యాదు మొత్తం తెలుగులో వ్రాసాను.

ప్రధానమంత్రిని సంభోదిస్తూ నా ఊరు, పేరు వ్రాసి నన్ను పరిచయం చేసుకున్నాను.

"ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళో ఓ చిన్న పరిశ్రమ నడుపుకునే అమ్మాయి – అత్యంత రహస్యమూ, అతి ప్రమాదకరమూ అయిన విషయాన్ని తీసుకొని, దేశంలోనే అత్యంత ప్రముఖుడైన ప్రధానమంత్రిని కలిసే సాహసం చేసిందంటే, ఆమె తీసుకొచ్చిన విషయం నిజం కావచ్చేమో అన్న దృష్టితో చూడండి” అని అభ్యర్దించాను. “నేను తెచ్చిన విషయము నిజం కాకపోతే అంతకంటే ఆనందం లేదు. ఒకవేళ నిజమే అయితే? నిజం కాదనుకొని పట్టించుకోకపోతే, అది దేశానికి ఎంత ప్రమాదకరం?" అని హెచ్చరించాను.

ఆ తర్వాత వరుసగా రామోజీరావు గురించి నేను సేకరించిన సమాచారం, నా పరిశీలన అన్నిటినీ పాయింట్లవారీగా వ్రాసాను. చివరిలో వీటన్నిటికి తార్కిక నిర్ధారణ, నిరూపణ తప్ప నాదగ్గర ఇతరత్రా ఋజువులూ, సాక్ష్యాలూ లేనివిషయం చెప్పాను. “ఈ దేశానికి ప్రధానమంత్రి మనుమడూ, మరో ప్రధానికి తనయుడూ తాను స్వయంగా మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీని హత్య చేయించగల వారికి వ్యతిరేకంగా, నాలాంటి సామాన్యురాలు సాక్ష్యాలు సేకరించటం సాధ్యమా” అని ప్రశ్నించాను.

సాక్ష్యాలు లేవు కాబట్టి నిర్లక్షం చేయవద్దనీ, విచారించి నిజం నిర్ధారించుకోవాలనీ ముగించాను. ఈ ఫిర్యాదుతో సీల్డ్ కవర్ తయారు చేసుకొని ప్రధానమంత్రి నివాసం, రేస్ కోర్సు రోడ్ కి బయలుదేరాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

waiting for next one, if we also can be like you, there might be no need for you to travel along.
thanks for making us realized..

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu