ఆ రోజుల్లో [1990] ఇండియా టుడే పక్షపత్రిక వారు హైదరాబాదు పాత బస్తీ మత ఘర్షణలూ, హింసా గురించిన కథనంతో, కవర్ పేజీ ఫోటోతో ఒక ఆర్టికల్ ప్రచురించారు. ఆ కవర్ పేజీ మీద 11 నెలల వయస్సున్న పసిపాప, తండ్రి భుజమ్మీద పడుకున్న ఫోటో ఉంది. ఆ పాప ముఖం మీద కత్తివేటు గాయం ఉంది. దాదాపు 11 కుట్లు పడ్డాయి. ఎడమ కనుబొమ నుండి ముక్కు మీదగా కుడిబుగ్గ వరకూ గాయం వ్యాపించి ఉంది. నల్లని దుస్తుల్లో ఉన్న ముస్లిం పాప. తండ్రి భుజమ్మీద పాప ముఖం పాఠకులవైపు ఉంది. తండ్రి వీపు కన్పిస్తుంది. కొద్దిగా తెరచి ఉన్న గాయం మీద నెత్తుటి చారలో హృదయవిదారకమైన ఫోటో అది. ఆ ఫోటో ఇప్పటికీ మరిచిపోలేను నేను.
అప్పటికి నాకింకా వివాహం కాలేదు. మాచెల్లి పాప చిన్నప్పుడు మా దగ్గర ఉండేది. ఆ బిడ్డంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఇండియా టుడే కవర్ పేజీ మీది పసిబిడ్డ ఫోటో చూడగానే నాకు మా చెల్లి పాపే గుర్తు కొచ్చింది. ఆ ఫోటో చూసి, ఆ ఙ్ఞాపకం తోచి వణికిపోయాను. చాలా బాధగా, దుఃఖంగా అన్పించింది. ఒకవేళ నేనెంతో ప్రేమించే నా చిన్ని బిడ్డే [ఆ పాపని నా పాపే గానే భావించేదాన్ని] ఆ స్థానంలో ఉండి ఉంటే అన్పించింది. ఆ ఆలోచన నా రక్తాన్ని మరగించింది. గుండెని మండించింది. చాలా తీవ్రంగా ఆలోచించాను.
ఆ చిన్ని పాపకి, ముఖం మీద కత్తి గాట్లు పడిన పసిదానికి, 11 నెలలు వయస్సులో ముఖం మీద 11 కుట్లు పడిన బుజ్జిపాపకి అయోధ్యలో గుడి ఉంటే నేమిటి, మసీదుంటే నేమిటి? అయోధ్యలో గుడున్నా, మసీదున్నా ఆమెకొచ్చే లాభమూ లేదా నష్టమూ లేదు. మేలూ లేదు కీడూ లేదు. మరెందుకు ఆ చిట్టి తల్లి అంతటి బాధకు గురవ్వాలి? మన చిన్ని పాపకు జ్వరం వస్తేనే, మర్నాటికి తగ్గిపోతుందని తెలిసినా మంచం ప్రక్కనే కుర్చుంటామే! బెంగపడతామే! అలాంటిది అన్ని కుట్లతో ఎంత బాధ ఆ చిన్ని ప్రాణానికి?
దీనికి తోడు హిందూ ముస్లిం నేతల రెచ్చగొట్టే ఉపన్యాసాలు పేపరు నిండా వచ్చేవి. అప్పటికి మాకు ఈనాడు, మరో ఇంగ్లీషు పత్రికా వచ్చేవి. చాలా లోతుగా తీవ్రంగా ఆలోచించాను. ఆవేశం కొద్దీ, పేజీల కొద్దీ వ్యాసాలు వ్రాసాను. ఆవేశం చల్లారాక ఫైల్లో పెట్టి దాచేసాను. పబ్లిష్ కి పంపే ధైర్యం చేయలేదు. పంపినా ఏ పేపరు వాళ్ళు ప్రచురించరని అప్పటికే నాకు అనుమానం. ఆ వ్రాతల్లో సారాంశం ఏమిటంటే – ‘అయోధ్యలో హిందువుల గుడికడతామని కంకణం కట్టుకున్న వారినీ, మసీదుని పరిరక్షించుకు తీరతామని ప్రతిన బూనిన వారినీ రెండు బ్యాచులుగా విడదీద్దాం. కత్తి యుద్దమో, ద్వంద్వ యుద్దమో చేసుకొమ్మందాం. టెన్నిస్ మ్యాచ్ లో, క్రికెట్ మ్యాచ్ లో నిర్వహించినట్లు ఈ ద్వంద్వ యుద్దాన్ని కూడా నిర్వహిద్దాం. క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ బ్యాచులు వారీగా A,B,C,....... గట్రా గ్రూపుల వారీగా స్టేడియంలలో నిర్వహిద్దాం. స్కోరు లెక్కేద్దాం. టిక్కెట్లు కొని చూద్దాం. ఎవరు ఎన్ని దెబ్బలు ప్రత్యుర్ధుల్ని కొట్టారో, ఎందరు ప్రాణాలు ఒడ్డారో లెక్కగడదాం. క్షతగాత్రులెందరూ, చచ్చిపోయింది ఎందరో పాయింట్లుగా లెక్కిద్దాం. ఎటూ ఈ మత నాయకులంతా అయోధ్యలో మందిరం కోసమో, మసీదు కోసమో ప్రాణాలు అర్పించేటందుకు సిద్దంగానే ఉన్నారు గదా! అలా క్రింది స్థాయి కార్యకర్తలూ, కరసేవకుల దగ్గరనుండి అగ్ర, ఉగ్రనేతల వరకూ ద్వంద్వ యుద్దపు మ్యాచుల్ని నిర్వహిద్దాం. ఎవరెక్కువ పాయింట్ల సాధిస్తే వారి తాలుకూ మందిరమో, మసీదో కడదాం. ఎటూ టిక్కెట్లు అమ్మిన సొమ్ము భారీగానే ఉంటుంది కదా! ఇంకా కావాలంటే స్పాన్సర్లని పెడదాం.
మధ్యలో అమాయకులూ, సామాన్యలూ ఎందుకు బలికావాలి? ఎటూ ప్రాణాలర్పించేందుకు, రక్తం కార్చేందుకు సిద్దంగా ఉన్నారు గదా మతభక్తులు!’ ఇలా వ్రాసుకున్నాను. అప్పటికి నాకు సి.ఐ.ఏ.ల వంటి గూఢచార సంస్థల గురించి తెలియదు. కనీసం సి.ఐ.ఏ. అంటే abbreviation కూడా తెలియదు. అలాగే రామోజీరావు చర్యల గురించి కూడా తెలియదు. అతడి ఈనాడు వ్రాతల గురించి పెద్దగా పరిశీలన లేదు. అందరిలాగే నేనూ పేపర్ లో చూసేదాన్ని, రేడియో వినేదాన్ని, టివీలో వార్తలు చూసేదాన్ని. అందరిలాగే నేనూ ఇదంతా మత ఘర్షణల్లో భాగమనీ, రాజకీయనాయకులు తమ ఓట్లకోసం ఆడుతున్న నాటకమనే అనుకున్నాను. ఇదొక కుట్రనీ, ఓట్లు కంటే ఎక్కువైన పరమ లక్ష్యం – “భారత దేశాన్ని చీల్చడం, సంస్కృతిని నాశనం చేయటం” అనే లక్ష్యం ఉందనీ నాకు తెలియదు.
అయితే 1992 లో, ఈనాడులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నా స్నేహితురాలి ఇంట్లో నేను కొన్ని రోజుల బసచేసాను. ఆ రోజుల్లో రాజకీయాలపై పిచ్చాపాటీగా చర్చిస్తున్నప్పుడు రామోజీరావు హస్తం వీటివెనుక ఉందన్న విషయం నాదృష్టికి వచ్చింది. అదే సమయంలో నా ఫ్యాక్టరీ పనుల నిమిత్తమై [lead acid batteries ని APS RTC, AP Police Transport Org. కి supply చేసేదాన్ని] నాటి ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్ధన రెడ్డి ఇంటికీ [సోమాజీ గూడలో ఉండేది] సెక్రటేరియట్ కీ, వెళ్ళాను. RTC లోని ఓ Executive Director, మరికొందరు ఉద్యోగులు బినామీ పేరుతో [E.D.భార్య పేరుతో] ఓ డమ్మీ బ్యాటరీ ఇండ్రస్టీ నడుపుతూ కొత్తబ్యాటరీల ఆర్డర్లూ, పాత [Scrap] బ్యాటరీల అమ్మకాలూ అన్నీ పేపరు మీదే చూపిస్తు, [ఆర్.టి.సి. నష్టాలలో నడవటానికి ఇవీ కూడా కారణాలే. ఇవీ ఎప్పుడు కార్మిక సంఘాలు బయటపెట్టవు]. మాలాంటి చిన్న ఇండస్ట్రీలకి రావలసిన ఆర్డర్స్ ని తినేస్తున్నందున సదరు ఇ.డి. మీద నేను Complaint పెట్టాను. దాని మీద ఎంక్వయిరీ జరిగిన రీత్యా ఒకటికి నాలుగు సార్లు సి.ఎం. జనార్ధన రెడ్డి చుట్టు తిరగవలసి వచ్చింది. దగ్గరనుండి పరిశీలించిన విషయాలతో నేదురమల్లి జనార్ధనరెడ్డి వెనుక కూడా రామోజీరావు ఉన్నాడని అర్ధమైంది. దాంతో ఈనాడు రామోజీరావు చేస్తోన్న కార్యకలాపాల గురించి స్పష్టత వచ్చింది. దాంతో ఈ ప్రాజెక్ట్ మీద కొన్ని రోజుల పాటు పనిచేసాను. మాటల్లో నాస్నేహితురాలిని రెచ్చగొట్టి మరీ ఆమె బాసు [రామోజీరావు గురించి], నాటి రాజకీయ అంశాల గురించి, అప్పటి సంచలనాల గురించి, పేపర్లో ఆమె, ఆమె సహోద్యోగుల వ్రాతల గురించి, వివరాలు రాబట్టేదాన్ని. తమ Sub Editors Team కి Chairman హోదాలో [అప్పటికి ఆర్.ఎఫ్.సి. కట్టలేదు. బాటసింగారం దగ్గర కొంత భూమి మాత్రమే సేకరించబడింది.] రామోజీరావు తన సిబ్బంది కిచ్చే మార్గదర్శకత్వం గురించి కూపీలాగేదాన్ని. ఇలా నడుస్తుండగా హఠాత్తుగా ఓ రోజామె తన ఇంటి నుండి నన్ను వెళ్ళిపొమ్మని అడిగింది. అప్పటికి పైకారణం ఏదో చెప్పింది లెండి. అందుచేత ఏం అనుకోవద్దనీ అన్నది. నేనూ ఏమనుకోలేదు. సహజమనే అనుకున్నాను, స్నేహపూర్వకంగా వీడ్కోలు తీసుకున్నాను. బహుశః నేను ‘తన నుండి కూపీలేవో లాగుతున్నానని తనకి అనుమానం వచ్చిందేమో, అందుకే నన్ను ఇంటినుండి పొమ్మని ఉంటుంది’ అనుకున్నాను. ఇదంతా 1992 ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగింది.
రాజీవ్ హత్య, మతఘర్షణల వంటి వాటి వెనుక రామోజీరావు హస్తం ఉందనీ, అద్వానీ, వీ.పి.సింగ్, కరుణానిధి వంటి జాతీయ, ఇతర రాష్ట్ర రాజకీయ నాయకులు అతడి చుట్టూ తిరుగుతారనీ తెలిసింది. రాజీవ్ హత్య వెనుక పైకారణంగా ఎల్.టి.టి.ఇ. ఉందనీ అర్ధమైంది. రాజీవ్ అంటే అభిమానం కంటే, నాకు 1990 లోని ఇండియా టుడే కవర్ పేజీ మీది పాప ఫోటో గుర్తుకొచ్చింది. ముఖమ్మీద కత్తిగాట్లతో, కుట్లుతో, బాధతో తండ్రి భుజమ్మీద సొమ్మసిల్లినట్లుగా పడివున్న పాప ఫోటో అది. నాకు చాలా ఆవేశం, క్రోధం కలిగాయి. చాలా ఆలోచించాను. తీవ్రంగా ఆలోచించాను. నిశితంగా పరిశీలించాను.
’రాజకీయ నాయకులకి మీడియా వ్యక్తులకీ సంబంధాలుండటం సహజం. రాజకీయ రంగం, మీడియా పరస్పర ఆధారిత రంగాలు. కాబట్టి ఒకరితో ఒకరికి అవసరాలుండటం సహజం’ అనుకుందామన్నా జాతీయ నాయకులైన వీ.పి.సింగూ, అద్వానీల వంటి వారికీ, ఇతర రాష్ట్రముఖ్యమంత్రులైన కరుణానిధి వంటివారికీ స్థానిక తెలుగు దినపత్రిక ‘ఈనాడు అధిపతి’ రామోజీరావుతో ఏంపని? పోనీ ఏదో పని ఉందనుకున్నా ప్రతీసారి వాళ్ళే ఇతడి చుట్టూ తిరుగుతారేం? ఎన్నడూ రామోజీరావు ఎవరి చుట్టూ తిరగడేం? రామోజీరావు పర్సనల్ గార్డులు అమెరికాలో ట్రెనీంగ్ అయ్యి వచ్చారు. అంత అవసరమా అన్పించింది? 1992 వరకూ రామోజీరావు ఏ రాజకీయనాయకుణ్ణి బహిరంగంగా కలవటం గానీ, బహిరంగ కార్యక్రమాలకి హజరవ్వంటం గానీ చేసేవాడు కాదు. అతడి పేరు ప్రజలకి తెలుసు గానీ అతడెలా ఉంటాడో దాదాపు ఎవరికీ తెలియదు.
దాదాపు ఎవరికీ అతడి ముఖం ఎలా ఉంటుందో తెలియదు. నాకు తెలుసులెండి. ఎలాగంటే 1990 లో నా స్నేహితురాలి పెళ్ళికి అతడు వచ్చాడు. అతణ్ణి రీసివ్ చేసుకొని మర్యాదలు చేయటం అన్న డ్యూటిని నా స్నేహితురాలు నాకు అప్పగించింది. కళ్యాణమందిరం పోర్టీకోలో అతడు కారు దిగుతున్నప్పుడు రిసీవ్ చేసుకొని, అతిధి కుర్చీల్లో కూర్చోన్నాక మంచినీళ్ళు, కూల్ డ్రింకు ట్రేలో అందించాను. అతడు నీళ్ళ గ్లాసు తీసుకున్నాడు. తాగాక గ్లాసు నేను అందుకుందామని ఎదురుగానే నిలబడ్డాను. చటుక్కున వంగి గ్లాసు క్రింద పెట్టేసాడు. “అబ్బా! ఎంత నిగర్వి. అంత గొప్పవ్యక్తి అయి ఉండీ ఎంత సింపుల్ గా ఉన్నాడు!” అని అప్పట్లో చాలా గొప్పగా అనుకున్నాను. తర్వాత రెండేళ్ళకి గాని అతడెంతటి వాడో కొంచెం కొంచెంగా తెలియడం ప్రారంభం కాలేదు.
ఎక్కడ పుట్టాడో, ఎక్కడ చదివాడో ఎవరికీ తెలియదు. ఫలానా పాఠశాలలో లేదా ఫలానా కళాశాలలో అతడు మా సహాధ్యాయి అంటూ ఎవరూ చెప్పగా ఎవరూ వినలేదు. నిరాడంబరం రీత్యా అతడు తన గురించి తాను చెప్పుకోలేదు అనుకున్నా, పైకొచ్చిన ప్రతివాడితోనూ తమకు బీరకాయ పీచు సంబంధమన్నా ఉందని చెప్పుకునే వాళ్ళుంటారు కదా! అలాక్కుడా ఎవరూ ఈనాడు రామోజీరావు ఇంత ప్రసిద్దుడు కాకముందు తమకు తెలుసని గానీ, తమ ఊరివాడని గానీ, తమతో పాటు కలిసి చదువుకున్నాడని గానీ ఎవ్వరూ అనరు. దాదాపు ఆకాశం నుండి సరాసరి సోమాజీగూడ లో పడ్డాడేమో ఈయన అన్నట్లు! అంతేకాదు చివరికి ఇతడి సినిమాలు మయూరి, ప్రతిఘటన మొదలైన వాటికి నంది అవార్డులు వచ్చినప్పుడు కూడా, అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి చేతుల నుండి నంది అవార్డు తీసుకోవడానికి రామోజీరావు గానీ, అతడి కుమారులు సుమన్, కిరణ్ లు గానీ ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఉషా కిరణ్ మూవీస్ తరుపున ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ సభలకు హాజరై నందుల నందుకునేవాడు.
అప్పటివరకూ నేనూ అందరిలాగే ఈనాడు చదివేదాన్ని. నా స్నేహితురాలి మాటలతో ఈనాడుని, రామోజీరావు చర్యల్నీ, వ్రాతల్నీ నిశితంగా పరిశీలించటం మొదలు పెట్టాను. ఆ పరిశీలన నాటినుండి నేటి వరకూ కొనసాగిస్తూనే ఉన్నాను. నా స్నేహితురాలి మేనమామకు పిల్లనిచ్చిన మామ ఈనాడు రామోజీరావుకు ఆడిటరు, ఆంతరంగికుడూ. కాబట్టి ఆమెకి మరికొంత లోతుగా విషయాలు తెలిసి ఉండేవి. వరుసగా నా స్నేహితురాలు చెప్పిన ప్రతీమాట గుర్తు చేసుకొని, వ్రాసుకొని విశ్లేషించుకున్నాను. ఆ ప్రకారం ప్రతీరోజూ ఈనాడు వార్తల్ని, వ్రాతల్ని విశ్లేషించసాగాను. తనింట్లో నేనున్న రోజుల్లో ఓ రోజామె “పేపర్లో వార్తలు వ్రాయడం గురించీ, చదవటం గురించి ప్రతీవాళ్ళు చాలా యధాలాపంగా తీసుకుంటారు. కానీ దాని వెనుక పబ్లిక్ యాటిట్యూడ్ ని ట్యూన్ చేయటం ఉంది. వార్తలు వ్రాసే తీరులోనూ, ప్రెజంటేషన్ చేసే తీరులోనూ మతలబు అంతా ఉంది. మా ఛైర్మన్ రామోజీరావు ఈరోజు స్టాఫ్ మీటింగ్ పెట్టాడు. ఇక చూస్కో! వచ్చేవారంలో అంతా మారిపోబోతోంది” అంది. ఆమాటలకు ఆశ్చర్యపోయాను. మొదట పెద్దగా పట్టించుకోలేదు. ‘ఆఫ్టరాల్, పేపర్ వ్రాతల్లో ఏముంటుంది? పొద్దున్న చదివితే మధ్యాహ్ననికి మరిచిపోయే పేపరు వార్తలు. మధ్యాహ్నమైతే న్యూస్ పేపర్ కాస్త వేస్టు పేపర్ అయిపోతుందన్న నానుడి ఎటూ ఉండనే ఉంది’ అనుకున్నాను. [బహుశః ఇది కూడా ఒక స్ట్రాటజీ. మీడియా మీదకి అనుమానం రాకుండా ఉండటానికి.] కానీ కుతూహలం ఊరుకోనివ్వలేదు. జాగ్రత్తగా జరుగుతున్న సంఘటనలు, ఈనాడు వార్తలు సమాంతరంగా గమనించటం మొదలుపెట్టాను. నిజంగానే ఆమె అన్నట్లే మొత్తం అంతా మారిపోయింది. అదే ఆమెతో అన్నాను.
ఆమె నవ్వేస్తూ “అవునే. మా ఛైర్మన్ దగ్గర అదేదో రసపుటిక్ పవర్ లాంటిది ఉందే! మీటింగ్ కి ముందు ఎంతమనం ‘అలా వార్తలు వ్రాయకూడదు’ అనుకున్న సరే, తీరా మీటింగ్ కి వెళ్ళి మా ఛైర్మన్ స్పీచ్ విన్నాక విరగ రాసేయాలన్పిస్తుంది” అంది.
"పొద్దున చదివితే రాత్రికి మరిచిపోయే పేపరు వార్తలకి అంత ఇంపాక్ట్ ఏముంటుంది?" అన్నాను. నా స్నేహితురాలు “ఓసి పిచ్చి మొహమా! అందరూ అంతే అనుకుంటారు. కానీ మా ఛైర్మన్ ఏమంటారో తెలుసా! “మధ్యాహ్నం అయ్యేసరికి పొద్దుటి న్యూస్ పేపర్ కాస్తా వేస్ట్ పేపర్ అయిపోతుందని అందరూ అనుకుంటారు. పొద్దున చదివితే రాత్రికి మరిచిపోయే వార్తలు అనీ అనుకుంటారు. కానీ ఉదయాన్నే పేపరు నాటే బీజాలు మాత్రం జనాల బుర్రల్లో పెరిగి పెనువృక్షాలైపోతాయి” అంటాడు. మనం పెద్దగా పట్టించుకోం గానీ, ఉదయాన్నే కాఫీ కప్పుతో పాటు అలవోకగా మనం చదివే పేపరు మనవి కాని భావాల్ని మనలో నాటుతున్నదని మనకే తెలియనంత చాకచక్యంగా ఇదంతా జరుగుతుంది” అంది.
చాలా కొత్త విషయం తెలిసింది అన్పించింది నాకు.
తదుపరి నెలల్లో, 1992 మార్చినెలలో అనుకుంటా, తిరుపతిలో కాంగ్రెస్ ప్లీనరీ సభ ఏర్పాటయ్యింది. అప్పటి ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్ధన రెడ్డికి ఈనాడు [abnormal] అసాధారణ ఇమేజిని, కవరేజ్ ని ఇస్తోంది. ఓరోజు ‘ప్రధాని పీ.వి.నరసింహారావు నేదురమల్లి జనార్ధన రెడ్డికి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాడు’ అని వ్రాసారు. తిప్పితిప్పి అదేవాక్యం. పదాలు మార్చి, నానార్ధాలు ఉపయోగించి, నాలుగైదు శీర్షికల క్రింద వ్రాసినది, అన్ని వార్తల సారాంశం అదే. మరో రోజు ‘తిరుపతి ప్లీనరీ సమావేశాలకై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న జనార్ధన రెడ్డి’ అంటూ వ్రాసారు. ప్లీనరీ సమావేశం జరిగే అవిలాల చెరువు దగ్గర మరమ్మత్తు పనులూ, సభావేదికని ఆకర్షణీయంగా, సౌకర్యంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నేదురమల్లి భావిస్తున్నాడనీ, అందుకోసం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నాడనీ చాలా ఫోటోలతో ప్రచురించాడు. ‘జనార్ధన రెడ్డి కాదు ధనార్జన రెడ్డి, రోజుకి అరకోటి సంపాదించకుండా నిద్రపోని ముఖ్యమంత్రి’ అంటూ ఓ రోజు వ్రాసారు. శీర్షిక అదే. లోపల చదివితే జనార్ధన రెడ్డికి ఎంత గ్రిప్ ఉందో, ఎదిరించిన వాళ్ళని ఎలా ఇంటికి పంపిస్తున్నాడో కథలు కథలుగా వ్రాసారు. [ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటి వై.ఎస్. గురించి ఈ రోజు ’ఈనాడు’ వ్రాస్తున్న మాదిరిగానే ఆ రోజుల్లో ’ఈనాడు’ జనార్ధన రెడ్డి గురించి వ్రాసేది.]
ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఓరోజు ‘దిగువ నియ్యబడిన అభ్యర్ధుల జాబితా [కాంగ్రెస్ ఆఫీసు బేరర్ల గురించి] ముఖ్యమంత్రి నేదురమల్లికి, ప్రధాని పీ.వి.నరసింహారావు కీ ఇష్టులైన వారిది’ అంటూ ఓవార్త వచ్చింది. దానిపై మరికొన్ని కథనాలు వచ్చాయి.
ఈ విధంగా, ఈనాడు వ్రాసే దాదాపు అన్ని శీర్షికల్లో, రామోజీరావు తన శక్తివంచన లేకుండా నేదురమల్లి జనార్ధన రెడ్డి కాంగ్రెస్ లో నెం.2 పొజిషన్లో ఉన్నాడనీ, లేదా P.M. కీ, AICC అధ్యక్షుడికీ తర్వాతి స్థానంలో ఉన్నాడనీ ప్రొజెక్ట్ చేసేవాడు. 1982 లో ఎన్.టి.ఆర్.ని ఏవిధంగా తన పేపరు బలంతో నిలబెట్టాడో, అదే పేపరు బలాన్ని నేదురమల్లికి ఉపయోగించేవాడు. అచ్చం ఇప్పటిలాగానే. ఉదాహరణకి [10/03/09] నిన్నటి ఈనాడు పేపరు చూడండి. ముందురోజు మాత్రమే తెదేపాకి, చంద్రబాబుకి కవరేజ్ ఇచ్చారు. అదీకాస్త తక్కువగానే. దాదాపు ప్రతీరోజూ మాత్రం, శీర్షిక పేరు పొగిడినట్లుండనీ, విమర్శించినట్లుండనీ. లోపల వ్రాసేది, ఫోటోలు వేసేది మాత్రం వై.ఎస్.కి పార్టీలో ఎంతోపట్టు ఉందన్నట్లుగానే. మధు యాష్కీ టిక్కెట్ కి ఎసరు పెట్టాడనో, ఎ.పి. భవన్ లో అతడి గది ముందు పడిగాపులు పడుతున్న ఆశావహులనీ రకరకాల ఫోటోలతో ప్రచురించారు. దాదాపు రోజూ ఇదేతంతు. పైకి జగన్ కంపెనీల అవినీతి భాగోతం బయటిపెడుతున్నమన్నట్లే ఉంటుంది. కేంద్రంగానీ, కాంగ్రెస్ అధిష్టానం గానీ ఆ అవినీతి పై కిమ్మనదు. అంతిమంగా సీనియర్ల కంటే, పి.సి.సి. అధ్యక్షుడు డి.ఎస్. కంటే, సి.ఎం.కే గ్రిప్ ఎక్కువ అన్నదే inject చెయ్యబడుతుంది. చివరికి AICC భవనంలో గానీ, అధ్యక్షురాలి ఆఫీసు /ఇంటి ముందుగానీ మూగిన ఆశావహుల గుంపు ఫోటోలూ రాలేదు, వార్తలూ రాలేదు. ప్రతీరోజూ మాత్రం PRP, TDP, TRS లకంటే, డి.ఎస్. ఆఫీసు కంటే వై.ఎస్. ఆఫీసు లేదా ఇంటి ముందు లేదా ఏ.పి.భవన్ లో అతడి రూమ్ ముందే టిక్కేట్లు కోరేవారు బారులు తీరారంటూ ఫోటోలూ, కథనాలతో అతడి బలాన్ని ఈనాడు పేపర్ బలంతో చూపిస్తూ ఉంటుంది. ఇదంతా పరిశీలనగా చూడకపోతే ‘ఈనాడు అంతే తెదేపా కరపత్రంలా ఉంది’ అనుకుంటారు ఎవరైనా.
సరిగ్గా ఇలాంటి స్ట్రాటజీనే ఆ రోజుల్లో 1992 ప్రధమార్ధంలో నేదురమల్లి జనార్ధన రెడ్డి పట్ల ప్రయోగింపబడేది.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు! .
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
అయోధ్యలో హిందువుల గుడికడతామని కంకణం కట్టుకున్న వారినీ, మసీదుని పరిరక్షించుకు తీరతామని ప్రతిన బూనిన వారినీ రెండు బ్యాచులుగా విడదీద్దాం......
భలే అలోచన...
మీ పరిశీలన అద్భుతం.
well said
అద్భుత పరిశీలనా శక్తి !.. శీర్షిక విమర్శిస్తే లోపలి వార్త అందుకు భిన్నంగా వుండేది. హెడింగ్ పొగిడితే లోపల విమర్శ వుండేది. ఇది నాకు చాలా రోజులు అర్థము అయ్యేది కాదు, పొగడ్తలు , విమర్శలు అన్ని కూడా ప్రచారంలో భాగమని.
Post a Comment