ప్రతీ రోజూ తీవ్రమైన విషయాలు చదువుతున్నా నా బ్లాగు చుట్టాలందరికీ నెనర్లు. ఓపికగా వ్యాఖ్యలు వ్రాసి నన్ను ప్రోత్సహించినందుకు కృతఙ్ఞతలు. ఈ ఆదివారం నాడు మీ ఇంటిలోని చిన్నారులకు అమ్మఒడి అందిస్తున్న చిరుకానుక ఇది. మీ పాపాయిలకి, బుజ్జి గాళ్ళకి ఈ కథ చెప్పి ఆనందింపచేస్తారని ఆశిస్తాను.

అనగా అనగా……

ఓ ఊరిలో ఓ అవ్వ ఉండేది. ఓ రోజు ఆవిడ వంట చేద్దామని పొయ్యి వెలిగించి, పొయ్యి మీద కుండ పెట్టింది. కుండలో కొన్ని నీళ్ళు పోసింది. ఎండుపుల్లలు బాగా మండేందుకు గాను కొన్ని బొగ్గు ముక్కలూ, వరిగడ్డి పోచలూ పొయ్యి పక్కన పెట్టుకుంది.

ఇంతలో ఓ గడ్డిపోచ ప్రక్కకు తప్పించుకుంది. ఓ బొగ్గుముక్క కూడా పొయ్యిలో పడకుండా పక్కకు గెంతింది. కానీ అప్పటికే పాపం దాని ఒంటికి కాస్త సెగ అంటుకుంది. అంతలో పొయ్యి మీది కుండలో నీళ్ళు మరగడం మొదలెట్టాయి. అవ్వ చేటలో కొన్ని చిక్కుడు గింజలు తెచ్చి కుండలో పోసింది. పొయ్యి ముందు కూర్చొని మంటెక్కువ పెట్టసాగింది.

ఇంతలో ఓ చిక్కుడు గింజ చేటలోంచి కుండలోని వేన్నీళ్ళలో పడకుండా తెలివిగా ప్రక్కకు జారి తప్పించుకుంది. చిక్కుడు గింజా, బొగ్గుముక్కా, గడ్డిపీచు కూడబలుక్కున్నాయి.

"అమ్మో. ఇక్కడే ఉంటే ఈ అవ్వ మనల్ని చూడకా మానదు. మంటల్లో వెయ్యక మానదు. పారిపోదాం” అనుకున్నాయి. గోడవారగా జరుగుతూ మెల్లిగా అవ్వ ఇంట్లోంచి బయట పడ్డాయి. వీధి ప్రక్కగా నక్కుతూ నక్కుతూ గాలికి కొట్టుకుపోతున్నట్లుగా నటిస్తూ పారిపోవటం మొదలెట్టాయి. అలా అలా వీధి చివరికి వచ్చేసాయి. వీధి చివర వాటికొక కాలువ అడ్డంగా ఉంది. ఆ చిన్న వీధి కాలువ వాటి ప్రాణానికి గంగా ప్రవాహమంత పెద్దగా కన్పించింది.

ఎలాదాటడం? గడ్దిపోచ, బొగ్గు ముక్కా, చిక్కుడు గింజ తీవ్రంగా ఆలోచించసాగాయి.

“ఐడియా!” ఒక్కసారిగా అరిచింది గడ్డిపోచ.

"ఏమిటి?" ఆత్రంగా అడిగాయి బొగ్గుముక్కా చిక్కుడు గింజా.

"నేను ఈ కాలువకి అడ్డంగా వంతెనలా పడుకుంటాను. నామీదుగా దాటండి మీ ఇద్దరూ!” అంది గడ్దిపోచ ఉత్సాహంగా.

"భలే భలే!” మరింత ఉత్సాహంగా అభినందించింది బొగ్గు ముక్క.

" ముందు నేను దాటుతాను” గోముగా అడిగింది చిక్కుడు గింజ.

గడ్దిపోచ కాలువకి అడ్డంగా పడుకుంది. దాని మీదుగా దాటుతూ చిక్కుడు గింజ ఆవలి వైపుకి చేరిపోయింది.

ఇక బొగ్గు ముక్క వంతు వచ్చింది. మెల్లిగా గడ్దిపోచ మీదకి ఎక్కి కాలవ దాటడం మొదలు పెట్టింది బొగ్గుముక్క. దానికి కొంచెం సెగ అంటుకొని ఉందయ్యె. గడ్డిపోచకి అది సోకింది. అప్పటికే బొగ్గుముక్క సగానికి వచ్చేసింది.

"త్వరగా దాటేయ్! నీ సెగకి నేను కాలిపోయేలా ఉన్నాను” గాబరా పడింది గడ్డిపోచ.

కంగారుగా కిందికి చూసింది బొగ్గుముక్క. సన్నని గడ్డిపోచపై తాను. క్రింద పారుతున్న నీళ్ళు. దెబ్బకి దానికి కళ్ళు తిరిగాయి. కాళ్ళు తడబడ్డాయి. కదల్లేక పోయింది. అది ఒకేచోట ఆగిపోయేసరికి, దాని సెగకి గడ్డిపోచ కాస్తా మధ్యకి తగలబడింది. దెబ్బకి కాలువలోకి రెండు ముక్కలుగా విరిగిపోయింది. దాంతో బొగ్గుముక్క నీళ్ళల్లో పడిపోయింది. పాపం రెండూ నీళ్ళల్లో కొట్టుకు పోతూ కేకలు పెట్టసాగాయి.

ఇదంతా చూసి ఒడ్డునున్న చిక్కుడు గింజ విరగబడి నవ్వింది. పడీ పడీ నవ్వింది. పొట్టపట్టుకొని పగల బడి నవ్వింది. క్రిందపడి దొర్లి దొర్లి నవ్వింది. ఆ దెబ్బకి దాని పొట్ట కాస్తా పగిలిపోయింది.

దాంతో అప్పటిదాకా నవ్వుతూ తుళ్ళుతూ, ఉన్న చిక్కుడు గింజ కాస్తా కుయ్యో మొర్రో మంటూ ఏడవటం మొదలు పెట్టింది. అప్పడే ఆ దారిలో వెళుతున్న దర్జీ ఒకడు దాన్ని చూసి చేతుల్లోకి తీసుకొని “ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు.

కళ్ళు తుడుచుకుంటూ సంగతంతా చెప్పింది చిక్కుడు గింజ.

దర్జీ దానివైపు జాలిగా చూస్తూ “చూశావా? గడ్డిపోచ, బొగ్గుముక్క నీకు మిత్రులు. నీలాంటి వాళ్ళే. పాపం గడ్డిపోచ నీకు సహాయం చేసింది. దాని సాయమే లేకుంటే నీవు కాలువ దాటలేవు కదా! గడ్డిపోచ బొగ్గుముక్కకీ సాయం చేయబోయి నీళ్ళల్లో పడిపోయింది. న్యాయంగా అయితే నువ్వు వాటికి సాయం చేయాలి. సాయం చేయలేక పోతే కనీసం సానుభూతి కలిగి ఉండాలి. అదేమీ లేకుండా వాటిని చూచి ఎగతాళి చేశావు. అవి నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే పగలబడి నవ్వావు. పొట్టపగిలేవరకూ నవ్వావు. తప్పు కదా!” అన్నాడు.

చిక్కుడు గింజ వెక్కిళ్ళు పెడుతూ “నిజమే! నాకు బుద్దొచ్చింది. దయచేసి నా పొట్ట కుట్టవా?" అంది జాలిగా.

దర్జీ జేబులో వెతుక్కుంటే సూది ఉంది గానీ మ్యాచింగ్ దారం దొరక లేదు. దాంతో ఉన్న దారంతో దాని పొట్టకుట్టేసాడు.

అందుకే ఇప్పటికీ నల్లని, ఎర్రని చిక్కుడు గింజల మీద తెల్లని చార, తెల్లని చిక్కుడుగింజల మీద నల్లటి చారా ఉంటాయి.

ఏ రంగులో ఉన్నా చిక్కుడు గింజలు రుచిగా ఉంటాయి.

మేము సాయంత్రం నడకకు వెళ్ళినప్పుడు చేలగట్టు ప్రక్కన మార్కెట్ కు తీసుకెళ్ళుతున్న గోతాలలో నుండి పడిపోయిన టమోటా, వంకాయ, పచ్చిమిరపకాయ లాంటివి కనిపించినప్పుడు వెంటనే మాకు ఈకథ గుర్తుకువస్తుంది. ఇవి కూడా చిక్కుడు గింజలాగా తప్పించుకున్నాయి అని.

ఈ కథ విన్న చిన్న తల్లులూ, తండ్రులూ అందరూ తమ నేస్తాలు క్రిందపడి దెబ్బలు తాటించుకున్నప్పుడు నవ్వకుండా, పడిన వాళ్ళ దగ్గరికెళ్ళి సాయం చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ…..

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

BagundanDee :-)

manchi katha :)

ఇది బాగుంది :)

ఎప్పుడూ ఎక్కడా వినని కొత్త కథ వినిపించారు.ధవ్యవాదాలు.

బాగుంది

Dear Madam,

First of all, Hatts off to your patience and interest in writing such a leangthy stories and also with very good attractive writing(story) skills. This shows your expertise in teaching skills and your passion for educating the today's youth towards morals and ethics of our Indian culture, hinduism etc.

I always read first your stories with great enthusiasm and I will tell all your stories to my 6 year old kid immediately after reading without fail.

Thank you so much for your interest and great passion for educating the society/today's youth. It is very much required to educate such things today for all our people who realy do know where we are in our society?

Thank you, best regards,
D. Prameela
Hyderabad.

ప్రమీల గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu