శ్రీశైలంలో మా చిన్ని Hut లో ఉన్నరోజుల్లో, జీవితం గురించి చాలా నిజాలు నేర్చుకున్నాము. దగ్గరనుండి, లోతుగా, ఆ పేదల్నీ, గిరిజనుల్ని పరిశీలిస్తూ, మనుష్యుల మనస్తత్వాల గురించీ, మానవీయవిలువల గురించీ పుస్తకాల్లో చదవని, చదవలేని వాస్తవాల్ని, భగవద్గీత నుండి మాత్రమే నేర్చుకోగలిగిన జీవితా సత్యాల్ని చాలానే నేర్చుకున్నాము. ఆర్ధికస్థాయికీ మనిషిలోని కోణాలకీ ఉన్న సంబంధం ఏమిటో కూడా బాగానే అర్ధం అయ్యింది. ఎంతగా ‘సినిమాలు వాస్తవం కాదు’ అని తెలిసినా, కొంత సినిమాల, నవలల, పుస్తకాల ప్రభావం మనమీద ఉంటుంది. అప్పటివరకూ సినిమాలో చూసి, పుస్తకాలలో చదివి పేదవాళ్ళంటే పోతపోసిన మంచితనాలు, అమాయకత్వాలు అనుకునే ’లక్షణం’ కొంత నాదగ్గర ఉండేది. వాళ్ళల్లో మంచితనం ఉంది. అమాయకత్వమూ ఉంది. అహంకారం ఉంది. [వాళ్ళల్లో కొందరు తమ జీవిత కాలంలో రైలుని చూడని వాళ్ళున్నారు] తమకి తెలియని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయన్నది ఒప్పుకోని మూర్ఖత్వమూ కొంత ఉంది. అరిషడ్వర్గాలూ, భావోద్రేకాలూ అన్నీ ఉన్నాయి. మొత్తంగా మనిషి ఉన్నాడు. అదే సమయంలో ప్రకృతి ఒడిలో బ్రతికే అడవి జనాల్లో మట్టివాసన కూడా ఉంది. అక్కడే నేను ఆకలి నిజనైజాన్ని చూశాను. బ్రతుకు పోరాటాన్ని, పసితనం నుండే నేర్చుకునే పిల్లల్ని చూశాను. ‘పూర్వాశ్రమంలో నువ్వు బిల్ గేట్స్ వే కానీ, బరాక్ ఒబామా వే గానీ ఇప్పుడు మాత్రం నీదగ్గర కంటే నా దగ్గర ఓ కొడవలి, ఓ గొడ్డలి ఎక్కువుగా ఉన్నాయి. కాబట్టి నీకంటే నేనే గొప్ప’ అంటారు వారు. నిజమేకదా అన్పించింది నాకు. పగలంతా పనిచేస్తారు. రాత్రికి సారా పాకెట్లు తాగేస్తారు. ఒకోసారి రోజుల తరపడి పనిచెయ్యకుండా సోమరిగా గడిపేస్తారు. ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకొని మళ్ళీ పనిలో పడతారు. వాళ్ళల్లో వారు గొడవలు పడతారు. స్నేహంగా ఉన్నప్పుడు ఒకరికొకరు ఇచ్చుకున్న ‘టీ’ లనీ, ఇతరులతో తగవులు పడ్డప్పుడు ఇచ్చిన ‘సపోర్టు’లని కూడా అప్పుల్లాగా లెక్కలు గట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులే వచ్చాయి లెండి. 2002 లో మళ్ళీ మేం శ్రీశైలం వెళ్ళేసరికి అందరికీ కరెంటు వచ్చింది. ఇళ్ళల్లోకి కలర్ టివీలు, జేబుల్లోకి సెల్ ఫోన్లు, బైక్ లు వచ్చాయి. అది చూసి మేమూ ఎంతో సంతోషించాం. అయితే గంగమెట్ల మీద నివసించే వారి బ్రతుకుల్లో సెల్ ఫోన్లు, మోటార్ బైకులూ, కలర్ టీవీలు వచ్చాయి గానీ, ఇప్పటికీ వారికి చదువుకోవాలని గానీ, మానసికంగా ఎదగాలని గానీ ధ్యాస ఉండదు. రావడమెంత తేలికో, పోవడమూ అంతే తేలికైన ఆర్ధికాభివృద్దే సర్వస్వం అనుకుంటే, ఆ పరిస్థితి బాగానే ఉండొచ్చు గానీ ఎప్పుడు వాళ్ళను స్థలం ఖాళీ చేయమంటే వాళ్ళ జీవితాలు మొత్తం తలక్రిందులే. మనిషిన్నాక ‘తిన్నామా, పడుకున్నామా తెల్లారిందా’ ఇదే concept తో బ్రతుకుతామా? మానసికమైన ఎదుగుదల, అధ్యాత్మక ఉన్నతి, ఆత్మోన్నతి అన్న concept లేదా?
ఇటు గంగమెట్లమీది పేదవారి కథ ఇదైతే, శ్రీశైలంలోని ప్రభుత్వ ఉద్యోగుల స్థితి మరోకథ. ఓరకంగా చెప్పాలంటే గంగమెట్ల స్థితి ఒక బావి అయితే, అక్కడి దేవస్థానం ఉద్యోగుల స్థితి మరో బావి. అక్కడ అన్నీ ప్రభుత్వ కట్టడాలే, ప్రభుత్వ భూములే. ఏ ఉద్యోగికైనా ప్రభుత్వ కాటేజ్ వస్తుంది. అక్కడి డ్రైవర్ కమ్ అటెండర్ స్థాయి ఉద్యోగులు కూడా పలుకుబడి ఉంటే A/C cottage అనుభవిస్తుంటారు. అప్పటికి అంటే 1993 నాటికి వాలెంటరీ రిటైర్ మెంట్ పధకం ఉంది. దాదాపు అక్కడి దేవస్థానపు ఉద్యోగుల్లో తమ రిటైర్ మెంట్ కు కొన్నేళ్ళు ముందు వాలెంటరీ రిటైర్ మెంట్ తీసుకొని తమ సంతానంలో ఒకరికి తమ ఉద్యోగం ఇప్పించేసుకుంటే, ఇక మళ్ళీ 35 ఏళ్ళు తమకి ఢోకా లేదు. కాటేజ్ ఖాళీ చేయనక్కరలేదు. ఇక ఏ సమస్య లేదు అనుకునేవాళ్ళు. కాబట్టే ఎలాగోలా 10th అయ్యిందని పిస్తే చాలు అనేదగ్గరే వాళ్ళ ఆలోచనలు ఆగిపోయి ఉండేవి. వీళ్ళ తూములు అంటే వ్యసనాలు ఏమిటంటే తాగుడు, జూదం తోపాటు నిధులు దొరుకుతాయని అడవులలో తవ్వకాలకి వెళ్తారు. ఇదోక వ్యసనం. ఇదంతా చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలలాంటి ప్రపంచం గురించే నేను విని ఉండలేదు. ఎక్కడా చదివి ఉండలేదు. అయితే ఈస్థితి మళ్ళీ మేం 2002 చివరిలో శ్రీశైలం వెళ్ళేసరికి కొంత మారింది. వాలెంటరీ రిటైర్ మెంట్ పధకం రద్దయ్యింది. దాంతో వాళ్ళకి కొంత ’చదువు’ అవసరం ఏర్పడింది. పిల్లల్ని చదివించుకోవటం అవసరం అన్న స్థితికి వచ్చారు. ప్రభుత్వం వాలెంటరీ రిటైర్ మెంట్ తీసివేయటం ద్వారా చదువు అవసరం చాలామందికి తెలిసింది. ఇది కొంత సంతోషించదగ్గ విషయం.
వీటన్నింటినీ మౌనంగా పరిశీలించాను. వాళ్ళల్లో వాళ్ళెన్ని గొడవలు పడ్డా మాతో మాత్రం భాగానే ఉండేవాళ్ళు. పోలీసు సి.ఐ. సాయంతో మాకు రేషన్ కార్డు పుట్టింది. అక్కడున్న రెండుసంవత్సరాలు రేషన్ బియ్యమే తిన్నాం. రోజులు సంతోషంగానే గడిచిపోతున్నాయి. అక్కడి స్థానికులు తమకి ఏదైనా వ్రాతకోతలు కావాలంటే మాదగ్గరికి వచ్చేవాళ్ళు. ప్రభుత్వానికి ఓ విఙ్ఞాపన పెట్టుకోవాలన్నా, ఓ దరఖాస్తువ్రాసుకోవాలన్నా, ఓ లేఖ చదివించు కోవాలన్నా మాదగ్గరికి వచ్చేవాళ్ళు.
మాకు చేతనైన సాయం మేం చేసేవాళ్ళం. అలా మాకు ’నాగరత్నమ్మ’ అనే సాధు మషిళ పరిచయం అయ్యింది. ఆవిడ బాలయోగిని. అంటే తన పదేళ్ళ వయస్సులోనే ఇహలోక ప్రపంచం ఇష్టం లేక సన్యసించింది. కాషాయ బట్టలు వేసుకోనేది. లుంగీ, చొక్కా ధరించేది. శ్రీశైలానికి ఎగువన, కృష్టానదిలో ప్రయాణిస్తే అక్కమహాదేవి గుహలు వస్తాయి. మనోహరమైన చోటు అది. శ్రీశైలానికి వచ్చే కన్నడ యాత్రికులు తప్పుకుండా అక్కడికి వెళ్ళి అక్కమహాదేవి తపస్సు చేసిన చోటుని దర్శించుకుంటారు. ఈమె అక్కడి ఉండి తపస్సు చేసుకునేది. స్థానిక చెంచువాళ్ళు ఆమెకు పాలు, పళ్ళు ఇచ్చేవారు. అక్కడ ఆమె సజీవ సమాధి కావాలని ప్రయత్నించింది. దాంతో అటవీ శాఖ వాళ్ళు అభ్యంతరం పెట్టి ఆవిణ్ణి శ్రీశైలానికి పంపించివేసారు. ఆమె శ్రీశైలం గుడికి దగ్గరలో ఓ ఆశ్రమంలో ఉంటోంది. శ్రీశైలానికి కన్నడ భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు. వాళ్ళకి ఈసాధు మహిళ అంటే చాలా భక్తి, గౌరవం. కాళ్ళకు మొక్కి భారీగా కానుకలిచ్చేవాళ్ళు. వాటితో ఆవిడ ఆశ్రమంలో యాత్రికుల వసతి కోసం కొన్ని గదుల నిర్మించాలనీ, భూమి కేటాయించమని దేవస్థానం అధికారులకి అర్జీ పెట్టుకున్నది. దానికి దేవస్థానం వారేదో జవాబిచ్చినప్పుడు ఆ అంగ్లలేఖని చదివి పెట్టమని తొలిసారిగా మా దగ్గరికి వచ్చింది. అది చదివి పెట్టాము. అప్పుట్నుంచే ఆవిడ అప్పుడప్పుడూ లేఖలు వ్రాసి పెట్టమనీ, చదివి పెట్టమనీ గుడిలో కలిసినప్పుడు అడుగుతుండేది.
ఒకరోజు మధ్యాహ్నం మేం మా Hut లో విశ్రాంతి తీసుకుంటున్నాము. నాగరత్నమ్మ మా ఇంటికి వచ్చింది. ఏడుస్తూ ఉంది. “ఏమయ్యిందమ్మా!” అని అడిగాను. ఆవిడ ఏడుస్తూ ‘తన ఆశ్రమం ప్రక్కన వేద పాఠశాలలో పనిచేసే అతను తనను వేధిస్తున్నాడనీ, ఈ రోజు తన ఆశ్రమం పడదోయించి, తన పూజా విగ్రహాలు బయట పారేసాడనీ’ చెప్పింది. తన మీద మట్టి ఎత్తిపోసి బూతులు తిట్టాడని చెప్పింది. “పోతే మరోచోట మళ్ళీ ఆశ్రమం నిర్మించుకొండి. దుష్టులకు దూరంగా ఉండమన్నారు కదా పెద్దలు” అన్నాను. [సదరు వ్యక్తి ఎవరో నాకు తెలియదు] ఆవిడ దుఃఖ పడుతూ ‘ఎక్కడికి వెళ్ళినా తనని ప్రశాంతంగా ఉండనివ్వడనీ, నాలుగేళ్ళుగా అతడు తనని బాధలు పెడుతున్నాడనీ’ అంది. ఎందకో నాకు అర్ధం కాలేదు. నేను వివరాలు అడిగాను. ఆవిడ చెప్పలేక ఏడుస్తోంది. నాకెందుకో అనుమానం వచ్చి “అమ్మా! అతడు మిమ్మల్ని స్త్రీగా గుర్తిస్తున్నాడా?" అన్నాను. అంతే. ఒక్కసారిగా ఆవిడ బద్దలయ్యింది. ఏడుపంతా అయ్యాక మొత్తం వివరించింది. కన్నడ భక్తులిచ్చిన డబ్బు ఆవిడ దగ్గర గణనీయమైన మొత్తంలోనే ఉంది. దాన్ని ఆశించి అతడామెని తనతో అక్రమ సంబంధం పెట్టుకొమ్మని వేధిస్తున్నాడట. ఆమె చెప్పిన వివరాలన్నీ విన్నాక నాకు చాలా బాధనిపించింది. జిల్లా కలెక్టర్ కూ, ఎస్.పి.కీ అడ్రసూ చేస్తూ ఆవిడ పేరిట ఫిర్యాదు వ్రాసి ఇచ్చాను. అందులో ‘ఈ కర్మభూమిలో చిన్నప్పుడే సంసార బంధం రోసిన స్త్రీ ప్రశాంతంగా భగవధ్యానం చేసుకొనే వీలుకూడా లేదా! అదే మీ తల్లి గారు ఈ స్థితిలో ఉంటే మీరు సహించగలరా?’ అని వ్రాసాను. రెండురోజులు ఆవిడకి అన్నపానాలు సమకూర్చాను. ఎన్నోఏళ్ళుగా ఆవిడ పాలు, పళ్ళు మాత్రమే తీసుకొంటున్న కారణంగా అన్నం లాంటివి హరాయించుకోలేదు. నేను రవ్వతో జావకాచి ఇచ్చాను. ఆ ఫిర్యాదుకి కలెక్టరూ, ఎస్.పి. ప్రతిస్పందించారు. దేవస్థానం వారికి ఆవిడ ఆశ్రమానికి చోటు ఇవ్వాల్సిందిగా రికమెండ్ చేశారు. వేధిస్తున్న ఆ వ్యక్తి మీద కేసు బుక్ అయ్యింది.
ఈ సంఘటన తర్వాత మా ఆదాయ వనరు మరింతగా ఎండిపోయింది. మా దగ్గర తన పిల్లలకు ట్యూషన్ చెప్పించుకునే ఒక సత్రం మానేజర్ “మీరెందుకు అన్ని విషయాల్లో తల దూరుస్తారు?" అంటూ మమ్మల్ని హెచ్చరించాడు. పుట్టుకతో వచ్చిన స్వభావం కారణమో, భగవంతుడు పుట్టించిన బుద్ది కారణమో గానీ మాకు ఆ సాధుమహిళ విషయంలో మేము చేసింది తప్పనిపించలేదు. ‘చేయగలిగిన సాయం ఉండీ, మనకెందుకు అనుకోవటం అన్యాయం కదా’ అన్పించింది. ‘అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవటం తలదూర్చకపోవటమా’ అన్పించింది. ప్రతి ఊరికి ఒక విలన్ నాగభూషణం ఉంటాడు కదండీ! ఆ ఊరి నాగభూషణంకి సదరువేధిస్తున్న వ్యక్తి బావమరిది అన్న విషయం అప్పుడే మాకు తెలిసింది. ఆవిడ చేత కేసు విత్ డ్రా చేయించుకోవడం కోసం రాజీప్రయత్నాలు చేసారు. దానికి ఆమెని ప్రలోభపెట్టసాగారు. ఆశ్రమం కోసం భూమి ఎలాట్ మెంట్ వెంటనే ఇప్పిస్తామని, దగ్గరుండి ఆశ్రమం మేమే కట్టిస్తామని గట్రా. ఆవిడ ఈ విషయం చెప్పాగనే మేము చెప్పాము. “మీకు ఎలాట్ మెంట్ వస్తూంది. కలెక్టర్ మీకు భూమి ఇవ్వమని దేవస్థానంకి వ్రాసారు కదా! ఆ పేపరే ఇప్పుడు మీదగ్గరుంది. ఇప్పుడు మీరు రాజీపడ్డారంటే తరువాత మీకు చాలా కష్టం అవుతుంది. భగవంతుడి మీద నమ్మకంతో కొద్ది రోజులు ఓర్చుకొండి” అని చెప్పాము. కాని తరువాత ఆవిడ ఆశ్రమం అన్న బలహీనతని దాటలేక రాజీ పడి కేసు విత్ డ్రా చేసుకుంది. తరువాత ఆశ్రమం కట్టిస్తామని ఆవిడ దగ్గర 50,000/- రూ.[ అప్పటి రోజులలో యాభై వేలంటే చాలా ఎక్కువ, గమనించగలరు] తీసుకొని చాలా రోజుల పాటు తిప్పించుకున్నారు. ఆవిడ తరువాత మాకు చాలా కాలం పాటు కన్పించలేదు. ఆవిడ ఒకరోజు కనిపించగా కేసు వివరాలు అడగగా, తను మోసం పోయిన విషయం చెప్పి, ప్రస్తుతం చిన్న రేకుల షేడ్ వేసుకున్నానని అడ్రసు చెప్పింది. ఆ విధంగా మేము ఆవూరిలో ప్రముఖ వ్యక్తిని మాకు తెలియకుండానే శతృవుగా చేసుకున్నాము.
అయితే – ‘ఎవరెట్లా పోతే మనకేం? మన వరకూ సమస్య రానప్పుడు, మనం మౌనంగా ప్రక్కకు తప్పుకు పోవడం మంచిది’ – ఈ పద్దతి సరేనదా, లేక, ‘కళ్ళముందు అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తు ఊరుకోకూడదు. ప్రతిఘటించాలి’ – ఈపద్ధతి సరైనదా అన్న ద్వంద్వం ఇంతటితో మమ్మల్ని వదలిపోలేదు. దీని తాలుకూ మరికొంత వివరణ 2007 లో జరిగింది. మళ్ళీ శ్రీశైలంలోనే. ఆ సందర్భంలో ఈ ద్వంద్వం గురించి మా అనుభవాన్ని వివరిస్తాను.
ఇక 1994 చివరిలో నాగరత్నమ్మ వ్యవహారంలో మా ప్రవర్తన – ‘నీతులు, ఆదర్శాలు చెప్పడం వరకే, ఆచరణలో మనకెందుకు వచ్చిన గొడవ’ అనుకోలేకపోయాము. అయితే 1995 ప్రారంభానికే మాకు మళ్ళీ గడ్డురోజులు తయారయ్యాయి. బ్రతుకు తెరువుకి ఏప్రయత్నం చేసినా మా ప్రమేయం లేకుండానే బెడిసి కొట్టేది. లేదా మేమే ఆ ప్రయత్నాన్ని ఒదులుకోవాలి. పార్ట్ టైమ్ లెక్చరర్ గా చేసాను వచ్చే 1200/- రూ. లలో ఇంకో లెక్చరర్ తో పంచుకోవాలని చెప్పారు. అనివార్యంగా వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఛార్జిలకే 300/- రూ. అవుతాయి కాబట్టి. మా వారు శ్రీశైలం టన్నెల్లో స్టోర్ రూం సూపర్ వైజర్ గా చేరారు. చేరిన రెండునెలలకే ఆ కంపెనీ లాకౌట్ ప్రకటించింది. దాంతో ఆ ఉద్యోగం కూడా ఊడింది. తరువాత దారి తెన్ను కనిపించలేదు.
దాంతో 1995 ఫిబ్రవరిలో శ్రీశైలం నుండి అవనిగడ్డకి బయలుదేరాము. అక్కడ మాజీమంత్రి మండలి వెంకట కృష్ణారావుని కలవాలన్నది మా ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ బాలల ఆకాడమీ నిర్వహించిన ఏపీ దర్శన్ ప్రోగ్రాంలో ఆనాటి విద్యామంత్రిగా మండలి వెంకటకృష్ణారావు చాలాసార్లు పాల్గొన్నాడు. అవనిగడ్డ[దివిసీమ] గాంధీక్షేత్రంలోనూ, ఇతర చోట్లా జరిగిన కొన్ని కార్యక్రమాలకి అతడు హాజరైనాడు. అప్పటి నా ఉత్సహాన్ని, వాగ్ధాటిని, వక్తృత్వ పోటీల్లో నా నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ నన్ను చిన్నపిల్లగా చాలా appreciate చేసేవాడు. ‘గుంటూరు పచ్చి మిరపకాయ’ అన్న ముద్దుపేరుతో సంబోధించేవాడు. టూర్ తర్వాత కూడా, నేను ఆ పరిచయాన్ని కొనసాగించాను. బ్యాటరీ తయారీ సంస్థ స్థాపించినప్పుడూ అతడి నుండి ప్రోత్సాహాన్ని పొందాను. ఆయన కుమారులు మండలి బుద్ధప్రసాద్ [నేటి మత్స్యశాఖ మంత్రి], శంభుప్రసాద్ లని ’అన్నా’ అని పిలిచేదాన్ని. మండలి గారు కూడా ఒకటి రెండుసార్లు నా ఫ్యాక్టరీకి వచ్చి వెళ్ళారు. 1992 కు ముందర కూడా, నేను ఒకసారి అవనిగడ్డ వెళ్ళివచ్చాను. నేను ఎప్పుడు వెళ్ళినా వారినుండి ఆదరణని పొందాను. మధ్యాహ్నం భోజనం చేయకుండా ఎప్పుడూ వారింటి నుండి నేను బయటకు రాలేదు. ఎవరినైనా ఆయనంతగా ఆదరించేవాడు.
నిజానికి, నేను 1992 లో ఢిల్లీలో పీ.వి.నరసింహారావుకి రామోజీరావు గురించి ఫిర్యాదు ఇచ్చాక, అక్టోబరులో నాఫ్యాక్టరీకి 1992 లో అసాధరణ రీతిలో సీజ్ చేసాక, నేను అక్టోబరులోనో, నవంబరులోనో అవనిగడ్డ వెళ్ళాను. మండలిని కలిసి నా ఫిర్యాదు గురించి, తదుపరి నా పరిశీలన గురించి, నా అప్పటి స్థితి గురించి వివరంగా చెప్పాను. అప్పుడాయన నన్ను మునుపటి కంటే ఎక్కువ ఆదరించాడు. నేను చేసిన ఫిర్యాదు గురించి విని చాలా సంతోషాన్ని వ్యక్తపరిచాడు. “నేను ఓ వారంలో ఢిల్లీ వెళతాను తల్లీ. పీవిగారిని కలిసి మాట్లాడతాను. నువ్వు మళ్ళా కలువునన్ను” అని చెప్పాడు. అప్పుడూ నేను వాళ్ళింట్లో భోజనం చేసే వచ్చాను. ఓ నెల ఆగి 1992 లో మళ్ళీ అవనిగడ్డ వెళ్ళాను. మండలి నాతో “ఢిల్లీ వెళ్ళాను తల్లీ. పీవిని కలిసాను. కానీ నీగురించి కనుక్కునేందుకు వీలు కాలేదు. తర్వాత చూద్దాం” అన్నాడు. నాకది కొంత నిరాశ కలిగించింది. ఈసారి ఆయన ప్రవర్తన కొంత అసాధారణంగా, అసహజంగా అన్పించింది. చేసేది లేక వెనుదిరిగాను. అయితే భోజనం చేసి వెళ్ళమని ప్రత్యేకంగా చెప్పారాయన. అలాగే ఆరోజు వారింట్లో భోజనం చేసే బయటికొచ్చాను. ఎందుకిదంతా చెబుతున్నానంటే వాళ్ళింట్లో నాకు అంతగా ఆదరణ ఉండేదనీ, అదే వ్యక్తుల నుండీ, నేను తర్వాత ఎదుర్కొన్న సంఘటనలు పూర్తి విరుద్దమనీ చెప్పేటందుకు.
ఇక 1992 లో మండలికి సంబంధించిన ఈ సంఘటనల తర్వాత నేను ఉత్తచేతులతో ఫ్యాక్టరీ నుండి బయటికొచ్చాను. కష్టనష్టాల తర్వాత శ్రీశైలం చేరి వివాహం చేసుకున్నాను. రెండేళ్ళు గడిచిపోయాయి.
మళ్ళీ 1995 లో, శ్రీశైలం నాగరత్నమ్మ కేసు తర్వాత, మళ్ళీ నా బ్రతుకు మరింత ఇరుకైన తర్వాత, మరోసారి అవనిగడ్డ ప్రయాణమయ్యాను. అప్పటికి నేను 7 నెలల గర్భంతో ఉన్నాను. దాదాపు 14 గంటల ప్రయాణం తర్వాత అవనిగడ్డలో మండలి ఇంటికి ఉదయానే చేరాను. బస్టాండు నుండి నేరుగా అతడి ఇంటికి వెళ్ళాము. అప్పటికి కనీసం ముఖం కూడా కడుక్కోలేదు. అయితే అక్కడ నేను ఎంత చేదు రిసీవ్ చేసుకున్నానంటే కనీసం మండలి నాకు ముఖం కడుక్కునే అవకాశం కూడా ఇవ్వలేదు. నా కథంతా అతడికి మరోసారి గుర్తుచేసి, 1992 లో తాను మళ్ళీ పీవిని కలిసి మాట్లాడతానన్న హామీని గుర్తుచేసి, ఇప్పుడెందుకిలా అవుతుందని అడిగాను. కళ్ళనిండా నీళ్ళతో కాస్సేపు మౌనంగా ఉన్నాడాయన. తర్వాత “ఒకవేళ జనార్ధన రెడ్ది మిమ్మల్ని వేధిస్తుండవచ్చుగా!” అన్నాడు. దానికి నాభర్త “అతడికంత సీన్ ఉంటే మొన్న ఎలక్షన్లలో గెలిచి ఉండేవాడు లెండి” అన్నాడు. [అది 1995 ఫిబ్రవరి. అప్పటికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు గడిచాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోయి, తెదేపా గెలిచింది. ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి అయ్యాడు. తొలి సంతకం సంపూర్ణమద్యనిషేధం ఫైలు మీద పెట్టాడు. దూబగుంట్లలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం, ఈనాడు రామోజీరావు ఇచ్చిన అసాధారణ ప్రచారంతో గొప్పగా విజయవంతమైంది. అది తన వ్యతిరేక పత్రికని దెబ్బతీయటానికి రామోజీరావు ప్రయోగించిన స్ట్రాటజీ అని ఇటీవల వెలుగులోకి వచ్చింది.] అయితే ఆ సారా వ్యతిరేక ఉద్యమ ఊపులో తెదేపా అధికారంలోకి రాగా, కాంగ్రెస్ ఓడిపోగా, నేదురమల్లి జనార్ధన రెడ్డి కూడా ఓడిపోయాడు. దాన్ని రిఫర్ చేస్తూ నా భర్త మండలితో అదే అన్నాడు. తదుపరి సంభాషణలో నేను ‘ఎవరేం చేసినా చూసేందుకు దేవుడున్నాడనీ, ప్రతి ఒక్కరికీ – ఎవరి కివ్వాల్సింది వారికిస్తాడనీ’ అన్నాను. దానికాయన ఒక్కసారిగా బరస్ట్ అవుతూ “ఎక్కడున్నాడే దేవుడు? ఎక్కడున్నాడు?" అన్నాడు. ఆ క్షణం నాకు చాలా కోపం వచ్చింది. అంతటి పెద్దాయన్ని గద్దిస్తున్నట్లుగా “దైవనింద చెయ్యకండి. ఘోరపాపం అది” అన్నాను. ఒక్కసారిగా నిరుత్తరంగా కూర్చొండిపోయాడాయన. మరుక్షణం అక్కడి నుండి బయలుదేరాను. ఈసారి నేనా ఇంట ఏమాత్రం ఆదరణని పొందలేదు.
ఆవనిగడ్డ నుండి విజయవాడ చేరాను. శ్రీశైలం తిరిగి వెళ్ళేముందు ఒక్కసారి నా ఫ్యాక్టరీకి వెళ్ళి, అక్కడేముందో చూడాలన్పించింది. అంతక్రితం శ్రీశైలంలో మాకు తెలిసిన అతను లామినేషన్ సామాగ్రికోసం మా ఫ్యాక్టరీ దగ్గర కిలోమీటరు దూరంలో ఉన్న మరో ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేవాడు. దాదాపు రెగ్యులర్ గా వెళ్ళేవాడు. నేను అవని గడ్డ వెళ్ధామనుకున్నప్పుడు అతడిని గుంటూరులో మాఫ్యాక్టరీకి ఒకసారి వెళ్ళి అక్కడ ఎవరయిన ఉన్నారేమో చూసి వివరాలు చెప్పమని అభ్యర్దించాను. అతడు ఎప్పుడు వెళ్ళిన కుదరలేదని ఏవో కారణాలు చెప్పెవాడు. దాంతో మాకు అర్ధం అయ్యింది. ఇతడు వెళ్ళడు, వివరాలు చెప్పడు అని. దాంతో మేమే అక్కడికెళ్ళి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాము. అక్కడింకా మాఅమ్మ, తమ్ముళ్ళు ఉంటారని నేను అనుకోలేదు. అయితే మా అమ్మ చెల్లి, తమ్ముళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
3 comments:
"మరణం ఎవరికైనా తప్పదు" కనుక మంచి కోసమే మరణిద్దాము. మీ ప్రయత్నాలు ఆదర్శనీయాలు. కొనసాగించండి.
have u met PV narasimha rao after he lost power?
may be he might have told u some more details of the case if u have met him later on.
తరువాత వివరంగా వ్రాస్తానండి.
Post a Comment