ఈ ఫిర్యాదుతో సీల్డ్ కవర్ తయారు చేసుకొని, ప్రధానమంత్రి నివాసం రేస్ కోర్సు రోడ్ కి బయలుదేరాను. అది నాకంతకు ముందు తెలియని ప్రాంతం కావటంతో అడ్రసు త్వరగా పట్టుకోలేక పోయాను. దాంతో ప్రధాని ఇంటికి నేను చేరేసరికి ఉదయం 9 గంటలు దాటిపోయింది. అక్కడున్న రిసెప్షన్ సిబ్బందిని కనుక్కుంటే – ప్రధానమంత్రి ప్రతీరోజూ ప్రజాదర్బార్ అటెండ్ కావడం లేదని, తమ కౌంటర్ లో నా రిక్వెస్ట్ లెటర్/ ఫిర్యాదు ఇవ్వవచ్చుననీ’ చెప్పారు. అలా చేయటానికి నేను తటపటాయించాను. దాంతో వాళ్ళు “మరునాడు ఉదయం 7 గంటలకు రండి. ఒకవేళ పిఎం గనక ప్రజాదర్బార్ కు వస్తే డైరక్ట్ గా మీరే ఇవ్వవచ్చు. ప్రజాదర్బార్ లేకపోతే OSD[Officer on special duty] సందర్శకులను రిసీవ్ చేసుకునేందుకు వస్తారు. అప్పుడు మీ representation ఇవ్వవచ్చు” అని చెప్పారు.

నేను మర్నాడు PMR కు వచ్చేందుకు సిద్దపడ్డాను. మర్నాడు అంటే 5th జూన్ 1992, ఉదయం 7 గంటల లోపలే నేను [PMR] ప్రధాని నివాసంకు చేరుకున్నాను. ప్రధాని రావచ్చునని చెప్పటంతో అందరు సందర్శకులతో పాటే నేనూ వేచి ఉన్నాను. దాదాపు 7.45 అవుతుండగా ఆరోజు ప్రధానమంత్రి ప్రజాదర్భార్ కు అటెండ్ కావటం లేదని, OSD [వర్మానో, దీక్షితో పేరు ఇప్పుడు స్పష్టంగా గుర్తులేదు] వస్తారనీ రిసెప్షనిస్టులు చెప్పారు. ఇంతలో OSD వచ్చి సందర్శకుల్ని ఒక్కొక్కరినే రిసీవ్ చేసుకున్నాడు. మరో దారి లేదు గనుక నేను నా సీల్డ్ కవర్ ని OSD కి అందచేసాను. ఒకసారి పైనున్న అడ్రసు, ఇతర వివరాలు చూసి, అన్నిటికంటే పెద్దగా ఉన్న నా కవర్ ని అతడు అన్నిటి కంటే అడుగున పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. నేను నా హోటల్ గదికి తిరిగి వచ్చాను. అప్పటికే రైల్ యాత్రినివాస్ నుండి అద్దె తక్కువుగా ఉండే పహార్ గంజ్ లోని హోటల్ కి మారిపోయాను.

వాస్తవానికి ఆ సమయంలో నేను చాలా వత్తిడికి గురయ్యాను. ప్రస్తుతం ఉన్న నా హోటల్ గది నంబరు, టెలిఫోన్ నెంబరు, నా శాశ్వత చిరునామా మొదలైన అన్ని వివరాలు నా ఫిర్యాదులో వ్రాసాను. అప్పటి నుండి చాలా ఆతృతతో ప్రధానమంత్రి నుండి ప్రతిస్పందనగా నాకు పిలుపు వస్తుందని ఎదురుచూస్తూ హోటల్ గదిలో వేచిచూడసాగాను. వార్తాపత్రికల ద్వారా ప్రధానమంత్రి రియో డీ జీనీరో లో జరుగుతున్న [’ఎర్త్ సమీత్’] ధరిత్రీ సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళాడని తెలుసుకున్నాను. ఒక వారం గడిచి ఉంటుందనుకుంటా.

హోటల్ లోని నా గదిలో కూర్చొని టివీలో వార్తలు చూస్తున్నాను. అప్పుడే ప్రధానమంత్రి తాలూకూ విజువల్ వస్తోంది. ఆయన ధరిత్రీ సదస్సు గురించి వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ వ్యాఖ్యలో “To attend this congress, sorry conference of earth summit, I feel happy……” అంటూ ఇంకేదో మాట్లాడాడు. ఆయన చాలా ’డిస్టర్బ్ డ్’ గా ఉన్నట్లు నాకు తోచింది. కళ్ళల్లో ఎరుపు, అలసట, తీవ్రఒత్తిడి కన్పించాయి. ఆయన బాడీ లాంగ్వెజ్ కూడా తీవ్రమైన భావోద్రేకాలతో ఉన్నట్లు నాకు తోచింది. నేను “ఆయన వృద్ధుడు. వ్యవహార్త. అనుభవశాలి, బహుభాషా వేత్త. అదీగాక ధరిత్రీ సదస్సు ఎప్పుడో నిర్ణయింపబడిన కార్యక్రమం. అందులో వ్యాఖ్యానించేందుకు తడబడే అవసరం ప్రధానమంత్రికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నా ఫిర్యాదు చదివి ఉంటాడు” అనుకున్నాను.

నాలో ఉద్విగ్నత, ఉత్కంఠ నిండిపోయాయి. చాలా ఉద్వేగం, సంతోషం కలిగాయి. ఏదో జరగబోతుంది అన్న అతురతతో ఎదురుచూశాను. రోజుకి రోజు, ఎంతో అతృతతో, రామోజీరావు, అతడి అనుచరులైన వీపిసింగ్, కరుణానిధి, నేదురమల్లి జనార్ధన రెడ్డి వంటివారి అరెస్టుని గురించిన సంచలన వార్త పేపర్లలో టివీలో వస్తుందని ఎదురుచూశాను. 1992 నాటికి నేను ఎంతో అపరిణతి తోనూ, అనవగాహనతోనూ, ముఖ్యంగా గూఢచర్యం గురించి, గూఢచార సంస్థలు గురించి, ఆ సంస్థల ఏజంట్ల గురించి ఏమీ తెలియని అమాయకత్వంతోనూ ఉన్నాను. చిన్నప్పుడు సాంఘీక శాస్త్రంలోని సివిక్స్ పాఠాల్లో చదువుకున్నట్లు భారత ప్రభుత్వం, భారతదేశంలో ఏమైనా చెయ్యగలదనీ, దేశపు పరిమితులకి లోబడి ప్రధానమంత్రి కంటే, కేంద్రప్రభుత్వం కంటే ఎవరూ బలవంతులు కారని అనుకునేదాన్ని. అప్పటికి రాజీవ్ గాంధీ హత్యకి మాత్రమే రామోజీరావు, వీ.పి.సింగ్, కరుణానిధులు బాధ్యులనుకున్నాను. మాజీ ప్రధాని కాబట్టి, తర్వాత ప్రధానితో SPG రక్షణ రద్దు చేయించి హత్య చేయించగలిగారనుకున్నాను. పదవిలో ఉండగానే ప్రధానమంత్రుల్ని హత్య చేయించగల శక్తి, గూఢచర్యానికీ, గూఢచార ఏజంట్లుకీ ఉంటుందనీ, ఇందిరాగాంధీ హత్యకు కూడా రామోజీరావుతో సంబంధం ఉందనీ నాకు తెలియదు. అందుచేత భారత ప్రభుత్వం, భారత ప్రధానికి విషయం తెలిస్తే చాలు, వారు ఏమైనా చెయ్యగలరు అనుకున్నాను. అప్పటి నా భావాల్లో అనవగాహన, అపరిపక్వత ఉండవచ్చుగానీ, నా భావాల్లో, వ్రాతల్లో నిజముంది. నా ఈ భావాలన్నీ అప్పటి నా డైరీలో వివరంగా వ్రాసుకున్నాను. 1993 లో నా వివాహం అయ్యేంతవరకూ అన్నీ డైరీల్లో వ్రాసుకున్నవే. వివాహం తర్వాత డైరీ అవసరం నాకంతగా లేకపోయింది. ఏ భావాలనైనా పంచుకునేందుకు నా భర్త నాకు తోడుగా ఉండగా ఇక వ్రాసుకోవలసిన అవసరం కన్పించలేదు. అయితే ఈ 2 ½ సంవత్సరాల డైరీలని 1995 లో పోగొట్టుకున్నాను. శ్రీశైలం నుండి మా ఫ్యాక్టరీకి వెళ్ళిన తరువాత మా పుస్తకలన్నిటినీ ఎలుకలు కొట్టనీయకుండా, ఎదురింట్లో భద్రం చేయమని శ్రీశైలంలో తెలిసినవాళ్ళకు ఉత్తరం ద్వారా తెలిపాను. తర్వాత నేను అడిగితే ఆవిడ తన ఇల్లు తగలబడి పోయిందనీ, అందులో తన వస్తువులతో పాటు నాడైరీలు కూడా కాలిపోయాయనీ చెప్పింది. అది ఎంతవరకూ నిజమో నాకు తెలియదు గానీ, ఆ విధంగా నేను నా డైరీలు, విలువైన పుస్తకాలు, పి.ఎం. కిచ్చిన మొదటి ఫిర్యాదు[1992] మొదలైనవి పోగొట్టుకున్నాను.

సరే మళ్ళీ 1992, ఢిల్లీ కి తిరిగి వద్దాం. ఈ విధమైన భావోద్రేకాలతో నేను ఢిల్లీలో ఉండగా, జూన్ చివరివారంలోనో లేక జూలై మొదటి వారంలోనో గుంటూరులోని మా ఫ్యాక్టరీకి ఇద్దరు ఐ.బి.అధికారులు వచ్చారు. మా అమ్మానాన్నలతో వారు చేసుకున్న పరిచయం ప్రకారం, వారిలో ఒక అధికారి కృష్ణారావు, ఢిల్లీ నుండి రాగా, మరో అధికారి కిశోర్ కుమార్, గుంటూరు కార్యాలయం వచ్చారు. వారు మా అమ్మ, చెల్లితో “అమ్మా, మాకు ఢిల్లీ నుండి ఆర్డర్స్ వచ్చాయి. మీ అమ్మాయి ప్రధానమంత్రిగారికి ఏదో సమాచారం ఇచ్చారని, మీకేమైనా సమస్యలున్నాయేమో ఎంక్వయిరీ చెయ్యమని మమ్మల్ని పంపారు” అని చెప్పారట. మాఅమ్మ, "మా అమ్మాయి ఇంకా ఢిల్లీ లోనే ఉంది” అనగా “మీరు మీ అమ్మాయిని మమ్మల్ని కలిసేందుకు పిలిపించవలసిన అవసరం లేదు. ఆవిడ పని ఆవిడ పూర్తి చేసుకొనే రానివ్వండి” అన్నారట.

నా పెద్దతమ్ముడు నాకు ఫోన్ చేసి ఈ సమాచారమంతా చెప్పాడు. నా చిన్న తమ్ముడు నాకు తోడుగా ఢిల్లీలో ఉన్నాడు. ఐ.బి.అధికార్లు, రెండు కిలోమీటర్ల దూరంలో నేనుండగా, రెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఫ్యాక్టరీలోని మా నాన్నా, అమ్మవాళ్ళని ఎందుకు కలిసినట్లో నా కర్ధం కాలేదు.

1992 అగస్టు 9వ తేదినో, 13వ తేదినో [నాకు బాగా గుర్తులేదు, ఈ రెండు తేదిల్లో ఒకరోజు] నేను నెం.10, జనపధ్ కు వెళ్ళి సోనియాగాంధీని కలవాలని ప్రయత్నించాను. నిజానికి జూన్ 5వ తేదిన ముందు అంటే నాటి ప్రధాన మంత్రి పీ.వి.నరసింహారావుకి నేను రామోజీరావు గురించిన ఫిర్యాదు ఇవ్వక ముందు కూడా ఒకరోజు సోనియాగాంధీని కలవాలని, ఆమె నివాసం నెం.10, జనపధ్ కు వెళ్ళాను. అప్పటికే ఆమె భర్త మరణానికి దుఃఖిస్తూ సంతాప సంవత్సరం పాటిస్తోంది. [నేను వెళ్ళింది జూన్ తొలిరోజుల్లో. ఢిల్లీకి వెళ్ళిందే మే 27, 28 తేదిల్లో. అప్పటికే రాజీవ్ గాంధీ మరణించి [మే 21,1991] సంవత్సరం దాటింది.] అప్పటికి ఆమె సందర్శకులని అనుమతించటం లేదు. ఆమె ఇంటి వద్ద సెక్యూరిటీ పోస్ట్ తప్ప రిసెప్షన్ ఆఫీసు లేదు. దాంతో నేను ఆమెని కలవలేకపోయాను. చివరికి బస్సు డ్రైవర్ సంఘటనతో, భగవద్గీతతో ప్రేరణ పొంది నా ఫిర్యాదుని ప్రధాన మంత్రికీ ఇవ్వాలని నిశ్చయించుకున్నాను గనుక ప్రధానికే ఇచ్చాను. అయితే ఆగస్టులో నేను 10, జనపధ్ కి వెళ్ళినప్పుడు [ఈసారి నేనిచ్చిన ఫిర్యాదు పర్వవసానాలు తెలుసుకోవాలన్నది నా ఆకాంక్ష] అక్కడ టెంట్లు, పందిళ్ళతో తాత్కాలిక రిసెప్షన్ ఆఫీసు ఉంది. సందర్శకులని అనుమతిస్తున్నారు. సోనియాగాంధీ సంతాప సంవత్సరం పాటించటం పూర్తయ్యిందినీ, అందుచేత సందర్శకులని అనుమతిస్తున్నారనీ చెప్పారు. అక్కడ నేను పాస్ తీసుకొని లోపల ఆమె పి.ఏ., ’మాధవన్’ అన్న అతడిని కలిసాను. రామోజీరావు భారత వ్యతిరేక కార్యకలాపాల గురించి, రాజీవ్ గాంధీ హత్య గురించీ, రామోజీరావు గురించి నేను ప్రధానమంత్రికి చేసిన ఫిర్యాదు గురించి వివరంగా చెప్పాను. ఈ నేపధ్యంలో సోనియాగాంధీని కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమని అడిగాను. అతడు “Trash! I won’t believe what you are saying. Sorry. You can’t meet our Madam” అన్నాడు. నాక్కొంచెం నిరాశ కలిగింది. నా ఫిర్యాదు తదుపరి పరిణామాలు తెలుసుకోవాలన్న పంతం తప్ప నాకు మరో ధ్యాస లేదు. మర్నాడు [PMR] ప్రధాని నివాసానికి వెళ్ళాను. ప్రధానమంత్రి పీ.వి.నరసింహారావుని చూసి తీరాల్సిందేనని పట్టుబట్టాను. ప్రధాని వ్యక్తిగత సిబ్బందిలోని ఒక ఐ.ఏ.యస్. అధికారి, కృష్ణమూర్తి అంటూ తనని తాను పరిచయం చేసుకొని నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాడు. ప్రధానమంత్రిని చూచి తీరాల్సిందేనని నేనూ మొండికేసాను. దాదాపు ధర్నా చేసాను. ఉదయం నుండి రాత్రి వరకూ అలాగే ఉన్నాము. దాదాపు రెండురోజుల పాటు అలాగే ఉన్నాను. నాతోపాటుగా నా చిన్నతమ్ముడు కూడా పస్తున్నాడు. అప్పుడే నేను పి.ఎం. ఇంటిదగ్గరకి వచ్చిన ’ధర్తీపకడ్’ అన్న వ్యక్తిని చూశాను.

అప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తరుపున శంకర్ దయాళ్ శర్మ పేరు ప్రతిపాదించబడింది. ఈ ధర్తీ పకడ్ రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయటానికి వచ్చాడు. ఇతడికి రాష్ట్రపతి పదవికి, ఉపరాష్ట్రపతి పదవికి, ప్రధానమంత్రి అభ్యర్ధుల నియోజక వర్గాల్లో పోటీ చేసి వార్తల్లోకి ఎక్కడం హాబీ. ఒక్కసారీ ధరావత్తు కూడా దక్కలేదు. మనిషి మురికిగా ఉన్నాడు. [చుట్టు కొన్ని వీధి కుక్కల్ని గొలుసుతో కట్టుకొని నడుస్తుంటాడట. PMR కి కుక్కల్ని తేలేదు లెండి] కడు పేదవాడూ, చదువుకోనీ వాడూనట. కానీ అతణ్ణి గురించి, అతడి నామినేషన్ గురించీ పత్రికలు, ముఖ్యంగా ఈనాడు తెగరాసేది. 1992 కు ముందే ఈ వార్తలన్నీ నేను చదివి ఉన్నాను. వాటన్నిటి వెనుకా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మొదలైన పదవులని అగౌరపరచటమే ఉండేది. ఈ రకమైన ఏహ్యతా, అసహనపూరిత కుట్రకోణం గురించిన పూర్తి వివరాలు Coups On World లోని ‘The writings and activities of Mr. Ramoji Rao before and after 1992’ లో పొందుపరిచాను. ఈ ధర్తీ పకడ్ ప్రధానమంత్రి reception Desk దగ్గర ’తను రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయటానికి వచ్చాననీ, తిరుగుప్రయాణానికి డబ్బుల్లేవనీ, తనకు డబ్బూ, రైలు టిక్కెట్ ఇప్పించాల్సిందనీ గొడవ పెట్టాడు. చాలా న్యూసెన్స్ చేసాడు. బహుశః ప్రధాని ఆఫీసు అతడికి ఛార్జీలు చెల్లిస్తే అదో సంచలన వార్త అయ్యుండేదేమో! మొత్తానికి అతడెంత న్యూసెన్స్ చేసినా, చివరికి గార్డ్సు వచ్చి అతణ్ణి పంపించి వేసారు గానీ డబ్బు గట్రా ఇవ్వలేదు.

నేను మాత్రం నా మొండిపట్టు కొనసాగించాను. మరునాటి రాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో పోలీసులు వచ్చి నన్ను, నా తమ్ముణ్ణి పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కి తీసికెళ్ళారు. అక్కడ పోలీసు అధికారులు నాకు, నా సోదరుడికి అన్నం పప్పూ, సాంబారుతో కూడిన భోజనం పెట్టారు. దాదాపు 48 గంటల తర్వాత మేం భోజనం చేశాము. దాదాపు రాత్రి రెండు గంటల వేళ భోజనం. తర్వాత మహిళా కానిస్టేబుళ్ళ విశ్రాంతి గదిలో నన్ను మహిళా పోలీసులు తీసికెళ్ళి విశ్రాంతి తీసుకొమ్మన్నారు. మాతమ్ముణ్ణి పోలీసు కానిస్టేబుళ్ళ గదికి తీసుకెళ్ళారు. బాగా అలిసిపోయి ఉండటంతో నేను మరింకేం ఆలోచించకుండా నిద్రపోయాను. తెల్లవారి ముఖం కడుక్కున్నాక టీ ఇచ్చారు. తర్వాత పోలీసు సి.ఐ./ ఎస్.ఐ. నాకు “Return to your place” అని సలహా ఇచ్చాడు.

ఈ సంఘటనల తర్వాత నేను మళ్ళీ బస చూసుకొని ఓరోజు విశ్రాంతి తీసుకొన్నాను. మర్నాడు స్నానపానాదులు ముగించి PMO కి వెళ్ళాను. అది అగస్టు 16 వ తేది అయి ఉండవచ్చు. రిసెప్షన్ లో PM ని కలవాలని అడిగాను. నా విజిటింగ్ కార్డు ఇచ్చాను. “I had given some confidential information to PM. I want to meet him to know about it. Please, let me have his appointment” అని అడిగాను. రిసెప్షన్ లో వాళ్ళు OSD ఖండేకర్, ఐ.ఏ.యస్. ఆఫీసరుని కలసి మాట్లాడమనీ, ఆయన కన్విన్స్ అయితే పి.ఎం.తో అపాయింట్ మెంట్ ఇస్తారనీ చెప్పి పాస్ వ్రాసి ఇచ్చాడు. లోపలికి వెళ్ళి ఖండేకర్ ని కలిసాను. రిసెప్షన్ లో చెప్పిందే చెప్పాను. అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగబోతుంది. నేను ఖండేకర్ తో “This is important than the election of President of India even” అని చెప్పాను.

దానికతడు నన్ను సాదరంగా కూర్చోబెట్టి “Madam! You had given some information to PM. He is doing something on it. I’m not supposed to say what he is doing. Let me know what do you want to say to PM” అన్నాడు. అప్పటికి దేశంలో జరుగుతున్న మార్పులు నాకు కొంత స్పష్టంగానే అర్ధం అవుతున్నందున నేను సంతృప్తి చెందాను. అతడి మాటలతో నాకు ఇంకొంత అవగాహన, సంతృప్తి కలిగింది. ఎందుకంటే నేను చేసిన ఫిర్యాదు సరియైన వ్యక్తికే చేరింది అన్న సంతృప్తి. నేను సెలవు తీసుకొని వచ్చేసాను. బయటికి వస్తూ రిసెప్షన్ ఆఫీసర్ కి ధాంక్స్ చెప్పి సెలవు తీసుకున్నాము. అప్పటిదాకా అక్కడ సందర్శకుల లాంజ్ లో కూర్చొని ఉన్న ఒక పెద్దాయన నావైపే తదేకంగా చూడటం గమనించాను. అంతకు ముందు, నేను అతడి ప్రక్క సోఫాలోనో కూర్చున్నాను. అతడు మాజీ ముఖ్యమంత్రి అనీ యు.పి.రాష్ట్రానికి చెందిన వాడనీ రిసెప్షన్ ఆఫీసరుతో సంభాషిస్తుండగా తెలిసింది. ఆయనింకా లోపలికెళ్ళేందుకు అనుమతి కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చొని ఉన్నాడు. అతడి కళ్ళల్లో నాచేతిలోని పింక్/ వైట్ పాస్ పట్ల ఓరకమైన ఆసక్తి చూశాను. దాంతో అలాంటి పాస్ పొంది లోపలికి వెళ్ళడం ‘something special’ అన్నమాట అనుకున్నాను.

ఈ సంఘటన తర్వాత ఆగస్టు 20 వ తేదికి గుంటూరు చేరుకున్నాను. నేను ఢిల్లీలో ఉండగా జూలై 1992 లో, నా సోదరుడి స్నేహితుడు, నాకు కుటుంబమిత్రుడూ అయిన లెనిన్ మాఇంటికి వచ్చాడు. తను మాఇంటికి రావడం, ఉండటం మాకు మామూలే. తనది వైజాగ్. ఈసారి నాపెద్ద తమ్ముడు ఫోన్ చేసి రమ్మనగా వచ్చాడు. మాఅమ్మ వాళ్ళకు తోడుగా, నాపెద్దతమ్ముడికి moral support గా ఉన్నాడు. నేను ఫోనులో “లెనిన్! మీఇంటికి వెళ్ళిపో. నేను చాలా dangerous project మీద వర్కు చేస్తున్నాను. లైఫ్ రిస్క్ విషయం. ఇందులో నువ్వు దిగవద్దు. వెళ్ళిపో” అని చెప్పాను. దానికి తను “శ్రీను నాకంతా చెప్పాడు. నాకు మీ పని గురించి తెలుసు. మీరు దేశం కోసం చేస్తున్నారు. మీ ప్రాణాలు పోయేటట్లయితే, అదేనాకు జరిగిన ఫర్వాలేదు” అన్నాడు.

ఆరోజు నుండి లెనిన్ మాఇంట్లోనే ఉన్నాడు. అంతకు ముందు కూడా తను మాఇంట్లో రోజుల తరబడి ఉండటం అలవాటే గనుక తన తల్లితండ్రులు కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు. వాస్తవానికి, నేను రామోజీరావు గురించిన ఫిర్యాదు పని ప్రారంభించక ముందు, మేమూ, లెనిన్ కలిసి విశాఖపట్నంలో ఓ జాయింట్ వెంచర్ యూనిట్ ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నాం.

ఈనేపధ్యంలో ఆగస్టు 3 వ వారంలో నేను ఢిల్లీ నుండి నా ఫ్యాక్టరి వచ్చాను. కొద్దిరోజుల్లో రామోజీరావు కుట్రల గురించి, రాజీవ్ గాంధీ హత్యగురించి ప్రభుత్వం ప్రకటిస్తుందన్న ఆలోచనతోనే కొన్నిరోజులు గడిచాయి. ఈ రకపు ఉద్విగ్న ఆలోచనలతోనూ, రామోజీరావు కుట్రల గురించిన పరిశీలన, పరిశోధనలతోనూ, దాదాపు 1992 ఫిబ్రవరి నుండి, నేను నావ్యాపారాన్ని చాలా నిర్లక్ష్యం చేసాను. చేతిలో ఉన్న APS RTC ఆర్డర్ కూడా Execute చెయ్యలేదు. దాంతో మరిన్ని ఒడిదుడుగుల్లో పడ్డాను.

మరోవైపు చూస్తే జూన్ 5, 1992 న నేను ఫిర్యాదు అందజేసిన తర్వాత దాదాపు రెండునెలలు పైదాకా ఢిల్లీలోనే ఉన్నాను. నేను ఢిల్లీలో ఉండగానే నాటి రాజకీయ పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అఖిల భారత లారీ యజమానుల సమ్మె విరమింపబడింది. పంజాబ్ లోని ఖలిస్తాన్ టెర్రరిజం హఠాత్తుగా తగ్గుముఖం పట్టింది. రోజుకు రోజు గణనీయ సంఖ్యలో మిలిటెంట్లు[అప్పటికి అలాగే పిలిచేవాళ్ళు], తీవ్రవాదులు పోలీసు ఎన్ కౌంటర్లలో చచ్చిపోతున్నారు. ఎంత నాటకీయంగా అంటే మిలిటెంట్లు ఫలానా చోట ఉన్నారని పోలీసులకు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసారనీ, ఆ సమాచారంతో పోలీసులు దాడిచేస్తే మిలిటెంట్లు దొరికారని, లేదా ఎన్ కౌంటర్లలో చనిపోయారని పోలీసులు ప్రకటనలు చేసేవారు. అధికసంఖ్యలో మిలిటెంట్లు, తీవ్రవాదులు భారీ ఆయుధాలతో సహా[AK 47 వంటివి] పోలీసులకి లొంగిపోవటం మొదలైంది. ఒకరోజైతే ఏకంగా దాదాపు 300 పైగా మిలిటెంట్లు లొంగిపోయారు. అప్పుడు పంజాబ్ పోలీసు ఉన్నతాధికారిగా కె.పి.ఎస్. గిల్ ఉన్నాడు. 1992 కు పూర్వం, ఓసారి ఒక ఐ.పి.ఎస్. అధికారి, పార్టీలో తప్పతాగి, ఆమత్తులో మరో మహిళా ఐ.పి.ఎస్. అధికారి పిరుదల మీద తట్టటమో, లేదా కొట్టటమో చేసాడనీ, ఆ అధికారిణి అతడి మీద కేసు పెట్టిందనీ నేను చదివాను. ఐ.పి.ఎస్. అధికారుల స్థాయిలో ఉండి ఆరకం ప్రవర్తన ఏమిటబ్బా అని అప్పట్లో ఆశ్చర్యపోయాను. అసహ్యం కూడా వేసింది. అయితే 1992 జూన్ తర్వాత సూపర్ కాబ్ గా అవతరించిన కె.పి.ఎస్. గిల్ మీదే ఆ కేసు పెట్టబడింది అని వార్తల్లో చదివాను. ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టాను. అయితే 1992 ఆగస్టు, సెప్టెంబరుల కల్లా కె.పి.ఎస్. గిల్ తిరుగులేని, సమర్ధత గల పోలీసు అధికారిగా అవతరించాడు. అతడి నాయకత్వంలో పంజాబ్ పోలీసులు, పంజాబ్ నుండి దాదాపుగా ఖలిస్తాన్ టెర్రరిజంని తుడిచి పెట్టేయగలిగారు. అప్పటికి ఇందిరాగాంధీ ప్రాణాలతో సహా వేలాదిమంది అమాయక సిక్కుల, పంజాబీల ప్రాణాల్ని హరించిన, బ్రతుకుల్ని కబళించిన తీవ్రవాదం క్రమంగా సమసి పోయింది. 1995 లో పంజాబ్ ముఖ్యమంత్రి బియంత్ సింగ్ హత్య వంటి చెదురుమదురు సంఘటనలు తర్వాత జరిగాయి. అప్పటినుండి ఇప్పటికీ పంజాబ్ లో ప్రశాంతత కొనసాగటం ఎంతో స్వాంతన కలిగించే అంశం.

1992 సెప్టెంబరులో డి.డి./ పేపరు వార్తల ప్రకారం ఒకరోజు రాత్రి 2 గంటల తర్వాత కరుడుగట్టిన తీవ్రవాది, పంజాబ్ మిలిటెంట్ల ఛీఫ్ అయిన గురుజంత్ సింగ్ ఓ పండ్ల తోట దగ్గర పోలీసు కాల్పుల్లో చచ్చిపోయాడు. టివీ/ పేపరు వార్తల ప్రకారం ఎవరో అఙ్ఞాత వ్యక్తి, పోలీసులకి, అతడి ఆచూకీ గురించి సమాచారం ఇచ్చాడట. అతడు తన ఉంపుడు గత్తె ఇంటి నుండి తిరిగి వస్తుండగా పోలీసులు అతణ్ణి, అతడు పోలీసుల్ని ఎదుర్కున్నాడు. కాల్పుల్లో చనిపోయాడు. ఈ గురుజంత్ సింగ్ ఒక పండ్ల తోటనుండి మాయం అయ్యేవాడట. వాడు చచ్చిన తరువాత ఆతోటలో వెదికితే ఆతోటనుండి ఒక ఇంటికి రహస్య దారి ఉందట. ఈ సంఘటన తర్వాత పంజాబ్ లో గణనీయమైన ప్రశాంతత నెలకొంది.

‘రామోజీరావు వంటి వాడి కార్యకలాపాలు తెలిసేసరికి నిఘాసంస్థలకు మరింత సమాచారం అంది ఉంటుంది. దాంతో ఇవన్నీ జరగటం సహజమే’ అన్న అభిప్రాయానికి నేను వచ్చాను. అప్పటికే సి.ఐ.ఏ. గురించీ, ఇజ్రాయిల్ గూఢచార వ్యవస్థ మొసాద్ గురించి, కె.జి.బి. వంటి సంస్థల గురించి లెనిన్ చదివి ఉన్నాడు. తానిచ్చిన సమాచారంతో కూడా నా బుర్రకి మరింత పదును పెట్టుకున్నాను. ఒక్కసారి అటువైపు దృష్టి పెట్టాక, ఇక అదే ధ్యాసగా పనిచేయటం నాకున్న అలవాటు. దాంతో పరిస్థితుల్ని, పరిణామాలని, కార్యకారణ సంబంధాలని అర్ధం చేసుకొనే ప్రయత్నం మరింత ఎక్కువ చేసాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

1 comments:

I must not say its interesting, coz its not a story, but hats off to your efforts....

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu