వారం రోజులుగా పొడవాటి టపాలతో అలిసిపోయినందున ఆదివారం, విరామంగా చదువుకొనేందుకు ఓ చిన్ని కథ!

అనగా అనగా

ఓ దేశరాజధాని నగరం. రాజుగారి పుట్టినరోజు ఉత్సవసభ జరుగుతోంది. సభా ప్రాంగణం ప్రజలతో క్రిక్కిరిసి ఉంది. రాజు గారిని పొగుడుతూ సైన్యాధికారి ఉపన్యాసించాడు. ప్రజలంతా ఆ’సొల్లు’విని గట్టిగా జేజేలు పలికారు. తర్వాత మంత్రి! ప్రజలీసారి మరింత గట్టిగా చప్పట్లూ కొట్టి, హర్షధ్యానాలు చేశారు. తర్వాత రాజుగారు కృతఙ్ఞతలు చెబుతూ ఉపన్యసించారు. ఈ సారి ప్రజలంతా దిక్కులు పిక్కటిల్లేలా చప్పట్లు చరుస్తూ, జేజేలు పలుకుతూ రాజుగారి పట్ల తమ విధేయత చాటుకున్నారు. సభకు రాకపోతే, రాజుగారిని పొగడక పోతే ఎక్కడ రాజుగారికి కోపం వస్తుందోనన్న భయం, రాజుకు కోపం వస్తే తమకి నష్టం అన్న ఆతృతా వారిలో ఉంది.

ఆ సభలో ఓ మూల ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు మౌనంగా ఉన్నాడు. చప్పట్లూ కొట్టలేదు, జేజేలు పలకలేదు. ప్రజలకి అతణ్ణి చూసి ఆశ్చర్యం వేసింది. గుసగుసలు పోయారు. విషయం రాజుగారి దాకా పోయింది. ఆయన గుర్రుమన్నాడు. విచారణ మొదలైంది. మంత్రి దర్పంగా, కాస్త కోపంగా “మేమంతా మన రాజు గారిని కీర్తిస్తుంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావ్? నీకు రాజంటే భయం భక్తీ లేవా?” అన్నాడు.

చిరునవ్వు నవ్వాడు ఆ వ్యక్తి. చిర్రెత్తుకొచ్చింది అందరికీ.

"జవాబు చెప్పు?" హుంకరించాడు సైన్యాధికారి.

ఆవ్యక్తి ప్రశాంతంగా “అయ్యా! మీరంతా ఈ రాజుగారు సర్వాధికారి అని కదా ఆయన్ని పొగుడుతున్నారు! ఈ రాజుగారి పాలనలో జరుగుతున్న అన్యాయాలు మీకు తెలుసు. అయినా అవేవి మాట్లాడకుండా రాజుని పొగుడుతున్నారు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని మెచ్చుకోవాలని, రాజుగారి దయ మీమీద ఉండాలని, రాజు గారికి మీరు ప్రీతిపాత్రులు కావాలని! అటువంటప్పుడు ఈ రాజు గారి కంటే కూడా గొప్పవాడు, సర్వాధికారి అయిన దేవుడి దయ నామీద ఉండాలనీ, దేవుడు నన్ను మెచ్చుకోవాలని, దేవుడికి నేను ప్రీతిపాత్రుణ్ణి కావాలని అనుకుంటే తప్పేమిటి?" అన్నాడు.

సభలో ఒక్కసారిగా నిశ్శబ్ధం!

రాజుకి ఙ్ఞానోదయమైంది. ప్రజలకీ ’సత్యం’ గోచరమైంది.

రాజు ఆవ్యక్తికి క్షమాపణా, కృతఙ్ఞతలూ చెప్పుకొని, తర్వాత నుండీ తన కర్తవ్యం అయిన ’ప్రజా శ్రేయస్సు’కోసం పాటు పడ్డాడు.

ఇదీ కథ!

ఇది కథ కాబట్టి, ఈకథలో రాజూ, ప్రజలూ మంచివాళ్ళు కాబట్టి, పరివర్తన తెచ్చుకున్నారు. అదే ఈ రోజుల్లో రాజులైతే, డొక్కచీల్చీ డోలు కట్టివాయిస్తాం అనే వాళ్ళెమో, అది వేరే విషయం.

అయితే ఈ కథలో విశేషం ఏమిటంటే ఎవరైనా తమ పైవారికి తాము ప్రీతిపాత్రులు కావాలని కోరుకోవటం, అందుకోసం ప్రయత్నించటం.

నిజమే కదా!

చిన్నతనంలో ఇంట్లో అమ్మనాన్నలకి మనం ప్రీతిపాత్రులం కావాలనుకుంటాం, వారి మెప్పుకోసం ఏదైనా చేస్తాం.

తర్వాత బడిలో పంతులు గారి మెప్పుకోసం,

పెద్దయ్యాక ఆఫీసులో ’బాసు’ మెప్పుకోసం…… ఇలా.

మరెందుకు భగవంతుడికి ప్రీతిపాత్రులం కావాలనీ, భగవంతుడి మెప్పుకోసం పని చేయాలనీ అనుకోవడం లేదు?

ఒకప్పుడు మన సమాజంలో – ‘మనల్ని మన డబ్బూ, సంపద కాపాడవు. చేసుకున్న మంచే కాపాడుతుంది. మనం చేసే మంచి మన పిల్లలని, తరతరాలని కాపాడుతుంది. మనం చెడు చేస్తే అది మనల్నీ, మన పిల్లల్ని కట్టి కుడుపుతుంది [బాధిస్తుంది]. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు.’ ఇలాంటి నమ్మకాలు కులమతాలకీ అతీతంగా ప్రజల్లో ఉండేవి.

’ఏ జన్మలో ఏం పాపం చేశానో, ఇప్పుడనుభవిస్తున్నాను’ అనుకునేవాళ్ళే ఎక్కువమంది ఉండేవాళ్ళు’. ‘పాపిష్టి దేవుడు! ఏం పాపం చేశానని నాకింత అన్యాయం చేసాడు’ అంటూ దైవనింద చేసేవాళ్ళుకాదు.

అదే ఇప్పుడైతే మొదటి డైలాగ్ తగ్గిపోయి, రెండో డైలాగ్ పెరిగిపోయింది. ’సాక్ష్యం లేకపోతే చట్టం ఏం చెయ్యలేదు. చట్టానికి దొరక్కపోతే ఏతప్పు చేసినా ఏంఫర్వాలేదు. ఒకవేళ చట్టానికి దొరికినా పైవారికి లంచం ఇస్తే తప్పించు కోవచ్చు.’ - ఈ రకపు ఆలోచనాధోరణి పెరిగిపోయింది. ఈదృక్పధాన్ని మీడియా, సినిమా రంగం, మరింత పెంచి పోషించాయి.

కాబట్టే ’పైసా మే పరమాత్మహై!’, ’పైసా లేనిది భగవంతుడైనా పలకడు’, ’దేవుడైనా డబ్బున్న వాళ్ళనే కరుణిస్తాడు’ ఇలాంటి వ్యాఖ్యలన్నీ ప్రజల్లోకి పుట్టుకొచ్చాయి.

నిజంగా దేవుడికా పైసలు కావాలి? మనం సృష్టించుకున్న డబ్బు, మనం విలువని ఆపాదించుకున్న బంగారం లాంటి లోహాలూ మనకి ఎక్కువేమో గానీ దేవుడికి ఎక్కువా?

“నీవు ఎన్నిపాపాలైనా చెయ్! నా హుండీలో డబ్బులు వేస్తే, నాకు బంగారు ఆభరణాలు చేయిస్తే అన్నిటిని మాఫీ చేస్తా” అని దేవుడు ఎక్కడైనా అంటాడా?

మనం ఎలా డబ్బు సంపాదించినా సరే, సంపాదించిన దానిలో వాటా ఇస్తే వూరుకోవటానికి దేవుడేమైనా మన మంత్రులూ, ముఖ్యమంత్రులూ, ప్రధాన మంత్రుల వంటివాడా?

దీనికీ, ఒకప్పుడు యూరపులో అచ్చుయంత్రం కనుగొనడానికి ముందు, ప్రజలకి తమ మత గ్రంధాల్లో ఏం వ్రాసి ఉందో తెలియని చీకటి రోజుల్లో, దేవుడి పేరు చెప్పి ఆనాటి పోప్ లు [అప్పుడు చాలా మంది పోప్ లుండేవాళ్ళు.] ప్రజలనుండి వసూలు చేసిన పాపపరిహారపు పన్నులకీ, వీటికీ ఏమైనా తేడా ఉందా?[అప్పట్లో ఇప్పుడు LIC ఏజంట్లు ఉన్నట్లు ఈ పాపపరిహారపు పన్ను పత్రాలు అమ్మడానికి యూరపులో పోప్ ఏజంట్లు ఉండేవారట.]

ఈ లంచాలమారితనాన్ని అంది పుచ్చుకొనే కాబోలు రామలింగరాజులాంటి వారు వివిధ ఆలయాల్లో దేవుళ్ళకి 200 కిలోల దాకా బంగారం నగలూ గట్రా కానుకలుగా ఇచ్చాడట. మరి ఆ లంచానికి తృప్తి పడిపోయి దేవుడు వూరుకోవలసింది కదా! ఒక్క రామలింగరాజే కాదు, తిరుమలకి వెళ్ళే భక్తుల రద్దీలో అధిక శాతం ఇలాంటి వాళ్ళేనేమో! భక్తితోనో, నిష్కామంగానో నేడు గుడులకి వెళుతున్న భక్తులు తక్కువే. అలా గాక భగవంతుని పట్ల భయమూ, భక్తీ ఉంటే పాపభీతి కూడా అంతే ఉంటుంది, గనుక ఇన్ని కుంభకోణాలు, మోసాలు, అన్యాయాలు జరగవు కదా!

నిజంగా భగవంతుడు మనమిచ్చే కానుకలకు మురిసిపోయి, మనం చేసిన తప్పుల్ని మాఫీ చేస్తాడా?

ఒక్కసారి భగవద్గీతలోకి పరిగిస్తే.....

శ్లోకం:
నమే పార్ధాపి కర్తవ్యం త్రిషు లోకేషు కించన
నా నవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి

భావం:
అర్జునా! ఈ సమస్త లోకాల్లో నేను ’చేయవలసినది’ ఏదీ లేదు. నాకు చెందనిదీ, నేను పొందవలసినదీ ఏంలేదు. అయినా నేను ఎప్పుడూ కర్మలని [పనులని] ఆచరిస్తూనే ఉంటాను.

ఇదీ భగవంతుని మాట. అందుకే ఆయన భగవంతుడు.

గీత మనకి కర్తృత్వాంహకారమూ, కర్మఫలాసక్తి వదివి ‘పని’ చేయమని చెబుతోంది. అంటే ఫలితాన్ని ఆశించకుండా ‘పని’చేయమని చెబుతోంది. అయితే ‘పని’చేయకుండా ఫలితాన్ని ఆశించే స్థితికి మన సమాజం దిగజారిపోయింది. అందుకేకదా, లంచాలిచ్చి మార్కులూ, ర్యాంకులూ, పదోన్నతులూ, పదవులూ, ఉద్యోగాలూ పొందటం ఎక్కువైపోయింది?

అలా అడ్డదారిలో సంపాదించిన పాపంలో ఆయనకి వాటా ఇవ్వడానికి పుణ్యక్షేత్రాల కెళ్ళి మొక్కు తీర్చుకోవడాలు, దేవుడికి కానుకలు సమర్పించుకోవడాలు!
నిజానికి భగవంతుడు గీతలో

శ్లోకం:
పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్ష్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతం ఆశ్నామి ప్రయతాత్మనః

భావం:
ఎవరైనా సరే – ఆకును గాని, పూవును గాని, పండును గాని, చివరకు నీటిని గాని నాయందు భక్తితో నాకు సమర్పిస్తే, నేను దాన్ని ప్రేమగా స్వీకరిస్తాను.

అంతేగాని…….
ఎలాపైకి వస్తే నేం, పైకిరావటం ముఖ్యం.

ఎలాసంపాదిస్తే నేం, డబ్బు సంపాదించటం ముఖ్యం.

అందులో నావాటా నాకు ఇచ్చేస్తే సరి – అంటాడా దేవుడు?

ఈ సత్యం బోధపడితే గానీ తిరుమల కొండ మీద రద్దీ తగ్గదనుకుంటా!

ఏమంటారు?
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

3 comments:

తిరుమల కొండమీద రద్దీ తగ్గే ఉపాయాన్ని మనసుకు హత్తుకొనేలా చెప్పారు. ధన్యవాదాలు. ఈ ఉపాయాన్నే అందరూ ఆచరిస్తే ఎంతబాగుంటుందో కదా.

మరొక విషయము.
రాజసూయ యాగాన్ని నిరవహించిన తరువాత అన్ని సంపదలు కోల్పోయిన ధర్మరాజు యజ్ఞాలు చెస్తే శుభాలొస్తాయంటారే? నెలతిరక్కుండానే నాకు ఈగతి పట్టిందేమిటని నారదుని వద్ద వాపోతాడు. అప్పుడాయన చెబుతాడు అసలు విషయము. యజ్ఞమునకు[మనం పూజకు అనుకోవచ్చు]మంత్రము,యాజ్ఞికుడు,మనసు,యజ్ఞములో వాడే ద్రవ్యము కూడా పవిత్రమయినవి గావుండాలి.లేకుంటే అవి అనర్ధాలను తెచ్చి పెడ్తాయి. బలమున్నదిగదా అని నీ తమ్ములను దేశము మీదకు పంపితే వాళ్ళు వివిధ రాజ్యాల లోని రాజులను వారి సైన్యాలను చంపి వారి రక్తముతో తడిసిన ధనాన్ని తెచ్చారు. నువ్వా ధనాన్ని ఈ పవిత్రకార్యక్రమానికి ఉపయోగించావు తత్ఫలితముగా నీకీ దుస్థితి ప్రాప్తించినదని వివరించాడు.నీ శ్రమతో ధర్మబధ్ధంగా సంపాదించినది తప్ప వేరేగా సంపాదించినదానితో పుణ్యకార్యక్రమాలు చేసినా అవి విరుధ్ధ ఫలితాలనే ఇస్తాయి.ఇది గమనించాలి మనము.

సింపుల్ గా చాలా బాగా రాసారు, ఒకప్పుడు ప్రపంచానికి అధ్యాత్మిక సౌరభాలని పంచిన భారత దేశంలో అధ్యాత్మిక విలువలు లుప్తమైపోతాయేమో అని సందేహంగా ఉంది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu