ఆనాడు భారతీయుల్లో అత్యధికులు అతిపేదవారు. తాను అనుభవిస్తేనే అది తనకి హెచ్చరికగా ఉంటుందన్న నిబద్దతతో అర్ధ నగ్నమునియై, కొల్లాయి ధరించిన వాడు బక్కచిక్కిన గాంధీ. పేదల పట్ల ఆయన కున్న సహ అనుభూతి [సానుభూతి కాదు] అలాంటిది. ప్రజలు సత్య–అహింసల్ని ఆచరించేందుకు, బ్రిటీషువారిపై శాంతీ సహనాలతో పోరాడేందుకు ఉద్యుక్తులయ్యేటట్లు చేయటానికి, వారిలో స్ఫూర్తి రగిలించటానికి ఆయన తరచూ నిరాహారదీక్ష పూనేవాడు. ఆయన ప్రజలని వ్యక్తులలోని దౌష్ట్యాల్ని తరిమేందుకు పురికొల్పాడు గానీ వ్యక్తుల్ని తరిమేందుకు కాదు.

అదీ మనుషులపై ఆయన ప్రేమ. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే కదా! 1980 ల్లో కొందరు అతిమేధావులు “అహింసావాది నంటాడు గాంధీ. మరి తాను నిరాహార దీక్షలు చేస్తూ, చేసింది ఆత్మహింస కాదా!” అని వాదించే వారు. [పరహింస కంటే ఆత్మహింస నయం కదా! అదీగాక గాంధీ మార్గంలో నడవకుండానే విమర్శిస్తే తినకుండానే నెయ్యిగురించి టన్నులకొద్దీ ఉపన్యాసాలు కుమ్మరించడంలాంటిదే.]

ఇక ఇలాంటి వితర్కాలూ, వితండవాదనలతో, 1980 ల్లో, అప్పటికే బలం పుంజుకున్న మీడియా కుట్రదారులు గాంధీజీ, ఇంకా అలాంటి స్వాతంత్ర సమర యోధుల్ని విమర్శించడమే ఒక ట్రెండుగా సృష్టించగలిగారు. ఇప్పుడు ఏవిధంగా అయితే డిజైనర్ దుస్తులూ, డిజైనర్ ఆక్సాసరీలు, క్రికెట్టూ, అందులోని చీర్ లీడర్లూ, పబ్బులూ, అందులో బీర్లూ మొదలైన వాటిని ట్రెండు గానూ, అభివృద్ధి చిహ్నంగానూ ముద్రవేసి మోజుని, వేలంవెర్రిని సృష్టించగలుగుతున్నారో, అలాగే అప్పుడు[1980] కాలేజి విద్యార్ధుల్లో, యువతరంలో స్వాతంత్రసమరయోధుల్ని, దేశ పూర్వనాయకుల్నీ, దేశచరిత్రా, సంస్కృతిలని విమర్శించడం అనే ట్రెండుని సృష్టించారు. అప్పట్లో మోడరన్ అనుకొనే వారి భావాలు “మనం గాంధీ లాంటి పూర్వనాయకులని విమర్శించకపోతే చూసేవాళ్ళూ మనల్ని మేధావులు కాదనుకుంటారు. మనం భారత ఇతిహాసాలని, సంస్కృతిని నిరసించకపోతే మనల్ని ఛాందసులనీ, మోటువాళ్ళమనీ, [Un-fashioned, uncivilized and uncultured fellows] అనుకుంటారు. మనల్ని మోడరన్ యూత్ గా పరిగణించరు” అన్నట్లుండేవి.

దాంతో మెదడు ఉపయోగించకుండానే మీడియా [ఆనాటి వారపత్రికలతో సహా] సృష్టించిన ఈ ట్రెండుని అనుసరించేవారు! అలాంటి వారిలో అత్యధికులు నేడు సమాజంలో నేటియువతరపు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు. ఇక ఆలోచించండి. వాళ్ళు తమ పిల్లల్ని ఎలా పెంచిఉంటారో? అందుకే చాలామందిలో విలువలు కనిపించడం లేదు. [అందరూ ఇలాగే ఉన్నారని నేను అనను. అలా అందరూ ఉండి ఉంటే, ఈపాటికి ఈదేశం ఎప్పుడో కుప్పకూలి ఉండేది. చాలామంది ఉన్నారని చెప్పడమే నా ఉద్దేశం. అంతేగాని అసలు మంచివాళ్ళే లేరని కాదు. అదీగాక ప్రతీమనిషి లోనూ మంచీ చెడు రెండూ ఉంటాయి, మంచినిష్పత్తి చెడుకంటే ఎక్కువుగా ఉంటే మంచివారుగానూ, చెడు నిష్పతి మంచికంటే ఎక్కువుగా ఉంటే చెడ్డవారుగానూ పరిగణింపబడతారు అంతే.]

అలాగే ఈదుప్ర్పభావానికి గురియై పెరిగి పెద్దయిన వారు కేవలం మార్కులు, ర్యాంకులూ, ఉద్యోగాలు, డబ్బు సంపాదనలు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. విలువలు వారికి పట్టటం లేదు.

ఇంకా సంతోషించదగ్గ విషయం ఏమిటంటే – ఇప్పుడు పాతిక సంవత్సరాల లోపు కుర్రకారులో సామర్ధ్యం, ఆలోచనా పటిమ, సూటితనం, నీతి నిజాయితీ వంటి విలువలూ, ధృఢమైన అభిప్రాయాలతో కూడిన వ్యక్తిత్వం కన్పిస్తున్నాయి. అంటే నా ఉద్దేశం – పాతిక సంవత్సరాల లోపు యువతరంలో ఈ లక్షణాలున్న వారి నిష్పత్తి, 30 నుండి 40 ఏళ్ళ వాళ్ళల్లో ఈ లక్షణాలున్న వారి నిష్పత్తి కంటే, ఎక్కువ అని.

నిజానికి ఇలాంటి ట్రెండులు సృష్టించి ప్రజలని మోసగించటం బ్రిటీషు వారికి కొత్తకాదు. యూరపు చరిత్రలో కాంగ్రెస్ ఆఫ్ వియన్నా, ఫ్రెంచి విప్లవం, ప్రపంచయుద్దాలు దీనినే నిరూపించాయి. తరువాత భారత రాజకీయ రంగంలోకి ప్రచ్చన్నంగా సి.ఐ.ఏ. ప్రవేశించింది. అసలు మతం మీదా, మంచి మీదా, మానవత్వం మీదా కుట్రలతోనే ప్రారంభమైంది నకిలీ కణికుల గూఢచార కెరీర్.

ఇక వీళ్ళంతా కలిసి పన్నిన పన్నాగమే నయ్యే 1948, జనవరి 30 న అమలు జరిపిన బాపూజీ హత్య. స్వాతంత్రం వచ్చిన 4½ నెలల్లో అమలు జరిపిన హత్య.

ఇక భారత రాజకీయ రంగమ్మీద జరిగిన కుట్రలో హైదరాబాద్ నిజాం ప్రకరణం గురించి మనం ఇంతకు ముందే వివరంగా చర్చించాము. భారత్ లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ లో కలిసిపోతానంటూ ఐ.రా.స.కి ఆర్జీ చేసిన 7వ నిజాం, దాన్ని వెనువెంటనే మొబలైజ్ చేసిన బ్రిటీషు, ఇతర దేశాలు…. ఎంత వేగంగా జరిగిపోయాయి? నిజానికి అప్పటికి ఐ.రా.స. పురిటి కందే.

ఇక ఈనిజాం అయితే మరింత కౄరుడు, దుర్మార్గుడు కూడాను. అతడి మద్దతుదారులైన రజాకార్ల గురించి తెలంగాణా వారికి చెప్పనక్కరలేదు. విషయమేమంటే కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారికి దాన్ని గురించి తెలిసింది చాలా తక్కువే కావటం. తమకి కావలసిన దాన్ని ’పదేపదే’ ప్రచారించే మీడియా ఈ దౌష్ట్యం గురించి మాత్రం వీలయినంత మౌనం పాటిస్తుంది.

ఈ సందర్భంలో 2008 లో ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడిన [కృష్ణపత్రికలోనిది తీసుకొని రీప్రింట్ చేసారు] ఓ సంఘటన గురించి వ్రాస్తాను.

స్వాతంత్రం వచ్చిన తొలిరోజులు! రజాకార్ల దౌష్ట్యంతోనూ, కౄరచర్యలతోనూ అల్లాడిన నిజాం సంస్థానం, పటేల్ తీసుకొన్న పోలీసు చర్య అనంతరం భారత్ లో కలిసిపోయింది. ఈ సంఘటన రజాకార్ల అఘాయిత్యాలు పెట్రేగి ఉన్న సమయంలో జరిగింది, తర్వాత వెలుగుచూసింది. హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిపోయిన కొద్దికాలం తర్వాత ఓరోజు – కొంతమంది రైల్లో ప్రయాణిస్తున్నారు. అప్పటి రాజకీయాల గురించి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణ నాటి నిజాం క్రౌర్యం గురించి, రజాకార్ల హింస గురించి నడుస్తుంది. హఠాత్తుగా ఒక మహిళ తన ఒంటిమీది దుస్తులన్నీ విప్పి, అందరి ఎదుట నగ్నంగా నిలబడింది. అక్కడ పిల్లలూ, స్త్రీలూ, పురుషులు ఉన్నారు. అందరూ దిగ్భ్రాంతులయ్యారు. ఎవరూ మాట్లాడలేదు.

కొన్ని క్షణాల తర్వాత తేరుకున్న ఓ పెద్దాయన, "ఏమిటిది తల్లీ! ఇలా అందరి ఎదుట నిలబడతావా? ఆడదానివి కాదూ! ఇలా నిలబడటానికి సిగ్గుగా లేదూ?" అన్నాడట. ఒక్కసారిగా అగ్నిపర్వతం బ్రద్దలయినట్లు ఆమె “నేను కాదు. మీరందరూ సిగ్గుపడాలి” అంటూ భోరుమన్నది. దుఃఖాతిశయం తీరాక, దుస్తులు ధరించి, “నన్ను రజాకార్లు బహిరంగ స్థలంలో నగ్నంగా చెట్టుకి కట్టేసి వారం రోజులుంచారు. నానా హింసా పెట్టారు” అంటూ తన శరీరం మీద నాటి హింసల గుర్తులు చూపిందట. చూస్తోన్న అందరి కళ్ళల్లో నీళ్ళు!

ఇది ఆ రోజుల్లో కృష్ణాపత్రికలో ప్రచురింపబడినట్లుగా 2008 లో ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కేసీఆర్ ’నిజాం’ని పొగిడిన సందర్భములో ఈ వార్తని ప్రచురించింది.

ఇంతటి కసాయి తనం, హద్దుల్లేని హింస!

ఇలాంటి ఈ’నిజాం’ని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రభక్తిని ప్రదర్శిస్తున్న తెరాస నాయకుడు కేసీఆర్ ప్రశంసించాడంటే ఎంతనీచం అనాలి? ఎంతగా ’తెలంగాణాలోని ముస్లిం ఓట్ల కోసం అలాచేసాడు’ అనుకుందామన్న అదేసమయంలో ’తెలంగాణాలోని హిందూ ఓట్లు పోతాయన్న’ భయం కూడా వెన్నంటే ఉండాలి కదా! మరి అయినా ఎందుకు చేశాడు? అంటే ఈ ఓట్లకి అతీతంగా, కేసీఆర్ ఇంకెవ్వరికో ’విధేయత’ ప్రకటించుకున్నాడన్న మాట. ఇలాంటిదే మరొకటి, అద్వానీ పాకిస్తాన్ వెళ్ళి ’జిన్నా’ని పొగిడి వచ్చాడు. అద్వానీకి తెలియదా ఇక్కడకొస్తే ఆర్.ఎస్.ఎస్., శివసేన, బి.జె.పి.లోని నాయకులు, దేశంలోని హిందువులు తనని విమర్శిస్తారని. అయినా సరే ’జిన్నాజిందాబాద్’ అనడం ద్వారా, తన విధేయతని ప్రకటించుకోవడం ద్వారా, తన కేరీర్ గ్రాఫ్ ని కాపాడుకోవటం. లేకపోతే మురళిమనోహర్ జోషిలాగా కేరీర్ పోగొట్టుకోవలసి వస్తుంది.

నిజానికి ఇలాంటి సంఘటనలు మనం వార్తల్లో చూస్తునే ఉంటాం, చదువుతూనే ఉంటాం. కాకపోతే కార్యకారణ సంబంధాన్ని లోతుగా పరిశీలించం. ఉదయాన్నే కాఫీ చప్పరిస్తూ చదివే వార్తల్ని మర్నాటికే మరిచిపోతాం. మర్నాడు మీడియా మరో వార్తా సంచలనం అందిస్తుంది. మనం మామూలుగా అందులో పడిపోతాం. ఇదే మీడియా బలం కూడా!

ఇక హైదరాబాద్ సంస్థానం విషయానికొస్తే, ఇంతకు ముందు చర్చించినట్లుగా నిజాం స్వతంత్రంగా ఉంటాననీ, కాకుంటే పాక్ లో కలుస్తాననీ ఐ.రా.స.[1945 లో పుట్టిన ఐ.రా.స.కి 1947 లో] అర్జీ చేసుకున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబరు13,1948 న పోలీసు చర్య చేపట్టే సరికి 48 గంటల్లో నిజాం పాకిస్తాన్ కి పరారయ్యాడు. హైదరాబాద్ భారత్ లో కలిసి పోయింది. ఇంతకంటే ముందే మహాత్మాగాంధీ హత్య జరిగింది. 1948 చివరిలో అంటే సెప్టెంబరులో పోలీసు చర్య జరిగితే 1950 లో [రెండేళ్ళు తిరిగేంతలో] సర్ధార్ పటేల్ మరణించాడు. సహజ మరణం వెనుక అసహజ కారణాలెన్ని ఉన్నాయో, ఆనాడైతే ఎవరూ అనుమానించలేదు. ఇప్పుడు మనకు తెలిసిన టెక్నాలజీతో చూస్తే ఏదైనా సాధ్యమే.

సర్ధార్ పటేల్ Vs నిజాం సంస్థానం విషయంలో ఓ వినికిడి ప్రచారంలో ఉండేది. హైదరాబాద్ మీద పోలీసు చర్య తీసుకొనే ముందు నాటి గృహమంత్రి సర్ధార్ వల్లభాబాయి పటేల్ నాటి ప్రధాని నెహ్రుకి ముందుగా చెప్పలేదట. చెబితే వ్యతిరేకిస్తాడనీ సందేహించాడట. అప్పటికే నెహ్రు కాశ్మీరు, హైదరాబాద్ వంటి కొన్ని విషయాల్లో మెతకవైఖరి అవలంభించటమే ఈ సందేహానికి మూలకారణమట. [అలాంటి మెతకవైఖరి నెహ్రులో ఉండటానికి బలహీనకారణాలు ఏమైనా కానివ్వండి, మూల్యం మాత్రం ఆయనా, ఆయన తరువాతి రెండుతరాలు (కుమార్తె, మనుమడు) చెల్లించుకున్నారు అనుకుంటా.]

ఇక 1947 లో దేశవిభజన విషయానికి వస్తే, మతప్రాతిపదికన దేశవిభజన చేసారు కుట్రదారులు [బ్రిటిషు, సి.ఐ.ఏ., అనువంశిక నకిలీకణికుడు]. “పాకిస్తాన్ ముస్లింలకు ఉద్దేశింపబడింది. భారత్ హిందువులకు, లౌకికవాదులకు ఉద్దేశింపబడింది. అయితే ప్రజలు తమ ఇచ్చానుసారం నిర్ణీత గడువులోపల ఏదో ఒక దేశంలో స్థిరపడవచ్చు. అంటే ముస్లింల్లో ఎవరైనా భారత్ నుండి పాక్ కి వెళ్ళదలుచుకుంటే ఇక్కడి ఆస్థుల్ని అమ్ముకునో బదలాయించో, ఇతర ఆర్ధిక లావాదేవీలని సెటిల్ చేసుకొని, పాక్ వెళ్ళిపోవాలి. అక్కడి నుండి ఇటు రావాలనుకున్నవారైనా అంతే! ఏ మతస్తులైనా ఎక్కడ స్థిరపడాలనుకున్నా ’నిర్ణీత గడువు’ లోపల సదరు ప్రక్రియ అంతా ముగించుకోవాలి.”

ఇటువంటి ప్రకటనలు తూర్పుపశ్చిమ పాకిస్తాన్ లకూ, భారత్ కూ మధ్యగల సరిహద్దుల్లో విపరీతమైన రద్దీని సృష్టించాయి. భారత్ లో నివసిస్తూ పాక్ కి వలస వెళ్ళాలనుకున్నవారు తమ ఆస్థుల్ని వీలయినంత తొందరగా అమ్ముకోవలసివచ్చింది, లేదా ఆస్థుల్ని వదులుకొని పోవలసి వచ్చింది. అలాగే పాక్ లో ఉంటూ భారత్ కు రావాలనుకున్న వారి పరిస్థితీ అదే! నిర్ణీత గడువు కాలం పూర్తికావచ్చేసరికి ఇరువైపుల ప్రజల్లోనూ విపరీతమైన వత్తిడి, ఆందోళనా, ఆతృతా మొదలైన భావోద్రేకాలు పెరిగిపోయాయి. సహజంగానే ఎవరైతే వలస వెళ్ళేందుకు నిర్ణయించుకోలేదో అలాంటి వారు, వలస వెళ్ళాలనుకున్న ప్రజల ఆస్థుల్ని చవకగా కొనాలనుకోవటం, Exploit చేయటం, లేదా ఎవరూ కొనకుండా ఊర్కుంటే వదిలేసి పోతారు కదా, అప్పుడు ఆక్రమిద్దాం అనుకుంటూ వేచి చూడటం, కొన్ని చోట్ల బలవంతంగా ఆస్థుల్ని లాక్కోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో భావోద్వేగాలని బాగా రెచ్చగొట్టాయి. దానికి పుకార్లు తోడయ్యాయి. అక్కడ ముస్లింలని నరికారట అంటూ ఇక్కడ హిందువులని నరకటం, ఇక్కడ హిందువుల్ని నరికారట అంటూ అక్కడ ముస్లింలని నరకటం రెండు దేశాల్లోనూ జరిగింది. ఫలితంగా లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు . అంతకు రెట్టింపు హింసలు పాలయ్యారు.

ఇది అర్ధం చేసుకోవటానికి మీకు నేను ఓదృష్టాంతం [circumstantial] చెబుతాను. నేను గుంటూరు ’మాయాబజారు’లో పుట్టిపెరిగాను. అది పూర్తిగా ముస్లిం చేతివృత్తుల వాళ్ళు ఎక్కువుగా ఉన్న ప్రదేశం. అక్కడ ఆటోమొబైల్ రంగానికి చెందిన చాలా ముస్లిం కుటుంబాల మధ్య మేమూ, మరొకరు కేవలం రెండే హిందూ కుటుంబాలుండేవి. అందరి వ్యాపార స్థలం ఒక్కటే. ఈ మాయాబజార్ కు ప్రక్కన హిందూ కుటుంబాలు ఉండే బజార్లు ఉండేవి. కానీ ఏ గొడవా ఉండేది కాదు. చిన్నప్పుడు మేం ’ఉస్మాన్ బాబాయి’, ’అబ్ధుల్లా పెదనాన్న’, ’రహీం తాత,’ ’మున్వర్ మామాయ్య’ అంటూ పిలిస్తూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. సంక్రాంతి పండక్కి మాఇంటికి కనీసం 20 మంది ముస్లిం మిత్రులు విందుకి వచ్చేవాళ్ళు. రంజాన్ వస్తే మా ఇంట్లో పండగన్నట్లు ఉదయాన్నే బీరువాలో దాచిన కొత్త దుస్తులు వేసుకొని, కొత్త అత్తరు పూసుకొని పిల్లలందరం రెడీ అయిపోయేవాళ్ళం. వాళ్ళల్లో చాలామంది మా నాన్నగారితో “మేం మాత్రం అరబ్బునుండి వచ్చామా ఏమిటండీ! మా తాత ముత్తాతలు ఇక్కడివాళ్ళేగా. దేవుణ్ణి మేం అల్లా అంటాం, మీరు వెంకటేశ్వర స్వామి అంటారు అంతేగా” అనేవాళ్ళు. అలాంటిది ఆర్.ఎస్.ఎస్. మరియు బిజెపి ల కరసేవ, శిలాన్యాస్ ల తర్వాత పరిస్థితులు క్రమంగా మారిపోయాయి. హఠాత్తుగా వాళ్ళు “అజారుద్దీన్ సెంచరీ చెయ్యాలి. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గెలవాలి” అనడం మొదలెట్టారు. “తినేది ఈ నేల తిండి, పీల్చేది ఇక్కడి గాలి. ఉండేది ఇక్కడ నేల మీద. ఛస్తే పాతేయాల్సింది ఇక్కడ. మళ్ళీ పాడేది పాకిస్తాన్ పాట” అంటూ హిందువులు తిట్టడం మొదలెట్టారు. అంతకుముందు 1971-72 పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా, పిల్లలందరం [హిందూ, ముస్లిం రెండు కుటుంబాల పిల్లలూ] “పాకిస్తాన్ నీపిలక పీకిస్తాన్!” “భుట్టో! నిన్ను బూటు కాలితో తన్నిస్తాం!” అంటూ కలిసిపాడిన వాళ్ళమే. పాకిస్తాన్ తో యుద్ధం అప్పుడు కూడా రాని మత విభేదాలు, అర్.ఎస్.ఎస్. మరియు బిజె.పి. ల అయోధ్య కరసేవతో వచ్చాయి. 1990 – 1991 ల్లో అయితే గుంటూరు మాయాబజార్ లో కత్తులు నూరుకున్నారని ఓ మాట కూడా గుంటూరులో వినబడింది. నిజానికి అప్పటికి మాయాబజార్ షాపులు ఆటో నగర్ కి తరలిపోయాయి. మేం గుంటూరు – విజయవాడ జాతీయ రహదారి మీదగల ఫ్యాక్టరీకి మారిపోయాం.

ఈ సంఘటన గుర్తుకొచ్చినప్పుడు ‘బయటి శతృవు కంటే లోపలి శతృవే మరింత ప్రమాదకారి కదా’ అన్పిస్తూంది. ఇలాంటి సంఘటనలను బట్టి, ఆనాటి దేశవిభజన సమయంలో కుట్రదారుల strategy సృష్టించిన మతఘర్షణల తీవ్రత, హింస వూహించసాధ్యమవుతుంది.

ఈ మత ఘర్షణల నేపధ్యంలోనే ఇదే పైకారణ్నాన్ని[Over leaf reason] అడ్డం పెట్టుకొని బాపూజీని హత్యచేశారు. రాజీవ్ గాంధీ హత్య విషయంలో ఎల్.టి.టి.ఇ. సానుభూతిపరురాలిగా ధనూ ఎలాంటి పావో, ఇందిరా గాంధీ హత్య విషయంలో అపరేషన్ బ్లూస్టార్ సానుభూతిపరులుగా సెక్యూరిటీ గార్డులు ఎలా పావులో, నిన్న ముంబాయి దాడుల్లో కసబ్ లాంటి వారు ఎలా పావులో, అలాగే నాధూరాం గాడ్సే కూడా కుట్రదారుల చేతిలో ఓ పావు. అంతే!

దేశవిభజన విషయంలో మరో కుటిలత చూడండి. ఎటూ ముస్లింలకోసం ప్రత్యేక దేశం పాకిస్తాన్ అన్నప్పుడు దాన్ని ఒకేముక్కగా పశ్చిమపాకిస్తాన్ గా ఉండవచ్చుగా? ఉహూ! భారత్ కి రెండు ప్రక్కలా రెండు ముక్కలు తూర్పు పాకిస్తాన్, పశ్చిమపాకిస్తాన్. రెండు ప్రక్కలా రెండు. పక్కలో బల్లేల్లాగా! ఇప్పడవే బంగ్లాదేశ్, పాకిస్తాన్ లుగా టెర్రరిస్టుల్ని మన దేశంలోకి పంపే రహదారులయ్యాయి. ఇలా రెండు ముక్కల పాకిస్తాన్ ని 1947 లో ఏర్పాటు చేయటం ఎందుకంటే తమ భవిష్యత్తు కుట్రలకు ప్రాతిపదిక కోసమే! అందుకే ఆనాడు ముస్లింల మీదా, పాకిస్తాన్ మీద బ్రిటీషు ప్రభుత్వం అంత అతిశ్రద్ధ [extra care] చూపించింది.
ఈ 62 ఏళ్ళలో కుట్రదారులకి పాకిస్తాన్ మీద ఉన్న అతి శ్రద్ద, అతిప్రేమ, గారాబం ఎన్నోసార్లు నిరూపితమయ్యింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

3 comments:

meeru cheppindi vinnaka..
jariginavi anni traluchukuntunte idi anta oka perfect plan la anipistundi

@ indhu:
it is a perffect plan
@ ammaodi:
ఈ రోజు ఆంధ్రజ్యోతి చూసారా, నిజం నిర్భీతి అంటూ.. మరి ఆనాడు మీరు సాక్ష్యాదారాలతో చూపించినా ఎందుకు ప్రచురించలేదో?

మనోహర్ గారూ,

కృతఙ్ఞతలండీ! ఆంధ్రజ్యోతి తెచ్చి మరీ చదివాను. మీరు చెప్పకపోయి ఉంటే మేం మంచి ’కామెడీ’ మిస్సయ్యి ఉండేవాళ్ళం. మీడియా మాటలకీ చేతలకీ అంత దూరం ఉంటుంది మరి!
***********

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu