భారత రాజకీయ రంగమ్మీద కుట్రని మరింతగా అర్ధం చేసుకొనేందుకు మరొక ఆసక్తికరమైన అంశాన్నీ పరిశీలించండి.

మనదేశానికి స్వతంత్రం రాకముందు దేశంలో చాలామంది రాజులు, రాణులూ, పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. స్వాతంత్రం వచ్చాక దాదాపు 550 పైన చిన్నచిన్న సంస్థానాలు ఇండియాలో విలీనమయ్యాయని మనం చదువుకున్నాం.

మన పాఠశాల చరిత్ర పాఠాల్లో 1857 సైనిక తిరుగుబాటు గురించి చదివాం. ఆవు, పంది కొవ్వుల పైపూతలతో తయారైన తూటాల గురించిన పుకార్లు ఆ తిరుగుబాటుకు కారణం. మరోప్రక్క నానా సాహెబ్, తాంతియా తోపే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు. దాన్ని మన తొలి స్వాతంత్ర సమరంగా పరిగణిస్తారు. ఇది మనం చరిత్రపాఠంలో చదువుకున్నాం. దాని కంటే ముందుగా ఛత్రపతి శివాజీ పోరాటాన్ని తొలి పోరాటంగా గుర్తించాలని కొందరు వాదిస్తారు, అది నిజమే కదా!

వాస్తవానికి ఝాన్సీ లక్ష్మీ బాయి అసలు పేరు మనూ బాయి. ఝాన్సీ పీష్వాతో వివాహమయ్యాక ఆమె పేరు లక్ష్మీబాయిగా మార్చబడింది. ఆమెకి ఒక పుత్రుడు జన్మించి, కొద్ది కాలంలోనే మరణించాడు. ఆ దిగులుతో ఆమె భర్త స్వర్గస్తుడయ్యాడు. వారసులు లేనందున ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఒక పిల్లవాణ్ణి దత్తత తీసుకొంది. ఈస్ట్ ఇండియా కంపెనీ “దేశంలో ఒకవేళ ఏ రాజైనా పిల్లలు లేకుండా మరణిస్తే, అలాంటి వారి రాజ్యాలని ఈస్ట్ ఇండియా కంపెనీ తన రాజ్యాంలో కలిపేసుకుని, సదరు రాణికి జీవన భృతి ఇస్తుంది” అని ఓ చట్టం చేసిపారేసింది.

ఏం చట్టం ఇది? అసలు వాళ్ళకేం హక్కూ, అధికారం ఉన్నాయనీ, తుపాకీ తూటాలు తప్పితే? చిన్నరాజ్యాలని గుంజుకోవటానికి అదో వంక మాత్రమే. ఒక వేళ ఇలాంటి కారణమేదీ దొరక్కపోతే “ఈ రాజ్యంలో నీరు పారుతున్నది, గాలి వీస్తున్నది. అందుచేత ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రాజ్యాన్నీ తమ రాజ్యంలో కలిపేసుకుంటుంది” అని చట్టం చేసే వాళ్ళు. ఇక ఈ కారణాలు కూడా కుదరకపోతే ఏవో గిల్లికజ్జా పెట్టుకొని, ఆయా సంస్థానాల మీదకి దాడి చేసేవాళ్ళు. వాళ్ళకి కారణాలతో నిమిత్తం లేదు, రాజ్య విస్తరణ, ఇక్కడి సంస్థానాల నుండి, భారతదేశం నుండి సంపద కొల్లగొట్టుకు పోవడమే వారి తుది లక్ష్యం. [ఈ నాటికీ లండన్ లో వేలానికి వచ్చే వస్తువుల్లో ఎన్నో వస్తువులు భారతదేశంలోని ఒక నాటి సంస్థానాధీశులవో, ధనికులవో కావటం ఇక్కడ గమనార్హం. ఇందులో నిజాం నగలది ఓ ప్రత్యేకత అధ్యాయం. దీని గురించి తర్వాత తీరిగ్గా ముచ్చటించుకుందాం.]

ఇలాంటి కుతంత్రాలతో రాజ్యాన్ని కబళించే ప్రయత్నం చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తాంతియా తోపే, నానా సాహెబ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి యోధులు యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో ఒకసారి అలిసిపోయి ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి గ్యాలియర్ రాజైన సింధియా కోటకి తాత్కాలిక Shelter కోసం వెళ్ళింది. తోటి పొరుగురాజు కాబట్టి సానుభూతి చూపుతాడని, తమ యుద్ధానికి మద్ధతు తెలుపుతాడనీ ఆమె అనుకొంది. సింధియా ఆమెకు రక్షణ నిస్తానని మాట ఇచ్చాడు. నమ్మిన ఝాన్సీ లక్ష్మీబాయి అలసటతో నిద్రలోకి ఒరిగింది. అయితే నమ్మక ద్రోహియైన సింధియా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఝాన్సీ రాణి ఉనికిపట్టు గురించి సమాచారం ఇచ్చాడు. అదీ కుట్రలో సింధియాల తొలిదశ పాత్ర! వారికి ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధం చేయటం ఇష్టం లేకపోతే, లేదా వారికి ’కంపెనీ’ అంటే భయం అయితే, అదేమాట ఝాన్సీ రాణికి చెప్పడం కదా చేయాలి? దానికి బదులుగా స్నేహం నటించి, ఆమెకి సహాయ పడుతున్నట్లు నమ్మించి ద్రోహం చేశాడు. అదే చివరి యుద్ధం ఝాన్సీ లక్ష్మీబాయి జీవితంలో. సింధియా మోసాన్ని గ్రహించిన ఝాన్సీ రాణి తన కొద్ధిమంది అనుచరులతో అక్కడ నుండి బయటపడింది. అయితే ఎక్కువదూరం వెళ్ళకుండానే ఈస్ట్ ఇండియా కంపెనీతో తలపడవలసి వచ్చింది. చివరి రక్తపు బొట్టుని భారతమాతకు తిలకపు బొట్టుగా అర్పిస్తూ ఝాన్సీ రాణి నేల కొరిగింది.

ఇక్కడ భయంకరమైన సత్యం ఏమిటంటే – అంతటి దేశ ద్రోహులైన, కుట్రదారి మనస్తత్త్వం కలిగిన, కుట్రకు మద్దతుదారులైన సింధియాలు నేటికీ భారత రాజకీయాలలో రాణించగలుగుతుండటం! మాధవరావు సింధియాకి పాపం తృటిలో ప్రధాని అయ్యే అవకాశం పోయిందని ఓ మాట. ప్రధాని పదవి రేసులో ఉండినాడన్నది నిజం. అతడి కుమారుడు జ్యోతిరాదిత్య సింధియాకి నేటి యు.పి.ఏ. కుర్చీవ్యక్తి నాగమ్మ అశీస్సులున్నాయి. కనుకే కేంద్రమంత్రిగా వెలిగిపోతున్నాడు. రాజమాత విజయరాజే సింధియా, రాజ సోదరి వసుందరా రాజే ల వెలుగులూ తక్కువేంకాదు. ఏ పార్టీ అయినా సింధియాల వెలుగుకి ఆటంకం లేదు. ఇది చెప్పడం లేదా అన్ని పార్టీల వెనుకా ఉన్నది ఒకే వ్యవస్థ అని?

లేనట్లయితే – ఎంతో మంది వీరులు, రాజవంశీయులు ఎవరైతే మాతృ దేశ స్వాతంత్రం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి, బ్రిటిషు వారికి, యూరోపియన్ లకీ వ్యతిరేకంగా పోరాడారో, అలాంటి వీర పాండ్య కట్టబొమ్మనలు, తాండ్రపాపారాయుడులూ, ఉయ్యాల నరసింహా రెడ్డిలు – ఈ రోజు ఎక్కడా వారి వారసుల అడ్రసు ఉండదు. స్వాతంత్ర సమర యోధులైతే నేడు ఫించన్ల కోసం మంత్రుల కాళ్ళు పట్టుకుంటున్న సందర్భాలు కూడా చూస్తునే ఉన్నాము. ఎక్కడైతే స్వాతంత్ర సమరం జరిగిందో అక్కడ అంటే వారి కోటలు శిధిలమైపోయాయి. కొన్ని భూమిలో కలిసిపోయాయి. కొన్ని గతకాలపు గుర్తుగా శిధాలావస్థలో టూరిస్టు సెంటర్లయ్యాయి. వాటి సంరక్షణ అంతంత మాత్రమే. అంతెందుకు? మన ఆంధ్రదేశంలోనే, మనం మన చిన్న తరగతుల్లో పాఠాల్లో చదువుకున్నాం, బుర్ర కథల్లాంటి జానపద కళారూపాల్లో చూశాం ’బొబ్బిలి యుద్ధం’ గురించి. అది ఫ్రెంచి వారికి వ్యతిరేకంగా ఆంధ్రులు జరిపిన తొలి స్వాతంత్ర సమరాలలో ఒకటి.

ఎంతో పౌరుషవంతులైన, వీరులైన బొబ్బిలి వారు ఫ్రెంచి వ్యాపార గుంపుకి విధేయులు కాలేదు. ‘బుస్సీ’ నాయకత్వాన ఫ్రెంచ్ సేనలు చాలా సార్లు బొబ్బిలి కోటనీ వశపర్చుకోవాలని యత్నించాయి, కానీ గెలవలేక పోయాయి. అయితే విజయనగరం రాజు విజయ రామరాజు గజపతి, ఫ్రెంచి వారితోనూ, బుస్సీతోనూ నేస్తం కట్టాడు. వాళ్ళ వేషభాషలకూ, ఫ్రెంచి వైనుకీ మైమరచి, వారి ఆయుధాలకి లోబడి వారి కుట్రల్లో భాగం పంచుకున్నాడు. స్థానికుడైన కారణాన కోట ఆనుపానులు, ఇతర సమాచారం సేకరించి ఫ్రెంచి వారికి చెప్పాడు. దాని ప్రకారం బొబ్బలివీరులలో ప్రముఖడు తాండ్రపాపారాయుడు కోటలో లేని సమయాన, కోటలో అందరూ వివాహ వేడుకల్లో మునిగి ఉన్న సమయాన, యుద్ధ సన్నద్ధత ఏమాత్రం లేక అదమరచి ఉన్న సమయాన ఫ్రెంచి సేనలు ముందస్తు యుద్ధ సమాచారం లేకుండా దాడి చేశాయి. బొబ్బిలి కోట అందుకు సిద్ధంగా లేదు. ఇది ఫ్రెంచి సేనలకి కలిసి వచ్చింది. విజయం దక్కింది. ఇప్పుడు ఆ శిధిలాల గుర్తులు మాత్రమే మనం బొబ్బిలిలో చూడగలం. బొబ్బిలి వారి ఆడబడుచు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పైడితల్లిదేవతగా ప్రజల మనస్సుల్లో స్ధిరంగా నిలిచిపోయింది.

విజయనగరం కోట అయితే చెక్కుచెదరని అందంతో నేటికీ నిలిచి ఉంది. కొన్ని భవనాలు సంగీత కళాకారులుగా, ఇతర కాలేజీలుగా రూపాంతరం చెందాయి. ఆ భవనాల్లాగే విజయ నగర మాజీ రాజులు పూసపాటి గజపతులు నేటికీ ఎం.ఎల్.ఏ.లూ, ఎం.పి. లుగానూ, మంత్రులు గానూ రాణిస్తున్నారు రాజకీయాల్లో. అశోక గజపతి రాజు పూసపాటి, ఆనంద గజపతిరాజు పూసపాటి, ఉమా[గజపతిరాజు] వగైరా వగైరాలన్నమాట. [ఉమా గజపతిరాజు 1992 తరువాత పూసపాటి రాజా వారితో వివాహం తెగతెంపులు చేసుకొని, పునర్వివాహం చేసుకొంది.]

ఈ విధంగా రాజకీయాల్లో కేవలం కుట్రదారులు, ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేశారో, ఎవరైతే బ్రిటీషు, యూరోపియన్లకి సాయంచేసి దేశభక్తులకి ద్రోహం చేశారో వారే రాణించడం, మెల్లిగా స్వాతంత్ర సమర వీరులంతా మూలకి నెట్టివేయబడి వీరిదే మొత్తం అధికారం కావడం మనం కాదనలేని సత్యం. ఇది చెప్పడం లేదా అనుశృతంగా జరుగుతున్న సుదీర్ఘ కాలపు కుట్రని?

నకిలీ కణిక వంశీయులు, మీడియా ముసుగు వేసుకున్న కుట్రదారులూ, వారి మద్ధతుదారులూ ఎప్పుడూ సింధియాలూ, విజయ నగర గజపతి రాజులూలాంటి వారికే ఇమేజీ, ప్రచారం ఇవ్వడం మనం చూస్తునే ఉన్నాము. నేను ఒకటి రెండు ఉదాహరణలే ఇలాంటి రాజవంశాల గురించి చెబుతున్నాను. ఉత్తర దక్షిణ భారత దేశంలో ఇలాంటి మాజీ రాజవంశాల నుండి రాష్ట్ర మంత్రులూ, కేంద్ర మంత్రులూ అయిన వారు ఎందరో ఉన్నారు. నీరజా చౌదరి అన్నట్లు మొత్తం రాజకీయ అధికారం కేవలం 500 కుటుంబాలకే పరిమితమైనా మనం ఆశ్చర్యపోవలసింది లేదు.

వాస్తవానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నిజాయితీగా దేశభక్తితో పోరాడిన స్వాతంత్ర సమర యోధుల్లో అత్యధికులు తమ పూర్వ వృత్తులకి మళ్ళారు. ఎందుకంటే వారు అధికారం కోరి పోరాడలేదు, మాతృదేశపు దాస్య విముక్తి కోసం మాత్రమే పోరాడారు గనుక.

ఓ సంఘటన గుర్తు చేస్తాను.

స్వాతంత్రసమరం ఉచ్ఛస్థితిలో సాగుతున్నప్పుడు ఓ విదేశీ పత్రిక విలేఖరి లోకమాన్య బాలగంగాధర తిలక్ ని అడిగాడట. “ఇండియాకి స్వాతంత్రం వస్తే మీరు ఏ పదవి నిర్వహిస్తారు?" అని. ఆయన బుంగమీసాలు మాటున చిరునవ్వు నవ్వుతూ “నేను సంతోషంగా నా విద్యార్ధులకి పాఠాలు చెప్పుకోవడానికి వెళతాను” అన్నాడట.

[అంతేకాదు నిస్వార్ధ దేశభక్తిపూరితులైన ఎందరో స్వాతంత్ర సమరయోధుల జీవితాలు, వారి వారసులు బ్రతుకులూ ఎలా ఈ కుట్రలో బలయ్యాయో మరింత వివరంగా తరువాత చర్చిస్తాను. వెంటనే వివరాలు కావాలంటే Coups On World లోని Coup On Politics….. లో చూడగలరు.]

అప్పటికే కొందరు స్వార్ధపరులూ, భౌతికవాదులూ బ్రిటీషు వారి నుండీ, పాశ్చాత్యుల నుండీ కుట్రా కుతంత్రాలు బాగా నేర్చేసుకున్నారు. స్వాతంత్రం వచ్చేవరకూ వీరంతా బ్రిటీషు వారికి సేవ చేశారు, వారితో స్నేహం చేశారు. ఉద్యోగాలో, వ్యాపారాలో చేసుకున్నారు. స్వాతంత్ర సమరంలో ఏ ఘట్టంలోనూ పాల్గొన లేదు. ఏనాడూ ఒక్క రోజు కూడా జైలుకు పోలేదు. తమ స్వసుఖాలు ఒక్కటైనా త్యాగం చేయలేదు. దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, వందేమాతర ఉద్యమం – వేటిల్లోనూ తొంగి కూడా చూడలేదు. కానీ ఇండియాకి స్వాతంత్రం వచ్చిన 1947,ఆగస్టు15 తెల్లవారేసరికి ఈ ప్రబుద్ధులంతా గాంధీ టోపీలు నెత్తిన పెట్టి, మువ్వన్నెల జండా భుజాన పెట్టుకొని రాజకీయాల్లో ప్రత్యక్షమయ్యారు. కాలగతిలో స్వాతంత్ర సమర యోధుల సర్టిఫికేట్లు పుట్టించడం వారికి పెద్ద సమస్య కాలేదు. ఎటూ నకిలీ కణికులూ, కుట్రదారులూ వారికి వెన్నుదన్నుగా ఉన్నారు కదా!

క్రమంగా ఈ స్వార్ధ ప్రబుద్ధులే రాజకీయాల్లో టాప్ లీడర్లయ్యారు. Camel in the Desert కధలోని ఒంటెల్లా నిజమైన, నిజాయితీ గల దేశ భక్తుల్ని రాజకీయ రంగం నుండి వెళ్ళగొట్టారు. చివరకి నాటి స్వాతంత్ర సమర యోధుల్ని బిచ్చగాళ్ళ స్థాయికి తరిమి తరిమి గొట్టారు. వీరిలో హైదరాబాద్ సంస్థానంకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణా స్వాతంత్ర సమర యోధుల స్థితి మరింత దయనీయం. పించన్ల కోసం నేటి రాజకీయ నాయకుల [వీరిలో చాలామంది నాటి దొంగ దేశభక్తుల వారసులే] కాళ్ళుపట్టు కోవటం కూడా చూస్తున్నాం.[చూసినా మన గుండె పట్టుకుపోక పోవడం నిజంగా దారుణం.]

ఈ విషయాన్ని మరింతగా పరిశీలించడానికి, రాజకీయ రంగమ్మీద నకిలీ కణికుల కుట్రని మరింతగా విశదీకరించడానికి నేను మీకు ఎన్.టి.ఆర్. దృష్టాంతాన్ని సూచిస్తాను.

1947 లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఎన్.టి.రామారావు పాతికేళ్ళ యువకుడు. కానీ అతడు భారత స్వాతంత్రసమరంలో పాల్గొన్నట్లు గానీ, జైలు కెళ్ళినట్లుగానీ, బ్రిటీషు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినట్లు గానీ ఏ దాఖలాలూ లేవు. పూర్ణ యవ్వనంలో, వేడి నెత్తురు ఉరకలేస్తూన్న వయస్సులోనూ, అందునా స్వాతంత్ర సమరభేరి ఎల్లెడలా మ్రోగుతూ దీప్తి, స్ఫూర్తి రగిలిస్తోన్న వేళ చిన్నాపెద్దా, ఆడామగా పేదా ధనికా తేడా లేనంతగా అత్యధిక భారతీయులు దేశభక్తితో గర్జిస్తున్న వేళా అతడెంత మాత్రం స్పందించలేదు.

కానీ 1981 తర్వాత హఠాత్తుగా తన 58 పైబడిన వయస్సులో అతడు దేశభక్తి [పోనీ రాష్ట్రభక్తి] పూరితుడై, ప్రజా సేవచేయాలని నిశ్చయించాడు. అతడు గొప్ప నటుడు. ఆ నటనా చాతుర్యానికి, అతడి సుందర రూపంతో ఏ పాత్రనైనా మెప్పించగల కళకీ అందరిలాగ నేనూ ఎంతో ముగ్ధురాలినౌతుంటాను. అవి అతడి పాజిటివ్ లక్షణాలు. అంత మాత్రం చేత అతడిలో లోపాలని ఒప్పుకోలేం కదా! ఇక్కడ భర్తృహరి శ్లోకం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. భావం వ్రాస్తున్నాను. “పాము తల పైన నాగమణి మెరుస్తున్నదనో, పాముచర్మం తళతళలాడు తున్నందునో దాన్ని దగ్గరికి చేరనీయం. ఎందుకంటే అది విషపూరితమైనది కాబట్టి. అలాగే వ్యక్తులు ధనికులైనా, సుందరాకారులైనా, పాండిత్యమూ, లేదా కళా నైపుణ్యమూ ఉన్నా కూడా, సౌశీల్యం లేనట్లయితే పాముని దరిచేరనీయనట్లే వారినీ దరిచేరనీయకూడదు” అని! మీడియా, ఇతర సహనటుల ప్రశంసల ప్రకారం అతడికి, అతడి వృత్తిలో క్రమశిక్షణ ఉండనివ్వండి, నిబద్ధత ఉండనివ్వండి. అది అతడి కెరీర్. ఆ నటజీవితంలో అతడు డబ్బూ, పేరు సంపాదించుకున్నాడు. అందువలన ప్రజలకి ఒరిగిందేమీ లేదు. కళారంగం, అందులో అతని కృషి ప్రజలకి వినోదాన్ని ఇచ్చేది మాత్రమే.

అతడు గొప్పనటుడైనంత మాత్రనా, అందమైన వాడయినంత మాత్రనా, [లేదా ఇప్పటి వరకూ మీడియా అతణ్ణి దేవుణ్ణి చేసినంత మాత్రనా అంటే దేవుడి పాత్రలనూ అతడికి అపాదించటం] అతడు గొప్ప దేశభక్తుడనలేం. అలా అనేటట్లయితే – ఓ డబ్బున్న ఎం.పి. కొడుకో, ఎం.ఎల్.ఏ. కొడుకో, తాను అందంగా [జనాకర్షణగా] ఉన్నాను గనుక, డబ్బున్నది గనుకా లేదా తను చక్కగా పాడగలడో, డాన్స్ చేయగలడో గనకా తానేం చేసినా కరెక్టే అంటే ఒప్పుకుంటామా?

నకిలీ కణికుడుకి భారత ఇతిహాసాల మీద చేసిన కుట్రలో సదరు ఎన్.టి.రామారావు ఎంతగానో తోడ్పడ్డాడు గనుకే ప్రతి ఫలంగా సినిమాల్లో అతడు రిటైరయ్యే నాటికి రాజకీయ రంగపు కెరీర్ అందించబడింది. [ఇతిహాసాలలో, ఎన్నో ప్రక్షిప్తాలని ఎలా చొప్పించారో, ఎలా నష్టపరిచారో విపులమైన చర్చ Coups on World లోని Coup On Epics లో దృష్టాంతాలతో సహా చర్చించాను. కొంత భాగం గత టపాలలో అనువదించాను. మిగిలినది తదుపరి టపాలలో అనువదిస్తాను.]

1970 లల్లో ఆనాటి మేటి నటి సావిత్రి ఇమేజిని, ఛరిస్మాని ఇందిరా గాంధీకి కళ్ళెం వేయడానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నించగా ఆవిడ ఒప్పుకోలేదట. ఆ రీత్యానే ఆవిడ వ్యక్తిగత వృత్తిగత జీవితంలో వత్తిడి, వ్యసనాలూ, సృష్టించబడ్డాయట. దాంతో పోటీని తట్టుకోలేక పోవడం, జమీనీ గణేశన్ ని వివాహం చేసుకోవటం లాంటి తప్పటడుగులు వేసి ఓటమి పాలయ్యిందనీ, అయితే ’రాజకీయరంగంలో పావుగా తమకి ఉపయోగపడలేదన్న కసి ’సావిత్రిని మరణశయ్య మీద సంవత్సరంపాటు కోమాలో ఉంచి దయనీయమైన చావుకి గురిచేసిందనీ మా చిన్నప్పుడు గుంటూరులో చెప్పుకోగా విన్నాను. మా వీధికి వెనుక వీధిలో ఆ నాటి నటి ఛాయాదేవి ఇల్లు ఉండేది. ఏడాదికోసారి ఆవిడ చెన్నపట్నం నుండి వచ్చేది. ఆవిడ వచ్చినప్పుడు మా వీధిలోని ఆడవాళ్ళంతా వెళ్ళి ఆవిడని చూసి పలకరించి వచ్చేవాళ్ళు. అలా చూసి వచ్చిన వాళ్ళు మా వీధి ఆరుగుల మీద కబుర్లాడుతుండగా ఇలాంటివి విన్నప్పుడు గాలి కబుర్లనుకొని నమ్మలేదు. అయితే సావిత్రి మరణించాక, 1975 తర్వాత సినిమా రంగం మీద నకిలీ కణికుడి పట్టుపెరిగి పోవడం, ఆ తర్వాత సినిమాల్లో నాణ్యత మరింత తరిగిపోయి అశ్లీలతా శాతం పెరిగిపోవటం, గాడ్ ఫాదర్ షిప్ లు నటీనటుల్ని, సినిమా కథల్ని శాసించటం – ఇవన్నీ పరిశీలించాక ఆ గాలి కబుర్లలో నిజం ఉండే అవకాశం కన్పించింది. అయితే ఏ ’కబురు’ ల్లోనైనా ’గాలి’ ఎంతో, నిజం ఎంతో తెలియచెప్పాల్సిన ’మీడియా’నే అసలు కుట్రదారు అయినప్పుడు దేన్ని మాత్రం నమ్మగలం? కనుక ఇక్కడికీ విషయాన్ని ఆపి మళ్ళీ ఎన్.టి.రామారావు దగ్గరి కొద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

9 comments:

ఎన్నడూ ఊహించని కోణమిది. చాలా బాగా రాశారు.

interesting, and eye opening

ivi nmma leni nijalla unnayi
ivi anni telisaka kallu undi guddi vallama ane sandeham kaluguthundi

Very interesting - Too Good!

లక్ష్మి గారూ! నేను మీ వ్యాసాలన్నీ చదువుతుంటాను. భారతదేశంలో కుట్రలు, కుతంత్రాలు ప్రవేశించిన వైనాన్న్ని చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు!

పై వ్యాసం లోని ఓ పేరాలో మీరు రాసిన విషయం మీద నాకు రెండు సందేహాలు కలిగాయి. దయచేసి నివృత్తి చేయగలరు. ఆ పేరా...

“ఎంతో పౌరుషవంతులైన, వీరులైన బొబ్బిలి వారు ఫ్రెంచి వ్యాపార గుంపుకి విధేయులు కాలేదు. ‘బుస్సీ’ నాయకత్వాన ఫ్రెంచ్ సేనలు చాలా సార్లు బొబ్బిలి కోటనీ వశపర్చుకోవాలని యత్నించాయి, కానీ గెలవలేక పోయాయి. అయితే విజయనగరం రాజు విజయ రామరాజు గజపతి, ఫ్రెంచి వారితోనూ, బుస్సీతోనూ నేస్తం కట్టాడు. వాళ్ళ వేషభాషలకూ, ఫ్రెంచి వైనుకీ మైమరచి, వారి ఆయుధాలకి లోబడి వారి కుట్రల్లో భాగం పంచుకున్నాడు. స్థానికుడైన కారణాన కోట ఆనుపానులు, ఇతర సమాచారం సేకరించి ఫ్రెంచి వారికి చెప్పాడు. దాని ప్రకారం బొబ్బలివీరులలో ప్రముఖడు తాండ్రపాపారాయుడు కోటలో లేని సమయాన, కోటలో అందరూ వివాహ వేడుకల్లో మునిగి ఉన్న సమయాన, యుద్ధ సన్నద్ధత ఏమాత్రం లేక అదమరచి ఉన్న సమయాన ఫ్రెంచి సేనలు ముందస్తు యుద్ధ సమాచారం లేకుండా దాడి చేశాయి. బొబ్బిలి కోట అందుకు సిద్ధంగా లేదు. ఇది ఫ్రెంచి సేనలకి కలిసి వచ్చింది. విజయం దక్కింది. ఇప్పుడు ఆ శిధిలాల గుర్తులు మాత్రమే మనం బొబ్బిలిలో చూడగలం. బొబ్బిలి వారి ఆడబడుచు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పైడితల్లిదేవతగా ప్రజల మనస్సుల్లో స్ధిరంగా నిలిచిపోయింది.”

మొదటి సందేహం: పైడితల్లి అమ్మవారిని బొబ్బిలివారి ఆడపడుచుగా రాశారు. కానీ నాకు ఆమే పూసపాటివారి ఆడపడుచుగానే తెలుసు. అందరూ అలానే భావిస్తారనుకుంటాను.

ఇక రెండవ సందేహం: బుస్సీ బొబ్బిలి కోటను కొట్టడానికి అనేక సార్లు ప్రయత్నించాడు, చివరికి తాండ్రపాపారాయుడు కోటలో లేని సమయంలో విజయరామరాజు సహాయంతో, కుట్రతో జయించగలిగాడనడం. ఇదంతా విజయరామరాజుకైతో సరిపోయేది. కానీ మీరు బుస్సీకి ఆపాదించి రాశారు.

బొబ్బిలివారు మన తెలుగువారు గర్వించదగ్గ వీరులే. పాపారాయుడు అసహాయ శూరుడే. అంతమాత్రాన బుస్సీని తగ్గించి చూపవలసిన పనిలేదనుకుంటాను. చరిత్ర రచనలో కొంత వక్రీకరణ జరిగితే జరిగి ఉండవచ్చు. కానీ మీరు చెప్పిన ఈ రెండు విషయాలు నాకెందుకో అసంబద్ధంగా అనిపించాయి.

బుస్సీ మంచివాడా, చెడ్డవాడా అనే విషయాన్ని పక్కనబెడితే అతను చరిత్రలో రాబర్ట్ క్లైవ్ సరసన పేర్కొన దగిన వ్యక్తి. రణతంత్రంలో ఆరితేరిన మహాయోధుడు. భారతదేశాన్ని జయించడానికి ఒక దశలో ఫ్రాన్సు దేశాధినేతలు బుస్సీని మాత్రమే సంప్రదించారు. అంతటి బుస్సీని స్థానికి వీరులైన బొబ్బిలి వారి ముందు చిన్న బుచ్చడం సినమాలలో అయితే చెల్లుతుంది, కానీ మీరు చరిత్రను కొత్త కోణంలో విశ్లేషిస్తున్నారు. మీరు మరింత జాగ్రత్త గా ఉండాలి. లేదంటే మీరు రాసే విషయానికి ప్రామాణికత ఉండదు.

మీరు నా కామెంట్ ను పాజిటివ్ గా తీసుకుంటారని ఆశిస్తున్నాను. నేనూ చరిత్ర అభిమానినే. :)

సరస్వతీ కుమార్ గారు,

ముందుగా నా బ్లాగులో వ్యాఖ్యవ్రాసినందుకు కృతఙ్ఞతలండీ!
మీరు లేవనెత్తిన మొదటి సందేహం – పైడితల్లి దేవతకీ బొబ్బిలి వారికీ ఉన్న బాంధ్యవ్యం గురించి పైడితల్లి ఉత్సవాల సందర్భంలో చదివాను. మరోసారి పరిశీలిస్తాను.

ఇక బుస్సీ విషయం – తాండ్రపాపారాయడు ఏకపాత్రాభినయంలో బుస్సీని సంభోధిస్తున్న సంభాషణలు ఉన్నాయి. స్థానిక బుర్రకథాకళాకారుల కథల్లోనూ, నాటకాలలోనూ బొబ్బిలి యుద్ధం, కోస్తా ప్రాంతాంలో ప్రచారమై ఉంది. అందుచేత ఫ్రెంచ్ సేనలకి విజయరామరాజు సాయం చేసినందునే బొబ్బిలి కోట నేల కూలిందన్నది ఈ జానపద కళారూపాల్లోని కథావస్తువుగా నేనేఱుగుదును. దాన్నే నా వ్యాసంలో ఉటంకించాను. చరిత్ర గ్రంధాల్లో, పరిశోధక గ్రంధాల్లో ఏంవ్రాసి ఉందో నాకు తెలీదు గానీ చిన్నతరగతుల్లో మనం చదువుకున్న చరిత్ర పాఠాల్లో మాత్రం ఇదే కథ ఉంది. ఇప్పుడసలు అలాంటి పాఠాలే లేవనుకొండి!

ఇక బుస్సీ రణతంత్ర నిపుణుడే కావచ్చు గాక, కానీ నీతివంతుడా, కాదా అన్నదే నేను చేసిన చర్చ. ఏ వ్యక్తికైనా అతడి కున్న ధనమో, అందమో, కళాకౌశలమో, సాంకేతిక నైపుణ్యమో, జాతీయతో – ఇలాంటి లక్షణాలన్నింటి కన్నా అతడిలోనీ మానవీయ విలువలు, సౌశీల్యం, మానవత్త్వాన్ని బట్టే ఆ వ్యక్తిని విశ్లేషించాలని నేను అనుకుంటాను. నా టపాలో నేను ఉదహరించిన భర్తృహరి శ్లోకం కూడా మనకి ఇదే నీతిని బోధిస్తుంది. కనకదాసు, సూరదాసు, నందుడు మొదలైన భక్తుల కథల్లోనూ మనకి దేవుడు భక్తుల పాండిత్యం, శాస్త్రఙ్ఞానం, కళానైపుణ్యం ఇలాంటి అర్హతల్ని బట్టిగాక, వారి మంచితనాన్ని బట్టే వారిపట్ల ప్రీతి చెందినట్లు చెబుతాయి.

అలాచూస్తే బాపూజీ ఎవరేజ్ స్టూడెంట్ నని తానే చెప్పుకున్నాడు. కానీ ఆయన లోని మానవీయ విలువలు, సౌశీల్యం, మానవత్వం ఆయన్ని మహత్మణ్ణి చేయటం మన కళ్ళముందు నిలిచిన సత్యం కదా! మరో ఉదాహరణ – ఓ శాస్త్రవేత్త ఏ ఫిజిక్స్ లోనో గొప్ప మేధస్సు కలిగి ఉండి [బుస్సీకో, అలెగ్జాండర్ కో ఉన్న యుద్ధ నైపుణ్యంలాగా] ఆ నైపుణ్యంతో ఇతరులని కీడు కలిగించే పని చేస్తే అతడి నైపుణ్యం కారణంగా అతణ్ణి క్షమించం కదా! ఇది నా అభిప్రాయం మాత్రమే. భారతదేశానికి వ్యాపారం కోసమై వచ్చి, ఆ పైన రాజ్యాధికారానికి ప్రయత్నించి, దోపిడి చేసిన యూరోపియన్లని కూడా [ఫ్రెంచి వారితో సహా] నేను ఇదే అభిప్రాయంతో చూస్తాను. ఆనాటి యూరోపియన్ల వ్యాపారులు దోపిడి దొంగలే! ఈమాట మనం కాదు, ఆనాడే వారి దేశస్థులే అనేవాళ్ళు. ఈ విషయం గత టపాలో వ్రాసాను. ఆనాటి యూరోపియన్ల మానసిక వారసులే ఈనాటి కార్పోరేట్ కంపెనీలు. నా ఈ ప్రతిస్పందన మిమ్మల్ని నొప్పించలేదని ఆశిస్తాను.

అయితే మీరన్నా మాట కూడా నిజం. ఎవరి గురించి వ్రాసినా నిష్పక్షపాతంగా వ్రాయాలి. లేకపోతే విశ్వసనీయతా, ప్రామాణికతా దెబ్బతింటాయి. మీరిచ్చిన సలహా గుర్తుంచుకుంటాను.

మరో విషయం నేను చరిత్రని కొత్త కోణంలో విశ్లేషిస్తున్నాను అనే కంటే కుట్రకోణంలో విశ్లేషిస్తున్నాను అనుకుంటున్నాను. ఒక్క చరిత్రని, రాజకీయ రంగాన్నే కాదు, నాకు తెలిసినంత వరకూ అన్ని రంగాల్లో జరిగిన కుట్రని విశ్లేషిస్తున్నాను. వివిధ రంగాల మీద కుట్రకోణాన్ని నా ఆంగ్ల బ్లాగు Coups On World లో వ్రాసాను. మీకు సమయం అనుమతిస్తే చదివి అభిప్రాయం చెబితే సంతోషిస్తాను.

మీబ్లాగు `సుధర్మ’ లోని LAWS నేను చదువుతుంటాను. నాకు అవి అక్షర సత్యాల్లా కన్పిస్తాయి. దాదాపు అన్ని నాకు అనుభవపూర్వకంగా బోధపడినవే. ప్రతీదానికి చాలా ఉదాహరణలు నా జీవితంలోంచి చెప్పగలను.

నన్ను హెచ్చరించినందుకు మరోసారి కృతఙ్ఞతలు.

చాలా రోజుల తరువాత నాకిష్టమైన అంశంపై మంచి వ్యాసం చదివాను.
ధన్యవాదములు
బుస్సీ గొప్ప రణతంత్రకారుడు. అతనికి ఫ్రెంచ్ రిపబ్లిక్ సంపూర్ణాధికారాలు ఇచ్చినట్లయితే భారతదేశమంతా బ్రిటిష్ వారి పాలన క్రిందికి కాక ఫ్రెంచి వారి పాలనలోకి వచ్చిఉండేది అన్న ఒక వాదన ఉంది. అలా ఇవ్వకపోవటానికి కారణం అప్పటికే ఫ్రాన్స్ ఒక ప్రజాస్వామ్య యుత దేశంగా కొంత మానవతతో వ్యవహరించేదశకు చేరుకోవటం అని అంటారు.
బుస్సీ చరమాంకం కూడా చాలా దయనీయంగా గడిచింది.

మీ వ్యాసంలో నాకు నచ్చిన రెండవ అంశం.

ఈ విధంగా రాజకీయాల్లో కేవలం కుట్రదారులు, ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేశారో, ఎవరైతే బ్రిటీషు, యూరోపియన్లకి సాయంచేసి దేశభక్తులకి ద్రోహం చేశారో వారే రాణించడం, మెల్లిగా స్వాతంత్ర సమర వీరులంతా మూలకి నెట్టివేయబడి వీరిదే మొత్తం అధికారం కావడం మనం కాదనలేని సత్యం.

పై మాటలు అక్షర సత్యాలు.

పంతొమ్మిది వందల యాభైనాలుగులో ఫ్రెంచి పాలనను వ్యతిరేకిస్తూ జరిగిన (ఫ్రెంచికాలనీలైన పాండిచేరీ, మాహే, కారైకాల్, యానం లలో) స్వాతంత్రపోరాటంలో ఫ్రెంచి వారికి అనుకూలంగా ఉంటూ, వారికి ఉద్యమకారుల ఆనుపానులను అందించిన కొంతమంది తొత్తులు మరియు ఉద్యమకారులు ఎగరేసిన భారత జండాలను (అప్పటికే భారతావని స్వతంత్రదేశం) చింపి గోచీలుగా ధరించి ఉద్యమకారులను హేళన చేస్తూ హింసించిన వ్యక్తులే, ఆయా ప్రాంతాలు భారతావనిలో విలీనం అయినతరువాత, రాజకీయనాయకులుగా, స్వాతంత్ర్యయోధులుగా అవతారం ఎత్తారు. ఇక్కడ కులం డబ్బు ప్రధానపాత్ర వహించాయి.
(రిఫరెన్స్: ఆ ఉద్యమంలో పాల్గొన్న మా తండ్రిగారైన శ్రీ బొల్లోజు బసవలింగంగారు చెప్పిన విషయాలు, నేను వ్రాసిన యానం విమోచనోద్యమం అనే పుస్తకం.)

మీరన్నట్లు కొందరు నిస్వార్ధపరులైన స్వాతంత్ర్యసమరయోధులు ఈనాటి మంత్రుల కాళ్లపై పడటం అంతటి దౌర్భాగ్య పరిస్థితి రావటం మన దురదృష్టం.

మంచి విషయాలు అందించారు.
మీ విశ్లేషణకు అభినందనలు.

బొల్లోజు బాబా గారు,

నేను ఎక్కడో చదివాను ’రక్త సంబంధం కన్నా భావ సంబంధం గొప్పదని’. మీ తండ్రి గారైన శ్రీ బొల్లోజు బసవ లింగం గారి వంటి స్వాతంత్రసమర యోధులు మీకే కాదు మాకందరికీ పూజ్యనీయులూ, పితృ సమానులే. స్వాతంత్రానంతరం ఆనాటి నిజమైన సమరయోధుల జీవనగతి గురించి తలచుకున్నప్పుడు మాలాంటి వారికి రక్తం మరుగుతుంటుంది. నేను స్వయంగా కొన్ని కుటుంబాలను చూశాను. వారి మీద కుట్ర జరిగిన పద్దతి నాకు బాగా అర్ధం అవుతుంటుంది. అటువంటిది, స్వయంగా అనుభవిస్తున్నా మీతండ్రి గారి వంటి, మీ వంటి వారి పరిస్థితిని ఏమనగలం? జరిగిన ఈ మోసం, దగా, కుట్ర ఎందరు ఎంత చెప్పినా తక్కువే. కానీ జరిగిన కుట్ర అర్ధమైతేనే కదా, జరుగుతున్న కుట్ర అర్ధం చేసుకోగలం, జరగబోయే దాన్ని అరికట్టగలం? ఏమంటారు? మీరు వ్రాసిన ’యానాం విమోచనోద్యమం’ నాకు తెలియనందున చదవలేదు. వివరాలు తెలపగలరా?

too long

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu