ఈ బెనిఫిట్స్ అన్నిటితో పాటు, 1970ల్లో ఈ మాజీరాజులూ, రాణులూ భరణాలని పొందుతుండేవాళ్ళు. ఈ మాజీరాజులు, రాణులు, జమీందారులలో చాలామంది ఈస్ట్ ఇండియా కంపెనీ హయంలో కంపెనీకి అనుకూలురు, బ్రిటీషు రాణి హయాంలో రాణికి అనుకూలురు. ఏదోవిధంగా ప్రయోజనం పొందాలన్న స్వార్ధం వీరిలో మెండుగా ఉండేది. దేశభక్తి పూరితమైన సంస్థానాధిశులంతా కట్టబొమ్మనల్లాగా ఎప్పుడో మట్టిలో కలిసిపోయారయ్యే! ఇక స్వాతంత్రం పొందిన తరువాత సైతం, తమ గతవైభవాన్ని కాపాడు కొనేందుకు, వీరు కుట్రదారులకు మద్దతు ఇచ్చారు. సుదూర భవిష్యత్తులో గతవైభవాన్ని తిరిగి పొందగలమన్న ఆశ కూడా వీరిలో చాలామందికి లేకపోలేదు. అప్పటికే వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి కూడా గణనీయమైన పరిమాణంలో ఈ మాజీరాజుల, రాణుల, జమీందారుల, దేశ్ ముఖ్ ల చేతిలో ఉండేది. ఆచార్య వినోభా భావే, ఈభూముల్ని, వారిని Convince చేసి పేదప్రజలకి ఇప్పించాలని కృషి చేశాడు. నెహ్రు సామరస్యంగా అది జరగాలని అభిలషించాడు. ఆ కారణంగానే భూసంస్కరణల చట్టం అమలు కొంత మందగొడిగా ఉండేది. అప్పటికే నెహ్రుతరం నాయకుల్లో “మనదేశం బ్రిటీషు వారి చేతిలో దోచుకోబడి శిధిలావస్థలో తిరిగి మనచేతికి వచ్చింది. ఇది మన ఇల్లు వంటింది. పందికొక్కులు తవ్విన బొరియలతో, కూలిన దూలలతో, కూలుతున్న పైకప్పుతో, రాలుతున్న గోడలతో తిరిగి మన ఇల్లు మనకి దక్కింది. దీన్ని ఓపద్దతి ప్రకారం మనం మరమ్మత్తు చేసుకోవాలి” అన్న అభిప్రాయంలో ఉన్నారు. ఈ పోలికని ప్రజలకి చెప్పారు కూడా! అందుచేత కందిరీగల తుట్టిని కదిపినట్లుగా వారి పనితీరు ఉండేంది కాదు. అదీగాక కుట్రఏదో జరుగుతుందన్న సందేహం వారికి లేదయ్యె! దాంతో భూసంస్కరణలు మందగొండిగా ఉండేది.
అయితే ఇందిరాగాంధీ కుట్రగురించిన స్పష్టమైన అవగాహనతోనే పని ప్రారంభించింది. గనుకనే ఎన్ని వత్తిళ్ళు ఎదురైనా రాజాభరణాలని రద్దుచేసింది. భూసంస్కరణలు చట్టం మీద దృష్టిని పెట్టింది. ఈ విధంగా కుట్రదారుల ప్రధాన మద్దతుదారులైన మాజీరాజుల, రాణుల, జమీందారుల, దేశ్ ముఖ్ ల ఆర్ధికమూలాల మీద వేటువేసింది. ఎందుకంటే ఆ ఆర్ధికమూలాలే వారి బలాలు గనుక.
ఈ రాజులూ, రాణుల స్వార్ధం గురించి చెప్పాలంటే ఓ సంఘటన వివరిస్తాను. జైపూర్ లో ధార్ ఎడారి ఇంత విశాలంగా విస్తరించడానికి గల కారణాల్లో ఒక కారణం ఏమిటంటే – 1900 AD తర్వాత తొలి దశాబ్ధాల్లో భారతదేశంలో స్వాతంత్ర సమరపు వాసనలు రాగానే అక్కడి స్థానిక రాజావారు భారత్ లో ఉండటం కంటే బ్రిటన్ లో స్థిరపడటం మేలన్న నిర్ణయానికి వచ్చేసారట. దాంతో తన సంస్థానాన్ని ఇతరులకి బదలాయించి, ధనంగా మార్చుకొని, మూటాముల్లె సర్ధుకొని లండన్ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేముందు తన టెరిటరీ లోని అడవినంతటనీ కటింగ్ మిషన్లని తెప్పించి మరీ, చెట్లని నరికించి, కలపగా మార్చుకొని సొమ్ముచేసుకొని వెళ్ళిపోయాడు. ప్రత్యక్షంగా, అప్పటికప్పుడు ఎన్ని వన్యప్రాణులు నశించిపోయాయో! పరోక్షంగా, కాలక్రమంలో మంచినీటికి సైతం మైళ్ళదూరం నడుస్తూ, ఎడారి బ్రతుకులు ఈడుస్తూ, ఎందరు కృశించి పోయారో? ఈ విషయాన్ని ’చిప్ కో’ ఉద్యమనేపధ్యంలో ఆరా తీస్తే బాగా పండుముసలి పెద్దాయన మొత్తం కథ చెప్పుకొచ్చాడు. ఇది ఏదో జర్నల్ లో చదివాను. ఇలాంటి వాస్తవాలు చదివినప్పుడు దిగ్భ్రాంతి పడాల్సిందే. ఇంతటి కరుడు గట్టిన స్వార్ధం వారిది. ఆయా రాజుల్లో, రాణుల్లో అసలు మంచివాళ్ళే లేరా అంటే ఉంటారు. కానీ వారి నిష్పత్తి స్వల్పం. అంతేగాక అలాంటి వారు కాలక్రమంలో అంతరించి పోయారు కూడా!
ఇందిరాగాంధీ రాజాభరణాలు రద్దు చేసిన నేపధ్యం ఇది!
అది కుట్రదారులకి ఎంత రగిలించి ఉంటుందో, ఆవిడపై పెరిగిన బత్తిడి చెపుతుంది.
అప్పటికే 1969 లో ఆవిడ 14 బ్యాంకుల్ని జాతీయం చేసింది. అందులో అత్యధిక వాటాలు ధనికులవీ, మాజీ రాజవంశీయులవే. వారిలో ఎవ్వరూ పేద ప్రజలకి ఋణాలివ్వడానికి ఇష్టపడేవారు కారు. వ్యాపారమే వారి లక్ష్యం. ఎటూ 40 ఏళ్ళ తర్వాత తిరిగి బ్యాంకులు అక్కడికే వచ్చినట్లున్నాయి. 1969 నాటికి జాతీయం చేయబడినవి 14 బ్యాంకులే గానీ, ఒకో బ్యాంకుకీ అనుబంధబ్యాంకులూ, సంస్థలూ గణనీయమైన సంఖ్యలోనే ఉండేవి. పట్టాభిసీతారామయ్య గారు స్థాపించిన ఆంధ్రాబ్యాంకు వంటివి కొన్ని బ్యాంకులే. అత్యధిక బ్యాంకులలో ధనవంతుల, మాజీరాజుల, రాణుల, జమీందారుల వాటాలే ఎక్కువుగా ఉండేవి. అంతేగాక పేదల కష్టం మీద వడ్డీవ్యాపారం చేసే వారు గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగర బస్తీల్లోనూ కుప్పలు తెప్పలుగా ఉండేవారు. ఈ స్థితిని మరింత నిర్ధిష్టంగా పరిశీలించేందుకు పి.వి.నరసింహారావు గారి ’లోపలి మనిషి’ నుండి క్రింది విషయం ఉటంకిస్తాను.
శంకర్ దాసు:
“బ్యాంకుల జాతీయకరణ వంటి అంశాలలో అధిష్ఠాన వర్గంలో తీవ్రవిభేదాలున్నట్లు మాత్రం నిశ్చయంగా తెలుసు. ఈ అలోచన జనరంజకంగానూ, ఆకర్షణీయం గానూ ఉండవచ్చు. కానీ కొత్తవిధానంలో బ్యాంకులు ఎటువంటి పూచీకత్తులు లేకుండా పెద్ద సంఖ్యలో పేదలకు రుణాలు ఇవ్వవలసివస్తుంది. దాంతో అవి నష్టాలబరువుకింద కుంగిపోయి, జరుతుతున్నదేమిటో తెలుసుకొనే లోగానే దేశ అర్ధికస్థితి కుప్పకూలిపోతుంది…..”
ఆనంద్:
"గ్రామప్రాంతాల్లో శతాబ్ధాలుగా వడ్డీవ్యాపారం చేస్తున్న వేలాదిమంది అనుభవం మీకు తెలుసోతెలియదో? పేదలకు తామిచ్చిన రుణాల్ని వసూలు చేసుకోవడంలో వాళ్ళేమైనా ఇబ్బందినెదుర్కొంటున్నారా? అదే నిజమైతే వాళ్ళు అదేవ్యాపారాన్ని అంటిపెట్టుకుని ఉండి క్రమేణా సంపన్నులు, ఇంకా సంపన్నులు కావడం ఎలా సాధ్యమైఉండేది? ఇక సకాలంలో చెల్లింపుల విషయానికొస్తే బడా భూస్వాముల నుంచే పెద్దఎత్తున భూమిశిస్తు బకాయిలు పేరుకు పోయాయన్న విషయం మీకు తెలియదా? నిజం చెప్పాలంటే ప్రభుత్వానికి పన్నులెగగొడుతూ పెద్దమొత్తాల్లో బకాయి పడడం మాగ్రామ ప్రాంతాల్లో హోదాకు చిహ్నం!”
మళ్ళీ ఆనందే అన్నాడు:
"ప్రత్యక్ష, తక్షణ సమాచారం సేకరిస్తా చూడండి”, ఫోన్ తీసుకొని తన ప్రైవేట్ సెక్రటరీకి స్థానిక భాషలో క్లుప్తంగా ఏవో ఆదేశాలిచ్చాడు. శంకర్ దాసు ఇనుమడించిన ఆసక్తితో చూస్తుండగా సెక్యూరిటీ గార్డు ఒక మహిళను, కూరగాయలు నిండిన ఆమె తోపుడిబండితో సహా కాంపౌండ్ లోకి వెంటబెట్టుకొని వచ్చాడు. ఆమె ముఖంలో భయం, ఆశ, అయోమయం ముప్పిరిగొన్నాయి. అరగంట క్రితం కానిస్టేబుల్ కు తాను రెండురూపాయల మామూలు చెల్లించినా ఒకపోలీసు మనిషి తనను ఇక్కడికెందుకు తీసుకొచ్చాడో అర్ధంకాక భయం; తన బండిలో ఉన్న తాజా కూరగాయలు ఒక పెద్దబంగళాలో ఉన్న వాళ్ళదృష్టిని ఆకర్షించినందుకు ఆశ; ఇటువంటి పరిస్థితి గతంలో తనకెప్పుడూ అనుభవంలోకిరాలేదు కనుక అయోమయం.
ఆనంద్, శంకర్ దాస్ ను తీసుకొని డ్రాయింగ్ రూం నుంచి ఇవతలకువచ్చి ఆ కూరలమ్మితో మృదువుగా, దయగా, చనువుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఎంతో లాలనగా మాట్లాడుతూ ఇంతవరకు ఎవరికీ కాగితం మీద పెట్టాలని కూడా అనిపించని ఒక బాధకరమైన కథనాన్ని మెల్లమెల్లగా ఆమెనుంచి రాబట్టాడు. విస్తుపోయి చూస్తున్న తన ప్రైవేట్ సెక్రటరీతో ఆమె వద్ద కూరగాయలు కొనమని చెప్పి ఆమెతో మాట్లాడడం, ఆమె కూరగాయలు తనకెంతో నచ్చాయన్న అభిప్రాయాన్ని ఆమెకి కలిగించి పంపించాడు. తర్వాత మళ్ళీ శంకర్ దాస్ ను డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్ళాడు. ఏంచేయాలోతోచని ఆ పెద్దమనిషి మారు మాట్లాడకుండా యాంత్రికంగా ఆనంద్ ను అనుసరించాడు.
"చాలా కృతఙ్ఞుణ్ణి దాసు గారూ!” ఆనంద్ ప్రారంభించాడు. “ఆ పేద మహిళ మనసులో ఏముందో ఇప్పటికప్పుడు శోధించి తెలుసుకోడానికి మీప్రశ్నలే నన్ను పురిగొల్పాయి. ఆమె కథ ఎంతో ఆకట్టుకునేదీ, హృదయాన్ని కలచివేసేదీ కూడా. నగరానికి దక్షిణంగా ముప్పైమైళ్ళ దూరంలో ఉన్నగ్రామం ఆమెది. భర్తతో కలిసి పదేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చింది. భర్త సైకిల్ రిక్షా తొక్కుతాడు. ఆ రిక్షాను అతడు ఓ వర్తకుడి దగ్గర అద్దెకొనుగొలు పద్దతిలో తీసుకున్నాడు. దినసరి అద్దె చెల్లించగా, వాళ్ళు జీవించడానికి మిగిలేది చాలా తక్కువ. ఒక్క పొద్దుకూడా పూర్తిగా కడుపునింపుకోలేని దుర్భరస్థితి. ఆ రిక్షా సొంతం చేసుకోడానికి భర్త రాత్రనక పగలనక కష్టపడ్డాడు. అంతలో రోగమొచ్చి హఠాత్తుగా చనిపోయాడు. అదేం రోగమో కనిపెట్టి చికిత్స చేసిన వాళ్ళెవరూ లేరు. భార్య నిరాధారంగా మిగిలింది. ఓవడ్డీ వ్యాపారి వద్ద అయిదువందల రూపాయలు అప్పచేసి తోపుడుబండి కొనుక్కొని నగరంలోని వీధుల్లో సందుల్లో కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతోంది. నగరంలో ఎక్కడ చూడండి, అటువంటి బళ్ళు వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఒక్కొక్క బండి యజమాని వెనుక ఎటువంటి విషాదగాథలు గూడుకట్టుకున్నాయో ఎవరికి తెలుసు? దినసరి పెట్టుబడి కోసం ఆమె మరో వడ్డీవ్యాపారి దగ్గర ప్రతిరోజూ యాభైరూపాయలు బదులు తీసుకొని సాయంత్రానికి రెండురూపాయల వడ్డీని కూడా కలిపి ఆ యాభైరూపాయలను తిరిగి చెల్లించేస్తూ ఉంటుంది. ప్రతిరోజూ ఆమె ఈ లావాదేవీని సాగిస్తూనే ఉంటుంది, ఆ విషయం మరచి పోకండి; ఆమె ఆవిధంగా ఎంత వడ్డీ చెల్లిస్తోందో మీరే ఉహించుకోవచ్చు. ఈ వృత్తాంతంలో దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏమిటంటే, ఆ వడ్డీ వ్యాపారిపట్ల ఆమె అపారమైన కృతఙ్ఞతను ప్రకటించుకుంటూ, మనస్ఫూర్తిగా అతడి మేలుకోరుకుంటూ ఉండడం, నాలుగేళ్ళుగా చెమటోడ్చి శ్రమ పడుతున్నా, బండి కొనుక్కోడానికి తీసుకున్న అప్పును ఆమె ఇంత వరకూ చెల్లించలేకపోయింది. కేవలం వడ్డీ మాత్రం ముట్టజెప్పగలుగుతోంది. అసలుమొత్తాన్ని ఆమె ఏనాటికీ చెల్లించలేదన్నది ఇందువల్ల స్పష్టమైపోతోంది.”
శంకర్ దాసుకు ఇంతకు మించిన విశదీకరణ అవసరం లేకపోయింది. “బ్యాంకుల్ని జాతీయం చేయడం మీరెందుకు కోరుతున్నారో ఇప్పుడు నాకర్ధమైంది”, అని మనస్ఫూర్తిగానే అన్నాడు. “అయితే ఈ వ్యవహారమంతా ఆ కూరలమ్మి దృక్కోణం నుంచి కనిపించినంత తేలికదైతే ఎంత బాగుండేదో, అని నేనూ అనుకుంటాను. ఏదేమైనా ఇక పార్టీలో చీలిక రాకతప్పుదు. దేవుడే మిమ్మల్ని చల్లగా చూడాలి, పార్టీని రక్షించాలి!”……
బ్యాంకుల జాతీయం వెనుక ఉన్న నేపధ్యం ఇదీ!
ఇందిరాగాంధీ ’గరీబ్ హఠావో’ అనే నినాదాన్ని ఇచ్చింది. అధిక విలువగల అంటే 1000, 500 రూపాయల నోట్ల చలామణి రద్దుచేసింది. దాంతో దాచుకున్న నల్లడబ్బు విలువ కోల్పోయింది. బ్యాంకుల్లో 1000, 500 రూపాయల నోట్లను మార్చుకోవాలంటే ప్రభుత్వానికి లెక్కచెప్పాలి. దాంతో ధనికులు చాలామందీ ఆనోట్లను కాల్చివేస్తూ [మరి ఐ.టి. రైడ్ జరిగితే ప్రమాదం కదా!] ఇందిరాగాంధీని కారుకూతలు తిట్టుకున్నారని నా చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు, ఇతర పెద్దల చర్చల్లో విన్నాను.
ఈ చర్యలన్నిటితో సామాన్య భారతీయులు ఇందిరా గాంధీలో ఉన్న intution ని గుర్తించారు. పేదలకి సహాయ పడాలనీ, దేశాన్ని వృద్ధి బాట పట్టించాలనీ ఆవిడకున్న సంకల్పాన్ని గుర్తించారు. [కుట్రని ఎదుర్కొంటున్న విధానాన్ని ఆవిడ పైకి చెప్పనూ లేదు, చెప్పినా సానుకూల పరిస్థితి రాదు] దాంతో ప్రజలు ఆవిడకి పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. సామాన్య ప్రజలకి, ఆమె వ్యతిరేకులు ఋణాలని ఎగ్గొట్టమని పరోక్ష ప్రోత్సాహం ఇచ్చారు. ఋణాలు ఆలస్యమయ్యేటట్లు ఉద్యోగులనూ తమకు అనుకూలంగా మలుచుకున్నారు. నాటికి, నేటికి పరిస్థితిలో తేడాలేదు. స్ట్రాటజీలో తేడా లేదు. అదే కుట్రతీరు. అప్పటి మీడియా, ఇందిరాగాంధీ పేదరికాన్ని వెళ్ళగొట్టడం లేదనీ, పేదల్నీ వెళ్ళగొడుతుందనీ, దేశాన్నీ దివాళా తీయించడానికే పేదలకు ఋణాలిస్తుందని ఎంతగా ప్రచారించినా ప్రజలామెని గౌరవించారు, ఆదరించారు, విశ్వసించారు. ఆవిడని అభిమానించారు. అంతేగానీ ఆవిడ తమ గుడిసెలలో తమతో కలిసి తిన్నందుకూ, తమ సాంప్రదాయ దుస్తులు వేసికొని, తమతో కలిసి నాట్యం చేసినందుకు కాదు.
భారతీయులూ, గ్రామీణులలో అత్యధికులు అఙ్ఞానులు కారు. వారిలో ఎక్కువమంది నిరక్షరాస్యలే కావచ్చు. ప్రభుత్వ పాలసీలూ, సిద్దాంతాలూ వారికి తెలియకపోవచ్చు. కాని నాయకుల్లోని సంకల్పాన్ని, నిజాయితీని గుర్తించగల నేర్పు మాత్రం కలవారే. రాజకీయ నాయకులు తమ తిండి తిన్నంతమాత్రాన, తమ గుడిసెలో నిద్రించినంత మాత్రానా, రోడ్డుప్రక్కన విడిది చేసినంత మాత్రాన, గిరిజన దుస్తులతో డాన్సులు చేసినంత మాత్రాన ఏమారిపోరు. మహా అయితే తొలిసారి మోసపోతారేమో. కాబట్టే ఇప్పుడు కె.సి.ఆర్.లూ, వై.ఎస్.ఆర్.లూ, చంద్రబాబులూ, బాలకృష్ణలూ, చిరంజీవులూ, రాహుల్ గాంధీలూ ఎవరెన్ని ఫీట్లు చేసినా ప్రేక్షకులై చూస్తున్నారు. అత్యధికులు కిరాయి లేదా కూలీ తీసికొని సభలకు హాజరవుతున్నారని కూడా వింటున్నాం. కాబట్టే ఆనాడు ఇందిరాగాంధీకి అంతటి ఆదరణ ప్రజలనుండి లభించింది. [ఎన్.టి.ఆర్. కి మొదటిసారి మాత్రమే రోడ్డుప్రక్కన డ్రామాలు ఫలించాయని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.]
దేశప్రధానిగా, ప్రధాన కుట్రదారుల చిరునామా తెలియకపోయినా, జరుగుతున్న కుట్రపట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవ్యక్తిగా, ఇందిరాగాంధీ ప్రభుత్వయంత్రాంగపు పనితీరు చాలా నిర్ధిష్టంగానూ, వేగంగానూ ఉండేది. ఈ విషయంలో నిఘాసంస్థల అన్వేషణ కుట్రతీరునీ, కుట్రదారుల ఉనికినీ కనుగొనేందుకు సమాంతరంగా నడిచేది.
స్త్రీ అయిన ఇందిరాగాంధీ యొక్క పట్టుని జీర్ణించుకోవటం ఆమె సహచర రాజకీయ నాయకులకీ, సీనియర్ నాయకులకీ కష్టంగానూ, అసూయ గానూ ఉండేదట. ఈ కారణాన్ని అంతర్గత కారణంగా చూపిస్తూ, రాష్ట్రపతి ఎన్నిక [జాకీర్ హుస్సేన్] లేదా ఆనాటికి ఏది current affair అయి ఉందో దాన్ని పైకారణంగా [over leaf reason] చూపిస్తూ ఇందిరాగాంధీ సహచర రాజకీయ నాయకులు మొరార్జీ దేశాయ్, కాసు బ్రహ్మనందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, దేవరాజ్ అర్స్, మొదలైన వాళ్ళు చాలామంది ఆవిడని ముప్పతిప్పలు పెట్టారు. ఆవిధంగా వారు కుట్రదారులకి తెలిసి ఇష్టపూర్వకంగా కొంత, తెలియక కొంత సహకరించారు. భావోద్రేకాలనీ, అపార్ధాలనీ, అవగాహనా లోపాలనీ కారణంగా చూపెడుతూ నిత్యం ఏవో సమస్యలు సృష్టించబడుతూనే ఉండేవి. ఒకటికి రెండుసార్లు ఇలాంటి కారణాలతో కాంగ్రెసు పార్టీ ముక్కలైంది. మళ్ళీ ముక్కలు విలీనం అవుతుంటాయి, మళ్ళీ మళ్ళీ ముక్కలౌతుంటాయి. నిరంతర అసంతృప్తి పార్టీ సాంప్రదాయం అయిపోయింది.
ఈరోజు ఒకరిని నమ్మిన ఇందిరాగాంధీ మర్నాడే వాళ్ళని దూరం తోసేదని పేరు ఉండేది. దీనికి కారణం ఏమిటంటే – ఉదాహరణకి ఈ రోజు ఇందిరాగాంధీ, ‘A’ అనే వ్యక్తి పట్ల నమ్మకం, సదభిప్రాయం కలిగి ఉందనుకొండి. ఇంట్లోనో, తన కుటుంబసభ్యులతో, కనీసం రాజకీయల్లో తనకు తోడు, తన తర్వాత వారసుడు అనుకొన్న చిన్నకొడుకు సంజయ్ గాంధీకి నేర్పేందు కోసం, తనకు ఎలివేషన్ కోసం చర్చిస్తుంది కదా! ఆ చర్చల్లోని అంశాలు, ఆవిడ motives, moods, emotions, అభిప్రాయాలు బయటికి చేరవేయబడేవి. అంతే! కుట్రదారులు దృష్టి ‘A’ మీద ఉంటుంది. అతడి చుట్టూ project అయ్యే చట్రంతో ఈసారి ఇందిరాగాంధీకి అతడు నమ్మదగని వ్యక్తిగా కన్పిస్తాడు. ఇటువంటి అపార్ధాలు సృష్టిచడం చాలా సులభం. మన అఫీసులో బాస్ లకి తోటి వారి మీద పితూరీలు చెబుతూ మనకీ బాస్ కీ మధ్య తంపులు పెట్టేవాళ్ళు చాలామంది పాటించేది ఇలాంటి తంత్రాలనే. దాంతో ’ఇందిరాగాంధీ ఎవర్నీ నమ్మదు’ అనే అభిప్రాయం బాగా పాపులర్ అయ్యింది. ఎవరో ఎక్కడో మనకి కీడు చేస్తున్నారు అని అన్వేషణలో ఉన్నవ్యక్తి, ఆకీడు తాలుకూ ఫలితాలు ఇతరులకి అర్ధమైనా కాకపోయినా, తన స్వానుభవానికి తెలుస్తున్న వ్యక్తి ఎవరినీ ఒక పట్టాన నమ్మలేకపోవడం సహజం. ఎందుకంటే పాపం ఆవిడది ఒంటరిపోరాటం! జయప్రదంగా ఆవిణ్ణి ఒంటరిని చేయగలిగింది అనువంశిక నకిలీ కణికుడి గూఢచర్యం. దానికి ప్రధాని ఇంటి లోపలి నుండి బయటికి చేరవేయబడిన సమాచారమే మూల బలం [ఇంత జరుగుతుంటే ఇంటలిజన్స్ కు తెలియదా అంటే, తెలియకపోవడం, అనుమానించకపోవడం పచ్చినిజం. అది ఎలా నిజమో వర్తమానం నిరూపిస్తుంది. అందుకే గతంలో నుండి వర్తమానంలోకి, వర్తమానం నుండి గత చరిత్ర లోనికి మనం ప్రయాణించాల్సి వస్తోంది, పరిశీలించాల్సి ఉంది. తెలుగులో తదుపరి టపాలలో దీనిని నిరూపిస్తాను. Coups On World లో Documentary Evidence తోనూ నిరూపించాను.
ఇక్కడ మరో విషయం కూడా మనం గుర్తించాలి. మన అబ్బాయో, అమ్మాయో బడి ఎగ్గొట్టి రోడ్లమీద తిరుగుతున్నారన్నా విషయం ఊరందరికీ తెలుస్తుంది గానీ, మనకి మాత్రం తెలియదు. ఎందుకంటే మనం మనవారిని నమ్ముతాం. ’మన వారని’ అనుకున్నవారిని నమ్ముతాం. గనుక త్వరగా అనుమానించం. అందుకే నమ్మకద్రోహం అన్నది కుట్రదారుల ప్రధాన తంత్రాల్లో ఒకటి అయ్యింది. ]
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు! .
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
2 comments:
దయచేసి మీ టపాలన్ని కలిపి ఒక పుస్తకం ప్రచురించండి
good post
Post a Comment