విద్యార్దుల ర్యాంకులూ, మార్కులలో అక్రమాలని గమనించకుండా, తల్లిదండ్రులు తమ పిల్లలు అధిక మార్కులు, ర్యాంకులూ తెచ్చుకోవటం తమ ప్రతిష్ఠకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తున్నారు. పిల్లల కంటే ఎక్కువగా వారి తల్లిదండ్రులకే.... ర్యాంకులూ, మార్కుల మీద మోజులున్నాయి. ‘మా వాడు టౌన్ ఫస్ట్, మండలం ఫస్ట్, స్టేట్ ఫస్ట్.... చివరికి స్ట్రీట్ ఫస్ట్ అయినా రాకపోతే, ఎంత అవమానం?’ అనుకొని, పిల్లల్ని వత్తిడి చేయటమూ కద్దు!
ఇక ప్రభుత్యోద్యోగులూ, విద్యాశాఖ ఉన్నతోద్యోగులూ, అదే బాటలో రాజకీయూలూ కూడా, ఇవేవీ ఆలోచించకుండా డబ్బుపట్ల మోజుతో పరుగులెత్తుతున్నారు. తల్లిదండ్రులది మార్కులూ, ర్యాంకుల మోజులైతే, వీరివి డబ్బుల మోజులూ. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకి [టీచర్లకి, ఇతర డిపార్ట్ మెంట్లలో పనిచేసే వారికి కూడా] బినామీ పేర్లతో లేదా భార్యల పేరుతో విద్యాసంస్థలున్నాయి.
మా నంద్యాలలో అయితే... సగం స్కూళ్ళు, కాలేజీలు ప్రభుత్యోద్యోగులవే! ఒక్క నంద్యాలలోనే కాదు చాలా ఊళ్ళల్లో ఇదే బాపతు! రాజకీయ నాయకులకి ఇంజనీరింగ్ కాలేజీలతో సహా పాఠశాలలు, కళాశాలలూ ఉన్నాయి. విద్యా వ్యాపారం అత్యంత లాభసాటి వ్యాపారం, ever green వ్యాపారం మరి!
ఇక్కడ ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. ఓ పిల్లి తల్లిని పరిశీలించండి. అది తన చిన్నకూనకి ఎలుకని ఎలా వేటాడాలో, ఇల్లిల్లు తిరుగుతూ ఆహారాన్ని ఎలా వెదుక్కోవాలో శిక్షణ ఇస్తుంది. సగం చచ్చిన ఎలుకని తెచ్చి, పిల్లికూన ముందు పెట్టి వేటాడటంలో శిక్షణనిస్తుంది. ఓ కుక్క తల్లిని చూడండి. తన పిల్లల్ని వెంట బెట్టుకుని, చెత్త కుండీల దగ్గర నుండి ఇంటి గడపల దాకా, వీధిలో తిండి ఎలా వెదుక్కోవాలో నేర్పిస్తుంది.
తమ టెరిటరీని కాపాడుకుంటూ వేరే వీధి కుక్కలు తమ వీధిలోకి రాకుండా నియంత్రిస్తూ కుక్కులు గ్యాంగ్ వార్ చేస్తాయి. ఆ గుంపు తగాదాలని కూడా, తల్లి కుక్క తన పిల్లలకి నేర్పిస్తుంది. ఎందుకంటే వాటికి మార్కుల, డిగ్రీల, సర్టిఫీకెట్లు ఇచ్చే వాళ్ళు లేరు. ఆ సర్టిఫీకెట్లు చూపిస్తే తిండి దొరకదు. అడ్డదారుల్లో సంపాదించిన సర్టిఫికెట్లు ఉపయోగించి, అంతే అడ్డదారుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కుదురుకుంటే పనిచెయ్యకుండానే జీతపు రాళ్ళు, పైరాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం ఆయా జంతువులకు లేదు. అందుచేత పని[విద్య] నేర్చుకోవటం, తప్పని సరి!
ప్రస్తుతం మన సమాజంలో, జంతు సహజమైనదీ, ప్రకృతి సహజమైనదీ అయిన ‘తరం నుండి తరం నేర్చుకోవటం’[అది గురువుల నుండి కానివ్వండి, తల్లిదండ్రుల నుండి కానివ్వండి.] అన్న ప్రక్రియ ప్రాభవం కోల్పోయింది.
ఇప్పుడు చాలామంది, విద్యాభ్యాసం విషయంలో ‘ఏదో ఒకటి చేసి’ మార్కులూ, ర్యాంకులూ సంపాదించినట్లే, ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగాల్లో చేరితే [చాలు! ఆ ‘ఏదో ఒకటి చేసి’ అన్న దాంట్లో లంచం ఇవ్వటానికే కాదు, ఏ అవినీతికైనా సిద్దపడటానికి సందేహించటం లేదు. ఏం చేస్తేనేం? ప్రభుత్యోద్యోగం సంపాదిస్తే చాలు. జీవిత లక్ష్యం నెరవేరినట్లే! అది ఇక జీవిత సాఫల్యమే!
పని చెయ్యాల్సిన అవసరం అంతగా లేదు. పని సామర్ధ్యంతో పనిలేదు. ప్రతిభా పాటవాలతో అంతకంటే పనిలేదు. ప్రైవేటు సంస్థలలో లాగా, ఒళ్ళిరగొట్టుకునే అవసరం లేకుండా, హాయిగా.... జీతంతో పాటు ‘పై డబ్బులూ’ సంపాదించుకుంటూ, రిటైర్ అయ్యేసరికి భారీ మొత్తం అందుకోగల సుఖమయమైన, భద్రమైన జీవితాన్ని పొందవచ్చు.
ఇందుకోసమే.... చివరికి కాంట్రాక్టు పద్దతిలోనైనా సరే ప్రభుత్వ సర్వీసులో చేరేందుకు లంచాలతో పాటు, ఇతరత్రా మార్గాలు కూడా తొక్కుతున్నారు, చాలామంది! ఎప్పటికో ఒకప్పటికి ఈ కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా క్రమబద్దీకరింపబడి ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాలు కాకపోతాయా అన్నదే ఆశ!
ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు భద్రతా లేదు, ‘తక్కువ పనితో ఎక్కువ రాబడి’ వచ్చే మార్గమూ లేదు. వెరసి పని చెయ్యకుండా ఫలితం కావాలనుకునే మనస్తత్వం, మర్రి విత్తనంలా పుట్టి మహా వట వృక్షమై ఎదిగింది.
పరీక్షా ఫలితాలలో అవకతవకలు ఆ విత్తనాల నుండి వచ్చిన మొలకలే! చదువుల్లో ప్రారంభమైన ఈ ‘అవినీతి’ -[చదవకుండానే పక్కదారిలో ఫలితాలు పొందే అవినీతి] ఇచ్చిన పంట - కౌశలం, నైపుణ్యాలు లేని యువతరం! నూటికి నూరు మందీ ఇలాగే లేకపోయినా, పట్టాలు పుచ్చుకు బయటికి వచ్చిన వారిలో... అత్యధికుల ప్రతిభాపాటవాలు సర్టిఫికేట్లలో మాత్రమే ఉన్నాయి, ప్రాక్టికల్ గా కాదు. కాబట్టే చాలా ప్రైవేటు కంపెనీలు, ఉద్యోగుల్ని నియమించుకున్నాక, వాళ్ళకి మళ్ళీ శిక్షణ నిచ్చుకోవాల్సి వస్తోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుండి, స్ర్కిప్టు, రచనా, డ్రాఫ్టింగుల దాకా.... అన్నిటిలో!
అయితే చాలామంది ఇదేమీ ఆలోచించటం లేదు. సామాన్యులు అలోచించ లేదంటే అది వేరే విషయం. అజ్ఞానం కొందరిదైతే, అలసత్వం కొందరిది. తెలిసినా, ఆలోచించినా, ఏమీ చెయ్యలేని అసహాయత కొందరిది. విచారకరమైన విషయం ఏమిటంటే - ఈ ‘విద్యారంగంలోని అవినీతి’ గురించి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గృహమంత్రులు కూడా ఆలోచించకపోవటం లేదా స్పందించక పోవటం! మీదు మిక్కిలి అమాయకత్వం నటించటం!!
నిజానికి ఒక దేశమ్మీద మరో దేశం ఈ విధంగా కుట్ర చేస్తే చాలు! ఏ యుద్దమూ చెయ్యకుండానే, సదరు దేశాన్ని సర్వనాశనం చేయవచ్చు. ఒకటి రెండు తరాల విద్యార్ధుల్ని నిర్వీర్యం చేస్తే చాలు! మొత్తం యువతరం అసమర్ధులు గానూ, నిష్ర్పయోజనంగానూ తయారౌతుంది. క్రికెట్టూ, పబ్బులూ తప్ప మరేం పట్టకుండా మిగిలిపోతుంది.
ఇది సామాన్యులకు సైతం అర్ధమైనా.... ప్రధానమంత్రికీ, గృహమంత్రికీ, కేంద్రప్రభుత్వానికీ అర్ధం కావటం లేదంటే, లేదా అమాయకత్వం చూపిస్తున్నారంటే అర్ధం.... ఆ కుట్రలో వీళ్ళూ భాగస్థులే అని! ఇది ప్రత్యక్ష నిరూపణ! ఇది గూఢచర్యంతో కూడిన కుట్ర! ఈ విషయాన్ని ప్రక్కన బెడితే....
పూర్వపు రోజుల్లో [ఎంతో గతంలోకి వెళ్ళక్కర్లేదు. ముందటి తరం వరకూ కూడా] విద్యార్ధులకీ ఉపాధ్యాయులకీ [గురు శిష్యులకి] మధ్య, చక్కని ఆరోగ్యకరమైన ఆనందదాయకమైన సంబంధాలు ఉండేవి. శిష్యులు, విద్యార్ధులు తమ టీచర్లని తల్లిదండ్రులన్నంతగా గౌరవించే వాళ్ళు. టీచర్లు తమ విద్యార్ధులని తమ బిడ్డలన్నంతగా మన్నించే వాళ్ళు. పిల్లలకి టీచర్ల పట్ల భక్తి, గౌరవం ఉంటే, టీచర్లకి పిల్లల పట్ల వాత్సల్యం, ప్రేమా ఉండేవి. మాష్టారి గారి భార్యని తమ తల్లిగా, మాష్టారి సంతానాన్ని తమ తోబుట్టువులతో సమంగా విద్యార్ధులు భావించేవాళ్ళు.
ఈ మాట ఎవరైనా అనగానే.... కుట్రదారుల మద్దతు దారులు "అదే అయితే వారి హిందూ పురాణాలలోని ‘తారా శశాంకం, కచ దేవయానిల కథల ’ మాటేమేమిటి?" అంటూ.... అవహేళన మేళవించి వాదనకు దిగుతారు. దాని గురించిన వివరణ Coups On Hinduism and Epics లో వ్రాసాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను. ప్రస్తుతం విద్యారంగంపై కుట్రని అనువదిస్తున్నందున, ఆ వివరణ ఇక్కడ ఇవ్వటం లేదు.
భారతీయుల జీవన సరళిలో, సుప్రసిద్ద సంస్కృత సూక్తులను గమనించండి.
మాతృదేవో భవ
పితృదేవో భవ
ఆచార్య దేవో భవ
అంటూ.... మాతా పితరులు, గురువు దైవ సమానులుగా భావించటం మనకి తెలిసిందే!
మరో గురుస్తుతి మనం చిన్నప్పుడు కంఠస్తం చేసిందే!
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
‘గురువు శ్రీమహావిష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుల ప్రతిరూపుడు. గురువు సాక్షాత్తూ ఆ పరబ్రహ్మ స్వరూపుడే! అలాంటి గురువుకి నమస్కారం’ అన్నది విద్యార్ధులు ప్రతిరోజూ పఠించే స్తుతి మంత్రం.
హిందీ సారస్వతంలో ఒక దోహ ఉంది. నాకు గుర్తుండి ఇది భక్త కబీరు చెప్పిన పద్యం. ‘గురువూ, దైవమూ తనకి ఒకేసారి సాక్షాత్తరిస్తే.... తాను ముందుగా గురువుకే నమస్కరిస్తాడట. ఎందుకంటే భగవంతుణ్ణి చూపించింది ఈ గురువే కదా!’ అంటాడు కవి. ఎంత గొప్ప భావన అది?
దైవం అంటే సత్యం. సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం అంటే - దైవాన్ని సాక్షాత్కరింప చేయగలదే!అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించి, దైవాన్ని చూపిన గురువు, దైవం కంటే కూడా ఎక్కువ!
అలాంటి నేపధ్యం నుండి ఎక్కడికి దిగజారింది మన సమాజం? విద్యార్ధులకి, టీచర్లకి మధ్య ప్రేమాయాణాలు నెలకొంటున్నాయి. టీచర్ల నుండి విద్యార్ధులు, లైంగిక వేధింపులనీ, అవమానాలని, అత్యాచార ప్రయత్నాలని ఎదుర్కొంటున్నారు. ఒకోసారి విద్యార్ధుల నుండి టీచర్లూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు రికార్డులూ, మీడియా వార్తలూ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
యదార్ధం చెప్పాలంటే - సినిమా మీడియా మొదటగా దీన్ని సమాజంలోకి ప్రవేశ పెట్టింది. క్రమంగా దాన్ని పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమాజంలోకి మరింత లోతుగా చొచ్చుకు పోయేందుకు [తమ వార్తల కవరేజి పద్దతితోనూ, క్రైం రిపోర్టు, నేరాలు-ఘోరాలూ వంటి కార్యక్రమాలతోనూ] దోహదపడింది.
దాదాపు 30-40 ఏళ్ళక్రితం.... The Bed Room Eyes అనో The Bed Room Windows అనో [పేరు సరిగ్గా గుర్తులేదు] ఒక ఆంగ్ల చిత్రం భారత దేశంలోకి ప్రదర్శన నిమిత్తమై వచ్చింది. తల్లిదండ్రులు స్వసుఖానురక్తులూ, స్వార్దపరులూ అవ్వటంతో.... నిర్లక్ష్యానికి గురైన 12 ఏళ్ళ పిల్లవాడు, ట్యూషన్ టీచర్ చేత `seduce' చేయబడతాడు. మొదట మానసికంగా దగ్గరవ్వటం నుండి, అనుకోకుండా శారీరకంగా దగ్గరవ్వటం... తదనంతర పరిణామాలతో కూడిన చిత్ర కధ!
అలాంటి చిత్రాలు సమాజానికి మేలు చేస్తాయా? కీడు చేస్తాయా? ఈ అంశంతో ఓ పేద్ద డిబేట్ జరిగింది. పత్రికలలో వ్యాసాలు, సమీక్షలూ వచ్చాయి. విద్యావేత్తలూ, మేధావులూ, చివరికి రాజకీయ నాయకులు కూడా అందులో పాలుపంచుకున్నారు. అయితే ఆ చర్చలన్నీ కూడా ఆ సినిమాకి వాణిజ్య ప్రకటనలుగా పరిణమించేటట్లే మొత్తం ఆ తంతంతా నడిచింది. ఆ విధంగా మరింత ప్రచారం వచ్చింది. అంతే తప్ప చిత్ర ప్రదర్శన నిషేధింపబడలేదు.
మెల్లిగా ఆ ఒరవడి బాగానే వంట బట్టింది. క్రమంగా అది అలవాటు చెయ్యబడింది. తదుపరి ఎన్నో సినిమాలలో గురుశిష్యుల మధ్య ప్రేమలూ, పెళ్ళిళ్ళూ చోటు చేసుకున్నాయి. ఇక ‘సుందరకాండ’ వంటి చెత్త సినిమాలలో అయితే పెళ్ళైన మగ లెక్చరర్ వెనక మంగళ సూత్రం పట్టుకుని వెంటబడే విద్యార్దిని! ఆనక ఆ పిల్లకేదో మాయా రోగం అనీ, ఆ బాధ నుండి తప్పించుకోవటానికి ఈ ప్రేమ గోలంతా చేసిందనీ చెబుతాడు దర్శకుడు. రోగం వస్తే Divert అవటానికి ఇంకే మార్గం లేదు కాబోలు! పైగా ఇలాంటి చెత్త సినిమాకి రామాయణంలోని ‘సుందర కాండ’ పేరు పెట్టటం కూడా భారతీయత మీద కుట్రలో భాగమే! ఇక ఈ కోవలో పరాకాష్ట మొన్నటి ‘హైస్కూలు’ సినిమా! 30+ ఏళ్ళ పంతులమ్మకీ 12 ఏళ్ళ కుర్రాడికి మధ్య ‘ఎఫైర్’ అట!
నిజానికి విద్య మనిషిని, చెడు ఆలోచనల నుండి, చెడు మాటల నుండి, చెడు చర్యల నుండి నియంత్రించాలి. ఇందుకు ఉదాహరణగా చిన్న కథ చదవండి. గతంలో ఈ బ్లాగులో ప్రచురించినదే!
విద్య పరమార్ధం మనిషికి మంచి నేర్పాలి. సత్యాన్ని తెల్పాలి. మంచి జీవితాన్నివ్వాలి. కేవలం డబ్బు సంపాదించటమే చదువు పరమార్ధం కాదు. ప్రతి మనిషీ సౌకర్యంగా, సుఖంగా బ్రతకాలనుకుంటాడు. నిజానికది ప్రతి ఒక్కరి హక్కు కూడా! పుట్టిన ప్రతి ప్రాణీ కోరే కోరిక అదే! సుఖంగా, సౌకర్యంగా, సంతోషంగా బ్రతకాలన్నది గమ్యం! ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే గమ్యంతో పాటు దాన్ని చేరే మార్గం కూడా సరైనదై ఉండాలి కదా!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
14 years ago
4 comments:
Meeru cheppalanukunna "KABIR DOHA"
"GURU GOBIND DOVU KHADE, KAKEY LAGOO PAY'E?"
"BALIHARI GURU APNE,GOBIND DIYO MILAYE"
Guru and Gobind (God) are both objects of reverence and worthy of worship but, Kabir puts ‘Guru’ at a higher pedestal than God. He says if both God and Guru condescend to give him ‘Darshan’ together, he would first touch the lotus feet of his ‘Guru’ before seeking blessings from the Lord, because it is He (Guru) who showed him the way to meet the Lord.
చందమామ గారు: ఆ దోహా అందించినందుకు చాలా కృతజ్ఞతలండి! చాలా సంతోషం!
అమ్మా! అమ్మ ఒడి!
చాలా బాగా వ్రాస్తున్నావు! తెలుస్తోంది—టిచరువని.
నీతో పూర్తిగా యేకీభవిస్తాను.
కృష్ణశ్రీ గారు: నా టపా మీకు నచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి!
Post a Comment