డిగ్రీ చదివే రోజుల్లో, ఆసక్తి కొద్దీ, నా స్నేహితురాలి ఆర్ధిక శాస్త్రపు టెక్ట్స్ బుక్ తీసుకుని చదివాను. అందులో, తొలి పాఠపు తొలి వాక్యాలుగా ‘వాణిజ్యం [business] అన్నది అంతటా ఉన్న వ్యవహారమే! వ్యాపారం జీవితంతోనే ప్రారంభమౌతుంది. పసి పాప పాల కోసం ఏడుస్తుంది. బిడ్డ ఏడుపు వినగానే తల్లి వచ్చి బిడ్డ అవసరం తీరుస్తుంది. ఆ విధంగా, పసిబిడ్డ తన ఏడుపుని అమ్మి, అమ్మ దగ్గరి నుండి పాలు కొనుక్కుంటుంది. ఆ విధంగా అది కూడా వ్యాపారమే’ అని ఉంది. [ఇప్పుడదే సిలబస్ ఉందో లేదో నాకు తెలియదు.]

వ్యాపారాన్ని నిర్వచించటానికి, దాని గురించి వివరించటానికి, ఈ విధమైన పోలికని విద్యార్ధులకి చెప్పటం, ఏపాటి ఔచిత్యమో నాకు తెలియదు. ఆర్ధిక వేత్తలకే తెలియాలి. వ్యాపార, వాణిజ్యాలకి ఆర్ధిక శాస్త్రంరీత్యా వేర్వేరు నిర్వచనాలున్నాయోమో గాని, ఈ టపాల మాలికలో, నేను మాత్రం రెండింటినీ ఒకే అర్ధంలో ఉపయోగిస్తున్నాను. ‘వస్తు మార్పిడితో, లేదా వస్తు ద్రవ్య మార్పిడితో లాభాన్ని సంపాదించటం, జీవన భృతి పొందటం’ అనే సామాన్య అర్ధంలో!

ఒకప్పుడు మన దేశంలో [బహుశః ప్రపంచమంతా కూడా] బార్టరు పద్దతి, అంటే వస్తు మార్పిడి విధానం అమలులో ఉండేది. ఇప్పటికీ పల్లెల్లో, చాకలి మంగలి వైద్యుడు వగైరా సేవలకు ప్రతిగా, రూపాయల బదులు వడ్లు కొలవటం అనే పద్దతి ఉంది. అదే ఒకప్పుడు, నేత పనివాళ్ళు, కమ్మరి, కుమ్మరులు చేసి ఇచ్చే దుస్తులు, కుండలూ, మట్టి పాత్రలూ, గునపం పారవంటి పనిముట్లకు బదులుగా కూడా, ధాన్యమే కొలిచేవారు.

వస్తుమార్పిడి లేదా బార్టరు విధానం నేపధ్యంలో ఓ చిన్న కథ చెబుతాను.

అనగా అనగా....

ఒకానొక పట్టణంలో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. అతడు ధనికుడూ, సమర్ధుడూ! అతడికి గుణశేఖరుడనే కుమారుడున్నాడు. గుణశేఖరుడు అందమైన వాడు, సద్గుణ శీలి. అయితే వ్యాపార మెళకువలు గ్రహించటంలో అంత చురుకైన వాడు కాడు.

ఆరీత్యా, ధనగుప్తుడు తన కుమారుడి కోసం తెలివైన వధువుని వెదకాలని నిశ్చయించుకున్నాడు. నిజానికి ఆ వూళ్ళోని చాలామంది ప్రముఖ వర్తకులు, తమ కూతళ్ళని గుణశేఖరుడికిచ్చి పెళ్ళి చేయటానికి సిద్దంగా ఉన్నారు. అయితే ధనగుప్తుడు మాత్రం తనకు కాబోయే కోడలు రూపవతి, గుణవతి మాత్రమే గాక, చురుకైనది కూడా అయి ఉండాలని కాంక్షించాడు. ఆ విషయంలో అతడు రాజీ పడదలుచుకోలేదు.

దాంతో ధనగుప్తుడు తీవ్రంగా ఆలోచించాడు. చక్కని ఆలోచన తట్టింది. సేవకుణ్ణి పిలిచి "ఊళ్ళో వీధుల వెంట తిరిగి, బియ్యం అమ్ముకురా! అయితే నీదగ్గర బియ్యం కొనాలనుకున్న వారందరికీ, బియ్యానికి బదులుగా నువ్వుల నూనె ఇవ్వాలని చెప్పు. ఏ పాత్రతో అయితే బియ్యం కొలిచారో అదే పాత్రతో నూనె కొలవాలని చెప్పు. ఎవరికైతే నువ్వు ఈ విధంగా బియ్యాన్ని, నూనెకు బదులుగా మారకం వేసి అమ్మావో, వెంటనే వచ్చి వాళ్ళ గురించి నాకు వివరాలు చెప్పు. ఊళ్ళో వర్తకుల కుటుంబాలు నివసించే వీధులలోనే బేరానికి వెళ్ళు" అని అజ్ఞాపించాడు.

యజమాని చెప్పిన ప్రకారం ఆ సేవకుడు, బియ్యపు మూట నెత్తిన పెట్టుకుని, వీధుల్లో తిరుగుతూ "బియ్యమయ్యా బియ్యం. బంగారు తీగల్లాంటి బియ్యం. ముత్యాల్లాంటి గింజలు బాబూ!" అంటూ అరవసాగాడు. అతణ్ణి పిలిచి బియ్యం బేరమాడబోయిన వారంతా, బియ్యానికి బదులుగా నువ్వుల నూనె ఇవ్వాలనీ, అదీ ఒకే పాత్రతో కొలవాలన్న షరతు విని బేరం వదులు కున్నారు. ఏ ఒక్కరూ నూనె ఇచ్చి, బియ్యం కొనేందుకు సిద్దపడలేదు. ఎందుకంటే - ఆ రోజుల్లో బియ్యం ధరకి నూనె ధర ఏడు రేట్లు ఎక్కువ మరి! దాంతో ధనగుప్తుడి సేవకుడి షరతు విని, అందరూ నవ్వసాగారు. వాళ్ళకయితే అతడిది ఆశబోతుతనంగా కనిపించింది.

కానీ ధనగుప్తుడి సేవకుడు మాత్రం, యజమాని అజ్ఞ ప్రకారం వీధుల వెంట అరుస్తూ తిరుగుతూనే ఉన్నాడు. "బియ్యమండీ బాబూ బియ్యం. ముత్యాల వంటి బియ్యం. బంగారు తీగల్లాంటి బియ్యం" అంటూ!

రెండు మూడు రోజులు తిరిగినా ఎవరూ బియ్యం కొనలేదు. చుట్టుప్రక్కల పల్లెపట్టణాల్లో కూడా అమ్మబోయాడు. ఓ రోజు ఓ అందమైన యువతి, అతణ్ణి పిలిచి బియ్యం చూపెట్టమంది. ధనగుప్తుడి సేవకుడు మూట దించి బియ్యం చూపెడుతు తన షరతుని వివరించాడు. "అమ్మా! ఏ పాత్రతో బియ్యం కొలిచావో, దాంతోనే నువ్వుల నూనె కొలిచి ఇచ్చేటట్లయితే బియ్యం తీసుకో!" అన్నాడు.

ఆ పిల్ల చిరునవ్వుతో "సరే!" అంది.

సేవకుడు ‘హమ్మయ్యా!’ అనుకుని "అయితే పాత్ర తీసుకు రామ్మా!" అన్నాడు. ఆ అమ్మాయి, వెడల్పాటి అంచుల్లేని పళ్ళెం తెచ్చింది. పళ్ళెం నిండా ఎత్తుగా రాశిలా బియ్యం పోసి తీసుకుంది. తర్వాత అదే పళ్లెంలో నువ్వులు నూనె పోసి అతడికి ఇచ్చింది. ఎలా చూసినా ఆ పిల్లకే లాభం. అప్పటికి ఉన్న ధర ప్రకారం చూసినా, దాదాపు నూనె కన్నా పదిరెట్లు బియ్యాన్ని తీసుకుంది. అంటే కిలో నూనెకి ఏడు కిలోల బియ్యంగా మార్కెట్ ధర ఉంటే, ఆ అమ్మాయి కిలో నూనెకి 10 కిలోల బియ్యం తీసుకుందన్న మాట!

సేవకుడు వెంటనే వెళ్ళి తన యజమానికి జరిగిందంతా చెప్పాడు. ధనగుప్తుడు ఎంతో సంతోషంతో, ఆ పిల్ల తల్లిదండ్రులని సంప్రదించి, ఆమెతో తన కుమారుడు గుణశేఖరుడి వివాహం జరిపించాడు.

ఆమె భర్తకి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండటంతో, తదుపరి వాళ్ళ వ్యాపారం మరింత వృద్దిలోకి వచ్చింది.

ఇదండీ కథ!

ఈ విధంగా.... వ్యాపార మన్నది తెలివి తేటలతో ముడిపడి ఉండాలి గానీ, దగాకోరుతనంతో కాదు. మోసపూరితధోరణి వ్యాపారంలో ఉంటే, ఎప్పుడూ నష్టపోయేది వినియోగ దారుడు మాత్రమే!

వెయ్యేళ్ళ క్రితం [అంటే ఈ దేశంలోకి ముస్లింలు అనబడే ఎడారి దొంగలూ, యూరోపియన్లు అనబడే సముద్రపు దొంగలూ రాకముందు] భారతదేశంలో, బాటసారి, ఏ ఇంటి గడప ముందైనా నిలబడి, తాగేందుకు మంచినీళ్ళు అడిగితే, అతడికి మజ్జిగ ఇవ్వబడేదని చెబుతారు. [అతిధి, అభ్యాగతులకు భోజనం పెట్టటం పుణ్యకార్యంగా భావించే వాళ్ళు] ఆ స్థితి నుండి, తాగునీటిని పాకెట్లలోనూ, సీసాల్లోనూ కొనుక్కునే స్థితికి ప్రయాణించాము. కొన్ని పట్టణాల్లో ప్రభుత్వం సైతం నీళ్ళ వ్యాపారం చేస్తోంది. ప్రజలకి మంచినీటి సౌకర్యం సమకూర్చటం ప్రభుత్వ విధి అని నారదనీతి చెబుతుంది.

ఇలాంటి వ్యాపార దృక్పధంతో, ఎవరైనా... పసిపాప ఏడుపుతో తల్లి దగ్గర పాలు కోరటాన్ని.... ఆకలేసిన చిన్నారి పెదవుల కోసం, భగవంతుడు అమ్మ రొమ్ములలో దాచిన అమృత ధారగా కాకుండా, తల్లిగుండెల్లో మాతృప్రేమగా మూర్తీభవించిన ఆ సృష్టికర్త దివ్య ప్రేమగా గాకుండా.... పసిబిడ్డ ఏడుపుని అమ్ముకుని, తల్లి దగ్గర నుండి పాలను కొనుక్కోవటంగా చూస్తే... ఎంత కౄరమైనది ఆ ఆలోచన?

అంత వ్యాపార దృష్టీ, పదార్ధ వాద దృష్టీ అలవడ్డాక, బిడ్డ ఏడవక పోయినా... గుండెలకు హత్తుకుని, బొజ్జనిమిరి, ఆకలి కనిపెట్టి పాలుపట్టే అమ్మప్రేమ అసలు కనబడదు.

కాబట్టే... ఇంత వ్యాపారం దృష్టి, పదార్ధ వాద దృక్పధమూ తెలియక ముందు... భారతదేశంలో చాలామంది, కొన్ని గృహస్థ నియమాలు పాటించే వాళ్ళు. ప్రతీ రోజూ కనీసం కొంతమందికైనా భోజనం పెట్టిగానీ, తాము భుజించే వాళ్ళు కాదు. అతిధి అభ్యాగతులు దొరకని నాడు భోజనం మానేసే వాళ్ళు. ‘అతిధి దేవోభవ’ అంటూ, ఆకలితో గడపలో అడుగుపెట్టేవాడు దేవుడితో సముడన్నట్లు గౌరవించేవాళ్ళు. [తిధీ నక్షత్రం వంటి వేవీ చూడకుండా వచ్చేవాణ్ణి అతిధి అంటారట.]

పుణ్యం వస్తుందన్న నమ్మకంతో, పేదలనీ, బిచ్చగాళ్ళనీ పిలిచి భిక్ష వేసేవాళ్ళు. జంగమ దేవరలని, గొరవయ్యలని, బుడబుడకల వాళ్ళని, సాక్షాత్తూ ఆదిభిక్షువు శివుడి అవతారంగా తలచి, భక్తీ గౌరవాలతో ఆదరించటం, నాలుగు తరాలకు ముందు కూడా ఆచరణలో ఉన్న విషయమే! సోదమ్మి సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరుని ప్రతిరూపమే! వీధి భాగవతులూ, హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు.... వీళ్ళెవరినీ ‘బిచ్చగాళ్ళు’ అన్న చులకనతో చూసే వాళ్ళు కాదు. వాళ్ళకుల వృత్తి, గౌరవాదారాలు పొందుతూ ఉండేది. అది ఆనాటి భారతీయుల జీవన సరళి!

ఆ విషయం ప్రక్కన బెడితే.... క్రీస్తు పూర్వమే భారతదేశంలో గొప్ప వర్తకులున్నారని చరిత్ర చెబుతుంది. గుప్తుల కాలంలో కొందరు వర్తకశ్రేష్ఠులు, చక్రవర్తికి సైతం ధన సహాయం, ఋణ సదుపాయం ఇవ్వగల స్థితిలో ఉండేవారనీ, సీమాంతర వ్యాపారం నౌకా వ్యాపారం కూడా నిర్వహించారనీ అంటారు. ప్రాక్పశ్చిమ దేశాల నుండి వచ్చిన [ఇటు చైనా, అటు గ్రీసు] యాత్రికుల రచనలతో సహా, ఎన్నో చారిత్రక ఆధారాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

గ్రీసుతో సహా అనేక ఇతర దేశాలు, ఒక వ్యక్తి ఎన్ని అంకెలు గుర్తుంచుకోగలిగితే అంత మేధావిగా పరిగణించే స్థాయిలో ఉన్నప్పుడే, భారతీయులు 10 to the power of 55 వరకూ అంకెలు తెలిసిన స్థాయిలో ఉన్నారు. ‘సున్న’ వినియోగంతో, దశాంశ పద్దతి తెలిసిన స్థితిలో ఉన్నారు.

[‘సున్నా’ని కనుగొన్నది భారతీయులైతే, కొన్ని శతాబ్దాల క్రితం దాన్ని ప్రచారించింది అరేబియన్ లట. అందుచేత దాన్ని ఇండో-అరబిక్ పద్దతిగా, అయిదవ తరగతి పిల్లలకి గణిత శాస్త్ర పాఠంగా వ్రాసారు. పాపం భారతీయులు కనుక్కోవటమే గానీ, ప్రచారించుకోవటం తెలియక.... అలా.... నీరుగారి ఉంటే, అరేబియన్లొచ్చి ప్రచారించి ప్రయోజనం చేకూర్చారన్న మాట! ప్రచారంలో తిమ్మిని బమ్మి చేయటం, బమ్మిని తిమ్మి చేయటం, నకిలీ కణికులకి వెన్నతో బెట్టిన విద్య. ఎటూ భారతీయులని చిన్నబుచ్చటం, అరబ్బులని ఆకాశానికెత్తటం, ముస్లిం గారాబం నకిలీ కణిక గూఢచర్య లక్ష్యాలయ్యె!]

నిజానికి రామాయణంలో వాల్మీకి మహర్షి, రావణుడి సైన్యశక్తిని వర్ణిస్తూ మాఘనం అనే ఈ సంఖ్యని 10 to the power of 55 గా పేర్కొన్నాడు. రావణుడి సైన్యం 1 ప్రక్కన 55 సున్నాలు పెట్టినంత పెద్దది కావచ్చు, కాకపోవచ్చు. కవి అతిశయోక్తిగా చెప్పి ఉండవచ్చు. కానీ, అప్పటికే 10 to the power of 55 అనే సంఖ్య, వాల్మీకితో సహా ఆనాటి వాళ్ళకి తెలుసన్నదే ఇక్కడ విషయం.

ఆనాటి భారతీయులకే కాదు, శతాబ్దం క్రితం వరకూ కూడా, భారతీయులకి వ్యాపారం తెలుసు గానీ, కార్పోరేట్ వ్యాపారం తెలియదు. భారతదేశపు వర్తకులు వ్యాపారం చేసినా, దానికీ కొన్ని నీతి నియమాలున్నాయి. ధర్మాధర్మ విచక్షణ ఉంది. వారి వ్యాపారం మానవతా విలువలకు ఆవల లేదు. మానవత్వపు పరిధిలోనే ఉంది.

వ్యాపారం చేసేందుకు వాళ్ళు, ప్రజల అవసరాలని అందుకున్నారే గానీ, ప్రజలకు అవసరాలని సృష్టించలేదు. మరో మాటలో చెప్పాలంటే - వాళ్ళు వ్యాపారం చేసేందుకు ‘డిమాండ్’ ని Meet అయ్యారే గానీ, ఈనాటి కార్పోరేట్ కంపెనీలు చేస్తున్నట్లు డిమాండ్ ని సృష్టించలేదు.

నేనీ మాటలు ‘భారతదేశం మాత్రమే గొప్పది, భారతీయులు మాత్రమే నీతిపరులు’ అనే జాత్యహంకారంతో, గర్వంతో, వెనకటి నాజీలు చెప్పినట్లు చెప్పటం లేదు. భారతదేశం మాత్ర్రమే గొప్పది, మిగిలిన దేశాలన్నీ పనికిమాలినవనటం లేదు. నా దృష్టిలో ప్రతీ దేశం, ప్రతీ జాతి, తమమైన గొప్పదనం కలిగి ఉంటాయి. ఎవరికైనా సరే, వారి వారి గొప్పదనాలు[Advantages], బలహీనతలు [Disadvantages] ఉంటాయి. ప్రతిఒక్కరూ అన్ని దేశాలని, అన్ని జాతుల ప్రజలని గౌరవించాలి. ప్రతి ఒక్కరూ తమ మాతృదేశాన్ని తమ స్వంత తల్లిలా గౌరవించి, ప్రేమించాలి. ప్రక్క దేశాన్ని, పొరిగింటి పినతల్లిలా గౌరవించి ఆదరించాలి. అప్పటికి గానీ ప్రపంచశాంతి అనేమాటని ఉచ్చరించలేం.

తల్లినే గౌరవించని స్థితి నుండి, మాతృదేశాన్ని ప్రేమించే స్థితికి ఎప్పటికైనా ప్రయాణించక తప్పదు, ఎవరికైనా సరే! తాలిబాన్లకైనా ముంబై ధాకరేల కైనా! ఈ విషయాంతరం ప్రక్కన బెట్టి, మళ్ళీ ఆర్దిక రంగం ద్వారా కుట్ర దగ్గరికి తిరిగి వస్తాను.

భావవాదం, ఆర్దిక వాదం, కార్పోరేట్ వాదం ల గురించి ఒక చిన్న పోలిక చెబుతాను.

భావవాదం.... అందమైన, ప్రేమమూర్తి అయిన యువతి వంటిది. అది కరుణా హృదయం కలిగిన, సుకుమారి అయిన అమ్మాయి వంటిది. అంతే కాదు, సహనం కలిగిన అమ్మవంటిది. మనిషి మాత్రమే కాదు, సకల ప్రాణ కోటి అనుభవించే భావనలు, చేసే ఆలోచనలు... ఇవన్నీ భావవాదంలోని భాగమే!

ఇక పదార్ధ వాదం.... అందమైన, ధృఢగాత్రుడైన యువకుడి వంటిది. అది స్థిరచిత్తుడైన, బలిష్ఠుడైన, సమర్ధుడైన, సాహస యువకుడి వంటిది. పట్టుదల కలిగిన, లక్ష్య సాధకుడైన నాన్న వంటిది.

భావ వాదమూ, పదార్ధ వాదమూ కూడా.... తమవైన పరిమితులూ, నియమితులూ కలిగి ఉన్నాయి. కాబట్టి భావవాదాన్ని స్త్రీతోనూ, పదార్ధ వాదాన్ని పురుషుడి తోనూ పోల్చాను. అయితే కార్పోరేటిజానికి ఏ నీతి నియమాలూ లేవు, పరిమితులూ లేవు. కాబట్టే అది నపుంసకుడి వంటిది.

ఒక కుటుంబంలో... భార్యభర్తలిద్దరూ, ఒకరి నొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, ఎవరి హద్దులని వాళ్ళు గుర్తుంచుకుంటూ, ఒకరి నొకరు గాయపరుచుకోకుండా, పరస్పరం సహకరించుకుంటూ, గడుపుతున్నారనుకొండి. ఆ కుటుంబం ఎంత హాయిగా, ఆనందంగా ఉంటుంది?

అదే విధంగా, ఒక సమాజంలో... భావవాదమూ, పదార్ధ వాదమూ కూడా, వాటి వాటి అవధుల మేరా ఆదరింపబడితే.... ఆ సమాజం ఎంత శాంతిగా, సౌఖ్యంగా ఉంటుంది?[భావవాదం అంటే మట్టిగొట్టుకు పోవటం కాదు. పదార్ధ వాదం అంటే యాంత్రికంగా బ్రతకటం అంతకంటే కాదు.]

ఒక కుటుంబంలో స్త్రీపురుషులు, భార్యభర్తలుగా సఖ్యంగా జీవిస్తే, వాళ్ళకి ‘సంతానం’ అనబడే భవిష్యత్తు ఉంటుంది. అంతే కానీ.... స్త్రీ అయినా, పురుషుడైనా, ఒక నపుంసకుడితో కలిసి జీవిస్తే, పిల్లలూ పుట్టరూ, భవిష్యత్తూ ఉండదు.

ప్రస్తుతం కార్పోరేటిజం.... సమస్త ప్రపంచాన్ని, సమస్త మానవ జాతిని, సమస్త ప్రాణకోటినీ, అలాంటి భవిష్యత్తు లేని పరిస్థితికే తరుముకెళుతోంది.

ఇక్కడ నేను చెప్పిన పోలిక గురించి, కొంచెం వివరణ ఇవ్వదలుచుకున్నాను. పై పోలికతో ‘హిజ్రాల’ను నేను అగౌరవించలేదని మనవి. వాళ్ళు శారీరకంగా మాత్రమే వికలాంగులు. నాకు వారి పట్ల గౌరవం, సానుభూతి ఉన్నాయి. ఈ పోలికలో నేను, కార్పోరేట్ వ్యాపార సంస్థలని [స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, సూపర్ బజార్లు, వస్తు విక్రయశాలలు, వస్తూత్పత్తి కర్మాగారాలతో సహా] మాత్రమే నపుంసకులతో పోల్చాను. ఎందుకంటే - సదరు కార్పోరేట్ కంపెనీలు మానసికంగా నపుంసకులు గనుక!

నాలుగైదు దశాబ్దాల క్రితం, ప్రపంచవ్యాప్తంగా కార్పోరేట్ కంపెనీలు, తమ ఆయుధాల అమ్మకాల కోసం, దేశాల మధ్య యుద్దాలు సృష్టించాయి. జగమెరిగిన సత్యమిది. ఎందరో చర్చించగా, వ్రాయగా, వినీ చదివి ఉన్న విషయం ఇది. 1990లో రష్యా కుప్పకూలిపోయాక, ఈ ప్రచ్ఛన్న యుద్దపు పైకారణం[over leaf reason] చిరిగిపోయింది.

ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు, తమ వ్యాపారం కోసం కొత్తదారులు వెదుకుతున్నాయి. కొత్త రోగాలు, కొత్త మందులూ కనుక్కుంటున్నాయి. కొత్త మోజులు సృష్టిస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

>> డిమాండ్ ని Meet అయ్యారే గానీ డిమాండ్ ని సృష్టించలేదు

భారతీయులలో బంగారంపై సహజంగా ఉండే మోజు ను అసరా చేసుకుని రెండు సంవత్సరాలుగా బంగారం ధర పెరిగిపొతుంది అని, అక్షయ త్రితియ అని బొంగు బోషాణం అని మీడియ ప్రజలను ఊదరగొడుతుంది . 1995 కి ముందు ఎప్పుడు అక్షయ త్రితియ అనేది నేను విని ఉండలేదు. పెళ్ళిల్లకి ,పండుగలకి బంగారం కొనే భారతీయులకి దానిని కొనడానికి ఇంకో సంధర్భం క్రియేట్ చేసారు . ఈ అక్షయ త్రితియలు ఒక్కోసారి ప్రతీ నెల వస్తుంటాయి మరి. ఇదంతా నిజమని నమ్మిన పేద మధ్య తరగతి ప్రజలు ఇక తమకు బంగారం అందుబాటులో ఉండదేమో నన్న భయంతో బంగారం కొనుగోలుకు పరుగులు తీసారు. దాంతో అమాంతం బంగారం ధర పెరిగింది. అంటే ఇక్కడ బంగారానికి కృత్రిమ డిమాండ్ సృష్టించారన్న మాట. ఇదో మానసిక తంత్రం

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu