సాయంత్రం అయిదు గంటలయ్యింది. బుజ్జిగాడు బడి నుండి పరుగెత్తుకు వచ్చాడు. రాగానే పుస్తకాల సంచి ప్రక్కన పడేసి, అమ్మని చుట్టేసాడు.

తల్లి మెడ చుట్టూ చేతులేసి వేలాడుతూ "అమ్మా! ఆకలేస్తోందే!" అన్నాడు.

అమ్మ నవ్వుతూ "టిఫిన్ చేసే ఉంచాను లేరా? వెళ్ళి పుస్తకాల సంచి గూట్లో పెట్టి, కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకు రా!" అంది.

బుజ్జిగాడు రివ్వున పరుగెత్తాడు. వాడు సిద్దమై వచ్చేసరికి అమ్మ పేట్లులో ఉప్మా తెచ్చి పెట్టింది. హుషారుగా వచ్చిన బుజ్జిగాడికి, ఉప్మా చూడగానే ఉసూరు మనిపించింది. "ఇదేమిటి? స్వీటు చెయ్యలేదా?" అన్నాడు.

"ఈ రోజు తీరిక దొరకలేదురా? రేపు చేస్తానులే!" అంది అమ్మ అనునయంగా.

"నిన్నా ఇదే చెప్పావు?" బుంగమూతి పెట్టాడు బుజ్జిగాడు.

"కుదర లేదు నాన్నా! రేపు తప్పకుండా చేస్తాను" అమ్మ నచ్చ చెప్పుతున్నట్లుగా అంది.

"నాకేం వద్దు పో! రోజూ ఇలాగే చెపుతున్నావు" అలిగి అవతలికి వెళ్ళిపోయాడు బుజ్జిగాడు.

అమ్మకీ విసుగేసింది. "రేపు చేస్తానంటే వినవేం? తింటే తిను! లేకపోతే పో!" అంది కోపంగా.

బుజ్జిగాడికి ఏడుపొచ్చేసింది. వెళ్ళి మంచమ్మీద బోర్లాపడుకున్నాడు. కాస్సేపు వెక్కివెక్కి ఏడ్చాడు. అలాగే నిద్రపోయాడు.

కాస్సేపటికి బుజ్జిగాడి నేస్తాలొచ్చారు. ఆడుకుందాం రమ్మన్నారు. ‘సర్లే ’ అనుకొని బుజ్జిగాడు వాళ్ళతో కలిసి బయలుదేరాడు. అంతా కలిసి ఊరి బయట తోటవైపు వెళ్ళారు. అంతా చెట్ల క్రింద ఆడుకుంటున్నారు. బుజ్జిగాడు ఒక్కడే తోటలో, ఓ వైపు మెట్లదారి వెంట వెళ్ళాడు.

ఆశ్చర్యం! వాడికో ఇల్లు కనబడింది.

ఇంటి ముందు ప్రహరీ అంతా బిస్కట్లతో కట్టారు. గోడలన్నీ మైసూర్ పాక్ లతో కట్టారు. కిటికీలు చూస్తే జాంగ్రీలు! నీటి గొట్టాల్లాగా జిలేబీలున్నాయి! పంపు తిప్పుతే పాయసం పడుతోంది! ఇంటి పైకప్పు గా ఖాజాలు పేర్చి ఉన్నాయి. తెల్లటి పాలకోవాలతో ఎంచక్కని మంచం పేర్చి ఉంది! కజ్జి కాయలు దిండ్లయి పోయాయి. పెద్ద అరిసె క్రింద జంతికల పుల్లలతో డైనింగ్ టేబుల్ అమర్చి ఉంది. బర్ఫీలతో టేబుల్ చుట్టూ కుర్చీలున్నాయి.

బుజ్జిగాడికి సంతోషంతో కేకలు వెయ్యాలనిపించింది. గుండెల్నిండా మిఠాయిల తీపి వాసన పీల్చుకున్నాడు. స్నేహితులందర్నీ పిలిచి ఆనందంగా మిఠాయిలు తిందామని, గొంతెత్తి పిలవబోయాడు.

"బుజ్జీ! నాన్నా బుజ్జీ! లేవరా?" ఎవరో భుజం పట్టుకుని ఊపుతుంటే కళ్ళు తెరిచాడు బుజ్జిగాడు.

ఎదురుగా అమ్మ నవ్వుతూ ఉంది. అమ్మ చేతిలో రవ్వాకేసరి ప్లేటు! నెయ్యి, జీడిపప్పులూ వేసి తియ్యటి వాసన వేస్తోంది.

"అమ్మా!" బుజ్జిగాడు ఒక్క ఉదుటున లేచి అమ్మను కౌగిలించుకున్నాడు.

అమ్మ బుజ్జిగాడి జుట్టు నిమిరి "తిను నాన్నా" అంది!

తియ్యటి రవ్వాకేసరి తింటూ బుజ్జిగాడు, తన కలనంతా వివరించి చెప్పాడు.

అప్పటికే ఇంటి కొచ్చిన నాన్న కూడా, బుజ్జిగాడి కల విని పకపకా నవ్వాడు.

గతంలో బుజ్జాయిలోనో, బొమ్మరిల్లులోనో చదివిన కథ ఇది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ కలల సిద్దాంతాలూ, ప్రశ్నోపనిషత్తులో కలల మీద చర్చలూ బుజ్జిగాడికి తెలియవు. అంతఃశ్చేతనకీ, కలలకీ మధ్య ఉన్న సంబంధం గురించి.... ఫ్రాయిడ్ కన్నా పిప్పిలాద మహర్షి చర్చ, నాకు మరింత అర్ధవంతంగా కన్పించింది. కలల గురించిన చర్చ మన వేదవేదాంగ వాంజ్ఞ్మయంలో చాలానే ఉంది.

సందిగ్ధ అసందిగ్ధాల మధ్య స్థితి ‘పొరపాటు’ అంటాడు ఫ్రాయిడ్. ఒక విషయం గురించి నిర్దిష్టంగా ఓ అభిప్రాయానికి లేదా నిర్ణయానికి రానప్పుడు, అలవోకగా.... మన మాటల్లో, చేతల్లో పొరబాట్లు దొర్లుతాయట. ఉదాహరణకి.... ఒక ప్రదేశానికి లేదా కార్యక్రమానికి వెళ్ళాలో వద్దో, ఇంకా నిర్దిష్టంగా నిర్ణయించుకోలేదనుకొండి. అలాంటి సమయంలో సదరు ప్రదేశానికి/కార్యక్రమానికి వస్తావా? అని ఎవరైనా మనల్ని అడిగారనుకొండి. తడబాటుతో కూడిన సమాధానమో లేదా పొరబాటు సమాధానమో చెబుతామట!

అలాగే అంతఃశ్చేతన లో అప్పటికే ముద్రవేసుకున్న విషయాలు కలలో ప్రతిఫలిస్తాయట. అయితే ఒకే కల పదేపదే రావటం, ఒకే కల నిద్ర మేల్కొన్నప్పుడు అంతరాయం పొంది, మళ్ళీ నిద్రించినప్పుడు కొనసాగటం [అంటే కల సీరియల్ అన్నమాట]... ఇలాంటి విన్యాసాల గురించి, ఎంతో ఆసక్తికరమైన చర్చలు.... ఇటు మన వేదాంగాలు అంటే ఉపనిషత్తులలోనూ, అటు పాశ్చాత్యుల రచనలలోనూ ఉన్నాయి.

‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అన్న మాటను ప్రక్కన బెడితే, ఎన్నో ఆధునిక శాస్త్ర సిద్దాంతాలకు, శాస్త్రీయ ఆవిష్కరణలకు.... మూలాలు, ఆలోచనా బీజాలు [Thought Provoking] మాత్రం, మన సంస్కృత వాంజ్ఞ్మయంలోనూ, వేద వేదాంగాల్లోనూ, పంచమ వేదమైన గీతలోనూ ఉన్నాయి. ఒకవేళ వాటికి సంబంధించిన శాస్త్ర విజ్ఞానం సంస్కృతంలో ఉన్నదేమో తెలీదు.

ఎందుకంటే మన భారతదేశం ఎన్నో వేలసార్లు దోపిడికి గురయ్యింది. చాలా పుస్తకాలు జర్మనీ వంటి దేశాలకు చేరాయి. వాటి ఊసు కూడా ఎక్కడ చెప్పబడలేదు. చరిత్ర వక్రీకరించబడింది. జర్మనీలో సంస్కృత యూనివర్సీటీ కూడా ఉన్నది. చాలామంది జర్మన్లు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఉన్నదాన్ని మరుగు పరచి, నాశనం చేసి కొత్తగా దాన్నే శాస్త్రీయంగా [సైంటిఫిక్] ఆవిష్కరించటం ఎన్నోసార్లు, ఎన్నో రంగాలలో జరిగింది.

ఈ నేపధ్యంలో... సాధనతొ అందుకోవలసిన వాటిని కన్నెతైనా చూడకుండానే స్టేట్ మెంట్లిచ్చే వాళ్ళకి, దండేసి దండం పెట్టటం తప్ప, మరేం చెయ్యలేం.

వాళ్ళ ప్రచార బానిసత్వానికి వాళ్ళని వదిలేస్తే.... మన పిప్పిలాద మహర్షి, శ్వేతాశ్వతర మహర్షి వంటి వారు, మనకిచ్చిన విజ్ఞాన సంపద కంటే, పాశ్చాత్యుల ఆధునిక సిద్దాంతాలకు ఎక్కువ ప్రచారం రావటం మాత్రం, భారతీయత మీద సుదీర్ఘ కాలంగా జరుగుతున్న కుట్రలో భాగమే. ప్రశ్నోపనిషత్తులో ‘కల’ గురించిన చర్చ మరోటపాలో కొనసాగిద్దాం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

http://srikchin.blogspot.com/2010/06/90.html

మీడియా, కాంగ్రెస్ అధిష్టానమూ పీవీజీకి దుష్కీర్తి తలకెత్తాలని పెనుగులాడటమే గానీ, ఆ మహానుభావుడికి ఏ అసత్యాలు అంటించలేరు. కాలం అన్నిటినీ నిరూపిస్తుంది. నిరూపించనుంది. మంచి లింకు అందించినందుకు నెనర్లు!

బాగుంది మీ విశ్లేషణ ....!

సావిరహే గారు: నెనర్లండి!

Adilakshmi garu - ప్రశ్నోపనిషత్తులో ‘కల’ గురించిన చర్చ మరోటపాలో కొనసాగిద్దాం!

అన్నారు.... ఆ టపాకోసం వెదికాను కాని కనిపించలేదండి.లింకు ఇవ్వగలరు - లలిత

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu