ఈ టపాల మాలికలో నా ఆంగ్ల బ్లాగు Coups On World లోని Coup On Business and Commercial Field అనే శీర్షికని తెలుగులోకి అనువదిస్తున్నాను. అయితే, ప్రస్తుతానికి అనువాదానికి అంతరాయం కలిగిస్తూ, ఆర్దిక రంగంలో నడుస్తున్న ఒక మాయా జాలాన్ని మీ ముందుంచాలని, ఈ టపా వ్రాస్తున్నాను.

ముందుగా ఒక చిన్న కథతో ప్రారంభించి, దాని అనువర్తనతో..... నడుస్తున్న మాయా జాలాన్ని వివరిస్తాను.

అనగా అనగా.....

ఒక విశాలమైన, సుభిక్షమైన రాజ్యం ఉండేది. ప్రత్యేకంగా రాజంటూ ఎవరూ లేకపోయినా.... ఎక్కడి కక్కడ.... వయస్సు, వివేకం, తెలివి ఉన్న మంచి వాళ్ళను పెద్దలుగా మన్నిస్తూ ప్రజలు జీవించే వాళ్ళు. ఏ సమస్య వచ్చినా ఆ పెద్దల దగ్గరే... తలా ఓ మాట వేసి, పరిష్కరించుకునే వాళ్ళు. పెద్దగా కొట్టాటలూ లేవు. నేరాలూ లేవు.

‘ దొంగతనాలూ దోపిళ్ళు ఉండవా?’ అంటే ఉండేవి. కాకపోతే ఘరానా దొంగలుండేవాళ్ళు కాదు. బందిపోటు గుంపులు వచ్చి, ఊళ్ళని దోచుకుపోయేవి. దాన్ని నివారించటం కోసం, ఎక్కడి కక్కడ, కొంత సైన్యంతో పాలకులుండేవాళ్ళు. కొన్ని చోట్ల యువకులే, దండుగా ఏర్పడి తమ ప్రాంతాలలో ప్రజల మాన ప్రాణాలను, ఆస్థిపాస్తులనూ కాపాడుకునే వాళ్ళు.

సాంఘిక, రాజకీయ స్థితి ఈ విధంగా ఉంటే... ఆ సువిశాల రాజ్యంలో, ఆర్దిక స్థితి సర్వస్వతంత్రంగా ఉండేది. దాదాపు ప్రజలంతా ఉత్పత్తి రంగంలోనే ఉండేవాళ్ళు. రైతులు వరి గోధుమల వంటి ఆహార ధాన్యాలు, పప్పులు ఇతర అవసరాలను తీర్చే పంటలు పండించే వాళ్ళు. పొలం గట్ల మీద కూరగాయలూ పండించేవాళ్ళు. ఇంటి పెరళ్ళలో పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు. కోళ్ళు మేకలతో మాంసాహారానికీ కొదవుండేది కాదు. ఆవూ, గేదేలతో పాడిపంటలకూ లోటులుండేది కావు.

రైతులంతా ఒకే పంట వేయకుండా, వాళ్ళల్లో వాళ్ళు కూడబలుక్కుని, కొందరు తిండి గింజలు పండిస్తే, కొందరు నూనె గింజలు, మరికొందరు ప్రత్తి వగైరాలు ఎన్నుకునే వాళ్ళు. ప్రతీ ఏడాది వంతులు మార్చుకుంటూ, మొత్తంగా ఊళ్ళో అందరి అవసరాలు తీరేటట్లు, వాళ్లల్లో వాళ్ళు సర్ధుబాటు చేసుకుంటారు. ఏ గొడవా లేకుండా పెద్దల సర్ది చెప్పేవాళ్ళు, యువకులు సఖ్యంగా ఉండేవాళ్ళు.

ఊళ్ళల్లో రైతుల వంటి ధాన్యోత్పత్తి దారులే గాక, కుమ్మరి కమ్మరి వంటి వస్తూత్పత్తి దారులూ ఉండేవాళ్ళు. నేతపనివాళ్ళు, కంసాలిలూ గట్రా సకల వృత్తుల వాళ్ళు, కలిసి మెలిసి జీవిస్తూ, తమ ఉత్పత్తులనీ, సేవలనీ ఒకరి కొకరు ఇచ్చిపుచ్చుకుంటూ జీవించేవాళ్ళు.

కష్టపడి ఓపిగ్గా పనిచేయటం, హాయిగా తినటం, సుఖంగా నిద్రపోవటం - ఇదే తెలుసు వాళ్ళకి. తీరిక దొరికితే పెళ్ళాం బిడ్డలతో మాటామంతీ, ఇరుగు పొరుగులతో కథలూ కబుర్లు! అంతకంటే ఎక్కువ అవకాశాలూ లేవు వాళ్ళకి! వాళ్ళల్లో పాడటం వచ్చినవాళ్లు పాడేవాళ్ళు, చిందేయటం వచ్చిన వాళ్ళు ఆడేవాళ్ళు.

జీవితంలో పరుగు పెట్టటానికి కనిపిస్తూ, లక్ష్యమేదీ లేదు. కడుపారా తినటం, మనసారా మాట్లాడటం, కన్నారా నిద్రపోవటం! గుడే వినోదం, విజ్ఞానం.

ఒళ్ళొంచి పనిచేసే చోట, తిన్నదేదీ అరగకపోవటం ఉండదు. అధవా రోగమెచ్చినా ఏదో వైద్యం! ఒకవేళ చచ్చినా ‘అది ఎప్పుడో ఒకప్పుడు ప్రతివాడికి వచ్చేదే కదా ’ అన్న వైరాగ్యం. వైరాగ్యమో... నిర్వేదమో? అనివార్యం అన్న సత్యదర్శనమో!

రోజులు సాఫీగా గడిచిపోయేవి! తము ఉత్పత్తి చేసిన వస్తువునో, చేయగల సేవనో ఎదుటి వాళ్ళకి ఇవ్వటం, ఎదుటి వారి ఉత్పత్తినో, సేవనో పొందటం. మిగులు ఉత్పత్తి పొందగలిగేంత కష్టం చేయగలిగితే నగానట్రాలతో సంపద! ఇంకొంచెం పెద్ద ఇల్లు, ఇంకా పెద్ద చావడి. ఎద్దుల బండి కాస్తా గుర్రపు స్వారీ అయ్యేది.

మహా అయితే పొరుగూరి ప్రయాణం, పుణ్యక్షేత్రాల దర్శనం! అభివృద్ది తక్కువే గానీ, ఆనందం తక్కువ కాని స్థితిలో, తీరికగా, ప్రశాంతంగా ప్రజలంతా బ్రతుకుతున్న రోజులు!

ఇంతలో అక్కడికి ఓ వింత వ్యక్తి వచ్చాడు. తనని తాను ఆర్ధిక వేత్తగా పరిచయం చేసుకున్నాడు. అంటే ఏమిటో ప్రజలకు అర్ధం కాలేదు. "అదంతే! మీకర్ధం కాదు. ఎందుకంటే నేను మేధావిని" అన్నాడు, గంభీరంగా!

"మీకు నేను వ్యాపారం నేర్పిస్తాను" అన్నాడు.

ప్రజలు అయోమయంగా చూశారు. పట్టించుకోవటం మానేసారు. "ఇప్పుడు మీరు చేస్తుందంతా పనికిమాలిన పద్దతి. వడ్లు కొలిచి కుండలు తీసుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడితే వచ్చే వడ్లెక్కడ, ఆర్రోజులు కష్టపడితే వచ్చే కుండెక్కడ?" అన్నాడు గొప్ప తార్కికంగా!

‘నిజమే’ అన్పించింది రైతుకి!

ప్రమాదంగా తోచింది కుమ్మరికి!

"అయ్యా! ఆరుగాలం పండించిన వడ్లన్నీ రైతు నాకు ఇవ్వటం లేదు. వాళ్ళ ఇంటికి సరిపడా, నేను ఎన్ని కుండలిస్తానో, అంతకు సరిపోయినంత ధాన్యమే నాకు కొలుస్తారు. ఆరురోజులు కష్టపడితే నా కుండలు తయారౌతాయి, నిజమే! అయితే ఊరందరి కోసం, నేనూ సంవత్సరమంతా కుండలు చేస్తూనే ఉంటాను కదా?" తనకు వచ్చిన పద్దతిలో తనవైపు వాదన చెప్పబోయాడు కుమ్మరి. పాపం! ఆర్దిక వేత్త చెప్పినంత అందంగా, దబాయింపుగా చెప్పలేకపోయాడు.

ఇదే సన్నివేశం.... కమ్మరి, వడ్రంగి,దర్జీ... అన్ని వృత్తుల వారికీ ఎదురయ్యింది. క్రమంగా రైతుకి, తానన్ని రోజులూ, అనవసరంగా, అందరికీ, తన కష్టం ధారపోసాననిపించింది. ఇతర వృత్తుల వాళ్లకీ.... తాము దగా పడ్డామనీ, పడుతున్నామనీ, పడబోతున్నామనీ అన్పించింది.

వాళ్ళల్లో వాళ్ళకి స్పర్ధలు పుట్టాయి. ఈలోగా ఆర్దికవేత్త కనబడకుండా పోయాడు. అయితే, అతడు పెట్టిన నిప్పు , మహాగ్ని గోళంలా మండ సాగింది. అప్పటి దాకా ప్రశాంతంగా, పరస్పర సహకారంగా ఉన్న రాజ్యమంతా, రచ్చరచ్చగా తయారయ్యింది.

ఇంతలో హఠాత్తుగా ఆర్ధికవేత్త తిరిగి ప్రజల మధ్యకు వచ్చాడు. ఈసారి తన లాంటి మరి కొందరిని వెంట తెచ్చాడు.

"ఏమయిపోయావు? ఎంత గొడవయ్యిందో తెలుసా?" అన్నారు ప్రజలు.

"తెలుసు!" గంభీరంగా చెప్పాడు ఆర్దికవేత్త!

"ఏం చెయ్యాలి?" అన్నారు ప్రజలు ఆరాటంగా!

"ఇక నుండీ వస్తువులు మారకం వేసుకోకండి. ఇదిగో వీటిని, మీ వస్తువులకు మారకంగా ఉపయోగించండి" అంటూ కొన్ని గవ్వల్ని చూపించాడు.

"ఇవి గవ్వలాగున్నాయే?" అన్నారు ప్రజలు కళ్ళింత చేసుకుని!

"తప్పు. వీటిని గవ్వలన కూడదు. ‘డబ్బులు’ అనాలి. మీకు ఆ లెక్కలు పద్దతులు నేర్పడానికే వీళ్ళందరినీ తెచ్చాను" అన్నాడు ఆర్ధికవేత్త, తన వెంటనున్న బృందాన్ని చూపుతూ!

ప్రజలంతా వాళ్ళ వైపు వింతగా, ఆసక్తిగా చూసారు. గడ్డం దువ్వుకుంటూ గంభీరంగా చూశారు ఆర్దికవేత్తలు! పాఠాలు మొదలయ్యాయి. ఊరంతా మారిపోయింది. తెరచాటున ఆర్దికవేత్తలు కొన్ని వస్తువులకి ఎక్కువ గవ్వలు మారకం అయ్యేటట్లు కొరతలు, ప్రచారాలు సృష్టించారు. దాంతో వస్తువు విలువలు ఎవరికీ అర్దం కానంతగా మారిపోయాయి.

"చూశారా! ఎంత అభివృద్దో!" అన్నారు ఆర్దికవేత్తలు.

"కాబోలు" అనుకున్నారు ప్రజలు.

కొన్నాళ్ళకు "అవున్నిజమే!" అనీ అన్నారు.

క్రమంగా కొందరి దగ్గర చాలా గవ్వలు పోగయ్యాయి. కొందరి దగ్గర చిల్లిగవ్వ లేకుండా పోయింది.

కొన్నాళ్ళకి, గవ్వల స్థానంలో వెండి బంగారు నాణాలొచ్చాయి. కాలక్రమేణా గవ్వలు రకరకాల పేర్లు, రకరకాల రూపాలు సంతరించుకున్నాయి. ఒకోచోట ఒకో పేరు, ఒకో రూపం! అంతే కాదు, రకరకాల కొత్త వృత్తులొచ్చాయి. ఏ వస్తువునీ ఉత్పత్తి చేయకుండానే ‘డబ్బులు సంపాదించే వృత్తులు ఏర్పడ్డాయి. అవి చదువు చెప్పటం, వైద్యం చేయటం, పూజాదికాలు నిర్వహించటం, మంచీచెడూ తెలియచెప్పే సత్సంగ నిర్వహణ... ఇవేవీ కాని కొత్తవి కావటం చేత, చాలామందికీ ఆకర్షణీయం అయ్యాయి.

కేవలం ‘డబ్బులు’ లెక్కలు కట్టటం, ‘డబ్బు’ లక్షణాలు, ప్రవాహాలు పసిగట్టటం, వంటి కొత్త కొత్త వృత్తులూ వచ్చేసాయి.

అప్పటికే ఆర్దికవేత్తలు, ప్రజలకి చిత్రవిచిత్రమైన వస్తువుల్ని పరిచయం చేసారు. సేవల్ని కూడా ‘డబ్బుల’ లెక్కల్లోకి మార్చుకోవటం నేర్పించారు. దాంతో, గతంలో పాడటం వచ్చినవాడు ఇప్పుడు ఉచితంగా పాడటం మానేసాడు. ఆడటం వచ్చిన వాడు ఉచితంగా ఆడటం మానేసాడు. క్రమంగా ఆటాపాటా వంటి వినోదాలే కాదు, మంచీ మర్యాదా మాటామంతీ వంటి భావాలు కూడా ‘డబ్బుల’తో కొనుక్కోవాల్సి వచ్చింది. ఇక ప్రేమ, అనుబంధం వంటి అనుభూతులు, డబ్బుల గలగలల్లో విలవిల్లాడాయి.

ఈ గలాభాలో పడిపోయిన ప్రజలు గుర్తించని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే - ఆర్దికవేత్తలు ప్రవేశపెట్టిన చిత్రవిచిత్ర వస్తువినిమయాలూ, సేవలూ, మాటల వ్యాపారాలతో, కేవలం కొందరి దగ్గరే డబ్బులు పోగవ్వటం! ఆ కొందరూ ఆర్దికవేత్తల అనుచరులూ సహచరులే అవ్వటం!!

ఇప్పుడు ప్రజలలో.... గతంలో ఉన్న తీరిక లేదు, ప్రశాంతత లేదు. సహకారమూ లేదు. పోటీ మాత్రమే ఉంది. ఎవరి కంటే ఎవరి దగ్గర ‘డబ్బులు’ ఎక్కువ పోగయ్యాయో అన్న ఆత్రం మాత్రమే ఉంది. అది తెచ్చిపెట్టిన అసూయ ఉంది.

క్రమంగా ప్రజలంతా.... వర్గాలుగా, గుంపులుగా, చివరికి వ్యక్తులుగా విడిపోయారు. ఎవరి గొడవా ఎవరికీ పట్టదు. ఎవరి కష్టం వాళ్లదే! ఎవరి సుఖమూ వాళ్లదే!

డబ్బుల కోసం పెనుగలాటలు పెరిగాయి. డబ్బులు పంచుకోవటం తప్ప, ప్రేమనీ అనుభూతుల్ని పంచుకోవటం మానేసారు. మానేసారు అనటం కంటే మరిచిపోయారు అనటం సబబు. పాపం వాళ్ళని మాత్రం ఏమంటాం? అసలంత తీరిక వాళ్ళకెక్కడ మిగిలిందని?

ఇలా.... రోజులు గడుస్తుండగా....

హఠాత్తుగా ఓ రోజు, ఆర్దికవేత్తల బృందం ఆర్భాటంగా, అందర్నీ ఆహ్వానించింది. తిరిగి చూస్తే ఏముంది?

రాజ్యం నడిబొడ్డున, ఓ భారీ నిర్మాణం ఉంది. అప్పటి దాకా ఆ రాజ్యపు ప్రజలకి తెలిసిన ఏ పదార్ధమూ కాదది. ప్రజలకి తెలిసింది పూరిళ్ళు, మిద్దెలు, భవంతులూ! మట్టికట్టడాలు లేదా రాతి కట్టడాలు! కలప తెలుసు. అయితే వాళ్ళకి తెలిసిన ఏ పదార్ధం తోనూ నిర్మింపబడలేదు ఆ కట్టడం.

"ఏమటది?" అన్నారు ముక్తకంఠంతో!

"కాగితం" అన్నారు ఆర్దిక వేత్తలు అంతే గట్టి కంఠంతో!

"ఎందుకిది?" అన్నారు ప్రజలు.

"మేమూ, మాలాంటి మేధావులందరమూ కలిసి, మీ కోసం నిరంతరం ఆలోచించాము. మీ అభివృద్ది కోసమే దీన్ని నిర్మించాము" అన్నారు.

"ఇదో గొప్ప ప్రక్రియ! లోపలి కొచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. చక్కగా అర్ధం చేసుకుంటే ఇది అందంగా,అపురూపంగా కనబడతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అందమైన అమ్మాయి లాంటిదే! దీన్ని బట్టి డబ్బుల లెక్కలు తెలుసుకోవచ్చు. అభివృద్ది ఎంతో గణించవచ్చు. మీరెంత సుఖంగా ఉన్నారో కూడా ఇట్టే తెలిసి పోతుంది. ఏ వస్తువుకు ఎంత ఖరీదు ఉందో కూడా తెలుస్తుంది. అసలు దీని ప్రభావంతో మీ జీవితాలే మారిపోతాయి" అని ఒక్క క్షణం ఆగారు ఆర్దికవేత్తలు.

అప్పటికీ అర్ధంకానట్లు చూశారు ప్రజలు!

గొంతు సవరించుకుని, మళ్ళీ ప్రారంభించారు ఆర్దికవేత్తలు!

"ఎప్పటికప్పుడు ఈ నిర్మాణం, మన రాజ్యంలో జరిగే అన్ని వ్యవహారాల గురించి లెక్కలు గడుతుంది. విశ్లేషణలు చేస్తుంది. దాన్నిబట్టి మనకన్నీ తెలిసిపోతాయి. మనకన్ని అమరిపోతాయి కూడా! ఇన్ని మాటలెందుకు? మనం తినే తిండి, పప్పుబియ్యం, కూరగాయల ధరల నుండి, వస్తు వాహన ఆభరణాది అన్నిటి ధరలపైనా, దీని ప్రభావం ఉంటుంది. కొన్నాళ్ళుపోతే మీకే అర్దం అవుతుంది" అన్నారు ఆర్దికవేత్తలు భరోసాగా! సర్లెమ్మనుకున్నారు ప్రజలు! రోజులు గడిచాయి.

ఆర్దికవేత్తలు "కాగితపు కట్టడం అందంగా ఉంది. కాబట్టి పప్పు దగ్గర నుండి అన్నిటి ధరలూ పెరుగుతాయి. చూడండి! గతంలో మీకు వంద డబ్బుల ఆదాయం వస్తే ఇప్పుడు వెయ్యి డబ్బులు వస్తున్నాయి. ఇది అభివృద్ది కాదా?" అన్నారు. కొందరు అవునన్నారు. కొందరు ‘అవునేమో ’ ననుకున్నారు.

కొద్దిమంది మాత్రం "వంద డబ్బుల ఆదాయం వచ్చినప్పుడు 90 డబ్బులు ఖర్చయిపోయేవి. పది డబ్బులు మిగిలేవి. ఇప్పుడు వెయ్యి డబ్బులు వచ్చినా.... వెయ్యి పైన, వంద డబ్బులు ఖర్చవుతున్నాయి. వెరసి వంద డబ్బుల అప్పులు లేదా అవసరాలు మిగిలిపోతున్నాయి. ఇదేం అభివృద్ది?" అన్నారు.

ఆర్దికవేత్తలు వాళ్ళని గదమాయిస్తూ "నోరు మూయ్యండి. మీకు లెక్కలు తెలియవు. మేం మేధావులం. మేం చెప్పినట్లే అన్నీ నడుస్తున్నాయి. అంటే అధికారం మాది. కాబట్టి మేం చెప్పిందే మీరు వినాలి, నమ్మాలి. గతంలోని వంద డబ్బుల ఆదాయంతో పోలిస్తే వెయ్యి ఎక్కువా, కాదా? అంటే అభివృద్ది జరిగినట్లే కదా!? ఇక మాట్లాడకండి!" అని కోరస్ గా అరిచారు.

ఆ బృందపు బృహద్ ధ్వనిలో, పాపం, ఈ కొద్దిమంది గొంతు, పీలగా మారింది. కొన్నాళ్ళకి మూతబడిపోయింది.

ఇంతలో, కాగితపు భారీ కట్టడం, అందమైన అమ్మాయిలా గాకుండా, వికృతమైన దెయ్యంలా కనబడుతోందన్న మాట, ఆ నోటా ఈ నోటా పొక్కింది. అయినా బియ్యం పప్పుల దగ్గర నుండి అన్ని వస్తువుల ధరలూ పెరిగాయి. సదరు కట్టడం అందంగా ఉన్నా, వికృతంగా ఉన్నా, ధరలు మాత్రం తగ్గడం లేదు. అదే అభివృద్ది అన్నారు ఆర్దికవేత్తలు. అప్పులు పెరిగి అల్లాడుతున్నారు ప్రజలు.

ప్రజలలో కొందరు, అసలా కాగితపు కట్టడంలో ఏముందో తెలుసుకోవాలని, తొలినాళ్ళలోనే అందులోకి ప్రవేశించారు. కొందరికి అసలేం అర్ధంకాలేదు. "అందమైన అమ్మాయిలా లేదేమిటి?" అనడిగారు.

"అది మీరు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. మీకు ఆర్దిక విషయాల మీద అవగాహన లేదు. అందుకే పోల్చుకోలేక పోయారు. ఈ కాగితపు కట్టడం బయటికి చూడటానికి ఏ ఆకారమూ లేని భారీ ఆకృతిలా ఉన్నా, లోపల, పొందికగా ఉన్న చక్కని అమ్మాయిలా ఉంది. మీకే అర్దం కావటం లేదు" అన్నారు ఆర్దికవేత్తలు.

అదేమిటో తెలుసుకొందామని ప్రయత్నించారు, ఆ కొందరు! అర్ధంగాక బయటికొచ్చేసిన వాళ్ళు కొందరైతే, అర్ధం చేసుకోలేక పిచ్చివాళ్ళు అయ్యారు, అందులో కొందరు! మిగిలిన వాళ్ళకి అర్ధమయ్యి కానట్లుండంతో, ఇప్పటికీ ఆ లోపలే గిరగిరా తిరుగుతున్నారు.

ఈ లోగా గడిచిన కాలంలో.... కాగితపు కట్టడం అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా.... ధరలు పెరగటం ఆగనే లేదు.

ఇలా ఉండగా హఠాత్తుగా ఓ రోజు...

మండే సూర్యుడి కన్నే నిప్పు కణిక గా రాలిందో,

ఆర్దిక అంచనాలు అర్దం గాకపోయినా, అంతశ్చేదన హెచ్చరికతో సామాన్యుడి గుండే మండిందో గానీ....

కాగితపు నిర్మాణానికి నిప్పంటుకుంది.

ఆరకుండా మండి, మసి కుప్పగా మారింది. మంటనార్పేందుకు ఆర్దిక వేత్తలు ఎన్ని మాటలు చెప్పినా, చెంబులతో నీళ్ళు కుమ్మరించినా, ప్రయోజనం లేకపోయింది. అంత భారీ నిర్మాణం తగలబడుతుంటే నీళ్ళ చెంబులు[ఉద్దీపనలు] నిప్పు నార్పలేవు కదా!

గమ్మత్తేమిటంటే.... కాగితపు నిర్మాణం నిలువునా మసికుప్పగా మారిపోయినా.... ధరలు తగ్గలేదు. పెరగటం ఆగలేదు. అప్పులూ తప్పలేదు.

అప్పటికి గానీ ప్రజలకి అర్ధం కాలేదు, తమ జీవితాల మీద ఈ కాగితపు నిర్మాణపు ప్రభావం ఏమిలేదనీ, దాని లెక్కలూ, విశ్లేషణలూ తమకు అందించిన అభివృద్ది భ్రాంతేనని!

తిరిగి చూస్తే ఆర్దికవేత్తలందరూ.... తమ మోసం బయటపడినందుకు, లోలోపల గజగజా వణుకుతూ, పైకి గంభీరంగా ముఖం పెట్టి, దీన్ని ఇంకా ఎలా మభ్యపట్టటమా అని ఆలోచిస్తూ ప్రజల ముందు నిలబడి ఉన్నారు!

కాగితపు నిర్మాణం కంటే ఎత్తుగా భగభగలాడుతూ.... ప్రజలు ఆర్దికవేత్తల ఎదురుగా ఉన్నారు!!

ఇదండీ కథ!

ప్రజల కోపాగ్నికి ఆర్దికవేత్తల గతేమీ కానున్నదో మనకి తెలియదు గానీ, ప్రస్తుతం మనం, ఈ కథకి అనువర్తనని పరిశీలిద్దాం.

1]. ఆర్దికవేత్తలు సృష్టించిన కాగితపు భారీనిర్మాణం, ద్రవ్యోల్భణం లెక్కల వంటిది. ద్రవ్యోల్పణం పెరిగిందన్నా, సున్నా అయ్యిందన్నా, చివరికి వ్యతిరేక ద్రవ్యోల్పణం లోకి వెళ్ళిందన్నా, నిత్యావసరాల, ఇతర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

మొన్నామధ్య.... సుప్రసిద్ద ఆర్దికవేత్తా, ఒబామాకి గురుగారూ, మన ప్రధానమంత్రీ అయిన శ్రీమాన్ మన్మోహన్ సింగుల వారు "వ్యతిరేక ద్రవ్యోల్బణం [-ve Inflation] లోకి వెళ్తే.... కంపెనీలకి నష్టం గానీ, ప్రజలకి లాభమే! ఎందుకంటే ధరలు తగ్గుతాయి" అని సెలవిచ్చారు. ద్రవ్యోల్పణం పాజిటివ్ నుండి సున్నాకి చేరింది, ఆపైన నెగిటివ్ లోకి పోయింది. మళ్ళీ తిరిగి పాజిటివ్ లోకే వచ్చింది. అయినా ధరలు మాత్రం తగ్గింది లేదు. ఏకోన్ముఖంగా పెరుగుతూనే ఉన్నాయి.

అచ్చంగా కాగితపు నిర్మాణం.... అందంగా ఉన్నా, వికృతంగా ఉన్నా.... ధరలు పెరిగినట్లే!

2]. మరో విధంగా చెప్పాలంటే - కాగితపు నిర్మాణం.... వృద్దిరేటు [GDP], తలసరి ఆదాయం, స్థూల జాతీయ ఉత్పత్తి, గట్రా లెక్కల వంటివి. వాటి దారిన అవి, ఎంత శాతం పెరిగినా, తరిగినా.... ప్రజల జీవితాల్లో మార్పుండదు. ధరలు తగ్గవు, అదాయ వ్యయాల నిష్పత్తీ మారదు. ఆదాయపు మిగులూ ఉండదు. ఇంకా అప్పులే మిగులుతాయి.

3]. ముఖ్యమైన అనువర్తన ఏమిటంటే - కాగితపు నిర్మాణాన్ని.... స్టాక్ ఎక్చేంజ్ గా చెప్పవచ్చు. సెన్సెక్స్ [కాకపోతే డోజోన్స్, నాస్ డాక్స్, ఏదైనా ఒకటే] ఆకాసాని కెగిసినా, పతనావస్థకి చేరినా, ప్రజల స్థితి గతులలో మార్పుండదు. ప్రజల అభివృద్దికి స్థూల ప్రతిబింబాలైన కార్పోరేట్ కంపెనీల షేర్లు, అచ్చంగా కాగితపు సంపద. అది ఆవిరి అయిపోయినా, మసిమసి అయిపోయినా.... అంతా కాగితాల మీదే!

అచ్చంగా కథలోని కాగితపు కట్టడం లాగానే! కాబట్టే, షేర్ మార్కెట్లో రాత్రికి రాత్రి లక్షలు సంపాదించవచ్చని నమ్మి, కూడబెట్టిన డబ్బు ముటగట్టుకు పోయిన సామాన్యులలో, ఆ మాయాజాలం అర్ధంగాక, పిచ్చివారయి వెనక్కి వచ్చింది కొందరు. పెట్టింది పోగొట్టుకుని, ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన వాళ్ళు మరి కొందరు. అర్ధమయ్యీ గాక అక్కడక్కడే పడి తిరుగుతున్న వాళ్ళు ఇంకొందరు.

సూక్ష్మంగా చెబితే స్టాక్ ఎక్చేంజి లోపల జరిగేది ఇది.

ఇక స్థూలంగా ఆ మాయాజాలాన్ని చెప్పాలంటే మరికొన్ని టపాలు తప్పవు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

కథ బాగుంది, జరుగుతున్నదాని గురించి సరళంగా బాగా చెప్పారు.

GOOD POST

THANK YOU

కన్నాగారు, KAMAL గారు: నెనర్లండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu