ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న కార్పోరేటిజంని, మరింత స్పష్టంగా అర్ధం చేసుకునేందుకు మరో పోలిక చెబుతాను. గతంలో ఒక టపాలో చెప్పిన పోలికకు దగ్గరగా అన్పించినా, మరింత స్పష్టమైన పోలిక! ఎలాగంటే -

భావవాదం మానవజాతికి తల్లివంటిది. కుటుంబంలో తల్లి, అందరి గురించీ శ్రద్ద తీసుకుంటుంది. అందరూ సంతోషంగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకుంటుంది. ప్రతి ఒక్కరి ఆహారం, ఆహార్యం, ఆరోగ్యం గురించి ప్రత్యేకించి శ్రద్ద తీసుకుంటుంది. అందరికీ, వారి అభిరుచులూ, ఇష్టాఇష్టాలని దృష్టిలో ఉంచుకొని, ఆయా అవసరాలు సమకూరుస్తుంది. వండి వార్చి వడ్డిస్తుంది. పిల్లలు... అన్ని విషయాలూ నేర్చుకుంటూ పెరిగి పెద్దయ్యేలా కృషి చేస్తుంది.

అలాగే పదార్ధ వాదం మానవజాతికి తండ్రి వంటిది. తండ్రి, కుటుంబ భద్రత గురించి, పరువు మర్యాదల గురించి శ్రద్ద తీసుకుంటాడు. కుటుంబం శక్తివంతంగా, ధృడంగా ఉండేటట్లూ, ఆర్దికంగా బలంగా ఉండేటట్లు పాటుపడతాడు. ఆహారాది అవసరాలు తీరేందుకు కావలసిన వనరులన్నీ సమకూరుస్తాడు. పిల్లలు పెరిగి పెద్దయ్యేసరికి, సమాజంలో ఒక స్థాయికి చేరేలా కృషి చేస్తాడు.

అయితే కార్పోరేటిజం మానవ జాతి పట్ల వేశ్యాగృహ నిర్వాహకుల వంటిది. సమాజంలో కుటుంబం పట్ల తల్లిదండ్రులిద్దరూ బాధ్యత, బంధమూ కలిగి ఉంటారు. కుటుంబ శ్రేయస్సు, వృద్దీ కోసం పాటుపడతారు. కానీ వేశ్యాగృహ నిర్వాహకులకు మాత్రం, తమ చెప్పుచేతల్లో ఉన్న వేశ్యల పట్ల గానీ, తమ గృహనికొచ్చే విటుల[కష్టమర్ల] పట్ల గానీ, ఏ concern ఉండదు. వాళ్ళ శ్రేయస్సూ పట్టదు, ఆరోగ్యమూ పట్టదు. కేవలం తమ రాబడి మాత్రమే వాళ్ళకి ముఖ్యం! వాళ్ళకి ఏ నీతి నియమాలూ ఉండవు, దయా దాక్షిణ్యాలూ ఉండవు. తమ వ్యాపారమే తమకు ముఖ్యం. సరిగ్గా కార్పోరేటిజం ఇలాంటిదే!

ప్రాచీన భారత దేశంలో కూడా వర్తకులు ఉండేవాళ్ళు. ‘వర్తక శ్రేష్ఠి’, శెట్టిగార్లుగా పిలవబడే ఈ వర్గం, వాణిజ్యానికి సంబంధించి, కొన్ని నీతినియమాలతో వ్యవహారించేవాళ్ళు. వితరణశీలురుగా పేరెన్నిక గలవాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ప్రాచీన భారతం అంటే నా అర్ధం, ఈ గడ్డ మీదకి గజనీ మహమ్మదూ, ఘోరీ మహమ్మదూ, అల్లా ఉద్దీన్ వంటి ఎడారి దొంగలు ప్రవేశించి దోపిడులు చేయకముందు. ఆ దోపిడి సంపద పరంగానే కాదు, భావపరంగా కూడా!

ఇక రామాయణంలోనూ, భారతంలో నారద నీతి ప్రస్తావన లోనూ, వర్తక వర్గం గురించి స్పష్టమైన వివరణలున్నాయి. భట్టి విక్రమార్కుల కథల వంటి జానపద, చారిత్రకా, సంస్కృత సాహిత్యంలోనూ, వర్తక శ్రేష్ఠుల నిజాయితీ, నిబద్దతల గురించిన ప్రస్తావనలున్నాయి. గుప్తుల కాలంలో వర్తకులు, సముద్ర వ్యాపారం చేయటమే గాక, రాజుకి సైతం అప్పులూ, సలహాలూ ఇవ్వగల స్థితిలో ఉన్నారనడానికి ఆధారాలున్నాయి.

రైతులు పొలంలో పంట పండించటానికి పెట్టుబడి పెడతారు. పంటలు పండించేందుకు శారీరకంగా శ్రమిస్తారు. దానికనుగుణంగా వాళ్ళు లాభాలు పొంది తీరాలి. అది ధర్మం! ఏ రంగంలోనైనా కూలీలు శరీరశ్రమ పెట్టుబడిగా కష్టపడతారు. అందుకనుగుణంగా వాళ్ళు భత్యాలు పొందాలి. అది ధర్మమే! వైద్యులూ, ఉపాధ్యాయులూ, న్యాయవాదులూ, ఉద్యోగులూ.... శారీరకంగా, మేధోపరంగా శ్రమిస్తారు. వారి సేవలకనుగుణంగా వాళ్ళు రాబడి పొందాలి. ఇదీ ధర్మమే!

అదే విధంగా.... వాణిజ్య సంస్థలు కూడా, వస్తు ఉత్పత్తికీ, విక్రయాలకీ, సేవల రంగంలో పెట్టుబడి పెడతారు. శారీరకంగా, మేధోపరంగా శ్రమిస్తారు. దానికి తగినంతగా వాళ్ళు లాభాలు పొందితే అది ధర్మం. అంతేగానీ 100% లాభాలు పొందాలనుకోవటం, పెట్టుబడికి పదింతలు లాభాలు పొందేందుకు వ్యూహాలు పన్నటం, దగాలు చేయటం అధర్మం. పరమ నీచం!

ప్రాచీన కాలంలో వర్తకులు సమాజానికి కట్టుబడి, లోబడి ప్రవర్తించేవాళ్ళు. నలుగురూ తమ గురించి చెడుగా అనుకోకూడదన్న భయమూ, దైవం శిక్షిస్తాడనే భయమూ భక్తీ ఉండేవి. [ఇప్పటి కార్పోరేట్ల వంటి నాస్తిక ప్రబుద్దులూ కొందరుండేవాళ్ళనుకొండి. ధనబలంతో దైవాన్నే ధిక్కరించిన అలాంటి వాళ్ళనే మనం రాక్షసులనే వాళ్ళం. ఇంకొందరిది కుహనా భక్తివాదం.]

రాజ శాసనాల కంటే.... సంస్కృతి, మతం ఏర్పరచిన నీతి నియామలే.... ఎక్కువగా వర్తక వర్గాలనీ, ప్రజలనీ కూడా నియంత్రించేవి. స్వయం సిద్దంగానే వర్తకులు, తమ లాభాలలో కొంత భాగాన్ని సమజ శ్రేయస్సుకీ, వితరణలకీ వెచ్చించే వాళ్ళు. పేదలకు దానధర్మాలు చేయటం ‘పుణ్యసంపాదన’ అనుకొని చేసేవాళ్ళు. ‘తమ రాబడిలో ఇంత వాటా కేటాయించి, పుణ్యాకార్యాలు చేయాలన్నట్లుగా’ వ్యవహరించటం కద్దు!

కాబట్టే ఎడారి దొంగలూ, సముద్రపు దొంగలూ ఈ గడ్డ మీదికి రాకముందు, ఎంతో కొంత మెరుగైన ప్రశాంతతో, సమన్వయ సామరస్యాలతో, నాటి ప్రజలు బ్రతికారు. ఇది చరిత్ర కారులు సైతం ఉల్లేఖించిన సత్యం!

ఈ నేపధ్యంలో ఆహ్లాదకరమైన కథ ఒకటి ఇప్పుడు చదవండి. ఇది నేను, చాలా సంవత్సరాల క్రితం ‘చందమామ’ లో చదివాను.

అనగా అనగా....

ఒక రేవు పట్టణంలో, మాణిక్య శెట్టి అనే పేరొందిన వర్తకుడుండేవాడు. అతడు ఎంతో ధనవంతుడో అంత దయగలవాడు.

ఒకనాడతని దగ్గరికి, పదిహేనేళ్ళ కుర్రవాడొకడు వచ్చాడు. మాణిక్య శెట్టికి నమస్కరించి ఆ కుర్రాడు "అయ్యా! నా పేరు కరుణాకర శెట్టి. నా తండ్రి నా చిన్నతనంలోనే గతించాడు. నా తల్లి వృద్దురాలు. ఇప్పటికే నా కోసం శ్రమపడుతూ ఉంది. ఆమెకా శ్రమ తగ్గించాలని నా కోరిక. నా దగ్గర రెండు వెండి నాణాలున్నాయి.

మిమ్మల్ని అడగాలంటే నాకు సిగ్గుగా ఉంది. అయినా పరిస్థితుల ప్రాబల్యం వల్ల మిమ్మల్ని అడిగేందుకు సాహసిస్తున్నాను. ఈ సారి మీరు, వర్తకం రీత్యా ఇతర సీమలకు వెళ్ళినప్పుడు, ఈ రెండు వెండి నాణాలతో నా కోసం ఏదైనా ఆకర్షణీయమైన, పనికి వచ్చే వస్తువుని కొనితెండి. దానితో నేను ఏదైనా పని కానీ, వ్యాపారం కానీ చేసి, నా తల్లిని పోషించుకుంటాను. దయ చేసి నాకీ సహాయం చెయ్యండి" అన్నాడు.

మాణిక్య శెట్టికి కరుణాకరుడి పట్ల చాలా కరుణ కలిగింది. అతడి వంక దయగా చూస్తూ "అబ్బాయి! నీకు పని ఇస్తాను. నాతో పాటు వర్తక పర్యటనకు వచ్చి , నా పనుల్లో సహకరించు. నీవు కోరినంత జీతం ఇస్తాను" అన్నాడు.

కరుణాకరుడు వినయంగా "అయ్యా! మీ దయకు కృతజ్ఞుణ్ణి. అయితే నన్ను క్షమించండి. నా తల్లి వృద్దురాలు. పైగా జబ్బుతో ఉన్నది. నేనామెకు దగ్గరుండి పరిచర్యలు చేయాలి. ఆమెని ఒంటరిగా వదిలి రాలేను. అందుకే నా కోసం ఏదైనా కొనితెమ్మని, మిమ్మల్ని అర్ధించవలసి వచ్చింది" అన్నాడు.

అతడి మాట తీరుకు మాణిక్య శెట్టి ముగ్దుడైనాడు. అతడి అర్దింపుని మన్నించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే, మాణిక్య శెట్టి వర్తక పర్యటనకై ఓడ మీద బయలుదేరాడు. వాణిజ్యానికి సంబంధించిన హడావుడిలో మునిగిపోయాడు. తిరుగుప్రయాణ సమయంలో, అతడికి కరుణాకరుడి అర్దింపు గుర్తుకు వచ్చింది.

అతడు వస్తు విక్రయ బజారులలో, కరుణాకరుడిచ్చిన రెండు వెండి నాణాలతో ఏదైనా కొందామని చూశాడు. రెండు వెండినాణాలకు కొనదగిన ఆకర్షణీయమైన వస్తువులేవీ అతడికి కనిపించలేదు. అతడికి కరుణాకరుడిని తలుచుకొని జాలి అన్పించింది. అంతలో అతడికి కొన్ని కోతులు అమ్మకానికి కనిపించాయి. కరుణాకరుడికి ఇవ్వడానికి కోతి తగినదని మాణిక్య శెట్టి కి తోచింది. కోతికి కరుణాకరుడు కొన్ని విచిత్ర విన్యాసాలు గానీ, చెట్టెక్కి కొబ్బరికాయలు కోయటం వంటి విద్యలు గానీ నేర్పి, డబ్బు సంపాదించు కోగలడని భావించి, అతడు కోతిని కొందామనుకున్నాడు.

అయితే కోతులమ్మేవాడు, ఎంత బేరం చేసినప్పటికీ, రెండువెండి నాణాలకి, నిద్రకి జోగుతున్న ఓ ముసలి కోతిని తప్ప, చురుకుగా ఉన్న కోతులని ఇవ్వనే ఇవ్వనన్నాడు. చేసేదేం లేక, మాణిక్య శెట్టి ఆ ముసలి కోతినే కొని, ఓడలో ఓ మూలన కట్టేసి తిరుగు ప్రయాణమయ్యాడు. ఎప్పుడు చూసినా, ఆ కోతి గమ్మున కునికిపాట్లు పడుతూ ఉండింది. పెట్టింది తిని మూలన పడుకునేది. ఇక దాన్ని కట్టేయటం కూడా అనవసరం అని, పనివాళ్ళు దాన్ని కట్టేయటం మానేసారు.

మాణిక్య శెట్టి ఆ కోతిని చూసి కొంత నిరుత్సాహ పడ్డాడు. ఇలా ఉండగా ఆ ప్రయాణంలో, వాళ్ళ ఓడ ముత్యాల దీవిని చేరింది. అక్కడ తీరంలో మంచి ముత్యాలు దొరుకుతాయని ప్రసిద్ది.

దేశదేశాల నుండి వచ్చిన వ్యాపారులు, అక్కడి జాలర్లకు, ఈతగాళ్ళకు డబ్బిచ్చి, ముత్యపు చిప్పలు ఏరుకురమ్మని సముద్రంలోకి పంపటంలో తలమునకలయ్యారు. ముత్యాల దీవిని ఓడ చేరిన క్షణంలో, అప్పటి దాకా నిద్రకు జోగుతున్నట్లు మూలన పడుకున్న కోతిలో చెప్పలేనంత చలనం వచ్చింది. ఒక్కసారిగా సముద్రంలోకి దూకి, క్షణాల్లో లోతులకి వెళ్ళి, చేతుల నిండా ముత్యపు చిప్పలతో తిరిగి వచ్చింది. వాటిని ఓడలో ఓ మూలన ఉంచి, తిరిగి ఉత్సాహంగా సముద్రంలోకి దూకింది.

అలా కొద్దిసమయంలోనే ఆ కోతి, చాలా ముత్యపు చిప్పల్నే ఏరుకొచ్చింది. బాడుగకు వచ్చిన గజ ఈతగాళ్ళ కంటే చాలానే పోగేసింది. అది చూసి మాణిక్య శెట్టి, ఆ కోతికి ముత్యపు చిప్పలని ఏరటంలో శిక్షణ ఇవ్వబడిందని అర్దం చేసుకున్నాడు. ‘అది ఎలాగో కోతులమ్మే వాణ్ణి చేరి ఉంటుంది. అందుకే అదెప్పుడూ నిరుత్సాహంగా, ఓ మూలన కూర్చునేది. ఎప్పుడైతే తనకు అలవాటైన, తర్ఫీదు ఇచ్చిన పని కనబడిందో, అప్పుడు ఉత్సాహంగా పనిలోకి ఉరికింది’ అనుకున్నాడు.

మాణిక్య శెట్టికి సంతోషం కలిగింది. అయితే అతడు ఆకోతిని గానీ, అది పోగేసిన ముత్యపు చిప్పల్ని గానీ, తన స్వంతం చేసుకోవాలనుకోలేదు. అప్పటికే కోతి చాలా ముత్యపు చిప్పల్ని తెచ్చి కుప్పబోసింది.

తర్వాత వాళ్ళు తమ పట్టణానికి తిరిగి వచ్చారు. వాళ్ళ రాక గురించి తెలుసుకున్న కరుణాకరుడు, మాణిక్య శెట్టిని కలుసుకున్నాడు. మాణిక్యశెట్టి "అబ్బాయి! నువ్వు అదృష్టవంతుడివి. నువ్విచ్చిన రెండు వెండి నాణాలతో ఏ వస్తువూ లభించలేదు. దాంతో నేను నీ కోసం ఓ కోతిని కొన్నాను. అయితే అది నీ అదృష్టం కొద్దీ, ముత్యపు చిప్పల్ని సేకరించటంలో శిక్షణ నివ్వబడ్డ కోతి అయ్యింది. మేము తిరుగు మార్గంలో ముత్యాల దీవిని చేరాము. నీ కోతి, చాలా ముత్యపు చిప్పల్ని ఏరుకొచ్చింది. ఇదిగో నీ కోతి, అది వెదికి తెచ్చిన ముత్యపు చిప్పలు! వీటిని తీసుకుని వ్యాపారం చేసుకో!" అంటూ కోతినీ, ముత్యపు చిప్పల్నీ అప్ప చెప్పాడు.

కరుణాకరుడు ఇది విని ఎంతో సంతోషించాడు. కోతినీ, ముత్యపు చిప్పల కుప్పనీ చూసి, ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత "అయ్యా! మీరు నాపట్ల ఎంతో దయ చూపించారు. మీరీ కోతిని నా డబ్బుతోనే కొని ఉండవచ్చుగాక! కానీ దానిని కొనాలని నిర్ణయించింది మీరే! కాబట్టి ఇది మీ అదృష్టం కూడా అయి ఉండవచ్చు. ఒకవేళ మీరు ఈ విషయాలన్నీ దాచి, కోతినీ, అది తెచ్చిన ముత్యాలనీ మీ దగ్గరే ఉంచుకొని, నాకు మరేదైనా ఇచ్చినా, మిమ్మల్ని అభ్యంతరం పెట్టే వారెవ్వరూ లేరు. కేవలం మీ నిజాయితీ వల్లనే నా కిదంతా దక్కింది. కాబట్టి ఈ ముత్యాలలో సగం మీరు తీసుకొండి. మిగిలిన వాటితో నేను వ్యాపారం చేసుకుంటాను" అన్నాడు.

మాణిక్య శెట్టికి కరుణాకరుని చూస్తే ఎంతో ముచ్చట కలిగింది. చిన్నవాడే అయినా... అతడి విశ్లేషణా, ఆలోచనా ధోరణి, నిజాయితీ ఎంతగానో నచ్చాయి. మాణిక్య శెట్టి బాగా ఆలోచించాడు. అతడికి ఒక్కగానొక్క కుమార్తె. కరుణాకరుడిని, అతడి తల్లిని చేరదీసి, తన ఇంట్లోనే ఉంచుకొని, కరుణాకరుడికి విద్యాబుద్దులు నేర్పించాడు. దాంతో పాటు వ్యాపార మెళకువలు కూడా! కరుణాకరుడిని ఆ విధంగా ప్రోత్సాహించి పెంచి, తన ఏకైక కుమార్తెనిచ్చి వివాహం చేశాడు.

తదుపరి కాలంలో కరుణాకరుడు మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. మాణిక్య శెట్టి మనుమలతో అడుకుంటూ విశ్రాంత జీవితాన్ని హాయిగా గడిపాడు.

ఇదీ కథ!

ఈ కథ రచయిత లేదా రచయిత్రి పేరు నాకు గుర్తులేదు. ఎవరైతేనేం? ఈ కథ ఒక భారతీయుడిది. ఒక ఆశావాదిది. ఒక భావవాదిది. ఈ కథలో రచయిత/రచయిత్రి, వర్తకులలో మంచితనం, కరుణ, నిజాయితీ ఉండాలని కాంక్షించారు. అదీ భారతీయ తత్త్వం! అనాదిగా భారతీయులు.... మంచి గురించి ఆలోచించారు, మంచి గురించి కలలు కన్నారు, మంచి గురించి కాంక్షించారు. ఎవరూ కలుషితం చేయకపోతే, ప్రాధమికంగా మనిషి మంచివాడే. ఏ దేశీయులైనా మంచినే కోరతారు. మంచిగానే ఉండాలనుకుంటారు.

అయితే, తరాల తరబడి, శతాబ్దాలుగా, నకిలీ కణిక అనువంశీయులూ, వాళ్ళ అనుచరులూ సహచరులూ.... ప్రచారిస్తూ ‘మంచి గురించి ఆలోచించటం, కలలు కనటం, ఆశించటం’ వంటి భావవాదం.... అవాస్తవిక దృక్పధం అని ప్రజలకి నూరి పోసారు. దాంతో మరింతగా మానవసంబంధాలు దెబ్బతిన్నాయి, దెబ్బతింటున్నాయి. మానవీయ విలువలదీ అదే స్థితి!

తమ గూఢచర్య వ్యూహాలతో, మంచి కోసం ప్రయత్నించే వారి జీవితాలని విఫలం చేసి మరీ, తమ ప్రచారాన్ని మరింత పెంచి, పదే పదే అదే ప్రచారంతో ‘నల్లమేక నలుగురు దొంగలు’ కథలో లాగా.... ప్రజల్ని ‘భావవాదం చేతగాని వాళ్ళు చెప్పే మాటలు. అవి వినటానికే బాగుంటాయి. ఆచరించటానికి కాదు’ అంటూ నమ్మించారు, నమ్మించ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మంచితనం అంటేనే మానసిక రుగ్మత మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

ఆశా వాదం లేకుండా పరిశోధనా మరియు అభివృద్ది ఎలా సాధ్యం... ప్రభుత్వ సంస్థలు మరియు ప్రయివేట్ సంస్థలలో వెటి లో ఎక్కువ అభివృద్ది, పరిశోధనలు వెలుగుచూస్తాయి .?

మీరు కొత్తగా నా బ్లాగులోకి వచ్చినట్లున్నారు. నా టపాలు చదివితే మీకర్ధకవుతుంది. వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu