తాగుడు వ్యసనపు విన్యాసం ఒకదాన్ని, ఈ ఆదివారం పూట సరదాగా చదువుతారని....
ఇది నా బాల్యస్నేహితురాలు చెప్పిన వాస్తవ సంఘటన. వైద్యులైన నా మిత్రురాలు, ఆమె భర్త, ఖమ్మం జిల్లా మంధని దగ్గర పనిచేసేవాళ్ళు.
విశాఖ స్టీల్ ఫ్లాంటు కనుకుంటా, అక్కడి నుండి ఇనుప ఖనిజం వెళ్ళేది. ఒకసారి, నెల ఒకటో తారీఖున, అందరికీ జీతాలు వచ్చాయి. ఆ నెలలో కొత్తనోట్లు పంపిణీ చేయబడ్డాయట. వాళ్ళ కాంపౌండర్ కూడా జీతం తీసుకున్నాడు. అప్పటికి అతడికి ప్రభుత్వం ఇస్తున్న జీతం మూడు వేలు. 30 వంద నోట్లు. ఫెళ ఫెళ్ళాడుతున్నాయి.
ఆ రోజు అతడి భార్య ఊళ్ళో లేదట. ఓ వందపెట్టి ఈ కాంపౌండర్ పూటుగా తాగేసాడు. ఇంటికెళ్ళి, పక్కనే కట్టేసి ఉన్న గేదె ప్రక్కన కూర్చుని, మత్తులో ఊగుతూ, జేబులో నుండి ఒకో వంద నోటు తీసి గేదెకి ప్రేమగా తినిపించేసాడు. "తినమ్మా తిను! నా బంగారు తల్లీ, తిను! నా బుజ్జి కన్నా, తిను!" అంటూ.... ఒకో నోటు దాని నోటి కందించాడట.
గేదె కూడా, పచ్చగడ్డి వదిలేసి ఇతడందించిన పచ్చనోట్లని పరపరలాడించేసింది. ‘అందరూ ఈ నోట్ల కోసమే కదా అన్ని తంటాలు పడుతున్నారు, చూద్దాం ఇవెంత రుచిగా ఉంటాయో?’ అనుకుందో, ‘అందరూ గడ్డికరుస్తారు అంటారు కదా, నేను నోట్లు కరుస్తాను!’ అనుకుందో, ‘ఇంత ప్రేమగా తినిపిస్తున్నాడు కదా’ అనుకుందో గాని, ఎంచక్కా తినేసింది.
చుట్టుప్రక్కల వాళ్ళు చూసేసరికే చివరి నోట్లు తినిపిస్తున్నాడట. వాళ్ళు ‘వద్దురా’ అని పక్కకి లాగబోతే, బండబూతులు తిట్టి వీరంగం చేసాడట. మర్నాడు ఉదయం, ఊరి నుండి ఇంటి కొచ్చిన అతడి భార్య నెత్తీ నోరు బాదుకుని ఏడ్చి, అతణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందట.
మత్తు దిగాక అతడూ, నెల జీతం మొత్తం గేదెకి తినిపించినందుకు బావురుమన్నాడట. దాదాపు రెండు దశాబ్దాల క్రితపు సంఘటన ఇది. అప్పటికి మూడు వేలంటే - నెలంతా ఓ సగటు మానవుడి ఇల్లు హాయిగా గడిచిపోయేంత మొత్తమే.
ఏడుపు తగ్గాక, పోయి, గేదెని నాలుగు బాదాడట. చుట్టుప్రక్కల వాళ్ళు "రాత్రి తాగిన మత్తులో దాన్ని బ్రతిమాలి నోట్లు తినిపించి, ఇప్పుడు చావబాదితే ఏం లాభం? గేదె చచ్చిందంటే మరింత నష్టం!" అనేసరికి చతికిలబడ్డాడు.
నెలంతా దాని పేడ ఎత్తుతూ... ఏడుస్తూ.... తిట్టుకుంటూ....!
తర్వాత నుండి, జీతం అతడి భార్య చేతికి ఇచ్చే ఏర్పాటు చేశారని చెప్పింది నా స్నేహితురాలు.
ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే నవ్వొస్తుంటుంది.
కొసమెరుపేమిటంటే : ‘అంత బాధపడ్డాడు, గేదెని తిట్టాడు, తన్నాడు గానీ, తన తాగుడు వల్లనే కదా అని మద్యాన్ని గానీ, ఆ అలవాటును గానీ, తనని తాను గానీ తిట్టుకోలేదు’ అని నా స్నేహితురాలు అన్నది. నిజమే! వ్యసనపరులయితే ఇంతేనేమో!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
7 comments:
తాగుడే కాదు, ఏ చెడ్డ వ్యసనమైనా అంతే.
వ్యసన పరుల తీరే ఇంత కదా!? తమలోని తప్పు తెలుసుకోరు గానీ ఊరందిరినీ నిందిస్తారు. బాగుంది కథ.
హె...హె... బాగుంది..బాగుంది. Good Post.
నరసింహ[వేదుల బాలకృష్ణ] గారు : నిజమేనండి.
విశ్వప్రేమికుడు గారు: సరిగ్గా చెప్పారు. కథ కాదండి. నిజంగా జరిగిందే!
తిక్క తింగరోడు గారు: నెనర్లు!
http://sandarbham1.blogspot.com/2010/06/blog-post_13.html
Read it. No need to publish
http://www.deeshaa.org/2010/06/12/now-for-some-good-news/
చందమామ గారు: చాలా మంచి లింకు ఇచ్చారు. నెనర్లు!
Post a Comment