నిజానికి విద్య అన్నది ఉప్ప ప్యాకెట్టో, బిస్కట్ ప్యాకెట్టో కాదు. సూపర్ మార్కెట్ కు వెళ్ళి, లేదా వీధి చివరికి చిల్లర కొట్టుకొళ్ళి, పది రూపాయలిచ్చి ఓ ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ విద్య అలాంటి వస్తువు కాదు, డబ్బిచ్చి పొందేందుకు! దుకాణదారుకి డబ్బు ఇవ్వటం, దుకాణపు యజమాని మనకి ఉప్ప ప్యాకెట్ ఇవ్వటంతో ఇక్కడ వ్యవహారం [deal] పూర్తయిపోతుంది.
కానీ విద్య విషయంలో అలా కాదు. పాఠశాలలో ఫీజు కట్టి చేరడంతో డీల్ మొదలౌతుంది. ఇక్కడ డబ్బుకి అతీతమైన సంబంధం - విద్యార్ది, ఉపాధ్యాయుల మధ్య ఉంటుంది. విద్యార్ధికి తమ టీచర్ పట్ల గౌరవం ఉండాలి. టీచర్ కి తమ విద్యార్ధుల పట్ల ప్రేమా, వాత్సల్యం ఉండాలి. [ఆవుదూడని వత్స అంటారు. గోమాతకి తన బిడ్డ పట్ల ఉండే ప్రేమని వాత్సల్యం అంటారు.] అప్పుడే టీచర్ చెప్పింది పిల్లల బుర్రలకి పడుతుంది.
కానీ చాలామంది తల్లిదండ్రుల దృష్టి ‘ఫీజు డబ్బు కట్టటంతో తమ కర్తవ్యం పూర్తయ్యింది’ అన్నట్లు ఉంటుంది. దాంతో మొత్తం భారం పాఠశాలల మీద పడుతుంది. పాఠశాలల యాజమాన్యాలు, ఆ భారాన్ని పూర్తిగా తమ ఉద్యోగులైన ఉపాధ్యాయుల మీదికి జారుస్థాయి. దాంతో ఈ మొత్తం జంఝటాన్ని - పాఠశాలలు, ఉపాధ్యాయులతో సహా... కష్టపడి పిల్లలకి చదువు నేర్పించి గాక, పైసలు ఉపయోగించి... మాస్ కాపీయింగ్, మార్కులు వేయించటం, ర్యాంకులు కొనటం వంటి ప్రక్కదారి మార్గాలలో వదిలించుకుంటున్నారు.
పిల్లలకి చదువు నేర్పటం, క్రమశిక్షణాది మంచి లక్షణాలు నేర్పటం.... అందుకోసం మంచి, సమర్ధులైన ఉపాధ్యాయులని సమీకరించటం, వాళ్లకి ఎక్కువెక్కువ జీతాలు చెల్లించటం.... ఇదంతా జంఝటమే! ఇంతకంటే తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ఫలితాలని సంపాదించవచ్చు.
కష్టపడి పిల్లలకి చదువు చెప్పటం, నయానో భయానో క్రమశిక్షణ నేర్పటం, కష్టపడి చదువుకునే తత్త్వం నేర్పటం - వీటన్నిటి కంటే.... ప్రశ్నాపత్రాలు లీక్ చెయ్యటం, మాస్ కాపీయింగ్ చేయించటం, వంటి పనులకు టీచర్లు పాల్పడుతుంటారు. స్వయంగా టీచర్లే బిట్స్ డిక్టేట్ చేయటం, కాపీలందించటం మొన్నటి పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో కూడా చూశాను. ఇంటర్నల్ పరీక్షల్లో సైతం, కొన్ని పాఠశాలల్లో, కొందరు ఉపాధ్యాయులు ఇదే పద్దతి నడపటం, నడవనివ్వటం మేము స్వయంగా పరిశీలించివే!
ఇక పాఠశాలలు యాజమాన్యాలు... డబ్బూ, పరపతి ఉపయోగించి, తమ విద్యార్దులుకి మార్కులు వేయించటం, ర్యాంకులు కొనటం సర్వ సాధారణం. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, ఫలానా పాఠశాల విద్యార్ధులు ఎవరెవరు తమ గదిలో పరీక్ష వ్రాస్తున్నారో విచారించి మరీ మాస్ కాపీయింగ్ కి సహకరించటం కూడా మొన్నటి పదవ తరగతి పరీక్షల్లో చూశాను.
ఇన్ని రకాలుగా, డబ్బుతో ఫలితాలని కొనవలసిన రావటంతో కూడా, యాజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు అంతంత మాత్రంగా ఇస్తుంటాయి. వాక్ ఇన్ ఇంటర్యూ అంటూ కార్పోరేట్ పాఠశాలలు, జిల్లా స్థాయిలో నెంబర్ వన్ విద్యాసంస్థలు కూడా, టీచర్లకు[IIT ఫౌండేషన్ శిక్షణ ఇచ్చేవారికి సైతం] పాతిక వేల దాకా జీతపు స్థాయి ప్రకటిస్తారు. అది కేవలం వాణిజ్య ప్రకటన మాత్రమే. తీరా చూస్తే... ఉదయం నుండి సాయంత్రం వరకూ ఏడెనిమిది పీరియడ్లు చెప్పించుకుని, పది పన్నెండు వేలు చేతిలో పెట్టటమూ నాకు తెలుసు.
పత్రికా ప్రకటనలలో మాత్రం, నెలకు పాతిక ముప్పై వేలు టీచర్లకు చెల్లిస్తున్నట్లు చెప్పుకుంటారు, అందులో సగం వాస్తవంగా చెల్లిస్తారు. టీచర్లను సైతం అలాంటి అబద్దాలనే చెప్పుకొమ్మంటుంది యాజమాన్యం. నిజం బయటపడితే ఉద్యోగం Fire out.
నిజాని కిది రంగు మారిన వాణిజ్య ప్రకటనే, ఉద్యోగ ప్రకటన కానే కాదు. ఆ విధమైన ప్రకటన ఇవ్వటం ద్వారా ‘ఫలానా పాఠశాల వారు నెలకు పాతిక వేలు చెల్లించి మరీ సమర్ధులైన టీచర్లతో చదువు చెప్పిస్తారు!’ అనుకొని, తల్లిదండ్రులు పాతిక వేల నుండి ఏభైవేల దాకా, సంవత్సరపు ఫీజులు తమకు చెల్లించాలన్నది ఇక్కడ వ్యూహం! అదే జరుగుతోంది రాష్ట్రస్థాయి ర్యాంకులు పొందిన విద్యా సంస్థలలో కూడా!
నిజం చెప్పాల్సి వస్తే - ఈ ఫలితాల అవకతవకలకు కూడా తక్కువేం ఖర్చవ్వదు. మంచి టీచర్ల చేత, తగినంత జీతభత్యాలిచ్చి, నిజాయితీగా చదువు చెప్పించినా ఇంతా ఖర్చవుతుంది. అలాంటప్పుడు ‘అదే ఖర్చుపెట్టి నిజాయితీగా ఫలితాలు సాధించవచ్చుగా?’ అనే అనుమానం మనకు వస్తుంది. సరిగ్గా ఇక్కడే కుట్ర కోణం బలంగానూ, అప్రకటితంగానూ పని చేస్తుంది.
నిజాయితీగా, సమర్ధులైన టీచర్లని పెట్టి చదువు చెప్పించినా, పిల్లలు కష్టపడి చదివినా.... ఫలితాలు అంత నిజాయితీగా రావు. ప్రభుత్వమో మరో అధికారామో నియంత్రిస్తే తప్ప! నూటికి ఒక విద్యాసంస్థ, నిజాయితీ దారిలో వెళ్తే పరాజయం పాలు కావాల్సిందే! పైనున్న కార్పోరేట్ సంస్థలు, ఫలితాలని హైజాక్ చేసి తొక్కేస్తాయి. కాబట్టి కూడా విద్యా వైద్యాలు ప్రైవేటీ కరించబడ కూడదు. అందుకే ఇందిరాగాంధీ హయాంలోని గత ప్రభుత్వాలు, అందుకోసం ఒడ్డి పోరాడాయి. గూఢచర్యపు పట్టు అప్పట్లో లేక ఓడిపోయాయి.
ఇక ఈ ఫలితాలని నిర్వహించే [organaise చేసే] తీరు, వాటి తాలూకూ నెట్ వర్క్, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకోసం పెద్ద కార్పోరేట్ విద్యాసంస్థలు కొందరు మధ్యవర్తులని [లైజాన్ ఆఫీసర్లు]ని నియమించుకుంటుంది. సంవత్సరమంతా ఉన్నతోద్యోగులకి, ఎం.ఎల్.ఏ., మంత్రుల వంటి రాజకీయులకి అందుబాటులో ఉంటూ, అవసరాలు[?] తీరుస్తూ, సత్సంబంధాలు కొనసాగించటమే సదరు ఉద్యోగుల/డైరక్టర్ల పని!
ఇవి ఫలితాల సాధన విషయంలో అయితే, ఇక విద్యార్ధుల సమీకరణ గురించిన నెట్ వర్క్, మరింత ఆసక్తి కరమైనది. కార్పోరేట్ విద్యాసంస్థలే కాదు, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ కూడా... విద్యార్ధులని సమీకరించేందుకు తమ తమ PRO లని ఆయాప్రాంతాల్లో అప్రకటితంగా అపాయింట్ చేసుకుంటాయి. మాటకారి వారిని, వ్యాపార నైపుణ్యం, ఎదుటి వారికి నచ్చచెప్పి ఒప్పించగల ఓపిక ఉన్నవారిని చూసుకుని, తమ దగ్గరికి ఎంత మంది విద్యార్ధులని పంపితే అంతగా, తలకు ఇంతని కమీషన్ ముట్టచెబుతాయి.
ఇందుకోసం కొన్ని కాలేజీలు, పాఠశాలలు తమ బోధనా సిబ్బందినీ ఉపయోగిస్తుంది. యాడ్ కాంపైన్ పేరుతో, ఆడియో వీడియోలతో సహా కరపత్రాలూ, బ్రోషర్స్ తో, ఆకర్షణీయమైన స్కీములతో... వేసవి సెలవులంతా ఇదే పని! ఎంతగా ఆశలు పెడతారంటే - తల్లిదండ్రులకి, ముఖ్యంగా అంతగా చదువుకోని గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకి, ఏకంగా అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు.
చిన్న ఉదాహరణ చెబుతాను. మాకు తెలిసిన ఒక అమ్మాయికి పదవ తరగతిలో 541 మార్కులు వచ్చాయి. ఆ అమ్మాయికి లెక్కలంటే ఇష్టం. బాగా చేస్తుంది. కప్ప, బొద్దింకలని చూసినా, ఒక్కసారిగా చీమల కుప్పల్ని చూసినా, ఆ పిల్లకి ఒళ్ళు జలదరిస్తుంది. జంతువుల పట్ల చాలా అయిష్టత. ఆమెకి MPC ఇష్టం.
స్థానిక కాలేజీ వాళ్ళు ఆ పిల్ల తల్లిదండ్రులకి "మీ అమ్మాయిని మా కాలేజీలో చేర్పిస్తే, ఫ్రీగా చదువు చెబుతాం. Bi.PC ఇప్పించండి. బాగా చదువుచెబుతాం. పూర్తిగా ఆమె మీద కాన్ సెంట్రేషన్ చేస్తాం. ఆమె గనుక మెడిసిన్ ర్యాంకు సాధిస్తే, రెండు తులాల బంగారు గొలుసు బహుమతిగా ఇస్తాం" అంటూ ఊదర పెట్టారు.
గత సంవత్సరం మా ప్రక్కింటి అమ్మాయికి 574 మార్కులు వచ్చాయి. ఆమె ఐఐటీ, ఎంసెట్ అంటూ ఉంటే, ఇదే కాలేజీ వాళ్ళు ఇదే ప్రపోజల్ తో "నువ్వు మా పాలిట లక్ష్మీదేవివి తల్లీ! సరస్వతీ దేవి కటాక్షం నీకుంది. ఏదో నీలాంటి వాళ్ళు మా కాలేజీలో ఉండి బాగా చదివి ర్యాంకు తెచ్చుకుంటే మాకు పేరు వస్తుందని మా ఆశ! Bi.P.C. తీసుకో, రానుపోనూ మేమే ఆటో కూడా ఏర్పాటు చేస్తాం" అంటూ ఇంటి చుట్టూ తిరగటం ప్రత్యక్షంగా చూశాము మేము. అదే తంతు ఈ సంవత్సరం ఈ అమ్మాయిది కూడా!
తల్లిదండ్రులకి ఆశ కలగటం సహజం. రెండు తులాల బంగారం అంటే 40 వేలు. ‘తమ పిల్ల చదివేసి మెడిసిన్ సీటు తెచ్చేసుకుంటే...?’ అని ఆశ! అదెంత కష్టమో, ఏపాటి సంభవమో తెలియదు. పదవ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంది కాబట్టి, మెడిసిన్ ర్యాంకూ తెచ్చేసుకుంటుంది అనుకుంటారు.
ఇక ఇలా ఆశపెట్టే కాలేజీ వాళ్లకి కూడా మెడిసిన్ ర్యాంకు ఎలా వస్తుందో తెలియదు. అసలిక్కడ ఎంసెట్ అన్నదే ఓ పెద్ద ఫార్సు! కాబట్టి, ఎంసెట్ లో ఈ అమ్మాయికే కాదు, ఏ విద్యార్ధికీ మెడిసిన్ ర్యాంకు తెచ్చుకునేంత శిక్షణా తామివ్వలేమని సదరు కాలేజీ వాళ్ళకీ తెలుసు. కానీ ఇవాళా రేపూ, ఇంజనీరింగ్ ర్యాంకులకి విలువ లేదు. ఐఐటీ తాము అందుకోలేరు. చదవగల విద్యార్ధులని సమీకరిస్తే, ఆశపెడితే, వాళ్ళు చదివి ఎలాగోలా ఒక్క మెడిసిన్ సీటు తెచ్చుకున్నా, అది తమకి కాసులు పండిస్తుంది.
ఒక వేళ మెడిసిన్ ర్యాంకు రాకపోయినా ఇంటర్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అవి ప్రచారస్త్రంగా ఉపయోగపడతాయి. ఈ ఆశ కంటే వాస్తవికతా తెలియదు. ఇంటర్ తమ దగ్గర చదివి, లాంగ్ టర్మ్ లో మెడిసిన్ ర్యాంకులు తెచ్చుకున విద్యార్ధుల వివరాలతో, ప్రచారాలు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఆశ వాళ్ళది!
ఇవేవీ తెలియని తల్లిదండ్రుల ఆశ తల్లిదండ్రులది. దాంతో లెక్కలంటే ఇష్టమో, జువాలజీ అంటే కష్టమో ఉన్న అమ్మాయిని Bi.P.C. లో చేరమన్న ఒత్తిడితో, ఆ బుడ్డిది బేర్ మంటోంది. ఏం చేస్తాం? అందుకే నిన్నటి టపాలో.... పిల్లలు విద్యాసంస్థలకీ, తల్లిదండ్రులకీ కూడా ఆదాయ వనరులుగా మాత్రమే కనబడుతున్నారని వ్రాసాను.
ఈ విషయం ప్రక్కన బెడితే.... PROల సాయంతో విద్యాసంస్థలు, విద్యార్ధులని సమీకరించుకునే ప్రక్రియలో.... అచ్చంగా ఎవరి మార్కెట్ సర్వే వారికుంటుంది. ఏ ప్రాంతంలో ఏయే వయస్సు పిల్లలు, ఏఏ తరగతుల్లో చేరేందుకు, ఎంతమంది ఉన్నారన్న వివరాలతో సహా, తల్లిదండ్రుల ఆర్ధిక స్థాయిల గురించి కూడా సమాచారం సేకరిస్తారు. ఆయా ప్రాంతాల్లో, ఏ విద్యార్ధుల తల్లిదండ్రులకి ఎంతెంత పలుకుబడి ఉందీ, ప్రభావపరచగల సత్తా ఏమాత్రం ఉందీ.... లాంటి వివరాలూ పరిశీలిస్తారు. దాన్ని బట్టి ఫలితాల పంపకం ఉంటుంది.
ఎవరి పిల్లలకి మంచి మార్కులూ, ర్యాంకులూ కట్టబెడితే, ఆయా ప్రాంతాల నుండి తదుపరి సంవత్సరం తమకు ఎంతమంది విద్యార్ధులు రవాణా అవుతారో చూసుకుని, దాన్నిబట్టి ఫలితాలని మేనేజ్ చేస్తారన్న మాట! ఇదంతా గమనించినప్పుడు, ఇంత శ్రమా, శ్రద్దా, సమయమూ... విద్యార్ధుల జ్ఞానాన్ని పెంపొందించటానికీ, వారి వ్యక్తిత్వాన్ని నిర్మించటానికీ ఉపయోగిస్తే.... ‘ఈ దేశపు యువత, ఎంత ధృఢతరంగా, సుసంపన్నంగా తయారౌతారో కదా!’ అన్పిస్తుంది.
ఈ విధమైన ఫలితాల అవకతవకల గురించి రాజకీయ రంగం ద్వారా భారతీయత మీద సుదీర్ఘ కుట్ర అనే టపాల మాలికలో ఎంసెట్ అవకతవకల మీద వ్రాసిన టపాలలో వివరించాను.
2000 సంవత్సరం ఫలితాల మీద మేము ఫిర్యాదు చేసిన తరువాత నుండి, ఇంటర్ ఫలితాలలోనూ, ఎంసెట్ ఫలితాలలోనూ, ఈ మధ్య కాలంలో ఐఐటీలోనూ, ‘మట్టిలోని మాణిక్యాలు’, ‘పేదింట విద్యాకుసుమాలు’ అంటూ శీర్షికలతో మార్కులూ, ర్యాంకులలో కొన్నింటిని, డబ్బూ పరపతి, ప్రభావశీలతా గల తల్లిదండ్రుల పిల్లలకి గాక, సామాన్యులకి కూడా రానిస్తున్నారు.
ఎందుకంటే - క్రమంగా ర్యాంకు ఫిక్సింగులూ, మార్కుల అవకతవకలూ బహిరంగ పడుతున్నాయి కదా!? జారిపోయే నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, కొంత సహజత్వాన్ని అద్దేందుకు, ఇలాంటి చర్యలు చేపట్టారన్న మాట. ఇవే మట్టిలోని మాణిక్యాలు 2000 సంవత్సరానికి ముందు స్టేట్ ర్యాంకుల జాబితాలో లేకపోవటం గమనార్హం!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
1 comments:
మీ విస్లేషణలను ఫాలొ అవుతున్నాను, కొన్ని సార్లు కంఫూసింగ్ గా అనిపించినా పాయింట్ బాగా అర్ధం అయ్యేలా వ్రాస్తున్నారు.
Post a Comment