పిల్లల్లో శ్రమించే తత్త్వం నేర్పడం గురించి చిన్నకథ!...
అనగా అనగా....
ఒక రాజు గారుండే వాడు. అతడికి ఒక్కడే కుమారుడు. అతి గారాబం వల్ల ఆ పిల్లవాడు వట్టి సోమరిపోతు అయ్యాడని రాజుకి అర్ధమయ్యింది. అందువల్లే దాదాపు పదిహేనేళ్ళు వచ్చినా, పిల్లవాడు ఒక్క మంచిలక్షణమూ, ఒక్క విద్యా నేర్వలేదు. రాజుకి చాలా విచారం కలిగింది. ఇప్పటికైనా యువరాజులో బద్దకాన్ని తొలగించాలనుకున్నాడు. ఏం చేయటమా అని ఆలోచించాడు.
మర్నాటి ఉదయమే యువరాజుని పిలిచి ‘సూర్యాస్తమయం లోపల స్వయం కృషితో రెండు వెండి నాణాలు సంపాదించుకు రావాలనీ, అప్పుడే రాజోచిత ఆహారాన్ని పొందగలడనీ, లేకపోతే సాధారణ భోజనం చేయాల్సి ఉంటుందనీ’ చెప్పాడు. రాత్రి భోజనం వేళ యువరాజుని "డబ్బెక్కడ?" అనడిగాడు.
పిల్లవాడు రెండు వెండి నాణాలు తీసి తండ్రి చేతిలో పెట్టాడు. రాజు వాటిని అటు ఇటూ తిరగేసి చూసి నిప్పల్లోకి విసిరాడు. యువరాజు మాట్లాడలేదు. రాజు సేవకులతో పిల్లవాడికి మామూలు భోజనం పెట్టమన్నాడు. తండ్రి అన్నంత పనీ చేయడులే అని భరోసా పడిన యువరాజు చిన్నబుచ్చుకున్నాడు. చేసేది లేక భోజనం చేసి పోయాడు. రాజు తన వేగుల ద్వారా పిల్లవాడు ఆ నాణాలు తల్లినడిగి తీసుకున్నది విని ఉన్నాడు.
రాజు మర్నాడూ అదే విధంగా ఆదేశించాడు. ఈ సారి యువరాజు మంత్రినడిగి డబ్బు తెచ్చాడు. రాజు మళ్ళీ వాటిని నిప్పల్లో వేసాడు. పిల్లవాడు మాట్లాడలేదు. అయిష్టంగా మామూలు భోజనం చేసి వెళ్ళాడు.
రాజు అదే కొనసాగించాడు. రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలయ్యాయి. చివరికి యువరాజు రాజద్యోగులని కూడా అడిగి వెండి నాణాలు తెచ్చాడు. రాజు ఎక్కడా ఎవరినీ యువరాజుకి డబ్బివ్వ వద్దని లేదు. అలాగని ఇచ్చిన మంత్రీ రాజద్యోగులని మెచ్చలేదు. రాణీతో సహా ఎవ్వరు యువరాజుకు వెండి నాణేలిచ్చినా రాజు వారితో ముభావంగా ఉన్నాడు. అయిష్టత ప్రకటించాడు. దాంతో క్రమంగా యువరాజుకి వెండి నాణాలిచ్చేవాళ్ళు తగ్గారు. యువరాజు కనబడగానే మోహం చాటేయటం, తప్పుకుపోవటం చేయసాగారు.
రాను రాను యువరాజుకిది బాధాకరంగా తోచింది. మామూలు భోజనం చేయటం కష్టంగా అన్పించినా సర్ధుకుపోయే వాడేమో గానీ, తాను అందరికీ చులకన అవుతున్నాడన్న భావం యువరాజుకి క్రమంగా అర్ధం కాసాగింది. చివరికో రోజు విసుగెత్తి రాజభవనం దాటి వీధుల్లో కెళ్ళాడు.
ఒక కమ్మరి దుకాణం దగ్గరికెళ్ళి పని ఇమ్మని అడిగాడు. కమ్మరి వాడు సమ్మెట కొట్టే పని ఇచ్చాడు. యువరాజుకి అది కష్టంగా తోచింది. అయినా అందరూ తనని నీచంగా చూస్తున్నారన్న కసి కొద్దీ, చెమట చిందించి పని చేసాడు. మధ్యాహ్నం కమ్మరి వాడు పెట్టిన పచ్చడి మెతుకులు రోజూ మధ్యాహ్నం తాను తినే పరమాన్నం కన్నా పరమ రుచిగా అన్పించింది. సాయంత్రం దాకా పని చేస్తే కమ్మరి వాడు రెండు వెండి నాణేలిచ్చాడు.
యువరాజుకి అవి అందుకున్నప్పుడు సంతృప్తిగా, ఒకింత గర్వంగా తోచింది. ఉప్పొంగిన ఛాతీతో ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి భోజనాల వేళ తండ్రి అడిగితే రెండు నాణేలు ఇచ్చాడు. ఇస్తోన్న ఆ చేతుల్లో చిన్న అలజడి! రాజు ఇదంతా ఏం పట్టించుకోనట్లు ఆ నాణాల్ని రోజులాగానే నిప్పల్లోకి గిరాటు వేసాడు.
యువరాజు ఒక్క క్షణంలో అక్కడికి గెంతి, నిప్పల్లోంచి నాణాలని కట్టెతో బయటకి లాగాడు. చప్పన నీళ్ళల్లో వేసి చల్లార్చి చేతుల్లోకి తీసుకున్నాడు. అపురూపంగా వాటిని ఎత్తిపట్టుకుని, కోపం దిగమింగుతూ తండ్రి వైపు చూశాడు. స్పుటంగా "ఎంత తేలిగ్గా వాటిని నిప్పల్లోకి గిరాటు వేసారు? ఉదయం నుండి సాయంత్రం దాకా నడ్డి విరుచుకుంటే వచ్చాయవి!" అన్నాడు.
రాజు చిరునవ్వు నవ్వుతూ "నాయనా! అన్ని వస్తువులూ అంతే! ఎంతో కష్టపడితే తప్పరావు. కష్టపడగా వచ్చిన దాన్ని అనుభవిస్తున్నప్పుడే ఆ తృప్తీ ఆనందమూ కలుగుతాయి. సోమరిగా తిని పడుకోవటం జీవితాన్ని వృధా చేసుకోవటమే. ఏ పనీ చేయనప్పుడు నిజమైన ఆనందాన్ని కూడా అనుభవించలేవు" అన్నాడు.
యువరాజుకి సత్యం బోధపడింది. ఆ రాత్రి వేళ రాజోచిత భోజనం కూడా బాగుందనిపించింది. కమ్మరి వాడిచ్చిన పచ్చడి మెతుకుల రుచి కూడా పదే పదే గుర్తుకు వచ్చింది. శ్రమలోని సంతోషాన్ని పిల్లవాడు గుర్తించాడు. కష్టపడి విద్యలు నేర్చాడు. పెరిగి పెద్దవాడై, చక్కగా రాజ్యం పాలించి, మంచి వాడన్న పేరు తెచ్చుకున్నాడు.
ఇదండీ కథ!
మా స్వానుభవం నుండి మరో చిన్న ఉదాహరణ చెబుతాను.
మా స్కూలులో పిల్లలకి, వర్క్ చక్కగా చేసిన వాళ్ళకి, ఒక చాక్లెట్ బహుమతిగా ఇచ్చేవాళ్ళం. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి రోజూ ఫైవ్ స్టార్ చాక్ లెట్లు వంటివి కొనిస్తారు. మేం ఇచ్చేది పావలా ఆశా చాక్లెట్. అయినా సరే, అది తను కష్టపడి చదివి సంపాదించుకున్న చాక్లెట్, తమకి స్కూలు ఇచ్చిన చాక్లెట్. అది వాళ్ళకి ఎంతో అపురూపం. కొందరు చాక్లెట్లని అలాగే దాచేస్తే, కొందరు వాటి ర్యాపర్స్ దాచుకునేవారు. నాకు ఇన్ని చాక్లెట్లు వచ్చాయంటే నాకు ఇన్ని అని పోటీలు పడి చదవటం, వ్రాయటం నేర్చేవారు.
నర్సరీ పిల్లలకైతే అక్షరం ఒకటి నేర్చుకుంటే ఒక్కచాక్లెట్ ఇచ్చేవాళ్ళం. కొంతమంది 26 అక్షరాలకు 26 చాక్లెట్స్ సంపాదించుకునేవాళ్ళు. కొంతమంది ఇంకా చాలా తక్కువవ్యవధిలో నేర్చుకునేవాళ్ళు. అలాగే అంకెలు నేర్చుకున్నా, అంకెకు ఒకటి చొప్పున చాక్లెట్ వచ్చేది. ఓ సారి ఓ నర్సరీ బుజ్జిగాడికి ఎలర్జీ ఉందనీ, చాక్లెట్లు ఇవ్వవద్దని వాళ్ళ అమ్మ చెప్పింది. సరేనని మేమూ వాడు కొత్త అక్షరం నేర్చుకున్నా incentive ఇవ్వలేదు. ఓ వారం రోజులు పోయేసరికి వాడు, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళడానికి వస్తే గోడకి అతుక్కుపోయి “రేపట్నుండి నేను స్కూలుకి రానే! నేను బాగా రాసినా సారు నాకు చాక్లెట్టు ఇవ్వటం లేదు” అని కంప్లయింట్ చేశాడు. వాడి భంగిమ, ఆ బుంగమూతి, చెప్పిన తీరుకి అందరం బాగా నవ్వాము. ‘తన శ్రమకి గుర్తింపు లేనప్పుడు ఎందుకు స్కూలుకి రావాలి?’ అన్న రోషం వాడిది. ఎంత ముచ్చట వేసిందో! వాడికి మూడేళ్ళు ఉంటాయంతే.
ఏ వస్తువైనా, ధనమైనా, ఒక పని ఫలితమైనా, విద్య అయినా, సమాజంలో ఒక హోదా అయినా, దాన్ని కష్టపడి పొందితేనే.... అది సదరు వ్యక్తులకి కూడా విలువైనదీ, గొప్పదీ అవుతుంది. అప్పుడు దాన్ని శ్రద్దగా కాపాడుకుంటూ, జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. అదే కష్టపడకుండా, అడ్డదారుల్లో, తేరగా పొందారనుకొండి.... అప్పడవి వారికి కూడా గొప్పవై ఉండవు. శ్రద్దాసక్తులతో ఉపయోగింపబడవు కూడా!
దేన్నైనా తేరగా పొందిన వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది, ఏ విలువలూ పాటించకుండా, ఎవరి పట్లనైనా నిర్లక్ష్యంగా! తాము పొందిన వస్తువులూ, ధనం, హోదాల వంటి వాటి పట్లే నిర్లక్ష్యం ఉండే వ్యక్తులకి, ప్రక్కవారి పట్ల మాత్రం, నిర్లక్ష్యం గాక మరో భావం ఎలా ఉంటుంది చెప్పండి? అంతిమంగా అవినీతి గమ్యం ఈ స్థితే!
చుట్టూ సమాజంలో పరిశీలించి చూడండి. కష్టపడి గాకుండా, అన్యాయంగానో, అక్రమ మార్గాల ద్వారానో డబ్బు సంపాదించిన వారి ఖర్చు హద్దులు మించి ఉంటుంది. [దాన్నే సినిమాలలోనూ గొప్పగా చూపిస్తుంటారు!] ఇదంతా చూసి, అంతగా డబ్బు సంపాదించలేని వారు, దాన్ని అనుకరించాలని ప్రయత్నిస్తారు. సాధ్యమైనా గాకపోయినా, ఈర్ష్య పడటం మానరు. పర్యవసానంగా అధికశాతం ప్రజలు విలువల్ని, అనుభూతుల్ని చెత్తకుండీల్లో పారేసి మరీ ఎండమావులు వెంటబడి ఉరుకులూ పరుగులూ పెడుతున్నారు.
ఈ ప్రక్రియ చిన్నవయస్సుల్లోనే.... విద్యార్ధుల పరీక్షా ఫలితాల్లో కాపీయింగ్, ఫలితాల గోల్ మాల్స్ గట్రాలతో పిల్లలకి అనుభవంలోకి వస్తున్నాయి. మొన్న మార్చిలో మా పాప పదవతరగతి పరీక్షలు వ్రాసింది. ఆ సందర్భంలో.... తారసిల్లిన ప్రభుత్వ ఉపాధ్యాయులలో చాలామంది "అరే! ముందుగా తెలిసి ఉంటే ఎగ్జామ్ సెంటర్ లో ఏదైనా చేసేవాళ్ళం కదా?" అన్నారు. "మార్కుల్ని బట్టి పిల్లల సామర్ధ్యాలని మేము లెక్కించము. ఆమె వ్రాసిన దానికి ఎన్ని మార్కులు వస్తే అన్నే వస్తాయి అనుకుంటాము" అన్నామో, ‘అక్కడికి మేమేదో నీతి కోవిదులం, తమని అవినీతి కుప్పలు’ అంటున్నామన్నట్లు మొహం పెడతారు. అందుకే ఏమీ అనకుండా నవ్వేసి ఊర్కోటం, తప్పకపోతే సున్నితంగా ఏదో చెప్పేయటం చేస్తున్నాము.
ఆ టీచర్లనీ తప్పుబట్టేందుకేం లేదు. వాళ్ళకి తారసిల్లిన తల్లిదండ్రులంతా "సార్! మా వాడికి ఫలానా సెంటర్ పడింది. కాస్త చూసీ చూడనట్లుంటే ఏదో మా వాడు 90% మార్కులు తెచ్చుకుంటాడు. ఏదో కాలేజీ వాళ్ళు ఫ్రీగానో, ఫీజు రాయితీనో ఇస్తారు" అనటమే వాళ్ళకీ తెల్సుమరి!
ఇదంతా చూస్తున్నా ఎవరు స్పందించరు. తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ, విద్యాసంస్థలూ, ఉన్నతాధికారులూ, ప్రభుత్వాధినేతలూ.... ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. తిలా పాపం తలా పిడికిడు అయినప్పుడు పరిస్థితి ఇలాగ్గాక మరోలా ఉండదు కదా!
నిజానికి డబ్బు విషయంలో అక్రమార్జన కంటే, విద్యా విషయంలో అక్రమార్జాన [చదువులో సబ్జెక్ట్, ప్రవర్తనలో చదువు తాలూకూ ప్రభావమూ లేకుండా, కాగితాల మీద మార్కులూ, ర్యాంకులూ, గ్రేడులూ ఉండటం] మరింత ప్రమాదకరమైనది. విద్యార్ది దశలో ర్యాగింగ్ కీ, ఆనక ఇంటాబయటా హింసకీ పాల్పడటం, మద్య మాదక పదార్ధాలకి బానిసలు కావటం, ప్రేమోన్మాదమంటూ ఇతరుల మీద దాడి చేయటం గట్రా మనో వికారాలన్నీ.... ఇలాంటి ప్రక్కదారి [విద్యతో సహా] సంపాదన పర్యవసానాలే!
ఇందుకు నిదర్శనంగా భారతంలోని ఈ చిన్నకథ చదవండి!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
9 comments:
చాలా బాగా చెప్పారు. మాకుతెలిసిన కథతో పాటు ఓ కొత్త కథ కూడా చెప్పారు. నేను ఇటువంటి కథలకోసం వెతుకు తున్నాను. చిన్నపిల్లలని మంచి మార్గంలో నడిపించడానికి కథలే మంచి ఆయుధాలు.
ధన్యవాదాలు.
మా టపా మీకు నచ్చినందుకు నెనర్లండి!
ఆదిలక్ష్మి గారు, ఈ వ్యాసం చిన్నతనంలో మా నాన్నగారు తన తోటి అధ్యాపకునితో అన్న ఒక మాటను జ్ఞప్తికి తెచ్చింది. ఒకసారి, మీ పిల్లల చదువుల ఖర్చు ఎలాగండి అని నాన్నగారిని అడిగితే, ఆయన, "నాకేమండి? మా పిల్లలు చదువు"కొన"ట్లేదు కదా, వాళ్ళు చదువుకుంటునారు " అన్నారు. ఆ మాట తలుచుకుంటే నాకు ఇప్పటికి ఎంతో గర్వంగా ఉంటుంది. మంచి వ్యాసం.
చాలా బాగా చెప్పారండి, అమ్మవొడి అని పేరు పెట్టినందుకు అమ్మవొడిలో కూర్చోపెట్టుకుని సుద్దులు చెపుతున్నట్టే వుంది మీ టపా
లలిత గారు: అవునండి. ఇప్పుడు చాలామంది చదువుకొంటున్నారు. చదువు కోవటం లేదు. :)
స్ఫురిత గారు: అందుకే కదండి అమ్మఒడి అని పేరు పెట్టింది. అప్పుడెప్పుడో మీ బ్లాగు నుండి యశొదమ్మఒడిలో నోట్లో వేలేసుకున్న చిన్నకృష్ణయ్య బొమ్మని దొంగిలించానండి. :)
హన్నా...ఆ వెన్నదొగనే మీరు దొంగిలించేసారన్నమాట...:)
అందుకే మీరు మా మంచి అమ్మ అయ్యారు.
స్ఫురిత గారు: అలా చిన్ని కృష్ణయ్యని తెచ్చేసుకున్నాం కాబట్టే ఇన్ని విషయాలు చెప్పగలుగుతున్నామండి!:)
చిలమకూరు విజయమోహన్ గారు : మంచి పిల్లలున్న అమ్మ ఎప్పుడూ మంచిదేనండి! :)
చాలా బాగా చెప్పారు.
Post a Comment