భారత దేశంలో ఒకప్పుడు తర్క శాస్త్రం చాలా గౌరవింపబడింది. శాస్త్రం అన్నంతగా అభివృద్ది చెందిన... తర్క మీమాంసలు! పాండిత్య ప్రతిభలు! విదేహరాజైన జనకుడి సభలో, పండితుడు వంది తో వాదనకి దిగిన అష్టావక్ర గురించిన కథ భారతంలో ఉంది.

a=b, b=c => a=c and c=d => a=d, b=d. ఈ విధంగా a,b కి సమానమై, b,c సమానమైతే a,cలు సమానం అవటమే గణితమైనా, తర్కమైనా! మెట్టు మెట్టుగా పైకి ఎక్కినట్లుగా, ఒకొక్క విషయాన్నే నిర్ధారించుకుంటూ, అంతిమంగా సత్యాన్ని చేరుకునేందుకే తర్కం!

అలాంటి చోట.... తర్కాన్ని ఒప్పుకోవాలన్నా, తార్కికంగా ఆలోచించాలన్నా సత్యదర్శనం పట్ల ఆసక్తి ఉండాలి. సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆకాంక్ష ఉండాలి. సత్యాన్ని అనుభూతించి మరీ తెలుసుకోవాలి. అందుకు తగినంత ధృఢమైన చిత్తమూ, స్థిరమైన నమ్మకమూ ఉండాలి.

బృహదారణ్యకోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తులలో ఋషులు సత్యదర్శనా కాంక్షితులై, చీకటి కావల ఏమున్నదో తెలుపమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తారు. ఆపైన వెలుగుని దర్శిస్తారు. అక్కడితో సంతృప్తి పడరు. వెలుగుకు ఆవల ఏమున్నదో చూపమంటారు. సత్యాన్ని తెలుసుకోవాలంటే చీకటినే కాదు, వెలుగునీ దాటి చూడాలన్న ఆలోచనే అద్భుతంగా తోస్తుంది. కాబట్టే ఉపనిషత్తులని అనుభూతించి తెలుసుకోవలసిందే అంటారు పెద్దలు.

ఎందుకంటే వెలుగుకి ఆవల ఋషి దర్శించింది దేనిని? తననే! ఇది చదివినప్పుడు "ఓస్! ఈ పాటి దానికా అంత తపస్సు, అంత ఆర్తి! అదేదో గొప్ప విషయంగా తెగ పొగిడేస్తున్నారే ఉపనిషత్తులనీ, వేదాలనీ, ఇతిహాసాలనీ! చీకటికీ, వెలుగుకీ ఆవల ఉన్నది తానేనట. బాగుంది!" అనేస్తే ఏమనగలం?

నెయ్యి రుచీ వాసనా తెలియని వాడు, స్వయంగా నెయ్యి కమ్మదనాన్ని అనుభవించి తెలుసుకోవలసిందే!

భగవద్గీత ఘంటసాల గొంతులో వింటుంటే "అర్జునా! పరమ గోప్యమైన ఈ గీతా శాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన మోహం నశించినదా?" అన్న శ్రీకృష్ణుడి ప్రశ్నవినిపిస్తుంది. చిన్నప్పుడు ఇది విని "ఇంత గొంతేసుకుని గంటన్నర పాటు గట్టిగా పాడేసాడు. అందరికీ వినిపించింది కదా! ఇంకా పరమ రహస్యమైన ’గీత’ అంటారేమిటి?" అనుకున్నాను.

కళ్ళెదురుగా 700 శ్లోకాలు ఉన్నా, ఎవరైనా గట్టిగా చదివినా, విన్నా.... అది రహస్యమేననీ, అందులోని ఒక్కొక్క శ్లోక భావమూ, అనుభవంలోకి వచ్చినప్పుడు గానీ అందులోని అర్ధమేమిటో అనుభూతికి అందదనీ.... జీవితం పాఠాలు నేర్పడం మొదలు పెట్టాక, మరో మాటలో చెప్పాలంటే జీవితపు కాఠిన్యమాధుర్యాలనీ, చీకటి వెలుగుల్ని దాటుతున్నప్పుడు అర్ధం అయ్యింది.

అదేమీ తెలియనప్పుడు.... గీతలో సుఖదుఃఖాలను, జయాపజయాలను, మానావమానాలను సమంగా స్వీకరించాలని చదివినప్పుడు "అది జీవితంలో ఏ అనుభవాన్ని ఆస్వాదించ వద్దనటమేననీ, కాబట్టి గీత పలాయన వాదమనీ" అనుకున్నాను. పిల్లకాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లు - జీవితంలో ఆటుపొట్లు అనుభవాని కొచ్చాక, వైకుంఠపాళిలో నిచ్చెనలు, పాములూ.... రెండూ ఉంటాయనీ, నిచ్చెనెక్కామని పొంగిపోతే మరుక్షణం పాము నోట్లో పడి కృంగి పోతామనీ అర్ధమైంది.

కాబట్టి, సుఖదుఃఖాలని, జయాపజయాలని సమంగా స్వీకరించాలంటే - అందుకు ముందుగా అహాన్ని దాటాలని, అది జీవితకాలపు సాధన అనీ అర్ధమైంది. పదో తరగతి పరీక్షల్లో, మరో ఆధునిక చదువుల్లొ పరీక్షలై పోయి సర్టిఫీకేటు చేతి కొచ్చాక ఇక ఆ అర్హత పొందినట్లే! అహపు పరీక్ష అలా కాదు. ఎంతటి వారికైనా అది జీవిత కాలపు సాధనే! జీవితంలో, ప్రతి అడుగులో, ప్రతి మలుపులో ఏమరుపాటు కూడని సాధనే!

కాబట్టే.... నిరంతర హరినామ సంకీర్తనా పరుడూ, ఆజన్మ బ్రహ్మచారీ, భక్తి సూత్రాలు ప్రవచించిన దేవర్షి, నారదుడు సైతం, అహపు బారిన పడిన కథ మనకి ఇతిహాసాలు చెబుతాయి. కఠోపనిషత్తులోనూ, ప్రశ్నోపనిషత్తులోనూ ఇంకా లోతైన విషయాలు చర్చించబడినాయి. నమ్మిన వాళ్ళకి అవి మార్గదర్శకాలు. నమ్మని వాళ్ళకి అవి నిరర్ధకాలు!

భగవంతుడూ అంతే! ఈశావాస్యపు శాంతి మంత్రం లోని పూర్ణం, అంటే సున్నలాగా! నమ్మినవాళ్ళకి భగవంతుడు పూర్ణుడు. నమ్మని వాళ్ళకి శూన్యుడు. నమ్మతే God is now here. నమ్మకపోతే God is nowhere. భగవంతుణ్ణి నమ్మినప్పుడు ఈ సర్వ సృష్టి స్థితిలయాలకి కార్యకారణ సంబంధం కన్పిస్తుంది. తార్కికంగానే కాదు, శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా కూడా!

తెల్లవాడు చెబితేనే నమ్ముతాము అనుకునే పరబానిసత్వం ఉన్నవాళ్ళనీ... ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అనుకుంటూ భారతీయులు "మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటారు" అంటూ.... స్వీయ ఛీత్కారం[ఆత్మ గౌరవగ్లాని] చేసుకునే వాళ్ళనీ వదిలేస్తే....

ప్రశ్నపనిషత్తులో
మంత్రం :
అథ కబంధీ కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛI
భగవత్ కుతో హ వా ఇమాః ప్రజాః ప్రజాయంత ఇతిII

భావం:
ఆ తరువాత కాత్యాయన కబంధి, పిప్పలాద మహర్షిని సమీపించి ఇలా అడిగాడు: "దేవా, ఈ ప్రాణి కోటులన్నీ ఎక్కడ నుండి పుడుతున్నాయి?"

మంత్రం :
తస్మై సహోవాచ - ప్రజాకామో వై ప్రజాపతిః, సత పో2తప్యత, సతపస్తప్య్తా, స మిథునముత్పాదయతే రయిం చ ప్రాణం చేతి, ఏతౌ మే బహుధా ప్రజాః కరిష్యత ఇతిII

భావం:
అతనికి పిప్పలాదుడు ఇలా బదులిచ్చాడు: ‘సృష్టికర్త’ సంతానం కోరినవాడై ధ్యానరూపమైన తపస్సు చేశాడు. అలా తపస్సు చేసి పదార్ధము శక్తి [Matter Energy] అనే జంటను సృష్టించాడు. ఈ రెండూ చేరి తనకై అనేక విధాలైన సంతతిని కల్పిస్తాయని ఆయన భావించాడు.

సృష్టికర్త పదార్ధం శక్తి అనే జంటను సృష్టించాడు. రయిం అంటే అన్నం అంటే పదార్దం. ప్రాణం అంటే శక్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ పదార్ధశక్తుల సమైక్యరూపం ప్రతిపాదించబడింది. మనిషితో సహా సకల ప్రాణులనీ పరిగణనలోకి తీసుకుంటే.... కాలిస్తే బూడిదయ్యే, పూడిస్తే మట్టిలో కలిసిపోయే ఈ శరీరం పదార్ధమే. రసాయన శాస్త్ర పరిభాషలో చెబితే ఆర్గానిక్ కాంపౌండ్. సేంద్రియ పదార్ధం! అందుకే పెద్దలు దీన్ని పాంచభౌతిక శరీరం అన్నారు.

అప్పటి వరకూ ప్రాణంగా ఉన్న శక్తి, శరీరంలో ఉన్నంత వరకూ ఇది తేజోపూరితం, చైతన్య భరితం. ప్రాణం, శక్తి ఉపసంహరించబడిన ఉత్తర క్షణం, దుర్గంధ స్థితికి, కృశించే దశకి చేరుతుంది. అటువంటి జంటను సృష్టికర్త సృజించాడు. పదార్ద శక్తులు పరస్పర ఆశ్రితాలే కాదు, పర్యాయ రూపాలు కూడా! దాన్నే ఐనిస్టీన్ E = mc2 గా గణితపరంగా కూడా నిరూపించాడు. ఐనిస్టీన్ గీతనీ, సంస్కృతాన్ని అధ్యయనం చేసాడని గొప్పగా చెప్పేవారు, అదే కంఠంతో భారతీయ ఇతిహాసాలని, వేద వేదాంగాలని పుక్కిటి పురాణాలని, వేదాలు సోమరసపాన మత్తులనీ ఈసడిస్తారు. ఏమనగలం? దండేసి దండం పెట్టడం తప్ప!

ఇదంతా ఎందుకు చెప్పానంటే - సృష్టి స్థితిలయాలకు దేవుడి ఉనికిని అంగీకరిస్తే, కార్యకారణ సంబంధాలని ఒక పద్దతిలో విశ్లేషించుకుంటూ వెళ్ళొచ్చు! అది మన ముందటి తరాల వారు వేల సంవత్సరాల క్రితమే చేశారు. దాన్నే మనకి వారసత్వ సంపదగా అనుగ్రహించారు. తరం నుండి తరానికి మౌఖికంగా సంక్రమించిన ఆ సంపద, తర్వాత తాటి ఆకుల మీదికి, ఆపైన రాగి రేకుల మీదికి.... తర్వాత కాగితాల మీదికి, ఇప్పుడు యంత్రపు తెరల మీదికి ప్రవహించింది.

దేవుడి ఉనికిని అంగీకరించకపోతే... ఈ సర్వ సృష్టికీ, సమస్త సంఘటనలకి, దేని కారణం దానికి చెప్పుకోవలసిందే! అయితే తర్కాన్ని మాత్రం ఒప్పుకొని తీరవలసిందే! ఆస్తికులైనా, నాస్తికులైనా....!

a=b, b=c, => a=c, c=d => a=d....ఇలాసాగే తర్కంలో c=d => a=d అంటే ఒప్పుకుంటాను. b=c అయినా b=d అంటే ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయాలు, అభిమానాలు, మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే....? అది కుతర్కం అవుతుంది.

దీన్నే.... ఇప్పటి ప్రపంచ, దేశ ఆర్ధిక రాజకీయ రంగాలలో, అదీ ఇదీ ఏముంది అన్నిరంగాలలో.... జరుగుతున్న, మూడున్నర శతాబ్దాలుగా జరిగిపోయిన, సంఘటనలకి తార్కికంగానైనా సరే, యాదృచ్ఛిక సంభావ్యత లేదనీ, వ్యవస్థీకృతంగా నడిపించిన కుట్రే కారణమనీ ప్రతిపాదించాను. దాన్నే నకిలీ కణికుల గురించి ప్రతిపాదనలు అనే టపాల మాలికతో ప్రారంభించి.... దృష్టాంతాలతోనూ, ఇతర టపాల మాలికతోనూ వివరించాను.

‘వ్యవస్థీకృత కుట్ర ఉంది’ అనే విషయాన్ని అంగీకరిస్తే... కార్యకారణ సంబంధాలతో సహా, ఇప్పటికి దాదాపు 350 టపాలతో సంవత్సరంన్నర కాలంగా వివరించాను.

"కుట్రా? అలాంటిదేం లేదు" అనేటట్లయితే.... నేటి సామాజిక పరిస్థితులనీ, మానవప్రవర్తనలనీ, ఆధునిక పోకడగా చిత్రించినా కూడా... సంఘటనలన్నిటినీ దేనికది విడగొట్టి చూడాల్సిందే! కార్య కారణ సంబంధం కనబడదు. ‘అన్నీ అలా జరుగుతున్నాయి. కాలమే అలా మారిపోయింది’ అనుకోవాల్సి వస్తుంది. నిజానికి కాలం మారినా సత్యం మారదు. సాంకేతిక శాస్త్ర ప్రకారం చూసినా, తత్త్వ శాస్త్ర ప్రకారం చూసినా సత్యం మారదు.

‘అన్నీ అలా జరుగుతున్నాయి, కాలమే అలా మారిపోయింది’ అనుకుంటే సమస్యా లేదు. పరిష్కారమూ లేదు.

నట్టింట్లో బాంబుపేలినా, ధరలూ పన్నుల వడ్డనతో మన నడ్డి విరిగినా.... ‘అన్నీ అలా జరిగిపోతున్నాయి. కాలమే అలా మారిపోయింది’ అనుకొని ’సంతోషంగా[?]’ బ్రతికెయ్యటమే మిగులుతుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

అవును కాలం మారలేదు . మారింది మనమే .

ఈశావాస్యోపనిషత్తులో ఋషి సత్యదర్శనా కాంక్షితుడై- అంటూ వ్రాసారు. కాని నేను చూస్తే ఆ విషయం ఆ ఉపనిషత్తులో నాకు కనపడలేదు. నా నరసింహ బ్లాగు పోస్టుల్లో ఈశావాస్యోపనిషత్ గుఱించి ఓ 5 పోస్టులు ఉన్నాయి. వాటిల్లో కూడా కనపడలేదు. ఓ సారి వాటిని చూచి సోర్సును తెలియజేయగలరు. ధన్యవాదములు.

దుర్గేశ్వర రావు గారు: అవునండి. నెనర్లు!

మల్లిన నరసింహా[వేదుల బాలకృష్ణమూర్తి]గారు : నిజానికి ’చీకటి నుండి ఆవలకి తీసుకుపొమ్మన్నది బృహదారణ్యకోపనిషత్తులోని అభ్యారోహ మంత్రంలోనిది. వెలుగు నుండి ఆవలకి తీసుకుపొమ్మన్నది ఈశావాస్యంలోని 15 -16 మంత్రాలు. ఇదంతా గత టపా, భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 01 [0/0=0, 0/0=1 ఏది సరైనది?] లో వివరించినందున క్లుప్తంగా చెప్పేప్రయత్నంలో బృహదారణ్యకోపనిషత్తుని రిఫర్ చేయటం మరిచిపోయాను. దాంతో మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేసినందుకు మన్నించాలి. నా టపాలో సరిదిద్దుతున్నాను. నెనర్లు!

ఉపనిషత్తులను పరిచయమ్ చేసినందుకు ధన్యవాదాలు.. ఎప్పటినుండో ఉపనిషత్తులు ఒక సారి చదవాలని కోరిక,ఈ జన్మ కి తీరుతుందో లేదొ(౧౦౮-108 ఉన్నయట అసలే) .ఇప్పటికి రామాయణ,భాగవతాలే ఒకసారి కూడా చదవలేదు. ఇక ఉపనిషత్తులే.... చూద్దాం.....

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu