విద్యగురు ముఖతః నేర్చుకోవాలి అంటుంది మహాభారతం. ఇందుకు నిదర్శనంగా భారతంలోని ఈ చిన్న కథ చదవండి! ఈ కథ అరణ్యపర్వంలోనిది. ఉషశ్రీ రచన నుండి యధాతధంగా గ్రహించి ప్రచురిస్తున్నాను.

పూర్వం భరద్వాజుడనే మహర్షి ఉండేవాడు. ఆయనకు ప్రాణ స్నేహితుడు రైభ్యుడు. వారిరువూరూ, సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి, నదీస్నానం చేసి, నిర్మల చిత్తంతో పరబ్రహ్మధ్యానం చేసుకుంటూ, ఆడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవాడు. అలా ఉండగా వారిలో భరద్వాజునికి యవక్రీతుడనే కుమారుడు కలిగాడు.

రైభ్యునికి అర్వావసువు, పరావసువు అని యిద్దరు కుమారులు పుట్టారు. వారు పెరిగి పెద్దవారయ్యారు.

భరద్వాజుడు ఎప్పుడూ ధ్యానసమాధిలో ఉండి కుమారుని విద్యా విషయాలు పట్టించుకోలేదు.

రైభ్యుడు తన కుమారులిద్దరినీ విద్యాంసులుగా తీర్చి దిద్దుకున్నాడు.

వారుభయులూ వివిధప్రాంతాలలో పర్యటించి తమ విద్యతో అందరి ప్రశంసలూ పొందుతున్నారు.

ఇది చూసిన యవక్రీతునికి విచారం కలిగి, వారి వలె తాను కూడా విద్యావంతుడై విశేష ఖ్యాతి సంపాదించాలనుకున్నాడు. అదే ఉహతో తపస్సు ప్రారంభించాడు. యవక్రీతుని తీవ్రనిష్ఠను గ్రహించి దేవేంద్రుడు వచ్చి "స్వామీ! విద్య అనేది గురుముఖతః అధ్యయనం చెయ్యక తప్పదు. అప్పుడు కాని వేద వేదాంగ విజ్ఞానంతో మనస్సు పరిపక్వం కాదు. ఈ ప్రయత్నం మాని ఉత్తమ గురువును ఆశ్రయించు" అన్నాడు.

ఆ మాట యవక్రీతునికి నచ్చలేదు. తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఉచిత రీతిని వీనికి ఉపదేశించాలని ఇంద్రుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి, గుప్పిలితో యిసక తీసి నదిలో పోస్తున్నాడు. యవక్రీతుడు నదీ స్నానానికి వచ్చి "ఏమిటీ పని? ఎందుకు ఇలా చేస్తున్నావు?" అని అడిగాడు.

వృద్దుడు నవ్వతూ "ఈ నదికి అడ్డంగా గోడ కడుతున్నాను" అన్నాడు.

యవక్రీతుడు నవ్వి "ఇంతటి నదికి గుప్పెడు గుప్పెడు యిసకతో గోడకట్టటం యీ జీవితంలో సాధ్యమా?" అన్నాడు.

అప్పుడావృద్దుడు - "నాయనా! గురువు శుశ్రూష లేకుండా వేదవిద్య అంతా నేర్చుకోవాలనుకోవడం కంటె, నేను చేసేది అవివేకం కాదు" అని జవాబిచ్చాడు.

యవక్రీతుడు "ఓహో సురపతీ! మీరు ఎలా అయినా సరే, నాకు వేదవిద్య అనుగ్రహించి విశేష ఖ్యాతి కలిగించాలి" అని ప్రార్ధించాడు.

ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదని, ఇంద్రుడు అనుగ్రహించాడు. యవక్రీతుడు సర్వవేద శాస్త్ర విద్యావిదుడయ్యాడు. మరుక్షణంలో తపోదీక్ష విడిచి, తండ్రి దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ వివరించాడు.

అప్పుడు భరద్వాజుడు "నాయనా! ఈ విధంగా విద్య సాధించడం వల్ల అది అహంకారం కలిగిస్తుంది. అహంకారం ఆత్మవినాశన కారణం నాయనా! ఇంత చిన్న వయస్సులో తీవ్రతపస్సు చేసి వరాలు పొందడం మరింత అహంకార హేతువవుతుంది. అయినా ఒక మాట విను. నువ్వు ఎప్పుడూ రైభ్యుని ఆశ్రమ పరిసరాలకు వెళ్ళబోకు. ఆయన కుమారులతో వైరం తెచ్చుకోకు" అన్నాడు.

యవక్రీతుడు వివిధ ప్రదేశాలు పర్యటించాడు. [విద్యావేత్తగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు.] అలా ఉండగా ఒకనాడు - అది వసంత మాసం. అరణ్యమంతా పూలవాసనలతో, ప్రకృతి అంతా పరమ రమణీయంగా, ఉల్లాసకరంగా ఉంది.

అటువంటి సమయంలో యవక్రీతుడు రైభ్యుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. ఆశ్రమంలో ఆ మహర్షి కోడలు ఒంటరిగా కనిపించింది. యవక్రీతుని మనస్సు చెదిరింది. ఇంద్రియాలు వశం తప్పిపోగా ఆ యిల్లాలిని బలాత్కరించి భోగించి వెళ్ళిపోయాడు.

ఆశ్రమానికి వచ్చిన మహాముని, ఆది విని తీవ్రక్రోధంతో, తన శిరస్సు నుండి రెండు జటలు తీసి హోమం చేసి, ఒక సుందరాంగినీ, ఒక రాక్షసునీ సృష్టించాడు. వారిద్దరూ మహర్షి ఆదేశం ప్రకారం యవక్రీతుని సమీపించారు.

ఆ సుందరీమణి తన కోర చూపుతో, చిరునవ్వుతో, లావణ్య దేహ ప్రదర్శనతో యవక్రీతుని లొంగదీసి, వాని చేతిలోని పవిత్ర జలపూర్ణమైన కమండలువు తీసుకు వెళ్ళిపోయింది.

అంతతో వాని శక్తి నశించగా, ఆ రాక్షసుడు తన శూలంతో యవక్రీతుని తరిమి పొడవబోయాడు. సరిగ్గా భరద్వాజుని ఆశ్రమద్వారం దగ్గరే, ఆ రాక్షసుడు యవక్రీతుడిని సంహరించాడు.

అది చూసి భరద్వాజుడు "నాయనా! అనాయాసంగా లభించిన విద్య ఇటువంటి అనర్ధాలే తెస్తుందని చెప్పినా విన్నావు కావు" అని గోలుగోలున విలపించి, ఆ తీవ్ర వేదనలో రైభ్యుని శపించి, తాను కూడా అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేశాడు.[భరద్వాజుడు క్రోధాన్ని, పుత్రశోకాన్ని దాటలేకపోయాడు.]

భరద్వాజ శాపగ్రస్తుడైన రైభ్యుడు, ఆయన కుమారుని చేతులలోనే మరణించాడు.

అప్పుడు అర్వావసువు సూర్యుని ఉపాసించి తన తండ్రినీ, భరద్వాజ, యవక్రీతులనూ బ్రతికించాడు.

పునరుజ్జీవితుడైన యవక్రీతుడు, తన ఎదురుగా ఉన్న దేవతలను ఉద్దేశించి "నేను కూడా ఈ రైభ్యుని వలెనే తపస్సు చేసి, వేద వేత్తనయ్యాను కదా! అయినా ఈయన నాకంటే గొప్పవాడెలా అయ్యాడు?" అనగా వారు,

"నాయనా! ఆయన గురు శుశ్రూష క్లేశాలతో వేదవిద్యను సాధించాడు. కనుక అంత శక్తిశాలి అయ్యాడు. అది లేకుండా నువ్వు సాధించావు. ఆ శక్తి నీకు రాదు. విద్య గురు ముఖతః నేర్చుకోవాలి నాయనా!" అని వారు వెళ్ళారు.

ఇది భారతంలోని కథ!

యవక్రీతుడు తపస్సుతో సాధించిన విద్య, ర్యాంక్ ఫిక్సింగులతోనో, కాపీలతోనో, లంచాలతో సీట్లు కొనో.... చదివి, సర్టిఫీకేటు సంపాదించడం వంటిదే! యవక్రీతుడి విద్యాశక్తి, అతడి మనస్సుకి గాక అతడి చేతిలోని కమండలువులో ఉంది. మనస్సు దుష్టపూరితంగా ఉంది గనుక, రైభ్యుని కోడలిని బలాత్కరించాడు. శక్తి కమండలువులో ఉంది గనుకా, అతడి మనస్సు కామపూరితం గనుకా.... రైభ్యుడు సృష్టించిన సౌందర్యవతి, తన హోయలతో యవక్రీతుణ్ణి ఆకర్షించి కమండాలన్ని హరించింది. సర్టిఫీకేటులో తప్పితే బుర్రలో సబ్జెక్టులేని వారిలా, కమండలాన్ని పోగొట్టుకుంటే యవక్రీతుడు శక్తి హీనుడయ్యాడు. పిదప రైభ్యుడు సృష్టించిన రాక్షసుడి చేతిలో మరణించాడు.

అందుచేతనే దేవతలు యవక్రీతుడికి విద్య గురుశుశ్రూషతో, కష్టపడి నేర్చుకోవాలని చెబుతారు. గురు శుశ్రూషాది క్లేశాలు అనడంలో విశేషార్ధముంది. విద్య ఇన్ స్టంట్ ఆహార పదార్ధం కాదు. ‘పాకెట్ చింపడం - తినేయడం’ వంటిది అసలే కాదు. మేధస్సుతో మధించవలసింది.

మహాభారతాన్ని వ్రాసేటప్పుడు వేదవ్యాసుణ్ణి, విష్నేశ్వరుడు "నా ఘంటం ఆగకుండా మీరు శ్లోకాలు చెప్పేటట్లయితేనే నేను వ్రాస్తాను"అన్నాడట. దానికి వేదవ్యాసుడు "అలాగే! కాకపోతే నేను చెప్పిన శ్లోకపు అర్ధ తాత్పర్యాలు అర్ధమయ్యాకనే నువ్వు వ్రాయవలసి ఉంటుంది" అన్నాడట. ఎందుకంటే విద్య, జ్ఞానం మేధస్సుతో ముడిపడినవి.

ఇక్కడ మరో ఉదాహరణ చెబుతాను.

పిల్లలు నడక నేర్చే వయస్సులో.... తప్పటడుగులు వేస్తారు. ఆ క్రమంలో క్రిందపడి మోకాళ్ళకు దెబ్బలు తాకించు కుంటారు. పై పళ్ళు గుచ్చుకుని క్రింది పెదవి చిట్లించుకుంటారు. మనం కుయ్యొ మొర్రో మంటాం. కానీ.... ఆ దశలో భూమ్యాకర్షణ గురించి పిల్లల మెదడు facts ని record చేసుకుంటుంది.

అచ్చంగా మనం, నీళ్ళున్నాయనుకొని చెంబు పైకెత్తుతాం చూడండి! తీరా అది ఖాళీదైనప్పుడు తెలుస్తుంది, మనం ఎక్కువ బలాన్ని ప్రయోగించామని! ఇది మనం ఆలోచించి చేయం. అలవోకగా చేస్తాం. మన మెదడులో.... చెంబు ఖాళీదైతే ఎంత బలాన్ని చేతలలో ప్రయోగించాలి, నిండుదైతే ఎంత బలాన్ని ప్రయోగించాలి.... అన్న సమాచారం ఎప్పుడో నిక్షిప్తమై ఉంటుంది.

అలాంటిదే తప్పటడుగులు వేసేటప్పుడు, పిల్లల మెదడులో జరిగే ప్రక్రియలు కూడా! మనం walker లు ఉపయోగించి, సహజమైన ఆ ప్రక్రియని భంగపరుస్తున్నాం. తల్లిపాలు తాగని పిల్లలకి అది జీవిత పర్యంతం చేటు తెస్తుందంటారు పెద్దలు. ఇప్పుడు శాస్త్రవేత్తలూ అది నిజమేనంటున్నారు. పప్పు బద్దలు విరిచేస్తే చిన్న చిక్కుడు మొక్క, లేత దశలోనే బలహీనపడుతుంది.

అలాగే ఈ ప్రకృతి సహజ ప్రక్రియలు కూడా! వాకర్ లాగా గురుత్వాకర్షణ గురించిన ప్రాధమిక అవగాహనని నివారించే వస్తుసాధనాలు పెద్దవాళ్ళ భౌతిక శ్రమని [పిల్లల్ని అటెండ్ చేసే శ్రమ] తగ్గించవచ్చుగాక, కానీ పిల్లలకి మాత్రం, ఆ వయస్సులో మెదడులో నిక్షిప్తం కావాల్సిన భూమ్యాకర్షణ తాలూకూ అవగాహనని శాశ్వతంగా దూరం చేస్తున్నాయి.

‘కష్టపడక పోవటం, కష్టపడ కూడదను కోవటం’ చేసే అపకారం ఇది! తప్పటడుగులతో నేర్చే నడక వంటిదే గురుముఖతః విద్య!

అటువంటి నేపధ్యంలో.... కష్టపడకుండా, పరిశ్రమించకుండా, విద్య నేర్వాలను కోవటం ఏపాటి సబబు? ఏపాటి సాధ్యం?

గురుముఖతః విద్య నేర్చుకోవటం అనే ప్రక్రియలో....

గురువు తాను ఎలా విద్య నేర్చుకున్నాడో, అదే పద్దతిలో శిష్యులకు విద్యగరుపుతాడు. తనకు వాక్యాలు, వ్యాసాలు, వ్యాకరణాలు వచ్చు కదా అని, పిల్లలకి ముందుగా అవన్నీ నేర్పడు. మొదట అక్షరమాల తోనే ప్రారంభిస్తాడు. తర్వాత గుణింతాలు, వత్తులు, పదాలు.... తానెలా నేర్చుకున్నాడో అలా! నేర్చుకునేటప్పుడు తాను పడిన ఒత్తిడులు, మనో భావనలతో సహా! కాబట్టే, విద్యార్ధులు ఎలా నేర్చుకుంటున్నారో గురువు తెలుసుకోగలడు.

ఇది మా స్వానుభవం కూడా! గూఢచర్యం గురించి తెలుసు కదా అని పీవీజీ, మాకు అక్షరమాల నేర్పకుండా వ్యాకరణం దగ్గరికి తీసుకెళ్ళలేదు. అలాగే మేమూ, తెలుసు కదా అని ప్రాధమిక అంశాలు వివరించకుండా, విశ్లేషంచకుండా.... క్లిష్టాంశాల దగ్గరికీ, కీలకాంశాల దగ్గరికీ వెళ్ళలేదు. అదీగాక మా అవగాహన సైతం నిరంతరం పెంచుకోవలసిన ప్రక్రియే! అది ఎవరికైనా, తప్పనిది కదా!

ఇది ఏ సబ్జెక్టుకైనా, ఏ విద్యకైనా వర్తిస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

http://www.countercurrents.org/hansa130510.htm

well said

అజ్ఞాత గారు: మంచి సమాచారం ఇచ్చారండి. గడిచి సంవత్సరంన్నర కాలం అయినా ఇంకా పచ్చిగా ఉన్న గాయం ముంబై ముట్టడి, పోలీస్ హీరోల హత్యలు. కసబ్ లు చేసిన హత్యలు కావవి. ప్రభుత్వ సాక్షిగా అధికారులు, పాక్ ముష్కరులతో కుమ్మక్కై చేసిన హత్యలవి. నిరూపణలతో సహా చక్కగా వివరించబడింది మీరిచ్చిన లింకులో! చాలా చాలా కృతజ్ఞతలు.

మనోహర్ : చాలా రోజుల తర్వాత ఎడాపెడా వ్యాఖ్యలిచ్చావు. ఒకేసారి చదివేసావా? :) నెనర్లు!

after so many days got net in room, and started reading blogs at a go.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu