ఎవరూ చూడకపోతే ఏం చేసినా ఫర్వాలేదా? ఈ విషయమై ముందుగా ఒక పాత కథని చదవండి.

అనగా అనగా....

ఒకానొక అడవిలో ఒక మునీశ్వరుడుండేవాడు. వేదవిద్యని అభ్యసించడానికి, ఆయన దగ్గర కొందరు శిష్యులుండేవారు. ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ, శిష్యులు గురువు దగ్గర విద్యనభ్యసిస్తుండేవాళ్ళు.

అలాంటి శిష్యులలో ఓ పదిమందిని పిలిచి, గురువు "నాయనలారా! మీ విద్యాభ్యాసం పూర్తికావచ్చింది. మీకు చివరి పాఠం చెప్పి పంపిస్తాను. ముందుగా ఈ అరటి పండు తినండి" అంటూ తలా ఒక పండు ఇచ్చాడు.

అంతలోనే మళ్ళీ "నాయనలారా! ఈ అరటి పండుని మీరు, ఎవరూ లేని చోటికి వెళ్ళి, ఎవరూ చూడకుండా తినేసి రండి" అన్నాడు. శిష్యులంతా తమకిచ్చిన పండు తీసుకొని, ఆశ్రమం చుట్టూ ఉన్న అడవిలోకి తలో దిక్కుకూ వెళ్ళారు. ఎవరికి తోచిన చోట వాళ్ళు, పొదలమాటుకూ, చెట్టుమానుల చాటుకూ పోయి అరటి పండు తిన్నారు.

తిరిగి గురువు దగ్గరికి వచ్చారు. "ఏమర్రా! అరటి పండు తిన్నారా?" అన్నాడు గురువు.

"తిన్నాం గురువు గారూ" అన్నారు శిష్యులు.

"ఎవరూ లేని చోట, ఎవరూ చూడకుండా తిన్నారు కదా?" అడిగాడు గురువు.

"అలాగే తిన్నాం గురువు గారూ!" అన్నారు శిష్యులు.

అయితే ఒక్క శిష్యుడు మాత్రం తలవొంచుకుని, అరటి పండు తెచ్చి గురువు గారి ముందు పెట్టాడు.

"ఏం నాయనా? పండు తినలేదా?" అని అడిగాడు గురువు. శిష్యుడు లేదన్నట్లు తల అడ్డంగా అడించాడు.

"ఎందుకని?" చిరునవ్వు నవ్వుతూ అడిగాడు గురువు.

"స్వామీ! నన్ను మన్నించండి! ఎక్కడికి వెళ్ళినా ఆ చోటులో ఎవరూ లేక పోవచ్చు గానీ, దేవుడున్నాడనిపించింది. ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనిపించింది. అందుకే అరటి పండు తిరిగి తెచ్చేసాను" నెమ్మదిగా చెప్పాడు శిష్యుడు.

గురువు సంతోషంతో ఆ శిష్యుడి వెన్నునిమిరాడు. మార్ధవంగా నవ్వుతూ "అవును నాయనా!? దేవుడు లేని చోటు లేదు. దేవుడు చూడని కార్యం లేదు. ‘ఎవరు చూసినా చూడకపోయినా, దేవుడు చూస్తాడు’ అన్న స్పృహ కలిగి ఉండాలి. ఇదే మీకు నేను చెప్పదలుచుకున్న పాఠం. ఈ ఎఱుక ఎప్పుడూ కలిగి ఉండండి" అని శిష్యుల్ని దీవించి పంపించాడు.

ఇదీ... పాత కథ!

ఇక కొత్త కథ చదవండి.

అనగా అనగా....

ధరణి కోట ఓ మోస్తరు గ్రామం. ఒకనాడా ఊరికి ఒక వంటరివాడు బ్రతుకు దెరువుకై వచ్చాడు. వాడి పేరు ఇంద్రయ్య. వాడికి ఊరి చివర ఒక పాడు బడిన పెంకుటిల్లు కనబడింది. విచారిస్తే అది పెదకాపుదని తెలిసింది. నేరుగా పెదకాపు దగ్గరికి వెళ్ళి "అయ్యా! నా పేరు ఇంద్రయ్య! పని పాటు చేసి పొట్ట పోసుకుందామని ఈ ఊరు వచ్చాను. ఊరి చివర నున్న మీ పెంకుటిల్లు నాకు బాడుగకు ఇస్తే అందులో ఉంటాను" అన్నాడు.

పెద్దకాపు వాణ్ణి ఎగాదిగా చూసి "ఆ పెంకుటింట్లో దెయ్యాలున్నాయని అందులో ఎవరూ దిగటం లేదు. నువ్వు కొత్తవాడివి కాబట్టి వచ్చావు. నీకేం భయం లేకపోతే అందులో ఉండవచ్చు. నాకు బాడుగ కూడా ఇవ్వక్కర్లేదు" అన్నాడు.

"పెళ్ళాం బిడ్డలు లేని ఒంటరి గాణ్ణి. నాకేం భయం?" అంటూ ఇంద్రయ్య, పెద్దకాపుకి కృతజ్ఞతలు తెలిపి పెంకుటింటికి చేరాడు.

నాలుగు గదుల ఇల్లు. చుట్టూ ఖాళీ స్థలం. విశాలమైన పెరట్లో పేద్ద చింత చెట్టుంది.

"విశాలమైన గదులు. ఇల్లు లక్షణంగా ఉంది. ముందు ఒక గది శుభ్రం చేసుకుని ఉంటాను. మెల్లిగా ఇల్లంతా శుభ్రం చేయవచ్చు" అనుకుని, ఇంద్రయ్య చీపురుతో ఓ గది బూజులు దులిపి శుభ్రం చేసుకున్నాడు. పొయ్యీ గియ్యీ ఏర్పాటు చేసుకుని వండుకు తిన్నాడు. నులక మంచం తెచ్చుకుని పెరట్లో వేసుకు పడుకున్నాడు. ’నిజంగా ఈ ఇంట్లో దెయ్యాలుండి ఉంటాయా?’ అని ఆలోచిస్తూ, అలాగే నిద్రలోకి జారిపోయాడు.

హఠాత్తుగా అర్ధరాత్రి మెలకువ వచ్చింది ఇంద్రయ్యకి. ‘ఎందుకు మెలకువ వచ్చిందా?’ అని చుట్టూ చూస్తే.... ఎదురుగా గుడ్లురుముతూ నిలబడి ఉందొక దెయ్యం. ఒక్క క్షణం భయం వేసినా, దెయ్యం తనని చూడగానే సతాయించకుండా, నెమ్మదిగా నిద్ర లేపినందుకు కొంత కుదుట పడ్డాడు, మరికొంత ధైర్యం తెచ్చుకున్నాడు.

"ఏమిటి విషయం? నన్నెందుకు నిద్రలేపావు?" అన్నాడు.

"ఇది నా ఇల్లు! ఈ చింత చెట్టు మీద ఏ చప్పుళ్ళు విన్పించకుండా, హాయిగా నిశ్శబ్ధాన్ని ఆనందిస్తూ ఇన్నాళ్ళూ గడిపాను. ఇప్పుడు నువ్వొచ్చావు. వెంటనే ఈ ఇల్లొదిలి ఫో" అంది దెయ్యం హుంకరిస్తూ!

ఇంద్రయ్య రాజీ కోరుతున్న గొంతుతో "చూడూ! నేనా ఒంటరిగాణ్ణి. పగలంతా ఏదో పనీపాటు చేసుకోవటానికి ఊళ్ళోకి పోతాను. సాయంత్రానికి వస్తే నీకు కొంచెం కాలక్షేపంగా ఉంటాను. ఊళ్ళో విశేషాలు నీకు చెప్తాను. నీ నిశ్శబ్ధానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు కదా?" అన్నాడు.

ఆ ప్రతిపాదన దెయ్యానికీ నచ్చింది. "సరే! ఇంతకీ నీ పేరేమిటి?" అంది దెయ్యం. "ఇంద్రయ్య" అన్నాడు.

కొన్ని రోజుల గడిచాయి. రోజూ సాయంత్రానికి దెయ్యం చెట్టుదిగి వచ్చేది. ఇంద్రయ్య వంట చేసుకుంటూ, స్నానపానాలు కానిచ్చి తింటూ, పడుకునే దాకా దెయ్యానికి కబుర్లు చెప్పేవాడు. ఊళ్ళో విశేషాలన్నీ వింటూ దెయ్యానికీ రోజులు సుఖంగా గడిచి పోతున్నట్లనిపించింది. రాను రాను దెయ్యానికి, ఇంద్రయ్య మీద ఇష్టం పెరిగి పోసాగింది.

ఓ రోజు దెయ్యం "ఇంద్రయ్యా! ఇంకా ఎన్నాళ్ళు ఈ కూలీనాలీ పనులు చేసుకుంటూ కష్టాలు పడతావు? నేను నీకొక మంత్రపు గుళిక ఇస్తాను. అది బుగ్గన పెట్టుకుంటే నువ్వు ఎవరికీ కనబడవు. అంతే కాదు, నువ్వు చేతుల్లోకి తీసుకున్న వస్తువులు కూడా ఎవరికీ కనబడవు. కాకపోతే అది నీ నోట్లో ఉన్నంత సేపూ నువ్వు ఏమీ తినలేవు, తాగ లేవు, నిద్రపోలేవు. చివరికి మలమూత్ర విసర్జన కూడా చేయలేవు. అది నోట్లో ఉండగా... ఎవరితోనైనా మాట్లాడితే, మనిషి కనబడకుండా మాట వినబడితే నీకే ప్రమాదం. కాబట్టి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా పని కానిచ్చుకో. అయితే ఇంటికొచ్చాక నాకు జరిగిన విశేషాలన్నీ చెప్పాలి. ఇది షరతు. ఇదిగో ఈ గుళిక బుగ్గన పెట్టుకుని నీ క్కావల్సిన వస్తువులు తెచ్చుకుని హాయిగా ఉండు" అంటూ ఓ గుళిక నిచ్చింది.

ఇంద్రయ్యకిది మొదట నమ్మశక్యం కాలేదు. గుళిక బుగ్గన పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. ఎవరూ తనని పలకరించలేదు. పని చెప్పలేదు. తను ఎదురుగా ఉన్నా పట్టించుకోలేదు. తను ఎవరికీ కనబడటం లేదన్నది ఇంద్రయ్యకి నిర్ధారణ అయిపోయింది.

‘గుళికని ఎలా ఉపయోగించుకోవాలా?’ అని ఆలోచించాడు. మొదట్లో సుబ్బిశెట్టి దుకాణం నుండి పప్పూ బియ్యం వంటి దినుసులన్నీ తెచ్చేసుకుని, ఇంటికి వచ్చి, గుళికని నోట్లో నుంచి తీసేసి వొండుకు తిన్నాడు. ‘కానీ ఏ పని చెయ్యకుండా, రోజూ తిని పడుకుంటే కొన్నాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి అనుమానాలు రావచ్చు. ఆరాలు తీయవచ్చు. ఎలాగా?’ అనుకున్నాడు. బాగా ఆలోచించాడు.

"నేను నగలు, ఇతర విలువైన వస్తువులు దొంగిలించినా దండగ. అమ్మి సొమ్ము చేసుకునేటప్పుడు పట్టుబడవచ్చు. దొంగిలించిన నగలు ఎలాగూ వేసుకు తిరగలేను. అందుచేత, డబ్బు దొంగిలించడమే సౌకర్యంగా ఉంటుంది. అదీగాక ప్రతీసారీ ఇదే ఊళ్ళో డబ్బు దోచేస్తే, ఎంత అదృశ్యంగా చేసినా, కొన్నాళ్ళకి ఊళ్ళో గగ్గోలు అవుతుంది. అందుచేత చుట్టు ప్రక్కల గ్రామాలకీ, పొరుగున ఉన్న పట్టణాలకీ, నగరాలకీ వెళ్ళడం మేలు. తడవకో చోటుకు వెళ్తే సరి!" అనుకున్నాడు.

మొదట అదృశ్యంగా వెళ్ళి, ఊళ్ళో ధనవంతులు డబ్బు దాచుకునే ఇనప్పెట్టెల దగ్గర వేచి ఉండి, వాళ్ళు డబ్బు తీసుకునేటప్పుడు తానూ దండుకునే వాడు. అలా.... సుబ్బిశెట్టి, పెద్దకాపు.... అందరిళ్ళల్లో.... అయిన కాడికి చేతివాటం చూపించాడు. కంటికి కనబడక పోవటం చేత, డబ్బు పోగొట్టుకున్న ఆసాములందరూ.... తామే పొరపాటు పడ్డామని కొందరనుకున్నారు. ఎలా దొంగతనం జరిగిందో అర్దంకాక కొందరు బుర్రబద్దలు కొట్టుకున్నారు.

ఇంద్రయ్య మాత్రం, ఊళ్ళో కనబడ్డ వాళ్ళందరికీ ‘తనకు జబ్బు చేసిందనీ, అందుచేత మునపట్లా రోజూ పనికి వెళ్ళలేక పోతున్నాననీ, పట్టణానికెళ్ళి వారానికి నాలుగు రోజులు వైద్యం చేయించుకుంటున్నానని’ చెప్పసాగాడు. అందరికీ ఇంద్రయ్య, వారంలో రెండు రోజులు పనికి వెళ్ళటం, నాలుగు రోజులు కనబడక పోవటం మామూలు విషయమై పోయింది.

ఇంద్రయ్య యధాప్రకారం.... చుట్టు ప్రక్కలున్న అన్ని ఊళ్ళలో ధనికుల ఇళ్ళల్లో, దుకాణాలలో డబ్బెత్తుకు రాసాగాడు. ఈ విధంగా మూటల కొద్దీ డబ్బు తస్కరించి పెంకుటింటికి తరలించాడు.

పెద్దమొత్తంలో డబ్బు కూడాక ‘తనకు దూరపు బంధువు ఒకాయన చావుబతుకులలో ఉన్నాడని అతని దగ్గరికి వెళ్తున్నానని’ ఊర్లోవాళ్ళందరికి చెప్పి కనపించకుండా పోయాడు. తరువాత కొన్ని రోజుల తరువాత వచ్చి ‘దూరపు బంధువు చనిపోతూ, వారసులు లేనందున తన ఆస్తినంతా తనకు దఖలు పరిచాడనీ, తాను అదంతా అమ్ముకొని తెచ్చుకున్నానని’ ఊళ్ళో వాళ్ళకి చెబుతూ, ధరణి కోటలో తానున్న పెంకుటింటిని, పెద్ద కాపు నుండి, అడిగిన ధర యిచ్చి కొనేసుకున్నాడు. ఇంకా పొలమూ, పళ్ళతోటలూ కొన్నాడు.

అదృష్టం కలిసొచ్చి, హఠాత్తుగా ధనవంతుడై పోయిన ఇంద్రయ్యని, ఊళ్ళో వాళ్ళంతా బాగా గౌరవించసాగారు. ఇంద్రయ్య మాత్రం గుళిక బుగ్గన పెట్టుకుని, ప్రక్కనున్న పట్టణాల్లో డబ్బు దొంగిలించడం కొనసాగిస్తూనే ఉన్నాడు. తడవకో ఊరు వెళ్ళటం, అదృశ్యంగా ధనం దొంగిలించుకు రావడం! మరోసారి మరో ఊరు. మధ్యమధ్యలో... పట్టణాల్లో పూటకూళ్ళ ఇళ్ళల్లో, పర్యాటక స్థలాల్లో విహారాలు చేస్తూ ఆనందించసాగాడు. "అహా! ఇంద్రభోగం అంటే ఇదేనేమో! పేరుకు పేరు. డబ్బుకు డబ్బు. తాను చేస్తోంది ఎవరికీ కన్పించటం లేదు. ధనికుడిగా అందరూ గౌరవిస్తున్నారు. దెయ్యం ఎంత మంచిదో!" అనుకున్నాడు.

ప్రతీ సారీ తానేమేమీ చేసిందీ దెయ్యానికి చెప్పేవాడు. అది ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయాడు. చివరికి ‘ఎవరూ తనని చూడటం లేదు కదా’ అని ఇతరుల స్నానాల గదుల్లోకి, పడక గదుల్లోకి తొంగి చూడటం మొదలుపెట్టాడు. క్రమంగా విచ్చలవిడిగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. గుళిక బుగ్గనున్నంత వరకూ తానెవరికీ కనబడడు. ఇంతకంటే భద్రత ఏముంది?

నలుగురు కలిసి మాట్లాడుకునే చోట, అదృశ్యంగా చేరి, ఒకరి వీపు మీద మరొకరు బాదినట్లు భ్రమలు కల్పించి తగవులు పెట్టటం, ఇరుగుపొరుగు వారికి గొడవలు రేపటం గట్రా మనోవికారాలతో చెలరేగి పోయాడు. బురదకు కంపు తోడైనట్లు.... దెయ్యానికి ఇంద్రయ్య, ఇంద్రయ్యకు దెయ్యమూ తోడయ్యారు.

ఇలా ఉండగా....

ఓ రోజు ఇంద్రయ్య, ధరణి కోటకు నాలుగు క్రోసుల దూరాన ఉన్న పట్టణానికి పోయాడు. గుళిక బుగ్గనుండటంతో ఎవరికీ కనబడడయ్యె. పట్టు వస్త్రాల దుకాణానికి వెళ్ళి, యజమాని గల్లా పెట్టె తెరిచినపుడు అందులో తానూ చెయ్యి పెట్టాడు. గుప్పెటి నిండా బంగారు నాణాలు తీసుకున్నాడు.

హుషారుగా బయటకు వచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత యధాలాపనలో గుళికను మ్రింగేసాడు. రాత్రి అయ్యాక తక్కుతూ తారుతూ ఇల్లు చేరాడు. అప్పటికే దెయ్యం ఇంద్రయ్య కోసం ఎదురు చూస్తోంది. ఇంద్రయ్య వాలకం చూసి "ఏమయ్యింది?" అంది ఆదుర్దాగా!

ఆయాసంతో, ఆందోళనతో ఇంద్రయ్య "పొరబాటున గుళికని మింగేసాను. దాంతో అందరికీ కనబడి పోతున్నాను" అన్నాడు.

దెయ్యం "కొంప మునిగింది" అని కీచుగా అరిచింది.

అసలే భయంతో వణుకుతున్న ఇంద్రయ్య, మరింతగా కొయ్యబారి పోతూ "ఏమిటి? ఏమయ్యింది?" అన్నాడు.

"గుళిక బుగ్గన ఉన్నంత సేపే నువ్వు అదృశ్యంగా ఉంటావు. అది కడుపులోకి పోతే నువ్వు అందరికీ కనబడిపోతావు" అంది దెయ్యం.

ఇంద్రయ్య ఏడుపు గొంతుతో "గుళిక మింగినప్పటి నుండీ కడుపులో చిత్రమైన బాధగా ఉంది. నిల్చోలేను. కూర్చోలేను. పిచ్చెక్కినట్లుగా ఉంది" అన్నాడు.

దెయ్యం చల్లగా "అంతేనా! ఇక నుండి తినలేవు, తాగలేవు. నిద్రపోలేవు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేవు" అంది.

ప్రక్కనే మహా విస్పోటనం జరిగినట్లు ఉలిక్కిపడ్డాడు ఇంద్రయ్య. "గుళిక మింగితే ఇంత ప్రమాదం ఉంటుందని నువ్వు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు?" అన్నాడు కోపంగా!

"నువ్వు అడగలేదు" అంది దెయ్యం నిర్లక్ష్యంగా!

"నీ దుంప తెగా! నువ్వు నిజంగా దెయ్యానివి" ఏడుపూ కోపమూ పెరిగిపోగా ఒక్కసారిగా దెయ్యాన్ని తిట్టేసాడు.

"ఎంత పొగర్రా నీకు? నన్నే తిడతావా?" అంది దెయ్యం గుడ్లురుముతూ!

దెబ్బకి ఇంద్రయ్యకి వాస్తవం ఇంకింది.

"దెయ్యం, దెయ్యం! నీకు దండం పెడతాను. గుళిక మింగినప్పటి నుండీ కడుపులో చిత్రమైన బాధ! భరించలేకుండా ఉన్నాను. ఈ అపాయం నుండి తప్పించవా!" అని వేడుకున్నాడు.

దెయ్యం కూడా విచారంగా తలపంకిస్తూ "ఇంద్రయ్యా! గుళిక నీ కడుపులో ఉన్నంత సేపూ ఈ నరక బాధ తప్పదు. దీనికొక్కటే పరిష్కారం ఉంది. గుళిక బుగ్గన ఉంచుకుని అదృశ్యమైనప్పుడు.... నువ్వు ఏయే పనులు చేసావో, ఎవరెవరికి కీడు చేసావో.... అదంతా, అందరికీ వినబడేటట్లు బహిరంగంగా చెప్పెయ్యాలి. అలా అన్నిటినీ బయటకు కక్కితేనే గుళిక నీ కడుపులో కరిగి జీర్లమైపోతుంది. అప్పడీ బాధంతా పోతుంది" అంది.

"ఏమిటీ? ఎవరూ చూడకుండా ఏమేం చేసానో, బహిరంగంగా అందరికీ చెప్పాలా? అంతకంటే చావటం మేలు" అన్నాడు ఇంద్రయ్య హఠం పోతూ!

"గుళిక నీ కడుపులో ఉన్నంత వరకూ, నీకు చావు కూడా రాదు" చావు కబురు చల్లగా చెప్పింది దెయ్యం!

కెవ్వుమన్నాడు ఇంద్రయ్య! ఎవరూ చూడలేరన్న ఒళ్ళుపొగరుతో తాను చాలానే చేసాడు. డబ్బు దోచుకోవటమే కాదు, తగాదాలు పెట్టటం దగ్గర నుండీ ఇంకా నీచమైన పనులు చేసాడు. ఇప్పుడవన్నీ అందరికీ చెబితే.... ఇప్పటి వరకూ ఊళ్ళో పెద్దమనిషిగా, ధనవంతుడిగా ఉన్న పరువూ మర్యాదా మంట గలిసి పోతాయి. అంతే కాదు, తన చేత భంగపడ్డ వారు, హింస పడ్డవారు, దోచుకోబడ్డ వారు, ఇప్పుడు ఊరుకుంటారా?

"ఏం చేయటం? ఏం దారి?" అంటూ దెయ్యం వైపు చూశాడు. ఏదీ దెయ్యం? ఎప్పుడో పోయింది. దెయ్యం భయం దెయ్యానిది! ఇంద్రయ్య ఇదంతా చెప్పాక, జనం తనని మాత్రం ఊరుకుంటారా? ఏ మంత్రాలో వేసి, సీసాలో బంధించి, భూస్థాపితం చేసి మరీ నాశనం చేస్తారు!" స్వీయ రక్షణలో పడ్డ దెయ్యం ఇంద్రయ్యని వాడి చావుకి వాడిని వదిలేసింది.

ఇంద్రయ్యకి ఏం చెయ్యాలో పాలు పోలేదు. ఎవరికీ కనబడనప్పుడు ఎంత తుళ్ళింతలు పడ్డాడో ఇప్పుడంతగా కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. కడుపులో నిలవనీయని బాధ!

‘ఎవరికీ కనబడనప్పుడు ఏం చేసినా ఫర్వాలేదు అనుకున్నాను. ఎవరు చూసినా చూడకపోయినా, దేవుడు చూస్తాడు అనుకోలేదు. దీన్నే పాపం పండటం అంటారేమో’ అన్న విషయం బాగానే ఇంకింది ఇంద్రయ్యకి!

చేసిన వన్నీ వెళ్ళగక్కితే జనమేం చేస్తారో నన్నది అందుబట్టని మరో బాధ అయ్యింది. కడుపులోనూ బాధే, బయటా బాధే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

What a great story! Amma! Meeku abhinadhanalu.

కథ బాగుంది, మీరే రాసారా? ఎక్కడన్నా చదివారా ఎవరైనా చెప్పారా?

నకిలీ కణిక వ్యవస్థలోని వారి వారి స్వర్ణముఖిలను అనుభవిస్తున్న ఇప్పటి నకిలీ కణికుల పరిస్థితి ఇదేగా ఇప్పుడు.

అజ్ఞాత గారు:మా కథ మీకు నచ్చినందుకు నెనర్లు!

కన్న గారు : పాత కథ సేకరించినది. కొత్త కథ స్వంతంగా వ్రాసిందే!

నరసింహ [వేదుల బాలకృష్ణమూర్తి]గారు : Good Catch! :))

బ్రహ్మాండంగా ఉంది

కొత్త పాళీ గారు : నెనర్లండి!

బాగా రాసారండి .

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu