భారతీయుల మీద విద్యారంగం ద్వారా కుట్రకు సమాంతరంగా.... గ్రంధాలయాలు, ప్రజలలో పిల్లలలో పఠనాసక్తి, శిధిలం చేయబడ్డాయి. లైబ్రేరియన్ నియామకాలు మూలపడ్డాయి. గ్రంధాలయాలకు నిధులు రద్దయ్యాయి. క్రమంగా గ్రంధాలయాలు అంతరించాయి. క్రికెట్టూ, టీవీలతో [ముఖ్యంగా ప్రైవేటు ఛానెళ్ళు వచ్చాక], జనాల్లో మిగిలి ఉన్న పఠనాసక్తి కూడా అడుగంటి పోయింది. ఇప్పుడు నిర్వహించబడుతున్న గ్రంధాలయాలలో కేవలం జి.కే.పుస్తకాలు, ఉద్యోగపోటీలలో విజయ సోపానాలు, టిప్స్ తో నిండిన వ్యక్తిత్వ నిర్మాణ పుస్తకాలు మాత్రమే ఉన్నాయి.

దశాబ్దాల తరబడి [తీవ్రదశలో] అమలు చేయబడిన ఈ కుట్రలో, ఆయా కాలాల్లో ఆయా స్థాయిలలో తదనుగుణమైన వ్యూహాలు[స్ట్రాటజీలు] అమలు చేయబడ్డాయి. ఉన్నతాధికారులలోనూ, రాజకీయ నాయకులలోనూ, డబ్బు కెరీర్ కు లొంగే అవినీతి పరులని, వాటితోనే సంతృప్తి పరచి లోబరుచుకున్నారు. ‘దూరదృష్టితో చూస్తే ఇలాంటి విద్యావిధానాలు, పాఠ్యాంశాలు, గ్రంధాలయ నిర్మూలనలు సమాజానికి నష్టదాయకం’ అని అడ్డుకునే ప్రయత్నం చేసిన నిజాయితీపరులనీ, నిబద్దత గల వారినీ, విధుల్నుండి తప్పించడం, వేధించటం చేశారు. గురిపెట్టుకుని విసిగించారు.

ప్రభుత్వంలో కీలక స్థాయిల్లో ఉన్న అలాంటి వారిని విసిగించటం, వేధించటం సాధ్యం గాకపోతే.... ఇక అప్పుడు నల్లమేక - నలుగురు దొంగలు కథలోని దొంగల్లా, పదే పదే అదే చెప్పి కన్విన్స్ చేసారు. ఫలానా సమస్యకి ఇది తప్ప మరో పరిష్కార మార్గం లేదంటూ, పదే పదే, మేధావులంటూ మీడియా ప్రచారించిన వాళ్ళూ, కమీటిల నిపుణులుగా ప్రభుత్వం నియమించిన వాళ్ళూ చెవినిల్లు కట్టుకు పోరితే.... వినగా వినగా ‘అంతేనేమో’ అన్పించటమే ఇక్కడ విన్యాసం!

ఈ విధంగా, సామదాన దండోపాయాలే కాదు, ప్రభావపరచటం, ఏమార్చటం, భ్రమపరచటం, నమ్మించటం గట్రా మానసిక తంత్రాలు కూడా ప్రయోగింపబడ్డాయి. కాబట్టే ఒక్క విద్యారంగమే కాదు, రాను రాను అన్ని రంగాలూ అధ్వాన్నంగా, అవినీతి ఊబిగా ఉత్పన్నం చెందాయి. ఇందుకోసం, భారతంలో ధృతరాష్ట్రునికి, కణుకుడు చెప్పిన కూటనీతిని అమలు చేశారు. కణిక నీతిని వివరించే కథనీ, కూటనీతినీ మరో సారి ఇక్కడ చదువుకోవచ్చు.


చేదుగా ఉన్నా, నిజమే చెప్పాల్సి వస్తే..... ఈ రోజు సమాజంలో, తల్లిదండ్రులలో అత్యధికులు, పిల్లల పెంపకం విషయంలో విఫలమయ్యారు, అవుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో మరిచిపోయారు, లేదా వాళ్ళకిది అసలు తెలియదు. మొన్నటి తరం పెద్దల్ని గురించి ఈ మాట నేను ఆనటం లేదు. ఈ తరం తల్లిదండ్రుల్ని , నిన్నటి తరం తల్లిదండ్రుల్లో కొందరిని చూసి, ఈ మాట చెబుతున్నాను.

అలాంటి చాలామంది తల్ల్లిదండ్రులకి పిల్లల్ని ఏవిధంగా క్రమశిక్షణా యుతుల్ని చేయాలో తెలియదు. పిల్లల్లో కుతూహలాన్ని, ఆసక్తిని, తార్కికతనీ, ఆలోచనా శక్తిని ఎలా పెంపొందించాలో తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా పిల్లల్ని అతిగా ముద్దు చెయ్యటమే! వాళ్ళ దృష్టిలో పిల్లలు కోరిందల్లా ఇవ్వటంతో తమ బాధ్యత తీరినట్లే! పిల్లలు అడిగినంత డబ్బివ్వటం, కోరిన వస్తువులు కొనివ్వటం... ఇవే పిల్లల పట్ల తమ కర్తవ్వం అనుకునే తల్లిదండ్రుల్ని నేను చాలా మందిని చూశాను.

నిజానికి ఈ రకపు ’గారాం’తో పిల్లల్లో ఎంత అహం పెరుగుతుందో ఆ తల్లిదండ్రులకు అవగాహన లేదు. పేద ధనిక తారతమ్యం లేకుండా అన్ని వర్గాల తల్లిదండ్రుల్లోనూ, వారి వారి ఆర్ధిక స్థాయిలకు తగినంతగా, ఈ ‘గారాబపు అహంకారం’ అనే ప్రక్రియ నడుస్తోంది.

ఇక ఇలాంటి స్థితిలో.... ‘పిల్లల్ని దండిస్తే చట్ట పరంగా పిల్లలు పెద్దల మీద కేసులు పెట్టవచ్చు’ అంటే పరిస్థితి ఏమిటి? అసలుకే ఓప్రక్క, తల్లిదండ్రులకి తమ పిల్లల్ని గట్టిగా కోప్పడాలంటేనే భయం. నొచ్చుకుంటారనో, ఏడ్చి ఇల్లు పీకి పంది రేస్తారనో భయం. ఇక టీవీలు, నేరాలూ - ఘోరాలు, లేనిపొని కొత్త ఆలోచనలని పిల్లలకి రేకెత్తిస్తున్నాయయ్యె! గట్టిగా తిట్టినా, రెండు దెబ్బలు కొట్టినా.... ఇంట్లోంచి పారిపోవడమో, ఆత్మహత్య చేస్కోటమో చిన్నపిల్లల విషయంలోనూ వింటున్నాం, చూస్తున్నాం.

అలాంటప్పుడు భయం లేకుండా ఎలా ఉంటుంది? అదే పరిస్థితి పాఠశాలలదీ, అక్కడి ఉపాధ్యాయులదీ కూడా! చదవలేదనో, క్రమశిక్షణా రాహిత్యమనో పిల్లల మీద కాస్త తీవ్రచర్యలు తీసుకుంటే... దానికి ఆ పిల్లలు కాస్తా అతిగా స్పందిస్తే[ఇల్లు విడిచి పారిపోవటం, ఎలుకల మందు మింగటం గట్రా] ఆపైన కేసులు, పోలీసు స్టేషన్లూ, కోర్టులూ, తిప్పలూ! ‘ఎందికొచ్చిన గొడవ?’ అని ఉపాధ్యాయులూ అనుకుంటున్నారు, స్కూళ్ళదీ అదే పరిస్థితి!


"సార్! మా వాడు బాగుపడితే చాలు! రెండు పీకినా ఏమీ అనుకోం?" అనే తల్లిదండ్రులు సైతం, తీరా బిడ్డ వంటి మీద దెబ్బలు చూడగానే ఆవేశంతో ఊగిపోవటమూ సహజమే! పిల్లల ప్రవర్తనకి విసిగిన ఉపాధ్యాయుల ఆగ్రహం హద్దులు దాటటమూ సర్వసాధారణమే! ఎందుకంటే పెద్దలలోనే భావోద్రేకాలని నియంత్రించుకునే శక్తి సన్నగిల్లిన చోట, పిల్లల్లో అదెక్కడి నుండి వస్తుంది? వెరసి అంతటా అదే మానసిక అస్థిరత [imbalance] ఉంది. ఫలితమే ఘర్షణ!

ఇలాంటి స్థితిలో, మండే జ్వాలలో మరింత పెట్రోలు పోయటానికి.... చట్టాలూ, మానవహక్కులూ కూడా తోడయ్యాయి. ఇక్కడ మరో విన్యాసం ఏమిటంటే - ప్రస్తుత విద్యావిధానంలో, పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్ధుల తల్లిదండ్రులూ కూడా, విద్యార్ధులకు సంబంధించిన అన్ని వ్యవహారాలకు ఉపాధ్యాయులనే బాధ్యుల్ని చెయ్యటం! అంతేగాక అసలు పిల్లల విద్యాభివృద్దిని కేవలం మార్కులతో మాత్రమే కొలవటం అన్నది సర్వత్రా జరుగుతోంది. పిల్లల ఎదుగుదల అంటే మార్కులూ ర్యాంకులే!

ఆటల పోటీలలోనూ ఇతరత్రా ప్రతిభాపాటవాల విషయంలోనూ కూడా బహుమతుల లెక్కలే! ఎన్ని కప్పులూ, ఎన్ని పతకాలూ! ఇదే జాతర! ‘ఎంతగా పిల్లల్లో నైపుణ్యాలు పెరిగాయి?’ అన్నది ఎవరికీ పట్టనిదై పోయింది. క్రమంగా కార్పోరేట్ విద్యాసంస్థల దగ్గరి నుండి సాధారణ విద్యాసంస్థల దాకా, ఎవరి స్థాయిని బట్టి వారు నాసా గుర్తింపులూ, గణిత ఒలెంపియాడ్ లూ, ఫలానా ఫలానా పోటీల్లో నారాయణ హవా, శ్రీచైతన్య పెను హవా! అంటూ వ్యాపార ప్రకటనల స్థాయికి ఎదిగిపోయింది[?].

ఈ మొత్తం వ్యవహారంలో.... పిల్లలు, పాఠశాలలకు పైసలూ, ఇమేజ్ తెచ్చిపెట్టే మోడళ్ళు గానూ, తల్లిదండ్రులకి పరపతి మోజులని తీర్చే వనరులు గానూ మిగిలిపోయారు. ఎందుకు నేర్చుకుంటున్నారో, ఏం నేర్చుకుంటున్నారో వారికేం తెలీదు. చదువులు కాని ఇతరత్రా పోటీలలోనూ, యాజమాన్యాల లాబీయింగ్ లని బట్టే బహుమతి పంపకాలైన చోట, విద్యార్ధులు అందులో సమిధలే తప్ప, సదరు పోటీలు పిల్లల్లో మానసిక వికాసాన్ని తెస్తోందేమీ లేదూ, మానసిక వత్తిడులని తప్ప!

తల్లిదండ్రులకి కూడా, పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ, మానసిక వికాసాం, వ్యక్తిత్వ నిర్మాణాం ఏవిధంగా ఉందో పట్టించుకునే తీరిక లేదు. ఆయా లక్షణాలు పిల్లల్లో పెంపొందించాలనే అవగాహన కూడా చాలా తక్కువమంది తల్లిదండ్రుల్లో ఉంది. మార్కులూ, ర్యాంకులే కొలబద్దలై పోయాయి. జి.కే. బట్టీ వేస్తే తెలివైన వాళ్ళయిపోతారనేంత గుడ్డినమ్మకం ఉన్న తల్లిదండ్రుల్ని కూడా చూశాను. "రామాయణ భారతాలని గురించి ఇంట్లో అమ్మదగ్గర చెప్పించుకు రామ్మా!" అంటే.... "టీచర్! మా మమ్మీ ఆవేవీ అవసరం లేదులే అంది" అని చెప్పిన పిల్లల్ని చూశాను.

కొందరు తల్లిదండ్రులకి - ‘పిల్లల్లో వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే, చదువుతో పాటు వ్యవహార జ్ఞానం కూడా కలిగించబడాలి. కథలు, పుస్తక పఠనంతో పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం కలిగించవచ్చు’ అని తెలిసినా, అందుకోసం తమ సమయాన్ని పిల్లలకి కేటాయించగల స్థితిలో లేరు. ఎవరి బిజీ వారిది. ఎవరి పని ఒత్తిడి వారిది. మొత్తంగా జీవితాలే ఉరుకులూ పరుగులతో, సూర్యాగమనాన్ని మించిన వేగంలో మునిగి పోయినప్పుడు ఎవరేం చెయ్యగలరు? ఎందుకంటే అందరూ ఒక్కటై పరిష్కరించుకోవలసిందే గానీ, ఒక్కరుగా పరిష్కరించుకోలేని సమస్య ఇది!

ఇంకా కొందరు తల్లిదండ్రుల అభిప్రాయంలో, పాఠశాలకు ఫీజులు కట్టటంలో తమ బాధ్యత తీరిపోయినట్లే! ఫీజులూ, పుస్తకాలు, యూనిఫాంలూ, బూట్లూ, సూట్లూ.... అన్ని ఖర్చులూ పెట్టి ‘పిల్లల్ని బళ్ళో పెట్టేస్తే’ సరి! ఇక కొందరు తల్లులకైతే ప్రతీ రోజూ, తామూ పిల్లల్తో కుస్తీ పట్టి, వాళ్ళ చేత హోం వర్కు చేయిస్తే, ఆ రోజుటికి తమ పని గడిచినట్లే! ఒక యజ్ఞం పూర్తయినట్లు ఓ నిట్టూర్పు కూడా విడుస్తారు. నిజానికి మొరాయించే పిల్లల చేత హోం వర్కు చేయించటం చాలా కష్టమైన పనే! మొరాయించని పిల్లలకి కూడా ‘బొచ్చెడంత హోం వర్క్’ ఉంటే అది నడ్డి విరిగేంత పని! ‘పిల్లలకి పరీక్షలు మాకు అగ్నిపరీక్షలు’ అనే తల్లిదండ్రులని బోలెడు మందిని గమనించాకే ఇవి చెబుతున్నాను.

ఇక ఈ తల నొప్పంతా భరించలేక, ఉదయం నుండీ బడిలో ఉండి వచ్చిన పిల్లల్ని, ట్యూషన్ కి తరిమేసే తల్లిదండ్రులు మరి కొందరు. దాంతో తల్లిదండ్రుల కర్తవ్య నిర్వహణ, బాధ్యతా పూర్తయినట్లే!

వెరసి పిల్లల అందమైన బాల్యం, ఆనందంగా గడవాల్సిన బాల్యం.... జ్ఞానపు తోటలో, చదువు‘కునే’ బడిలో కాదు, చదువు ‘కొనే’ జైలులో తెల్లారి పోతోంది! ఒక చిట్టి పిచుకనో, చిన్ని చిలుకనో గమనించే తీరిక లేదు.

శ్రీశ్రీ కాంక్షించినట్లు.... ‘మంచుకురిస్తే, వాన వెలిస్తే, ఆకాసాన హరివిల్లు విరిస్తే, అది మా కోసమే’ అనుకునే బాల్యం పిల్లలకి అందుబాటులో లేదు. ‘సముద్రపు అలల మీది తేలి వచ్చే నురగలలో ఆడుకుంటూ పిల్లలు పాడుకుంటున్నారు. కాగితపు పడవలు వదలి వాటి వయ్యారాలు చూసి సంబరంగా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు. వాళ్ళకి చేపలు పట్టటం రాదు!’ అంటూ రవీంద్రుడు పాడిన బాల్యం, ఇప్పుడు పిల్లల దగ్గర లేదు. అలారం.... స్కూలు బస్సు హరన్... లంచ్ బెల్... లాంగ్ బెల్... బస్సు హారన్.. డేట్ మారింది. అంతే! సెలవులొస్తే అప్పుడే ఊపిరి పీల్చుకోవాలి. మరి వీక్ టెస్టో?

చిదిమితే పాలు గారే పసిపాపలకి, రేపటి భవిష్యత్తు కోసం అంటూ, ఇంత ఒత్తిడి ఈ రోజు.... అవసరమా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

GOOD POST.....THANK YOU

ilaanti bhaavaala valle nenu inka degree poorthi cheyyalekapothunna....idhi enthaina andharu oppukovalsina nijam.......maa bandhuvulalo chaalaa mandhi vaalla pillalni chadhivinchedhi kevalm dabbu(money) kosame .....

maa intlo ilaantivi maatlaadithe neekendhukuraa ani thitti......sakkaga sadhuvuko ani chepthunnaru.......
poni friends ki chepthe jeevithamlo sthirapaddaaka edhaina aalochinchu ani antunnaru.....
asalu nenemi cheyyagalano anedhi kooda marchipoyettu vunanu.....

AMMA ODI గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

అవునమ్మా నిజం ్ చెప్పారు

తమిళన్ గారు, దుర్గేశ్వర గారు : నెనర్లండి.

అజ్ఞాత గారు : మీకు జవాబుగా చిన్న టపా వ్రాస్తాను.

హారం గారు: మేము ఎప్పటి నుండో హారం ప్రచారం చేస్తూనే ఉన్నాం.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu