ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధుల్ని అలరించాలని ఇది వ్రాస్తున్నాను ఈ కథ మహా భారతం, ఆది పర్వంలోనిది.

కౌరవ పాండవుల విద్యా ప్రదర్శన ముగిసింది. ప్రజల్లో పాండవుల పట్ల ఆదరణా, ఆరాధనా పెరిగిపోతున్నాయి. అనివార్యమై ధర్మరాజుకి యువరాజుని చేశాడు ధృతరాష్ట్రుడు. సద్గుణ సంపన్నుడూ, దయార్ధ్ర హృదయుడూ, ధెర్యస్ధెర్య సమన్వితుడూ అయిన ధర్మరాజు తన ప్రవర్తనతో ప్రజల మనస్సులను గెలుచుకున్నాడు. అర్జునుడు సోదరులతో జైత్రయాత్ర చేసివచ్చాడు. నానాటికి పాండవుల కీర్తి పెరిగిపోయింది.

ఇది ధృతరాష్ట్రుని హృదయాన్ని కలచివేసింది. ధృతరాష్ట్రునికి ముగ్గురు మంత్రులు.

అందులో ప్రధాని విదురుడు. ఈయన విద్వాంసుడు, ధర్మపరుడు, నీతికోవిదుడు. నిష్కర్షగా రాజు లోటుపాట్లని నిస్సంకోచంగా ముఖమ్మీదే చెప్పగల ధైర్యశాలి.

రెండవ వాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు. వినయశీలి.

మూడవ వాడు కణికుడు. ఈయన కూటనీతి కుశలుడు. అంటే మోసంతో, కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు.

అలాంటి కణికుడిని ధృతరాష్ట్రుడు ఏకాంతానికి రప్పించి తన బాధ, కాంక్ష తెలియజేశాడు.

ఆ నీతివేత్త “మహారాజా! శతృనాశనానికి ముందు వారి ఉత్సాహ, ఐశ్వర్య, మంత్రాంగాలనే మూడు మార్గాలను నాశనం చేయాలి. అమాత్య[అంటే మంత్రులు, కార్యదర్శులన్న మాట], దుర్గ[అంటే పట్టణాలు, నగరాలన్న మాట], కోశ[అంటే ధనపునిల్వలు], సేన[పాలనా యంత్రాంగం, సైన్యాలు], రాష్ట్రాలు[రాజ్యంలోని అంతర్భాగాలన్న మాట] ఈ ఐదు వర్గాలనూ నాశనం చేయాలి.

సామ దాన భేద దండ ఉద్భంధన విషప్రయోగ అగ్ని ప్రసరణ మార్గాలలో శత్రువుల్ని నాశనం చేయాలి. శతృబలాన్ని మొదలంటూ నాశనం చేసి, తర్వాత వారి ఆశ్రయు వర్గాన్ని [అంటే అనుచరవర్గం అన్నమాట] నాశనం చేయాలి.

శతృవులని విభజించి గెలవాలి.

మహారాజా! వారిలో పిరికి పందల్ని భయపెట్టాలి. లోభికి ధనమిచ్చి లోబరుచుకోవాలి. బలహీనుడయితే పరాక్రమంతో స్వాధీనం చేసుకోవాలి. సమబలునితో స్నేహం చేయాలి. విషం తినిపించి గానీ, మోసగించి గాని శతృవుని క్రమంగా కడతేర్చాలి.

ఇది నీతి శాస్త్రం చెప్పే విషయం!

శతృవుని సాధించ దలిచినప్పడు [అంటే హెరాజ్ చెయ్యాలనుకొన్నప్పడు] క్రోధం పనికిరాదు. చిరునవ్వుతో చరిస్తూ వాడికి విశ్వాసం కలిగించి పాములా కాటు వేయాలి. ఎటువంటి ఘాతకం తలపెట్టినా ఆ విషయం పైకి తెలియకుండా, చిరునవ్వుతో, మృదుభాషణ తో ఓరిమి వహించి అదునెరిగి నెరవేర్చుకోవాలి.

ఆశలు రేకెత్తించాలి కాని అవి నెరవేర్చకూడదు. అలాగని ఆ భావం ఎదుటి వారికి తెలియనివ్వకుండా వాయిదాలు వేస్తుండాలి. ఇనుముతో చేసిన కత్తిని తోలు కవచంతో భద్రపరచి, అవసరానికి తీసి కేశ ఖండనానికి వినియోగించి నట్లుండాలి. మన మంత్రాంగం, మనం ఏ పనిచేసినా అది మనకి మరిన్ని ఆపదలు తెచ్చిపెట్టకూడదు.

ఒక కథ చెబుతాను వినండి మహారాజా!

అనగా అనగా ...

ఓ మహారణ్యం.

ఆ అడవిలో ఎన్నో కౄరమృగాలు యధేచ్చగా విహరిస్తూన్నాయి. అక్కడి ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది, కుటిల బుద్ది కలది. తన పనులన్నీ ఇతరులు చేత చేయించుకొని, పని పూర్తి కాగానే వారిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది.

ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు.

పులి, తోడేలు, ముంగిస, ఎలుక.

ఈ నక్క వీటితో కలిసి మెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది.

ఆరోజులలో ఒకనాడు --

పిక్కబలిసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ పోయే లేడి దాని కంటపడింది. ఆలేడి ఈ మిత్రబృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. దాన్ని తినాలని నక్కకు కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టడం సాధ్యం కావడం లేదు.

బాగా ఆలోచించింది నక్క.

మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని,

"స్నేహితులారా! ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం అరగించవచ్చు” అని నాలుక చప్పరించి, అది ఎంత రుచిగా ఉంటుందో చూపించింది.

అన్నిటికీ నోరూరించి.

"ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం” అన్నాయి అవి ఆతురతతో అటే చూస్తూ.

అది కొంత సేపు ఆలోచన అభినయించింది.

"ఆ! ఇప్పడు ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి.ఈ లేడి మెలకువగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పడు చప్పడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలక బావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదనులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే!” అంది.

దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి.

అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతులేస్తూ, పచ్చికమేసి, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళు జాపి నిద్రపోతున్నది లేడి.

నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలకవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది.

నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.

అప్పడా నక్క:

"న్నేహితులారా! ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందుచేత ఆకొండ లోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు” అంది.

అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి.

అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని.

నక్క బొటబొటా కన్నీరు కారుస్తూంటే చూసిన పులి,

"బావా! ఎందుకు విచారిస్తున్నావు?" అంది.

"ఏం చెప్పను పులిబావా! ఆ ఎలక లేదూ! అది ఏమన్నదో తెలుసా! ’పులి ఎంత పెద్ద జంతువైతే ఏంలాభం? నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తూంది సిగ్గులేకుండా,’ అని వేళాకోళం చేస్తే
నాకు బాధ కలిగింది” అంటూ నక్క కన్నీరు విడిచింది.

పులికి పౌరుషం వచ్చింది.

"మిత్రమా! ఎలక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను” అంటూ వెళ్లిపోయింది.

అంతలో ఎలక రాగా, నక్క

"విన్నావా, ఎలక బావా! ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎలకనూ తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది” అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.

మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. “విన్నావా! పులి బావకు నీ మీద కోపం వచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట”, అనడంతో తోడేలు దౌడు తీసింది.

అప్పడు ముంగిస రాగా, “చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గుర్నీ చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను” అనగా అది తోక ముడిచి పారిపోయింది.

హాయిగా ఆ లేడి మాంసం ఆరగించింది నక్క.

విన్నారా! మహారాజా! తెలివితో, వంచనతో మనకార్యలు చక్క బెట్టుకోవాలి” అన్నాడు కణికుడు.

ఇదే కణిక నీతి.

ఈ కథలో నక్క బలమైన పులి మీద ‘పౌరుషాన్ని రెచ్చగొట్టటం’ అన్న తంత్రం ప్రయోగించింది. మిగిలిన వాటి నుండి విడగొట్టింది. తోడేలుకి పులినీ, ఎలుకకి ముంగిసనీ చూపెట్టి, విభేధాలు పుట్టించి తరిమేసింది. ఇక ఒంటరిదైన, తనకంటే బలహీనమైన ముంగిసని బాహాబాహిగా సవాలు చేసి భయపెట్టింది. ఈ విధంగా సామ దాన భేద దండోపాయాల్లాంటివి ప్రయోగించి నాలుగు జంతువుల్ని విడగొట్టి ఓడించింది.

ఇదే కణిక నీతి.

ఈ కణిక నీతిని చాలా గొప్పగా, హఠాత్తుగా బ్రిటిషు వాళ్ళు కనిపెట్టారంటూ ఈస్ట్ ఇండియా కంపెని వారి సైన్యాధికారి జనరల్ డూప్లే కనిపెట్టిన ’విభజించి - పాలించు’ అన్న స్ట్రాటజీ అంటూ ఎంతగా అదరగొట్టారు![నిజానికి డూప్లే ఫ్రెంచ్ జనరల్. ప్రచారంతో ఆ విషయం మరుగున పడిపోయింది.]

వేల సంవత్సరాల క్రితపు భారతంలోని కణికుడూ, కణిక నీతి ముందా లేక క్రీ.శ. 1450ల తర్వాత భారతదేశానికి టీ, ఇంకా మసాలా దినుసులు వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిషు వాళ్ళు, వాళ్ళ జనరల్ డూప్లే ముందా? ఎవరు ఎవరి స్ట్రాటజీని అనుసరించి ఉండాలి?

నిజంగా బ్రిటీషు వాళ్ళే, భారతంలోని కణిక నీతి తెలియకుండానే, స్వతంత్రంగా వాళ్ళ బుర్రలతో ఆలోచించే ‘విభజించు - పాలించు’ మనే తంత్రన్ని కనిపెడితే, దాన్ని ఆచరణలో పెట్టి ముందుగా యూరప్ లోనే తమ ఆధిపత్యాన్ని స్పెయిన్ మీదా, హాలెండ్ మీదా, ఫ్రాన్స్ మీదా చూపించి ఉండేవాళ్ళు కదా?

క్రీ.శ. 1498 లో తొలిసారి భారత్ కు సముద్ర మార్గం కనిపెట్టే వరకూ యూరప్ లో ఇంగ్లాండు, స్పెయిన్, ఫ్రాన్స్, హాలెండ్, పోర్చుగీసులు వ్వాపారపోటీ పడ్డారన్నది చారిత్రక సత్యం. ఇండియాకి సముద్ర మార్గం కనుగొన్న పోర్చుగీసు నావికుడు వాస్కోడ గామాకు స్పాన్సరర్ స్పెయిన్ రాజు. ఇతర ప్రాంతాలకు సముద్ర మార్గలు కనుక్కోవడానికి బయలుదేరే వాళ్ళకు డబ్బు సమకూరుస్తూ పై ఐదు దేశాలు రాజులు వాళ్ళకు ’సాహసికులు’ అన్న పాజిటివ్ కాప్షన్ పెడితే, ఆనాటి ఆయాదేశాల సామాన్య ప్రజలు ‘సముద్రపు దొంగలు, దోచుకోవడానికి క్రొత్త చోట్లు కనిపెట్టడానికి బయలుదేరారని’ ఉన్న నిజం అనేవారట. కాబట్టి తర్వాత సామ్రాజ్య వాదంతో అసలా దేశప్రజలందరికీ దోపిడిని అలవాటు చేసి అందరి ఆమోదముద్రని పొందారు ఆయా దేశాల రాజులు లేదా రాణులు.

ఎందుకంటే దోచుకోవడానికి ఇతరప్రాంతాలు లేనప్పడు తమ దేశీయుల్నే దోచుకొని మరీ తమ సుఖాలు సమకూర్చుకొన్నారు. దోచుకోవడానికి వలస రాజ్యాలు దొరకగానే, తమ దేశప్రజలకు కూడా ఆ వెసులుబాటు కలిగించి తమ దోపిడీకి ఆమోదం సంపాదించారు. తమను కాపాడేందుకు, తమ చుట్టు ఎంత ఎక్కువ మంది మద్దతుదారులుంటే అంత రక్షణ కదా!

సరే! చివరకు భారతదేశం చేరారు. వ్యాపారంలో వారి తొలి లక్ష్యం అదే. ఎందుకంటే తమ చలి ప్రాంతాల్లో, తమకి అత్యంత అవసరమూ, తమ దేశంలో అత్యంత గిరాకీ ఉన్న మిరియాలూ, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు దొరికేది భారతదేశంలోని కొంకణ తీరంలోనే. అందుకే కాన్ స్టాంట్ నోపిల్ నుండి భూమార్గం తమకు మూతబడగానే సముద్ర మార్గాన్ని కనుక్కొన్నారు.

తీరా ఇండియా చేరాక కూడా ఈ దేశాల వ్యాపార కంపెనీలు వారిలో వారు తెగకొట్టుకున్నారు. మొదట్లో వాళ్ళకి భారతదేశంలో సామ్రాజ్య స్ధాపన చేయాలన్న ఆలోచన లేదు. ఇక్కడి రాజుల దగ్గర వంగి వంగి దణ్ణాలు పెట్టి అనుమతులు పొందడంలోనూ, వ్యాపార స్దావరాలు ఏర్పాటులోనూ, వ్యాపారాభివృద్దిలోనూ పోటి పడటం మీదే ఉండేది వారి దృష్టి. [ఇప్పటికీ బ్రిటిషు వారికి రాజభక్తీ, దాస్యబుద్దీ ఎక్కువని చెప్పాడానికి బ్రిటన్ రాచరికమే పెద్ద ఉదాహరణ]

ఈ పోటి, రమారమి కొన్ని శతాబ్ధాలు నడిచింది. అప్పడెప్పడూ బ్రిటిషు వారి మేధస్సు విభిజించి - పాలించమన్న కణిక నీతిని ఆచరించ లేక పోయింది పాపం!

క్రీ.శ. 1768 లో నిజాం రాజ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాగా వేశాక గానీ ఈ పట్టు బ్రిటిషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి, తమ తోటి యూరోపియన్ వ్యాపార కంపెనీల మీదగానీ, భారతదేశపు చిన్న చిన్న రాజ్యాలు మీదగానీ రాలేదు. అప్పడే ఈ కణిక నీతి [విభజించు - పాలించు అన్న తంత్రం]వీరికి స్ఫూరించింది. నిజాముల నుండి ఉత్తర సర్కారుని, 1800 సంవత్సరములో రాయల సీమని దత్తత పుచ్చుకొనేదాకా వారి పట్టు ఈ భూభాగం మీద పెరిగింది. ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీస్, స్పెయిన్, గట్రా దేశాల కంపెనీలు అణగతొక్కపడ్డాయి. క్రీ.శ.1498 నుండి 1768 లదాకా [దాదాపు 270 ఏళ్ళు] రాని గ్రిప్ [పట్టు] 1800 లనుండి 1857 లోపల భారతదేశం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి ఈస్ట్ ఇండియా కంపెనీ తెచ్చుకోగలిగింది.

కేవలం కణిక నీతి అంటే విభజించు -పాలించు అనే తంత్రంతోనే ఇదంతా సాధించింది.

ఇది చరిత్ర చెప్పే సత్యం.

జరిగిపోయిన నిజం.

ఇప్పడు ఎవరు కావాలన్నా మార్చలేని నిజం.

నిజాముల చరిత్ర నుండి ప్రారంభమైన నిజం!

270 ఏళ్ళ పాటు బుర్రబద్దలు కొట్టుకున్న సాధించలేని పట్టు బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ 57 సంవత్సరాలలో సాధించగలిగింది?

ఖచ్చితంగా అది వారి మేధస్సు కాదు. వారి మేధస్సు అయితే మొదటగా యూరప్ లోనే అది పొంది ఉండే వాళ్ళు. ఇండియా గడ్డమీద అడుగుపెట్టి నప్పడే ఆధిపత్యం సంపాదించి ఉండే వాళ్ళు.

కాబట్టే నిశ్చయంగా చెప్పవచ్చు కణిక నీతిని అమలు చేయగలమేధోసంపత్తి బ్రిటిషువారిది కాదని. ఇదొక్కటే నిదర్శనం కాదు అలా చెప్పటానికి. ఈ నాడు ప్రపంచదేశాలన్నిటి మీదా, [భారతదేశంతో సహా] అమలు చేయబడుతున్న కణిక నీతి నుండి అంతిమ లబ్ద పొందుతున్నది ఇంగ్లాండు కాకపోవడం కూడా మరో నిదర్శనం.

ఈ అంశాన్ని ఇంకా సోదాహరణంగా, సహేతుకంగా, దృష్టాంతపూరితంగా నిరూపించడానికి మరికొన్ని టపాలు అవసరం. తార్కికంగా ఆలోచించడానికి కావలసిన అధారాన్ని ఈ టపాలో వివరించాను.

మరలాంటప్పడు ఇప్పడు ప్రపంచదేశాలన్నిటి మీదా, ముఖ్యంగా భారతదేశం మీదా, సరిగ్గా చెప్పాలంటే మొత్తం మానవజాతి మీదా, మానవత్వం మీదా అమలుచేయబడుతున్న కణిక నీతి వెనుక ఎవరున్నారు? ఎవరు అంతిమ లబ్ధి పొందుతున్నారు?

ఈ విషయంలో మరో ముఖ్యమైన కోణాన్ని ఇక్కడ పరిశీలించాలి.

మనదేశంలో సురభి కుటుంబాలు కొన్ని వంశ పారంపర్యంగా, తరాల తరబడి నాటక కళని అనుశృతంగా తమ భావి తరాలకు అందిస్తూ వస్తూన్నాయి. అలాగే కొన్ని ఆయుర్వేదవైద్య కుటుంబాలూ, ప్రకృతి వైద్యఙ్ఞానం గల కుటుంబాలూ, సంగీతఙ్ఞులూ, కవి గాయక పండిత కుటుంబాలు తరతరాలుగా తమ కళనీ, ఙ్ఞానాన్ని, నైపుణ్యాలని తమ భావి తరాలకు సంక్రమింపజేస్తూ వాటిని సజీవంగా చైతన్యంగా ఉంచుతున్నాయి.

అంతెందుకూ?

సాక్షాత్తు మన వేద వాఙ్మయమే కొన్ని వేల సంవత్సరాల పాటు తరం నుండి తరానికి మౌఖికంగానే బదలాయింపబడ్డాయి. అందుకే వాటిని అపౌరుషేయాలనీ పిలుస్తారు. చాలాకాలం తర్వాత గాని ఆ ఙ్ఞాన సంపద గ్రంధస్ధం కాలేదు.

ఈ కోణంలో తార్కికంగా ఆలోచిస్తే బ్రిటిషు వారికి జనరల్ డూప్లే పేరిట చెప్పబడిన [మన కణిక నీతి] విభజించు - పాలించు అన్న స్ట్రాటజీ విజయం వెనుకా గూఢచార ఙ్ఞానం కలిగిన వంశమో, లేక కొన్ని కుటుంబాలో ఉండే అవకాశం లేదా? [అదే కణిక నీతి ఈనాడు విభజించి - ప్రచారించు అన్న స్ట్రాటజీ తో ప్రపంచాన్ని శాసిస్తోంది] వాస్తవానికి మన భారత, రామాయణాలు నిగూఢ గూఢచర్యాన్ని కధాత్మకంగా, కళాత్మకంగా వివరించాయి. ఒక్క కణిక నీతి లోనే కాదు, నారద మహాముని ధర్మరాజుకి చేసిన రాజ్యపాలనా మార్గనిర్ధేశంలోనూ, ధృతరాష్ట్రుణ్ణి విదురుడు మందలిస్తూ చెప్పిన విదురనీతి లోనూ ఎంతో గూఢచార ఙ్ఞానం ఉంది. ఇక చాణక్య మంత్రి, తిమ్మరుసు మంత్రి లాంటి వారి మేధో సంపత్తి గురించీ, వారి గూఢచర్య ఙ్ఞానం గురించి మనకు చరిత్ర పాఠాలుగా చెబుతుంది.

అటువంటప్పడు ఏ సురభి కుటుంబాల్లాగో, ఆయుర్వేదవైద్యపు వంశాల్లాగో తరతరాలుగా, తరం నుండి తరానికి సంక్రమిస్తూ, ఆచరింపబడుతూ కొన్ని కుటుంబాలు గూఢచర్య ఙ్ఞానాన్ని, నైపుణ్యాన్ని కలిగి ఉండకూడదా?

గూఢచర్యమంటేనే ‘నిగూఢమైనది, పైకి వ్యక్తం కానిది’ అని అర్ధం.

అలాంటప్పడు అది ఏరోజైనా కాలం మూడి బయటికొచ్చినప్పడు కదా తెలుస్తుంది?

సునామీ వచ్చాక కదా మనందరికీ తెలిసింది సముద్రగర్భంలో భూకంపం సంభవించిందనీ, అదే ఈసునామీ ని సృష్టించిందనీ.

మళ్ళీ చరిత్రలోకి వద్దాం.

క్రీ.శ. 1498 లో యూరపు నుండి ఇంగ్లాండు, డచ్చి గట్రా దేశాల వ్యాపార సంస్ధలు[నిజం చెప్పాలంటే దోపిడి దొంగలు] భారతదేశానికి వచ్చేనాటికే వారిదగ్గర తుపాకి మందు అన్న టెక్నాలిజీ ఉంది. అప్పటికి మనవారింకా కత్తీ, డాలు, విల్లుంబులూ, ఈటెల దగ్గరే ఉన్నారు. అయినా గాని ఆ అప్రాచ్యులు[అంటే పశ్చిమ దేశాల వాళ్ళన్న మాట. దాన్నే మన పెద్దలు తిట్టుగా వాడారు] ఇండియా మీద పట్టు సాధించ లేకపోయారు. ఈ స్ధితి దాదాపు 270 సంవత్సరాల పైగానే సాగింది. క్రీ.శ. 1800 తర్వాత చాలా వేగంగా దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతం దాకా యావద్దేశం వారి ఏలుబడి లోకి వచ్చింది. ఖచ్చితంగా చెప్పాలంటే దక్కను ప్రాంతంలోని నిజాము ఏలుబడిలోని హైదరా బాదు సంస్ధానం దగ్గర నుండీ ఈ పట్టు మొదలైంది.

అంటే దాదాపు ఈ సమయంలోనే, ఈ ప్రాంతం నుండే బ్రిటిషు వారి టెక్నాలజీ [తుపాకి మందు, తుపాకిల్లాంటి ఆయుధాలు]కి భారతదేశంలోని గూఢచర్యమేధస్సు లేదా కణిక నీతి చెప్పగల మేధస్సు తోడైంది.

అప్పటి నుండే బ్రిటిషు వారి జైత్రయాత్ర ప్రారంభమైంది.

అది ఇండియాతో ఆగలేదు.

రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని తామే గర్వంగా ప్రకటించుకోగలిగినంత సువిశాల బ్రిటిషు సామ్రాజ్యం భూగోళమంతా విస్తరించింది.

ఇక్కడో సునిశిత అంశాన్ని పరిశీలించండి.

క్రీ.శ. 1857 లో తొలి భారత స్వాతంత్ర సమరం జరిగింది. ఝాన్సీలక్ష్మీ బాయి, తాంతియా తోపే, నానా సాహెబ్ లాంటి వీరుల్ని ఈ సందర్భంలో మనం స్మరించుకొంటాం. అంతకంటే లోతుగా ఆలోచించం. నిజానికి 1800 లసంవత్సరంలో నిజాం ప్రభుత్వం నుండి రాయల సీమ జిల్లాల దత్తత పొందిన బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తర్వాత ఏదో ఓ కారణం బనాయించి ప్రతి చిన్నరాజ్యాన్ని, పాలె గాళ్ళని కణిక నీతి ప్రయోగించి కబళించింది.

కేవలం 57 సంవత్సరాల్లో ఈ బ్రిటిషు కంపెనీలు బలీయమైనాయి. అంతకు ముందు వ్యాపారం కోసం, పట్టుకోసం తోటి యూరోపియన్ కంపెనీలతో పోటీ పడటం లోనే వాళ్ళ బ్రతుకు 270 ఏళ్ళుపాటు తెల్లారింది.

అప్పడు సరిగ్గా జరిగిందది.

అదే 1857 సైనిక తిరుగుబాటు.

అదే బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీని ఇంటికి పంపించి, బ్రిటిషు విక్టోరియా రాణిని ఇండియాకి రప్పించింది.

ఇది యుద్ధంతో సాధించ బడలేదు.

గూఢచార తంత్రంతో అంటే కణిక నీతితో సాధించబడింది.

సైనిక విప్లవానికి ముఖ్యకారణమేమిటి?

సైనికులకు ఇవ్వబడిన కొత్త రకం తూటాలను[కాట్ రిడ్జ్ లను] నోటితో తెరవవలసి ఉంటుంది. వాటికి ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపి పూత పూయబడినదని ఒక పుకారు సైనికుల్లో ప్రచారమయ్యింది.

సైనికుల్లోనికి హిందువులకు ఆవు పవిత్రజంతువు. ఆకొవ్వు నోట తాకరు.

సైనికుల్లోని ముస్లింలకు పంది అసహ్యజంతువు. ఆకొవ్వును వాళ్ళు నోటతాకరు.

ఫలితం - సైనికుల్లో అసంతృప్తి.

ఇది సైనిక తిరుగుబాటుకూ, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ నిష్ర్కమణకూ, బ్రిటిషు రాణి పాలన ఇండియాలో ప్రారంభం కావడానికి వెనకున్న ముఖ్యకారణాల్లో ఒకటి.

దీని వెనుక టెక్నాలజీ ఉందా? కణికుడిలాంటి కుటిల నీతి మేధస్సు ఉందా?

ఈ మేధో వంశమో, కుటుంబమో ఏదైతే ఉందో దాన్ని ఇక నుంచి రచనా సౌలభ్యం కోసం, పాఠకులకు బాగా అర్దమవ్వడం కోసం నకిలీ కణికుడు అని పిలుస్తాను.

ఇక నకిలీ కణికుని మేధస్సు బ్రిటిషు బకింగ్ హోం ప్యాలస్ ని అంటే రాచ కుటుంబాన్ని ప్రపంచ హీరో చేసింది.

కొన్ని దశబ్దాల తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషు రాచ కుటుంబం స్దానం లోకి అమెరికా, రష్యా లోచ్చాయి. అమెరికా నిఘా సంస్ధ సి.ఐ.ఏ., రష్యా నిఘా సంస్ధ కె.జి.బి., వాటి పోటా పోటీ గూఢచార సామర్ధ్యాల గురించి మనం ఎన్నో నవలల్ని ఉత్సుకతతో చదివాం. [ఇర్వింగ్ వాలెస్ సెవెంత్ సీక్రెట్,ది సెకండ్ లేడీ, ది మిరాకిల్, ది ఆల్ మైటీ ల్లాంటి బొచ్చెడు నవలలు. మచ్చుకి కొన్ని చెప్పాను] ఆ ధీమ్ తో వచ్చిన ఎన్నో సినిమాలని కళ్లు విప్పార్చుకు చూశాం. ధ్రిల్ అయిపోయాం. 1920 లనుండి ప్రారంభమైన రష్యా ప్రస్ధానం, 1990 తో పతనమై, అంతటితో కె.జి.బి. ఉత్ధాన పతనాలు పూర్తయ్యాయి. ఆపైన అమెరికా సి.ఐ.ఏ. దే అగ్రస్ధానం. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా సి.ఐ.ఏ. కి తెలుస్తుందన్న విశ్లేషణని మనం పత్రికల్నిండా చదివాం. 2001, సెప్టెంబరు 11 న అమెరికా డబ్యూ.టి.సి. పైన ముస్లిం ఉగ్రవాదుల దాడి నాటిదాకా అదే పరిస్థితి.

ఇప్పడు ఆ స్ధానంలో ఉగ్రవాదం, పెట్రో డాలర్లు తెరమీదకి వచ్చాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మతోన్మాదం చౌకగా ఉగ్రవాదుల్ని తయారుచేయడానికి పనికిరావడం.

ఆవిధంగా ఇస్లాం మతం కూడా ఈ కుట్రలో ఓ సమిధగామారి దగా పడుతోంది.

ఇంగ్లాండు, తర్వాత రష్యా, అమెరికాలు ఏదేశమైనా కానివ్వండి - ఓ కామన్ స్ట్రాటజీ ఏమిటంటే, ఏదేశమైనా ప్రపంచాధిపత్యం కోల్పోయే ముందు ఆర్ధికంగా చితికిపోతుంది. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఇంగ్లాండు, 1990 లో పెరిస్త్రోయికా తర్వాత రష్యా, నేడు అదే బాటలో సబ్ ప్రైమ్ తర్వాత అమెరికా.

ఈ నేపధ్యంలో గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రిటిషు వారికి ఇండియాలో పట్టుదొరికాక అంటే క్రీ.శ.1800 లతర్వాత ప్రపంచమంతా విస్తరించడం, 1947 లో ఇండియా నుండి వైదొలిగాక క్రమంగా వారిదేశానికే పరిమితమవ్వడం. ఎంతగా వారి స్ధితి కుదింప బడిందంటే సెప్టెంబర్ 11, 2001 అమెరికాపై ఉగ్రవాదుల దాడి తర్వాత అమెరికా ప్రెసిడెంట్ జార్జివాకర్ బుష్ ఆఫ్గాన్ మీదా యుద్దం చేస్తున్నప్పుడు, ఆనాటి బ్రిటిషు ప్రధాని టోని బ్లెయిర్ తాను సాక్షాత్తు అమెరికా విదేశాంగ మంత్రేమో అన్న లెవెల్లో తెగ తిరిగేసాడనీ, ఇది పుల్లయ్యవ్వారం లాగా ఉందని పత్రికలు [ఈనాడుతో సహా] ఎడిటోరియల్సూ, సబ్ ఎడిటోరియల్సూ వ్రాయగా మనమంతా చదివాం. అంతగా కుదింపబడిందన్న మాట.

ఈ వాస్తవం మనకి చెప్పెదేంటంటే ప్రపంచం మీద పట్టు బ్రిటిషుకో, రష్యాకో, అమెరికాకో, ఈరోజు ఉగ్రవాద సంస్ధలకో లేదు. వారి దగ్గర టెక్నాలజీ ఉన్నా సరే! ఆ టెక్నాలజీ ఆయుధమైనా సరే లేక ఇంటర్ నెట్ ఙ్ఞానమైనా సరే!

దానికి కుటిలనీతి వంటి కణిక నీతి - అంటే గూఢచార నైపుణ్యం, ఙ్ఞానం ఉంటేనే ఇది సాధ్యం.

ఈ రోజు ఇంటర్నెట్, అందులో వెబ్ సైట్లూ, బ్లాగులూ లాంటి వేదిక కన్పిస్తోంది. కనుక ప్రజల ఆవేశాలు, ఆక్రోశాలూ మనకి తెలుస్తున్నాయి. 20 ఏళ్ళ క్రితం మనమంతా అనుభవించింది నాముందటి టపా ’ముంబాయి ముట్టడి - తొక్కిపడుతున్న లొసుగులు’ లో చెప్పినట్లుగా ఎన్నో సందేహలు.

ఎంతో ఆవేదన! ఎందుకిలా జరుగుతోందన్న ఆవేదన!

ఇలా జరగకూడదన్న ఆక్రోశం!

ఏం చేయాలన్న ఆలోచన!

ఏమి చెయ్యలేని నిస్సహాయత!

ఇదంతా నాలాగే మీలో చాలా మంది అనుభవించారని నేను ఖచ్చితంగా చెప్పగలను.

ఇప్పడు ఇరవై ఏళ్ళయువకుల్లో ఉన్న ఆవేశం, ఆక్రోశం ఆరోజు అంటే 20 ఏళ్ళ క్రితం నాదగ్గరా ఉండింది. ఆ ఆవేశం, ఆక్రోశం,
ఆలోచన 16 ఏళ్ళ నుండి అంటే 1992 నుండీ ప్రతీవార్తనీ, ప్రతీ అంశాన్ని లోతుగా అధ్యయనం చేయటానికి దారి తీసింది.

ఆ సత్యాన్వేషణలో నేను తెలుసుకున్నవే నేనిప్పుడు మీముందు పెడుతున్నాను.

దేనికోసం మీరిప్పడు వెదుకుతున్నారో, ఏ సమస్యల్ని చూస్తూన్నారో, ఏ పరిష్కారం కోసం తపిస్తూన్నారో, దాన్ని నేను 16 ఏళ్ళ క్రితం నుండీ వెదకీ, చూసి, తపించీ తెలుసుకున్నాను.

దాన్నే మీకిప్పుడు సహేతుకంగా,[అంటే లాజికల్ గా], సాక్ష్యాధార సహితంగా, దృష్టాంత పూరితంగా [అంటే సర్కమ్ స్టాన్షియల్ గా] మీముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను.

ఇప్పుడు నేను చెబుతున్న విషయాలన్నీ మీకు తెలిసినవే.

మీరు నాలాగే పత్రికల్లో, టీవిల్లో తెలుసుకున్నావే.

కాని దేనికి దాన్ని చూస్తే నేలమీద అక్కడొక్కటీ, ఇక్కడొక్కటీగా పడున్నా పూసల్లాంటివి.

వాటిమధ్య ఓ దారం అంతస్సూత్రంగా దాగుందని తెలిసినప్పుడు కదా మనకు అక్కడున్నది దండనీ, విడివిడిగా పడున్న పూసలు కాదనీ తెలిసేది?

దండని, విడి పూసలుగా భ్రమింపజేసేందుకే మనమీద ‘విభజించి – ప్రచారించు’ అనే కణిక నీతి ప్రయోగింపబడుతోంది. ‘నల్లమేక - నలుగురు దొంగలు’ కథలాగా ‘పదేపదే అదే ప్రచారం’ అన్న తంత్రం ప్రయోగింపబడుతోంది.

దాన్నే మీడియా మాయాజాలం అన్నా టపాల మాలికలో చర్చిస్తున్నాను. నిజానికి ఒక పెద్దకుట్రలో అది ఒక చిన్నకుట్ర.

ఈ కుట్ర దశాబ్ధాలుగా కాదు శతాబ్దాలుగా నడుస్తోంది.

వ్యక్తిగా మన జీవితంలో పది సంవత్సరాలు అంటే ఒక దశాబ్దం చాలా ఎక్కువ కాలం.

అదే ఒక దేశానికి ’దశాబ్దం’ అంటే చాలా స్వల్పం.

మన జీవితాల్లో రెండు మూడు దశాబ్దాల కాలం, ఒక దేశ చరిత్రలో రెండు మూడు శతాబ్దాల కాలంకి సరి సమానం. పరిణామాలకైనా, పర్యవసానాలకైనా.

అందుచేత, మన జీవితాల్లో మూడు దశాబ్దాలుగా జరుగుతున్న తీవ్రమైన కుట్రనీ, మన దేశమ్మీద రెండు శతాబ్దాలుగా జరుగుతున్న సుదీర్ఘ కుట్రనీ సోదాహరణంగా, దృష్టాంత పూరితంగా వివరించాలంటే మరిన్ని టపాలు అవసరం. ఈ టపాల మాలిక పూర్తయ్యేలోగా మీ సందేహాలన్నింటినీ సవివరంగా తీర్చగలనని ఆశిస్తాను.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

You wrote it very very good.
Keep it up...
Very good excellent.

This comment has been removed by the author.

చాలా విపులంగా రాసారు..అన్నీ తెలిసున్నవే అయినా మీరు చెప్పినట్లు దారంలో పూసల్ని బాగా గుచ్చారు..

mee mEdhassuku pranatulu.meevamtivaari valla tappanisarigaa lokaaniki melu chekoorutumdi.dhnyavaadamulu

చాలా బాగా రాసారు సార్. బహుసా వచ్హే టపా లో రాస్తారనుకుంటా ఈ అంతర్జాతీయ కుట్ర వెనుక అసలు లాభదాయకుల గురించి.waiting for the next one. మీకు వీలుంటే IMF, World Bank, Rothschild etc గురించి కూడా రాయగలరు.

చాలా బాగుంది. మీరు ఎత్తి చూపేదాక కొన్ని విషయాలు నిజంగానే నాకు తెలియలేదు. మీ తర్వాతి టపాల కోసం ఎదురుచూస్తుంటాను.

very good, keep writing..

వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

ఈ టపా అన్నింటి కన్నా ముందు చదవాల్సింది... నాకు ఈ రోజు దొరికింది.. చాలా మంది ఇది చదవకుండా వ్యాఖ్యలు రాస్తున్నారేమొ... నేను కూడా చాలా వ్రాశాను... మీ ఆలోచనా శక్తి అద్భుతం అండి... జరుగుతున్న విషయాలన్నింటికీ లంకె కలిపి...లెక్కలేసి చూస్తే... అసలు విషయం అర్థమవుతుందన్నమాట... నకిలీ కణికుడు అంటే మీరు పెట్టిన పెరేమో అనుకున్నా... చాలా చాలా థాంక్స్ అండీ.. మీరేమైనా కార్యక్రమాలు లాంటివి చేపడితే మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుందండి... ప్రణాళిక తో ముందుకు వెళ్తే దేశాన్ని రక్షించొచ్చు...

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu