ఈ చర్చ ఇక్కడ ఆపి, మళ్ళీ విశ్వామిత్రుణ్ణి పలకరిద్దాం. అడవిలో రామలక్ష్మణులకి ఎన్నో అస్త్రశస్త్ర విద్యల్నీ, తత్త్వ విషయాలనీ బోధించాడు. యాగ రక్షణ సమయంలో తాటకిని వధించేందుకు, ఎంత రాక్షసి అయినా స్త్రీ కదా అని రాముడు సందేహిస్తున్నప్పడు విశ్వామిత్రుడు “రామా! సందేహించకు! స్త్రీ కదా, ఎలా చంపడం అని వెనకడుగు వేయకు. ఆమె తాటకి. చెడు బుద్ది కలది. మన కర్తవ్యాచరణలోనూ, ధర్మా చరణలోనూ మన తొలి ప్రాధాన్యం [మన గురించి కంటే] ధర్మాచరణకే ఉండాలి, చివరకి అది మన కీర్తికి, మంచి పేరుకి సంబంధించిన విషయమైనా సరే! ధర్మాచరణలో మనం అన్నీ త్యజించాలి, చివరకి మన గురించి అన్యులేమను కొంటారోన్నది కూడా. మన అనుభూతులూ, కీర్తిప్రతిష్టలూ, అన్నీ ధర్మాచరణ తర్వాతే”. అప్పడు రాముడు తాటకిని వధించాడు.

ఎంత ఐడియలిస్టిక్ దృక్పధం?[భావవాదం?] ధర్మాచరణలో ’మన’ అనుకున్నవేవి మనకు అడ్డురాకూడదు. అదే ఇప్పడయితే తమ స్వార్ధం కోసం అన్ని ధర్మాల్ని వదిలేస్తున్న వ్యక్తుల్ని కొల్లలూగా, కోటానుకోట్లుగా చూస్తున్నాం. ఇంతగా అవినీతి, అధర్మం, పదార్ధవాదం పెరిగిపోయాక, విషవృక్షపు రంగనాయకమ్మలూ, సినీ కవులూ, హేతువాదులమనే వాళ్ళూ, మేధావుల మనే వాళ్ళూ, భావవాదాన్ని [అంటే ధర్మాచరణ, నీతిగా ఉండటం, నిజం పలకడం] అందులో ఉండే ఆత్మతృప్తినీ అర్ధం చేసుకోలేరు. కాబట్టి రామాయణాన్నీ అర్ధం చేసుకోలేరు. అది సహజమే. ఎందుకంటే దేన్నైనా అనుభవించి తెలుసుకోవలసిందే. శ్రీరామకృష్ణ పరమహంస [బోధామృతంలో] అన్నట్లు “నెయ్యి రంగు, రుచి, వాసనా తెలియని వాడికి ఏవిధంగా చెప్పినా దాని రంగు, రుచీ, వాసనా అర్ధం కావు. వారికై వారు నెయ్యిని చూచి, తినీ, ఆఘ్రూణించి తెలుసుకోవలసిందే”.[దీనికే వేదాల్లో, వేదాంత చర్చల్లో ’నేతినేతి’ అనే ఉదాహరణంగా పెద్దలు చెబుతారు. నేతి అంటే న+ఇతి = ఇది కాదు అని అర్ధం]

ఇక రామాయణ కథా కొనసాగింపు దగ్గరికి వస్తే - శ్రీరామలక్ష్మణులు తాటకిని, ఆమె పుత్రుల్లో ఒకడైన సుబాహుణ్ణి వధించి యాగాన్ని రక్షిస్తారు. తాటకి మరో కుమారుడు మారీచుడు వారి ధాటికి పారిపోయి ఆశ్రమ జీవితం గడుపుతాడు. సీతాపహరణంలో మాయలేడి వేషధారి ఈ మారీచుడే. విశ్వామిత్రుడు, తర్వాత రామలక్ష్మణుల్ని విదేహ రాజధాని మిధిలా నగరానికి తీసుకువెళతాడు. దారిలో వారు గౌతమి మహర్షి ఆశ్రమాన్ని చేరతారు. అక్కడ శ్రీరాముడి కాలుసోకిన రాయి, అద్భుత సౌందర్యవతియైన అహల్యగా మారుతుంది. ఈవిడ గౌతమి మహర్షి భార్య.

మనిషి రాయిగా మారడం, మరో మనిషి కాలిదుమ్ము సోకి మనిషి అవ్వడం - ఇందులోని తార్కికతనీ, వాస్తవికతనీ, మన ఆధునిక [సోకాల్డ్] సైన్సునీ కాసేపు ప్రక్కన పెట్టి అహల్య కథలోకి లోతుగా చూస్తే -

ఈవిడ అద్భుత సౌందర్యవతి. బ్రహ్మదేవుని పుత్రిక. ఆమె సౌందర్యానికి ముగ్ధుడై దేవేంద్రుడామెని వివాహమాడ కోరినా బ్రహ్మ ఆమెను గౌతమి మహర్షికిస్తాడు. దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి. అది ఒక పదవి, దేవేంద్రుడు దేవతలకి అధిపతి గానీ దేవుడు కాడు. అతడికి అరిషడ్వార్గాలన్నీ ఉంటాయి. గ్రీకుల జూపిటర్ కి లాగా. ఎవరైనా తపస్సు చేస్తే తన పదవి కోసమే అని భయపడటం దగ్గర్నుంచి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలన్నీ ఉంటాయి. వీటితోపాటు ఎంతో ఙ్ఞానం కూడా ఉంటుంది.

ఓరోజు తెల్లవారుఝామున గౌతముని ఆశ్రమం చేరి కోడికూతని అనుకరిస్తాడు దేవేంద్రుడు. తెల్లవారబోతోందను కొని గౌతముడు నదికి వెళతాడు. గౌతముడి రూపంలో అహల్య శయ్యని చేరతాడు ఇంద్రుడు. అహల్య ఇది పసికట్టినా, అంతటి దేవేంద్రుడు తనని మోహించాడు గదా అన్న గర్వం ఆవిడని అతడితో శృంగారం పంచుకొనేందుకు ప్రలోభ పరుస్తుంది. ఆ తతంగము ముగుస్తుంది. దేవేంద్రుడు సెలవు తీసికోబోతుండగా, నది నుండి వెనక్కి వచ్చిన గౌతమ మహర్షి ఆశ్రమాన్ని చేరతాడు. ఆయనకి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఆయన అహల్యని “నీవు ఇంద్రియ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని కోల్పోయావు. పతితో గాక ఇతర పురుషుడితో శృంగారాన్ని అభిలషించావు. శిలవై పడుండు. ఎప్పుడైతే, పరిపూర్ణ వ్యక్తిత్వం కలవాడూ, సకల సుగుణ సంపన్నుడూ, ధర్మనిష్ట కలిగినవాడూ అయిన రాముని పాదం నిన్ను సోకుతుందో, ఆరోజు నీవు తిరిగి మనిషివి అవుతావు. అప్పుడే నిన్ను మళ్ళీ కలుస్తాను” అని శపించి తపస్సు చేసుకోబోతాడు.

రామ పాదం సోకిన అహల్య తిరిగి మనిషి రూపం పొంది, శ్రీరాముణ్ణి ఎంతగానో పూజిస్తుంది. ఆ సమయంలో అక్కడి కొచ్చిన గౌతమ మహర్షి శ్రీరాముణ్ణి, విశ్వామిత్రుణ్ణి కొనియాడి కృతఙ్ఞతలు తెలిపీ, తన భార్య అహల్యని మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. భార్యభర్తలిద్దరూ తపస్సుకై అడవికి పోతారు. గౌతమ మహర్షి తన భార్యని మన్నించి మనస్ఫూర్తిగా గ్రహిస్తాడు. ఎందుకంటే గౌతముడు ఓ దేశానికి రాజు కాదు, రాముడిలాగా. ముందుగా ఆయనకి తన భార్య మనో నిగ్రహం కోల్పోయినప్పటికీ క్షమించగలిగే, భార్యగా అంగీకరించగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి [స్వయంగా తాను ముని కాబట్టి, తపస్సు చేయడం అంటేనే మనోనిగ్రహం కాబట్టి] మనస్సుని నిగ్రహించడం ఎంత కష్టమో తెలుసు.

అదే శ్రీరాముడయితే రావణవధానంతరం సీత దేవిని తన పతివత్ర నిరూపించుకోమన్నాడు. ఆమె అగ్నిప్రవేశం చేసింది. రాజ్య పట్టాభిషేకం తర్వాత మద్యపాన వ్యసనపరుడైన రజకుడి నిందకై సీతని అడవికి పంపాడు రాముడు. ఆమె మౌనంగా శిక్ష భరించింది తప్పు లేకుండానే. ఆయన మరో స్త్రీని పెళ్ళి చేసుకోలేదు, జీవితాన్ని సుఖించలేదు. ఎందుకంటే తాను రాజు. ప్రజలకి ఆదర్శం[రోల్ మోడల్].

గీతలో చెప్పినట్లుగా ,
“యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః
స యత్ర్పమాణం కురుతే లోక స్త దనువర్తతే”

సమాజంలో ఉత్తములనబడే వారు దేన్ని అనుసరిస్తారో జనులందరూ దాన్నే అనుసరిస్తారు. [ఇక్కడే నకిలీ కణికుడు పై స్థాయిలో నీచులు, అవినీతిపరులను,శీలరహితులను ఆ స్థానాలలోకి వచ్చేటట్లు చూసి ప్రజలందరికి కూడా ఈ రోజులలో ఇదే సరియైన విధానం అని ప్రచారిస్తున్నాడు]కనుక సాక్షాత్తు భగవానుడే[శ్రీకృష్ణుడు] గీతలో “ నేను పనిచేయవలసిన అవసరం లేదు. పని చేసి దేన్ని పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు లేనిదంటూ ఏదీ లేదు. అయినా నా విద్యుక్త కర్మ నేను నెరువేరుస్తాను. లేకపోతే జనులందరూ నన్నే అనుసరించి సోమరులవుతారు” అంటాడు. అందుకే శ్రీరాముడూ, శ్రీకృష్ణుడూ భారతీయుల దృష్టిలో దేవుళ్ళు. అంతేగాని 10 వేల చేతులో, కాళ్ళో, తలలో ఉన్నందుకు కాదు.

ఎవ్వరు సౌశీల్యవంతుడని, సకల సద్గుణ సంపన్నుడని గౌతముడు చెప్పాడో, ఎవరి కాలిదుమ్ముసోకి రాయి ఆడది అయ్యిందో, అలాంటి రాముడికి - తనలో సగం, తన అత్మ అయిన సీత పవిత్రురాలో కాదో తెలియదా? రాజ్య సుఖం వదలి తన సాన్నిహిత్యం కోసం అడవికి వచ్చిన భార్య, రావణుడి ధన, ఐశ్వర్య ప్రదర్శననీ, ప్రలోభాన్ని, ఆ రాక్షస ప్రయోగ సామ దాన భేద దండో పాయాల్ని ఎంతో ఆత్మ స్థైర్యం తో ఎదుర్కొన్న తన భార్య సీత ఔన్నత్యం రాముడికి తెలీదా? రాముడి హృదయం సీతకి తెలియదా? అయినా సరే, పాలకులుగా తమ జీవితం ప్రజలకు జవాబు దారి. అందుకూ, వాళ్ళు ధర్మాచరణలో తమ స్వంత జీవితాన్ని త్యాగం చేసి ప్రజలకి మార్గదర్శనం చూపించారు. అంతే తప్ప విషవృక్షాలు పెంచిన రంగ నాయకమ్మల వాదనల ప్రకారం అక్కడ స్త్రీని చులకన చేయటం లేదా స్త్రీని భోగ వస్తువుగా చూడటమో లేదు. [ఇదే రంగనాయకమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ, వ్వాపర ప్రకటనల్లోనూ స్త్రీ చులకన చేయబడుతున్నా, భోగవస్తువుగా వాడబడుతున్న ఏమీ స్పందించడం లేదు. ఎంత విచిత్రం?]
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

atleatst this time i got chance to write the first comment.
"the untold history" లో తాటక, మారీచుడు, వీళ్ళపై రచయిత అభిప్రాయాలు ఒక్కసారి చదవండి..
theuntoldhistory.blogspot.com
లో రామా కనవేమిరా అన్న లేబుల్ చూడండి

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu