భారతీయత మీద విద్యారంగం ద్వారా కుట్ర – 02 [కథలతో చదువు]
గతంలో, భారత దేశ సమాజంలో విద్యాసంస్థలు గురుకులాలుగా వ్యవహరించబడేవి. గతంలో అంటే ఈ గడ్డమీదికి ముస్లింలనబడే ఎడారి దొంగలు, యూరోపియన్లబడే సముద్రపు దొంగలు రాకముందన్న మాట. జనావాసాలకు దూరంగా, గ్రామాలకు దాపులనున్న అడవులలో, అరణ్యాల శివారులలో, గురుకులాలుగా పిలవబడే ఈ విద్యాపీఠాలుండేవి. కొన్ని గురుకులాలని రాజులు పోషిస్తే, కొన్ని గురుకులాలు ప్రజల చేత పోషింపబడేవి.
ఆయా గురుకులాలలో.... ధనికా పేదా తేడాలు లేకుండా, తల్లిదండ్రుల హోదా పరపతి గట్రాలతో సంబంధం లేకుండా, విద్యార్ధులు ఆశ్రమ జీవితం గడపవలసి ఉండేది. వినయం, శుష్రూషలతో గురువు అనుగ్రహాన్ని పొంది, విద్యను అభ్యసించాలి. అందుకోసం ఎంతో శ్రమ, సహనం విద్యార్ధులు అలవరచుకోవలసి ఉండేది. చాలా గురుకులాలలో, విద్యాభ్యాసంతో పాటు భౌతిక శ్రమ కూడా విద్యార్ధులు అలవరచుకోవలసి ఉండేది.
పాఠాలు వల్లించడంతో పాటు, అడవిలో నుండి, వంట చెఱకు ఇతరత్రా వస్తువులని విద్యార్ధులు సేకరించాలి. కొన్ని గురుకులాలలో విద్యార్ధులు, సమీప గ్రామాలకు వెళ్ళి, బిక్షాటనతో ఆహారాన్ని సేకరించవలసి వచ్చేది. ఇలాంటి శ్రమదమాదులతో, విద్యార్ధులకి.... జీవితం తాలూకూ కాఠిన్యతా, జీవిత పోరాటం, ఆకలి ఉపాధి మార్గాలలోని, కష్టం స్వానుభవంగా ‘శిక్షణ ఇవ్వబడేది’. అంటే వాస్తవిక శిక్షణ అన్నమాట. గురువు ఆజ్ఞాపిస్తే.... కుబేర పుత్రుడైనా, రాజకుమారుడైనా భిక్షకై వెళ్ళాల్సిందే.
ఇంతటి కఠినతరమైన శిక్షణతో, విద్యార్ధులు తమ అహాన్ని అతిక్రమించడం సాధన చేసేవాళ్ళు. గురువుని సేవించడం, గురువుకి విధేయత చూపడం మాత్రమే ఫీజుగా పరిగణించవచ్చు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, ‘గురువు ఆకాంక్షను నెరవేర్చడం’ .... గురువు చేసిన విద్యాదానానికి ప్రతిఫలంగా, గురుదక్షిణగా చెప్పబడుతూ [అంటే ఫీజుగా] చెల్లింపబడేది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే - ఉప్పు ప్యాకెట్ పది రూపాయలు, కారం ప్యాకెట్ పాతిక రూపాయలు మాదిరిగా.... ఎల్.కె.జీ.కి ఇంత ఫీజు, ఇంజనీరింగ్ కి ఇంత ఫీజు, అని ధరల సూచిక లేదు. విద్యాభ్యాసం నడుస్తున్నన్ని రోజులు, గురుశిష్యుల మధ్య సంబంధం, ధనానికి అతీతమైనది. గురువుకి శిష్యుల పట్ల ప్రేమ వాత్సల్యాలు, శిష్యులకి గురువు పట్ల వినయ విధేయతలే మాధ్యమాలుగా, జ్ఞానం పట్ల ఆసక్తి ఆస్వాదనలే పునాదిగా.... గురువుల విద్యాదానం, శిష్యుల విద్యాభ్యాసం జరిగేది.
ఆర్దిక పరమైన హద్దులకు ఆవల నడిచే ఈ ప్రక్రియను ఆస్వాదించగలవారే గురువులయ్యేవారు. కాబట్టి కూడా, విద్యాభ్యాసం అన్నది అంత కఠినతరమైన శ్రమతో కూడి ఉండేది. ఇప్పుడూ విద్యాభ్యాసం అంత శ్రమతో కూడి ఉన్నదే. నడ్డి విరేగంత పుస్తకాల సంచుల బరువులతో, మార్కుల మోతతో, టెస్టుల టెన్షన్లలతో, నిరంతర పరుగులతో, బిజీ షెడ్యూలుతో! కానీ, ఆత్మలోపించిన శరీరం లాగా, వ్యక్తిత్వం లోపించిన విద్య! రసం పిండేసిన చెరుకు పిప్పి వంటిది ఈనాటి విద్య.
అయితే గతంలో భారతదేశంలోని విద్యాపీఠాలు, [నలందా, తక్షశిలలు ఇంకా గతంలోకి వెళితే ఋష్యాశ్రమాలు]వ్యక్తికి.... జీవించడాన్ని, జీవితానికి పరమార్ధాన్ని కూడా నేర్పేవి. ఒక్క మాటలో చెప్పాలంటే - విద్య యొక్క నిజమైన అర్ధమూ, లక్ష్యమూ అహాన్ని అతిక్రమించడమే. ఎందుకంటే అహంకారి జ్ఞానాన్ని గ్రహించలేడు. అంతే కాదు, నిరహంకారి మాత్రమే ఇతరులని ప్రేమించగలడు, మానవీయతతో ఆలోచించగలడు, విశ్వశ్రేయస్సుకోసం పని చేయగలడు, జ్ఞానార్ధి కాగలడు! ఈ సందర్భంలో చిన్న కథ ఉటంకించవచ్చు. గతంలో చదివినదే అయినా మరోసారి....
అనగా అనగా…..
ఓ గ్రామానికి దాపుల నున్న అడవిలో సదానందుడనీ గురువు, ఒక గురుకులాన్ని నడుపుతున్నాడు. ఆయన గురుకులం క్రమశిక్షణకి పెట్టింది పేరు. ఆయన యుద్దవిద్యలు కూడా బాగా నేర్పుతాడని ప్రసిద్ది. ఓరోజు కిరీటి అనే యువకుడు సదానందుడి ఆశ్రమానికి వెదుక్కుంటూ వచ్చాడు. సదానందుణ్ణి కలుసుకుని నమస్కరించి “అయ్యా! నాకు కత్తి సాము నేర్చుకోవాలని ఆశ. తమ శిష్యుడిగా స్వీకరించండి” అని ప్రార్ధించాడు. సదానందుడు ఆ యువకుడి జన్మస్థలం గురించి, తల్లిదండ్రులగురించి, పూర్వవిద్యల గురించి అడిగాడు. కిరీటి అన్నిటికీ వినయంగా జవాబిచ్చాడు. సదానందుడు ఏమాటా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు.
కిరీటికి ఏమీ అర్ధం కాలేదు. సరే ‘కాదు పొమ్మనలేదు కదా!’ అనుకుని ఆశ్రమంలో ఇతర విద్యార్ధులతో కలిసిపోయాడు. గురుకుల ఆశ్రమంలోని ఇతర విద్యార్ధుల లాగే రోజూ ఉదయాన్నే లేవటం, ఆశ్రమవిధులు నిర్వహించటం చేస్తున్నాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తేవటం, వంటశాలలో పనిచేయటం, ఏటి నుండి నీరు తేవటం, గురుకులంలోని తోటలోగల కూరగాయల మొక్కలకీ, పూలమొక్కలకీ, పళ్ళవృక్షాలకీ నీళ్ళుపోయటం….. ఇలా అన్ని పనులూ చేస్తున్నాడు. అయితే సదానందుడు కిరీటి కన్పిస్తే చాలు ఈడ్చి తంతుండేవాడు. కిరీటి మొక్కలకు నీళ్ళు పోస్తుంటే ఫెడేలున వీపు మీద గుద్దేవాడు. ప్రాంగణం ఊడుస్తుంటే డొక్కలో గుద్దేవాడు. ఏపని చేస్తున్నా, ఎటో ఒకవైపు నుండి సదానందుడు కిరీటిని తన్నటం మానలేదు.
కిరీటికి ఏమీ అర్ధం కాలేదు. దుఃఖం వచ్చింది. అవమానంగా అన్పించింది. ‘ఒకవేళ గురువుగారికి తనంటే ఇష్టం లేదా? తమ ఆశ్రమంలో ఉండటం ఇష్టం లేకపోతే తనని పిలిచి సూటిగానే అదేవిషయం చెబుతాడుగానీ ఇలా ఎందుకు తనని కొడతాడు?’ అనిపించింది. ఒకోసారి, గురుకులం నుండి వెళ్ళిపోదామా అన్పించేది. కానీ కత్తి యుద్ధం నేర్చుకోవాలన్నా సంకల్పం కొద్దీ గురుకులంలోనే ఉండిపోయాడు. కొన్ని నెలలు గడిచాయి. గురువు గారు మాత్రం కిరీటి కన్పిస్తే చాలు దెబ్బతీయకుండా ఉండేవాడు కాదు. కిరీటి ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వీపు పగలటం ఖాయం. దాంతో అనివార్యమై, కిరీటి అప్రమత్తంగా ఉండటం నేర్చుకున్నాడు. ఏపని చేస్తున్నా, చురుగ్గా అన్నిదిక్కులూ జాగ్రత్తగా పరిశీలించేవాడు. ఏమాత్రం అలికిడి అయినా మెరుపులా కదిలేవాడు. దాంతో సదానందుడు కిరీటిని తన్నలేకపోవటం తరుచుగా జరగసాగింది. ఇలా మరికొన్నిరోజులు గడిచాయి.
ఓరోజు సదానందుడు కిరీటిని పిలిచి “నాయనా! అదిగో ఆ కత్తి అందుకో. ఈ రోజు నుండీ నీకు కత్తిసాము నేర్పుతాను” అన్నాడు ప్రసన్నంగా.
కిరీటి ఆనందానికి అవధుల్లేవు. మరుక్షణం కత్తి అందుకుని అభ్యాసానికి దిగాడు. తొలిపాఠం అయ్యాక కిరీటి గురువుగారికి నమస్కరించి “అయ్యా! నేను వచ్చి, నన్ను శిష్యుడిగా అంగీకరించమని అడిగిన రోజు, మీరు ఔననలేదు. కాదనలేదు. కాదనలేదు కాబట్టి నేను గురుకులంలో ఉండిపోయాను. కానీ ప్రతిరోజూ మీరు నేను కనబడతే చాలు చితకబాదారు. ఆ బాధ పడలేక వెళ్ళిపోదామని కూడా అన్పించింది. ఈ రోజు నేను అడగకుండానే పిలిచి విద్యాబోధన ప్రారంభించారు. కారణం సెలవిస్తారా?" అని అడిగాడు.
సదానందుడు చిరునవ్వునవ్వి “నాయనా! కత్తి యుద్దానికి అప్రమత్తతా, చురుకుదనమూ పునాది వంటిది. నీవు వచ్చిన రోజు నుండీ నీకు అది నేర్పటం మొదలుపెట్టాను. నువ్వు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా నాచేతి దెబ్బలు తిన్నావు. క్రమంగా నీ చురుకుదనం, జాగ్రత్త పెరిగాయి. ఇప్పుడు లాంఛనంగా విద్యాబోధన ప్రారంభించాను. ఏవిద్యకైనా ముందు దానికి తగిన దృక్పధాన్ని, ఆలోచనా సరళిని విద్యార్థికి నేర్పాలి. తర్వాత అసలు విద్య వారు అతి సులభంగా నేర్చుకోగలుగుతారు. విద్యా బోధనలో అసలు కిటుకు ఇదే” అన్నాడు.
కిరీటి సంతోషంగా గురువుగారికి పాదాభివందనం చేసి, ఇతర విధుల్లోకి వెళ్ళాడు. అనతికాలంలోనే సదానందుడి దగ్గర కత్తియుద్ధంలోని మెళకువలు నేర్చుకుని, నైపుణ్యంగల కత్తి యుద్ద వీరుడిగా కిరీటి పేరు తెచ్చుకున్నాడు.
ఇదీ కథ!
ఈ కథ మనకి, ఏది నేర్చుకోవాలన్నా, ఏ సాధన చెయ్యాలన్నా, వాటికంటే ముందు దృక్పధం [attitude] ముఖ్యమని చెబుతుంది. ఒకవ్యక్తి జీవితాన్ని నిర్మించేది, ప్రభావపరిచేది దృక్పధమే. ఒక జాతిని నిర్మించేది, ప్రభావపరిచేది కూడా దృక్పధమే. ఒకప్పుడు భారతీయుల్లో ఉన్న ఈ దృక్పధమే వారిని ప్రపంచంలోకెల్లా భాగ్యవంతుల్నీ, సౌశీల్యవంతుల్నీ చేసింది. ప్రపంచం నలుమూలల నుండి క్రీస్తు పూర్వమే నలందా విశ్వవిద్యాలయానికి 10 వేలకంటే ఎక్కువ విద్యార్ధులుండేవాళ్ళు. ఎందుకంటే భారతీయులు అలనాటి దృక్పధం భారతదేశాన్ని ప్రపంచంలోనే తలమానికం చేసింది.
ఒకప్పుడు, ఆ దృక్పధాన్ని భారతీయులకు, పురాణాలు, ఇతిహాసాలు, వాటిని ప్రచారించే కళారూపాలు, మతవిశ్వాసాలు, జీవన సరళి, బోధించేవి. ఇప్పుడు వాటిస్థానాన్ని మీడియా [పత్రికలు, టివీలు], సినిమాలు ఆక్రమించాయి. అదే ఈ దుస్థితికి కారణం.
నిజానికి స్పూర్తితోనూ, ఇష్టంతోనూ అభ్యాసం చేయగలిగితే, ఆ సాధనని ఎంతో ఆస్వాదించవచ్చు. అది ఒక శాస్త్రం అయినా, ఒక కళారూపం అయినా! నేర్చుకోవడాన్ని నేర్పేదే అసలైన విద్య. అలాంటి విద్య నేర్చిన వాడు, జీవిత పర్యంతం విద్యార్ధిగా ఉంటూ, తనకి తెలియని విషయాలని తెలుసుకుంటూ, జీవితాన్ని ఆస్వాదిస్తాడు.
మన చిన్నారులకి ‘నేర్చుకునే ఆసక్తిని నేర్పే విద్య’ను నేర్పాలి. పిల్లలకి ఒక నిర్ధిష్ట వయస్సు వరకూ.... మాతృభాషతో పాటు ఒకటి రెండు భాషలనీ [చదవడం వ్రాయడం, మాట్లాడటం], కనీస గణితాన్ని తప్ప, ఇతర శాస్త్రాలు నేర్పడం అనవసరం. చిన్నారుల విద్యార్ధి దశలోని తొలి సంవత్సరాలు, కేవలం వారిలో బలమైన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడానికే ఉపయోగించాలి. కథలూ, క్రీడలు ఇందుకు చక్కని ఉపకరణాలు!
ముందుగా.... పిల్లలు మానసికంగా, శారీరకంగా ధృఢంగా తయారవ్వాలి. మానవీయ విలువలు తెలుసుకుంటూ పెరగాలి. తరువాతే వారికి శాస్త్ర బోధన ప్రారంభించాలి. బాల్యం గడిచి యవ్వనంలోకి అడుగుపెట్టే నాటికి ‘సత్యం, ప్రేమ, జ్ఞానం’ల కోసం జీవించేందుకయినా, మరణించేందుకయినా సదా సంసిద్ధులై ఉండేంత పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని, పిల్లలు సంతరించుకోవాలి. ‘తిండి, సంపద - వీటిని సంపాదించడమే జీవితం’ అనే భావనలు వారిలో ఉండకూడదు. సంపద, సుఖం, జ్ఞానం, ప్రేమ - వీటిలో దేని ప్రాధాన్యత దానికి ఇవ్వగలిగే, దేని పరిధి ఎంతో నిర్ధారించగలిగే.... విచక్షణ, పిల్లలు తెలుసుకోగలగాలి. ‘సంపదా సుఖమూ’ జీవితంలో అవసరం. అయితే ‘జ్ఞానము, సత్యం, ప్రేమ’ జీవితం కంటే విలువైనవి. ఈ సత్యం వాళ్ళకి బాగా ఆకళింపు కావాలి.
మనం ఒక ఖరీదైన కారునో, భవనాన్నో మరో విలువైన వస్తువునో... ఎంత ఇష్టంగా, ప్రేమగా చూసుకున్నా.... అది మనల్ని ప్రేమించదు, మన ప్రేమకు స్పందించదు. మన మేలు కోరటమో, మనల్ని చూడగానే చిరునవ్వు నవ్వటమో చేయదు. దాని కళ్ళు ఎప్పటికీ మన మీది ప్రేమాశ్రువులతో మెరిసిపోవు. అసలు కళ్ళుంటే కదా మెరవటానికి?
కాబట్టి, ఎప్పుడైనా, ఏ కారణం చేతనైన, ఎంత విలువైనదైనా.... నిర్జీవం అయిన వస్తువు, సజీవం అయిన సాటి వ్యక్తి కంటే, సాటి ప్రాణి కంటే విలువైనది కాదు. ప్రాణం లేని కారునో, భవనాన్నో, బంగారు బొమ్మనో మనిషి సృష్టించగలడు. కాని సజీవం అయిన చిన్న కుక్కపిల్లని కూడా మనిషి సృష్టించలేడు.అది భగవంతుడికి మాత్రమే సాధ్యం! [టెస్టుట్యూబ్ బేబిలని మనిషి సృష్టిస్తున్నాడు కదా అనవచ్చు. సృష్టిలో ఉన్నదాని నుండే ప్రతిసృష్టి చేస్తున్నాడు.]
చిన్నకుక్కపిల్ల కళ్ళు మన మీద ప్రేమతో మెరుస్తాయి, తడుస్తాయి. మనల్ని చూడగానే పరుగెత్తుకు వచ్చి, మన చుట్టు చుట్టూ తిరుగుతూ, తోక ఆడిస్తూ, తన ప్రేమనంతా ఇష్టంగా వ్యక్తీకరించే ఆ చిన్ని నేస్తం, మన కష్ట సుఖాల్ని పంచుకుంటుంది, తోడుగా నిలుచుంటుంది. అందులో వ్యక్తం అయ్యేది ఆ సృష్టికర్త దివ్యప్రేమే! కాబట్టి ఆశ్వాశతమైన పదార్దం కంటే శాశ్వతమైన భావం ఎప్పుడూ విలువైనదే. ఈ సత్యం, బాల్యంలోనే పిల్లలకు అవగాహన కావాలి. అలాంటి అసలైన విద్యనే మనం పిల్లలకు నేర్పాలి.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
9 comments:
subscribe చేసుకునే వీలు కల్పించండి..మంచి పోస్టులు మిస్ అవుతూన్నాం..
Kvsv గారు: Subscribe ఎలా చేయ్యాలో చెప్పండి. చేస్తాను. టెక్నికల్ గా మేం చాలా వీక్. :)
KVSV instead of subscribing you could click on follow button and follow this blog...hope this helps :)
బ్రహ్మాండ మయిన టపా. ఎవరు వ్రాస్తారా అని చూస్తున్నా. వెయ్యేళ్ళు వర్దిల్లమ్మా.
అజ్ఞాత గారు: నెనర్లండి. ఇంతకీ బ్లాగులో Subscribing అంటే ఏమిటి? మీకు తెలిస్తే చెప్పగలరు.
ఎవరికయిన తెలిసినా చెప్పగలరు.
Rao S Lakkaraju గారు : మీ అభిమానానికి కృతజ్ఞతలండి. చిన్నపదమే అయినా అదే వాడటం తప్పలేదు :)
ఈ రోజుల్లో కావాలసింది నైపుణ్యం మాత్రమే నైతికత సంగతి అడగకండి.
Your blog already has RSS subscription. Whenever there is a new comment or post it will be updated in the live bookmarks when subscribed.On the top right side corner there are two RSS subscription links. entries link is for the posts and comments link is for subscribing comments. Click on those links and press subscribe now to have the subscription.
అజ్ఞాత గారు: ఎవరి విజ్ఞత వారిది కదండి.
చివరి అజ్ఞాత గారు: మా సందేహాన్ని తీర్చినందుకు కృతజ్ఞతలండి.
Post a Comment