పాఠశాల విద్యనీ, గురువుల్నీ పరిశీలిస్తే……
మీరెప్పుడైనా ఒకటి నుండి పదో తరగతి వరకూ విద్యార్ధుల సిలబస్ ఎలా ఉందో గమనించారా? ఇప్పటికి చాలాసార్లు, ప్రభుత్వం, ఈ సిలబస్ ని సంపూర్ణంగా మార్చటం, మార్పుచేర్పులు చేయటం జరిగింది. అవన్నీ ఏ ప్రాతిపదికన చేస్తారో గానీ….. పిల్లలు చదువుకునే పాఠాలు మాత్రం రసహీనమైన, స్ఫూర్తిహీనమైన చెత్త మాత్రమే! రసం పిండేసిన చెరకు పిప్పీ, అంతే!
మూడవ తరగతి పిల్లలకి, ఒక్కపాఠంలో మొత్తం రామాయణం, మరో పాఠంలో మహాభారతం[English Medium, Social Studies, A.P.Govt. Printed Text Book] ఉంటుంది. మూడు పేజీల్లో, ఓ బొమ్మతో, నలుపు తెలుపు ముద్రణలో ఉన్న రామాయణ భారత గాధలు, ఆపైన కొన్ని Short Answer Questions, మరికొన్ని Long Answer Questions! ఏం చెప్పాలి పిల్లలకి?
ఇక నాలుగు అయిదు తరగతి పిల్లల సోషల్ టెక్ట్సు పుస్తకాలలో, స్వాతంత్ర సమరయోధుల గురించి, సంఘ సంస్కర్తల గురించి ఒకే పేజీలతో కూడిన పాఠాలుంటాయి. ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎప్పుడు ఎక్కడ ఏ చదువులు చదివారు, దరిమిలా ఉద్యోగాలు చేస్తే ఎప్పుడు ఎక్కడ చేశారు, ఎప్పుడు మరణించారు! అందరికీ కలిపి ఓ టాబ్యులర్ ఫామ్ తయారు చేయవచ్చు. మచ్చుకి కూడా ఎవ్వరి జీవితాల నుండీ, ఏ రకమైన స్ఫూర్తిదాయకమైన సంఘటనా వివరింపబడదు.
ఇక చిన్న పిల్లలకి…… పరిసరాల గురించి, రోడ్లు, పొలాలు, ఇళ్ళరకాలు, కుటుంబాల్లో వావి వరసల గురించి పాఠాలూ, ప్రశ్న జవాబులూ ఉంటాయి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడుల్లో ఉయ్యాల లూగుతూనూ, చిన్నమ్మ చిన్నాన్నల పక్కల్లో పడుకుని కబుర్లు చెప్పుతూనూ, నేర్చుకోవలసిన విషయాలని, పాలబుగ్గల పసివాళ్ళు, సీరియస్ గా పుస్తకం ఒళ్ళో పెట్టుకుని, “Mother’s father, and father’s father is grand father” అనీ, “Mother’s brother and father’s brother is an uncle” అనీ, బట్టి చేస్తుంటే చూసినప్పుడు నాకు చాలా బాధగా అన్పించేది, నవ్వూ వచ్చేది. తమ చుట్టు పరిసరాలు, ఇళ్ళు, రోడ్లస్వరూప స్వభావాలు, వాళ్ళు ఆడుతూ పాడుతూ పరిశీలించగలరు, తెలుసుకోగలరు. అది కేవలం వాస్తవజ్ఞానానికి [Commen Sense] సంబంధించిన విషయం.
ఈ Commen sense నీ, ఇంగిత జ్ఞానాన్ని కూడా, పసితనం నుండీ బట్టీవేసి నేర్పుతోంది నేటి మన విద్యావ్యవస్థ! పిల్లలకి జ్ఞానం సరఫరా చేయబడటం లేదు. కథలు శూన్యం. కేవలం ముద్రణ [Print]లో ఉన్న పాఠాలు, ఆపైన గైడుల్లోని ప్రశ్నలు – జవాబులు , మార్కులూ, ర్యాంకులూ, గ్రేడులూ, అంతే!
ఈ గందరగోళంలో పడి, సహజంగానే, పిల్లలు ’చదువు అంటే, జ్ఞానం కాదు. చదువు అంటే బట్టీ వేసి, పరీక్షల్లో వ్రాసి, మార్కులు తెచ్చుకుని, పరీక్షలైపోయిన మర్నాడే మరిచి పోదగిన ప్రశ్నలు – జవాబులు’ అన్న స్థితికి వచ్చేసారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో చదువు అంటే మార్కులు, ర్యాంకులే! దాన్ని బట్టి వేయటానికి, కేవలం తాత్కాలికంగా జ్ఞాపకం [Short memory] పెట్టుకుంటున్నారు. పరీక్షలైపోగానే మరిచిపోతున్నారు. వేసవి సెలవలు రాగానే, ఏ బుడ్డీనైనా అడగండి, తము ముందు చదివిన తరగతి పాఠాల్లోంచి చిన్న పద్యం కాదు గదా, చిన్న ప్రశ్న – జవాబు కూడా చెప్పలేరు. “పోమ్మా! ఎవరికి గుర్తుంటాయి?" అంటూ మూతి సున్నా చుట్టి మరీ ఎదురు మిమ్మల్నే ప్రశ్నిస్తారు.
7 నుండి 10 వ తరగతి చదువుతున్న పిల్లలెవర్నైనా తాము సైన్సూ, సోషల్ లో చదివిన ఏ పాఠాన్నైనా….. ఉదాహరణకి ఏ దేశపు ఎగుమతి దిగుమతిలో అడగండి. అంతకు ముందు బట్టీ వేసి నేర్పిన ఒక్కముక్క గుర్తుండదు. వాళ్ళకే కాదు, నిజానికి ఎవరికీ గుర్తుండదు. ఎందుకంటే జీవితంలో వాటి ఉపయోగం లేని కారణంగా, అనువర్తన ఉండని కారణంగా! నిజానికి ఏ ఎగుమతి దిగుమతి రంగంలోనో ఉపాధి పొందే వారికీ, ఉద్యోగం చేసే వారికి కూడా, అవి చిన్నప్పుడు చదువుకున్న రీత్యా గుర్తుండదు. తర్వాత ఆ రంగంలో పనిచేస్తున్న రీత్యా గుర్తుంటాయి. ఇప్పుడైతే ఆ అవసరమూ లేదు. గుర్తు ఉంచుకునే పనిలో కంప్యూటర్లు ఎంతో సాయం చేస్తున్నాయి కదా?
పరిసరాల గురించిన, ప్రపంచాన్ని గురించిన, కనీస జ్ఞానం ఉండకూడదని నేను అనటం లేదు. కానీ దాన్ని నేర్పే విధానం అది కాదంటున్నాను. అంతేగాక, పిల్లలకి నాలుగు నుండి పధ్నాలు గేళ్ళ వయస్సులో కావలసింది ప్రపంచదేశాల ఎగుమతి దిగుమతి గురించిన జ్ఞానం, రసాయన బంధాల గురించిన జ్ఞానం కాదు. బట్టీ పద్దతిలో వాళ్ళ బుర్రల్లోకి దూర్చవలసిన జ్ఞానం అంతకంటే కాదు. ఇతరుల భావాన్ని సరిగ్గా గ్రహించగల, తమ భావాన్ని సరిగ్గా వ్యక్తీకరించగలిగేలా, వ్యక్తిత్వం అలవడేలా, వారి విద్య ఉండాలి. కథల ద్వారా వాళ్ళ ఆత్మకి చైతన్యం కలిగించాలి. కథల ద్వారా నీతిని, కర్తవ్య నిర్వహణనీ, ప్రవర్తనా సరళినీ, మంచీ మర్యాదలనీ, నేర్పవచ్చు. చెడు నుండి మనస్సుని ఎలా నిగ్రహించాలో నేర్పవచ్చు. తాము విన్న, చదివిన విషయాలని, తమ ఊహలోకి ఎలా తెచ్చుకోవాలో నేర్పవచ్చు.
ఇక్కడ ఓ ఉదాహరణ పరిశీలించండి.
పిల్లలకి ఒంటి కొమ్ము రాక్షసుడి గురించో, ఒంటి కంటి రాక్షసుడి గురించో ఉన్న జానపథ కథలని చెబుతూ, ‘తాటి చెట్టంత ఎత్తుంటాడు’ అని చెప్పామను కోండి, బూరి బుగ్గల బుడ్డీగాడు, కళ్ళింత చేసుకుని ’అంత ఎత్తున రాక్షసుడు ఉంటే ఎలా ఉంటుంది?’ అని ఊహించ ప్రయత్నిస్తాడు. ఆ ఊహ చేసేటప్పుడు, ఆ చిన్నారి ముఖంలో వింత వెలుగు, కళ్ళల్లో మెరుపూ ఉంటాయి. ఊహించగలిగిన ఆ చిన్నిముఖంలో, బ్రహ్మ తేజస్సులో తిలాంశమన్నా కన్పిస్తుంది. అలాంటి ఊహశక్తిని సంతరించుకున్న పిల్లలకి, బోర్స్ పరమాణు నమూనాని చెప్పినా, s,p,d,f orbitals గురించి చెబుతూ డంబెల్ షేప్ లో ఉంటాయన్నా, NH3, PCl5 గురించి చెబుతూ పిరమిడల్, బై పిరమిడల్ అని చెప్పినా, వాళ్ళకి అర్ధం అవుతుంది.
అవేవీ లేని వాళ్ళకి, బట్టి తప్ప శరణ్యం ఉండదు. ఇది నేను నా పాపమీద, నా విద్యార్ధుల మీద ప్రయోగాలు చేసి మరీ చెబుతున్నాను. నా పాపకి తన చిన్నప్పుడు, కనీసం పదివేల కథలు చెప్పి ఉంటాను. తిరుమల కొండ మెట్లు ఎక్కెలోగా, మొత్తం దశావతారాల కథలు పూర్తి కావలసిందే! తెలుగులోనే చెప్పాను. కానీ ఇప్పుడు ఇంగ్లీషు అలవోకగా మాట్లాడుతుంది. ఇంగ్లీషు నవలలు చదువుతుంది. పైన చెప్పిన పాఠాలూ, ఇబ్బంది పడకుండానే అర్ధం చేసుకుంటుంది. మా పోరాటం కారణంగా ఆమె నా దగ్గరే, ఇంటి బడిలో[Home Schooling] చదివింది. ఆమె పైనే కాదు, నా విద్యార్ధుల పైన కూడా ఇలాంటి ప్రయోగాలు, వీలుకుదిరినంతగా చేశాను. పుస్తకాల చదవటం అలవాటు ఉన్న పిల్లలనీ గమనించాను.
మాతృభాష మీద పట్టు లేనివాళ్ళు అసలే భాషనూ నేర్వలేరు. ఎందుకంటే, భాష భావం నుండి వేరు కాదు. మాతృభాషలో భావప్రకటన వస్తేనే మరెన్ని భాషలైనా నేర్వగలిగేది! సరే, ఇక ఈ విషయం ప్రక్కన పెట్టి మళ్ళీ మొదటికొస్తాను.
ఎన్ని వ్యాకరణ తరగతులు చెప్పినా అలవడని లక్షణం – ’వాక్చాతుర్యం, అర్ధవంతంగా మాట్లాడటం!’ అదే కథలు ద్వారా ప్రయత్నించి చూడండి. పిల్లల్లో హాస్య చతురత సైతం అలవడుతుంది. అయితే ఆ కథలు సినిమా కథలో, టీవీ సీరియల్సో కాకూడదు సుమా! చందమామలంత గొప్ప ఉపకరణాలు మరి లేవు. భట్టి విక్రమార్క కథలంత అద్భుత రసపూరిత కథలు పిల్లల్లో సాహస స్వభావాన్ని, ధైర్యాన్ని, త్యాగనిరతిని నేర్పుతాయి.
మా పాపకీ, మా స్కూలు బుజ్జీలకి భట్టి విక్రమార్క కథలంటే ఎంత ఇష్టమో! మా పాప అయితే 365 కథలున్న ఆ లావుపాటి పుస్తకాన్ని చదువుతున్నన్ని రోజులూ, ఏమన్నా సరే ’మా విక్రమార్కుడు’ అనేది. కథలు చివరికి వచ్చిన రోజున, విక్రమార్కుని మరణం చదివి, గమ్మున దిగాలు ముఖం పెట్టుకు తిరిగింది. ’ఏమిటమ్మా!’ అని బుజ్జగిస్తే ఒక్కసారిగా బోరుమంది. అరివీర విక్రమార్కుడి మరణం, అంత మామూలుగా, శాలివాహనుడి చేతిలో ఓడి ఉండటం, పాపం, తనకి జీర్ణం కాలేదు.
"ఎవ్వరైనా అంతేనమ్మా! కాలం తీరాక వెళ్ళిపోవల్సిందే!” అంటూ చాలా రకాలుగా ఓదార్చ వలసి వచ్చింది. ఇక ఛంఘీజ్ ఖాన్ చదివాక ’నేనొక టేమూజిన్’ ని అంటూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ‘పిల్లల బాల్యం నుండి కథలని మైనస్ చేస్తే మిగిలేది శూన్యం’ అని చెప్పటానికి.
కథలు వినడం, చదవటం, వాళ్ళల్లో శ్రద్దనీ, ఏకాగ్రతనీ పెంచుతాయి. ముఖ్యంగా ఊహాశక్తినీ పెంచుతాయి. ఒక పనిని ఏకధాటిగా గంటల కొద్దీ చేయటం, ప్రారంభించిన పనిని మధ్యలో వదలకుండా చివరికంటూ పూర్తి చేయటం అలవడుతుంది. ఆ విధంగా వ్యక్తిత్వం ఏర్పడుతుంది. వెన్నుగట్టిపడుతుంది. మన ఇతిహాసాలు, చందమామ లాంటి కథలు, చదవటం వలన భావవాదం బాగా బలపడుతుంది. తమదైన అభిప్రాయాలు, తమవైన లక్షణాలు అలవడతాయి. ఆ తర్వాత – వాళ్ళకి ఎన్ని విద్యలైనా, ఎన్ని భాషలైనా నేర్పవచ్చు. ముందు వ్యక్తిత్వం [శ్రమించే తత్త్వం, వినయం, జ్ఞాన పిపాస వంటి లక్షణాలు] నేర్పాలి.
విద్య పేరిట వాళ్ళకు జీవిత సత్యాలు నేర్పాలి. ఒక పనిని నిర్వహించే సత్తా నేర్పాలి. ఏ పని చేయటానికైనా స్ఫూర్తి, ఉత్సాహం కలిగి ఉండటాన్ని నేర్పాలి. ఒక పనిని అవాంతరాలొచ్చినా వెనుకాడ కుండా ఎలా చేయాలో నేర్పాలి. జీవిత లక్ష్యాలు ఎలా ఏర్పరచుకోవాలో నేర్పాలి. దేని మీదైనా తమదైన ముద్ర వేయగలిగేలా వారు తయారు కావాలి.
ఒక్కమాటలో చెప్పాలంటే విద్య, విద్యార్ధిని ఒక ఖచ్చితమైన వ్యక్తిత్వం గలవారిగా, సంపూర్ణమైన స్వభావలక్షణాలు గలవారిగా తయారు చేయాలి. ఆ చిన్ని బిడ్డ, పెరిగి పెద్దయ్యాక, సత్యాన్ని గ్రహించగల మేధావిగానూ, సత్యం కొరకు పోరాడ గల ధీరునిగానూ, సత్యాన్ని అర్ధం చేసుకోగల అంగీకరించగల మనోదార్ధ్యత గల వాడిగానూ, ఏ సాహసానికైనా వెనుదీయని ధైర్యవంతులు గానూ, నిత్యోత్సాహి గానూ తయారు కావాలి. సరైన విద్యావిధానం ఉంటే ఇది ఎంతమాత్రం కష్టసాధ్యం కాదని ఘంటాపథంగా చెప్పగలను.
అయితే ఇప్పుడు మనం అలాంటి వ్యక్తుల్ని మన విద్యావిధానం నుండి పొందగలుగుతున్నామా? మన చిన్నారులు ప్రకృతిని ప్రేమించగలిగే విధంగా తయారౌతున్నారా? అసలు పరిశీలించే తీరికే వారికి ఉండటం లేదు, ఇక ప్రేమించగలిగేది ఎక్కడ? నీతి, ధర్మం పాటించగలుగుతున్నారా? అసలు అలాంటి మాట కూడా వారికి పరిచయం చేయబడటం లేదు. జీవిత లక్ష్యాలు తెలుసుకోగలిగే విధంగా, అందుకోగలిగే విధంగా తయారౌతున్నారా? ‘సాఫ్ట్ వేర్ ఇంజినీరు కావాలి, లేదా డాక్టరు కావాలి, ఐ.ఏ.ఎస్. కావాలి, ఐ.పి.ఎస్. కావాలి’…. ఈ విధమైనవి జీవిత లక్ష్యాలు అవుతాయా? అవి జీవినోపాధులు మాత్రమే! కానీ పిల్లల్ని నీ ’గోల్’ ఏమిటి నాన్నా?’ అంటే తము చేయబోయే ఉద్యోగం గురించే మాట్లాడటం నేను చాలామంది విద్యార్ధుల దగ్గర గమనించిన విషయం. ఇది ఒకటి నుండి ఐదవ తరగతి పిల్లల్లో మాత్రమే గమనించి చెప్పటం లేదు. ఇంటర్ దాకా చూసి చెబుతున్నాను.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చైనాలో ఒక విద్యార్ధిని, “పెద్దయ్యాక నువ్వు ఏమౌతావు?” అని అడగగా “నేను పెద్దయ్యాక లంచగొండిని అవుతాను” అని ఠక్కున సమాధానం చెప్పిందని, ఈమధ్యకాలంలో వార్తాపత్రికలో చదివాను. ఇంకా మన పిల్లలు అంత అభివృద్ది సాధించలేదు, అంత వరకూ నయం!
నూటికి నూరుశాతం పిల్లలంతా ఇలాగే ఉన్నారనటం లేదు. కానీ అత్యధికులు ఇలాగే ఉన్నారు. ఆలోచనా రహితంగా, క్షణం తీరిక లేకుండా, మహోధృత ప్రవాహంలో పడికొట్టుకుపోతున్న గడ్డిపోచల్లా! ‘పిల్లలు ఏం సాధించారు?’ అంటే – మార్కులూ, ర్యాంకులూ, ఉద్యోగాలు, జీతపు దమ్మిడీలు, కట్టిన ఇళ్ళు, కొన్నకార్లు మాత్రమే కాదు కదా! నిజానికి ఈ పదార్ధ విజయం కూడా తగినంత నిష్పత్తిలో లేదు. అంటే లక్షల్లో పరీక్షలు వ్రాసి, సర్టిఫీకేట్లు పొందిన వారిలో కూడా, దమ్మిడీల పరంగా విజేతలు నిష్పత్తి తక్కువే.
ఇక వ్యక్తిత్వ పరంగా విజేతల నిష్పత్తి గురించి ఏం మాట్లాడగలం?
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
11 comments:
చాలా చాలా బావుంది. విద్యా వ్యవస్థపై ఇంకా రాయండి. తవ్వుకునేకొద్దీ ఎంతో బాధ కలుగుతుంది. కొన్ని తరాలను, కోట్లాది మంది పేద పిల్లల జీవితాలను నాశనం చేస్తోంది ఈ విద్యా విధానం.
i agree with you ...nice post
Agree with you 100%...
I have experienced in my own life - how much value addition books (yes... story books) have done to my life, career.
Starting education in govt school (telugu medium) in small village, if I managed to get into Central / National institutes of repute, if I could work for who's who of India's corporates, If could travel abroad on assignments and if could reach highest position in Job -- Yes.... I attribute a lot this credit to the seeds sown by my parents (mother in particular), grand parents, uncles who were into soicial, literary, Radio, theatre etc activities.
To both my kids, what I have gifted "ALWAYS" from my tours is BOOKS, BOOOKS AND BOOKS....
I need NOT tell you the resultant development in my kids and the pleasure we all derive out of it!!
Thanks once again - ammaaa.
జీవని గారు,
సంవత్సరం క్రితం ఇంగ్లీషులో ** పేరిట వివిధరంగాల ద్వారా భారతీయత మీద, మానవత్వం మీద కుట్రని వ్రాసి, ప్రచురించానండి. అదే ఇప్పుడు తెలుగులోకి అనువదిస్తున్నాను. మీరన్నది నిజమే! తవ్వుకునే కొద్ది బాధాకరమే. ఎవరి చేతుల్లోనో నలిగిపోతున్న పువ్వులు ఇప్పటి పిల్లలు.
****
తమిళన్ గారు,
నెనర్లు!
****
అజ్ఞాత గారు,
మీ అనుభవాన్ని పంచినందుకు కృతజ్ఞతలండి! జ్ఞానమంత ఆనందాన్నిచ్చేది మరేదీ లేదండి. అందుకు ప్రధాన వనరులు పుస్తకాలే.
రాబోయే కాబోయే తల్లిదండ్రులకు ఇది చాలా ఉపయుక్తంగా, మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను.
చాలా చాలా బాగుంది.. పసిపిల్లల బస్తా బ్యాగుల చరిత్ర ఎంత చెప్పినా తరగదు. చక్కగా ఆడుతూ పాడుతూ చదవాల్సిన వాళ్ళు మొయ్యలేక మొయ్యలేక బ్యాగులు మోస్తూ, ఇంటికొస్తే చదవడానికేమి లేనట్లుగా పేపర్లకొద్దీ రాసేస్తూ "అబ్బా వేలు నొప్పిగా ఉందమ్మా" అని చెప్తుంటే ఒక్కోసారి ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. వారి చదువుల బరువులను చూస్తూ.. భరించనూ లేము బయటపడనూ లేము అన్నట్లుగా ఉంటుంది. నేను నా మొదటి బ్లాగులో చదువ్"'కొంటున్నారు" మనపిల్లలు డబ్బులిచ్చి కాదు బాల్యాన్ని అమ్ముకొని అని రాసాను. ఆటపాటలని మరిచిపోయి, పేపరు పెన్ను తప్పితే వేరే ప్రపంచంలో విహరిస్తూ పూర్తిగా 10 ఏళ్ళు నిండకుండా కళ్ళకి జోడు తగిలించుకొంటూ... ఇలా చెప్తూ పోతే తరగని వ్యధ ఇది.
చాలా బాగా చెప్పారు.
చాలా బాగుంది. ఇక్కడ ఒక చిన్న సంఘటన.
>> పిల్లలకి ఒంటి కొమ్ము రాక్షసుడి గురించో, ఒంటి కంటి రాక్షసుడి గురించో ఉన్న జానపథ కథలని చెబుతూ, ‘తాటి చెట్టంత ఎత్తుంటాడు’ అని చెప్పామను కోండి
ఇలాంటివి నాకు బాగా అర్థమయ్యేవి. ఎందుకంటే ప్రొద్దున లేస్తే తాటిచెట్టు చుట్టూ తిరుగుతాం, అది చిన్నప్పుడు ఎలా వుంటుంది, పెద్దయ్యాక ఎలా వుంటుంది మనసులో బాగా చిత్రీకరింపబడినాయి కనక.
>>బోర్స్ పరమాణు నమూనాని చెప్పినా, s,p,d,f orbitals గురించి చెబుతూ డంబెల్ షేప్ లో ఉంటాయన్నా, NH3, PCl5 గురించి చెబుతూ పిరమిడల్, బై పిరమిడల్ అని చెప్పినా, వాళ్ళకి అర్ధం అవుతుంది
ఇది మాత్రం అర్థమయ్యేది కాదు.
కారణం ఇక్కడ వాడిన "డంబెల్ షేప్" అంతవరకు నేనెప్పుడూ చూడనది. దాని పరిమాణం కానీ, ఆకారం కానీ ఏవీ నాకు నా ప్రపంచంలో చూసిలేను. సార్ పాపం బోర్డ్ మీద బొమ్మ వేసినా సరే అర్థం అయ్యేది కాదు. నిజ జీవితంలో మన పరిశరాలకు దగ్గరలేని ఏ పోలికైనా ఇదే పరిస్థితి అని అనిపించేది.
మధ్య మధ్యలో చణుకులు కూడా బాగున్నాయి.
"’నేనొక టేమూజిన్" :-)
చాలా బాగా చెప్పారు. పరిస్థితి మారాలంటె పాఠశాల విద్యను 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుంచి, ప్రభుత్వ రంగం నుంచి తప్పించి స్వతంత్ర ప్రతిపత్తి గల జిల్లా స్థాయి సంస్థలకు వదిలి వేయాలి. వాటిని విద్యావెత్తలకు వదిలి వెయ్యాలి. సిలబస్, ఉపాధ్యనియామకాలు, వెతనాలు మొత్తం వాటికే వదిలివెయ్యాలి. http://samatalam.blogspot.com/2009/01/blog-post.html
ఇన్నీ చాలవన్నట్టు కాన్సెప్టు స్కూళ్లూ, ఐఐటీ ఫౌండేషన్లూ, గాడిదగ్రుడ్లూ. ఈ శృంఖలలో మిగతా టపాలకై ఎదురుచూస్తూ...
భవదీయుడు
రవిచంద్ర గారు,
నెనర్లు!
*****
రమణి గారు,
ఇది తరగని వ్యధ కాదండి. ఆలోచిస్తే పరిష్కారం కన్పించే సమస్యే ఇది. నెనర్లు!
****
సురేష్ తోటకూర గారు,
నెనర్లు!
*****
భాస్కర రామిరెడ్డి,
:)
*****
సమతలం గారు,
ఇంతక్రితమే మీ టపా చదివానండి. మంచి వివరాలు పొందుపరిచారు. అసలు సమస్యపై అవగాహన రావాలంటే ఎందరం, ఎన్ని కోణాలలో పరిశీలించాల్సి ఉంటుందో! నెనర్లు!
*****
రాఘవ గారు,
అవునండి. పిల్లల్ని మరింత శ్రమకి, ఒత్తిడికి గురి చేయటానికే ఈ కాన్సెప్ట్ స్కూళ్ళు, మాధ్స్ ఒలింపియాడ్ లు, ఐఐటి ఫౌండేషన్ కోర్సులు. నెనర్లు!
Post a Comment