ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా Sep.05, 2007 న ప్రముఖ విద్యావేత్త, డా. EV సుబ్బారావు గారు ఓ వ్యాసం వ్రాసారు. అందులో ఆయన , ఒకప్పటి విద్యావిధానాన్నీ, నేడు పాఠశాలల పరిస్థితినీ సమీక్షించారు.
‘ప్రాచీన కాలంలో గురుకులాలుగా పిలువబడే విద్యాసంస్థలు ఆయా గురువుల పేరిట ప్రసిద్దమయ్యేవి. ప్రజలు వాటిని ’ఫలానా గురువు నడిపే గురుకులం’ అనే రిఫర్ చేసేవారు. ఫలానా గురువు క్రమశిక్షణ నేర్పుతాడనీ, జ్ఞాని, సమర్ధుడూ – ఇలా ఆయా గురువుల నైతికత, ధార్మికతలని బట్టి తల్లిదండ్రులు తమ పిల్లలని సదరు గురుకులాలలో వదిలిపెట్టేవారు. అదే ఇప్పుడైతే, ఒక పాఠశాల, గత సంవత్సరాల్లో సాధించిన మార్కులు, ర్యాంకుల వంటి ఫలితాలని చూసి, పాఠశాలకి ఉన్న బ్రాండునీ, ఇమేజ్ ని చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలని ఆయా పాఠశాలలకి పంపుతున్నారు. తరగతి గదిలోకి గురువు/టీచర్ అడుగుపెట్టే వరకూ కూడా, మనపిల్లలకి ఎవరు చదువు నేర్పబోతున్నారో మనకి తెలియదు. టీచర్/గురువుల పేర్లేమిటో కూడా తెలియదు. అంతేకాదు, సంవత్సర ప్రారంభంలో కనబడిన గురువులే/టీచర్లే, సంవత్సర చివరి వరకూ మనపిల్లలకి చదువు చెబుతారో లేదో కూడా మనకి తెలియదు. ఏం విద్యావిధానం ఇది?’ – అన్నారాయన . ఇదెంత నిజం!
మా చిన్నప్పుడు గుంటూరులో సైతం ’వీధిబడి’గా పిలువబడినా సరే, మాష్టారి పేరిటే బడి పేరు ఉండేది. మాకు ఊహ తెలిసేటప్పటికే ప్రభుత్వ పాఠశాలగా మారిపోయినా, మా గుంటూరు వారితోట లోని ప్రభుత్వపాఠశాలని ’పానయ్య బడి’గానే అందరూ పిలిచే వాళ్ళు. ఇప్పటికి, ఆ బడి లో పనిచేసిన ‘పానయ్య మాష్టారు’ స్వర్గస్తుడైనా సార్ధక నామం మాత్రం మిగిలిపోయింది. అక్కడ పిల్లల్ని లెక్కల రాకపోతే కొడతారనీ పేరు కూడా ఉండేది. కానీ బాగా చదువు చెబుతారు. అప్పటికి కాన్వెంట్ల సంస్కృతి అంతగా లేదు.
నిజానికి – బోధనార్హత [అంటే నా ఉద్దేశంలో డిగ్రీలో, బీయెడ్లో, డీఎస్సీలో కాదు] లేని వ్యక్తి, పిల్లలకి ఏం నేర్పగలడు?
వ్యక్తిగా తనలో బలమైన వ్యక్తిత్వం లేని గురువు,
ధృడ చిత్తం లేని గురువు,
స్థిరచిత్తం లేని గురువు,
సామర్ధ్యం లేని గురువు,
విలువలు లేని గురువు,
నిజం చెప్పే అలవాటు లేని గురువు,
అబద్దాలు అలవోకగా ఆడే గురువు,
యాజమాన్యపు దయా దాక్షిణ్యాలు కోసం పితూరీలు చెప్పడం దగ్గర నుండీ, కాకాలు పట్టడం వరకూ చేస్తూ [ఇంకేవో కూడా చేస్తుండటమూ కద్దు] ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలు మరిచిపోయిన గురువు,
ఏవిధంగా సత్పవర్తననీ, సద్గుణాలనీ పిల్లలకి బోధించగలడూ?
ఇదేదీ పరిశీలించాల్సిన అవసరంగానీ, అసలు తమ పిల్లలకి ఎవరు చదువులు చెబుతున్నారో, అసలా చదువులేమిటో, వాటివల్ల ఉపయోగం ఏమిటో పరిశీలించాల్సిన అవసరం గానీ, చాలామంది తల్లిదండ్రులకి లేదు. కనీసం ఆ ఆలోచన కూడా లేదు. “పిల్లలకి చదువు చెప్పే గురువుకి సద్గుణాలో, విలువలో ఉండాల్సిన అవసరం ఏమిటి? సైన్సు, సోషలూ, లెక్కలూ,.... ఇలా సబ్జెక్టులు చెబితే చాలదా?" అనే తల్లిదండ్రులూ ఉన్నారు.
వెలగని దీపం ఏవిధంగా మరో దీపాన్ని వెలిగించలేదో, అదే విధంగా తనలో లేనిదాన్ని ఏ గురువూ ఏవిద్యార్ధికీ బోధించలేడు, నేర్పించలేడు. అది సబ్జెక్టయినా సరే, వ్యక్తిత్వ లక్షణాలైనా సరే!
చాలామంది ఉద్దేశంలో, చదువంటే కేవలం తరగతి పాఠ్యపుస్తకాల్లో ప్రచురింపబడిన పాఠాలే! చదువంటే అక్షరాలే నన్నట్లు ఉంటుంది వాళ్ళ ధోరణి. అక్షరాస్యత జ్ఞానం ఎప్పటికీ కాదు. అనుభూతించగలిగిన భావం జ్ఞానం! దాన్ని అందుకునే సాధనం అక్షరం! సునిశితమైన ఈ అంశం, ఈ రోజు చాలామందికి అర్ధం కాని స్థితిలోకి మన సమాజం తిరోగమనం చేసింది.
ఇక్కడ మీకు ఓ చిన్న ఉదాహరణ చెబుతాను.
నర్సరీలో చేరిన బుడ్డోడికి కూడా ఈరోజు సంఖ్యలు నేర్పడం మొదలు పెడతారు. 1 నుండి 100 దాకా! నిజానికి ‘ఒకటి’ అంటే ఏమిటి? మా పిల్లల్ని[10 వ తరగతి, ఆ పైన పిల్లల్ని సుమా] అంటే విద్యార్ధులని, నేను పరిచయ క్లాసుల్లో ఈ ప్రశ్న వేస్తుంటాను. ఒక్కొక్కరు “One Mam” అంటారు.
“ఇంగ్లీషులో చెప్పావు, అంతే! సరే, One అంటే ఏమిటి?" అంటాను.
మరొకరు వ్రాసి చూపిస్తారు.
“నువ్వు వ్రాసావు, అంతే! దీన్ని నేను నిలువ గీత అంటాను. నువ్వు ఒకటి అని ఇలా [1] వ్రాసావు. ఏ రోమన్ వాసినో అడిగితే ‘i’ అని ఇలా వ్రాసి చూపెడతాడు. తెలుగులో వ్రాయమంటే ‘౧’ ఇలా వ్రాస్తాడు. ఇది ఓ వంకర అక్షరం లేదా సంజ్ఞ. అది కేవలం ఒక గుర్తు మాత్రమే! మళ్ళీ అడుగుతున్నాను. ‘ఒకటి’ అంటే ఏమిటి?" అంటాను.
పాపం మా బుడ్డీలు [ఇంటర్ వాళ్ళయినా నాదృష్టిలో బుడ్డిలే] బిక్కముఖం పెట్టేస్తారు. నవ్వులూ పూయిస్తారు.
దాంతో మరొకరు ఒక వేలు ఎత్తి చూపుతారు. “అది నీ వేలు, అంతే! ఒకటి ఎలా అవుతుంది?" అంటూ ఉంటాను.
ఇక చూస్కోండి, మా వాళ్ళకి తెగ ఉత్సాహం వచ్చేస్తుంది. ఆపైన చర్చ ఆసక్తికరంగా నడుస్తుంది.
చివరికి “ఒకటి అన్నది ఓ భావం. దాన్ని సుచించటానికి వేలు చూపిస్తాం. లేదా ‘1’ అనీ, ‘i’ అనీ, ‘౧’ అనీ వ్రాస్తాం, అంతే! ’అలాంటి వస్తువు అది మాత్రమే ఉంది’ అన్న భావాన్ని ‘ఒకటి’ అన్న పదంతో, ఇంగ్లీషులో ‘One’ అన్న పదంతో, హిందీలో ‘ఏక్’ అనే పదంతో, మరో భాషలో మరో పదంతో సూచిస్తాం. ఇక ‘రెండు’ అన్న భావాన్నీ, ఇలాగే మరో పదంతో, మరో గుర్తుతో సూచిస్తాం! ’అలాంటి వస్తువు అది మాత్రమే గాక, మరొకటి కూడా ఉంది’ అన్న భావాన్ని ‘రెండు’ అంటాం. తొలిమెట్టు తర్వాత తర్వాత మెట్టు ఎక్కినట్లుగా, ‘ఒకటి’ అన్న భావన మీద ఆధారపడి ‘రెండు’ అన్న భావాన్ని[ఒకటికి ఒకటి కలిపితే రెండు అంటూ] నేర్చుకుంటాం” అని చెప్పి, అక్కడ నుండి మా పిల్లల్ని, పైధాగరస్ ఫిలాసఫి, “జగమంతా అంకెల మయం” దగ్గరకీ, అక్కడి నుండి Atomic Number దగ్గరకీ తీసుకు వెళ్తుంటాను. సాధారణంగా నా ఫిజిక్స్ క్లాసు ఇలా ఉంటుంది.
ఇక్కడ మరో ఉదాహరణ చూడండి.
ఈశావాస్యోపనిషత్తుని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను.
>>>ఉపనిషత్తుల యధార్ధమైన అర్ధాన్ని కేవలం పాండిత్యం [పఠించటం, బట్టి వేసి ఉటంకించడం] తో అవగతం చేసుకోలేం. వినయంతోనూ, ఆరాధానాభావంతోనూ పఠించినప్పుడు మాత్రమే వాటిని అర్ధం చేసుకోగలం. అలాంటి వైఖరిని మనస్సులో పాదుగొల్పుకొని ఈ మంత్రాలను ముందుగా పారాయణం చేయాలి. ఈశావాస్య ఉపనిషత్తు శాంతి మత్రం ఇది.
ఓంపూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతేI
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతేII
ఓంశాంతిః శాంతిః శాంతిఃII
భావం:
భగవంతుడు పరిపూర్ణుడు. ఈలోకం పరిపూర్ణమైనది. పరిపూర్ణుడయిన భగవంతుని నుండే పరిపూర్ణమైన ఈ లోకం ఉద్భవించింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణతను తీసివేసిన తరువాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.
ఒక ప్రహేళిక మూలంగా లోకాన్ని వివరించడానికి ఈ మంత్రం ప్రయత్నిస్తున్నది. భగవంతుడు పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా ఉంటున్నాడు. ఆయన నుండి పరిపూర్ణమైన ఈ లోకం ఉద్భవించింది. అయినప్పటికీ తన పరిపూర్ణతకు లోటులేక ఆయన పరిపూర్ణుడుగానే ఉంటున్నాడు. దీనిని మూడువిధాలుగా అర్ధం చేసుకోవచ్చు.
౧. ఒక దీపం నుండి అనేక దీపాలను వెలిగించవచ్చు. ఇందువలన మొదటి దీపపు పరిపూర్ణతకు ఎలాంటి లోటూ రాదు. దాని నుండి వెలిగింపబడిన దీపాలు కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రకాశాన్ని ఇచ్చేవిగా ఉంటాయి.
౨. మనం ఎందరినో ప్రేమిస్తాం. వారిపట్ల సంపూర్ణంగ ప్రేమను వర్షిస్తాం. ఆ కారణంగా మన వద్ద ఉన్న ప్రేమ తగ్గిపోయిందని చెప్పలేం. మన ప్రేమ సంపూర్ణంగా ఉంటూనే మనం ఎందరికో ప్రేమను సంపూర్ణంగా పంచి పెట్టవచ్చు.
౩. ఒక చెట్టుకు అనేక పుష్పాలు పూస్తాయి. ప్రతి పుష్పమూ సంపూర్ణంగా ఉంటుంది. ఇలా పరిపూర్ణమైన పుష్పాలను కోకొల్లలుగా ఇస్తున్నప్పటికీ ఆ చెట్టు పరిపూర్ణత కించిత్తు కూడా తగ్గదు. ఎందుకంటే చెట్టు పరిపూర్ణత వేరు, పుష్పం పరిపూర్ణత వేరు.
అదే విధంగా భగవంతుని నుండి ఎన్నెన్నో పరిపూర్ణమైన లోకాలూ, పిండాండ బ్రహ్మాండాలూ ఉద్భవించవచ్చు. అందువలన ఆయన పరిపూర్ణతకు ఏవిధమైన లోటురాదు.
భగవంతుని పరిపూర్ణత లోకాల ఉద్భవం వల్లనో, విలీనం వల్లనో ప్రభావపడదు. భగవంతుని నుండి ఉద్భవించడం వల్ల ఈ లోకం కూడా భగవదంశ సంభూతమైనదని శాంతి మంత్రం భావం. ఈ సత్యాన్ని గ్రహించి జీవిస్తే సామాన్య జీవితమే మనలను భగవన్మార్గంలో తీసుకొని వెళ్ళే శక్తి గలదై ఉంటుంది. ఈ భావాన్నే ఈ ఉపనిషత్తు ద్వారా శాంతి మంత్రం వ్యక్తం చేస్తున్నది.
వేదమంత్రాలన్నీ చివరకు ఓం శాంతిః శాంతిః అంటూ ముగుస్తాయి. శాంతిః అంటే ప్రశాంతత అని అర్ధం. మూడు విధాలయిన ఆటంకాల నుండి మనం బయడపడడానికి మూడుసార్లు ఉచ్ఛరించాలి. ఆ మూడు విధాల ఆటంకాల ఏవంటే.
౧. ఆధ్యాత్మికం:- మన వలన వాటిల్లే ఆటంకాలు, శారీరక రుగ్మత, మానసిక రుగ్మత లాంటివి.
౨. ఆధిభౌతికం :- ఇతర జీవరాసుల వలన వాటిల్లే ఆటంకాలు.
౩. ఆధిదైవికం :- ప్రకృతి శక్తుల వలన ఏర్పడే ఆటంకాలు: వర్షం, పిడుగు, అగ్నిలాంటి వాటి వలన సంభవించేవి.
మూడుసార్లు ’శాంతిః’ అని ఉచ్ఛరించడం వలన, మూడు రకాల ఆటంకాల నుండి విడివడి ఈ ఉపనిషత్తును ఆధ్యయనం చేసే మన ప్రయత్నం విజయవంతమవాలని ప్రార్ధిద్దాం.
[పై శ్లోకాన్ని, భావాన్ని ఈశావాస్యోపనిషత్తుకు స్వామి జ్ఞానదానంద (రామకృష్ణమఠం వారి ప్రచురణ) వ్యాఖ్యానం నుండి యధాతధంగా సంగ్రహించాను.]
పరిశీలించి చూడండి. గణిత పరిభాషలో చెప్పాలంటే ఈ ఈశావాస్యోపనిషత్తులోని ఈ శాంతి మత్రం శూన్యం అంటే ’సున్న’ భావాన్ని [Concept] ని వివరిస్తోంది. సున్నాని పూర్ణం అని మన పెద్దలు ఉటంకించటం అందరికీ తెలిసిందే. సున్నలో నుండి సున్న తీసివేస్తే వచ్చేది సున్నానే. సున్నాకు సున్న కలిపినా వచ్చేది సున్నానే.
0 – 0 = 0; 0 + 0 = 0.
ఈ నేపధ్యంలో గమనించాల్సింది ఏమిటంటే – గణితంలో సున్నాని ప్రాచీన భారతీయ జ్ఞాని ఆర్యాభట్ట ప్రతిపాదించాడని అంటారు. గతంలో అంటే క్రీస్తు పూర్వం, గ్రీకులు ఎవరెన్ని ఎక్కువ సంఖ్యల సంకేతాలని గుర్తు ఉంచుకోగలిగితే వాళ్ళని అంత మేధావులుగా గుర్తుంచేవాళ్ళట. అంటే I,II,III,IV,…..IX,X,XI….. ఇలాగన్న మాట. “నీకెన్ని సంఖ్యల గుర్తుంటాయి?” అని ఒకరినొకరు ప్రశ్నించుకోవటం, అక్కడ కుశల ప్రశ్నలంత సాధారణమై ఉండేదట. అలాంటి చోట, సున్న భావం [Concpet] గణితాన్ని ఎంత సులభతరం చేసిందో కదా? ఇలాంటి ఈ ‘సున్నా Concept’ ని భారతీయులు కనిపెట్టగా, అరబ్బీ దేశీయులు ప్రాచుర్యంలోకి తెచ్చారట. కాబట్టి దీన్ని ‘ఇండో ఆరబిక్’ పద్దతిగా పిలుస్తారని 5వ తరగతి పిల్లలకి గణిత పాఠంలో ఉంటుంది. దీని వెనుక మర్మం ఇప్పుడు బాగానే అర్ధమౌతుందనుకుంటాను.
ఇక ఈ టపాల మాలికలోని ఈ టపా ముగించే ముందు… సరదాగా ఓ ప్రశ్న.
1/1 = 1 , 2/2 = 1, 100/100 = 1 అలాగే x/x =1
మరి 0/0 =1 లేదా 0/0 = 0. ఏది సరైనది?
వందపళ్ళను వందమందికి పంచితే ఒక్కొక్కరికీ ఒకపండు వస్తుంది. కాబట్టి 100/100 =1
మరి సున్న పళ్ళను సున్న మందికి పంచితే, ఒకొక్కరికి ఎన్ని పళ్ళు వస్తాయి. ఒక పండు రాదు కదా? ‘సున్నమందికి’ అంటే ఎవరూ లేరు. ఎవరూ లేని వారికి ఏ పండూరాదు. అంటే ఫలితం సున్న కావాలి. 0/0 = 0 అన్నమాట. కానీ ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ‘1’ రావాలి అన్న సూత్రం ప్రకారం 0/0 =1 కావాలి.
కాబట్టి, దీన్నీ undefined…. నిర్వచించబడనిది….. అని చెబుతాం!
దీన్నే ఈశావాస్యోపనిషత్తులోని శాంతి మత్రం సాయంతో చూస్తే…. పరిపూర్ణుడైన పరమాత్మని, పరిపూర్ణుడైన ఆత్మకు పంచితే, అందుకోగలిగే భావం పరమభావం లేదా బ్రహ్మభావం. దీనినే మోక్షం లేదా జన్మరాహిత్యం అంటాం. అది అనుభవించి, అనుభూతించి తెలుసుకోవలసిందే! అది పరిపూర్ణమైనది, అదే సమయంలో శూన్యమయినది.
ఎంత సాధనతో, ఎన్ని జన్మల సాధనతో అది అందాలో కదా? దీనిని మరో విధంగా కూడా ఈశావాస్యోపనిషత్తు వివరిస్తుంది. దానిని మరోసారి చర్చిద్దాం.
తరచి చూస్తే సున్నా భావం [Concept], భగవంతుడు లేదా పరమాత్మ [లేదా శాశ్వత మైన ఆత్మ]కు మరోరూపమే అన్పిస్తుంది. ఎందుకంటే సున్నాని శూన్యమనీ అంటారు. పూర్ణం అని కూడా అంటారు. పూర్ణం అంటే అన్నీ ఉన్నది. శూన్యమంటే ఏమీ లేనిది. భగవంతుడూ అంతే! నమ్మిన వాళ్ళకు అన్నీ భగవంతుడే! నమ్మని వాళ్ళకు అసలు భగవంతుడే లేడు.
అంతేకాదు పరబ్రహ్మ భావాన్ని[అంటే భగతద్భావాన్ని] సాధనతో [అంటే ఆచరణతో] మాత్రమే తెలుసుకోగలం. ఇదే విషయాన్ని గీత ఎంత స్పష్టంగా చెబుతుందో చూడండి.
శ్లోకం:
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్
వినాశ మవ్యయస్యాస్య న కశ్చి త్కర్తు మర్హతి
భావం:
ఏదైతే యీ జగత్తంతా పరివ్యాప్తమైవుందో అది [అత్మ] నాశనం లేనిదనీ, అవ్యయమైన ఆ ఆత్మను నశింపజేసేది కూడా యేదీ లేదనీ తెలుసుకో.
శ్లోకం:
ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చిదేన
మాశ్చర్యవ ద్వదతి తథైవ చాస్యః
ఆశ్చర్యవ చ్చైన మన్య శ్శ్పణోతి
శ్రుత్వా ప్యేనం వేద నచైవ కశ్చిత్
భావం:
ఒకానొకడీ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మరొకడు ఆశ్చర్యంగా పలుకుతున్నాడు. ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కాని – చూడటం వలన, చెప్పటం చేత, వినటం చేత – ఆత్మను గురించి తెలుసుకోలేరు.
కాబట్టి – సాధనతో మాత్రమే, అనుభవంలోకి, అనుభూతిలోకి తెచ్చుకోగలిగిన భావం జ్ఞానం. జ్ఞానమే భగవంతుడు. దానినే ఒకప్పటి భాషలో విద్య అనే వాళ్ళు.
అటువంటి చదువు చెప్పేవాడు గురువు.
‘తనకు భగవంతుడూ, గురువూ ఒకేసారి కన్పిస్తే, తాను ముందుగా గురువుకే నమస్కరిస్తాననీ, ఎందుకంటే తనకి భగవంతుణ్ణి చూపింది గురువే కాబట్టి’ – అంటాడు భక్త కబీరు.
అందుకేనేమో మనవాళ్ళు…..
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
అంటారు.
అలాంటి గురువు, ఈరోజు పరువు మాసి పోయారు. చాలామంది తల్లిదండ్రులకి తమ పిల్లలకు చదువు చెప్పే గురువు ఎవరో, అతడి గుణగణాలు ఎటువంటివో – ఏదీ పట్టటం లేదు. ఆయా విద్యాసంస్థలకి ఉన్న Result record, Career record తప్ప, మరేదీ పట్టటం లేదు. దాదాపు పాఠశాల యొక్క బ్రాండూ, ఇమేజ్, [అంటే కార్పోరేటిజం] మాత్రమే పడుతోందన్న మాట.
నిజానికి చదువు అర్ధం కూడా మారిపోయింది. ఈరోజు వృత్తి విద్యలు చదువు కాకుండా పోయాయి. కులవృత్తి విద్యలూ, యుద్దకళలూ, యుద్దవిద్యలూ, లలితకళలూ కూడా చదువు కాకుండా పోయాయి. ఇంకా చెప్పాలంటే మనకున్న 64 కళలూ కూడా చదువు కాకుండాపోయాయి. కేవలం ప్రభుత్వ శాఖల్లో, కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించగలదీ, పొట్టకూడు పెట్టగలదీ మాత్రమే చదువుగా పరిగణింపబడుతోంది. కేవలం తిండి తినటం, బ్రతక గలగటం మాత్రమే జీవితానికి పరమార్ధమా? అది జంతువులకి సహజలక్షణం కదా? మానవ జన్మ అంతకంటే ఉన్నతమైనది కదా? మరి మానవ జీవిత పరమార్ధమూ ఉన్నతంగా ఉండాలి కదా? చదువు పొట్ట నింపటమే కాదు, మనస్సునీ నింపాలి.
అదంతా మరిచిపోయి దమ్మిడీల పరుగులో మునిగిపోవటం వల్లా, దమ్మిడీల వరదలో కొట్టుకుపోయే దృక్పధం వలన ఏర్పడిన ఉత్పాదం ఇది.
ఇక పాఠశాల గురువుల దగ్గరికి తిరిగి వద్దాం.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
17 comments:
టపా చదివాను.ఆలోచనలో మునిగాను. తేరుకొని మళ్ళీ రేపు వస్తాను.
Watch these videos
http://www.youtube.com/watch?v=0giYl6bi7Os
http://www.youtube.com/watch?v=xWeQLO6_T6U
http://www.youtube.com/watch?v=VA8kFX9qNmE
http://sulochanosho.wordpress.com/
marokkasaari meeku hridayapoorvaka namassulu!
Sukheebhava... Deerghaashmaan bhava!
mano-vaanchha phalasidhirasthu!!
భాస్కర రామిరెడ్డి,
రేపటికి స్వాగతం!
****
అజ్ఞాత గారు,
మంచి లింకులిచ్చారు. జిడ్డు కృష్ణమూర్తి గారి రచనలు అన్నీ కాదు గానీ, కొన్ని చదివాను. నాకు చాలా చాలా నచ్చిన వాటిల్లో అవీ కొన్ని. నెనర్లు!
****
అజ్ఞాత గారు,
మీ అభిమానానికి కృతజ్ఞతలండి. మీ దీవెనలను సంతోషంగా స్వీకరిస్తున్నాను.
ఈ సంవత్సరం అని మా ఎలిమెంటరీ స్కూళ్ళలో కొత్త కార్యక్రమం పెట్టారు. దానికి సంబంధించిన రిపోర్టు ఒకటి ఉంటుంది. అది నింపుతుంటే నాకు తేళ్ళూ జెర్లూ పాకుతున్నట్లు ఉంటుంది. వీలైతే మీకు దగ్గర్లో ఎవరైనా టీచర్ ఉంటే తెప్పించుకుని చూడండి. తయారుచేసినవాడు ఎంత పెర్వర్టో అర్థం అవుతుంది. ప్రభుత్వ విద్య పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. పిల్లలకు చదువు సంగతి తర్వాత, ముందు ఈ దిక్కుమాలిన రిపోర్టులు ఉండాలి. ఒక్కోసారి ఎంతో బాధ అనిపిస్తుంది. మా బడుల గురించి ఆలోచించి చించి బీపీ పెంచుకుని మనసు నొప్పి పెట్టుకుని వదిలేశాను. యూజీ క్రిష్ణమూర్తి గారు అన్నట్టు ఇంకా ధ్వంసం కావాలి. పూర్తి నాశనం అయితే అప్పుడన్నా కొత్త వ్యవస్థ పుట్టుకుని వస్తుందేమో మరి.
‘‘పూర్ణమదః పూర్ణమిదం" అరటిపండు ఒలిచిపెట్టినట్లు ఉదాహరణలతో చాలా చక్కగా వివరించారు.
చాలా చాలా బాగా చెప్పేరు ఈ విషయాల గురించి నా మనసు లో ఎప్పుడు ఆలోచనలు మెదులుతూ వుండేయి కాని మీ అంత బాగా అక్షరీకరించలేను అనుకోండి, విద్య కు నిర్వచనం మారి నప్పుడు విధ్యార్ధులకు గురువులకు నిర్వచనం మారటం అనేది అనివార్యం. పూర్ణమనే పదానికి ఎంత బాగా చెప్పేరు అర్ధం.. నేను ఎప్పుడు అందరి తో వాదిస్తూ వుంటా ఈ చిన్న చిన్న బడుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కాన్వెంట్ ల వరకు lkg, ukg ల నుంచి 5 వ తరగతి వరకు వుండే టీచర్ లను ఎంపిక చేసుకోవటం లో శ్రద్ధ చూపిస్తే మన భావి తరాలు బాగుంటాయి. కాని స్కూల్స్ పెట్టే వాళ్ళలోనే చిత్తశుద్ధి లేనప్పుడు అందులోని గురువులను తీసుకునే టప్పుడు ఎందుకు శ్రద్ధ వహిస్తారు వాళ్ళు. నాకు ఎప్పుడు మన వూర్లో (మన వూర్లో అంటే నా వుద్దేశం ఆంధ్రా లో ఒక చిన్న పల్లెటూరిలో అని) చిన్న స్కూల్ పెట్టుకుని వుండాలనిపిస్తుంది. నిజం అది నా జీవితాశయం. అది కుదరక పోతే కనీసం నా అధ్యాపక వృత్తి ని తిరిగి మొదలు పెట్టాలి అనుకుంటాను. చాలా మంచి విషయాలను చాలా విశ్లేషణాత్మకం గా చెప్పేరు. ధన్య వాదాలు. ఇంకా చాలా రాయాలని వుంది కాని ఇదే ఒక టపా అయ్యేటట్లు వుంది. :-)
జీవని గారు,
ప్రభుత్వవిద్యలోని లోపాలు మాకు బాగా తెలుసండి. వాటిమీద అడ్మినిస్ట్రేషన్ గా ఫిర్యాదులు పెడుతూ, చాలా పోరాడాము. కాబట్టే దాన్ని కుట్ర అన్నాము. లోపమని తెలిసీ కావాలని చేస్తుంటే దానిని కుట్ర అనే అనాలి కదా! నెనర్లు.
****
చిలమకూరి విజయ మోహన్ గారు,
:)టపా మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండి.
****
భావన గారు,
వ్యాఖ్య పొడవయినా ఫర్వాలేదండి. మీ భావాలు పంచినందుకు సంతోషం. ఎంత పల్లెటూరిలోనయినా చిన్న స్కూలు పెట్టుకొని ప్రశాంతంగా ఉండగలిగే పరిస్థితులు ఇప్పుడు లేవండి. పిల్లలకి మంచినేర్పారో మీరు పిల్లల భవిష్యత్తు నాశనం చేసినట్లే నంటుంది ప్రభుత్వం. కాబట్టి వంద రూల్స్ చెప్తుంది. అదే అటానమస్ పేరుతో పి.జీ. కాలేజి ఏమీ చేసినా పట్టించుకోదు ప్రభుత్వం. ఇది మా పరిశీలన,స్వానుభవం. నెనర్లు!
నేను ఈ శ్లోకాన్ని ఇన్ఫినిటీ కాన్సెప్ట్ తో చూస్తున్నాను ఇన్నాళ్ళు,
పూర్ణం అంటే అనంతం అనిపించింది.లోపలా బయటా అంతా ఉండేవాడు కాబట్టి,అంతః బహిశ్చ వ్యాప్త సర్వం కదా...(ఎవరూ చెప్పింది కాదు, అలా అనిపించింది)
ఇన్ఫినిటీ లోనుండి ఇన్ఫినిటీ ని తీసివేసినా, కూడినా, గునించినా, భాగించినా అంతా ఇన్ఫినిటీనే కదా.
పూర్ణం అంటే మనవాళ్ళు సున్న అని అనుకోలేదేమో అని నా అనుమానం. అదీ కాక చమకం లో ఏకశ్చ మే అంటూ మొదలుపెడతారు. విజ్ఞులు వివరించగలరు...
మనోహర్ గారూ,
అనంతానికీ శూన్యానికీ తేడా లేదండీ. అద్వైతం. ఆలోచించండి. :)
ఇహ నాకు అర్థమైనంతలో, చమకంలో సందర్భం వేఱు.
శూన్యం అనంతం.సృష్టీ అనంతం.మానవ మేధస్సూ అనంతం.
మాయా లోకంలో అంతా పూర్ణమే.కానీ ఎల్లలు చూడగ అంతా అనంతమే.
మనిషి జీవితం అంతా పరిపూర్ణమే.తరచి చూస్తే అంతా శూన్యమే.
నిర్మలం, నిశ్చలం
పూర్ణం, శూన్యం
అదే కదా దైవం.
naku oka dout andi
vupadyadiosthavasmu sep 5 kadandi.oct 5 ani rasarenti?naku arhtam kaleda miru propatu paddara?
భాస్కరరామిరెడ్డి,
తేరుకున్నావన్న మాట.
****
రాఘవ గారు,
వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!
*****
మనోహర్ గారు,
భాస్కర రామిరెడ్డి అన్నట్లు, రాఘవ గారు అన్నట్లు శూన్యం, అనంతం ల మధ్య వ్యత్యాసాన్ని పట్టించుకోవనవసరం లేదు. పిల్లలకి Real Numbers చెప్పేటప్పుడు – 1 to – infinite లని నెగిటివ్ ఇంటీజర్స్ అనీ, 1 to +infinite లని పాజిటివ్ ఇంటీజర్స్ అనీ చెబుతుంటాం. భగవంతుడు నెగిటివ్ గానూ పాజిటివ్ గానూ ఉండడు గదా! సద్గుణాలని పాజిటివ్ గుణాలు గానూ, దుర్గుణాలని నెగిటివ్ గుణాలు గానూ పెద్దలు చెబుతారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో, గుణత్రయ విభాగ యోగంలో, సత్త్వరజస్తమో గుణాలని వివరిస్తూ, ఏ గుణమైనా మానవుని బద్దుని చేస్తుంది గనుక, అర్జునుణ్ణి గుణాతీతుడివి కమ్మంటాడు. సున్నాకి –0 గానీ +0 గానీ లేనందునా, తెలుగు ఛందస్సులో ’సున్న’ని పూర్ణానుస్వారమనీ, ’అర సున్నా’ని అర్థపూర్ణానుస్వారమనీ అన్నందునా, నేను ఈశావాస్యోపనిషత్తు శాంతి మంత్రంలోని ’పూర్ణం’ని సున్నగానూ, భగవంతుడి గానూ భావించాను.
అంతమాత్రం చేత మీ ఆలోచన తప్పని ఆనను. ఎందుకంటే – ధీసిస్ నుండి యాంటీ ధీసిస్, దానికి మళ్ళా ప్రతివాదం పుడుతుంది అంటాడు హెగెల్. ఆలోచన నుండి మరో ఆలోచన, దాని నుండి మరొక ఆలోచన పుడుతుందంటారు మన పెద్దలు. ఆలోచించటం అంటేనే అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటం. అర్ధం చేసుకునే కొద్దీ సాధన చేయటం ప్రారంభిస్తాం. ఆలోచించటం, అర్ధం చేసుకోవటం, సాధన చేయటం లోని నిబద్దతకే, నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. అంచేత మీ ఆలోచన, సాధన అనుశృతంగా సాగాలని కోరుకుంటాను. అభినందనలు.
***
అజ్ఞాత గారు,
అనువాదంలో పొరపాటు జరిగింది. సరిదిద్దాను. నెనర్లు!
మీ మాటలు చదువుతుంటే , చిన్నపుడు సున్న గురించి ఎకడో విన్న మాటలు గుర్తొస్తున్నాయి. (ప్రపంచంలో సున్న ఒక్కటే రెండు అనంతాలను సృష్టిస్తుందట, అపరిమితమైన జ్ఞానం కలిగిన జీవాత్మ లోపలి అనంతం కాగా,అపరిమితమైన పరమాత్మ వెలుపలి అనంతం అట, దేహం విడదీసే సున్నా అట.)
నేర్చుకోవడం గురించి మీరన్న మాట మాలాంటి వాళ్ళకి శిరో ధార్యం, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ఆయన ఉపన్యాసాలలో ఒక్కసారి నేర్చుకోవడం మొదలుపెట్టి చూడూ ఆ తర్వాత ప్రకృతే నువ్వు ఏం నేర్చుకోవాలో ,ఎలా నేర్చుకోవాలో చెప్తుంది. కానీ కావాల్సిందల్లా నేర్చుకోవాలనే నిర్మలమైన మనస్సు అనేవారు. సరిగా మీరు అదే అన్నరు.
మనోహర్ గారు,
>>>బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ఆయన ఉపన్యాసాలలో ఒక్కసారి నేర్చుకోవడం మొదలుపెట్టి చూడూ ఆ తర్వాత ప్రకృతే నువ్వు ఏం నేర్చుకోవాలో ,ఎలా నేర్చుకోవాలో చెప్తుంది. కానీ కావాల్సిందల్లా నేర్చుకోవాలనే నిర్మలమైన మనస్సు అనేవారు.
ఇది పరమ సత్యం.
http://www.gap-system.org/~history/HistTopics/Bakhshali_manuscript.html
Equations are given with a large dot representing the unknown. A confusing aspect of Indian mathematics is that this notation was also often used to denote zero, and sometimes this same notation for both zero and the unknown are used in the same document. Here is an example of an equation as it appears in the Bakhshali manuscript.
Thought, the given piece of info from the above link adds a point to the views presented in this blog post and the following comments.
Post a Comment