ఒకపని జరిగిందంటే, దాన్ని నిర్వహించిన వాళ్ళు ఉండాలి కదా! ఒక కర్మ జరిగిందంటే దానికి కర్త ఉండి తీరాలి! ఎందుకంటే – ఒక నిర్మాణం జరిగిందంటే, దాని నిర్మాత ఖచ్చితంగా ఉండి తీరాలి కాబట్టి. ఆ నిర్మాత ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు. ఆ వ్యవస్థ ‘మనకి తెలిసిందేనా, కాదా’ అన్నది వేరే విషయం. మనకి తెలియనంత మాత్రాన అది నిజం కాదు అనలేం కదా? ఎందుకంటే, భూమ్యాకర్షణ శక్తి గురించి న్యూటన్ చెప్పకముందు నుండీ భూమికి ఆకర్షణ శక్తి ఉండటం సత్యం. దాన్ని తర్వాతే మనం తెలుసుకున్నాం. అంతే!
అదే విధంగా, మూడున్నర శతాబ్ధాల తరబడి, వంశపారంపర్యంగా, హిందూమతంపైన, భారతీయుల దృక్పధంపైనా, ప్రపంచవ్యాప్తంగా ప్రజా దృక్పధంపైనా, మొత్తంగా మానవత్వంపైనా కుట్రలు జరపటం సత్యం. ఈ కుట్రలకు కర్తలైన అనువంశికులనే, నేను, ‘నకిలీ కణికులు’గా ఉటంకించాను. దానిలో భాగంగానే నెం.10 వర్గాన్ని చెప్పాను. అలాగే, 17 ఏళ్ళుగా, ఈ నకిలీ కణిక వ్యవస్థ జరుపుతున్న, జరిపిన కుట్రలనీ, ఆ వ్యవస్థలోని కీలక వ్యక్తుల అస్తిత్వాన్ని, స్వభావాలని, పనితీరులని ప్రపంచానికి బహిరంగ పరచటం అన్న ’కర్మ’ కూడా సత్యం! దీని కర్తలనే నేను ‘నెం.5 వర్గం’గా ఉటంకించాను.
1992 లో, నేను పీవీజీకి రామోజీరావు కార్యకలాపాలని గురించి ఫిర్యాదు చేసిన తర్వాత, PMO లోని OSD ఖండేకర్ వంటి వారు, నా ఫ్యాక్టరీకి వచ్చిన ఐబి అధికారులూ వంటి సంఘటనలతో, ’నా ఫిర్యాదు పీవీజీకి అందింది’ అన్న విషయం నాకు రూఢి అయ్యింది. ఆ తదుపరి కొద్దిరోజులకే అప్పటి కేంద్ర హోంమంత్రి ఎస్.బి.చవాన్ [మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తండ్రి], ’మనదేశంలోని పత్రికాధిపతులలో సి.ఐ.ఏ. ఏజంట్లున్నారు’ అని ప్రకటించారు. ఇది పత్రికలలో వచ్చింది. దాని మీద ఏ పార్టీగానీ, ఏ ప్రముఖ వ్యక్తులు గానీ, ఎవరూ గొడవ చేయలేదు. కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. బయటికి తీయమని సవాళ్ళు కూడా విసరలేదు.
అప్పుడూ ఇలాగే, జరిగిన, జరుగుతున్న ప్రతీ అంశాన్నీ, వార్తల్నీ నిశితంగా పరిశీలించేవాళ్ళం. అప్పుడు మా పరిశీలనకి వచ్చిన చాలా విషయాలని మేమసలు నమ్మలేకపోయాము. అప్పటికి అవి మాకు ’స్టేట్ మెంట్లు’ వంటివే! వీటన్నిటిని ప్రభుత్వం ఎలా బహిర్గతం చేస్తుందో అర్ధం అయ్యేది కాదు. అదే ఇన్నేళ్ళ తర్వాత, మరోసారి పరిశీలిస్తే…..అప్పుడు కేవలం మా పరిశీలనలో మిగిలిన స్టేట్ మెంట్లు, ఇప్పుడు ప్రజలందరికీ బహిరంగమై, సంఘటనాత్మకంగా నిలిచాయి.
అప్పుడు, ఎవరు ఎవరికి చెప్పినా నమ్మని విషయాలు, ఇప్పుడు ఎవరూ ఎవరికీ చెప్పనవసరం లేకుండానే, అందరికీ అర్ధమయ్యేటంతగా బహిర్గతమయ్యింది. ఎక్కడా, ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయలేదు. కాని, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ, మొత్తంగా వ్యవస్థలోని అవినీతిని, రహస్యాలను బహిర్గతం చేసుకున్నారు. [అద్వానీ Vs జశ్వంత్ సింగ్ లాగా అన్నమాట!] అలాగే, ఇప్పుడు నేను చెబితే మీరు నమ్మలేకపోతున్న, కొంత మేరకే నమ్మగలుగుతున్న, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుల గురించీ, నెం.5 వర్గం గురించీ, మరికొంతకాలం గడిస్తే, ఎవరూ ఎవరికీ చెప్పనవసరం లేనంతగా బహిర్గతం కావచ్చు. కాలం ఇప్పటికి కొన్ని పరిష్కరించిది. అలాగే మిగతావి కూడా పరిష్కరించవచ్చు. కాలాన్ని మనం శాసించలేం కదా!
మరోమాట! వ్యక్తి కంటే, వ్యక్తిగత భావోద్వేగాల కంటే, వ్యక్తికీర్తి ప్రతిష్ఠల కంటే కూడా ’కర్తవ్య నిర్వహణ’ అన్నది ఉతృష్టమైనది. వ్యక్తి కంటే కూడా ‘కర్మ’ గొప్పదిగా భావించటం చేతనే భారతదేశం పుణ్యభూమి అయ్యింది, కర్మభూమి అయ్యింది.
సాక్షాత్తూ విష్ణువు ప్రహ్లాదుడి కోసం నృసింహావతారం ఎత్తి, హిరణ్యకశపుని సంహరించిన అనంతరం, ఉగ్రనరసింహుడు ప్రసన్న నరసింహుడైన తర్వాత, ప్రహ్లాదుడు తనకు మోక్షం అనుగ్రహించమని అడుగుతాడు. భగవంతుడి సాక్షాత్కారం తర్వాత సైతం, అదీ ఆ భక్తుడి కోసమే అవతారం దాల్చిన భగవానుడి దర్శనం తర్వాత సైతం, భగవంతుడు ప్రహ్లాదుడికి మోక్షసిద్ధి నివ్వడు.
"నాయనా! భూమ్మీద నీ కర్తవ్యం నిర్వహించు. నీ ధర్మాన్ని పాటించు. ప్రజలంతా తమ ధర్మాన్ని పాటించేటట్లు చెయ్యి. ధర్మ పునఃప్రతిష్ఠ తర్వాత నీకు మోక్షసిద్ధి కలుగుతుంది” అంటాడు.
అదీ! మన పురాణాలు మనకి కర్తవ్య బోధ చేసే తీరు! ఇక్కడ కర్మ,[కర్తవ్యం లేదా ధర్మం] కి తప్ప, వ్యక్తికి ప్రాధాన్యత లేదు. ఆచార్య సి.రాజగోపాలాచారి, భగవద్గీత గురించి చెబుతూ, “ప్రతి మనిషీ తన కర్తవ్యం తను నిర్వహించి కిక్కుర మనకుండా ఈ లోకం నుండి నిష్ర్కమించాలి” అంటారు.
ఈ విషయాన్నే ఉపనిషత్తులూ చెబుతాయి. ముఖ్యంగా ఈశావాస్యోపనిషత్తు…..అద్భుతంగా, అందంగా కవితాత్మకంగా చెబుతుంది. ఉపనిషత్తులలో ఋషులు, భగవంతుణ్ణి, తమని చీకటికి ఆవలివైపుకు తీసుకు వెళ్ళమని ప్రార్దిస్తారు. చీకటి నుండి వెలుగులోకి, అజ్ఞానం నుండి జ్ఞానంలోకి, మృత్యువు నుండి అమరత్వానికి! దీనినే బృహదారణ్యక ఉపనిషత్తులోని అభ్యారోహ మంత్రం మనకి
అసతోమా సద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోమా అమృతంగ మయా
ఓం శాంతి శాంతిః శాంతిః
అని చెబుతుంది.
ఈశావాస్యోపనిషత్తులో ఋషి ,
శ్లోకం:
హిరణ్మయేన పాత్రేణసత్యస్యాపిహితం ముఖమ్
తత్ త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే
భావం:
’సత్యం యొక్క ముఖం స్వర్ణమయమైన తెరతో [వెలుగుతో] కప్పబడి ఉంది. ఓ సూర్యదేవా![ఓ భగవంతుడా!] సత్యనిష్టుడనైన నేను, ఆ సత్యాన్ని దర్శించడానికి తెరను తొలగించు’ అని ప్రార్ధిస్తాడు.
సత్యాన్వేషియైన ఉపనిషత్ ఋషి , ముందుగా తనను చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్ళమని భగవంతుణ్ణి ప్రార్ధించాడు. తర్వాత వెలుగుకు కూడా ఆవలివైపుకు తీసుకువెళ్ళమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తాడు.
ఎందుకంటే ’సత్యం’ వెలుగు చీకటి అనే ద్వంద్వాలకి కూడా అతీతమైనది.
తదుపరి శ్లోకాలు చూడండి.
పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ
తేజో యత్ తే రూపం కల్యాణతమం తత్ తే పశ్యామి
యో౨ సావసౌ పురుషః సో౨ హమస్మి
భావం:
సకల జీవరాసులనూ పోషించి కాపాడేవాడవు, ఒంటరిగా పయనించేవాడవు, అన్నింటినీ పరిపాలించే వాడవయిన ఓ సూర్యదేవా! ప్రజాపతి కుమారుడా! నీ కిరణాలను ఉపసంహరించుకో. నీ దివ్య తేజస్సును కుదించుకో. మహిమాన్వితమైన నీ స్వరూపాన్ని నీ కృపాకటాక్షంతో నేను దర్శించాలి. ఆ సూర్యనిలో నెలకొని ఉన్నది ’నేనే’. [తనలోని ఆత్మతత్త్వమే సూర్యభగవానుడిలోనూ విరాజిల్లుతున్నదని గ్రహించడం].
శ్లోకం:
వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్ం శరీరమ్
ఓం ఓం ఓం క్రతో స్మర కృతగ్ం స్మర క్రతో స్మర కృతగ్ం స్మర
భావం:
ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది. ఈ శరీరం నుండి వెలువడే ప్రాణం, సర్వవ్యాపియైన మరణం లేని ప్రాణంతో కలిసిపోతుంది. ఓ మనసా! చేసిన వాటిని చింతన చేసి చూడు, మనసా చేసిన వాటిని చింతన చేసి చూడు.
[ఉపనిషత్తు ఋషి చరమస్థితి అనుభూతిని పొందిన తరువాత కారుణ్య దృక్కులతో ఈ లోకాన్ని వీక్షిస్తాడు. ఈ లోకమనే మాయ వలలో చిక్కుకుని మానవులు అనుభవించే బాధలు ఆయన కళ్ళకు కనిపిస్తున్నాయి. అందువల్ల వారినందరినీ ఆహ్వానించి జీవితం గురించి ఒక్కసారి చింతన చేయమని చెబుతారు.
చీకటికీ, వెలుగుకీ కూడా ఆవల ఉన్న పరమసత్యాన్ని తెలుసుకున్న తరువాత సైతం, ఋషి లోకంలోని మానవుల బాధలు తొలగించటానికి ప్రయత్నించటమే ఇక్కడ విషయం.]
శ్లోకం:
అగ్నేనయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ
భావం:
ఓ అగ్నిదేవా, తేజోస్వరూపుడా! మా సకల కార్యాలూ నీకు ఎరుకే; ప్రారబ్ధాన్ని అనుభవించడానికైన మమ్ము అనుభవమార్గంలో తోడ్కొని వెళ్ళు. మమ్ములను ఘోరమైన తప్పుల నుండి వైదొలగచేయి. నీకు పదేపదే మా నమస్కారాలు.
[తమని అనుభవ మార్గంలో తోడ్కొని వెళ్ళమని ప్రార్ధిస్తున్నాడు ఋషి, అనుభవమార్గం అంటే ఏమిటి?
పనులు ఫలితాన్నిస్తాయి. మంచి పనులు మంచి ఫలితాన్ని, చెడ్డపనులు చెడు ఫలితాన్ని ఇస్తాయి. అలా వచ్చిన ఫలితాలను అనుభవించి తీరవలసిందే. “ఇంత వరకు చేసిన పనుల గురించి ఎరిగిన భగవంతుడా! ఇక కొత్తపనులు చేసి ఫలితాలు రాకుండా, చేసిన వాటికి మాత్రం ఫలితాన్ని అనుభవించేటట్లు మా జీవితం ఉండనివ్వు” అన్నది ఉపదేశ భావం.
ఈ విధంగా భగవంతుని కృపాకటాక్షాన్ని ఆర్ధిస్తూ ప్రార్ధనాపూర్వకమైన జీవితాన్ని గడపాలనే సూచనతో ఈశావాస్యోపనిషత్తు సంపూర్ణమవుతుంది.]
ఈ విధంగా ఉపనిషత్తులు సైతం కర్మ, కర్మ ఫలితాల గురించి చర్చిస్తాయి.
మంచిపనులు మంచి ఫలితాన్ని, చెడు పనులు చెడుఫలితాన్ని ఇస్తాయి. అందుకే గీతలో భగవంతుడు కర్మ ఫలాన్ని ఆశించకుండా, ఏది తన ధర్మమో ఆ పనిని నిర్వర్తించమని చెబుతాడు. కర్మఫలాన్ని భగవంతుడికి విడిచిపెట్టి కర్మ చేయటం అంటే, తాను హత్య చేసి, శిక్ష శ్రీకృష్ణుడికి వేయమని వాదించటం కాదు. ఇలాంటి జోకులూ, సినిమాలూ నకిలీ కణిక వ్యవస్థ సృష్టించినవే. ఆమధ్య వచ్చిన అమితాబ్ బచ్చన్, నందితాదాస్, మనోజ్ బాజ్ పాయ్ నటించిన ‘AKS’ సినిమాలాగా అన్నమాట.
కర్మఫల త్యాగమంటే అది కాదు. ఏది మన విద్యుక్తధర్మమో, దాన్ని ఫలాపేక్షరహితంగా నిర్వహించటం. ‘ఏది ఇతరులు మనకి చేస్తే మనకి బాధ, కష్టం కలుగుతాయో, అది మనం ఇతరులకు చేయకపోవటం పరమధర్మం’ అని పెద్దలంటారు. ఏది చేయదగిన పని, ఏది చేయకూడని పని అన్నది అంతరాత్మ చెబుతుంది. తల్లిదండ్రులు, గురువులూ చిన్నప్పటి నుండి కొంత నేర్పుతారు. పెద్దలు చెపుతారు. ప్రాచీన కాలం నుండి పెద్దలు, అనుభవంతో, సాధనతో, తాము తెలుసుకున్న సత్యాలను, మనకోసం పొందుపరచి, హిందూమతంగా, హిందూ ధర్మంగా, హిందూ జీవన విధానంగా, భారతీయ సంస్కృతిగా, ఇతిహాసాలుగా, ఉపనిషత్తులుగా, వేదాలుగా, గీతగా అందించారు. వివేచిస్తే మన కర్తవ్యం ఏమిటో, మన ధర్మం ఏమిటో, మనకి బాగానే అర్ధమౌతుంది. [ఆచారించాలంటేనే నొప్పి వేస్తుంది. ప్రక్కదారి సౌఖ్యం అన్పిస్తుంది. విషయమేమిటంటే, చాలా ఎక్కువ మందికి, ఆ ‘ప్రక్కదారి’ సౌఖ్యం అన్పించబట్టే, ఈ రోజు మన సమాజం పతనావస్థకు దగ్గరౌతుంది.]
కర్మగురించి భగవద్గీత మనకి నేర్పే సాధన ఇదే!
మోక్షం కోసం అన్నిటినీ సన్యసిస్తూ సాధన చేసిన యోగికి, చివరికి మోక్షాన్ని కూడా సన్యసించమని చెబుతుంది మోక్ష సన్యాస యోగం. మోక్షం అన్నది ఇహానికి దూరంగా ఎక్కడో లేదనీ చెబుతోంది.
కాబట్టే – కర్మఫలమూ, కర్తృత్వాహంకారమూ వదలి కర్మల నాచరించమని చెబుతుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలతో, కర్మఫలాన్ని విడిచిపెట్టి, ‘ఈ కర్మని నేనే నిర్వహించాను’ అన్న అహంకారాన్ని విడిచి పెట్టి, కర్మని నిర్వహించమని చెబుతుంది.
దీన్ని తూచా తప్పకుండా ఆచరించిన నిజమైన స్థితప్రజ్ఞుడు పీవీ నరసింహారావు. తాను ప్రారంభించిన ఈ పని,[నకిలీ కణిక వ్యవస్థనీ, నెం.10 వర్గాన్ని, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు గట్రాలని, వారి స్వభావాలూ, పనితీరుతో సహా బహిరంగపరచటం అనే ఈ పని] తన మరణానంతరం ఎలా పూర్తి చేయబడుతుందో, ఏదైనా అపశృతులు పడతాయోమోనన్న సంశయంగానీ, ఫలితాన్ని తాను పొందాలన్న ఆశగానీ లేదు. ’తనపని’ అనుకున్నదాన్ని, తాను చేసి, కిక్కురమనకుండా నిష్ర్కమించారు. ‘ఈ పని చేసింది తానేనన్న కీర్తి’ తనకు రావాలని కూడా అనుకోకపోవటం కంటే – కర్మఫల త్యాగం, కర్తృత్వాహంకారం లేకపోవటం ఇంకేముంటుంది?
మనం ఓ ఖరీదైన గాజుగ్లాసుని, చిన్నపిల్లాడికి ఇచ్చి, బల్లమీద పెట్టమని చెప్పామనుకొండి. వాడు దాన్ని తీసికెళ్ళి పెట్టేలోగా మనకి టెన్షన్ ఉంటుంది. ’వాడు దాన్ని సరిగ్గా హేండిల్ చేస్తాడో లేదో, బల్లమీద గ్లాసు పెట్టబోయి జారవిడుస్తాడేమో, గ్లాసు కాస్తా పగిలి కూర్చుంటుంది’ అని ఒకటే హైరానా పడిపోతాం. ’పగిలితే మహా ఏమౌతుంది? కాస్త డబ్బు నష్టమౌతుంది. అంతే కదా?’ అనుకోలేం. అటువంటిది – ఇంత పెద్ద పని, ఇంత పెద్దవిషయాన్ని గురించి, ఎంతో మామూలుగా, ’ఇంత వరకూ నా పని! నా చేత ఈ పని చేయించిన భగవంతుడే, సమీకరించబడిన నెం.5 వర్గంలోని మిగిలిన సభ్యులచేత కూడా చేయిస్తాడు. ఇది భగవంతుడి పని. నాకు చెప్పింది నేను చేసి పోతాను. భగవంతుడి చేతిలో ప్రతీవాడు ఒక ఉపకరణం అయినట్లే, నేనో ఉపకరణాన్ని’ అనుకుని, తన ధర్మం తను నిర్వహించి నిష్ర్కమించటం అంటే – కర్మ నిర్వహించటంలో నిబద్దత తప్పితే కర్మఫలితం మీద ఆసక్తి లేకపోవటమే కదా?
గీతలోని జ్ఞానయోగంలో శ్లోకం:
యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః
భావం:
ఎవడు ఫలాపేక్షారహితుడో, కర్తృత్వాహంకారాన్ని జ్ఞానాగ్నిచే భస్మం చేస్తాడో, వాడే పండితుడు.
అని చెబుతుంది. ఈ దృష్ట్యా చూసినా పీవీజీ నిజమైన పండితుడు.
ఈ పని చేసిన కీర్తి తనకు కావాలని గానీ, ఫలితాన్ని తాను పొందాలని గానీ అనుకుంటే, తాను పదవిలో ఉండగానే ఇది పూర్తి అయ్యోలా చూసుకుని ఉండేవాడు. లేదూ తను జీవించి ఉండగానే పూర్తి అయ్యేలా డిజైన్ చేసుకుని ఉండేవాడు.
కానీ తనకంటే పని[కర్మ] గొప్పది. అది ఎంత సమయం తీసుకుంటే సత్ ఫలితం వస్తుందో, జగత్తుకు మేలు కలుగుతుందో, అంత సమయం ఇవ్వాల్సిందే! అదీ ఆ స్థితప్రజ్ఞుని త్యాగనిరతి! తన మరణానంతరం, తన ప్రార్ధవ శరీరం మీద కూడా స్ట్రాటజీ నడుస్తుందనీ, భౌతిక దేహానికి అవమానాలు ఎదురౌతాయనీ ఊహించలేనివాడు కాదు. అయినా అదీ పట్టలేదంటే ఆ ధీరుడి నిబద్దత ఎంతటిదో అర్ధంచేసుకోవలసిందే!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
Excellent. మీ లాంటి మేధావులకు నా లాంటి వారు కాంప్లిమెంట్ ఇచ్చె స్థాయి ఉందని అనుకోను. కాని మీరు చాలా బాగా విశ్లేషించారు.
కర్తవ్య నిర్వహణ గురించి చాలా బాగా వివరించారు. నిజంగా అద్భుతం.
అత్యద్భుతంగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
అజ్ఞాత గారు, జయ గారు, వేదుల బాలకృష్ణమూర్తి గారు,
వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు![నిజానికి ఈ సమాధానం చాలా పొడిగా ఉన్నట్లు అన్పిస్తుందండి. ఇంకేమనాలో తెలియటం లేదు! అర్ధంచేసుకోగలరు.]
Post a Comment