’ధర్మో రక్షతి రక్షితః’ అంటారు పెద్దలు. ’ధర్మాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది’ అని దాని అర్ధం.
అయితే…. ‘ధర్మం, నీతి, న్యాయం, ఇలాంటి మాటలు బ్రతక చేతగాని వాడు చెబుతాడనీ’, ‘నీతి ధర్మం గట్రా మాటలు వినడానికి మాత్రమే బాగుంటాయి. అవి ఆచరించిన వాడు మట్టిగొట్టుకుపోతాడని’…. ఇలాంటి భావాలు సినిమాలు, మీడియా చెప్పగా….. యదార్ధంలో కూడా నీతి, ధర్మం అన్నవాడు ’పాపం మంచి వాడు’ అని అందరి చేత జాలిగా అన్పించుకుని, ఆర్ధికంగా అణగారిపోయాడు. నీతి ధర్మం మరచినవాడు బ్రతకనేర్చినవాడై డబ్బు సంపాదించగలిగాడు. ఇప్పుడు ఈ స్థితి Extreme అంటే ఉగ్ర స్థితికి వచ్చింది. [ఇప్పటికి ఇదే ఉగ్రస్థితి అనుకుంటున్నాను] ఇదలా ఉంచండి.
గణిత శాస్త్రంలో ప్రవచనాలు [Statements] లో చెప్పినట్లు ‘ధర్మాన్ని రక్షించు అది నిన్ను రక్షిస్తుంది’ కి విపర్యయం [Negation Statement] చెబితే ‘ధర్మాన్ని రక్షించకపోతే అది నిన్ను రక్షించదు’.
ఇప్పుడు మన సమాజంలో ఉన్న స్థితి ఇదే! వరదలొచ్చినప్పుడు గానీ, కరువొచ్చినప్పుడుగానీ, వంతెనలు కూలినప్పుడు గానీ…. మరే సందర్భంలో గానీ….70 MM లో కనిపిస్తోంది ఇదే! మచ్చుకి ఒకటి.
అటవీ శాఖ వారి స్లోగన్ ’వృక్షో వృక్షతి వక్షతః’. అంటే చెట్టును రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అని అర్ధం. ఒకప్పుడు మన పూర్వీకులు ప్రతి చెట్టుని, ప్రతి మొక్కని ఏదో ఒకపేరుతో పూజించేవాళ్ళు. తెల్లవాడు మనందేశంలోకి అడుగుపెట్టిన తరువాత వేపచెట్టును దైవత్వంగా భావించి పూజించటాన్ని, రకరకాల చెట్లను, మొక్కలను పూజించటాన్ని అవహేళన చేయటం, అంతర్జాతీయంగా భారతీయులనీ ఆత్మన్యూనత పరచటం చేసాడు. తరువాత అందరు డబ్బు వెంట పరుగుపెట్టి, ఇప్పుడు దాదాపుగా పేదవాడి దగ్గర నుండి ధనవంతుడి వరకూ ఇంట్లో చెట్టు అన్నది లేకుండా చేసుకున్నారు. ఆ విధంగా స్వచ్ఛమైన గాలిని, భూగర్భ నీటి నిల్వ సామర్ధ్యాన్ని తగ్గించుకొని బాధలు పడుతున్నారు.
హిందువులు ప్రతి చెట్టుకీ, పుట్టకీ మొక్కు తారనీ, పూజలు చేస్తారనీ, ప్రపంచ దేశాలన్నీ పరిహాసం చేసాయని, చేస్తున్నాయనీ ఒకప్పుడు మీడియా తెగ ప్రచారించింది. నిజంగానే హిందువులు ప్రతీ చెట్టునీ, పుట్టనీ పూజిస్తారు. వేపచెట్టు గౌరీ దేవి రూపం. లంకలో శింశుపా వృక్షం క్రింద సీతమ్మ దుఃఖంతో శ్రీరామని కోసం ఎదురు చూసింది. దూర్వార పత్రం గణేశుడి కిష్టం. బిల్వపత్రం ఈశ్వరునికిష్టం. తులసి తల్లి లక్ష్మీదేవి రూపం, విష్ణువుకిష్టం. పిప్పల వృక్షం పెద్దలకిష్టం. శమీ వృక్షం మీద పాండవులు తమ ఆయుధాలు దాచారు. ఇలా…. ప్రతీ చెట్టుకీ, పుట్టకీ దానిదైన ఓ ప్రత్యేకత ఉంది. దైవత్వం ఉంది. అదీగాక ప్రతీ చెట్టుకీ పుట్టకీ మొక్కితే తప్పేమిటి?
అవును! మనం వేపచెట్టు కన్పిస్తే పసుపు పూసి బొట్టుపెట్టి పచ్చనిదారంతో చుట్టి పూజిస్తాం. ప్రకృతిలోని ప్రతి వస్తువునీ పూజించటం ద్వారా అహాన్ని దాట ప్రయత్నిస్తాం. పర్యావరణాన్ని కాపాడతాం. ప్రతి పాణిలోనూ దేవుణ్ణి చూడ ప్రయత్నిస్తాం. ‘తనని అన్ని భూతముల యందు, అన్ని భూతములనూ తన యందునూ, చూడమంటాడు’ శ్రీకృష్ణుడు గీతలో. సర్వాప్రాణులలో సృష్టికర్తయైన భగవంతుణ్ణి చూడగలగటం ఉతృష్ట భావన.
కాబట్టే హిందూమతం ’ఒక మతం కాదు, జీవన విధానం’ అంటారు. మతం కంటే కూడా ఉచ్ఛస్థితి, మతమే జీవన విధానంగా పరిణామం చెందటం! పరిశీలించి చూడండి. కొన్ని మతాలు, వారంలో ఒకరోజు ప్రార్ధనా మందిరానికి వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్ధించాలని చెబుతుండగా, హిందూ మతం ఉచ్ఛాస నిశ్వాసాలెంతో అంతగా – ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థల యందూ భగవన్నామస్మరణం చేయమంటుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలతో, కర్మఫలాసక్తినీ, కర్తృత్వాహంకారాన్ని వదిలి తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చటమే భగవత్సేవ అంటుంది.
కాబట్టి ప్రతి చెట్టులోనూ, పుట్టలోనూ కూడా భగవంతుణ్ణి దర్శిస్తాం. ఈ విధమైన దృక్పధాన్ని నాశనం చేసి, “చెట్టుకు పూజలు చేయటం ట్రాష్!” అంటూ ఫ్యాషన్ల సొల్లు కబుర్లు చెప్పి, ’పచ్చని చెట్టుని కొట్టేస్తే, పచ్చని సంసారం కూడా చెట్టుకూలినట్లే కూలిపోతుంది’ అనే సెంటిమెంట్లని ఫూలిష్ అనేసి….. ఇప్పుడు ప్యాకింగ్ మార్చేసి, తీరిగ్గా…. ఎన్ని ’చిప్ కో’ ఉద్యమాలు నడిపిస్తే, ఎన్ని చెట్లకు రాఖీలు కడితే….. చెట్లు రక్షింపబడతాయి?
అడవులని నరికి తినేస్తున్నారని మన అందరికీ తెలుసు. అటవీ శాఖ ఉద్యోగులకి అందులో పెద్దపాత్రనీ తెలుసు. చెట్లు కొట్టుకొని చేసే కలప వ్యాపారంలో, మంత్రుల స్థాయి నుండి ఉన్నతోద్యోగుల దాకా, ఫారెస్ట్ రేంజర్ల దగ్గర నుండీ గిరిజనుల దాకా, స్మగర్ల దగ్గర నుండి ఫర్నిచర్ షోరూంల యజమానుల దాకా, అందరి పాత్రలూ ఇతోధికంగా ఉన్నాయనీ తెలుసు.
అడవులకి దగ్గర్లో స్నేహితులు ఉంటే – “మాకు ఇక్కడ టేకు చౌక. కావాలంటే డబుల్ కాట్లు, డైనింగ్ టేబుళ్ళు చేయిద్దాం. చెక్ పోస్ట్ మానేజ్ చేసుకుంటే చాలు. ఏమంటావ్?" అంటారంటే – “అయ్యో అలాంటి స్నేహితులు మనకు లేరే! ఎవరి ద్వారానైనా ట్రై చేద్దాం” అనుకుంటాం. అటవీ శాఖలో ఉద్యోగం అంటే, పై డబ్బులిన్ని వస్తాయంటే – అలాంటి ఉద్యోగం కోసం, లక్షల్లో లంచాలివ్వడానికి సిద్దపడతాం. నల్లమల అడవుల [5 జిల్లాలకు విస్తరించిన అడవి] మీద ఈ వ్యాపారం చేయని రాజకీయనాయకులు లేరంటే అతిశయోక్తి కాదేమో! ఆ విధంగా నల్లమల అడవులను అందరు కలిసి గుండు కొట్టారు!
మనం చేసే ఇన్ని పనులలో అడవి దుంపనాశనం అయిపోతున్నదని తెలిసినా ’ఆఁ అందరూ చేస్తున్నారు. మనం చేస్తే తప్పేమిటి?’ అనుకుంటాం లేదా ’మనం ఒక్కరం మడిగట్టుకు కూర్చుంటే అడవి పచ్చగా ఉంటుందా ఏమిటి?’ అనుకుంటూ, ఎంచక్కా ఆత్మవంచన చేసుకుంటాం.
ఆ విధంగా వృక్షో రక్షితి రక్షితః అన్నది మరిచిపోయాం మనం. అలాంటప్పుడు కరువు కాటకాలు, వరదలు కాక ఇంకే ఫలితం ఉంటుంది మనకి?
ఈ విధంగా అడవి పట్ల మన ధర్మాన్ని మనం రక్షించలేదు. అందుకే అది మనల్ని రక్షించటం లేదు!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~~~
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
8 comments:
మీరు చెప్పింది అక్షర సత్యం.!
చాలా రోజుల తర్వాత వ్యాఖ్య వ్రాసారు, నెనర్లు!
16 సంవత్సరముల క్రితం మేము ఇళ్ళు కట్టుకున్నప్పుడు ఇంటి బయట చుట్టూ రహదారి కిరువైపులా దాదాపు 14 వే్ప,కానుగ,జువ్వి చెట్లు నాటాను. వాటిని మొక్కలనుంచి వృక్షాలుగా మార్చడానికి నేనుపడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు.పశువులు తోలుకుపోయేవాడితోనూ,మేకలు తో్లుకుపోయేవాడితో్నూ ప్రతి రోజూ పోట్లాటే.రోడ్డు నీదా? రోడ్డులో ఎవరు నాటమన్నారంటూ.ఇలా ఉంది మన ప్రజల వృక్షో రక్షితి రక్షితః
నిజమండీ. ధర్మాన్ని మనం త్యజించేస్తూ.. దూరం పోయి, కష్టాలు వచ్చినపుడు ధర్మాన్ని నిలదీస్తే ఎలా ? సునామీ సమయంలో కూడా మాంగ్రోవ్స్ తాలూకూ ప్రాముఖ్యతను ప్రాక్టికల్ గా తెలుసుకుని కూడా, వాట్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మంచి విషయాన్ని రాసారు. సస్టైనబుల్ డెవెలప్మెంట్ అనే భావన ని మర్చిపోతే, నష్టం మనకే !
చిలమకూరు విజయమోహన్ గారు,
అయితే మీరూ మాలాగే పోట్లాడతారన్న మాట. ఇంతకీ చెట్లెలా ఉన్నాయో చెప్పారు కాదు!
*****
సుజాత గారు,
వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు! మీ పాప చక్కగా ఉందండి. మొన్న ఫోటో చూసాను.
5/5 with 95 grace marks.
బాగుంది చాలా బాగా చెప్పేరు. మనది, మన వాళ్ళు చెప్పిన పద్దతి అంటే చులకన... పక్క వాడు చెపితే కాని ఎక్కదు నేను మీ పోస్ట్ లన్ని చదువుతాను ఒక్కటైనా వదలకుండా, నాకు రాజకీయాలంటే పెద్ద అవగాహన వుండదు అందుకే కామెంటను, చాలా బాగా రాసేరు అనుకుంటా చదివిన ప్రతి సారి....చాలా మంచి విషయాలు మా అందరితో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు..
భావన గారు,
రాజకీయాలు మనకి అర్ధం కానంత జటిలమైనవి కావండీ! జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధమౌతాయి!వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!
Post a Comment