మరో విషయాన్ని స్పష్టీకరిస్తాను. ఇది, లోతుగా మనల్ని మనం పరిశీలించుకున్నా, మన చుట్టూ ఉన్న వారిలో పరిశీలించినా స్పష్టంగా గోచరించే యదార్ధం. అదేమిటంటే - అహంకారము, జ్ఞానము పరస్పర ద్వంద్వాలు. అవి విలోమ సంబంధం ఉన్న జంట. అంటే ఒకటి పెరిగినప్పుడు రెండోది తరుగుతుందన్నమాట. జ్ఞానం పెరిగితే అహంకారం నశిస్తుంది. అహంకారం పెరిగితే జ్ఞానం లోపిస్తుంది. అందుకే జ్ఞానాన్ని దైవీయలక్షణం గానూ అహం భావాన్ని అసుర లక్షణం గానూ పెద్దలు పరిగణిస్తారు.
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు, సకల జగత్తులో జ్ఞానం అంత పవిత్ర వస్తువు మరేది లేదని, జ్ఞానిని భగవంతుడు, భగవంతుడిని జ్ఞాని దర్శించగలరని, జ్ఞాని భగవత్ స్వరూపుడని అంటాడు.
శ్లోకం:
తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే
ప్రియో హి జ్ఞానినో2త్యర్ధ మహం స చ మమ ప్రియఃII
భావం:
వీళ్ళు నలుగురిలో - జ్ఞాని, యెల్లప్పుడూ నాయందే మనస్సు నిలుపుకొని, ధ్యాన యోగంతో సేవిస్తాడు కనుక, అందరికంటే అతడే శ్రేష్ఠుడు. తనకు నేనూ, నాకూ తనూ మిక్కిలి యిష్టులం.
శ్లోకం:
ఉ దారా స్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్
ఆస్థిత స్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్II
భావం:
పై నలుగురు ఉత్తములే. కాని, జ్ఞాని మాత్రం నా ఆత్మ స్వరూపుడు. అన్ని విధాలా నన్నే పరాంగతిగా ఆశ్రయించుకొని ఉంటాడు.
మన సంస్కృత సారస్వతంలో.... వేదాలు, ఉపనిషత్తులు జ్ఞాన గనులు. కఠోపనిషత్తుకు, కేనోపనిషత్తుకు శాంతి మంత్రం అయిన, ఈ అందమైన, అర్ధవంతమైన, సత్య శోభితమైన క్రింది శ్లోకాన్ని ఒకసారి పఠించండి. హృదయరంజితమైన రాగంలో ఆలపించబడే ఈ మంత్రం, ఆత్మని తట్టి లేపి ఆనందలోకాల్లో విహరింపజేస్తుంది. విద్యాభ్యాసంలో భాగంగా గురుశిష్యులు ప్రారంభ పాఠంగా ఈ శ్లోకాన్ని పఠిస్తారు.
శ్లోకం:
ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం
కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః
భావం:
గురుశిష్యులమైన మన ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక! ఇద్దరినీ పోషించుగాక! ఇద్దరమూ ఊర్జితశక్తితో పరిశ్రమిద్దాం గాక! మన స్వాధ్యాయం ఏకాగ్రమూ ఫలవంతమూ అగుగాక! ఎన్నడూ మన మిద్దరమూ పరస్పరం ద్వేషించుకొనకుందాం గాక!
ఈ శ్లోక భావాన్ని లోతుగా ఆవలోకిస్తే.... గురుశిష్యులు ఏకకాలంలో ఏకకంఠంగా పఠించే ఈ శ్లోకం ఎంతో అర్ఠపూర్ణమైనది. గురువు శిష్యుడి మనస్సు నుండి అహాన్ని పారదోలి, అతడి మనస్సు జ్ఞానాన్ని గ్రహించి తనలో నిక్షిప్తం చేసుకునే విధంగా మలచ ప్రయత్నిస్తున్నప్పుడు, ఖచ్చితంగా ఆ శిష్యుడు, ఆ ప్రక్రియ పట్ల వికర్షితుడవుతాడు. గురువు పట్ల ద్వేష పూరితుడూ అవుతాడు. [కుక్షి నింపే అక్షర విద్య గురించి నేనిక్కడ ప్రస్తావించట్లేదు. అదైనా కూడా, ABCDలు నేర్పబోయే టీచర్ పట్ల నర్సరీ బుడ్డీ గాడికి మొదట కోపమూ, అలక వస్తాయి. వాడికి చాక్లెట్ లు ఇచ్చి, కథలు, కబుర్లు చెప్పి మచ్చిక చేసుకోవాల్సిందే.]
ఆ వికర్షణని, విద్వేషాన్ని కూడా దాటి, అరిషడ్వర్గాలనబడే ఆరుకంతలని పూడ్చినప్పుడే ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందగలడు. [కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అరిషడ్వర్గాలంటారు] శిష్యులు గానూ, గురువులు గానూ కూడా ఇది మా స్వానుభవం. నిశితంగా మన మనసు లోతులని పరిశీలించుకోగలిగితే, ప్రతీ వ్యక్తికీ అనుభవమయ్యే, అర్ధమయ్యే యదార్ధం ఇది.
ఒక బీరువాలో, చెత్తా చెదారం, పనికిరాని వస్తువులు, నిండుగా ఉన్నాయనుకొండి చెత్తబుట్టలో వేయాల్సిన పనికి రాని వస్తువులతో నిండిన ఆ బీరువాలో, మంచిపుస్తకాలు పెట్టేందుకు చోటు ఉండదు. అహం - జ్ఞానంల పరిస్థితి కూడా ఇదే! మన బుర్ర అనే బీరువాలో పనికిమాలిన చెత్తవంటి అహంకారంని తొలిగిస్తేనే.... జ్ఞానాన్ని, దాన్నుండి కలిగే ఆనందాన్ని బుర్రలో నింపుకోగలం.
ఎవరైనా ఒక వ్యక్తి.... గొప్ప జ్ఞానిగా కీర్తి పొంది, మరో వైపు చూస్తే మహా అహంకారి అయ్యుంటే, ఖచ్చితంగా అతడు నిజమైన జ్ఞాని కాడని, వట్టి ప్రచారం [build up] తప్ప అతడిది నిజమైన జ్ఞాని కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
గతంలో, అంటే వేల సంవత్సరాల క్రితం, భారతీయ గురుశిష్యులకి, విద్వాంసులకి, ఇప్పుడు మనం వాడుతున్న కలం కాగితాలు, కంప్యూటరు యంత్రాల వంటి పరికరాలు లేవు. తాటి ఆకుల మీద పక్షి ఈకలతో వ్రాసేవారు. అప్పటి విద్య మొత్తం మౌఖికంగా ఉండేది. వేల సంవత్సరాల పాటు, తరం నుండి తరానికి.... వేదాలు, కావ్యాలు, సాహిత్యం.... మౌఖిక అభ్యాసంతోనే బదలాయించబడింది. కొన్ని నమ్మకాలు సమాజాన్ని చీకటిలోకి లాక్కెళ్ళినా, వాటికి ఆవల, పరిణతి చెందిన పరిపూర్ణ ఆలోచనా విధానం, అప్పటి ఈశవిద్యలో గోచరిస్తుంది.
వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలతో ప్రేరేపింపబడిన మూఢాచారాలు, అంధ విశ్వాసాలలో యధార్ధంగా ఉన్నదెంతో, ప్రచారపు హోరు ఎంతో, ఇప్పుడు పరిశోధించలేం. తామే.... ప్రక్షిప్తాలనీ, ఉన్నవాటికి మరికొన్ని మూఢనమ్మకాలనీ ప్రవేశ పెట్టి, తామే మరింత అల్లరి చేయటం! ఓ ప్రక్క బాణామతి, దెయ్యాలు, ఆఘోరాల గురించి సినిమాలు, నవలలు ప్రచారిస్తూ మరో ప్రక్క విమర్శించినట్లు! సాంబారులో తానే బొద్దింక వేసి హోటల్ యజమానితో దెబ్బలాడే హాస్యనటుడి విన్యాసం కూడా నడిచిన చోట.... ఉన్నదెంతో, పెంచి పోషించింది ఎంతో ఇప్పుడెవరు చెప్పగలరు?
అదీగాక.... ఏ కాలంలో అయినా, ఏ సమాజంలో అయినా, మంచీ చెడూ రెండూ ఉంటాయి. కొన్ని అనుకూల అంశాలు, మరికొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉంటాయి. అది ప్రాచీన కాలమైనా, ఆధునిక కాలమైనా! సత్యమైనవీ, వ్యక్తి ఆత్మోన్నతికీ ప్రజాహితానికీ సమాజ శ్రేయస్సుకీ తోడ్పడేవి, అనుకూల అంశాలైతే.... అందుకు విపర్యయమైనవి ప్రతికూలాంశాలు. దేనిలోనైనా మంచి గ్రహించి, చెడుని విడిచిపెట్టడమే విజ్ఞత అంటారు పెద్దలు. కాబట్టి గతమంతా మంచీ కాదు, వర్తమానమంతా చెడూ కాదు. అలాగే తాత్కాలికంగా మంచిగా అన్పించి కాలగతిలో కీడు చేసే ఏ అంశమైనా ‘మంచి’ ఎప్పటికీ కాదు.
అలాంటిదే ప్రస్తుత విద్యావిధానం! ఇప్పుడు కూడా విద్యార్ధులు, నాటి గురుశిష్యుల మాదిరిగా మౌఖిక అభ్యాసం చేస్తున్నారు. వల్లెవేసి బట్టీ వేస్తున్నారు. కాకపోతే గ్రహిస్తున్న విద్య.... వరి బియ్యం కాదు, చిట్టూ తవుడు!
వివిధ దేశాల ఎగుమతి దిగుమతుల గురించీ, త్రికోణమితి గురించీ, మాత్రికలు గురించీ నేర్చినంత మాత్రాన, పిల్లల వ్యక్తిత్వం నిర్మాణం కాదు, స్పష్టమైన ధృక్పదమూ అలవడదు. నేటి అభివృద్ది చెందిన శాస్త్ర సాంకేతికతలూ, జీవ భౌతిక రసాయన శాస్త్రాలు, గణిత, కంప్యూటర్ శాస్త్రాలు సత్యం కాదని గానీ, విద్యార్ధులకి నిరూపయోగమని గానీ, నేను అనటం లేదు.
అయితే 13 ఏళ్ళ వయస్సులోపల పిల్లలకి, అవి పాఠ్యంశాలై, అభ్యాసనాంశాలై ఉండకూడదంటున్నాను. ప్రాధమిక విద్య, పిల్లల్లో ధృఢమైన, వారిదైన స్వంత వ్యక్తిత్వాన్ని, ధృక్పధాన్ని నిర్మించాలి. పిల్లలు మానవీయ విలువలని, తార్కిక ఆలోచనా శక్తిని, పరిశీలనని, జ్ఞానాసక్తినీ పొందాలి. ఇది జయప్రదంగా పూర్తయితే.... ఎంతటి క్లిష్టమైన శాస్త్ర, గణితాలనైనా వాళ్ళు ఆలవోకగా నేర్చుకుంటారు.
13 ఏళ్ళలోపు... ‘నేర్చుకునే తత్త్వాన్ని’ నేర్పితే.... ఆపైన దేన్నైనా ఇష్టంగా, కష్టం లేకుండా నేర్చుకుంటారు. కాబట్టి ముందుగా వాళ్ళలో సద్గుణాలని, పాజిటివ్ లక్షణాలని, పాజిటివ్ ఆలోచనా విధానాన్ని నేర్పాలి.
దీన్ని కథలూ, ఆటపాటలతో నేర్పవచ్చు. ఇతిహాసాలు, చారిత్రక వ్యక్తుల, మహానుభావుల జీవిత కథలు, పిల్లల్ని ఎంతో స్ఫూర్తివంతం చేస్తాయి. జీవితం పట్ల వాళ్ళకు తెలియకుండానే స్పష్టమైన అవగాహన కలుగుతుంది. జీవిత లక్ష్యాలు తమంతట తామే నిర్దేశించుకుంటారు. మార్గదర్శకత్వం గురువు [టీచర్] వహిస్తే చాలు, పిల్లలు అల్లుకుపోతారు. నిజానికి విద్యా వ్యవస్థ ఉండాల్సింది ఇలాగే!
కానీ ఇప్పుడేం జరుగుతోంది? ఒక్కసారి.... నాలుగైదు తరగతుల సాంఘీక శాస్త్రాన్ని చూడండి. గొప్ప వ్యక్తుల జీవితగాధలుండవు. ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఏ సంవత్సరాల్లో ఏం చదివి, ఏ పదవులు నిర్వహించారు, ఎప్పుడు మరణించారు గట్రా టాబ్యులర్ ఫామ్ వంటి వివరాలుంటాయి. అలాంటి గణాంక వివరాలు చదవటం వలన పిల్లల్లోనే కాదు, ఎవరిలోనూ.... ఉత్తేజంగానీ, స్పూర్తి గానీ కలగదు. కాబట్టే, పిల్లలు కూడా ఎంతో యాంత్రికంగా ఆ స్టాటిస్టిక్స్ ని తాత్కాలిక జ్ఞాపకంలో పెట్టుకుని, పరీక్షల్లో కక్కేసి, మార్కులొచ్చాక మరిచి పోతుంటారు. అంతే! స్ఫూర్తి పొందేందుకో, ఉత్తేజితులయ్యేందుకో అందులో ఒక్కటన్నా జీవిత సంఘటన ఉంటేగా!
మరో సజీవ ఉదాహరణ చెబుతాను. పంచతంత్రంలో అద్భుతమైన, అందమైన కథలున్నాయి. జీవిత సత్యాలున్నాయి. రాజనీతి దగ్గరి నుండి స్నేహపు తీరుల గురించి సైతం.... వ్యూహాలు, ఉపాయాలూ ఉన్నాయి. నిజానికి ఆ గ్రంధపు మరోపేరు సంపూర్ణ నీతి చంద్రిక. మూలగ్రంధంలోని ప్రతీ కథలో, జంతువులూ, పక్షులూ ప్రధాన పాత్రలై నడిపే సంభాషణల్లో.... ఎన్నో మానవీయ కోణాలు, నైతిక సూత్రాలూ, ప్రకృతి సిద్దమైన పోలికలతో, వర్ణనలతో వివరించబడ్డాయి.
నిజానికి మానవీయ విలువలనీ, వ్యవహార జ్ఞానాన్ని చర్చంచటానికి ఆ కథలు ఉద్దేశింపబడ్డాయి, మలచబడ్డాయి. ఆ కథా పూర్వక చర్చలతోనే వినోద క్రీడా ప్రియులైన రాజకుమారులని విష్ణుశర్మ మేధోచైతన్య పూరితులని చేశాడు తప్ప కాకమ్మ - ఎలకమ్మ కథలతో కాదు. కథల నెపంతో విష్ణుశర్మ, సునిశిత ఆలోచనా పటిమనీ, ప్రాకృతిక పరిశీలననీ.... జంతువుల, పక్షుల పాత్రల సంభాషణల ద్వారా రాకుమారుల బుర్రల్లోకి ఎక్కించాడు.
మచ్చుకి ఒకటి!
చిన్నప్పటి నుండీ మనం విన్న కథ! ‘వలలో చిక్కిన పావురాలు’ వలతో సహా ఎగిరి, వేటగాడికి ఠోకరా ఇచ్చి, ఎలుక నేస్తం దగ్గరి కెళ్ళి వలబంధనం తెంచుకున్న కథ. చాలా సూటిగా, చివరలో ఒక నీతి వాక్యంతో చెప్పబడే కథ!
అదే కథ, పంచతంత్రంలో ఎలా ఉందో చూడండి. మొత్తం కథా వివరించడం సుదీర్ఘమైనందున, పావురాలు వలతో సహా ఎగిరి, పావురాల రాజైన చిత్రగ్రీవుడు, తన మిత్రుడైన హిరణ్యకుడి కలుగు దగ్గర వాలినప్పటి నుండీ వివరిస్తాను.
చిత్రగ్రీవుడు ఎలుక కలుగు దరిచేరి ఎలుగెత్తి "ఓ చెలికాడా! ఏల మాతో మాటలాడవు" అనగానే... హిరణ్యకుడామాట విని, వేగముగా కలుగు వెడలి వచ్చాడు.
స్నేహితుణ్ణి చూసిన సంతోషంతో "ఆహా! ఏమి నా భాగ్యము? ఈ రోజు నా ప్రియమిత్రుడు చిత్రగ్రీవుడు, నాకు నేత్రోత్సవము చేయనున్నాడు" అన్నది. [ఎంత చక్కని ఆహ్వాన పలకరింపులో!]
అంతలోనే వలలో చిక్కిన పావురాలను గమనించి, వెఱగుపడి ఒక్కక్షణం ఊరుకుని "చెలికాడా! ఇది ఏమి?" అని అడిగింది.
దానికి చిత్రగ్రీవుడు కొంత విచారంగా "ఇది మా పూర్వజన్మ కర్మఫలము. చేసిన కర్మమనుభవింపక తీరదు కదా!" అన్నాడు. హిరణ్యకుడు, చిత్రగ్రీవుడి బంధనాలు తెంపేటందుకై సమీపించగా, చిత్రగ్రీవుడు అభ్యంతరం చెబుతూ "చెలికాడా! చేయవలసింది ఇలా కాదు. ముందుగా నా ఆశ్రితులైన నా అనుచరుల బంధనాలు తెంచు. తర్వాత నన్ను విడిపించుదువు గాని" అన్నాడు.
అందుకు హిరణ్యకు డనే ఆ ఎలుక "నా దంతాలు కోమలమైనవి. అన్నిటి బంధాలు కరిచి తెంపలేను. పండ్ల బలిమి ఉన్నంత మేరకు నీ బంధనాలు తెంచి వేస్తాను. తర్వాత శక్తి కలిగిన పక్షంలో మిగిలిన వారి సంగతి చూడవచ్చు" అన్నాడు.
దానికి చిత్రగ్రీవుడు "అలాగే చెయ్యి. శక్తికి మీరి ఎవరైనా ఏమి చెయ్యగలరు? అయితే... ముందర యధాశక్తి వీరి నిర్భంధము తెంచి వేయి. తర్వాతే నా సంగతి చూచుకుందాం" అంది. [ఎంత చక్కగా, నిక్కచ్చిగా తన అభిప్రాయం చెప్పిందో చూడండి. స్నేహితుణ్ణీ కాదనలేదు. తన ఇచ్ఛా విడువలేదు.]
అందుకు హిరణ్యకుడు "తన గురించి తాను పట్టించుకోకుండా ఇతరులని రక్షించాలనటం నీతి కాదు. తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము గలదా?’ అని పెద్దలంటారు. తాను బ్రతికి కదా సమస్త పురుషార్ధాలు సాధించుకోవాలి? తానే పోయిన తర్వాత దేనితోనైన ఎవరి కేమి పని ఉంటుంది?" అన్నది.
అయినా చిత్రగ్రీవుడు శాంతంగా, "మిత్రుడా! నువ్వు చెప్పింది నీతి కాదనను. [చూడండి. వ్యతిరేకిస్తూ తన వాదనని ప్రారంభించలేదు.] అయినా గానీ, నా వారి దుఃఖాన్ని చూసి సహించలేను కాబట్టి ఇంత నొక్కి చెప్పాల్సి వచ్చింది. ప్రాజ్ఞుడు తన జీవితాన్ని వదులుకొని అయినా, మంచి వారికి వచ్చిన కీడు తొలిగించాలని నీతి కోవిదులు చెబుతారు. నావంటి వారు నా అనుచరులైన ఈ పావురాలు. వీరి వంటి వాడినే నేను.
ఆపదలో ఆదుకొనని నా ప్రభుత్వం వలన వీరికి రాగల ఫలితమేమున్నది? మిత్రుడా! విడువదగినదీ, ఆశాశ్వతమైనదీ అయిన నా శరీరం మీద ఆశమాని, నాకు కీర్తిని ప్రసాదించు. నా ఈ అనుచరులకు నా వలన జీతమూ బత్తెమూ ఏదీ లేదు. అయినా గానీ వీరు, సర్వకాలమూ నన్ను వదలక, నా తోడై నన్ను సేవిస్తూ ఉన్నారు. వీళ్ళ ఋణం ఎప్పుడు తీర్చుకోవలనో తెలియదు. నా బ్రతుకు ముఖ్యమని తలచకు. వీళ్ళ ప్రాణాలు రక్షించితే చాలు!
అనిత్యమైన, మలినమైన ఈ శరీరం చేత.... నిత్యమైన, నిర్మలమైన కీర్తి లభిస్తే, అంతకంటే మించిన లాభం ఉంటుందా? శరీరానికీ, గుణాలకీ మిక్కిలి వ్యత్యాసమున్నది. శరీరం క్షణభంగురం. గుణాలు కల్పాంత స్థాయిలు. ప్రళయం వచ్చే వరకూ నిలిచి ఉంటాయి. ఇలాంటి శరీరాన్ని కోరి, కీర్తిని పోగొట్టుకోవచ్చునా?" అంటాడు.
అది విని హిరణ్యకుడు సంతోషంతో పులకించి పోతాడు. చిత్రగ్రీవుణ్ణి చూసి "చెలికాడా! మేలు మేలు! నీ ఆశ్రిత వాత్సల్యాన్ని పొగడటానికి నేనెంత వాణ్ణి? ఈ గుణము చేత నీవు త్రిలోకాధిపత్యానికి తగి ఉన్నావు" అంటూ, అందరి బంధనాలు కొరికి తెంచేసాడు. అందరికీ అతిధి సత్కారాలు చేసి, చిత్రగ్రీవుణ్ణి చేరి "చిత్రగ్రీవా! చెలికాడా! ఎంతటి వారికైనా పూర్వ కర్మ మనుభవింపక తప్పదు. వలలో చిక్కుకున్నందుకు నొచ్చుకొకు. అన్నీ తెలిసిన వాడవు. నీకు నా బోటి వారు చెప్పగలిగేది లేదు" అని ఊరడించాడు. [ఎంత మార్ధవమైన ఆదరణ ఇది!]
తర్వాత హిరణ్యకుడు చిత్రగ్రీవుణ్ణి కౌగలించుకుని, వీడ్కొలు చెప్పాడు. చిత్రగ్రీవుడు తమ పరిజనులతో హిరణ్యకుడి స్నేహ శీలాన్ని, మంచి గుణాలని కొనియాడుతూ పయనమయ్యాడు.
మిత్రలాభం కంటే మించిన లాభం మరొకటి ఈ ప్రపంచంలో లేదు. కాబట్టి బుద్దిమంతుడు ఎక్కువమంది మంచి మిత్రులను సంపాదించుకోవాలి. ఒక్క ఎలుకతో స్నేహం, పావురాలకి ఎంత మేలు చేసిందో చూడండి" అని చెప్పి విష్ణుశర్మ కొనసాగించాడు.
~~~~~~~~
మనం ఎన్నోసార్లు చదివిన, విన్న, చెప్పిన ఈ పంచతంత్రం కథలో.... ‘కట్టే కొట్టే తెచ్చే’ అనే కథ, చివరలో నీతి వాక్యం తప్పితే.... ఇంత సంభాషణా చాతుర్యం, నీతి మాటల మాలిక ఉందా? ఒకో పాత్ర, ఎదుటి వారిని మన్నించే తీరు, మర్యాదించే వైనం, సంభాషణల మర్మం, మానవీయ విలువల తోడి మెరుపు! నిజంగా అది పంచతంత్రమే కాదు నీతి చంద్రిక కూడా!
ఒక్క తరగతి వాచక పుస్తకంలో కూడా ఇదేమీ ఉండదు. బియ్యం పారబోసి, మిగుల్చుకున్న తవుడు వంటి చప్పటి కథ మాత్రమే ఉంటుంది.
ఈ కథలో ఎలుక హిరణ్యకుడూ, పావురాల రాజు చిత్రగ్రీవుడూ పరస్పర విరుద్ద వాదనలు చెబుతారు. ఎలుక ‘విపత్కర పరిస్థితుల్లో ఎవరి స్వార్ధం వారు చూసుకోవటం ముఖ్యం’ అంటుంది. పావురం ‘ఎప్పుడైనా సరే, శరీరం కంటే కీర్తిగొప్పదనీ, నిస్వార్ధంగా పరోపకారం చేయటమే మేలనీ’ అంటుంది.
ఎవరి వాదన వాళ్ళు ప్రజంట్ చేసే తీరూ, చివరికి ఒకరితో ఒకరు ఏకీభవించే తీరూ ఎంతో స్పష్టంగా చెప్పబడుతుంది.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
చాలా చక్కగా చెప్పారు. విద్యారంగంలో మార్పులు యెలా ఉండాలి అన్నది ప్రపంచీకరణ నిర్ణయిస్తోంది. అంతే కాని పిల్లల మానసిక పరిపక్వతకు దోహదపడేదిగా కాదు.....
Who has to wake up and how will that happen, I guess that is the million dollar question!!
lalitha
పంచతంత్రం, హితోపదేశం శ్లోకాలతో కూడిన పుస్తకాలు నా దగ్గఱ ఉన్నాయి. ఎప్పటికో అప్పటికి వాటిలోని శ్లోకాలనూ, వాటి అర్ధాలతో సహా బ్లాగుమిత్రులతో పంచుకోవాలి.
లలిత గారు: వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!
నరసింహా[వేదుల బాలకృష్ణమూర్తి]గారు: పంచతంత్ర శ్లోకాలనీ, భావాలనీ వ్రాయాలన్న మీ సంకల్పం మంచిది. కానివ్వండి. అందులోని అసలైన సారాన్ని కొందరైనా గ్రహించగలుగుతారు!
కృష్ణమూర్తి గారు: మీరా పని చేస్తే కొంచెం గుర్తు పెట్టుకుని నాకు ఒక వేగుపడెయ్యండి, ఎప్పటి నుండో చకోరం లాగా ఎదురుచుఉస్తున్నాను, ఈ పుస్తకాలు పాతవి చదవాలని....
Post a Comment