ముందుగా 300 యోధులు సినిమా గురించి: నేను ఈ సినిమాని తెలుగు డబ్బింగ్ తో చూశాను. మిగిలిన భాషల సంగతి తెలియదు గానీ, తెలుగులో వ్యాఖ్యానం చెప్పిన వారు గానీ, పాత్రధారులకు గాత్ర దానం చేసిన వారు గానీ, ఎంతో అర్ధవంతంగా, స్పూర్తిదాయకంగా డబ్బింగ్ చెప్పారు. ఇక పాత్రధారులు, కళ్ళల్లో గాఢమైన భావాలతో సహా చక్కని అభినయాన్ని చూపిన సినిమా అది.

కథ విషయానికి వస్తే.... స్వాతంత్రం కోసం, వ్యక్తి స్వేచ్ఛాగౌరవాల కోసం, తమ దేశపు స్త్రీలూ పిల్లలూ పారశీకులకి బానిసలు కాకుండా ఉండటం కోసం, స్పార్టన్ లు చేసిన పోరాటం, స్పార్టన్ ల రాజు లియోనైడర్స్ చేసిన యుద్దం!

స్వార్టాలో పుట్టిన ప్రతి బిడ్డనీ అనుభవజ్ఞులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏమాత్రం శారీరక, మానసిక రుగ్మతలున్నా ఆ బిడ్డని అప్పుడే చంపివేస్తారు. ఇది కొంత అతిశయోక్తిగా, నిర్ధాక్షిణ్యంగా అన్పించినా, ఒక ధృఢమైన జాతిని నిర్మించుకోవాలన్న స్పార్టన్ ల సంకల్పాన్ని దర్శకుడు అలా చెప్పి ఉండవచ్చు.

ఏడేళ్ళ వరకూ తల్లిఒడిలో, తండ్రి నీడలో పెరిగిన గారాల బిడ్డలని తర్వాత ఒంటరిగా కౄర మృగాలున్న దీవిలో వదిలేస్తారు. ప్రకృతి సహజంగా... ధృఢత్వాన్ని, బ్రతుకు సమరాన్ని నేర్పి, పరిస్థితులని జయించీ, పరిసరాలని అతిక్రమించి, తిరిగి స్పార్టా చేరితే.... భవిష్యత్తు! లేదా ఆ దీవిలో ఓటమితో ఒంటరి మరణమే! ఈ విషయాన్ని చెబుతూ వ్యాఖ్యాత "బాల్యం నుండే వారికి ధైర్యమూ, పోరాటమూ నేర్పబడతాయి. పారిపోవటం, శతృవుని శరణు కోరటం స్పార్టన్ లకి తెలియవు" అంటాడు. యుద్దరంగం నుండి పారిపోవటం, శతృవుని శరణు కోరటం- ఈ రెండూ లేకపోతే ఇక ఉన్న దారులేమిటి? విజయమో, వీర మరణమో! అంతే! ఇదే ’గీత’ కూడా చెబుతుంది, ’హతోవా ప్రాప్యసే స్వర్గం’ అని.

సినిమా ప్రారంభ సీన్ లలో.... దీవిలో ఒంటరిగా విడిచిపెట్టబడిన బాలుడు ఆకలిగొన్న కౄర తోడేళ్ళని ఎదుర్కొని వధిస్తాడు. తోడేలుది ఆకలి. బాలుడిది ప్రాణం! జీవన్మరణ సమస్య అయిన యుద్దం అది. మెండలీఫ్ చెప్పిన struggle for exixtence! ప్లేటో స్వప్నించిన యూటోపియా! కారు చీకటి కంటే నల్లని దేహంతో, నిప్పుకణికుల్లా ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో, ఎదురుగా.... దాడికి సిద్దంగా... మీదికి దూకనున్న తోడేలుని ఎదుర్కొక పోతే మరణం తధ్యం. బ్రతకాలన్న తీవ్రమైన కాంక్ష, గెలవాలన్న విజిగీష, ఒంటరి తనాన్ని పిరికితనాన్ని గుర్తించని ధైర్యం! ఫలితమే బాలుడి చేతిలో.... భారీగా కౄరంగా కనబడే తోడేలు చావు! అతడే స్వదేశమైన స్పార్టాకి సజీవంగా చేరి మహారాజైన లియోనైడర్స్.

బాల్యంలోనే అలాంటి కఠిన సంఘటనలనీ, సంఘర్షణలనీ ఎదుర్కొన్నవాడు గనకనే.... తనకి తాను ’రాజులకే రాజుననీ, దేవుళ్ళకే దేవుణ్ణనీ’ తన చెంచాల చేత కీర్తింపించుకుంటూ, అపార బానిస సేననీ ఐశ్వర్యాన్నీ ప్రదర్శిస్తూ, ప్రత్యర్ధుల మీద ప్రలోభాలనీ, విభజించి పాలించే తంత్రాలనీ ప్రయోగిస్తూ, మానవ కంకాళాలతో నిర్మించిన భారీ రధం మీద ఊరేగుతూ, దాన్ని తన బానిస మానవుల చేత లాగిస్తూ.... విశ్వవిజేత కావాలన్న కాంక్షతో, అన్ని దేశాలను ’గుక్కెడు నీళ్ళు, గుప్పెడు మట్టీ’ ఇచ్చుకొని దాసులమంటూ మోకాలి దండ వేయమనే - జెక్సీస్ ని ఎదుర్కొనేటప్పుడూ... లియోనైడర్స్ దగ్గర భయమూ బెరుకూ గానీ, ఓడిపోతామేమోననీ బెంగగానీ, జెక్సీస్ సైన్యాన్ని చూసిన వెరపు గానీ ఉండవు.

కేవలం 300 మంది యోదులతో జెక్సీస్ అపారమైన సైన్యాన్ని ఎదుర్కొంటాడు.

ముందుగా జెక్సీస్ రాయబారులు, లియోనైడర్స్ దగ్గరికి, జెక్సీస్ సందేశాన్ని తీసుకుని వస్తారు. "దూతవైనా నీ నోటి నుండి వచ్చే మాటలకు నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని హెచ్చరించినా, గర్వాతిశయంతో, ’జెక్సీస్ పేరు చెబితే చాలు ఎదుటి వాడు గడగడ లాడతాడు, ఎందర్ని చూడలేదు?’ అన్నట్లుగా.... చేతిలో జెక్సీస్ ని ఎదిరించిహతులైన వాళ్ళ కపాలాల మాలని చూపిస్తూ.... లియోనైడర్స్ తో సంభాషణ ప్రారంభిస్తాడు. "ఏం కావాలి మీ మహారాజుకు?" అన్న లియోనేడర్ ప్రశ్నకు "నేలా నీళ్ళు!" అన్న జవాబు చెబుతాడు. "అవి మీ పారశీక దేశంలో లేకనా ఇంత దూరం వచ్చారు?" అన్న లియోనైడర్స్ కు, జెక్సీస్ దూత, ఎంతో క్రోధంతో ‘తమ మహారాజుని ఎదిరించిన వాళ్ళు ఇలా చచ్చి కపాలాలైనారనీ, తమ బానిసత్వాన్ని ప్రకటిస్తూ స్పార్టా దేశం నుండి గుక్కెడు నీళ్ళు, గుప్పెడు మట్టి సమర్పించి జెక్సీస్ కు సామంతరాజై పడి ఉండమనీ’ సలహా ఇస్తాడు. లేనట్లయితే అపారమైన జెక్సీస్ సేనలని ఎదుర్కోలేక స్పార్టాదేశం నామరూపాల్లేకుండా మట్టిలో కలిసి పోతుందంటాడు.

తీరా లియోనైడర్స్ "దూతవైనా నీ నోటి మాటలకి నీవే బాధ్యత అని చెప్పాను. అయినా లక్షపెట్టక నాముందే నా రాణిని అవమానించావు. నా దేశం మట్టిగొట్టుకు పోతుందని నాతోనే అన్నావు. మట్టీ నీళ్ళు కావాలన్నావుగా, అవి ఈ పాతాళంలో పుష్కలంగా దొరుకుతాయి" అంటూ ఆ దూతని వధించ బోయినప్పుడు, "తప్పు. ఇది చట్ట విరుద్దం" అంటాడు. దూతగా తాను చట్ట పరిధులని పరిగణించడు. తానే స్వయంగా చెబుతున్న స్థాయిలో ’మేము ఇందరం జెక్సీస్ కు పాదాక్రాంతులమయ్యాము. నీకేం కొమ్ములున్నాయా?’ అన్నట్లు అలవోకగా బెదిరిస్తాడు. ’ఇద్దరు మగవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో ఆడదానివి నువ్వు మాట్లాడతావేం?’ అంటాడు.

ఇంతగా స్త్రీని చులకన చేసే ఈ జెక్సీస్ , అతడి వర్గీయులు, ఎదుటి వాణ్ణి ప్రలోభపెట్టి లొంగదీసుకునేందుకు వాడేది, మళ్ళీ స్త్రీ శరీరాలనే! ఎవరినైనా ముందుగా కాంతా కనకాలతో లొంగ దీసుకుంటాను. బానిసలయ్యాక మిగిలేవి కొరడా దెబ్బలూ, పీక ఉత్తిరించడాలే! రధం లాగడానికీ, యుద్దానికీ నిరాకరించిన బానిసల్నీ కొరడాలతో కొడతారు. యుద్దంలో ఓడిపోయి పారిపోయి వచ్చినందుకు జెక్సీస్ పీకలూ కోస్తాడు.

అలాంటి జెక్సీస్ కు దూత అయిన వాడు, తీరా తనకి ప్రమాదం ముంచుకు రాగానే, ఎదుటి వాడు చట్టాలు పాటించాలంటాడు. వెరసి వీళ్ళ అభిప్రాయంలో తమని కాపాడటానికే చట్టాలుంటాయి. దాన్నే నెం.10 వర్గం సంపూర్తిగా పుణికి పుచ్చుకుంది. తమ అనుచరులైన నేరగాళ్ళనీ, తమనీ కాపాడటానికే వీళ్ళకి చట్టాలు గుర్తొస్తాయి.

అందుకే లియోనైడర్స్ "ఇక్కడ ఇదే చట్టం రా!" అంటూ ఆ దూతనీ, అతడి అనుయాయులనీ నూతిలోకి తోసి వేస్తాడు. అలా తోసేందుకు నిర్ణయం తీసుకునే ముందు తన భార్య వైపు చూస్తాడు. ఆ లోతైన చూపులో ‘తను తీసుకోబోయే నిర్ణయం తన ఒక్కడి జీవితాన్ని ప్రభావితం చేయదు. మొత్తంగా తమ దేశపు భవిష్యత్తునీ, దేశ పౌరులందరి జీవితాలనీ ప్రభావితం చేస్తుంది’ అన్న స్పృహ ఉంటుంది. మహారాణి చూపుల నుండి గ్రహించిన ఏకాభిప్రాయం, మద్దతూ ఇచ్చిన స్థైర్యంతో జెక్సీస్ దూతలని చంపి వేస్తాడు.

[అప్పుడే కాదు, యుద్దానికి వెళ్ళబోతూ భార్యా పుత్రుల దగ్గర వీడ్కొలు తీసుకునేటప్పుడు కూడా, లియోనైడర్స్ పాత్రధారి కనబరిచిన భావప్రకటన గొప్పగా ఉంటుంది.రెప్పలార్పకుండా కొడుకుని చూసుకునే ఆ చూపులో, ’అటూ ఇటూ అయితే ఇదే ఆఖరి చూపు’లన్న స్పృహ, అయినా వెనుకడుగు ఊహ కూడా చేయని దార్డ్యత ఉంటాయి. అలాగే లియోనేడర్ దళపతి, తన కుమారుడి మరణం తర్వాతి సన్నివేశాలలో లోతైన బాధని కళ్ళల్లోనే పలికించిన తీరు, ఆ నటుల ప్రతిభనీ, దర్శకుడి నైపుణ్యాన్ని చూపిస్తాయి. ]

జెక్సీస్ దూతలని తాను చంపేటప్పుడే లియోనైడర్స్ కి తెలుసు, తాను జెక్సీస్ ని ధిక్కరిస్తున్నారనీ, పర్యవసానంగా యుద్దం తప్పదనీ! అయినా తన ప్రజల వైపు చూసుకుని "నా ప్రజలు బానిసలు కాకూడదు" అని గుండెల నిండా సంకల్పించుకున్నాకే, జెక్సీస్ దూతలని కాలెత్తి గుండెలపై తన్ని పాతళ బావిలోకి తోస్తాడు.

ఇక యుద్దం తప్పనిసరి! యుద్దపు అనుమతి కోసం మత పెద్దలని ఆశ్రయిస్తాడు. అది వాళ్ళకు ముందునుండీ వస్తున్న సాంప్రదాయం, నమ్మకం. ప్రజలు కూడా మత పెద్దలని, తమ హితవు కోరే వారుగా నమ్మి గౌరవిస్తారు. పూర్వం మనం ఋషులని గౌరవించినట్లుగా! వర్తమానంలో అందరమూ మీడియాని నమ్మి గౌరవించినట్లుగా! అయితే జెక్సీస్ పంపిన బంగారానికి, అప్పుడే పూచిన పువ్వలవంటి కన్యలకి ఆశపడి, ఆ వృద్ద మత పెద్దలు అలవోకగా అబద్దాలు చెబుతారు. వాళ్ళ సహకారం లేనిది ప్రజల అంగీకారమూ, యుద్ద సన్నాహమూ మహారాజుకైనా అసాధ్యమే! స్పార్టా సేనని ఎలా యుద్దభూమికి కదపగలడు?

అందుకే, స్వయంగా కేవలం 300 యోధుల్ని వెంటబెట్టుకుని, మాతృభూమి స్పార్టాకి జెక్సీస్ సేనలు చేరక ముందే అతడికి ఎదురు వెళ్ళి యుద్దరంగాన తలపడేందుకు సిద్దపడతాడు లియోనైడర్స్! అప్పటికే జెక్సీస్ పంపిన లంచాలు మరిగిన మంత్రి, కుట్రకపటాలతో ’మత పెద్దల మాటకు విరుద్దంగా, దైవ సమ్మతం లేకుండా మహారాజు లియోనైడర్స్, స్వార్ధంతో, స్వకీర్తి కాంక్షతో యుద్దానికి అదీ 300 మందితో వెళ్ళుతున్నాడని’ నిందాపూర్వకంగా మాట్లాడతాడు. దాన్ని పూర్వపత్రం చేస్తూ లియోనైడర్స్ "ఎవరన్నారు? నేను దేశాటనం చేయటానికి వెళ్తున్నాను. వీళ్ళు నా ఆత్మరక్షక దళం" అంటాడు.

300 మంది సుధృఢ గాత్రులనూ, స్థిర చిత్తులనూ తీసుకుంటాడు. దళపతి ఆ యోధుల్ని పరిచయం చేస్తూ "వీరందరికీ ఒక్కొక్క పుత్రుడున్నాడు" అంటాడు. అతడి పుత్రుణ్ణి గుర్తించిన మహారాజు, "ఇంత చిన్న వయస్సులో నీ కుమారుడు యుద్దరంగానికి రావటం అవసరమా?" అంటే - "వీడు గాక నాకు ఇంకా ఇద్దరు పుత్రులున్నారు. వీడికి యుద్దవిద్యలన్నీ నేనే నేర్పాను. తాను నేర్చిన విద్యలతో మాతృదేశ రక్షణకి వాడు ఉవ్విళ్ళూరు తున్నాడు. అయినా నేను తొలిసారి యుద్దభూమిలో అడుగుపెట్టిన వయస్సు కంటే వీడు కొంచెం పెద్దవాడే!" అంటాడు.

ఎంతో అలవోకగా... ’జాతస్వహి ధృవో మృత్యుః’ అనే అనివార్యమైన చావుని అర్ధవంతం చేసుకోవాలనే స్పష్టమైన స్వాతంత్ర కాంక్ష, ఆ యోధుడిలోనూ, అతడి పుత్రుడిలోనూ కన్పిస్తుంది. ఎంతగా అంటే - జేక్సీస్ సేనలతో యుద్దం చేసేటప్పుడు వాళ్ళు హఠాత్తుగా, కనిపించకుండా, అంబుల వర్షంలాగా శరాలను ఉపయోగించినప్పుడు, డాలులతో శరీరాలని కప్పుకుని, అది వెలిశాక పగలబడి నవ్వేంతగా...! "ఎందుకు నవ్వుతున్నావు?" అంటే "వాళ్ళు దడిచారు. వెన్నుపోటుకు సిద్ద పడ్డారు" అంటూ పక పకా నవ్వేటంతగా!

పిరికి వాడు వెన్నుపోటుకు సిద్దపడతారు. యుద్దం చేసే దమ్ముల్లేని వాడు కుట్రలకు తెగ బడతాడు. యుద్ద భూమిలో, ప్రతీక్షణం చావు బ్రతుకుల మధ్య తారట్లాడుతూ, దెబ్బతీస్తూ దెబ్బ కాచుకుంటూ కూడా, శతృవు పిరికి తనాన్ని, బలహీనతనీ ఆనందిస్తూ విరగబడి నవ్వగలిగారంటేనే.... వారిలోని ధీరత్వం, నిర్బయం కన్పిస్తుంది.

మొత్తంగా ఈ సినిమాలో ఫోటోగ్రపీ కూడా ఆద్యంతమూ అద్బుతంగా ఉంది. పాతళం లాంటి నూతిలోకి విసరబడిన జెక్సీస్ దూతల దగ్గరి నుండీ, అంబుల వర్షం మేఘంలాగా ఆకసాన్ని కమ్ముకొని సూర్యుణ్ణి కూడా కప్పి వేసినట్లు, తాత్కాలికంగా చీకట్లు పరుచుకోవటం ఎంతో చక్కగా దృశ్యీకరించారు. అప్పుడే కాదు, మదగజాలని స్పార్టన్ ల మీదికి ఉసిగొల్పినప్పుడు, వాళ్ళు వాటిని మృత్యులోయలోకి విసరటం, మాయా ఖడ్గ మృగపు దాడి.... దాదాపు అన్ని సన్నివేశాలూ ఎంతో చక్కగా చూపించారు.

ఆ భారీ ఖడ్గమృగం మీదకి ఈటె విసిరాక కూడా అది ఆగకుండా పరుగెత్తుకు వస్తుంది. అది మీది కొచ్చేవరకూ కూడా స్పార్టన్ యోధుడు అలా స్థాణువులా చలించకుండా నిలబడతాడు. తన మీద తనకున్న నమ్మకం, ’తన ఆయుధం ఆ మృగాన్ని సంహరించి తీరాలి. సంహరించలేదుపో, చావుకి తెగించే కదా యుద్దభూమికి వచ్చింది?’ అన్నట్లుంటుంది అతడు చలించకుండా నిలబడిన తీరు!

జేక్సీస్ సేనలు తమ స్పార్టా మీదికి వచ్చేముందే, తామే ఎదురు వెళ్ళి యుద్దానికి సిద్దపడే వేళ, ప్రకృతి పరంగా సానుకూల ప్రతికూల అంశాలని అంచనా వేస్తూ లియోనైడర్స్ యోధులు, ’తమని చేరాలంటే సన్నిని ఇరుకైన దారిలో జెక్సీస్ సేన రావలసి ఉంటుంది. అప్పుడు తాము ఎదుర్కొవడం సులభం’ అనే అంచనాలో బయలు దేరతారు. అది ఫలిస్తుంది కూడా! తమ దేశీయుడైన గూని వాడు జెక్సీస్ తో కుమ్మక్కు కానంత వరకూ! ఇది ఎలా ఉంటుందంటే శివాజీ మహారాజ్, అతని సేనలు తురకలను ఎదుర్కున్న తీరులాగా!

వాళ్ళు యుద్దరంగానికి చేరేవేళకు, టేక్సాస్ యోధులు స్పార్టన్లతో చేయికలిపి జెక్సీస్ తో పోరాడటానికి వస్తారు. వారి శౌర్యానికీ పని కల్పిద్దాం అంటూ లియోనైడర్స్ వాళ్ళ సాయాన్ని అంగీకరిస్తాడు. అయితే "వాళ్ళని యోధులు అనటం కంటే ఆక్రోశులు అనటం సబబు" అంటాడు. ఎందుకంటే వాళ్ళు అనివార్యమై, నిస్సహాయులం అనుకుంటూ యుద్దానికి సిద్దపడతారు. తమ స్వేచ్ఛా గౌరవాల కోసం సిద్దపడరు. అదే వారి ప్రశ్నలోనూ ఉంటుంది. "ఇంత తక్కువ సేనతో, కేవలం 300 మంది యోధులతో అపారమైన జెక్సీస్ సేనలని ఎదుర్కొనటం సాధ్యమా?" అంటాడు.

లియోనైడర్స్ టేక్సాస్ యోధులని ’నువ్వేం చేస్తావు?’ అనడిగితే ఒకొక్కరు శిల్పిని, కమ్మరిని అంటూ తమ తమ వృత్తులు చెబుతారు. స్పార్టన్లని అడిగితే వాళ్ళు ’యుద్దం’ అంటారు. లియోనేడస్ "ఇప్పుడు నీకు అర్ధమైందా?" అంటాడు. ఇది నిజంగ చాలా అర్ధవంతమైన సంభాషణ!

ఇక్కడ ఓ పోలిక చెబుతాను. మనం ప్రతీరోజూ భోజనం చేస్తాము. వరి అన్నం, గోధుమ చపాతీలు లేదా జొన్న రొట్టెలు ప్రధాన ఆహారం అయితే, అందులోకి అధరువులుగా పప్పూ పచ్చడీ కూరా పులుసూ నెయ్యి పెరుగూ ఉంటాయి. అంతే తప్ప కేవలం ఆధరవులే ప్రధాన ఆహారమై ఉండవు. [పూర్తిగా మాంసాన్ని ఆహారంగా స్వీకరించే అప్రాచ్యుల ఆహారపు అలవాట్లని నేనిక్కడ ఉటంకించటం లేదు.] అంటే వరి లేదా గోధుమ ప్రధాన స్రవంతి అయితే కూరా పెరుగూ అందులో పాయలై ఉంటాయి.

అలాగే పౌర జీవితంలో వృత్తి ప్రధాన స్రవంతి అయితే వినోద వికాసాలు అందులో పాయలై ఉండాలి. ప్రస్తుతం 24 గంటలు టీవీ ఛానెళ్ళతో, మిడ్ నైట్ మసాలాలతో, వినోదం ప్రధాన స్రవంతి అయిపోయింది. క్రికెట్ మ్యాచ్ లున్నప్పుడు ఉద్యోగ విద్యార్ధుల హాజరు పడిపోవటమే ఇందుకు దృష్టాంతం. ఇక మ్యాచ్ లంటే ఓటింగ్ కూ రాకపోవడం అందులో మరింత ’అతి’. అదే విధంగా దేశరక్షణ చేసే యోధుడి జీవితంలో యుద్దం ప్రధాన స్రవంతి అయి ఉండాలి. అదే 300 యోధులు సినిమాలోని పై సన్నివేశంలో చెప్పబడుతుంది.

దాన్నే నిజం చేస్తూ, టేక్సాస్ యోధులు ఆక్రోశాన్నే వెళ్ళగక్కుతుంటారు. జెక్సీస్ అపార సేనలు సముద్ర మార్గాన రావటం చూస్తూ.... "ఎంత అపారమైన సేన! వీళ్ల చేతిలో మనం చావటం ఖాయం. వాళ్ళని గెలవనూ లేము. ఎదిరించి పోరాడనూ లేము. దేవుడి కింకా మన మీద దయ రాలేదు" అంటారు. అదే దృశ్యాన్ని చూస్తూ స్పార్టన్లు "నౌకలలో వస్తున్న జెక్సీస్ సేన, నేల మీదకు రాగానే ఇక్కడి ఎండకు మలమల మాడి ఛస్తారు" అంటారు. టేక్సాస్ లది ఆక్రోశంతో కూడిన నిరాశావాదం అయితే, స్పార్టన్లది ఆత్మవిశ్వాసంతో కూడిన ఆశావాదం.

ఆ క్షణంలో లియోనైడర్స్ "కానీ ఇప్పుడు వర్షం కురవబోతోంది" అంటాడు. నిజంగానే పెద్ద గాలివాన వస్తుంది. ఆ దెబ్బకి జెక్సీస్ సేనలో అధిక భాగం ధ్వంసమవుతుంది. దీనికి కొన్ని క్షణాల ముందు టేక్సాస్ యోధులు "దేవుడికి ఇంకా మన మీద దయ రాలేదు" అంటారు. నిజంగా దేవుడికి వాళ్ళ మీద దయ లేకపోతే గాలి వాన వస్తుందా? జెక్సీస్ సేనలో అధిక భాగం నశిస్తుందా?

దేవుడెప్పుడూ మంచికీ, ధర్మానికే బాసటగా నిలుస్తాడు. చూడగల కళ్ళు, గ్రహించగల దృక్పధం మనుష్యులకి ఉండాలి. అంతే! అందుకే గీతలో చివరిలో, ’యత్ర యోగీశ్వర కృష్ణోః యత్రపార్ధో ధనుర్ధారః’ అని చెప్పబడుతుంది.

తదుపరి ప్రారంభమైన్ యుద్దం పరమ భీకరంగా ఉంటుంది.

యుద్దరంగానికి స్పార్టన్లు చేరేలోగానే, జెక్సీస్ సేనలు, ఒక గ్రామం మొత్తాన్నీ ధ్వంసం చేసి, గ్రామీణుల శవాలని చెట్టుకి గుత్తులుగా గుచ్చుతారు. అంతగా భీభత్సాన్ని సృష్టించడం.... చూసిన వారి వెన్ను నుంచీ భయం పుట్టించాలనే! ఈ లక్షణం నెం.10 వర్గం, నకిలీ కణిక వ్యవస్థలో అణువణువునా ఉంటుంది. ఎల్లప్పుడూ చెడ్డవారికే బలమనీ, చెడ్డవాణ్ణి చూసి భయపడమనీ చెప్పటమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. సినిమాలలో సైతం చివరి సీను దాకా విలన్ దే పై చేయి. చచ్చీ చెడీ సర్వం పోగొట్టుకొని హీరో, విలన్ పీచమణచాల్సిందే! వార్తల్లోనూ అంతే! అవినీతి పరులకే అన్ని నడుస్తున్నాయి అన్నట్లే ఉంటుంది. చిన్నప్పటి నుండీ, ఎక్కడి కక్కడ చెడ్డవాణ్ణి చూసి భయపడమనే నేర్పబడుతోంది.

’దుష్టుడికి దూరముగా ఉండుము’ అన్నది సామెత. దుష్టుడికి దూరంగా ఉండటమంటే భయపడమనీ కాదు. మనం దూరంగా ఉన్నా, వాడు మన జోలికి వస్తే...? అప్పుడూ దూరంగా పారిపొమ్మని కాదు. కనీసం ’దుష్టుడి జోలికి పోకు. వాడు నీ జోలికొస్తే ఊరుకోకు’ అని కూడా చెప్పబడటం లేదు. ఏకంగా.... చిన్నప్పటి నుండీ "వాడు చెడ్డపిల్లాడులే నాన్నా! వాడితో ఆడుకోకు, వాడి జోలికెళ్ళకు" - దాదాపు ఒక తరం నుండి పిల్లలకి ఇలా చెప్పడాన్నే గమనించాము.

ఉదాహరణకు - ఇటీవల తెలుగులో విడుదలైన ’అరుంధతి’ సినిమాలో.... పశుపతి ఆత్మకి అమిత బలం ఉంటుంది. అఘోరా గా మారి మానవాతీత, క్షుద్ర శక్తులని సంపాదించి, ఆ తర్వాత సజీవంగా సమాధి చేయబడి, అందులోనే చచ్చిన వాడి ఆత్మకి, చచ్చాక కూడా గద్వాల సంస్థానపు ప్రజలని చీడపీడలతో బాధించగలగేంత శక్తి ఉంటుంది. వాడికి వ్యతిరేకంగా పోరాడిన అరుంధతి [జేజెమ్మ]కి ఏ దేవుడూ సాయం చేయలేడు. చచ్చాక కూడా ఆమె ఆత్మకీ పశుపతికి ఉన్నంత శక్తిలేదు. చిన్న అరుంధతిగా మూడో తరంలో జన్మించాకా అంత శక్తి లేదు. చాలా భయపడుతుంది.

జేజెమ్మకే కాదు, ఆమె తండ్రీ గద్వాల రాజూ అయిన వాడికి గానీ, ఉరిపోసుకు మరణించిన ఆమె అక్కకి గానీ, జేజెమ్మ ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడూ, చిన్న అరుంధతికి పెదతాత అయిన వాడిలో గానీ అంత శక్తి లేదు. కేవలం కోట బయట ఉండి లోపలికి రావద్దని పార్వతీ, ఆమె భర్త వంటి పని వాళ్ళని అటకాయించి విఫలమౌతాడు.

అదే పశుపతి తల్లికైతే, చచ్చాక ఆత్మకి కూడా శక్తి ఉంటుంది. దానితో ఆ దెయ్యం ఇతరులని రప్పించి కొడుకు సమాధిని పగల గొట్టిస్తుంది. పశుపతి కైతే అఘోరా శక్తి ఉంది. మరి వాడి తల్లి ఆత్మకి ఏ ’ఘోరా’ శక్తి ఉన్నట్లు? వెరసీ ’బ్రతికి ఉండగానూ, చెడ్డవాడిదే బలం. చచ్చాక ఆత్మలలో కూడా చెడ్డవాటికే బలం’ అని చెప్పబూనడం కాకపోతే ఏమిటిది? చెడ్డ ఆత్మలకే అంత శక్తి ఉంటే, మరి మంచి వాడికి, మంచి వాళ్ళ ఆత్మలకీ ఎంత శక్తి ఉండాలి? దెయ్యానికి అంత బలముంటే దైవానికి ఎంత బలం ఉండాలి? ’అక్స్’ లాంటి చాలా సినిమాలలో ఇదే చూశాను.

అంతే కాదు భీభత్సానీ, హింసనీ చూపేందుకే గతంలో సినిమాలలో డ్రమ్ముల కొద్ది ఎర్రరంగు గుమ్మరిస్తూ.... ప్రేక్షకుల అంతరంతరాల్లో భయాన్నీ నాటే ప్రయత్నమే జరుగుతుంది. కొందరిలో అది హింసోన్మాదాన్ని రేపగా అదీ తమకి మంచిదే. అలాంటి వాళ్ళని చేరదీస్తే మిగిలిన సామాన్యుల్ని భయ పెట్టవచ్చు - ఇదే అలాంటి సినిమాల ద్వారా, సినిమారంగం గాడ్ ఫాదర్లూ, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గంలోని కీలక వ్యక్తులూ ఆశించింది.

300 యోధులు సినిమాలో యుద్ద భీకరతని చూపినా.... చిందే రక్తాన్ని ఎరుపులో గాక నీడలో, పసుపు వర్ణం కలిసిన షేడ్ లో చూపించారు. ఎందుకంటే - ఆ సినిమాలో స్పార్టన్ల స్థానంలో ఏ దేశాన్ని ప్రతిష్టించినా, ప్రజలలో ధైర్య సాహాసాల్నీ, స్వేచ్ఛా గౌరవాల పట్ల కాంక్షనీ, విజగీషనీ ప్రేరేపించటమే గానీ, భీభత్సాన్నీ ,భయాన్నీ ప్రవేశపెట్టటం ఉద్దేశం కాదు గనక!

ఒకప్పుడు "మంచి వాడి జోలికి వెళ్ళకు. మంచి వాడికి కష్టనష్టాలు కలిగించకు మంచి వాడి శాపం తరతరాలకి తగిలి తీరుతుంది. సత్పురుషుల కన్నీరు, రుధురం నేల జారితే, ఆ గడ్డపైన వానలు కురవవు, పంటలు పండవు" అని నమ్మేవాళ్ళు. ఆ విధంగా ’మంచితనం’ పట్ల భయభక్తులతో ఉండటాన్ని ఇలాంటి నమ్మకాలు ప్రోత్సహించేవి. దీనికి విపర్యయమే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అమలు చేసింది. అదే జేక్సీస్, అతడి సేనల చర్యలగా మనకి తెర మీద కనబడతాయి.

లియోనైడర్స్ నేతృత్వంలో స్పార్టన్ల ప్రతిఘటనే లేకపోతే జెక్సీస్ కి ఎదురు లేదు. తాను దేవుళ్ళకే దేవుణ్ణనుకునే జెక్సీస్ కి తానూ సామాన్య మానవుణ్ణే ననే వాస్తవం తొలిసారిగా ఇంకేది కాదు. నెం.5 వర్గం ఏర్పడక ముందు నకిలీ కణిక అనువంశీయుడికి అచ్చమైన ప్రతిరూపమే జెక్సీస్.

ఇంకా చెప్పాలంటే.....

సూచన: ఈ సినిమాలో కొన్నిపేర్లు శబ్దస్పష్టత లేక కొద్ది పాటి తేడాలున్నాయి. గమనించగలరు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

do u know there is exactly same incident happened in india too? Try googling Saragarhi. It's is a story of 21 sikhs fighting against 20-22,000 muslims.
about spartans, the truth they are around 2000-3000 and not 300 as shown in movie.
They too have some luck in that war.Can u please write about Saragarhi sometime later?

ఆదిలక్ష్మిగారు,
చాలా బావుందండీ. మనదేశంలో కూడా చాలామంది స్వేఛ్చా, స్వాతంత్ర్యాల కోసం ధన,మాన,ప్రాణాలని ధారపోశారు. కానీ చాల పకడ్బందీగా ఆ spirit ని నాశనం చేస్తున్నారు. ఈ సినిమా నేను చూసినప్పటికన్నా, మీ విశ్లేషణ చదివాకే నాకు ఎక్కువగా నచ్చింది.

ఈ టపా చదివేటప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు వచ్చయి....... మంచి వాడికి అయినా చెడ్డ వాడికి అయినా ధైర్యం పాలు లో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కదా... పశుపతి & తల్లి ఇద్దరూ ఇతరుల ను హింసించే రకాలే.. అందువల్ల వారికి శక్తి కూడా ఎక్కువే అయ్యుండాలి... మంచి పిరికి వాడు ధైర్యవంతుడయ్యేది తన మంచి తనం వాడికి మంచి చేసి తన పై తనకి నమ్మకం కల్పించి నప్పుడే... మీలా :D ... నాకు తెలిసి మీరు మొండి వారు కదా... అందులో నుండి ధైర్యం పుట్టింది... ఇంకా... మంచి పుస్తక పఠనం వల్ల మీరు ఏది మంచి ఏది చెడో తెలుసుకోగలుగుతున్నారు.. ఇలా క్వాలిటీలు పెంపొందటానికి మంచి అలవాట్లు కావాలి కదా... అదే మొండితనం ఎదుటి వారిపై గెలవటానికి ఉపయోగించే వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారతారు... అది పెరిగి పెరిగి చెడ్డవాళ్ళలొ శక్తిమంతులవుతారు.. వాళ్ళకీ ఉంటుంది ధైర్యం అది హింసాత్మకం కావొచ్చు.. కాని మంచి వాళ్ళు తమపై తమకి నమ్మకం కలిగాక, తాము చేసేది సరైందే అని నిర్ధారించుకున్నాక బలవంతులు గా మారతారు.. ఎందుకంటే వాళ్ళ బలహీనత మంచితనం కదా..... ఏమో.. నాకు ఏది అనిపిస్తే అది రాస్తాను... మీరేమొ నా వ్యాఖ్యలు అసలు ప్రచురించరు...

300 మీద మీ రివ్యూ చాలా బాగుంది. ఐతే, సినిమాలో చూపించిందాంట్లో వాస్తవం తక్కువ, కల్పన పాళ్లెక్కువ. In reality, Xerxes is better known as Xerxes the Great .. and there is more than one good reason for that. In any case, he's definitely not a demon - as was depicted in this movie.

Coming to the guy who played Kind Leonidas

అజ్ఞాత గారు: ఈ విషయం మీద ఒకసారి ఎవరో టపాలో వ్రాయగా చదివినట్లు గుర్తు. ఒకసారి చెక్ చేసి లింక్ ఇస్తానండి.

డల్లాస్ నాగ్ గారు: మన స్వాతంత్ర సంగ్రామంలో ఇలాంటి కథలు కోకొల్లలు. అందుకనే స్వాతంత్ర సమరానికి సంబంధించిన విషయాలు అందుబాటులో లేకుండా చేసారు. అవి చదివితే గాని మన స్వాతంత్రం యొక్క విలువేమిటో ప్రజలకి తెలియదండి. నా రివ్యూ నచ్చినందుకు నెనర్లు! అయితే రివ్యూ ఇంకా పూర్తి కాలేదండి.

కృష్ణ గారు : మీతో నేను ఏకీభవించనండి. చెడ్డవాడికి శక్తి ఎక్కువని మీరు చక్కగా సిద్దాంతీకరించారు. ఆపై మీ విచక్షణ. చదువురాని వాళ్ళల్లో కూడా ధైర్యవంతులు నాకు చాలా మంది తెలుసు.

అబ్రకదబ్ర గారు: దాని చారిత్రక వాస్తవాలు నేను చర్చించటం లేదండి. కల్పనే అయినా ఆ చిత్ర కథనే విశ్లేషిస్తున్నాను. మంచి వివరాలు ఇచ్చారు, నెనర్లు.

మలక్ పేట రౌడి గారు : నెనర్లండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu