300 knights సినిమా గురించీ, దాని ముఖతః నెం.5 వర్గానికీ, నెం.10 వర్గానికీ మధ్య నడిచిన భాష గురించీ చెప్పే ముందు చిన్న విశ్లేషణ.

ఓ సారి క్రింది వార్తని పరికించండి.
సాక్షి పత్రిక వార్తాంశం: 14 మార్చి, 2010

భార్యకు తలుపులు మూశాడు
పురుష అధికారులతో ఢిల్లీ వెళ్లిందని భర్త ఆగ్రహం
ఒరిస్సాలో మహిళా రైతుకు అవమానం
బాధితురాలు జాతీయ అవార్డు గ్రహీత

>>>భువనేశ్వర్‌: ఓవైపు మహిళకు సాధికారత కల్పించడానికి 33 శాతం కోటాతో కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంటే.. మరోవైపు జాతీ య స్థాయి అవార్డును అందుకునేందుకు.. పురుష అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లిందనే ఒకే ఒక్క కారణంతో ఒరిస్సాలో ఓ మహిళా రైతును ఇంట్లోకి రానివ్వడానికి ఆమె భర్త నిరాకరించాడు. పుట్టగొడుగుల సాగులో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు ఒరిస్సాలోని కుసుమ్‌జోర్‌ గ్రామానికి చెందిన మథుర సబర్‌ను (40) జాతీయ స్థాయి అవార్డు కోసం రాష్ట్ర అధికారులు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 26న ఆమె రాష్ట్ర అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

అయితే జాతీయ స్థాయి అవార్డును అందుకున్నానన్న ఆనందం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. పురుష అధికారులతో కలిసి వెళ్లిందనే కారణంతో మథుర భర్త రతన్‌.. ఆమెను ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదు. 'ఢిల్లీ వెళ్లేందుకు ఆయన అనుమతి తీసుకున్నాను. ఇప్పుడేమో.. నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు. నేనెక్కడికి వెళ్లాలి' అని మథుర వాపోయారు. మథుర ఎదుర్కొన్న అవమానం గురించి తెలిసినా.. జిల్లా వ్యవసాయ అధికారులు ఆమెకు ఎలాంటి సాయమూ అందించడం లేదు. 'ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి.. తిరిగి గ్రామానికి క్షేమంగా తీసుకురావడంతోనే మా బాధ్యత తీరి పోయింది' అని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి.సేథీ ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్న మథురకు ఐదుగురు పిల్లలు. మథుర జాతీయ స్థాయి అవార్డు గ్రహీతే కాదు.. మాజీ సర్పంచి కూడా.. ఆమె 1997-2002 మధ్య రిషాగావ్‌ సర్పంచిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మహి ళా స్వయం సహాయక గ్రూపును కూడా నడుపుతున్నారు. భర్త తనను ఇంట్లోకి రానివ్వకపోయినా.. అసహాయరాలిగా భావించ డం లేదని, అయితే తన వ్యక్తిత్వంపై భర్త చేసిన ఆరోపణలే దిగ్భ్రాంతికి గురి చేశాయని మథుర చెబుతున్నారు. ఇది మూర్ఖత్వంలా అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.

పై వార్తలో ఆంధ్రజ్యోతి పత్రిక యధార్ధాలనే ఉటంకించి నట్లయితే....

ఒక సామాన్య మహిళా రైతు మధుర! గతంలో సర్పంచి గానూ పని చేసిందట. ఆమెకూ, ఆమె భర్తకూ ఉన్న వివాదాల విషయం ప్రక్కన బెడితే.... ఇక్కడ వ్యవసాయాధికారి సేధీ స్పందన చర్చనీయాంశం.

తాము ఆమెను ఢిల్లీ తీసికెళ్ళి బహుమతి ప్రదానం చేయించి తిరిగి క్షేమంగా గ్రామంలో దిగవిడిచిపెట్టామనీ, అంత వరకే తమ బాధ్యత అనీ సదరు అధికారి ఇచ్చిన వివరణ! నిజమే! చట్టప్రకారం అంత వరకే అధికారుల బాధ్యత. కానీ సమాజంలో వ్యక్తిగా కూడా అంత వరకే బాధ్యత ఉంటుందా! మధుర భర్త పురుషాంకారంతోనో, మూర్ఖంగానో, అనుమానంతోనో అలోచిస్తుండవచ్చు. పురుషాధికారులతో కలిసి ఢిల్లీ వెళ్ళి వచ్చింది కాబట్టి ఇంట అడుగు పెట్టనీయనంటున్నాడు.

అధికారులు, ఆమె భర్తకు నచ్చచెప్పటం, చుట్టుప్రక్కల వారితో గ్రామపెద్దలతో పంచాయితీ పెట్టించి, అతడిని మరికొంత విశాలంగా ఆలోచించేటట్లు చేయటం, కనీసం అందుకు ప్రయత్నించటం చేయగలరు. వాళ్ళు పూనుకుంటే ఆ గ్రామంలో నలుగురు కలిసి రాకపోరు కదా! తమ స్టాటిస్టిక్స్ కోసం తము, అవార్డుకు ఎంపికలు చేయడం, వెంటబెట్టుకు ఢిల్లీ తీసుకెళ్ళి బహుమతి ప్రదానం చేయించడం, తిరిగి ఊళ్ళో దిగబెట్టటం.... మరీ జీతం కోసం పనిచేయటం, చట్టంప్రకారం పనిచేయటమే! అంకిత భావంతో పనిచేయటం, సేవాభావంతో పనిచేయటం ఎంత మాత్రం కాదు.

ఇక్కడ నా చిన్నప్పటి సంఘటన ఒకటి ఉటంకిస్తాను. నేను స్టాల్ స్కూల్ లో 7 వ తరగతి చదువుతుండగా.... అప్పటికి నాకు 11, 12 ఏళ్ళుంటాయి. ఆ రోజుల్లో 11 ఏళ్ళకే ఓణీలు వేసేసుకోవాలి. ఓణీలు వేసారంటే ఇక పెళ్ళి ప్రయత్నాలు చేసెయ్యాలి. మా నాన్నని మా బంధువులు కొందరు ఆ విషయమై ఒత్తిడి చేస్తూ "ఆడపిల్ల, ఎంత బియ్యేలు చదివినా రేపు బియ్యాలు కడుగాల్సిందే! ఆడపిల్ల ఊళ్ళేలాలా, ఉద్యోగాలు చెయ్యాల! ఇంటికి పెద్దపిల్ల. ఇక పెళ్ళి చేసేయ్" అని నలుగురూ అనేసరికి... మానాన్న ప్రయత్నం మొదలు పెట్టేసారు.

మా అమ్మ మొత్తుకుంది. "చక్కగా చదువుతున్న పిల్ల, చదువులకి ఫీజులు కట్టనక్కర్లేని స్కూలు. చదివిద్దాం" అంది. మా నాన్నఅమ్మ తర్జన భర్జనలు పడుతున్నారు. మా నాన్న "ఎవరో పిల్లనడిగారు. పెళ్ళి చేసేస్తే సరి!" అనే వైపుకే మొగ్గాడు. దాంతో రెండురోజులు నన్ను స్కూలుకు పంపలేదు. మా చెల్లెళ్ళిద్దరూ వెళ్ళారు. స్కూల్లో టీచర్లు అడిగితే సంగతంతా చెప్పేసారు.

అంతే! రెండో రోజు సాయంత్రం మూడు రిక్షాలు వేసుకుని మా క్లాసు టీచరుతో సహా సబ్జెక్టు టీచర్లు నలుగురు మా ఇంటికి వచ్చారు. మా నాన్నతో కనీసం గంటపాటు మాట్లాడారు. "మంచిపిల్ల. చక్కగా చదువుతుంది. టాలెంట్స్ ఉన్న అమ్మాయి" అంటూ నచ్చచెప్పారు. తెలివైన అమ్మాయిననీ, స్కూలుకీ తల్లిదండ్రులకీ కూడా పేరు తెస్తాననీ, చదువు మాన్పించి ఇంత చిన్న వయస్సులో పెళ్ళి చేసేసి ఆమె భవిష్యత్తు నాశనం చేయవద్దనీ చెప్పారు. వాళ్ళకి నేనంటే చాలా వాత్సల్యం. మా నాన్నకీ నేనంటే చాలా ప్రేమ. అప్పటి సామాజిక పరిస్థితులు అవి. అప్పటికి మా బంధువువర్గంలో ఎవరూ అంతగా చదువుకోలేదు. అందునా ఆడపిల్లలని చదివించటం చాలా ఆరుదు.

అలాంటి నేపధ్యంలో మా టీచర్లంతా ప్రత్యేకంగా వచ్చి చెప్పటంతో మా నాన్న చాలా కన్విన్స్ అయ్యాడు. వాళ్ళు చెప్పకపోయి ఉంటే, మా నాన్నని ఒప్పించక పోయి ఉంటే, ఇప్పుడు నేను ఎక్కడ ఎలా ఉండేదాన్నో!

మా పంతులమ్మలు చెప్పిన దానికి మా నాన్న ఎంతగా ముగ్దుడయ్యాడంటే - "నా బిడ్డ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంటికి వచ్చి చెబుతారు? నాకంటే తెలియదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు. అంతమంది వచ్చి చెప్పారంటే - తల్లీ! ఇంక నిన్ను ఆపనమ్మ. నువ్వెంత వరకూ చదువుతానంటే అంత వరకూ చదివిస్తాను" అన్నాడు. అదే ప్రకారం నన్ను వ్యాసరచన దగ్గర నుండి ఏ ప్రతిభా పోటీలకైనా పంపడానికి వెనుకాడ లేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ రోజు మా పంతులమ్మలు వచ్చి మా నాన్నని కన్విన్స్ చేయటం నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఓ విద్యార్ధిని తండ్రి, ఆమెను చదువును మాన్పిస్తానంటే, వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె తండ్రికి నచ్చచెప్పాల్సిన అవసరం మా పంతులమ్మలకి లేదు. చట్టరీత్యా అది వారి బాధ్యత కాదు. బడికి వచ్చిన వాళ్ళకి చదువు చెప్పటంతో వాళ్ళ పని అయిపోతుంది. అంతే కాదు, మా ఇంటికి వచ్చి గంటపాటు మా నాన్నకి చెప్పి ఒప్పించటానికి, తామే స్వయంగా రిక్షాలు కట్టించుకుని వచ్చారు. అందుకు ప్రభుత్వం వాళ్ళకి అదనపు జీతాలివ్వదు. టిఏ లివ్వదు. గంటకు పైగా మాట్లాడినందుకు డిఏ లూ ఇవ్వదు.

అక్కడ అవేవీ వాళ్ళు ఆలోచించలేదు. విద్యార్ధినిగా నా మీద ఉన్న ప్రేమ, వాత్సాల్యం, మంచి విద్యార్ధిని భవిష్యత్తు నాశనం కాకూడన్న ఆతృత! అంతే! జీతం కోసం గాక, అంకిత భావంతో పనిచేసిన వారి ఋణం ఏమిచ్చి తీర్చుకోగలను నేను?

అప్పుడే కాదు, ఇప్పుడు కూడా, కొందరు టీచర్లు, బాగా చదివే పిల్లలకి తమ డబ్బుతో పుస్తకాలు కొనిచ్చి, పరీక్ష ఫీజులు కట్టి ప్రోత్సహించటం చాలాసార్లు చూశాను. వాళ్ళెవ్వరూ "ఇంత వరకే మా పని!" అని చట్టపు పరిధిని వెదుక్కోవటం లేదు.

జీతం కోసం పనిచేస్తే చట్టప్రకారం అన్నీ ఓకే! కాని ఆత్మతృప్తి కోసం పనిచేస్తే.... అంకిత భావమూ, సేవాభావమూ వాటంతట అవే వస్తాయి. అది దృక్పధంతో మాత్రమే వస్తుంది. ప్రతి పనికీ దమ్మిడీలల్లో గాకుండా.... ఆత్మ తృప్తి వంటి అనుభూతుల కోసం పనిచెయ్యాలన్న దృక్పధం ఉంటేనే, మంచి సమాజం సాధ్యం. ఒకప్పుడు ఈ దృక్పధం ఉండేది. అదే గురు ధర్మం, శిష్య ధర్మం, ఉద్యోగ ధర్మం, ప్రభు ధర్మం, పాలక ధర్మం , పౌరధర్మం... ఇలా.... నమ్మకాల ఆధారంగా, మతపు పునాది మీద నిలబడిన స్తంభాల్లా, సమాజమనే రమ్య హర్మాన్ని ఠీవిగా నిలబెట్టేవి.

ఆయా ధర్మాల్ని ప్రభోదించిన హిందూ మతం, జీవన విధానం, ధ్వంసం చేయబడుతుండటమే ఈ రోజు మనం చూస్తున్న సేధీల వంటి అధికారులు తయారవ్వటానికి కారణం. ఒక్క అధికారి ఇంటి మీద దాడిచేస్తే వందల కోట్లు బయట పడటానికీ కారణం ఇదే! ఇక రాజకీయ నాయకుల ఇళ్ళ మీద దాడులు చేయటం లేదు గానీ, చేస్తే లక్షల కోట్లో, వేల కోట్లో బయట పడకపోవు. మధుకోడాలు మచ్చుకి ఒక్కరు కదా! స్విస్ బ్యాంకులు అసలు సిసలు మచ్చుతునకలు.

~~~~~~~~~~ ~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~

మరో వార్త పరిశీలించండి.
>>>ఆంధ్రజ్యోతి వార్తాంశం: 26 ఫిబ్రవరి, 2010.

పాలివ్వడమే పాపం
వర్షమని చూడకుండా బస్సులో నుంచి తల్లీబిడ్డ గెంటివేత
బ్రిటన్‌లో మాతృమూర్తికి ఘోర అవమానం
లండన్, ఫిబ్రవరి 25: తల్లి బిడ్డకు పాలివ్వడం అశ్లీలంగా కనిపించిందో దుర్మార్గునికి... మాతృత్వానికి ఘోర అవమానం జరిగింది. క్రూరుడైన బస్సు డ్రైవర్ జోరున వర్షం కురుస్తున్నా చూడకుండా తల్లీ బిడ్డను బస్సులోంచి బలవంతంగా కిందకు గెంటేశాడు. ఇదెక్కడో అభివృద్ధి చెందని అనామక దేశంలోనో, లేక మన మారుమూల పల్లెల్లోనూ జరిగిన సంఘటన కాదు. ప్రపంచానికి నాగరికత నేర్పామని విర్రవీగే బ్రిటన్‌లో. 25 ఏళ్ల ఎమి వూటన్ అనే మహిళ ఆర్నెళ్ల పసికందును తీసుకుని ఆఫీసు నుంచి బస్సులో ఇంటికి బయలు దేరింది.

అప్పటికే బస్సు నిండా జనం కిక్కిరిసి ఉన్నారు. బయట జోరున వర్షం కురుస్తోంది. పాప ఆకలితో ఏడ్చేటట్టుంది. అప్పటికీ చాలా సేపు ఆలోచించింది. ఇక తప్దనుకుని పాలివ్వడం మొదలు పెట్టింది. అంతే ఏదో ఘోరం జరిగినట్టు ఒక తోటి ప్రయాణికుడు ఫిర్యాదు చేయడం, కొంపలు మునిగినట్టు డ్రైవర్ వచ్చి కిందకు దిగాలని ఆదేశించడం జరిగిపోయింది. పాప ఆకలితో ఉందని, పాలివ్వకపోతే ఏడుస్తుందని, అప్పుడు అందరూ ఫిర్యాదు చేస్తారని ఆమె ఎంత వేడుకున్నా డ్రైవర్ కనికరించలేదు. బిడ్డకు పాలిచ్చేటప్పుడు స్తనం కనిపించకుండా ఎలా ఉంటుందని నిలదీసింది.

అరచేతులు, పాదాలు కనిపించడం లేదా? అలాగే ఇది కూడా? అని ఎంత వాదించినా ప్రయోజనం లేకుండాపోయింది. బస్సులోంచి బలవంతంగా కిందకు దించేశాడు. అవమాన భారంతో ఆ తల్లి ట్యాక్సీలో ఇంటికి చేరుకుంది. ఈ వార్త పత్రికల్లో గుప్పుమనడం, నేషనల్ హెల్త్ సొసైటీ వారు రంగంలోకి దిగడంతో ఆ బస్సును నడుపుతున్న ఫస్ట్ బ్రిస్టల్ సంస్థ దిగి వచ్చింది. ఆ తల్లిని క్షమాపణలు వేడుకుంది.
~~~~~~

ఇంగ్లాండుతో పాటూ పాశ్చాత్యదేశాలలో, పూర్తి నగ్నంగా ఉన్న ఫోటోలతో పత్రికల కవర్ పేజీలు రావటం ఉంది. బిబిసీ వంటివి న్యూడ్ ఫ్రైడే లని నిర్వహిస్తామనటం [సామూహికంగా స్త్రీ పురుషులు, యాంకర్లతో సహా పాల్గొనే కార్యక్రమం] జరిగింది. నిర్వహించారో లేదో తర్వాత ఫాలో అప్ వార్తని ఎవరూ ప్రచురించలేదు.

బహిరంగ ప్రదేశాలలో చుంబనాలు, అర్ధనగ్న దుస్తులతో యువతీ యువకులు తిరగడాలూ.... అశ్లీలం, అసభ్యకరమూ, అభ్యంతరమూ కాదు గానీ, తల్లి బిడ్డకి స్తన్యమందించి పాలివ్వటం మాత్రం అభ్యంతరమైందట.

అదృష్టవశాత్తు భారతదేశంలో ఇంకా అమ్మలు పమిట లేదా చున్నీ ధరిస్తున్నారు గనక అంత పరిస్థితి రాలేదు. ఒక వేళ వాణిజ్య ప్రకటనల్లోనో నవీన సినిమాల్లోనో చూపినట్లు, ప్యాంటు చొక్కాలు ధరించిన అమ్మలు ఎక్కువైపోయి, అలాంటి స్థితే ఇక్కడా దాపురించినా డ్రైవరూ, కండక్టర్లు అలా అనరు. అంటే నలుగురూ [పల్లె బస్సుల్లో అయితే ఖచ్చితంగా] చీవాట్లు పెడతారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే పోయి రోడ్డుప్రక్కన చెట్టు క్రింద కూర్చొని బిడ్డకు పాలుపట్టమంటారు. కాస్త పెద్దవయస్సు వాళ్ళుంటే, శుభ్రంగా చీర కట్టుకోవచ్చు గదా అని ఆ ఆధునిక వస్త్ర ధారణల తల్లిని కూడా చీవాట్లు పెడతారు. అదీ సామాజిక బాధ్యత. దాన్ని బస్సు డ్రైవర్ కూ, కండక్టర్ కూ, తోటి ప్రయాణీకులకూ చట్టం నేర్పదు. మానవత్వంతో, పసిబిడ్డ ఆకలి పట్ల తల్లి ప్రేమ పట్ల ఉండే concern తో వస్తుంది.

హాలీవుడ్ నటీమణుల దగ్గరి నుండి క్రీడా కారిణుల వరకూ పాలిండ్లనీ, పిరుదులనీ ప్రదర్శిస్తూ పెద్దపెద్ద హోర్డింగులుంటే తప్పలేదు గానీ ఆకలి గొని ఏడ్చే చిన్నారి పాపనోటికి తల్లి స్తన్యం అందిస్తే తప్పా? ఎంత గొప్పగా చట్టాన్ని అమలు చేయటం ఇది?

~~~~~~~~~~ ~~~~~~~~~~~~ ~~~~~~~~~~~

ఇక మరో వార్త చూడండి.
సాక్షి పత్రిక వార్తాంశం: 14 మార్చి, 2010

ఆకలిమంటకు ఏనుగే స్వాహా!

హరారే: జింబాబ్వేలోని గొనారెంరnౌ నేషనల్‌ పార్కులో మరణించిన ముసలి ఏనుగు ఆకలితో అలమటిస్తున్న జనానికి ఆహారమైంది. ఇరవై నాలు గు గంటల తర్వాత ఇదే చోట చూస్తే, మిగిలినవి ఎండిన నెత్తుటి మరకలు మాత్రమే. ఆకలిగొన్న జనం ఏనుగుకు ఏనుగునే స్వాహా చేసేశారు. తొలుత ఒక గ్రామస్థుడు సైకిలుపై వెళుతూ, ఆరు టన్నుల ఏనుగు కళేబరాన్ని గమనించాడు. మిగిలిన జనానికి సమాచారం అందడంతో, అందరూ చేతికందిన ఆయుధాలు పట్టుకుని వచ్చి, ఏనుగు కళేబరంపై ఎగబడ్డారు. అందినంత మాంసాన్ని కోసుకు పోయారు.

చివరకు ఎముకలను కూడా కొందరు సూప్‌ తయారు చేసుకునేందుకు తీసుకుపోయారు. రాబర్ట్‌ ముగాబే హయాంలో జింబాబ్వే ఆర్థికంగా సంకట స్థితిని అనుభవిస్తోంది. జింబాబ్వే కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. బస్తా నిండా కరెన్సీ తీసుకుపోయినా, గుప్పెడు తిండి గింజలు లభించని దుర్భర పరిస్థితి. వ్యవసాయం కుంటుపడి, పంటల దిగుబడి గణనీయంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏనుగుల వంటి భారీ జంతువులు లభిస్తే, ఆకలిగొన్న ఇక్కడి ప్రజలకు పండగే.

~~~~~~~~~

నలిగి పోతున్న వ్యవసాయాన్ని, పెచ్చరిల్లుతున్న అవినీతిని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే.... ఇప్పటి జింబాబ్వే వర్తమానం, రేపు ప్రపంచదేశాల [భారతదేశంతో సహా] భవిష్యత్తు అవుతుంది.

ఇది పరమ చేదుగా ఉన్నా, పచ్చి నిజం. చట్టాలు మనుష్యులు నిర్మించుకున్నవి. అవి కొంత మేరకు మాత్రమే సమాజాన్ని నియంత్రించగలవు. ప్రధానంగా సమాజాన్ని ప్రభావ పరిచేవి, నియంత్రించేవి నమ్మకాలు, ధార్మిక భావనలు.... మొత్తంగా చెప్పాలంటే దృక్పధం.

సత్యం,నిజాయితీ, మానవత్వంలతో కూడిన దృక్పధం లేనప్పుడు ఎన్ని చట్టాలు చేసినా ఏ ప్రయోజనమూ ఉండదు. ఎంత ఆర్భాటాలు చేసినా మహిళా బిల్లులు ఉద్దరించగలిగేదీ ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి చట్టానికీ వందలొసుగులూ ఉంటాయి. వాటి ఆధారంగా ఆయా చట్టాలని భేషుగ్గా తుంగలో తొక్కనూ వచ్చు. ఆపైన మళ్ళీ ’చట్టానికి కళ్ళు లేవు’ అంటూ విమర్శలూ చేసుకోవచ్చు, సినిమాలు తీసుకుని వ్యాపారాలూ చేసుకోవచ్చు. ఉండాల్సింది చట్టాలొక్కటే కాదు, సామాజిక బాధ్యత కూడా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

లక్ష్మి గారు,

'సామజిక భాధ్యత ' మీద మీరు రాసిన ఈ టపా, చాలా బాగుంది. 'బాగుంది ' - అనడంకంటే, ఈ టపా చదివిన అందరికి, కనీసం ఒక 5 నిమిషాలు 'సమాజం' గురించి అలొచింపచెసే విధంగా, రాసిన ప్రతి విషయానికి వొక వుదాహరణ/వివరణతొ ఇవ్వడం వల్ల, ఈ టపా ద్వారా మీరు ఆశించిన 'ప్రేరణ ' తప్పకుండా కలగాలని ఆశిస్తున్నాను.

-శ్రీరాం.

ఆలోచింపచేశారండీ మీ పోస్టుతో.చాలా బావుంది.

మీ చదువును కొనసాగించడానికి కారకులైన గురువులను మాకు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కూడా అలాంటి గురువులను అక్కడక్కడా గమనిస్తూనే ఉన్నాను. కాకపోతే పెద్దగా వెలుగులోకి రావడం లేదంతే.

ఆదిలక్ష్మి గారూ !

మీకు, మీ కుటుంబానికి శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో...

- శిరాకదంబం

శ్రీరామ్ గారు : ప్రేరణ మనం కల్పించలేమండి. ఎవరికి వాళ్ళకి తమలో నుండే రావాలి. నెనర్లు!

చెప్పుదెబ్బలు పూల దండలు గారు : నెనర్లండి!

రవిచంద్ర గారు: అలాంటి వారు తము వెలుగులోకి రావాలని కూడా పెద్దగా కోరుకోరండి. నెనర్లు!

SR Rao గారు : మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు.

http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=455450&categoryid=1&subcatid=32

అజ్ఞాత గారు : రామోజీరావుకు సంబంధించిన వార్తాంశంన్ని ఉదయం నేను చూసానండి. కాని మీరు గుర్తుంచుకుని లింక్ పంపినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడయినా మేము చూడకపోయే అవకాశాలు ఉంటాయి కదా! నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu