మనం పరిశీలించిన విషయాలని, సంఘటనలని, వ్యక్తులని గురించి విశ్లేషించేటప్పుడు, ’నేను - నా అభిమానం, నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు నచ్చని అంశం’ - వీటన్నిటిని దాటి ఆలోచించాలి. ’నేను ’ అనే అహంకారాన్ని, మన తాలూకూ భావోద్రేకాలని, అరిషడ్వర్గాలనీ వదిలేసి ఆలోచిస్తేనే ’సత్యాన్ని’ చేరగలం.

ఇందుకు గీత లో చెప్పినట్లుగా సాధన అవసరం. మనో బుద్ది నియంత్రణ తప్పనిసరి! గీతని పారాయణ చేయటం కాదు, ఆచరిస్తేనే ఈ స్థితికి చేరగలం. [పారాయణ చేస్తూ ఉంటే అసంకల్పితంగానూ, అప్రయత్నంగానూ, కొన్నాళ్ళకీ మనకి తెలియకుండానే ఆచరణ మార్గంలోకీ వచ్చేస్తాం. అందుకే పెద్దలు పారాయణ చేయమంటారు. ప్రసాదం కోసం గుడికి వెళ్ళినా క్రమంగా భక్తి కుదురుతుంది, భగవంతుడిపై మనస్సు లగ్నమౌతుంది. అలాగే ఇదీనూ!]

కాబట్టే ’ఆచరణ - పరిశీలన’ అన్నది - విషయాలని అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడే తాళం చెవి [Key or Pass word] అన్నాను.

కాబట్టే నా గతటపాలలో ఏదైనా క్లిష్ట విషయాన్ని , వై.యస్. మరణం నేపధ్యాన్ని వివరించేటప్పుడు ’నేను నా అభిమానం’ అన్నది దాటి ఆలోచించాలని వ్రాసాను. ఎందుకంటే ’సత్యం’ అన్నది వ్యక్తి కంటే విలువైనది, ’సత్యం’ అంటే సాక్షాత్తూ భగవంతుడే గనక! ఆ భగవంతుడి దయ మా మీద ఉంది గనుకేమో, మా జీవితాలలో గూఢచర్యపు ఉనికిని గుర్తించుకోని సమయంలో సైతం భగవంతుణ్ణి "చేదుగా ఉన్నా సరే, దేవుడా! మాకు నిజమే తెలియజేయి. ఆ నిజాన్ని ఇంకించుకునే మానసిక శక్తిని ఇవ్వు!" అని కోరుకునే వాళ్ళం.

అందుకే మరోసారి చెబుతున్నాను - నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గానికీ, నెం.5 వర్గానికీ మధ్య నడుస్తున్న ఈ ’మెదళ్ళతో యుద్దాన్ని’ అర్ధం చేసుకునేందుకు మాకు ఉపయోగపడింది ’ఆచరణ - పరిశీలన’లే! ఇక్కడ మీకు ఓ విషయము స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.

ఏమిటంటే....

నాకు 1992 లో రామోజీరావు వ్యవహారాలు తెలిసినప్పుడు, ’ఇది నా దేశం. ఇలా జరక్కూడదు’ అనుకున్నాను. అప్పటికి రామోజీరావు తాలూకూ గూఢచర్యం ఎంత విస్తారమో నాకు తెలియదు. అసలు దాన్ని గూఢచర్యం అంటారని కూడా తెలియదు. అయితే, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలు సైతం తీయగలిగిన వాళ్ళని తెలుసు. కాబట్టి అతడి గురించి ఫిర్యాదు చేయటం అంటే ప్రాణాలకు తెగిస్తున్నానని తెలుసు. నా కుటుంబసభ్యుల్ని అడిగాను. మా నాన్న "కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా అరఘడియ బ్రతికినా చాలు. ముందుకే వెళ్ళమ్మా" అన్నాడు.

ఢిల్లీ వెళ్ళి పీవీజీ కి ఫిర్యాదు చేశాను. తదనంతర పర్యవసానాల్లో ఆత్మీయులు, కుటుంబసభ్యుల నుండి దూరమయ్యాను. ఒంటరిగా మిగిలిన నాకు, తోడు నీడగా నిలిచినవాడు లెనిన్. నన్ను కట్టుకుంటే జీవితం పూలబాట కాదని తనకి తెలుసు. "దేశం కోసం ఈ అమ్మాయి చేసింది. గెలుపు వస్తే ఎలా పంచుకునేవాణ్ణో, ఓటమినీ అలాగే పంచుకుంటాను. ఈ దేశం తన ఒక్కదానిదే కాదుగా! ఏమైనా ఈ పనిని ప్రారంభించినది తను. తనతో పాటే నేను. మధ్యలో విడిచిపెట్టను" అన్నది తన దృఢాభిప్రాయం.

ఓడిపోయి.... ఒంటరిగా నిలిచి.... "కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, ఆత్మబంధువులనుకున్న స్నేహితులూ, అందరూ నన్ను వదిలేసారు. నువ్వూ వెళ్ళిపో! నా ఖర్మాన నన్ను వదిలెయ్" అంటూ.... ఎవరి మీదా చూపలేని నిస్సహాయతనీ, ఆక్రోశాన్ని వెంటనున్నందున తన మీద చూపిస్తూ చాలా సార్లూ ఏడ్ఛాను. అప్పుడు తను వ్యక్తీకరించిన అభిప్రాయం ఇదే! నాకు తోడుగా నిలబడటంలో తాను చూపించిన ధృఢత్వానికి ఏమిచ్చీ ఋణం తీర్చుకోలేను కూడా! అందుకే నా జీవితాన్నే ఇచ్చేసుకున్నాను. తను....నా మెడలో తాళి కట్టి నాకు తోడుగా నిలబడిన ఈ 17 ఏళ్ళలో.... నవ్వులూ నష్టాలూ, ఆనందాలూ ఆపదలూ కలిసే ఎదుర్కొన్నాము. ఫిర్యాదు చేస్తూ నేను ప్రాణాలకు తెగించినట్లే, నాకు తోడుగా తనూ ప్రాణాలకూ తెగించి నిలబడ్డాడు.

అటువంటి మాకు - పీవీజీ అయినా, నెం.5 వర్గమైనా ఏమిస్తే మమ్మల్ని రక్షించ గలదు? మా ప్రాణాల కంటే విలువైనవి మాకు మరొకటి ఉండవు. ఎవరికైనా అంతే కదా! మా ప్రాణాలు రక్షించటానికి మార్గమేది? కోట్ల కొద్దీ డబ్బు ఇస్తే, అది మా ప్రాణాలని రక్షించలేదు, మా ప్రాణాల కంటే విలువైనదీ కాదు. ఆ డబ్బు మమ్మల్ని కాపాడదు. మాకు సుఖ సంతోషాలనీ ఇవ్వలేదు.

ఎందుకంటే - కోట్ల కొద్దీ డబ్బు అయినా ’గూఢచర్యం గురిపెట్టబడిన వ్యక్తి’ నుండి ఊడగొట్టటం ఎంత సేపు? అసలుకే డబ్బుశాశ్వతం కాదు. 125 ఏళ్ళ కెరీర్ గల లెమాన్ బ్రదర్స్ కళ్ళముందు కుప్పకూలింది. సినిమాలలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, సూపర్ స్టార్ గా కోట్ల కొద్దీ డబ్బు గడించిన అమితాబ్ బచ్చన్, 1992 తర్వాత ABC [అమితాబ్ బచ్చన్ కార్ఫోరేషన్] స్థాపించి అప్పులు పాలై, ముంబైలో నివాస గృహాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చిన తరుణంలో ’కౌన్ బనేగా కరోర్ పతి’ టీవీ కార్యక్రమంతో తిరిగి నిలదొక్కుకున్నాడు. గూఢచర్యం గురిపెడితే ఎంతటి సంపన్నుడికైనా అదే పరిస్థితి!

3000 కార్లు, 360 మంది భార్యలూ, ప్రియురాళ్ళు కలిగిన విలాస సంపన్నుడు బ్రూనే యువరాజు [సుల్తాన్ సోదరుడు], 1992 తర్వాత ఓ దశలో కార్లు అమ్ముకునే దశకు చేరాడు. ఆ మధ్య పెట్రోల్ రేట్లు [బ్యారెల్ 147+ డాలర్లు] పలికినప్పుడు మళ్ళీ పుంజుకున్నాడు లెండి.

కాబట్టి డబ్బుతో ఒరిగేదేమీ లేదు. పూర్వకాలపు జానపద కథల్లోలాగా ఒంటిస్తంభం మేడలోనూ ఉంచలేరు కదా? అందునా గూఢచర్యం ఎంత నిర్ధాక్షిణ్యమో, కౄరమో నెం.5 వర్గానికీ, పీవీజీకి స్పష్టంగా తెలుసు. ఎంత స్పష్టంగా అంటే - తన మరణానంతరం తన పార్దివ శరీరాన్ని సైతం అవమానించగలరని ముందుగానే ఊహించగలిగినంత స్పష్టంగా! ఈ నిర్ణాక్షిణ్యమూ, ఈ కౄరత్వమే మా పాప పుట్టిన సందర్భంలో మాకు అనుభవంలోకి వచ్చింది. గూఢచర్యపు కాఠిన్యం అప్పుడే గాక మరెన్నో సార్లు మా బుర్రలకీ ఇంకే దాకా అనుభవానికొచ్చింది. కాబట్టి కూడా దీన్నుండి మమ్మల్ని రక్షించే ఒకే ఒక నౌక గా ’భగవద్గీత’ మాకు కన్పించింది.

అలాంటప్పుడు .... ఏది ఇస్తే, ’ప్రాణాలకు తెగించిన’ మాకు, మా పనికి ప్రతిఫలం అవుతుంది? ’ఏం చేస్తే.... పీవీజీ మా ప్రాణాలని, తనున్నా లేకపోయినా కూడా రక్షించిన వాడవుతాడు? అది ఒక్కటే! గూఢచర్య జ్ఞానం. దాన్నే ఆయన మాకిచ్చాడు. దాన్నే మాకు నెం.5 వర్గం నేర్పింది. ఎలాగంటే - ఈనాడుని, రామోజీరావునీ పరిశీలించడం ద్వారా! ఆ జ్ఞానాన్నే ఇప్పుడు మీతో మేము పంచుకుంటున్నది. ఇంతకీ... ఈనాడుని, రామోజీరావుని పరిశీలించడం ద్వారా మాకిందంతా ఎలా అర్ధమయ్యింది అంటారేమో? అనుభవం అన్నిటినీ నేర్పుతుంది కాదా! మా పై రామోజీరావు వేధింపు - దాన్నుండి మేం నేర్చుకున్న పాఠాలులో కూడా కొన్ని వ్రాసాను.

అంతేకాదు, రామోజీ రావు తదితరుల అసలు రూపాన్ని ఎలా నిరూపించాలా? సాక్ష్యాధారాలు ఎలా సేకరించాలి? ఇందుకు తగినంత సమయం కావాలి. అలాగే మా ప్రాణాలనీ రక్షించాలి. అందుకే అనుభవపూర్వకంగా గూఢచర్యం నేర్చుకోవాల్సిన స్థితికి మేము తరమబడ్డాము.

ఇలా అనుభవంతో పాఠాలు నేర్చుకోవటం... 1992 లో పీవీజీకి ఫిర్యాదు చేసిన రెండు నెలలు లోపలే మొదలైంది. జూన్ 5 న, నేను పీవీజీకి ఫిర్యాదుని సీల్డ్ కవర్ లో ఇచ్చాను. జూలైలో మా ఇంటికి ఐబి అధికారులు వచ్చి నా ఫిర్యాదు ప్రధానికి అందిన విషయం confirm చేశారు. అప్పుడు మొదలైంది ఇది!

2 km ల దూరంలో నేనుంటే, ఫిర్యాదు ఇచ్చిన నన్ను వదిలేసి 2000 km ల దూరంలో ఉన్న నా తల్లిదండ్రుల్ని ఎందుకు కలవటం? వాళ్ళు నన్నెందుకు contact చేయరు? నేనున్న హోటల గది నెంబరు, ఫోన్ నెంబరు అన్నీ.... తాత్కాలిక చిరునామా క్రింద వ్రాసాను. శాశ్వత అడ్రసు క్రింద ఫ్యాక్టరీ చిరునామా వ్రాసాను. మరి నన్నెందుకు కలవరు?

ఇందుకోసం ’ప్రధాని పీవీజీ నాకు ఇంటర్యూ ఇవ్వాల్సిందే’ నంటూ మూడు రోజులపాటు రేసుకోర్సు రోడ్ లోని పీవీజీ ఇంటి రిసెప్షన్ దగ్గర బైటాయించాను. నిరాహారంగా! మూడోరోజు రాత్రి నన్ను, నా వెంట నున్న నా తమ్ముణ్ణి, పార్లమెంట్ రోడ్ లోని పోలీసు స్టేషన్ కి తీసికెళ్ళారు. అర్ధరాత్రి! అప్పటికి మూడురోజులుగా అన్నం తీనలేదు. పోలీసు స్టేషన్ కి కెళ్ళాక, అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకి, ఆంధ్రాభోజనం తెప్పించి పెట్టారు. మహిళా పీసీల గదిలో నిద్రపోమ్మన్నారు. మర్నాడు పొద్దున మమ్మల్నెవరూ పట్టించుకోలేదు.

మళ్ళీ PMR [Prime Minister Residence] కి వెళ్ళి బైటాయించాను. లోపలి నుండి కృష్ణమూర్తి అనే ఉన్నతాధికారి వచ్చి "ఏం కావాలమ్మా! నన్నెందుకు కలవాలను కుంటున్నారు?" అని అడిగాడు. నేను మొదట తెల్లబోయాను. తర్వాత "అసలు మీరెవ్వరో కూడా నాకు తెలియదండి. నేను మిమ్మల్ని కలవాలన లేదు. పీ.ఎం.ని కలవాలనుకుంటున్నాను" అని చెప్పాను. ఆయన "నా పేరు కృష్ణమూర్తి అమ్మా! ఎవరో మీరు నన్ను కలవాలంటున్నారంటే వచ్చాను" అన్నాడు.

ఆ తర్వాత ఢిల్లీలో పదీ జనపథ్ కు వెళ్ళి సోనియాని కలవడానికి ప్రయత్నించాను. ఇంటర్యూ ఇవ్వలేదు. PMO [Prie minister Office] కు వెళ్ళి పిఎంని కలవాలని ప్రయత్నించాను. OSD [Officer on Special Duty] ఖండేకర్ ని కలవమని రిసెప్షన్ లో చెప్పారు. పాస్ ఇచ్చారు. [2005 లో అయితే అంత సీన్ కూడా లేదు. Dock Section లో కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు.] అతడితో మాట్లాడాక, ఇక ఫ్యాక్టరీకి తిరిగి వచ్చాను. ఢిల్లీలో ఉండగా, ఫ్యాక్టరీకి వచ్చాక, జరిగిన అనేక సంఘటనలు... వేటికవి.... అడ్డదిడ్డంగా.... అస్తవ్యస్తంగా అన్పించినా.... ఏదో శృతి, అర్దమయీ కానట్లుండేది.

పీవీజీని, దేశాన్ని పరిశీలిస్తే... పంజాబ్ టెర్రరిజం, మండల్ - మందిర్ సమస్యలు చల్లారటం వంటి ’మంచి జరగటం’ కనబడేది. మా జీవితాల్లో మాత్రం ’మంచి జరగక పోగా చెడు జరగడం’ అనుభవానికి కొచ్చింది. నా ఫ్యాక్టరీని పంచనామా కూడా లేకుండా సీజ్ చేసారు. ఒక్కరూల్ పాటించలేదు. అలాగే APSFC వాళ్ళు జీతం ఇచ్చిమరీ సెక్యూరిటీ గార్డులని పెట్టారు. వాళ్ళు శుభ్రంగా తోటపని, ఇంటిపని చేసిపెట్టేవాళ్ళు. నా ఫ్యాక్టరీని మాత్రం నడపటానికి లేకుండా చేసారు.

అలాగని పీవీజీనే దేశద్రోహి, రామోజీరావుకి తోడు దొంగ అయితే దేశానికి మంచి చేయడు. సరిగదా, మా పీకలు కోస్తాడు. అది జరగలేదు. పోనీ మన ఫిర్యాదు ఆయనకి అసలు చేరలేదేమో అనుకోవటానికి లేదు. ఐబి అధికారులు ఫ్యాక్టరీకి వచ్చీ, నేను PMO లో కలిసినప్పుడు OSD , నాకు ఆ విషయం నిర్ధారణ చేశారు. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? ఎస్.బి.చవాన్ హోమంత్రి హోదాలో ’సిఐఏ ఏజంట్స్ ప్రతికాధిపతులలో ఉన్నారు’ అంటూ ప్రతికా ప్రకటన చేశాడు. ఏ పత్రికలు కిమ్మనలేదు కూడా!

మొదట్లో... మా ఊహకి భారత కేంద్రప్రభుత్వం కంటే రామోజీరావు ఏమాత్రం గొప్పవాడు కాదు. తర్వాత్తర్వాత రామోజీరావు వెనుక అమెరికా సీఐఏ ఉంది. కాబట్టి ’ఈరోజు కేసు, రేపు అరెస్ట్’ అనే పరిస్థితి కాదు అనుకున్నాము. మొదట్లో ఏమీ అర్ధం కాలేదు. కార్యకారణాలు లెక్కగట్టుకున్నాము. కొంత స్పష్టత, ఎక్కువగా అస్పష్టత ఉండేది. తదనగుణంగా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. నేను బయటకు వచ్చాను. మళ్ళీ నేను ఫ్యాక్టరీకి తిరిగి వెళ్ళే వరకు APSFC వాళ్ళు గాని, Bank వాళ్ళు గాని వచ్చి మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. 1992 నుండి 1995 చివర వరకూ ఫ్యాక్టరీని జప్తు చేసుకోలేదు.

మేం తిరిగి వచ్చిన తరువాత మా ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాటకీయంగా చంద్రబాబు నాయుడి కొడుకు నా తమ్ముడితో పరిచయం, తర్వాత పెట్టుబడి పెట్టి షాపు పెట్టించడం గట్రా గట్రా జరిగిపోయాయి. వాళ్ళు ఫ్యాక్టరీ నుండి వెళ్ళిపోగానే APSFC వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీని ఖాళీ చేయమని అడిగారు. ఆ విధంగా, ఇన్ని నాటకీయతల మధ్య, నేను స్థాపించిన ఫ్యాక్టరీ నా చేతుల మీదనే వదులు కోవలసి వచ్చింది. వీటి గురించి మా కథలో వివరించాను.

ఫ్యాక్టరీ పోగొట్టుకున్నందుకు బాధకంటే పెంచిన మొక్కలు వదులు కున్నందుకు బాగా బాధవేసింది. నా కష్టం, నా కుటుంబసభ్యుల కష్టం మొత్తం నష్టపోయాము. ఆ ఫ్యాక్టరీ ఖాళీ చేసేముందు ఐబి ఆఫీసుకు వెళ్ళాను. అంతక్రితం [1992లో] ఏమయినా అవసరం అయితే కాంటాక్ట్ చేయమని చెప్పారు. ఆ రిఫరెన్స్ తో ఐబి అధికారిని కలిస్తే ’తాను కొత్తగా వచ్చానని, తనకి ఏమీ తెలియదని’ చెప్పాడు. ’నా స్థానం లో మీరుంటే ఏం చేస్తారని’ సలహా అడిగితే ’నుదిటి రాతను నమ్ముకుంటాను’ అని సలహా ఇచ్చాడు. అందరూ ఒకే శృతి, లయ తో ఇక ఫ్యాక్టరీ విషయం వదిలేసుకుని మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించమని సలహాలిచ్చారు. ఆ విధంగా నంబూరు గ్రామం చేరాము. ఆ విధంగా రామోజీ రావు మీద నేను పెట్టిన ఫిర్యాదుకు, సాక్ష్యాలు సేకరించటానికి పునాది పడింది. ఆ అవగాహన అప్పుడు మాకు లేదు.

ఇక్కడ, మీకు ఓ పోలిక చెబుతాను. ఇది నేను 1992 ద్వితీయార్ధంలో[ఫిర్యాదు ఇచ్చిన తర్వాత] టెలిస్కూలు కార్యక్రమంలో చూశాను.

ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి, ఓ మాష్టారి దగ్గరి కొచ్చి తనకు చదువు చెప్పమని అడుగుతుంది. ఆమె నిరక్షరాస్యురాలు. మేకల్ని మేపుకుంటూ బ్రతుకు తుంటుంది. మాష్టారు ఆ పిల్లతో "అమ్మాయి! నీకు చదువుకోవాలన్న ఆసక్తి కలగటం బాగుంది. అయితే నీ దీక్ష సరైనదో కాదో తెలియాలి. ఏదో కొత్త ఉత్సాహం కొద్దీ నాలుగురోజులు ప్రయత్నించి, తర్వాత నిర్లక్ష్యం చేసేటట్లయితే నీకు చదువు నేర్పను. అది నీకూ నాకూ కూడా సమయం దండగ" అంటాడు.

ఆ అమ్మాయి తను దీక్షగా చదువుకుంటానంటుంది. ఆమెకు చదువు చెప్పేందుకు గురువు గారు ఓ షరతు విధిస్తాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రవేశ పరీక్ష లాంటిదన్న మాట. భారత దేశ మ్యాపు తీసుకుని, దాన్ని అడ్డదిడ్డంగా ముక్కలుగా చింపి, ఆ పిల్ల చేతికిస్తాడు. "ఇది భారతదేశ పటం. దీన్ని మళ్ళీ ఇలాగే అతికించుకు రా. అలా చేస్తే నీకు చదువు నేర్పుతాను" అంటాడాయన.

ఆ అమ్మాయి మర్నాడు మాష్టారి దగ్గరికి వస్తుంది. పారదర్శకంగా ఉన్న సెల్లో టేపుతో చక్కగా అంటించిన భారత దేశపటాన్ని మాష్టారి ముందు పెడుతుంది. అక్షరమ్ముక్క రాని పిల్ల! మ్యాప్ అంటే ఏమిటో కూడా తెలియని పిల్ల! అంత సరిగ్గా ఎలా అంటించింది? విభ్రమానికి, ఆనందానికి గురైన మాష్టారు "ఇంత సరిగ్గా ఎలా అతికించావు తల్లీ!" అంటాడు.

ఆ అమ్మాయి నవ్వుతూ "సార్! మీరు ముక్కలుగా చింపి ఇచ్చిన ఈ పటం వెనకాల మనిషి బొమ్మ ఉందండి. మనిషి కాళ్ళూ చేతులూ తలా సరిగ్గా అతికించి, తిప్పి చూస్తే దేశపటం సరిగ్గా వచ్చింది" అంటుంది.

మాష్టారు ఆ మ్యాప్ ని తిప్పి చూస్తే, వెనకాల, అతకటానికి ఉపయోగించిన సెల్లో టేపుల క్రింది నుండి, జీవశాస్త్ర పాఠంలోని రక్తధమనులు, సిరలని విశదీకరిస్తున్న మనిషి చిత్రపటం ఉంటుంది.

ఆయన ఎంతో సంతోషంగా, వాత్సల్యంగా, ఆ అమ్మాయి తల మీద చేయి వేసి దీవిస్తూ "చదువుల సారం ఇదే తల్లీ! ఇది తెలిస్తే ఏ విద్యనైనా నేర్చుకోవచ్చు" అంటాడు. ఇది టెలిస్కూలు వారి కార్యక్రమం.

భగవంతుడి దయ వలన నాకు జ్ఞాపక శక్తి మెండు. చిన్నప్పటి నుండి ఒకసారి చదివినవీ, చూసినవీ, విన్నవీ, అన్నవీ అంత తేలిగ్గా మరిచి పోను. మనస్సుకి పట్టనివి అసలు గుర్తే ఉంచుకోను. అదృష్టవశాత్తూ మా వారిదీ మంచి జ్ఞాపక శక్తీ, తార్కిక శక్తీ!

2005 లో... మేము అన్నిటినీ తర్కించేటప్పుడు, ఆలోచించేటప్పుడు, మాకిలాంటివన్నీ చాలా గుర్తుకొచ్చాయి. నిజమే మేకలు కాచుకునే అమ్మాయికి అక్షరాల విద్య ఎంతో, మాకు గూఢచార విద్యా అలాంటిదే! కానీ, మనిషి బొమ్మని అనుసరిస్తూ, ఆ అమ్మాయి India map ని సరిగా అతికించినట్లే, మనమూ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ’ధర్మం, సత్యం, మానవత్వం, అనే వాటి సాయంతో మనకి తెలిసిన అన్నిటితో విశ్లేషిస్తే....? అనుకున్నాము.

మానవీయ విలువలతో కూడినది ధర్మం. సాక్షాత్తూ భగవంతుడే సత్యం. దేశపు ఎల్లల్నీ, జాతుల హద్దుల్నీ, మతాల పరిమితుల్నీ దాటి, మానవత్వమే ప్రాతిపదికగా ఆలోచిస్తే దీన్ని అర్ధం చేసుకోగలమనిపించింది. కాబట్టి విషయాలని, వ్యక్తులని అర్ధం చేసుకునేందుకు, అప్పటి వరకూ ఆచరిస్తూ వస్తున్న గీతే ఆధారంగా కనిపించింది. గుణత్రయ విభాగ యోగం, దైవాసుర సంపద్విభాగయోగం వంటి 18 అధ్యాయాలు పరంగానే దేన్నైనా అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాము.

1992లో, ఫిర్యాదు ఇచ్చిన మొదటి రోజుల్లో, పీవీజీకి ఏ సమస్యలయితే పరిష్కరింపబడినవో, వాటి కార్యకారణ సంబంధాలని విశ్లేషించుకుంటూ పోయాము. అలాగే, మా మీద ప్రయోగించిన స్ట్రాటజీలని రాజకీయ సంఘటనలకు, మిగతా సంఘటనలకు అనువర్తిస్తే మొత్తం భారతదేశ, ప్రపంచ, రాజకీయ, ఆర్ధిక, గూఢచర్య పటం మొత్తం కనిపించింది. కార్యకారణ సంబంధాలు కనిపించాయి. ఆ విధంగా రామోజీరావు బొమ్మని అతికించి, తిరగేసి చూస్తే, ప్రపంచ పటం మొత్తం సరిగ్గా అతుక్కుంది. మొత్తంగా ఒకే రకపు స్ట్రాటజీలు!

కాబట్టే పాకిస్తాన్ లో సామాన్యముస్లిలు బావుకున్నదేమీ లేదని, మత మౌఢ్యం ఎక్కిస్తే తాలిబానులకీ, ఆరెస్సెస్ కరసేవకులకి తేడా లేదన్నది చూడగలిగాము. గోద్రా మనకదే నిరూపించింది గదా! హిందువులకి ఆత్మన్యూనతని ఇంకించకుండా, తాలిబానులకి ఇంకించినట్లు మతమౌఢ్యం ఇంకిస్తే, హిందూవులు కూడా తాలిబాన్లులాగానే ఉంటారు. భారతీయులకి తాము వ్యర్ధ జీవులమని గాకుండా అమెరికనులకి లాగా తాము అగ్రరాజ్య పౌరులమన్న అహంకారం ఇంకిస్తే భారతీయులు అమెరికనుల లాగానే ఉంటారు.

అది ప్రజలకి సామూహికంగా బ్రెయిన్ వాష్ చేయగల మీడియా చేతిలోని పని! పదే పదే అదే ప్రచారంతో ప్రపంచవ్యాప్తంగా మీడియా నిర్వహించే పని. కావలసిన దేశంలో కావలసినట్లుగా ప్రజలకి మలుచుకునేందుకు చేసేపని. జపనీయులని వర్క్ హాలిక్ లుగా, కెనడియన్లని డ్రగ్ ట్రాఫికింగులుగా, ఇటాలియన్లని మాఫియాలుగా, పాకిస్తానీయులని తాలిబాన్లుగా.... ఇలా!

ఇది అర్ధమయ్యాక.... దేశ కాలమాన పరిస్థితులనీ, మా జీవితంలో 1992 నుండి జరిగిన ప్రతి సంఘటననీ విశ్లేషించుకుంటూ ఫిట్ చేసుకుంటూ పోయాము. చిత్రమేమిటంటే - ఎక్కడ మేం గందర గోళం పడతామో, అర్ధం కాని అయోమయానికి గురవుతామో, అప్పుడు మమ్మల్ని ఈనాడు వ్రాతలు, వార్తలు, సినిమాలు, వై.యస్., సోనియాల వంటి రాజకీయ నేతలు గైడ్ చేసేవాళ్ళు. పిచ్చ confussion అన్పిస్తోంది కదూ! వివరంగా చెబుతాను.

కొన్ని చిన్ని ఉదాహరణలతో....!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

దళితుల/తక్కువ కులస్తులు విషయంలోనూ ఇదే జరిగిందంటారా ? ... వారికి ఆత్మన్యూనతను ( Inferiority complex ), అగ్రకులస్తులలో అహంభావాన్ని( Superiority complex ) ఇలాగే ఇంకించారంటారా ?
ఎందుకంటే -ఒకడిని మనం వెధవ వెధవ అంటే చివరికి వాడు వెధవ లానే తయరవుతాడు ... అల కాకుండా నువ్వు గొప్పొడివి అని బ్రైన్ వాష్ చెస్తే నిజమే అనుకుని వాడి సామర్ధ్యాన్ని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడతాడు

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu