2009 వ సంవత్సరానికి 10 వ తరగతి పరీక్షా ఫలితాలు 27/05/09 న వెలువడ్డాయి. దాదాపు 13 ½ లక్షల మంది విద్యార్ధుల శ్రమ ఫలితాలని, భవిష్యత్తుని వెల్లడించాయి. అందులో 78.5% విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. అందులోనూ సగం ఫస్ట్ క్లాసులే. ఇదే 10వ తరగతి విద్యార్ధులు, మరో సంవత్సరం తర్వాత, ఇంటర్ ప్రధమం వ్రాసేటప్పటికి 43% మాత్రమే ఉత్తీర్ణులవుతారు. ఇది గత సంవత్సరాల నుండి ఈ సంవత్సరం వరకూ జరుగుతున్నదే. ఇటీవల విడుదలైన ఇంటర్ ప్రధమ పరీక్షలో 43% మాత్రమే ఉత్తీర్ణత ఉండగా, క్రితం సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణత శాతం ఇప్పటిలాగే 75% నికి పైమాటే. పదవతరగతి తర్వాత, అంతంతమాత్రపు ఆర్ధికస్థాయి ఉన్న విద్యార్ధులు, అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధులూ, పైచదువులకు వీడ్కొలు చెప్పారనుకున్నా కూడా, ఇంటర్ పరీక్షలు వ్రాసిన 7 లక్షల పైచిలుకు విద్యార్ధుల్లో నుండి, కనీసం 75% కాకపోయినా 70 శాతమన్నా ఉత్తీర్ణత ఉండాలి కదా! ఉండదు. ఎందుకంటే అందులోనూ ఎన్నో కార్పోరేట్ వ్యాపార తంత్రాలున్నాయి గనుక.

పదవ తరగతిలో ఎంతమంది విద్యార్ధులు ఉత్తీర్ణులైతే, అంతగా కార్పోరేట్ కాలేజీలకు ఆదాయవనరులు లభ్యమైనట్లే. కాబట్టే పదవతరగతిలో ఉత్తీర్ణతా శాతం అత్యధికం ఉంటుంది. అందులోనూ సగం మంది ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణులయ్యారంటే ఇక అంతగా కార్పోరేట్ కాలేజీలకు మార్కెట్ లభించినట్లే. సెకండ్ క్లాసో, సాధారణ ఉత్తీర్ణతో పొందిన విద్యార్ధులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ M.P.C., Bi.P.C. ల్లో చేరడానికి, చేర్పించడానికి అందునా కార్పోరేట్ కాలేజీలకి వెళ్ళడానికి జంకుతారు. అదే ఫస్ట్ క్లాసులు వస్తే? ఒక ఆశ. జీవితం పట్ల ఒక చిరు ఆశ. “ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా! ఏమో ఎవరు చూడ్డొచ్చారు? ఇంకొంచెం కష్టపడితే ఇంటర్ లో మంచి మార్కులు, ఎంసెట్లో మంచి ర్యాంకులూ వస్తాయి. పిల్లవాడు/పిల్ల ఇంజనీరో డాక్టరో కావటం కంటే కావలసింది ఇంకేమిటి? ఎలాగోలా కష్టపడి, అప్పోసప్పో చేసి, పెద్దకాలేజీల్లో చేర్పిస్తే మంచిఫలితాలొస్తాయి” – ఈ ఆకాంక్షతో అమాయక తల్లిదండ్రులూ, జీవితం పట్ల ఆశలూ, ఆకాంక్షలతో పిల్లలూ సాహసిస్తారు.

కాబట్టే పదవతరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్ధుల శ్రమ పాత్ర పరిమితంగానే ఉంటుంది. ప్రభుత్వం, కార్పోరేట్ విద్యాసంస్థల మధ్య గల అనుబంధాల పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఇక, ఇంటర్ తర్వాత విద్యార్ధులు ఇంజనీరింగ్ వైపు వెళ్తే, ఆ కథ వేరు కదా! డిగ్రీ విద్యార్ధుల మీద నడిచే వ్యాపారం, ఎంసెట్ ఐఐటి వ్యాపారాలతో పోల్చితే, పెద్దగా చెప్పుకోదగిందికాదు. అందుచేతే పదవతరగతి ఫలితాలు 78% శాతాల్లోనూ, ద్వితీయ, ప్రధమ ఇంటర్ ఫలితాలు 60 to 40 శాతాల్లోనూ ఉంటాయి.

ఇక ఈ సంవత్సరం పదవతరగతి ఫలితాలలో రాయలసీమ వారి హవా నడిచిందట. ‘సీమ గుమ్మానికి చదువుల పారాణి’ వంటి శీర్షికలతో, పత్రికలు ప్రధానంగా వ్రాసాయి. దాదాపుగా అత్యధిక ర్యాంకులు నంద్యాల బ్రాంచ్ నుండే వచ్చాయి. మా నంద్యాలలో ప్రముఖ కార్పోరేట్ విద్యాసంస్థ కేశవ రెడ్డి స్కూలు, రాష్ట్ర టాప్ 10 ర్యాంకుల్లో 15 ర్యాంకులు పొందింది. ఇదే సంస్థ పోయిన సంవత్సరం టాప్ 10 లో 8 ర్యాంకులు పొందింది. ప్రతీ సంవత్సరం ర్యాంకర్లతో, పూలగుత్తులతో, ముఖ్యమంత్రితో, ఫోటో ప్రదర్శన ఈ సంస్థ ప్రత్యేకతన్నమాట. కడప జిల్లాకి అంతంత ప్రయోజనాలు సమకూర్చే రాయలసీమ రారాజు రాజశేఖర్ రెడ్డి, కడపకు పొరుగునున్న కర్నూలు జిల్లాలోని కేశవ రెడ్డి కార్పోరేట్ పాఠశాలకు, ఆమాత్రం ప్రయోజనం సమకూర్చడం వింతేమీ కాదు. అసలే మన ముఖ్యమంత్రిగారు చెప్పినవి, చెప్పనవి అన్ని ప్రయోజనాలు కల్పిస్తారు కదా! అందునా ఉదారంగా వితరణ లీయగల కేశవ రెడ్డి మరి! కాబట్టే ఈసారి పదవతరగతి ఫలితాలలో కేశవరెడ్డి స్కూలు విద్యార్ధులు, నారాయణ, విజ్ఞాన్, వికాస్, శశి, విశ్వశాంతి, విశ్వభారతి, రవీంద్రభారతి ఇత్యాది పేరేన్నిక గన్న స్కూళ్ళన్నిటినీ ఊడ్చి పారేసారు. పైన పేర్కొన్న ఏ ఒక్కస్కూలుకీ 580 కంటే మించి మార్కులు రాలేదు. ఆ ఆత్మవిశ్వాసమే పొంగి పొరలుతుండగా, కేశవరెడ్డి స్కూలు, సగర్వంగా, "ఆ చరిత్ర విస్తుపోయేలా… రాష్ట్రం నివ్వెరపోయేలా… ఇకపై వేరెవ్వరూ ఛేదించలేని మరో చరిత్ర” అని వ్రాసుకుంది. [ఇక్కడ కేశవ రెడ్డి స్కూలు ఒక విషయం మర్చిపోయినట్లుంది. ఈ మోసాలకు గురువు, శ్రీ చైతన్య కాలేజీ బి.ఎస్.రావు, స్కూళ్ళ వ్యాపారం కూడా మొదలు పెట్టాడు. తర్వాత కాలంలో అన్ని అవకాశాలు ఎవ్వరికి ఇవ్వడు.]

ఇదే నేపధ్యంలో, మరో స్కూలు గౌతమ్ మోడల్ స్కూల్స్ ’నిజాయితీ మార్కులకు నిజమైన నేస్తం’ అన్న ఉపశీర్షికతో పత్రికలో వాణిజ్య ప్రకటన విడుదల చేసుకుంది. దీనిభావం ఈ పాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది. [నిజాలు వెలికితీసే మీడియాకు, విద్యారంగానికి సేవ చేసే మేధావులకు ఎప్పుడు అర్ధమవుతుందో] 2007 లో 7వ తరగతికి ఉత్తీర్ణత పరిగణనలో ఉన్నప్పుడు, ర్యాంకులూ, మార్కుల విషయంలో, ఇలాగే విద్యాసంస్థలు మా నంద్యాలలో పోటాపోటీకి దిగి, పరస్పర విమర్శల యుద్దం చేసుకున్నాయి. అది ఎంత వరకూ పోయిందంటే – కరపత్రాలు ముద్రించి మరి, ఎవరు ఎన్ని మార్కులు, ఎన్ని ర్యాంకులూ కొనుగోలు చేసారో బట్టబయలు చేసుకునేదాకా! తర్వాత విద్యాశాఖాధికారుల జోక్యంతో అంతా సద్దుమణిగింది లెండి.

దానాదీనా తేలేది ఏమిటంటే – విద్యా వ్యాపార రంగంలో, ఎవరికి లాబీయింగ్ బాగా నడుస్తుంటే వారికి ర్యాంకుల పంట, మార్కుల దిగుబడి ఎక్కువగా ఉంటుందన్న మాట. అవి చూపి అడ్మిషన్ల కాసులు రాసులుగా రాబట్టుకుంటారు. కాబట్టే ఒక ప్రభుత్వహయంలో, ఒక ప్రాంతం వారికి లేదా కొన్ని విద్యాసంస్థల వారికీ ఫలితాలు అత్యుత్తమ స్థాయిలో వస్తాయి. ఒకప్పుడు విజ్ఞాన్, వికాస్, మరో XYZ లేదా ABC విద్యాసంస్థలకు ఇలాగే హవా నడిచింది. ఇప్పుడు వాటి స్థానంలోకి కేశవరెడ్డి, భాష్యం వగైరా వగైరాలు వచ్చాయి. అంతే!

మొత్తంగా, ఓట్లు వేసి ప్రభుత్వాలని ప్రతిష్ఠించడంలో ప్రజలు నిమిత్తమాత్రులు. అలాగే కష్టపడి చదివి మార్కులూ ర్యాంకులూ సంపాదించటంలో విద్యార్ధులు నిమిత్తమాత్రులు. అద్భుతము, అపూర్వము అనదగ్గరీతిలో, కార్పోరేట్ విద్యాసంస్థల పరిభాషలో చెప్పాలంటే ‘విస్తుపోయిన చరిత్రలూ, నివ్వెరపోయిన రాష్ట్రం’ సాక్షిగా ఆయా కార్పోరేట్ విద్యాసంస్థల ఫలితాలతో విద్యార్ధులూ, వారి తల్లిదండ్రులూ [ర్యాంకులూ, మార్కులు పొందిన వారే సుమా!] ఆనందంగా ఉన్నారు. ఆ ఫలితాల ప్రభావంతో వెల్లివెత్తిన అడ్మిషన్ల వరదలో ఆయా కార్పోరేట్ విద్యాసంస్థలు ఆనందంగా ఉన్నాయి. ప్రతిఫలంగా అందుకున్న ’ప్రయోజనాలతో’ ప్రభుత్వాధికారులూ, మంత్రి, ముఖ్యమంత్రీ ఆనందంగా ఉన్నారు. కాబట్టి మనసారా మనం చెప్పుకోవచ్చు అందరూ ఆనందంగా ఉన్నారని! ఏమంటారు?

అంతా బాగానే ఉంది గానీ, మరి భవిష్యత్తులో దేశపు సత్తా మాటేమిటి?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

కేశవరెడ్డి తిరుపతి బ్రాంచిలో మా తమ్ముని కూతురుకు 585 మార్కులు వచ్చాయండి. పరీక్షలకు కొన్ని రోజులకు ముందు కొంతమందిని నంద్యాలకు పంపి స్పెషల్ కోచింగ్ ఇచ్చారు.
మీరు నంద్యాలలో ఉంటున్నారా ? నేను ఈనెల రెండవ వారంలో నంద్యాలకు వచ్చాను.

>>గౌతమ్ మోడల్ స్కూల్స్ ’నిజాయితీ మార్కులకు నిజమైన నేస్తం
అది చూడగానే నాకు కూడా అదే అనిపించింది..

మీరు చెప్పవచ్చినది ఏమిటో నాకు ఏమి అర్ధం కాలేదు :-(

అసలు ర్యాంకులే లేకపోతే!?

Imagine SAT kind of exam in the place of EAMCET. If there is no ranking scenario, the corporate education industry and lobbying for ranks becomes irrelevant.

The very idea of ranking students, and giving admissions based on ranks is absurd. Ironically, we Indians love absurdities :(

@చిలమకూరు విజయమోహన్ గారు,
మేము ఉండేది నంద్యాలలోనే. మా ఇంటిచిరునామా, ఫోన్ నెంబరు Coups On World లోని కంప్లైంట్స్ లో ఉన్నాయండి. మిమ్మల్ని కలిసే అవకాశం పోయింది. మరెప్పుడయినా మీరు నంద్యాల రావడం జరిగితే తప్పకుండా మాకు మెయిల్ ఇవ్వండి.

@మేధ గారు,
మీ పరిశీలన సరియైనదేనండి.

@Panipuri123 గారు,
బహుశ మీరు మధ్యలో నుండి నా టపాలు చదువుతూ ఉండి ఉంటారు. నేను పాతటపాలలో ఎంసెట్ నేపధ్యాన్ని, విద్యారంగంలో అవినీతిని వివరంగా, సోదాహరణంగా వ్రాసాను. ఆ టపాలు చదివితే, ఇది మీకు బాగా అర్ధమయ్యేది.

యోగి,
ఎప్పుడు మనవాళ్ళు absurdity నుండి reality వైపు ప్రయాణించాలి?

ఈరోజే అందిన మఱో వార్త. MCA ప్రశ్నపత్రాల్ని ’లీక్’ చేసిన (చేయించుకున్న) ప్రైవేట్ యాజమాన్యాలు. అఱగంటలో సెల్ ఫోన్ల ద్వారా పాకిపోయిన ప్రశ్నపత్రం.

మనవాళ్ళకి అమెరికాలో ఉద్యోగాలు కావాలట. ఈ వార్తలు తెలిస్తే అందఱినీ తన్ని తగలేస్తారు తెల్లవాళ్ళు. ఆర్థికమాంద్యం ఉపశమించాక మళ్ళీ ఇదివఱకటిలా వలస-ఉద్యోగాలకి ఎగబడొచ్చునని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈమధ్య ఒబామా మహాశయుడు విద్యావిధానంలో సంస్కరణల గురించి ఒక అత్యవసర సమావేశం నిర్వహించాడు. అందులో - ఇండియా, చైనా దేశాలకి దీటుగా కోచింగులూ, గట్రా కూడా ఏర్పాటు చేసి బయటి ఉద్యోగులతో అవసరం లేనివిధంగా అమెరికాని తీర్చిదిద్దాలని తీర్మానించారు. అందుచేత అమెరికా ఉద్యోగాల గురించి రాబోయే పది-పదిహేనేళ్ళ తరువాతనైనా మనవాళ్ళు మర్చిపోవాల్సిందే !

ఈ విద్యావిధానమంతా మనుషుల్ని వలసపొమ్మని బోధించే వ్యవస్థ.అందుకోసమే ఇంగ్లీషు మీడియాలూ, ర్యాంకులూ, వాటిల్లో మోసాలూ ! వలసమార్గాలు మూసుకుపోతే తప్ప మనం ఇక్కడే ఉండి మన దేశాన్ని బాధ్యతగా ఎలా బాగుచేసుకోవాలో అర్థం కాదు.

మన జీవిత కాలంలోనే అది జరుగుతుందని ఆశిద్దాం‍!! :)

ఏమో , ఇంజనీరింగ్ సీట్లు పెరిగితే (ఎక్కువగా)అప్పుడు ఇంటర్ ఉత్తీర్ణతా శాతం కూడా పెరుగుతుందేమో.
జయహో కాంగ్రెస్,జయహో రాజశేఖరా!

ఇంకా ఈ ఐదేళ్ళలో ఇలాంటివి ఎన్ని చూపిస్తారో దేవుడి పాలనా ప్రతినిధులు(ఏ దేవుడో?)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu