[>> గుర్తుతో ఉన్నవి ఉషశ్రీగారి వచన భారతం నుండి యధాతదంగా గ్రహించినది నారద నీతి.
బ్రాకెట్లో ఉన్నవి నకిలీ కణిక వ్యవస్థ అమలు జరుపుతున్న విలోమ నారద నీతి.]


>>అకాలంలో నిద్రపోయి, రాత్రివేళ జాగరణం చేయకూడదని ఎరుగుదువు కదా! ఉషఃకాలంలో మేలుకాంచి అవసరకార్యాలు నిర్వర్తిస్తున్నావా?[ఈ రోజుల్లో పాలకుల దగ్గర నుండి, పాలనాయంత్రాంగంలో భాగమైన ఉద్యోగవర్గం, ప్రజలలో కూడా విపర్యయమే నడుస్తోంది. మద్యపానం, పబ్బుల సంస్కృతి, అవేవీ లేకపోతే టీవీ సీరియళ్ళు, అర్ధరాత్రి మసాలా కార్యక్రమాలూ, ప్రజల్లో పైస్థాయి నుండి క్రింది వరకూ ప్రేరేపిస్తోంది ఈ ప్రకృతి విరుద్ధ స్వభావాన్నే! సూర్యోదయ సూర్యాస్తమయాలతో అనుసంధించబడి, సూర్యరశ్మితో సమ్మిశ్రితమైన రేయింబవళ్ళలో రాత్రిళ్ళు నిద్రకూ, పగలు జాగృతికి అనుకూలమైనవి. అయితే దాని విపర్యయం జీవన విధానంలోకి చొచ్చుకువచ్చింది ఇప్పుడు]

>> ప్రతిపక్షంవారి గూఢచారులు నీ మంత్రులతో రహస్యసమాలోచనలు సాగించడం లేదుకదా! మిత్రుడైనా, శత్రువయినా, తటస్థుడయినా సరే….. ఎవడు ఎప్పుడు ఏ పనిని చేస్తున్నాడో ఒక కంట చూస్తున్నావా![ ఇది ఎంతగా విఫలయయ్యిందో ఇప్పుడు మీకు కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం వారి[అంటే శతృదేశాలు] గూఢచారులు మన మంత్రులతో రహస్యసమాలోచనలు సాగించటం కాదు, ఏకంగా మన మంత్రులే శతృదేశగూఢచారులై పోయారు. ఇక ఎవరిని ఎవరు కనిపెట్టి చూడగలరు?]

>>సంధిగ్ధస్థితులు ఏర్పడినపుడు సమర్ధులయిన మేధావులతో సంప్రదిస్తున్నావుగా![ఇక సంప్రదించేందుకు మేధావులు మిగిలి ఉంటేగా? ఎప్పుడో అణిచివేయబడ్డారు. అడ్డదారిలో, మీడియా ఇచ్చిన ఇమేజ్ తో వెలిగిపోతున్న [Pseudo] మిధ్యామేధావులే ఇప్పుడు మేధావులుగా చలామణి అవుతున్నారు. అత్యధికులు ఈ కోవకి చెందినవారే]

>>విశ్వసనీయుడు, విశుద్దవర్తనుడు, నిర్వహణదక్షుడు, వినిర్మల మనస్వి, ఉత్తమవంశసంజాతుడు, కుశాగ్రబుద్ది అయినవానినే మంత్రిపీఠం మీద ఉంచాలని ఎరుగుదువు కదా! అని నారదుడు అవశ్యమయిన రాజనీతిని ఉపదేశిస్తున్నాడు.[ అన్ని లక్షణాలకు ఒకటే పర్యాయం ‘డబ్బు’. డబ్బున్నవాడు, నేరస్తుడైనా సరే, చివరికి హత్యానేరాల మీద, ఉగ్రవాదులకి సహాయం చేసిన నేరం మీద, జైలుకి వెళ్ళిన వారు కూడా, నేడు రాజకీయాల్లో రాణిస్తున్నారు, మంత్రులౌతున్నారు]

>>విషమసమస్యలు ఎదురయినపుడు ప్రధానులతోనే సంప్రదించాలి కాని, కనిపించిన వారి నందరినీ సలహా అడగకూడదు.[ సలహాల కోసం, విచారణల కోసం కమిటీలు నియమింపబడతాయి. అందులో అర్హులే ఉంటారో అసమదీయులే ఉంటారో అందరికీ తెలిసిందే]

>> ఇక కోశాగారం ఎప్పుడూ సమృద్ధంగా ఉండాలి. [ఇప్పుడున్న విదేశీ అప్పులు, ప్రపంచబ్యాంకు అప్పులే చెబుతున్నాయి. దీని విపర్యయపు అమలు ఏతీరులో ఉందో]

>>సేద్యవ్యవహారాలకు అవసరమయిన సామాగ్రిని సకాలంలో అందించాలి. అంతేకాని వారిని ఇతర కార్యకలాపాలకు వినియోగించకూడదు. [సేద్యపురంగం ఎంతగా నిర్లక్ష్యానికి గురవుతుందో, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కరువు, కార్పోరేట్ విత్తన, ఎరువుల, మందుల కంపెనీలు రైతుల్ని పీల్చి పిప్పిచేస్తున్న తీరు, మార్కెటింగ్ శాఖ, సౌకర్యాలు రైతు కళేబరాల్ని కూడా పీక్కుతింటున్న తీరు స్పష్టం చేస్తున్నాయి]

>>ధర్మదృష్టికల శాస్త్రఙ్ఞులే విద్యాబోధకులుగా ఉండాలి.[ విద్యారంగం ఎలా ఉందో, దీనిమీద కుట్ర తీరు ఏమిటో గత టపాలలో సవివరంగా చెప్పాను. ఇదీ నారదనీతికి విపర్యయమే]

>>వెయ్యిమంది మూర్ఖులను ఆదరించి చేరదీయడం ఎంత అవివేకమో, వివేకముగల ఒక్క విద్వాంసుని దూరం చేసుకోవడం అంత హానికరం. [ఇప్పుడు జరుగుతోంది నూటికి నూరు శాతం దీని విపర్యయమే. ముఖ్యంగా ప్రభుత్వశాఖల్లో, పనితీరులో ఉద్యోగుల దగ్గర నుండి, కాంట్రాక్టులు అప్పజెప్పడం వరకూ, లంచం, అవినీతి, అనైతికతలే అర్హతలుగా ఆదరణ, నిరాదరణలు నడవటం అందరికీ తెలిసిందే]

>>శస్త్రాస్త్రాలూ, ధనధాన్యాలూ కోటలో ఎప్పుడూ తరగకూడదు. నగరవాసులకు స్వచ్ఛమయిన మంచినీటికి ఇబ్బంది రాకూడదు.[దీని విపర్యయ పరిస్థితి ఎలా ఉందో, నిన్నటి భోలక్ పూర్ ఘటనలు, అప్పటినుండీ వార్తాపత్రికల్లో పతాక శీర్షికలూ, కొన్నేళ్ళుగా ఫ్లోరైడ్ బాధిత నల్గొండ ప్రాంత ప్రజలూ, ప్రత్యక్ష తార్కాణాలు. భారతకాలం నాటికి భూగర్భజలాలు పుష్కలం. త్రాగునీటికి బావులు కూడా బాగా ఆధారపడదగినవే. ఇక చెరువులు, దొరువులూ, కొలనులు, సెలయేళ్ళు, నదుల మాట చెప్పనే అక్కర్లేదు. కాలుష్యపు మాట కలలోనైనా లేదు. బ్రిటీషు వాళ్ళు ఇండియా వచ్చాక, వాళ్ళనడ్డం పెట్టుకుని నకిలీ కణిక వ్యవస్థ ఓవైపు నదీజలాలని కలుషితం చేస్తూనే, మరోవైపు భారతీయులు తమ అపరిశుభ్ర జీవనపు అలవాట్లతో నదీజలాలని కలుషితం చేస్తున్నారంటూ ఎంతగానో ఎద్దేవా చేసారు. ఎంతగా భారతీయ గ్రామీణులు, నదీ తీరప్రాంతాలను బహిర్భుమిగా వాడుతూ, మలమూత్రవిసర్జనలతో నదీజలాలని కలుషితం చేశారనుకున్నా, అది రసాయన వ్యర్ధ కలుషితంతో సరిసాటి కాదు గదా? పైగా మానవ వ్యర్ధాలతో కలుషితమైన నీరు అందులో ఉన్న చేప, కప్పలతో పరిశుభ్రం అయ్యే అవకాశమన్నా ఉంది. రసాయన వ్యర్ధాలతో కలుషితమైన నీరు, అందులోని జలప్రాణుల పాలిట విషమై, వాటి ప్రాణాలూ హరిస్తోందే? రసాయన వ్యర్ధాలతో భూగర్భజలాలే కలుషితమైపోతున్నాయి. కొల్లేరులోకి వలస వచ్చే గూడకొంగల రెట్టలు తిని చేపలు పెరిగిపోతాయి. చేపలని తిని కొంగలు పెరుగుతాయి. రెండూ పరస్పరాశ్రితాలు. ఆవిధమైన[equilibrium] సమతుల్యత, ప్రకృతిలో ప్రతీ చక్రంలోనూ ఉంది. దాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా, నకిలీ కణికవ్యవస్థ పనిచేస్తుంది. అప్పుడు ప్రకృతివైపరీత్యాలు పెరుగుతాయి. అప్పుడు ఈతి బాధలూ పెరుగుతాయి. ఆ బాధలతో బలహీనులైన ప్రజలని గ్రిప్ చెయ్యటం సులభం. యూరోపియన్లు తమ వ్యాపార వలస రాజ్యస్థాపనలో భాగంగా, ప్రపంచంలోని ఏ దీవుల్ని చేరితే అక్కడ, మొదటగా అంటురోగాల్ని ప్రబలింపచేసి స్థానికుల్ని బలహీనపరచటం, ఆ తర్వాత ఆ భూమిని దురాక్రమించటం ఇటీవలే బయటకు వస్తూన్న, వెలుగు చూస్తున్న చారిత్రాక సత్యాలు. ఇది విషయాంతరమైనందున ఇక్కడితో ఆపుతున్నాను. ఇక మంచినీటి వ్యవహారానికి వస్తే, నదీ తీరాలని బహిర్భుములుగా వాడటం సరైనదని నేను అనటం లేదు. కానీ ఆ విషయమై జరిగిన ప్రచార పటాటోపం వెనుక, చాపక్రింద నీరులా రసాయన వ్యర్ధ కాలుష్యపు విషయం, మరుగుపరచబడింది అంటున్నాను. ఏది ఏమైనా ప్రయత్నపూర్వకంగానే, ఉద్దేశ పూరితంగానే, ప్రస్తుత ప్రభుత్వాలు మంచినీటి సమస్యని మరగపెడుతున్నాయి.]

>>శత్రుపక్షంలోని మంత్రి, పురోహిత, సేనాపతి, ద్వారపాలకాదులనూ, అంతఃపుర, కోశాగార, కారాగారాధ్యక్షలనూ, నగరాధికారినీ, శిల్పులనూ, ధర్మసభాధక్షునీ,దుర్గరక్షకునీ, వనపాలునీ, ధనవ్యయాధికారినీ, యువరాజునూ, వారి దండనాధులనూ ఒక కంట కనిపెడుతుండాలి. నీవర్గంలో కూడా మంత్రి, పురోహితులనూ, యువరాజునూ, విడిచి మిగిలిన అందరి వ్యవహారాలనూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూండాలి. [గూఢచర్యంతో ఇప్పుడు ఈ concept ని నకిలీ కణికుడి వ్యవస్థ మాత్రమే ఉపయోగించుకోగలుగుతోంది. ఆ విషయాన్ని ఇతరులెవరూ గుర్తించకుండా ఉండేందుకు కూడా, భారతీయ ఇతిహాసాలైన భారత రామాయణాలను, ఇతర సంస్కృత వాంఙ్ఞ్మయాన్ని, పూర్తిగా నిరాదరించే స్థితికి సమాజాన్ని ఈడ్చుకుపోయారు]

>>వ్యక్తుల స్వభావాలు పరిశీలించి, ఉత్తమ, మధ్యమ, అధమవర్గాలకు, వారికి తగిన పదవులివ్వాలి. శిష్టాచార మర్యాదలు తెలిసి, వంశపారంపర్యంగా మనసేనలో ఉన్న మంత్రులను ఉత్తమకార్యనిర్వహణకే నియోగించాలి సుమా.[ ఉద్యోగాది పదవుల నియామకాల్లో లంచం, సిఫార్సు గట్రాలు నడుస్తున్నాయి. ఇక రాజకీయ పదవుల్లో అయితే అవినీతే ప్రామాణికమూ, అర్హతా కూడా అయి కూర్చున్నాయి. ఇక వ్యక్తుల స్వభావాల పరిశీలనకు తావేది? ఇక ఈ స్థితిలో శిష్టాచార మర్యాదలు, వంశపారంపర్యతలూ కూడానా?]

>>సమయ, సందర్భాలు తెలియకుండా దండనీతిని అమలు జరిపినా, అవసరమయినపుడు దానిని విడిచినా ప్రమాదమే. [దండనీతిని ప్రయోగించాల్సిన న్యాయవ్యవస్థ పనితీరు అందరికీ తెలిసిందే. చెరసాలల్లో ప్రత్యేకగదులూ, ఇంటి భోజన వసతులూ! జైల్లోకి అందించబడే సెల్ ఫోన్లూ, చికెన్ బిరియానీలు! జైల్లో వసతుల గురించి పోరాడే మానవహక్కుల సంఘలూ, ఇతర స్వచ్చందసంస్థలూ! ఆపైన బాపూ జయంతి గట్రా వంకలు పెట్టి, కరుడుగట్టిన నేరస్థుల్ని సైతం విడుదల చేయటాలూ, క్షమా భిక్ష పెట్టడాలూ మామూలు. ఇక విశాల హృదయాలతో హంతకులకి [ఉదాః నళిని] సైతం క్షమాభిక్షలు సరేసరి. గౌరువెంకట రెడ్డిల వంటి వారి కథలూ తరచూ వింటున్నవే. అసలు మన న్యాయవ్యవస్థ పునాది వాక్యమే ‘పదిమంది నేరస్దులు తప్పించుకున్నా ఫర్వాలేదు. ఒక్క అమాయకుడికి శిక్షపడకూడదు’ అని. కానీ, ఖర్మకొద్దీ, తప్పించుకున్న ఒక్కో నేరస్థుడూ వెయ్యిమంది అమాయకుల్ని పీడిస్తున్నాడే? అందుకే అంటారేమో ‘రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీదనడుస్తుందని’. శిక్ష్మాస్మృతి ఇంతఘోరంగా వైఫల్యం చెందింది గనుకనే సమాజంలో నేరస్థులు పెద్దమనుష్యులుగా చలామణి అవగలిగే స్థితికీ, అక్రమార్కులే అభివృద్ది చెందగలిగేస్థితికీ పరిస్థితులు దారితీసాయి]

>>అనాచారిగా ఉండే యజమానిని పవిత్రుడయిన యాజకుడు[పూజారి లేదా పురోహితుడు] విడిచేస్తాడు. అలానే కామలాలసుడయిన పురుషుని శీలవతి అయిన స్త్రీ విడిచిపెడుతుంది. తన కర్తవ్యాన్ని ప్రజలపై ఉంచే ప్రభువును వారు పదభ్రష్టుని చేస్తాను. [ప్రజలు ప్రభువును పదభ్రష్టుని చేసినా, వారి ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. ఒకరిని మించిన వారు మరొకరు. ఏరాయి అయినా ఒకటే పళ్ళూడగొట్టుకోవటానికి అన్న స్థితి. అతణ్ణి మించినవాడు ఆచంట మల్లన్న అన్నట్లే ఉన్నారు అందరూ రాజకీయ నేతలు కూడా! ఇక ఎవరు ప్రభువైతే ఏమిటి తేడా?]

>>నీ సేనలోనివారు సాహస, పరాక్రమాలు ప్రదర్శించినపుడు వారిని సద్యఃకాలంలో సమ్మానిస్తున్నావా? వారి అర్హతుల ననుసరించి పై పదవులకు పంపుతున్నావా?[ అసలు సాహాసాలు చేసేవారొకరు. ఆపాదించబడేది మరొకరికి. అధవా సైన్యంలోని ఏవ్యక్తికో సాహస పరాక్రమాలు చేసిన గుర్తింపు లభించినా, దాని తాలూకూ incentive మాత్రం లేదు. డిసెంబరు 2002 లో పార్లమెంట్ పై పాక్ తీవ్రవాదులు దాడిచేసినప్పుడు, భారతదేశపు పరువూ మర్యాదలు కాపాడాటానికి, ప్రాణాలు పోగొట్టుకున్న వీరులకి కుటుంబాలకి ఇప్పటికీ న్యాయం చెయ్యలేదు. (మీ సంతాపాలు ఎవరి క్కావాలి?) అంతెందుకు 2007 జూన్ లో నంద్యాలలో కుందునది పొంగింది. వరదల్లో చిక్కుకుపోయి దాదాపు 10 మంది కూలీలు మూడురోజులు అల్లాడారు. ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడింది, స్థానిక ఈతగాడు, ఒక కానిస్టేబుల్. తీరా ఆపరేషన్ అంతా పూర్తయ్యాక, తీరిగ్గా పోలీసు సి.ఐ. ఆ credit అంతా తన పేర వ్రాయించుకుని, పేపర్లో ఫోటోలు వేయించుకుని, వార్తలూ వ్రాయించుకున్నాడు. ఇది మా కళ్ళెదుట జరిగిన సత్యం. నిజంగా అంత రిస్కు తీసుకున్న వారికి, ఎంతగా ప్రాణం ఉసూరుమంటుంది? డబ్బు కోరకపోయినా కనీసం గుర్తింపు కోరుకుంటారు కదా ఎవరైనా? ఇది ఒక్క రంగంలో కాదు. అన్ని చోట్లా ఇంతే. చాకిరీ ఒకరిది, ఫలితం ఇంకొకరిది. (అడ్మినిస్ట్రేషన్ ఫెయీల్యూర్), పరిపాలన వైఫల్యం ఇది.]

>> సేనలకు నిత్యజీవితావసర వస్తువులు ఎప్పటికప్పుడు అందకపోతే రాజ్యానికి విపరీత ప్రమాదాలు వస్తాయి సుమీ![ సైనికులకి సరఫరా చేసే వస్తువుల నాణ్యత గురించి, DGS&D లోని అవకతవకల గురించి వ్రాస్తే అవి కొన్ని గ్రంధాలే అవుతాయి. ఆయా రంగాల్లోని ప్రముఖులు ఇది గ్రంధస్థం చేసిన సంధర్భాలు కూడా ఉన్నాయి. ఇక శవపేటికల కొనుగోళ్ళ కుంభకోణాల దగ్గరనుండి, తెహల్కా వెలుగుచూపిన కుంభకోణాల వరకూ లెక్కకు మిక్కిలి. 1962 చైనా యుద్దంలో సైనికులకి చేరాల్సిన చలిదుస్తులూ, బూట్లూ కోల్ కతా వీధుల్లో అమ్మకానికి వచ్చాయన్న ఆరోపణలున్నాయి. ఇంకే మనుకోగలం దీని గురించి?]

>>దేశరక్షణార్ధం ప్రాణత్యాగం చేసేవారి కుటుంబాలపోషణ ప్రభువే వహించాలి; లేకపోతే అనంతరకాలంలో మరెవ్వరూ ప్రాణత్యాగానికి సాహసించరు.[ ఈ విషయంలో ఎన్.డి.ఏ, యూ.పి.ఏ. లు రెండూ కూడా శుష్కప్రియాలు, శూన్యహస్తలూ చూపిస్తున్నాయి. అంతకు ముందటి కాలంలో ప్రాణత్యాగం చేసిన సైనికులకి ఇవ్వబడిన గౌరవ మర్యాదలు, వారి కుటుంబాలకి అందించాల్సిన ఆర్ధిక సాయాలలో ఇంత తాత్సారమూ, నిర్లక్ష్యమూ జరిగినట్లు ఎక్కువ వార్తలు లేవు. సత్యాసత్యాలు భగవానుడికి తెలియాలి.]

>>విద్యావివేకాలు కలిగి, కార్యాకార్యపరిఙ్ఞానం ఉన్న మేధావులను ఆదరించి పోషించుకోవాలి. [ఇప్పుడు ఇది నూటికి శాతం అమలు జరపని విధానం. ప్రభుత్వోద్యోగులతో సహా ఎవరినైనా, ఏమాత్రం నిజమైన విద్య, ఇంగిత ఙ్ఞానం, కార్యాకార్యపరిఙ్ఞానం, కార్యకారణ సంబంధిత తార్కిక ఙ్ఞానం ఉన్నాయంటే, ఎంతో వేధింపుకీ, పైవాడి నుండి అణిచివేతకీ గురవుతూనే ఉన్నారు. పాపం, తము పడుతున్న మధనకి, ఎదుర్కుంటున్న వేధింపుకి కారణం తమకున్న ఙ్ఞానమేనని కూడా వారికి తెలియదు. పైవాడి ఈర్ష్య అనో, ప్రక్కవాడు తమమీద ఈర్ష్య కొద్దీ, పైవాడికి చాడీలు చెప్పారనో అనుకుంటారు. ఙ్ఞానం కలవారిని అణిచేయటానికే అరకపు attitude, పైస్థాయి నుండి క్రింది స్థాయి వరకూ పెంచి పోషించ బడుతుందన్న విషయం ఎవరికీ తెలియనంత నిగూఢమైనది ఇది.]

>>నీ అంగరక్షకులూ, వారి ప్రోత్సాహకులూ, వ్యవహారాలలో ఉదాసీనంగా ఉండే వారూ వీరందరూ మంత్రాగంలో ఉండవచ్చు. శత్రుపక్షంలో లోభీ, అవమానితుడూ, జీతాలు సరిగా అందనివాడూ, వీరందరినీ చేరదీసి మన కార్యాలు చక్కబెట్టుకోవచ్చు.[ఉదాసీనంగా ఉండటం అంటే తమ వ్యక్తిగత భావోద్రేకాలు, తమ ఇష్టాయిష్టాలు, ఈర్ష్యాసూయలు చూపకుండా ఉండటం. ఖచ్చితంగా చెప్పాలంటే ఆత్మసంయమనం కలిగి ఉండటం. సరిగ్గా దీని విపర్యయం అమలుచేయబడుతుంది. ఎంతగా కక్షసాధింపు చర్యలకి పాల్పడగలిగితే, వాళ్ళకే ’కెరియర్’ ఉండటం రాజకీయాల దగ్గర నుండి అంతటా ఉంది. (ఉదా: తమిళనాట జయలలిత Vs కరుణానిధి) ఎవరికి అధికారం వస్తే వాళ్ళు, రెండవవర్గాన్ని చెండుకు తింటారు. ఇప్పుడు దాదాపు అదేస్థితి అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. ఓట్లే వ్యతిరేక వర్గానికి వేసారని ఊళ్ళకి ఊళ్ళని బాధితుల్ని చేయటం గురించి తరచూగా వింటూనే ఉన్నాం. ఇక మన పక్షంలో వీలయినంతమంది లోభుల్నీ, అవమానితుల్నీ, జీతాలు సరిగా అందని వాళ్ళనీ శత్రుపక్షం చేరదీసుకోనేందుకు వీలుగా తయారుచేయటమే లక్ష్యంగా పని నడుస్తుంటుంది. ఒకప్పుడు టీచర్లకి అసలు జీతాలు సరిగా చెల్లించబడేవి కావు. అవీ అరకొర జీతాలు. ఇప్పటికీ కొన్ని రంగాల్లో ఇదేస్థితి. కాస్త బుర్ర ఉన్నవాళ్ళని కులం, మతం, లేదా హోదా, ఏదో పేరుతో అవమానాలకి గురిచేస్తే చాలు, ఆ క్రుద్దతతో వారు వైరి పక్షానికి అనుకూలురు కావటం తేలిక. ఇదే స్ట్రాటజీ ఇక్కడ.]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

good one

ఆక్కా! ఇంతకు ముందు Iam feeling you are just like mine అన్నాను గుర్తుందా! నా మనో భావాలు ఈ పొస్ట్ లొ వున్నది వున్నట్టు గా వచ్చాయి. అందుకనే మిమ్మల్ని అక్కా అని పిలవాలనిపించింది. మీ బ్లాగు నాకు చాల సంతొషం కలిగిస్తొంది. - బ్లాగు తమ్ముడు

nice..mee valla chaala vishyalu telusukuntunnam.
thank you

chala baaga chepparu..

http://www.andhrabhoomi.net/sameeksha.html

Anonymous గారు,
రామోజీరావు గురించి, చెరుకూరి చంద్రమౌళి రచన సీరియల్ గా ప్రచురింపబడనుందని ఇంతకు ముందు విన్నాను. ఒకేసారి పుస్తకంగా ప్రచురింపబడిందన్న సమాచారం, ఇతర వివరాలు, మీరిచ్చిన లింకులో ఉన్నాయి. మంచి సమాచారం ఇచ్చారు, కృతఙ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu