3½ దశాబ్దాలకు పైగా... ఉధృతంగా దశాబ్దాల తరబడి... నకిలీ కణిక వ్యవస్థ, ప్రజా బాహుళ్యంలోకి మిధ్యా భావవాదాన్ని, కుహనా భావజాలాన్ని ప్రవేశ పెట్టింది, ప్రచారించింది. పర్యవసానంగా ప్రజాదృక్పధం... మానవీయ విలువలకు దూరంగా, దమ్మిడీల పరుగుకీ దగ్గరగా జరిగింది.
ప్రజలందరూ నూటికి నూరు శాతం ఇలాగే ఉన్నారని అననుగానీ, అత్యధిక శాతం ఇలా ఉన్నారని మాత్రం అంటాను. ఇది దృష్టిలో ఉంచుకుని నా విశ్లేషణని పరిశీలించగలరు.
~~~~~
రాత్రి కలతనిద్రపోయినా, కలల నిద్రపోయినా లేక కమ్మని నిద్రపోయినా, తెల్లవారి మాత్రం ప్రశాంతంగా నిద్రలేచి "నిన్న బాగానే గడిచింది. ఈరోజు బాగానే నడుస్తుంది. రేపు కూడా బాగానే నడవబోతోంది" అనుకునే ధీమా మనకి లేదు. నిన్న పసిబిడ్దలూ/యువకులూ హత్యచేయబడ్డారు లేదా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు గ్యాస్ బండ ధర పెరిగింది, లేదా బస్సు ఛార్జిలు పెరిగాయి. ఇక రేపేం కానున్నదో" అనుకునే పరిస్థితి!
రోజుకెంతమంది రైతన్నలూ నేతన్నలూ నేలరాలు తున్నారో లెక్కలు చూసుకోవాల్సిందే!
’బీహార్లో సంవత్సరానికి, కిడ్నాపుల నేపధ్యంలో 300 కోట్ల రూపాయల లావాదేవీలు నడిచాయట’ అని గణాంక వివరాలు గమనించుకోవాల్సిందే!
బియ్యం పప్పుల దగ్గర్నుండీ బస్సు విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు ఎంత పెరుగుతాయోనని బిక్కుబిక్కుమంటూ చూడాల్సిందే!
ఒకప్పుడు ఒకో ప్రదేశానికి ఒకో పాలేగాళ్ళుండే వాళ్ళు. ఇప్పుడు ఆ స్థానాల్లో రాజకీయ నాయకులు ఉంటున్నారు. తాత తండ్రుల హయాంలో ఒరిస్సా నుండి వలస వచ్చిన కేసీఆర్ తెలంగాణా తన గుత్తసొత్తు అంటాడు. అలాగే తాతతండ్రులు ఉత్తరప్రదేశ్ నుండో మరోచోటి నుండో ముంబాయికి వలస వచ్చిన బాల థాకరే ముంబాయి, కుదిరితే మహారాష్ట్ర మొత్తం, తన గుత్తసొత్తు అంటాడు. దెబ్బతో ఆస్తుల విలువలు మారతాయి. వృత్తి వ్యాపారాల స్థితిగతులు మారతాయి. సామాన్యుడి బ్రతుకు మీద RDX తో కూడిన బాంబులే పడక్కర్లేదు. ఇలాంటి రాజకీయ నాయకులు స్వంత ప్రయోజనాల కోసం తెరమీదికి తీసుకొచ్చే ఉద్యమాలతో కూడిన బాంబులే నేడు జనాల బ్రతుకులని బస్టాండు పాలు చేస్తున్నాయి.
మండే కొలిమి లాగానో, రగిలే లావా లాగానో ప్రజల బ్రతుకులూ, దేశపు స్థితిగతులూ మారిపోయాయి. ఎవరు ఈ దేశాన్ని కాపాడాలి? ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకు వినబడే మాటల్లో కొన్ని -
"ఈ రాజకీయాలు ఇంతేనండి. ప్రజల్లో మార్పు రావాలి. లేనంత కాలం ఇంతే!"
"సమాజం మారాలండీ! లేనట్లయితే ఎప్పటికీ ఇంతే!"
"అవినీతి అంతం అయితే తప్ప మార్పు రాదండీ!"
నిజమే మార్పు రావాలి! ఎవరిలో రావాలి? సమాజం అంటే ఎవరు?మనం కాదా? మనం సమాజంలో భాగం కాదా? మనం వేరు, సమాజం వేరునా? మనందరం కలిసే సమాజమ్ కదా! మార్పు మనతో కదా ప్రారంభం కావాలి? అవినీతి అంతం కావాలంటే ఆ ప్రక్రియ మనతో కదా ప్రారంభం కావాలి? మీకు ఓ చిన్న ఉదాహరణ చెబుతాను.
2003 నుండి 2007 వరకూ మేము శ్రీశైలంలో చల్లా వెంకయ్య సత్రంలో మొదటి అంతస్థులో ఉండేవాళ్ళం. అదే అంతస్థులో జిల్లా పరిషత్ పాఠశాలలో ఇన్ ఛార్జ్ ప్రిన్స్ పాల్ గానూ/గణిత ఉపాధ్యాయుడు గాను పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉండేవాడు. మాకంటే వయస్సులో పెద్దవాడు. పొరుగు వ్యక్తిగా అతడితోనూ, వాళ్ళ కుటుంబంతోనూ మాకు మంచి సంబంధాలే ఉండేవి. అతడు కూడా పొరుగు వ్యక్తిగా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తే! వాళ్ళ అమ్మాయిలు కూడా మా దగ్గర ట్యూషన్ చెప్పించుకునే వాళ్ళు.
ఆయన బడిలో పాఠాలు సరిగా చెప్పేవాడు కాదు. కాకపోతే ఠంచనుగా బడికి మాత్రం హాజరయ్యేవాడు. ఆ ప్రభుత్వ బడిలో మరికొందరు ఆ మాత్రం కూడా చెయ్యరన్న మాట. మాటల్లో "ఈ పిల్లలకి బేసిక్స్ లేవండి. మనం చెప్పినా చదవరు" అనే వాడు. అది ప్రభుత్వ పాఠశాల. ఒకప్పుడు జీరో రిజల్ట్ చరిత్ర కలిగినది. ఫీజులు కట్టని కారణంగా తల్లిదండ్రులెవరూ నిలదీసి అడగలేరు. అడిగినా జవాబు చెప్పే నాధుడు ఉండడు. చివరికి అతడి కూతురు కూడా ఓ సారి "ఈ లెక్క మా డాడీ నాలుగుసార్లు చెప్పాడు మేడం. నాకు అసలేం అర్ధం కాలేదు" అనేసింది. ఇదే వ్యక్తి, దేవస్థానం వాళ్ళు మా సత్రానికి నీళ్ళు సరిగ్గా పంపిణీ చేయని సందర్భంలో "వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డితింటున్నారా?" అని మండి పడ్డాడు. తాము పరీక్షా జవాబు పత్రాల మూల్యాంకన[10th class marks valuation]కి వెళ్ళినప్పుడు అక్కడ సౌకర్యాలు ఏమాత్రం చేయలేదన్నప్పుడు కూడా తిట్లు లంకించుకున్నాడు.
ఒక్కసారంటే ఒక్కసారి ’తాను విద్యార్దులకి చేస్తున్నదేమిటి?’ అనీ అలోచించలేదు. అది చూసి మాకు నోట మాట వచ్చేది కాదు. పొరుగువాడు. ఏమీ అనలేము. మాటలతో మార్పు తెచ్చేందుకు అతడు మా కంటే చిన్నవాడూ కాదు, మా విద్యార్ధి వంటివాడూ కాదు. అదీగాక, అసలు మాటలతో ఎవరి ఆలోచనా సరళినైనా ఏం మార్చగలం? అందుకే మిన్నకుండి పోయేవాళ్ళం. అయితే పరిశీలన మాత్రం చేసేవాళ్ళం. దేవస్థానం ఉద్యోగుల గురించి "జీతాలు తీసుకుంటున్నారే. పై డబ్బులూ తింటున్నారే. పని చెయ్యాలని తెలియాదా?" అంటూ దుమ్మెత్తి పోసిన ఆ నడివయస్సు వ్యక్తికి, తాను చేస్తున్న దాని మీద స్పృహ లేదు. "ఆ. నేనొక్కడిని ఒళ్ళు విరగ్గొట్టుకుని చెప్పినంత మాత్రాన పిల్లలు బాగుపడిపోతారా?" అనే ధోరణి! అందరూ అలాగే అనుకోబట్టే కదా ఈ స్థితి?
అందరికీ తెలిసిందే అయినా ఓ చిన్న కథని మరోసారి గుర్తు తెచ్చుకుంటే -
అనగా అనగా...
ఓ రాజు గారికి తన రాజ్యంలోని ప్రజలందరూ చాలా నిజాయితీ పరులని పరమనమ్మకం ఉండేదట. అదే విషయమై పదే పదే అంటుండే సరికి, ఓ రోజు మంత్రి ’అంత సీన్ లేదు’ అన్నాడట. రాజుకి కోపం వచ్చింది. నిరూపించమన్నాడు.
మర్నాడు మంత్రి రాజధాని నగర మంతటా ’రాజు గారి ఇంట వేడుకలున్నాయని, ప్రజలంతా తలా చెబుడు పాలు తెచ్చి, ఒకరొక్కరే వచ్చి, రాజుగారి కోటలో ఉంచిన బానలో పోయాల్సిందనీ’ దండోరా వేయించాడు. ప్రజలంతా తలో చెంబు బరువుగా మోసుకొచ్చి, ఒక్కరొక్కరే బానలో పోసి పోయారు.కాపాలా లేదు, తనిఖీ కూడా లేదు. బాన నిండాక రాజు, మంత్రి బాన తెరచి చూస్తే ఏముంది? అన్నీ నీళ్ళే!
"ఆ! అందరూ పాలు పోస్తారు కదా! మన ఒక్కరం చెంబునీళ్ళూ పోసినా ఏం కాదులే! అన్నిట్లో అవే కలిసి పోతాయి.[అన్నిట్లో అదే కొట్టుకుపోతుందన్నట్లు] ఎవరూ చూడబోవటం లేదు కదా? తనిఖీ ఉంటే దొరికి పోతామని భయపడ వచ్చు గాని అదేం లేదు కదా! ఏం ఫర్వాలేదులే!" అని ఎవరికి వాళ్ళు అనుకున్నారు. దాంతో అందరూ నీళ్ళే తెచ్చారు.
ఎవరికి వాళ్ళు "మిగిలిన అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తారు. [అంటే పాలు తెస్తారు] తానొక్కడూ తన పని తాను చేయక పోతే[అంటే నీళ్ళు పోస్తే] ఏం కాదులే" అనుకున్నారు. "మిగిలిన అందరూ తమపని తాము చేయటం లేదు. నేనొక్కడిని చేస్తే మాత్రం ఏం లాభం?" అనుకోవటానికి మరో రూపమే ఇది. బదులుగా, ఎవరికి వాళ్ళు "మిగిలిన అందరూ తమ పని తాము చేయనీ చేయకపోనీ! [అంటే పాలే తీసుకు రానీ, నీళ్ళే తీసుకు రానీ] నా పని నేను సరిగా చేస్తాను" అనుకొని ఉంటే బాననిండా తీయని పాలే ఉండేవి కదా!
నిజానికి ’నేను వేరు, సమాజం వేరు’ అనుకోవటం కారణంగా ఏర్పడ్డ పరిణామం ఇది. ’నాలాగే ప్రతీవాడూ అనుకుంటే...? నాలాగే ప్రతివాడూ చెబుడు నీళ్ళే తెస్తే...?’ అని అలోచించకపోవటం. శతాబ్ధాలుగా ’విభజించి పాలించటం, విభజించి ప్రచారించటం’తో ఏర్పడిన పరిణామం, ఈ రకమైన ప్రజాదృక్పధం!
మరో ఉదాహరణ చెబుతాను.
పెద్దకుటుంబంలో ఓ ఇరవై మంది సభ్యులున్నారనుకొండి. పసిబిడ్డలూ, వయోవృద్ధులూ పోను ఓ పదిహేను మంది ఉన్నారనుకొండి. ఆ ఇంటిని నడపటానికి అందరూ తలోపని చేస్తే [తిండి సంపాదించే పనైనా, ఇంటిని నిర్వహించే పనైనా] ఆ ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది. అలాగ్గాక, కొందరు తిని తిరగటమో, తిని నిద్రపోవటమో లేదంటే టీవీ చూడటమో చేస్తే...? మొత్తం పని కొద్దిమంది మీద పడుతుంది. మెల్లిగా మరికొందరు బద్దకాన్ని ఆశ్రయిస్తారు. క్రమంగా... తిని కంచం భోజనాల బల్ల మీది నుండి సింకుల్లో కూడా వేయకుండానూ, పడకమంచమ్మీది రగ్గు సైతం మడతబెట్టకుండానూ తయారౌతారు. దెబ్బతో పని చేసే ఒకరిద్దరి నడ్డీ విరిగి పోతుంది. అశాంతి రేగుతుంది. ఇక ఇల్లు నరకానికి నకలుగా మారుతోంది.
దానికి తోడు, ఇంటిని నడపటానికి శ్రమిస్తున్న తోటి కుటుంబీకుల శ్రమని పంచుకోకుండా, తీరి కూర్చొని తీర్పులూ సమీక్షలూ చేసారనుకొండి. అప్పుడిక ఇల్లు నరకానికి నకలు కాదు ప్రత్యక్ష నరకమే!
నిజానికి కుటుంబం ఎటు వంటిదో దేశమూ, సమాజము కూడా అటువంటిదే!
కుటుంబంలోని ఒకవ్యక్తి, ’నేను వేరు, కుటుంబం వేరు ’ అన్నట్లు ప్రవర్తిస్తే వాణ్ణి పచ్చి స్వార్ధపరుడు అంటాం. చిన్న పరిమాణం కాబట్టి దాన్ని గుర్తించగలుగుతాం. అదే దేశపు పరిధి లోకి వస్తే, ఆ స్వార్ధపు దుష్పరిణామం ఇదిగో ఇప్పుడు మన కళ్ళెదుట ఉన్నదే! అసలెందుకు ప్రజా దృక్పధం ఈ విధంగా పరిణమించింది?
శతాబ్ధాలుగా చాపక్రింద నీరులా, దశాబ్దాలుగా ముమ్ముర స్థాయిలో, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ ప్రజాబాహుళ్యంలోకి ప్రవేశపెట్టిన మిధ్యా భావజాల ప్రభావం ఇది. దీన్ని మూలం నుండి పరిశీలించాలంటే...
భగవద్గీత... అహంకారాన్ని, అరిషడ్వర్గాలనీ దాటమంటుంది. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ దీని విపర్యయాన్ని అమలు చేస్తాయి. నకిలీ కణిక వ్యవస్థ ప్రయోగించే స్ట్రాటజీలు పైకి పలురకాలుగానో, పది రకాలుగానో కనబడినా... తరచి చూస్తే అంతర్లీనంగా... అహాన్ని సంతృప్తి పరచటం లేదా అహాన్ని రెచ్చగొట్టటం/దెబ్బగొట్టటం అన్న వాటి మీదే ఆధారపడి ఉంటాయి. ఆడది, ఆకలి దీనికే మరోకోణం అన్న మాట.
సమాజాన్ని అర్ధం చేసుకోవాలంటే అభివృద్ది లేదా అంకెల గారడితో లెక్కకట్టలేము. ఎందుకంటే అభివృద్ది అయినా మరోకటి అయినా ఒకోసారి ఒకోరకంగా ఉంటుంది. వాటి పైకారణాలు[over leaf reasons] కూడా రకరకాలుగా ఉంటాయి. అది ఎప్పటికి మనకి అర్ధం కాని జీడిపాకం. [ఎందుకంటే అర్ధం కానివ్వక పోవటమే ఇక్కడి స్ట్రాటజీ కనుక!] అలాగాక భగవద్గీత లో చెప్పినట్లు త్రిగుణాలతో మానవ సమాజాన్ని లెక్కగడితే మన సమాజం ఎటువైపు పయనిస్తుందో బాగా అర్ధం అవుతుంది. అప్పుడు కుట్ర స్వరూపం కూడా బాగా అర్ధమౌతుంది.
భగవద్గీత, ప్రతీమనిషిలో త్రిగుణాలు [సత్వరజస్తమో గుణాలు] ఉంటాయంటుంది. ప్రతీ గుణానికి కొన్ని అనుకూలాంశాలు, ప్రతికూలాంశాలు ఉన్నాయి. ఒకో సమయంలో ఒకో గుణం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆయా సమయాల్లో కూడా వ్యక్తి తనకు తాను సాక్షిలా పరికిస్తుండాలంటాడు గీతాచార్యుడు.
క్రింది శ్లోకాలు పరిశీలించండి.
శ్లోకం:
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ
భావం:
త్రిగుణాలలో సత్త్వగుణం పరిశుద్దమైనది. అది ప్రకాశాన్ని కల్గించి పాపాల నుండి దూరం చేస్తుంది. ఈ గుణోద్బాసితులు సౌఖ్యం, జ్ఞానం - అనే వాటితో బద్దులవుతారు.
శ్లోకం:
రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్
భావం:
అర్జునా! రాగమయమైన రజోగుణం - కామ మోహకాంక్షాదుల సంపర్కం వల్ల ఆవిర్భవిస్తోంది. ఈ గుణానికి బద్దుడైన జీవుడు - కర్మలచే బద్దుడవుతాడు. [కర్మలంటే నిష్కామ కర్మయోగం కాదు. దాన్ని బుద్దియోగం అని గీత అంటుంది. ఇక్కడ కర్మ అంటే ’ఈ పనిని నేనే చేసాను అనే అహంకారం, దీని ఫలితం నాకే చెందాలి అనే ఆసక్తితో చేసే పని’ అని అర్ధం!]
శ్లోకం:
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత
భావం:
అజ్ఞానం నుండి జనించే తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచి వేస్తుంది. సోమరితనం, నిద్ర, పొరబాటు అనే వాటితో బద్దులను చేస్తుంది.
శ్లోకం:
రజస్తమశ్వాభిభూయ సత్త్వం భవతి భారత
రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా
భావం:
అర్జునా! ఒకప్పుడు రజస్తమోగుణాలను అణచి సత్త్వము - మరొకప్పుడు సత్త్వ తమోగుణాలను మించి రజోగుణము - ఇంకొకప్పుడు సత్త్వరజోగుణాలను గెలిచి తమోగుణము - ఆధిపత్యం వహిస్తుంటాయి.
శ్లోకం:
సత్త్వా త్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ
ప్రమాదమోహో తమసో భవతో2జ్ఞానమేవ చ
భావం:
సత్త్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల లోభం కలుగుతాయి. తమోగుణం వల్ల అజ్ఞానం, భ్రాంతి, ప్రమాదాలు ఏర్పడతాయి.
శ్లోకం:
శ్రీ భగవానువాచ:-
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ
స ద్వేష్టి సంప్రవృత్తావి న నివృత్తాని కాంక్షతి
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే
గుణా వర్తంత ఇత్యేవ యో2వతిష్ఠతి నేంగతే
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః
తుల్యప్రియోప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః
మానావమానయో స్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః
సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్స ఉచ్యతే
భావం:
అర్జునా! ఎవడైతే ఈ గుణాల యొక్క వ్యక్తరూపాలైన - ప్రకాశ, ప్రవృత్తి, మోహాలు ప్రాప్తించినా ద్వేషించక, ప్రాప్తించకపోయినా వాటిని ఆశించక - సాక్షి మాత్రుడిగా ఉండి, గుణధర్మ పరమైన కర్మలకు తన కర్తృత్వాన్ని జోడించక, వాటి స్వస్వభావతను గ్రహించి, సుఖదుఃఖాలను రెంటినీ సమభావంతో చూస్తూ, తనయందే సుప్రతిష్ఠితుడై - మట్టి, రాయి, బంగారాలపై సమాభావంతో వుండి, ప్రియాప్రియాలకు సముడై, ధీరుడై, నిందాస్తుతులందునా, మానవమానాలందునా, శత్రుమిత్రులందునా - సమబుద్దితో వుండి, నిస్సంకల్పుడై ఉంటాడో - వాడే గుణాతీతుడుగా చెప్పబడతాడు.
శోక్లం:
మాం చ యో2వ్యభిచారేణ భక్తియోగేన సేవతే
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయకల్పతే
భావం:
నిత్యమూ నన్నే నిశ్చల భక్తితో సేవించేవాడు, త్రిగుణాలనూ అతిక్రమించి బ్రహ్మత్వాని కర్హుడవుతాడు.
శ్లోకం:
ప్రవృత్తిం చ నిపృత్తిం చ కార్యాకార్యే భయాభయే
బంధం మోక్షం చ యావేత్తి బుద్ధి స్సా పార్ధ! సాత్త్వికీ
భావం:
ధర్మాధర్మాలందు ప్రవృత్తి నివృత్తులను - కర్తవ్యాకర్తవ్యములను - భయాభయాలను - బంధనమోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్వికబుద్ది.
శ్లోకం:
యయా ధర్మమధర్మం చ కార్యం చా కార్యమేవ చ
అయథావ త్ర్పజానాతి బుద్ధిస్సా పార్ధ! రాజసీ
భావం:
ధర్మాధర్మాలు, కార్యాకార్యాల యొక్క యధార్ధ జ్ఞానాన్ని గాక, పొరపాటుగా గ్రహించేది రాజసబుద్ధి.
శ్లోకం:
అ ధర్మం ధర్మమితి యా మన్యతే తమసా22వృతా
సర్వార్ధాన్ విపరీతాంశ్చ బుద్ది స్సా పార్ధ! తామసీ
భావం:
అధర్మాన్ని ధర్మంగాను, అన్ని విషయాలనూ అపసవ్యంగాను గ్రహించేది తామస బుద్ది.
ఈవిధంగా పరిశీలించినా కూడా... సత్వ, రజో, తమో గుణాలలో... సాపేక్షంగా... తమోగుణం కంటే రజోగుణం, రజోగుణం కంటే సత్త్వగుణం, వ్యక్తి శ్రేయస్సు రీత్యా గొప్పవి. అలాగయినా భగవద్గీత, మనిషిని తామసం నుండి రాజసానికి, రాజసం నుండి సాత్వీకానికి ప్రయాణించమంటుంది. అయితే నకిలీ కణిక వ్యవస్థ , మొత్తంగా మానవజాతిని తామసం వైపుకి లాక్కుపోయింది, పోతోంది.
అంతేకాదు, భగవద్గీత మనిషిని త్రిగుణాలని కూడా దాటి నిశ్చల బుద్ధిని పొందమంటుంది. ఆ విధంగా భగవద్గీత, హిందూ సనాతన ధర్మం, మనిషిని ఉతృష్టమైన దాన్ని కూడా అతిక్రమించమని బోధిస్తే... అందుకు విపర్యయంగా నకిలీ కణిక వ్యవస్థ, నికృష్టమైన దానిలో నిండా మునిగి పొమ్మంటుంది.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
2 comments:
ఈ పరిస్థితిని పూర్తిగా న.క.వ్య.పై ఆరోపించడం సబబు కాదేమోనండీ.
మనిషి సహజంగానే సుఖాన్ని కోరుకుంటాడు. ఆ సుఖాన్వేషణలో ప్రత్యేకించి శ్రమ అవసరం లేకుండానే లభించే సుఖాన్ని త్వరగా పొందుతాడు. అదే శాశ్వతమైనదని నమ్మి దానిలోనే మునిగియుంటాడు. అందుకే కొందఱికి ఆహారం సుఖమైతే, కొందఱికి నిద్ర సుఖం. సాధారణంగా ఈ తాత్కాలిక సుఖాలు తామసమైనవే అయ్యుంటాయి. నిజమైన సుఖం... బ్రహ్మానందం పొందాలీ అంటే సాత్త్వికమైన ప్రవృత్తిని కూడ దాటిపోవాలి. దానికి శమదమాలు చాల అవసరం. ఇందులోని ఆనందం తొలినాళ్లలో కనబడక శ్రమ మాత్రమే కనబడుతుంది. అందువల్ల సాధారణంగానే ప్రకృతిసిద్ధంగానే మనుష్యులు ఎక్కువ తామసప్రవృత్తికి లోనై ఉండడంలో ఆశ్చర్యం లేదు.
కానీ ఇది తామసం అనీ ఇది రాజసికమనీ ఇది సాత్త్వికమనీ తెలుసుకోగల విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తోంది చాలా వఱకు ఈ ప్రస్తుత విద్యావ్యవస్థ. విద్య కేవలం వృత్తివిద్యగా రూపాంతరం చెందడం వల్ల, అధ్యాత్మవిద్య పూర్తిగా కనుమఱుగవడం వల్ల ఈ బుద్ధివికాసం జఱగడం కుంటువడుతోంది. విద్యావ్యవస్థ ఈ రకంగా నాశనం అవ్వడానికి కారణంగా న.క.వ్య.ని చెప్పడం మాత్రం చాలా సబబు.
ఎప్పటికి మల్లేనే చక్కటి వ్యాసమందించారండీ. నెనర్లు.
రాఘవ గారు,
కొన్ని పరిస్థితులు బాగా ముదిరిపోయాక ద్వంద్వాలు తయారౌతాయండి. అంటే విత్తు ముందా చెట్టు ముందా లాగన్న మాట. ప్రజల్లో తామసం సహజంగానే ఎక్కువగా ఉంటుంది లేదా నకిలీ కణిక వ్యవస్థ ప్రజలకి తమో గుణం పూరితుల్ని చేస్తోంది అన్నది అటువంటి ద్వంద్వమే. :)
Post a Comment