నాగవైష్ణవి మరణ వార్త తెలిసినప్పటి నుండి మనస్సంతా చేదుగా, నిర్వేదంగా ఉంది. పదేళ్ళ పసిబిడ్డ! అపహరణకి గురైన గంటన్నర లోపే హత్యకు గురై, ఇనుము కరిగించే కొలిమిలో కాల్చి బూడిద చెయ్యబడింది. అన్నెంపున్నెం తెలియని పసిది. నిర్ధాక్షిణ్యంగా చంపబడి, నిప్పుల కొలిమిలో కాల్చబడి... భగవంతుడా! ఎటు పోతున్నాం మనం?
ఆ బిడ్డ కుటుంబ నేపధ్యం ఏమైనా గానీ, తండ్రికీ బంధువులకీ మధ్య వివాదాలు ఎన్నున్నా గానీ... పదేళ్ళ పాపని కౄరంగా చంపేసి, కోడినో మొక్కజొన్న కండెనో కాల్చినట్లు కాల్చేసి... ఎంత కిరాయి రౌడీలైనా, ఎంతగా ఆస్థి తగవులూ, ఇతర గొడవలూ ఉన్నా... అయిన వాళ్ళే అయినా, అద్దెకు వచ్చిన నేరగాళ్ళైనా... అసలు మనుషులేనా అన్పించే రాక్షసత్వం అది.
ఎన్ని చీకాకుల్లో ఉన్నా, రోడ్ మీద వెళ్తున్నప్పుడు ముక్కు ముఖం తెలియని పిల్లలనైనా సరే, వాళ్ళ హావభావాలు, మాట తీరు చూస్తే కాస్సేపు మన చికాకుల్నీ, అసహనాలనీ, అన్నిటినీ మరిచిపోతామే! అలాంటిది... తమకు ఏ సంబంధం లేని బిడ్డ, ఆ బిడ్డ మీద కక్షో కోపమో ఉండే అవకాశమే లేదు... పీక నులిమే చంపనీ, మరో రకంగా చంపనీ... కాంట్రాక్టు తీసుకొని, ’డబ్బులోస్తే చాలు’ అన్నట్లు కూరగాయలు కొసినట్లు పీకలు కోయటం! మనిషి ప్రాణం ఎంత విలువలేనిది అయిపోయింది?
రూపాయి... దమ్మీడీల పరుగు... జీవితంలోకి మరింత లోతుగా చొచ్చుకు వస్తే పర్యవసానం ఇలాగే ఉంటుంది.
శనివారం[30, జనవరి] వైష్ణవి అపహరణకు గురైన నేపధ్యంలోనే ఆ పిల్లలు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నపిల్ల చంపి వేయబడింది. అది బయటపడ్డాక ఆ బిడ్డ తండ్రి గుండెపోటుతో మరణించాడు. మొత్తం మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రెండురోజులుగా చాలామంది మనస్సులు కలిచివేసిన ఈ సంఘటనని నాలుగు పార్శ్వాలలో పరిశీలించవచ్చు.
1. భావపరంగా
2. సామాజికంగా
3. ఆధ్యాత్మికంగా
4. చరిత్ర పరంగా
వైష్ణవి తండ్రికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి ఆమె ఆధికారిక భార్య. రెండో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడట. నిజానికి ఇలాంటి వాటిని ఒకప్పుడు చట్టమూ, సమాజమూ గుర్తించేవి కావు. అదేదో ’దశరధ మహారాజుకు ముగ్గురు భార్యలు’ అన్నట్లు చెప్పడానికి లేదు. ఆధునిక కాలంలో బహుభార్యత్వం నిషేధించబడినాక ఇలాంటి బంధాలను అక్రమ సంబంధాలనే అనేవారు. ఇటీవల... ఎక్కువ కాలం ’సజావుగా’ సాగితే ఈ అక్రమ సంబంధాలను కూడా సక్రమంగానూ, ఆస్తి పంపకాలకు అర్హమైనవి గానూ కోర్టు తీర్పులిచ్చిందట.
వైష్ణవి తండ్రి ప్రభాకర్ మద్యం వ్యాపారి. రియల్ ఎస్టేట్ వంటి ఇతర వ్యాపారాలూ ఉన్నాయి. తొలిభార్య స్వయానా అక్కకూతురు. ఆమె కుమారుడికీ, రెండో భార్య సంతానానికి ఆస్తులు ఎలా చెందాలి అన్న విషయమై[?] తొలిభార్య తోబుట్టువులతోనూ, తన తోబుట్టువులతోనూ ప్రభాకర్ కి వివాదాలున్నాయి. రెండో భార్య సంతతి పట్ల అతడి మొగ్గు ఎక్కువ ఉండటం ఈర్ష్యాసూయలకి, ద్వేషాలకి తావిచ్చింది. పర్యవసానం పసిపిల్ల హత్య చేయబడింది.
ఇదీ నేపధ్యం!
1]. ఈ సంఘటనని మొదట భావపరంగా పరిశీలిద్దాం:
నిజానికి - బ్రతకడానికి డబ్బుకావాలి. మరింత సౌకర్యంగా, సుఖంగా బ్రతకడానికి మరికొంత డబ్బు కావాలి. అయితే డబ్బే బ్రతుకు కాదు. జీవితంలో డబ్బూ కావాలి, అనుబంధాలూ అనుభూతులూ కూడా కావాలి. ఆకలి కేకలు వేస్తే, దారిద్రం నట్టింట నాట్యం చేస్తే, ప్రేమ కిటికీ లోనుండి పారిపోతుందంటారు.
అలాగే, నిరంతరం దమ్మీడీల పరుగులో బిజీబిజీ అంటే... కొన్నేళ్ళ తర్వాత చూసుకుంటే మన పిల్లల మనస్తత్వం ఏమిటో, మనఃస్థితి ఏమిటో, కుటుంబంలో మన స్థితి ఏమిటో కూడా తెలియకుండాపోతుంది. మన కుటుంబంలో మనమే, మనకు మనమే పరాయి వాళ్ళం అయిపోయామని తెలుసుకునే సరికే జీవితం సగం పైగా పూర్తయిపోతుంది. అలాగని "ప్రేమని తిను, బంధాన్ని తాగు, కబుర్లతో కడుపు నింపుకో, భావవాదివి కాబట్టి మట్టిగొట్టుకుపో" అంటే... అదీ సరికాదు. అసలు ’భావవాది, దైవభక్తుడు... ఐహిక విషయాలని, ఆర్ధిక విషయాలని అసలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు, చేయాలి ’ అని చెప్పటం నకిలీ భావవాదం మాత్రమే!
జీవితంలో ధనానికీ, అనుభూతులకీ... దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంత ఇవ్వటం, రెండింటినీ సమన్వయ పరుచుకోవటమే జీవన కళ! అక్కడా సమతుల్యత కావలసిందే! మన జీవన సరళిలో ఉన్న జీవన కళని, ప్యాకింగ్ మార్చి, Art of living పేరిట, ఇప్పుడు మన విద్యే మనకి, డబ్బులు తీసుకుని మరీ నేర్పుతున్నారు.
అలాగాక, ’పైసాయే పరమాత్మ’ను కుంటే... రూపాయి కోసం ఏ పనైనా చేయొచ్చనుకుంటే... అప్పుడు డబ్బు విషయమై ఇతరుల దగ్గర ప్రారంభమైన స్వార్ధం, ఇంటిలోపలి దాకా వస్తుంది.
అప్పుడు అస్తుల కోసం, అయిన వాళ్ళే హంతకులౌతారు.
కాసుల కోసం ఎవరినైనా చంపేందుకు కిరాయి నేరగాళ్ళూ వస్తారు.
2]. ఇదే సంఘటనని సామాజికంగా పరిశీలిస్తే...
ప్రభుత్వాలు కూడా, ఈ ఏడాది జీడీపీ ఇంతశాతం, అభివృద్ధి రేటు ఇదీ, తలసరి ఆదాయం ఇంత పెరిగిందీ, xyz ఇంతా, ABC ఇంతా... అంటూ పైసల లెక్కలే చెబుతూ... డబ్బుతోనే అభివృద్ది అంటుంటే... సమాజపు పతనం ఈ దిశలోనే ఉంటుంది.
పైనుండి క్రింది దాకా రెడ్ టేపిజం రాజ్యమేలుతుంటే... డబ్బు చేతులు మారితేనే కాగితాలు బల్లలు మారడం... పైసలు రాలితేనే పనులు కదలటం... జరుగుతుంటే మానవీయ విలువలు ఇలాగే నాశనం అవుతాయి. [నేను గమనించినంత వరకూ, సరళీకృత ఆర్దిక విధానాలు వచ్చాకా, వేగం పుంజుకున్నాకా, మరింత వేగంగా మానవీయ విలువలు పడిపోయాయి.]
ఓ నేరం జరిగినప్పుడు... పోలీసులు ’ఇది విజయవాడ పరిధిలోకి వస్తుందా రాదా, ఇది కృష్ణాజిల్లా పోలీసులు చేపట్టాల్సిన కేసా లేక గుంటూరు జిల్లా పోలీసులు చూసుకోవాల్సిన వ్యవహారమా ’ అంటూ మీమాంసలు పడుతుంటే... మీనమేషాలు లెక్కిస్తుంటే...
అచ్చంగా దొంగలు పడిన ఆరునెలలకి కుక్కలు మెరుగుతాయి! అచ్చంగా కొంపంటుకున్నాక అప్పుడు బావి తవ్వకం మొదలెట్టినట్లుంటుంది!
ఈ కేసులో తమకి ’ఎటునుండి ఎక్కువ డబ్బు వస్తుంది ’ అని గాకుండా... లేదా ఈ కేసులో ’పైసలు పెద్దగా రావు. అలాంటి సోది పని ఎవరు చేస్తారు?’ అనుకోకుండా... నికార్సుగా పనిచేస్తే...?
ఉదాహరణకి వైష్ణవి కేసునే తీసుకుంటే... అపహరణకి గురయ్యింది పదేళ్ళ పాప! కుటుంబ వివాదాలు నేపధ్యం ఏదైనా గానీ... ఆ బిడ్డ ధనికుడి కుమార్తె కానీ లేక పేదవాడి కుమార్తె కానీ... "నా బిడ్డే ఆపహరణకి గురైతే, ఎంత భయం, ఆందోళనా ఉంటాయి? ఆలస్యం చేస్తే మరింత హాని జరగొచ్చొమో" అని ఏ పోలీసు అధికారి ఆలోచించినా... ఏమో బిడ్డప్రాణాలు కాపాడబడేవేమో? కనీసం బూడిద బదులు శవమైనా దక్కి ఉండేదేమో? పోలీసు అధికారులు, ఇతరులు ఇలా ఆలోచిస్తే,... ఈ కేసు కాకపోయినా, ఇలాంటి ఎన్నో కేసుల్లో... నేరాలని నియంత్రించవచ్చు, న్యాయం జరిపించనూ వచ్చు. కాదా?
మరోవైపు చూస్తే, Money makes many things అనే నానుడి పదేపదే ప్రచారింపబడి, చాలామంది నమ్మకాలలో స్థిరపడిపోయింది. కాకపోతే బావ కూతుర్ని అపహరించి, హత్య చేసి, గుర్తు పడతాడేమోనన్న భయంతో డ్రైవర్ నీ చంపేసి... ఎలా తప్పించుకోగలం అనుకున్నాడు ప్రభాకర్ బావమరిది వెంకట్రావు?డబ్బుతో అన్నీ సరిచేసుకోగలం అనుకోవటం తప్పితే మరింకే ధైర్యంతో అంత నేరానికి, కౄరానికి ఒడిగడతారు? కొసమెరుపేమిటంటే ఈ నిందితుడు వెంకట్రావు న్యాయవాదట.
ఈ సందర్భంలో, ఇటీవల వార్తల కెక్కిన ’హల్దీరామ్’ మిఠాయిల యజమాని, ప్రభుశంకర్ అగర్వాల్ విషయం ఉటంకించటం సందర్బోచితం. ఇటీవలే కోల్ కతాలోని నాలుగవ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. [హైకోర్టుకి అప్పీలు చేసుకునే అవకాశం ఇచ్చింది లెండి.] తన ఆకర్షణీయమైన వాణిజ్య సముదాయానికి టీ స్టాల్ ఆటంకంగా ఉందట. దాని యజమాని సత్యనారాయణ ఠాకూర్ ను, అతని టీ దుకాణం తీసేయమంటే ఒప్పుకోలేదట. కొన్ని ప్రయత్నాల తర్వాత, సదరు టీస్టాల్ యజమానిని హత్య చేసేందుకు కిరాయి ముఠాను పురమాయించాడు. 2005, మార్చి 30న టీస్టాల్ యజమాని అనుకొని అతడి బంధువైన ప్రమోద్ శర్మపై కాల్పులు జరిపారు. కేసు విచారణ పూర్తయ్యి ఇప్పుడు హల్డీరామ్ మిఠాయిల యజమానికి శిక్షపడింది. ఇందులో సత్యాసత్యాలు భగవానుడి కెరుక. బయటికొచ్చిన కథనమే నిజమైతే, తీయని మిఠాయిలు తయారు చేసి అమ్మే ధనిక వ్యాపారి ఎంత చేదు వెదజల్లాడో కదా! ఇతడిదీ అదే దృక్పధం - ’డబ్బుతో ఏదైనా సాధ్యమే! నేరం చేసి తప్పించుకోవటమైనా!’ అనుకున్నాడు.
3]. ఈ సంఘటనని ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే...
"చేసిన కర్మకి ప్రతిఫలం అనుభవిస్తాము. చట్టం నుండి తప్పించుకోగలమేమో గానీ భగవంతుడి శిక్ష నుండి తప్పించుకోలేం. ఈ రోజు డబ్బులు కోసమో, ఆస్తుల కోసమో ఓ పసిబిడ్డని చంపేస్తే, చంపిస్తే, రేపు తమనీ తమ పిల్లలనీ ఈ పాపం కట్టికుడిపితే...?" ఇలా ఆలోచించి ఉంటే - కిరాయి నేరగాళ్ళు హత్యలు/నేరాలు చేయటానికి రారు. బంధువులూ, పెద్దమనుషుల ముసుగులు కప్పుకునే వాళ్ళూ కిరాయి మూకలని పురమాయించనూ లేరు.
’చట్టాల నుండి, కోర్టుల నుండి తప్పించుకోగలమేమో గానీ, భగవంతుడి నుండి తప్పించుకోగలమా?’ అని ఒక్క క్షణం ఆలోచిస్తే... మంచీచెడూ, పాపం పుణ్యం, దైవంపట్ల భయమూ భక్తీ గట్రా నమ్మితే [వీటిలో ఏదీ నమ్మినా సరే]... దారుణమైన అమానుషాలు, కౄర కృత్యాలూ, ఘోరనేరాలూ ఇంతగా పెచ్చరిల్లవేమో కదా?
దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబం ఉందనుకొండి. ఆ కుటుంబంలోని పిల్లలకి తల్లిదండ్రుల పట్ల భయమూ, గౌరవమూ ఉండాలి. అప్పుడు పిల్లలు ఒక పద్దతిగా పెరుగుతారు. అలాగాక పిల్లలకి తల్లిదండ్రులంటే భయభక్తులు లేవనుకొండి, అప్పుడు పిల్లలు వాళ్ళిష్టం వచ్చినట్లు ఉంటారు. అప్పుడు ఒక పద్దతి అంటూ ఏమీలేదు.
అలాగే ప్రజలు పిల్లల స్థానంలో ఉంటే, సమాజం గాని, ప్రభుత్వంగానీ, దైవభక్తిగానీ, పాపపుణ్య నమ్మకం గానీ, తల్లిదండ్రుల స్థానంలో ఉండాలి. ప్రజల్ని కట్టడి చేయాలి. కాని ఇప్పుడు ప్రభుత్వం విఫలం అయ్యింది, పర్యవసానంగా సమాజం కూడా విఫలమయ్యింది. వీటన్నింటికంటే ముందే దైవం నిరూపించలేని సత్యం అయ్యింది. [పాపపుణ్యాలని, దైవాన్ని నమ్మేవాళ్ళు, ఆచరించేవాళ్ళు వాటిని నిరూపించవలసిందిగా నమ్మని వాళ్ళు సవాల్ చేస్తున్నారు.] పర్యవసానంగా ప్రజలకి భయం [సిగ్గు లజ్జ] అన్నది లేకుండా పోయింది. కాబట్టే ఇప్పుడు మనం దారుణమైన అమానుషాలు, కౄర కృత్యాలూ ఘోరనేరాలను చూడవలసిన స్థితి వచ్చింది.
కాబట్టే ఒకప్పుడు భారతదేశంలో, రాజులు [ప్రభుత్వాలు] ఎలాంటి వాళ్ళయినా సరే, హిందూమతం మాత్రం ’దైవభక్తి, పాపం పుణ్యం ’ లాంటి నమ్మకాల ద్వారా ప్రజలను కట్టడి చేసేది. రాజులు స్వార్దపరులైనా, ప్రభుత్వాలు విఫలమైనా కూడా, సమాజం విఫలం అయ్యేది కాదు. ఆ విధంగా హిందూమతం ప్రజలని రక్షించేది. అందుకే హిందూమతాన్ని మతం కన్న జీవన విధానం అన్నారు. ఒకప్పుడు పరుల సొమ్ముపాము వంటిది అనే నానుడి ఉండేది. ఇప్పుడు పరుల సొమ్ము పాయసం వంటిది అనే కొత్త సామెతలు వచ్చాయి.
4]. ఇక ఇదే సంఘటనని చరిత్ర పరంగా పరిశీలిస్తే...
చరిత్ర పాఠాలలో ’ఫలానా రాజుల కాలంలో లేదా ఫలానా శతాబ్ధంలో, ఫలానా దేశంలో అరాచకం ప్రబలింది’ అని చదువుతుంటాం. ఇప్పటికీ పిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు రొటీన్ గా చెబుతారు. రొటీన్ గా చదివి, బట్టీ వేసి, పరీక్షలో రాసి, ఆనక తీరిగ్గా మరిచి పోతారు. దాని అర్ధం ఏమిటో ఉపాధ్యాయులు పిల్లలకి చెప్పరు. అసలు చెప్పేందుకైనా కొంతమంది ఉపాధ్యాయులకి కూడా ’అరాచకం ప్రబలడం’ అంటే అర్ధం తెలీదేమో కూడా!
’అరాచకం ప్రబలడం’ అంటే ఇదే? ప్రాణాలు చౌక అయిపోవడం! నేరాలు మితి మీరి పోవడం. ధనమే ప్రధానం అవ్వటం. దుర్యోధనుడి ’మయసభ’ ఏకపాత్రాభినయ డైలాగుల్లాగా "బంధుత్వాబంధుత్వాలు లేవు. న్యాయాన్యాయాలు లేవు. కర్తవ్యాకర్తవ్యాలు లేవు. భయాభయములు లేవు. దయలేదు. ధర్మము లేదు" అన్నట్లున్న నేటి పరిస్థితినే ’అరాచకం ప్రబలడం’ అంటారు. ఇప్పటి ఆధునిక భాషలో చెప్పాలంటే రాజ్యాంగం విఫలం కావడం!
వాస్తవానికి రాజు [పాలకులు] స్వార్ధపరులూ లేదా అసమర్ధులూ అయితే... ప్రజలలో నేరప్రవృత్తి పెరిగి, నియంత్రణ తరిగి అరాచకం ప్రబలుతుంది.
నేటి ప్రజాస్వామ్య పాలకులు స్వార్ధపరులైనందున, అందిన కాడికి దండుకునే పనుల్లో బిజీగా ఉన్నారు. తమకు జైకొట్టిన వాళ్ళనీ, తమకు అనుకూలురైన వాళ్ళనీ దండుకోనిస్తున్నారు. యధారాజ: తధాప్రజ: అన్నట్లు, అదే స్వార్ధ పరత్వం పైనుండి క్రింది దాకా... రాజకీయ, ఉద్యోగ, వ్యాపార వర్గాల నుండి మధ్య , దిగువ తరగతి ప్రజల దాకా పాకింది.
పర్యవసానంగా అరాచకం ప్రబలింది. మరోమాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. నేడు వాళ్ళే అసమర్ధులు కావటంతో స్వార్ధ పర శక్తులు పేట్రేగి పోయాయి. పర్యవసానంగా అరాచకం ప్రబలింది.
చరిత్ర మరిచి పోవటంతో గతం నుండి పాఠాలు నేర్చుకోవటమూ మరుగున పడింది. కాబట్టే, కళ్ళముందున్న స్థితిని గమనించుకోలేని, అర్ధం చేసుకోలేని స్థితిలో నేటి సమాజం ఉంది. ఇందుకోసమే ప్రభుత్వాలు ప్రయత్నపూర్వకంగా ’చరిత్ర’ని నిర్లక్ష్య పరుస్తున్నారు. చరిత్ర చదువుకున్నవాడికి బ్రతుకుతెరువు కూడా కష్టం కావటంతో, బడిపంతులు కాదలుచుకున్న కొద్దిమంది తప్ప , చరిత్ర చదివే వాళ్ళే లేకుండా పోయారు. చంద్రబాబు నాయుడి వంటి గొప్ప’విజన్’ ఉన్న వాళ్లయితే... అసలు ’పాఠ్యాంశాల్లో చరిత్రని ఎత్తిపారేద్దాం’ అని ప్రతిపాదించారు.
చరిత్ర మర్చిపోతే... పరిస్థితులని కూడా గుర్తించలేని గుడ్డితనం వస్తుందనడానికి మరో ఉదాహరణ పరిశీలించండి. చరిత్ర పాఠాల్లో మనం ’ఫలానా రాజుల కాలంలో[గుప్తులు, రాయల వారు వగైరా] కళలు, సాహిత్యం ఉచ్ఛస్థితిలో ఉన్నాయి’ అని చదువుతుంటాం. ఇదీ అంతే! చదివి పరీక్షల్లో వ్రాసి మర్చిపోవటమే! కళలూ, సాహిత్యం ఉచ్ఛస్థితిలో ఉండటమంటే ఏమిటో ఎవరూ ఆలోచించం.
నిజానికి కళలూ, సాహిత్యం ఉచ్చస్థితిలో ఉండటం అంటే ఆయా కాలాలలో ప్రజల అవగాహన శక్తి అంత పైస్థాయిలో ఉందని. నిశితంగా పరిశీలిస్తే 1980వ దశకంలో మన సినిమాలు, సాహిత్యం ఎంత నాసిగా ఉండేవో గుర్తుంది కదా? పగా ప్రతీకారం... చిన్నప్పుడే హీరో కుటుంబాన్ని విలన్ కడతేరుస్తాడు. పెద్దయ్యాక హీరో విలన్ ని వెదికి వేటాడి చంపుతాడు. లేదా ధనిక హీరోయిన్ ని ప్రేమించిన పేద హీరో మీద, విలన్లు అన్యాయంగా కేసులు బనాయించి జైలుకి పంపుతారు. అతడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు. జైలు నుండి పారిపోయి వచ్చిన హీరో విలన్లని చావగొడతాడు. ఇవే కథలు. లేదా ముక్కోణపు ప్రేమ కథలు. ఫక్తు ఫార్ములా లన్నమాట. మొదటికే సినిమాలు, అన్ని కళలనీ నామరూపాల్లేకుండా చేసి ఏకైక ప్రత్యామ్నాయం అయి కూర్చున్న రోజులు!
ఇక సాహిత్యము[నవలలూ, ధారవాహికలు రాజ్యమేలాయి] అవే బాటలో ఉండింది, ఇప్పటికీ అలాగే ఉంది. దాంతో క్రమంగా ప్రజల్లో తార్కిక శక్తి, అవగాహనా సామర్ధ్యమూ సన్నగిల్లాయి. ఇప్పటికీ డైలాగ్ కామెడీ ఎక్కువ ఉన్న సినిమాలు, కథలో సంక్లిష్టతా, కథనంలో వేగం, తార్కికత,... ఎక్కువగా ఉన్న సినిమాలు, టీవీలో అడ్వటైజ్ మెంట్లు, చాలా మందికి అర్ధం కాకపోవటం స్వయంగా పరిశీలించాను. అదీ పరిస్థితి!
అసలందుకోసమే కళలూ, సాహిత్యము నిస్సారంగా తయారు చేయబడ్డాయి. కణిక నీతిలోని తొలి వాక్యం - శతృవుని నాశనం చేయాలనుకున్నప్పుడు ముందుగా వారి ఉత్సాహ ఐశ్వర్య మంత్రాంగాలని నాశనం చేయాలి’ అన్నది. ఇదే నకిలీ కణికుల కుట్ర ప్రణాళిక కూడా! అవగాహనా లేమితో ఉన్నప్పుడు, ప్రజలెవ్వరూ తమ కుట్రలు అర్ధం చేసుకోలేరు. సరికదా ఇంకా కొందరు, తమ కుయుక్తులకీ, కుతర్కాలకీ లోబడి, ఎంతో ఇష్టంగా ఇతరుల మీద కుట్రలు అమలు జరిపేందుకు తమకే ఏజంట్లుగా రూపాంతరం చెందుతారు. ఇది బ్రిటీషు వాళ్ళు మన దేశంలో పాగా వేయటానికి ప్రయోగించిన కుయుక్తి. [ఇప్పటికీ అన్ని స్థాయిల్లో, అన్ని రంగాలలో కొనసాగుతున్న కుయుక్తి.] అది మనకి చరిత్ర నేర్పిన పాఠం!
ఇది గ్రహింపుకి రాకుండా ఉండేందుకే చరిత్ర నిర్లక్ష్య పరచబడుతోంది. చరిత్ర మరిచి పోతే... గతం మరిచిపోతాం. గతం నుండి పాఠాలు నేర్చుకోనూ లేం. అప్పుడు కళ్ళ ఎదుటే అరాచకం కరాళ నృత్యం చేసినా గుర్తించలేం. బదులుగా... ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు, మీడియా ఏంచెబితే అది నమ్ముతాం. ఎలా తలాడించమంటే, అలా తలాడిస్తాం. ఇదీ వైష్ణవి హత్యోందంలో చరిత్రపరమైన ’అరాచకం ప్రబలటం’ అనే కోణం.
భావపరంగా చూసినా, సామాజికంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా, చరిత్రపరంగా చూసినా... అన్నిస్థాయిలలోనూ, అన్ని వర్గాలలోనూ, మనం ధర్మాన్ని రక్షించటం లేదు, అందుకే అదీ మనల్ని రక్షించటం లేదు!
ఎటూ... ’ధర్మం, నీతి, నిజాయితీ ’ అన్నవి తొక్కమాటలు, బ్రతక చేతగాని వాళ్ళు చెప్పే మాటలు అయిపోయాయి. ఇంకా ఎక్కువగా ’మంచీ చెడూ, పాపం పుణ్యం’ అంటే మనోభావాలూ దెబ్బతింటాయి మరి!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
8 comments:
మీ అవేదన చాలా బాగా వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఇండియాలో ప్రతి మూలా జరుగుతూనే ఉన్నాయి. అదే పాశవిక చర్య ఒక పేద రైతు లేక ఒక రిక్షాతోలే వాడి కుటుంబంలోనో జరిగితే ఈ మీడియా ఇదే అత్యుత్సాహం చూపిస్తుందా? పరిపాలనా యంత్రాంగం ఇలా స్పందిస్తుందా? అలా అయితే ముఖ్యమంత్రికి మరో పనేమి ఉండదు – రాష్ట్రమంతటా జరిగే ఇలాంటి కౄర విక్రుత చర్య్లలకు స్పందిస్తూనే గడపాలి. బహుభార్యా లోలుడైన తండ్రి కడుపున పుట్టడమే ఈ చిన్నారి పాప పాలిట శాపమైయింది. ఆస్తిపై ఆశ కారణంగా పసివారిని హతమార్చడం కన్న మించిన పాశవిక అనాగరిక చర్య మరొకటి ఉండదు. ఇలాంటి రాక్షసులను ప్రవర్తన మారే వరకు నడి బజారులో రాళ్ళతో కొట్టించాలి. ఈ అనాగరిక సమాజాన్ని సృష్టించడంలో మనలాంటి వారి ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంది. డబ్బు సంపాదించడమే పరమావధిగా మసలుకునే ఇలాంటి కుటుంబాలకు ఇంతటి ప్రాముఖ్యాన్నిచ్చే అవసరం లేదు.
బాగా విశ్లేషించారు అండి. నిజమే కదా..
చాలా బాగా వ్రాసారు. థాంక్స్
రామకృష్ణారావు
చాలా బాగా వ్రాసారు.
మీరు వర్గ పరంగా కూడా పరిశీలించి ఉండవలసింది.
తెలుగు గారు: మీ అభిప్రాయంతో ఏకీభవిస్తానండి. నెనర్లు!
భావన గారు : నెనర్లండి.
రామకృష్ణ గారు : నెనర్లండి.
చిలమకూరు విజయమోహన్ గారు : నెనర్లండి.
అజ్ఞాత గారు : వర్గ పరంగా అంటే?
అజ్ఞాత గారు,
మీ కామెంట్ చదివానండి. వర్గం అంటే మీరు ఏదృష్టితో అన్నారో అర్ధం కాలేదు. ఇప్పుడు అర్ధం అయ్యింది. మీతో నేను ఏకీభవిస్తాను. ఆ విషయాన్ని తదుపరి టపాలలో ఎప్పుడయినా చర్చించటానికి ప్రయత్నిస్తాను. మంచి కోణాన్ని చెప్పారు. నెనర్లు!
అజ్ఞాత గారు : మీరు కోరినట్లు వ్యాఖ్య ప్రచురించలేదు. మీరు లేవనెత్తిన అంశాలు నా ఆంగ్లబ్లాగు Coups on World లో విపులంగా చర్చించాను. మీకు వీలైతే చదవగలరు.
Post a Comment